శబ్బాష్‌రా శంకరా!

రాసిన వారు: మురళీధర్ నామాల
*******************

పేరు: శబ్బాష్‌రా శంకరా
రచయిత: తనికెళ్ళ భరణి
పబ్లిషర్: సౌందర్యలహరి
ప్రతులు: అన్ని ప్రముఖపుస్తక షాపులలో దొరుకుతుంది
మూల్యం: 50/-
కినిగె లంకె: ఇక్కడ

తనికెళ్ళ భరణిగారి వెండిపండుగ చూసాక కవిత్వమంటే ఇష్టపడేవారు, భరణిగారిని ఇష్టపడేవారు, భరణిగారి కవిత్వమంటే ఇష్టపడేవారు ఇలా ఎందరో ఎదురుచూసిన విషయం ఒకటుంది. ఆయన ఆ సభలో పాడిన “శబ్బాష్‌రా శంకరా” తత్వాలు చదివేందుకో, వినేందుకో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అని. అలా ఎదురుచూసినవారిలో నేనూ ఒకడ్ని.ఆయన భావాన్ని పలికిస్తూ పాడిన విధానం, పదాల్లో లాలిత్యం ఆ సభలో కూర్చున్న పెద్దలు బాలుగారిని ఎంతలా కదిలించిందో అందరం ప్రత్యక్షంగా చూసాము.అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే ఆ తత్వాలు చదివే భాగ్యం మనకెప్పుడు దక్కుతుందా అని ఎదురుచూసాము.

తీరా పుస్తకం వచ్చే సమయానికి నేను అమెరికాలో ఉన్నాను. అందరూ చదివేసామని బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ వ్రాసేసుకుంటూ ఉంటే భాదనిపించింది. ఒక స్నేహితునికి ఫోన్ చేసి నాకోసం ఒక పుస్తకం కొని పంపమని చెప్పాను. ఇంతలోనే కినిగెలో పుస్తకం పెట్టినట్టు ఫేస్‌బుక్‌లో చూసాను. ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. వెంటనే అప్పటికప్పుడు కినిగెలో కొని చదివేసాను. ఇలా విదేశాల్లో ఉన్న వారికి, పుస్తకాలను ప్రచురణప్రతులుగా కొని భద్రపరుచుకోలేకపోతున్నామని భాదపడేవారికి కినిగె చక్కని పరిష్కారం చూపుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా పైరేటెడ్ పుస్తకాలు కావు కాబట్టి రచయిత సృజనకి అన్యాయం చేస్తున్నామన్న న్యూనత లేకుండా పుస్తకాన్ని కొని గౌరవంగా చదువుకోవచ్చు.

ఈ వ్యాసం పుస్తకం చదివినప్పుడు నేను పొందిన అనుభూతులని చెప్పేందుకే తప్ప, పుస్తక విమర్శ కాదు. నేనొక సామాన్య పాఠకుడ్ని. ఏ పుస్తకాన్నయిన చదివేప్పుడు రచయిత వేలుపట్టుకు అతను చూపిన దారిలో వెళ్ళి అతను సృజించిన ప్రపంచాన్ని చూసి వచ్చేస్తాను. నేను బాహ్యంగా ఉండి పుస్తకాన్ని పరిశీలించి విమర్శనాత్మక విశ్లేషణలిచ్చే శక్తి నాకులేదు.

ఆధ్యాత్మిక సాహిత్యం ఎందరో రచించారు, ఇకముందు రచిస్తారు కూడా. ఆధ్యాత్మిక సాహిత్యాన్ని రెండు రకాలుగా విభజించొచ్చేమో. మొదటిది భగవంతుని మీద సాహిత్యం వ్రాయాలని అనుకుని మొదలుపెట్టి, తమ పాండిత్యానికి వన్నె తెచ్చెలా వ్రాసినవి. రెండవది భగవంతుని భక్తిలో తరిస్తూ అలవోకగా, ఏ సంకల్పం లేకుండా తమనోటి వెంట వచ్చిన మాటలు మంత్రాల్లా అనిపించి మరింత విస్తృతం చేసి మనలాంటి పామరులకు అందించినవి. “శబ్బాష్‌రా శంకరా!” ఖచ్చితంగా రెండవరకంలోకి వస్తుంది. భరణి తనలో ఉన్న భాషా సంపదనో, రచనా పటిమనో, సృజనా శక్తినో నిరూపించటం కోసం చేసిన ప్రయత్నం ఎక్కడా మనకు కనపడదు. అన్నమయ్య “అదివో అల్లదివో” అన్నట్టుగా, భక్త రామదాసు “పలుకే బంగారమాయెనా” అన్నట్లుగా అతి సహజమైన పదాలతో భగవంతునితో మాట్లాడిన మాటలే మనకి కనిపిస్తాయి. తను చిన్ననాటి నుండి పలికిన యాసలో చెప్పుకోవటం వలన భాషా భేషజాలు పోయి, పద గాంభీర్యాలు తొలగి భగవంతుని ముందు సాగిలబడ్డ సామాన్యుడు కనిపిస్తాడు.శంకరుని భక్తిలో ఊగిపోతూ ఆ పారవశ్యంలో తన నోటి వెంట వచ్చిన మాటలను తత్వాలుగా మనకి అందించారు భరణి. పైగా ఇందులో నా గొప్పతనమేమీ లేదు శంకరును పేరులో ఉన్న మహత్యమే అంతా అంటారు.

