ముళ్ళపూడి వారి “కానుక”

( ఈరోజు ముళ్ళపూడిగారి జయంతి. )
రాసినవారు: వైదేహి శశిధర్

(“న్యూజెర్సీ బ్రిడ్జి వాటర్ టెంపుల్ లో జరిగిన ముళ్ళపూడి సాహితీసదస్సు లో చేసిన ప్రసంగం కొద్ది మార్పులతో” )
**************************************************

లబ్దప్రతిష్ఠులయిన  రచయితలను తలచుకోగానే ఆయా రచయితల రచన,ప్రవృత్తికి సంబంధించిన ప్రత్యేక విశేషాలు మనకి స్ఫురిస్తాయి .బమ్మెర పోతన అనగానే భక్తి, విశ్వనాధ అనగానే  సంస్కృతి-సంప్రదాయం,కృష్ణశాస్త్రి అంటే  భావకవిత్వం వగైరా. శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారిని తల్చుకుంటే మాత్రం చాలా మందికి  రెండు విషయాలు గుర్తొస్తాయి.ఒకటి బాపు గారితో ఆయనకున్న అద్వితీయమైన స్నేహం, రెండవది ఆయన హాస్యప్రియత్వం . ఆయన హాస్య ప్రియత్వానికి  బుడుగును మించిన  తార్కాణం లేదు. అయితే ఒక్కొక్కసారి ఇలా రచయితలని వారిలో తరచుగా కనబడే ఏదో ఒక విశిష్టత కు కట్టేయడం వల్ల ,వారిరచనలలో ఉన్న మరికొన్ని ప్రతిభా విశేషాలను గమనించకపోవడం,గమనించినా  వాటికి  తగిన ప్రాచుర్యం ఇవ్వకపోవటం వంటి ప్రమాదాలు ఉన్నాయి .ముళ్ళపూడి వారి సాహిత్యం   సునిశితమైన హాస్యానికి గీటురాయిగా నిలబడిపోయినా వారి సాహిత్యం లో,ముఖ్యంగా వారి “కానుక” కధలోని  ఇతర అద్భుత కోణాల  గురించి చర్చించటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. అంతేకాక వారి ‘హాస్య రమణీయం ‘ గురించి లోగడ పుస్తకంలో అనేక వ్యాసాలు వచ్చి ఉన్నాయి కాబట్టి మరల ఈ వ్యాసంలో హాస్యసాహిత్యంలో వారి ప్రతిభ గురించి ప్రస్తావించటం  లేదు .

హాస్యాన్ని ఆహ్లాదంగా సునాయాసంగా పండించే శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు  భక్తిరసాన్ని అంతే  గాఢంగా,ఉదాత్తంగా పండించిన  కధ “కానుక”. రచనాకాలం 1963.
సాధారణంగా ఆయన వ్రాసే పద్ధతికి ,శైలికి భిన్నమైన కధ. ఎక్కడా  ఆయన సహజసిద్ధమైన చమత్కారం ఉండదు. హాస్యరచనల ద్వారా ఒక రచయిత రచనా ప్రతిభను అంచనా వేయగలమేమో కానీ, ఆ రచయిత హృదయ సౌకుమార్యాన్ని ,ఆర్ద్రతను అంచనా వేయాలంటే కరుణ రసాన్ని ,వేదనను  ఆవిష్కరించే తీరు ద్వారా మాత్రమే  సాధ్యమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆరకంగా చూస్తే రచయితగా ఆయన ప్రతిభాపాటవాలను,వ్యక్తిగా ఆయన స్నిగ్ధ,ఆర్ద్ర హృదయాన్ని అర్ధం చేసుకోవటానికి ముఖ్యమైన ఉపకరణం ఈ కధ . అంతేకాదు,రమణ గారి కధలపట్ల ,వాటి లక్షణం పట్ల చాలామంది పాఠకుల్లో ఉన్న నిశ్చిత అభిప్రాయానికి భిన్నంగా ఆయన సాహిత్యంలో ఉన్న సృజనాత్మక వైవిధ్యాన్ని ,గంభీరతను, అనుభూతి గాఢత్వాన్ని  చూపించే కధ “కానుక”.

ఈ కధ సారాంశం క్లుప్తంగా:
“కానుక” కధలో ప్రధాన పాత్ర గోపన్న.గొప్ప సంగీతకారుడు .స్వరాలను ,సంగీతాన్ని ఊహించి పరవశం పొందే కళాతృష్ణ కలవాడు. శ్రీకృష్ణుడి వేణుగానం విన్నప్పటినుండీ ఆ మాధుర్యాన్ని ఆరాధిస్తూ రాత్రి,పగలు గడిపేవాడు . ఇంత  చిన్న వెదురు ముక్కలో శ్రీకృష్ణుడు అంతటి అద్భుత సంగీతాన్ని ఎలా పొదిగాడో తెలుసుకునే జిజ్ఞాస తో ఒకరోజు కృష్ణుడి వేణువును తెచ్చుకుంటాడు కూడా .అయితే ఉత్తరీయం చాటున దాచి తెచ్చిన వేణువు అలాగే మాయమవుతుంది . మర్నాడు కృష్ణుడు తనకు ఒక కొత్త  వేణువు  చేసి పెట్టమని గోపన్నను అడుగుతాడు. అప్పటినుంచీ పాతికేళ్ళుగా వేణు నిర్మాణం లో నిమగ్నమవుతాడు గోపన్న. వేల వేణువులు చేస్తాడు .చేసిన ఏ వేణువు  గోపన్నకు నచ్చదు .చివరికి విసిగి పాతికేళ్ళ తర్వాత ఒక వేణువు పరీక్షించకుండానే శ్రీకృష్ణుడికి పుట్టినరోజు కానుకగా తన కొడుకు చేత పంపుతాడు. కాసేపటికి అలసి నీరసంగా పడున్న గోపన్న చుట్టూ గుట్టలు గుట్టలుగా ఉన్న పనికిరావనుకున్న వేణువుల లోంచి ఓ గంటపాటు కనీ వినీ ఎరుగని అద్భుత వేణు గానం వినబడుతుంది .గోపన్న ఆ సహస్ర వేణు నాద స్వరార్ణవంలో ఆనందంగా తేలిపోతాడు.కొంతసేపటికి  కొడుకు తిరిగి వచ్చి కృష్ణుడు తనను చాలా ముద్దుచేసాడని, బువ్వపెట్టాడని,  తన బుగ్గ మీద ముద్దుపెట్టాడని ,కానీ కృష్ణుడు వేణువు వాయించినపుడు అందులోంచి ఏ శబ్దమూ వినబడలేదని చెప్పటంతో కధ ముగుస్తుంది.