“గణపతి దేవుడు నీకు బిడ్డ
ఖబరస్తానేమో నీ అడ్డ…!
నీ తత్వాల్ పాడతా-కాళ్ళామీద బడ్డా
శబ్బాష్‌రా… శంకరా!!”

అనే తత్వముతో పుస్తకం మొదలయ్యింది. అవును మరి హిందూ సాంప్రదాయం ప్రకారం శుభకార్యమేదయినా గణపతి పూజతోనే మొదలవ్వాలి కదా. ఆ సంప్రదాయాన్ని భరణిగారు ఇక్కడ ప్రదర్శించారు. ఆ గణపతి మహిమో ఏమో గానీ పుస్తకం చదవటంలో ఏవిధమయినా విఘ్నాలూ లేకుండా ఏకధాటిగా పూర్తయిపోయింది. ఒక్కొక్కటిగా తత్వాలన్నీ వ్రాయకుండా చాలా ఆకట్టుకున్నవి మాత్రమే వ్రాయాలని మొదలుపెట్టానా? చూస్తే అన్నీ కట్టిపడేసేవే. ఎలా చూసుకున్నా పుస్తకం మొత్తం ఇక్కడ నేను ఎత్తిరాయాలేమో. అందుకే కొన్ని మాత్రమే ఇచ్చి తప్పించుకుంటా.

“నాకారావయ ఓనమాలు
బిల్‌కుల్‌రాదు చందస్సు!
నువ్వే యతివి-గణాలు సుట్టుముట్టూ
శబ్బాష్‌రా… శంకరా!!”

వేములవాడ భీమకవి,శ్రీనాథుడు, ధూర్జటి,తిక్కన,బసవన్న,సోమన,పోతన,విశ్వనాథ ఇలా ఎందరో మహాకవులు భగవంతున్ని కీర్తిస్తూ ఎన్నో కావ్యాలు వ్రాసారు అని చెబుతూ, మరి సామాన్యుడ్ని నాకు వారిలా వ్యాకరణం,చందస్సు తెలియదు అంటునే అయినా యతివి నీవే, నీ చుట్టూ ప్రమదగణాలు ఉన్నాయిగా ఇక నేను ఎలా పాడితే ఏం అంటారు. అందుకే పుస్తకం ముందు మాటలోనే భాషకీ,ప్రాసకీ యాసకీ లొంగుతాడా? అని చెప్పేసారు.

“పెండ్లమా పెద్దమ్మ తల్లి!
గంగెంట ఏందీ లొల్లి?
మూడ్కండ్లుంటెనె- రెండు ఇండ్లాయెరా
శబ్బాష్‌రా… శంకరా!!”


“పెద్దోన్కేమో సిద్ది బుద్ది
చిన్నోన్కి దేవమ్మ -శ్రీవల్లి!
మీ ఖాన్‌దాన్ మొత్తము ఇద్దరే ఇద్దరా?
శబ్బాష్‌రా… శంకరా!!”

ఈ రెండు తత్వాల్లో ఎంత ముచ్చటగా భగవంతునితో హాస్యమాడుతున్నాడో చూడండి. భగవంతుడు భక్త సులభుడంటారు. భక్తితో జీవితాన్ని దేవునికే అంకితం చేసిన భక్త పరమాణువులకు అంతటి పరమేశ్వరుడు కూడా దాసోహమంటాడు. ఆపైన భక్తులు ఆడిందే ఆట పాడిందే పాట. అందుకే అన్నమయ్య “చందమామ రావో, జాబిల్లి రావో” అని ఆడించాడు, “జో అచ్చుతానంద జో జో ముకుందా” అని లాలించాడు. రామదాసు సరాసరి “ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు” అని నిలదీసాడు. ఇక్కడ మన భరణి “ఫ్యామిలి ఫ్యామిలీ బహుభార్యత్వమా” అని ఒక చురకవేసాడు. అయినా ఈ భగవంతునికి,భక్తునికి ఉన్న అనుబంధం మన పామర బుర్రలకి ఏమర్ధమవుతుందిలెండి?