ఎంత చక్కటి కధ ! మొట్టమొదట ఈ కధ ఎత్తుగడ చూద్దాం .
“ప్రొద్దు వాటారినప్పటి నుండీ  మర్రిచెట్లలోంచి ఊడలు ,ఊడలుగా దిగజారుతున్న చీకటి, చలమై ,చెరువై,చెలరేగిన యమునై ,సముద్రమై భూమినంతా ముంచివేసింది .ఆకాశమెత్తున ముంచేసింది . రాధ కంటి కాటుకలా ,కృష్ణుడి వంటి నలుపులా ,నందుడి ఇంటి  చల్లలా చిక్కబడింది.”
గొప్పప్రారంభం! ఈ వాక్యాలలో సందేహం లేని అందమైన భావుకత ఉంది. అయితే ఇది కేవలం భావుకత మాత్రమే కాదు. కధౌచిత్యాన్ని పెంచుతూ ,కధలోని ముఖ్యవిషయానికి ,కధ తాలూకు పరిణామ క్రమానికి పాఠకుడిని అనుసంధానం చేసే భావుకత . కధలో మొట్టమొదట వాక్యంలో,  ప్రకృతిని వర్ణించే సందర్భాలను కూడా కృష్ణుడి పరంగా వర్ణించటం ద్వారా కధకు కేంద్ర బిందువైన  కృష్ణభక్తి ని మనకు స్ఫురింపజేయటమే కాకుండా కధ పరిణామానికి చక్కని పునాది వేస్తారు. ఇది ఆయన కధౌచిత్యాన్ని సూచిస్తుంది.
మరోవిషయం, వచనం రాస్తూ కవితాత్మకంగా రాయడం కత్తి మీద సాము లాంటింది.సరిగా నిర్వహించకపోతే అటు వచనం,ఇటు కవిత్వం రెండూ పేలవంగా తయారయ్యే ప్రమాదం ఉంది.ఇక్కడ “చక్కగా నిర్వహించటం” అంటే కధా గమనానికి అడ్డంపడకుండా,సందర్భానికి తగిన భావుకత/కవితాత్మకత పూవు లో దారంలా చక్కటి వచనంలో ఒదిగిపోవటం. ఇక్కడ భావుకత అంటే  ప్రకృతి వర్ణన ,అందమైన విషయాల గురించి చెప్పటం  కాదు. చెప్పదలుచుకున్న ఏ విషయాన్నైనా  హృదయానికి హత్తుకునేట్లు భావస్ఫోరకంగా  చెప్పటం.అలా చెప్పలేని రచన సాహిత్యంలో నిలబడదు .

ఇక్కడ గోపన్నలో మనం చూసే ముఖ్య విషయాలు రెండు.
1.సంగీతప్రియత్వం
2.కృష్ణభక్తి
సంగీతాన్ని కలవరించి,ఊహించి,సాధన చేసి   గోపన్న తెలుసుకున్న సత్యం ఏమిటంటే
“ఊహ కందే సంగీతంలో పాట కందేది శతసహశ్రాంసం ఉండదు”  అని. గొప్ప సత్యం.ఇది సంగీతానికే కాదు ,అన్ని కళలకూ,సాహిత్యానికీ ,జీవితానందానికీ  అన్నిటికీ వర్తిస్తుంది కూడా.ఊహ తప్పిస్తే మిగతా అన్నిటికీ సరిహద్దు ఉండనే ఉంది .ఆ ఊహకు కళా రూపం ఇచ్చేసరికి ఏదో ఒక మేరకు ఆకాశమంత ఊహను పరిమితం చేయక తప్పని స్థితి.అందరు కళాకారులూ ఎదుర్కొనే సమస్య .ఇటువంటి సమస్య ను ఎదుర్కొన్న కళాకారుల మనస్థితిని,ఆవేదనను,అలజడిని గోపన్న పాత్ర ప్రారంభంలో చూస్తాం.

గోపన్న లో కనబడే కృష్ణభక్తి నిజానికి ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ.బహుశా భక్తి అంటే అదేనేమో-అవధులు లేని ప్రేమ. వేణువు గరుకుగా ఉంటే శ్రీకృష్ణుడి  వేళ్ళు కందుతాయేమోనని,ఆయన పెదవులు తాకేచోట వేణువు కఠినంగా ఉందేమోనని ,తన వేళ్ళతో వేణువును అరగదీయటం వంటి సంఘటనల ద్వారా గోపన్న ప్రేమను /భక్తిని ఈ కధలో చక్కగా చూపిస్తారు .ఇటువంటి ప్రేమను,భక్తిని అర్ధం చేసుకోవటానికి  ఆస్తికతతో ,మతంతో ,మతవిశ్వాసాలతో సంబంధం లేదని నా అభిప్రాయం.

అలాగే  గోపన్న పాతికేళ్ళుగా గుట్టలు, గుట్టలుగా వేణువులు తయారుచేయటం ,అవి నచ్చక పక్కన బెట్టటం ,మళ్ళీ కొత్తవి తయారు చేయటం దీన్ని ఎలా అర్ధం చేసుకోవచ్చు ?ఒక కళాకారుడు పరిపూర్ణత కోసం పడే తపన గా తీసుకోవచ్చు .నాకైతే పరిపూర్ణత కోసం పడే తపన కంటే  కూడా కృష్ణుడికి కానుకగా ఇవ్వదగినంత  ఉత్కృష్టమైనదిగా  తన కళని అతను భావించకపోవటం కనబడుతుంది. అంటే ఎంతటి నిరహంకారం,వినమ్రత ఉందో తెలుస్తుంది.కళాకారులకి సహజంగా అహం ఎక్కువనే చెప్పాలి.చిన్నలోపాలని ఎత్తిచూపినా, విమర్శించినాతట్టుకోలేరు.అంటే వారి కళ తాలూకు పరిమితులను వారి అహం ఒప్పుకోలేదు. మరి అవధులు లేని సంగీతాన్ని తన ఊహ ద్వారా దర్శించగలిగిన ఇంతటి సంగీతకారుడు తన కళ, శ్రీకృష్ణుడికి కానుకగా ఓ చిన్న వెదురు పిల్లనగ్రోవిని తయారుచేయలేదని  సందేహపడటానికి అతని అపారమైన భక్తి,నిరహంకారం తప్ప మరేమీ కారణం కాదు. నిజమైన భక్తి ,అహంకారం నిజానికి ఒకే ఒరలో ఇమడవని తెలిసిన విషయమే .

ఈ కధలో మనల్ని ఆకట్టుకునే మరో కోణం ఆర్ద్రత .కేవలం కృష్ణుడికి “కానుక” ఇవ్వటం కోసం పాతికేళ్ళుగా తన జీవితాన్ని మరిచి ,ఆఖరికి తల్లిలేని పిల్లవాడి ఆలనాపాలనా కూడా పట్టించుకోకుండా వేణు నిర్మాణంలో మునిగిపోవటం మనకు జాలిని కలుగజేస్తుంది.గోపన్న కొడుకు –చిన్న గోపన్న పాత్ర ప్రవేశం నుండీ మన హృదయం కరుణతో నిండిపోతుంది .ఆ పసివాడు తండ్రిని “బువ్వ దిను రా” అని పిలవడం ,తండ్రి తినకపోతే ఆరాట పడటం ,ఎన్నడూ లేనిది తండ్రి తనను దగ్గరికి తీస్తే గుబులు పడటం,తనను చిన్నికృష్ణుడిలా అలంకరించి తండ్రి భక్తిపారవశ్యంతో నమస్కరిస్తే బావురుమంటం ,వేణువుల గుట్టల మధ్య ఉదయం నుంచీ  సాయంత్రం దాకా తండ్రి కూర్చుంటే చెదిరిన జుట్టుతో,నలిగిన బట్టలతో, ఆకలితో, నీరసంగా తండ్రి ఎదుట దిగాలుగా కూర్చోవటం ఇవన్నీ పాఠకుల హృదయాల్ని  ద్రవింప జేసే ఆర్ద్రమైన సంఘటనలు .