“శంకర అంటేనే నాకు
శక్కర లెక్కనె ఉంటదయ్య!
శివునాగ్నైతది.. సీమనైత..
శబ్బాష్‌రా… శంకరా!!”

“నీ పేరింటెనె కంటనీరు
ఇగ అంటె పారు పన్నీరు!
ఎంతానందము పేరుకున్నది శివా
శబ్బాష్‌రా… శంకరా!!”

పరమభక్తులు భగవంతుని పేరు వింటేనే తాదాత్మ్యత స్థితిలోకి వెళ్ళిపోతారంట. ఆ స్థితిని ఎన్నిసార్లు అనుభవించారో మరి భరణి మనకి కూడా అది పరిచయం చెయ్యటానికి భగవంతుని పేరులో ఉన్న కమ్మదనం చెబుతున్నారు. మరికొన్ని తత్వాల్లో సాంఘిక దురాచారాలను ఎత్తి చూపారు. మూఢనమ్మకాలను వదలమని,జంతుహింసని మానమని హితవుచెప్పారు. లోకరీతులను, దిగజారుతున్న మానవ విలువలను దేవునికి చెప్పి భాదపడ్డారు. దేవతలు నిన్ను ఎర్రిబాగులోడ్ని చేసారన్నారు, ఉత్తి పున్నానికె మోక్షమిచ్చే అమాయకుడివన్నారు,దేవతలందరూ వరాలిస్తారు నువ్వొక్కడివే ప్రాణాలు తీస్తావని నిందించారు, ఎనుగుని ఎల్క మోస్తుంది. నెమలి,పాము దోస్తి చేస్తాయి మీ శైవకుటుంబములో సహజీవనం బేషని పొగిడారు.

ఇలా భరణి కేవలం ఒక్క విషయానికే పరిమితం కాకుండా విస్తృతమైన భావాలను, విషయాలను తన తత్వాలద్వారా స్పృషించారు. కేవలం భక్తినే కాక సామాజిక చైతన్యాన్ని కలిగించే ప్రయత్నంచేసారు. భక్తి రచనల్లో అన్నమయ్య కీర్తనలు స్పృషించినంత విస్తృత భావాలను భరణిగారు శివతత్వాల్లో పలికించారు అనటం అతిశయోక్తికాదు. ఇక భక్తి వైరాగ్యంలో భరణిగారు మంచి మంచి తత్వాలు చెప్పారు. అలాంటివి ఒక మూడు చెప్పి ముగిస్తాను.

“బైటికి ‘బండ’బూతువి
అర్ధంగాని లోలోతువీ!
కరిగే రాతివి – పరం జ్యోతివి
శబ్బాష్‌రా… శంకరా!!”

“కన్నీళ్ళల్లనె బుట్టిన పెరిగినా..
కన్నీళ్ళనే.. కాలినా!
ఒక్క బొట్టన్న.. స్పటికలింగమైతే..
శబ్బాష్‌రా… శంకరా!!”

“కాయిష్ ఒక్కటె నాకు ఎప్పటికి
కైలాసమెటుల బోవుడో!
కాశీపోవుడు – కాలిపోవుడు!!
శబ్బాష్‌రా… శంకరా!!”

ఇవే పుస్తకంలో చివరి తత్వాలు. అందుకే ఎవరు చదివినా పుస్తకాన్ని కన్నీళ్ళతోనే ముగిస్తారు. ఇక మాటలు నేను వ్రాయలేను. రాసిన భరణిగారికి, విని,చదివి తరిచిన అందరికీ శివానుగ్రహ ప్రాప్తిరస్తు. శివార్పణం.

You Might Also Like

4 Comments

  1. mohanramprasad

    తెలుగువారి కుంకుమ భరిణె
    తనికెళ్ళ భరణి

  2. జాన్ హైడ్ కనుమూరి

    ఎంతలోతులో మునిగినా తడిసేది దేహమే!
    ఎక్కువసార్లు తడిస్తే వచ్చేది జలుబే!

    జలుబు ఎదో సమయంలో పోతుంది
    అనుభవం మాత్రం అంటిపెట్టికొని వుంటుంది.

    మురళి బాగా రాసారు అభినందనలు

  3. sridhar reddy

    Prathi okkaru ee pusthakanni chadhavalane alochana kaliginchavu murali.

  4. వేణూశ్రీకాంత్

    చాలా బాగా రాశారు మురళి గారు.

Leave a Reply to వేణూశ్రీకాంత్ Cancel