ఈ కధ అంతా ఒక ఎత్తు అయితే ఈ కధ ముగింపు మరో ఎత్తు .అత్యద్భుతమైన ముగింపు. పాఠకుల ఊహకు అందని ముగింపు.నందుని ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే ఆ వేణువు లోంచి ఏ రాగమూ పలకదు కానీ గోపన్న గుడిసెలోని సహస్ర వేణువులలోంచి  ఓ గంటసేపు వేణుగానం వినబడుతుంది .ఈ ముగింపు ఈ కధకు ఒక కళాత్మకతను అద్దిన ముగింపు. ముఖ్యంగా కృష్ణుడు అంటేనే మాయ ఆవరించుకున్న పౌరాణికపాత్ర .ఈ పాత్ర చుట్టూ అల్లిన కధకు ఈ ముగింపు చక్కటి ఔచిత్యాన్ని ,హంగు ను ఇచ్చింది . అంతేకాదు కృష్ణుడి కరుణాహృదయాన్ని సూచించే ముగింపు కూడా .ఇక్కడ కృష్ణుడికి ప్రధానం వేణువు కాదు , వేణువును స్వీకరించటం ద్వారా గోపన్నను సంతోషపెట్టటం . కృష్ణుడు వేణువు స్వీకరించటం గోపన్న సంతోషం కోసం కాబట్టే వేణుగానం నందుని ఇంట్లో మొదలైనా గోపన్న గుడిసెలో మాత్రమే వినబడుతుంది. తన కానుక స్వీకరింప బడిందని  గోపన్నకు తెలియటం మాటలద్వారా కాదు,అద్భుతమైన సంగీతం ద్వారా ! అంతేకాదు కృష్ణుడికి తగిన వేణువులు కాదని గోపన్న వదిలేసిన ప్రతి వేణువు లోంచి అత్యద్భుత సంగీతం వినబడుతుంది . అంటే గోపన్న చేయి తగిలిన ప్రతి వేణువును శ్రీకృష్ణుడు శిరోధార్యంగా  ఎప్పుడో స్వీకరించాడు శ్రీకృష్ణుడికి  తగిన వేణువు తయారుచేయలేనని అనుకోవటంలో గోపన్న భక్తి,వినమ్రత ఉంటే, గోపన్న చేసిన ప్రతి వేణువును ఆప్యాయంగా స్వీకరించటం లో శ్రీకృష్ణుడి ప్రేమ,కరుణ,ఔదార్యం ఉన్నాయి .ఈ సంఘటన ద్వారా భక్తుడిలోనూ,భగవంతుడిలోనూ ఉన్న  ఉదాత్తతను రమణగారు చక్కగా ఆవిష్కరించారు . నిజానికి ఇక్కడ వేణువు ను పరిపూర్ణ భక్తికి,అంకితభావానికి సంకేతంగా రమణగారు సూచించారు .కధ మొదట్లో  గోపన్నకు సంగీతమే పరమలక్ష్యంగా మొదలైనా ,చివరకు ఆ సంగీతం భక్తిభావప్రకటనకు  సాధనమవటం  గోపన్న పాత్ర కే  కాకుండా కధ కు కూడా చక్కని ఉదాత్త  పరిణామం గా భాసిల్లింది .

“కధా రమణీయం “ రెండవ సంపుటం లో చేర్చిన ఈ కధకు బాపుగారు  వేసిన బొమ్మ గురించి మాట్లాడకుండా ఈ సమీక్ష పూర్తికాదు.”కానుక”  కధ తాలూకు  ఆత్మను తన కుంచె కొనలలో అద్భుతంగా వడిసిపట్టుకున్నారు బాపు.మోకాలిమీద గడ్డం ఆనించి కూర్చున్న చిన్న గోపన్న,వేణువుల మధ్య  అలిసిపోయిన పెద్ద గోపన్న,వారి మధ్య వెలుగుతున్న నెగడు చివరలలోంచి వ్యాపిస్తున్న వీచికలు, క్రమక్రమంగా  వేణువు వాయిస్తున్న కృష్ణుడి రూపాన్నిఅందంగా సంతరించుకోవటం  మన దృష్టి ని పట్టి నిలుపుతుంది. కళాత్మకమైన కధకు అంతే కళాత్మకమైన బొమ్మ .
నిజానికి ఈ కధ నేను నా హైస్కూల్ రోజులలో మొదటసారి చదివాను .మళ్ళీ రెండువారాల క్రితం చదివాను. ఇప్పటికీ కధ చదివినప్పుడు అదే ఆనందం . ఒక రకంగా చూస్తే ఇప్పుడు మరింత ఆనందాన్ని ఇచ్చిందేమో కూడా .దాదాపు ఇరవై ఏళ్లకు పైగా వ్యవధి తర్వాత కూడా ఒక కధ పాఠకుల లో  అటువంటి  స్పందన కలుగజేయటం  ‘మంచి కధ “అనడానికి తార్కాణంగా తీసుకోవచ్చు .శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు ఇటువంటి శైలిలో మరిన్ని రచనలు చేయకపోవటం  కేవలం మన దురదృష్టం.

డా.వైదేహి శశిధర్
06/27/2011

You Might Also Like

5 Comments

  1. చౌదరి జంపాల

    వైదేహిగారు గొప్ప కథను గురించి చక్కగా చెప్పారు.
    కోకొ: 1985లో చికాగోలో ఒకరోజున బాపు గారి రాక సందర్భంగా చిన్న సభ, బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొహమాటంగా, కొద్దిగా జంకుతూ నాకొక ఒరిజినల్ బొమ్మ కొనుక్కోవాలని ఉందని కార్యక్రమం నిర్వహిస్తున్న వేలూరి వెంకటేశ్వరరావు గారితో బాపు గారిని అడిగించాను. దానికేమండీ పర్వాలేదు మీకేం బొమ్మ కావాలో చెప్పండి అన్నారు బాపు. నాకు కానుక కథ, బొమ్మలు చాలా ఇష్టం, కానుక బొమ్మ కావాలండీ అని అడిగాను. నా ముక్కూ మొఖమూ అప్పటిదాకా తెలీకపోయినా, అడిగిన వెంటనే ఉదారంగా, ఉచితంగా ఆ బొమ్మ నాకు బాపు గారు ఇచ్చేశారు. వైదేహిగారు పైన వర్ణించిన బొమ్మ పాతికేళ్ళుగా మా ఇంట్లో ఉన్న పెన్నిధి. మా మొదటి బాపు బొమ్మ. ముళ్ళపూడివారి అల్లుడు, వియ్యపురాళ్ళతో సహా మా ఇంటికి వచ్చిన అనేక మంది అతిథులు ఆ బొమ్మను చూసి ముగ్ధులైనప్పుడు వారికి కానుక కథను, తెలుగు కథ, బాపురమణల గొప్పతనాన్ని పరిచయం చేసే అవకాశం కల్పించింది ఆ బొమ్మ.

  2. KR

    The link between art and “bhakti” (in Indian context) is very interesting. The whole story revolves around it and very nicely depicts it. I think “ఊహ కందే సంగీతంలో పాట కందేది శతసహశ్రాంసం ఉండదు” very aptly catches the critical point of that link.
    శ్రీకృష్ణుడి వేణుగానం గోపన్న విన్నది ఊహలోనే. అందికే ఆ మాధుర్యం అందలేనిదయ్యింది. భగవంతుణ్ణి చేరుకోవాలనే భక్తుడి తపన, తన ఊహకి కళ ద్వారా రూపమివ్వాలనే కళాకారుడి తపన ఒకటే. కృష్ణుడూ అతని వేణుగానం అనే ఆలంబన లేకపోతే, గోపన్న అంతటి కళాకారుడు అయ్యేవాడు కాదు.

  3. లలిత (తెలుగు4కిడ్స్)

    వైదేహి గారూ,
    నా నోటి దాకా వచ్చి అనలేకపోయిన మాట ఇక్కడ అక్షర రూపంలో ప్రత్యక్షమయ్యింది.
    మీరు పుస్తకం.నెట్ కి వ్రాసి పంపించవచ్చు కదా అని.
    మీరు చెప్తుంటే వినడం నాకు మంచి అనుభూతినిచ్చింది.
    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చిన్ని కృష్ణుడి కథలు చెప్తుంటే పరవశిస్తూ విన్న రోజులు గుర్తుకు వచ్చాయి నాకు.
    మీరిచ్చిన పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. కానీ ఈ కథ చదవడం ఇంకా మొదలు పెట్టలేదు.
    మొదట వెంటనే చదవాలనిపించింది.
    కానీ మీరు చెప్తున్నప్పుడు నేను ఊహించుకున్నది చదివేటప్పుడు కలిగే అనుభూతిని ఎలా ప్రభావితం చేస్తుందో అని కాస్త ఆగి చదవడం మంచిదనుకుంటున్నాను.

  4. Purnima

    ఇదో ’మాస్టర్‍పీస్’.. అసలిలాంటి కథ ఒక్కటైనా ఉన్నందుకు తెలుగువారు గర్వపడాలి. నేను ఇప్పటిదాకా చదివిన ప్రపంచ సాహిత్యంలో ఇంతటి తన్మయత్వానికీ, తాదాత్మయానికి గురిచేసిన కథ మరోటి లేదు. నేనారాధించే కాల్వినో కూడా ఈ విషయంలో ఒక అరడుగు వెనుకే!

    సాక్షాత్తూ ముళ్ళపూడిగారే ఈ కథను గురించి తన అభిప్రాయాలు చెప్పటం నేను చేసుకొన్న అదృష్టం. ఆయన చెప్తున్నప్పుడు, ఆయన కళ్ళల్లో spark..ఆ ఉత్సాహం.. నాకర్థమయ్యిందేటంటే అప్పుడెప్పుడో రాసిన కథ తాలూకూ ఊహలూ ఆయనకింకా స్పష్టంగా గుర్తున్నాయి. ఆయన కథకన్నా, కథ వెనుకనున్న తన మనోభావాలను గురించే మాట్లాడారు. ’తానూహించుకున్న సంగీతాన్ని ఏ సంగీతకారుడూ వాయిద్యాల్లో ఇమడ్చలేడు. సంగీతంలో అసలు మజా అంతా వినిపించడంలో కాదు, ఊహించుకోవడంలో ఉంది..” అన్నారు. ఆయన ఒక్కసారి కూడా కృష్ణుడి ప్రస్తావన తీసుకురాలేదు. ఇది ఒక భక్తిరస ప్రధాన కథ కన్నా, ఆయన ఒక కళాకారుడి తపస్సుగానే అభివర్ణించారు.

    నాకూ అలా అర్థం చేసుకోవడమే నచ్చుతుంది. నాకు చాలా ఇష్టమైన ఆటగాళ్ళు విషయంలో కానుక కథ అన్వయించుకుంటే – సచిన్‍కు క్రికెట్ కృష్ణుడు, అతడు చేసే వేణువులు పరుగులు; ఫెదరర్‍కు టెన్నిస్ కృష్ణుడు, అతడు చేసే వేణువులు అతడాడే ఆట – వాళ్ళంతటి జీనియస్‍లు అయినా కూడా, అంత తపన, పట్టుదల, ఆ ఆకలి ఎక్కడినుండి వస్తాయో ఆలోచించుకోవటం తేలికవుతుంది.

    (నన్నెప్పుడూ ఓ వెంకన్న కన్నా ఓ అన్నమయ్య, ఓ కృష్ణుడు కన్నా ఓ గొపన్న , ఓ రాముని కన్నా ఓ ఉడతే ఎక్కువ ప్రభావితం చేస్తారు. )

    కాకపోతే ఇందులో కృష్ణుణ్ణి ఒక పాత్ర చేసి, ఒక అద్భుత కథను అద్వితీయ స్థాయికి తీసుకెళ్ళారు.

    అత్యుత్తమ కథలో ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉంటాయి. ఒక్కసారి చదివి వదిలిపెట్టే కథ కాదు. చదువుతున్నకొద్దీ రుచి పెరుగుతూనే ఉంటుంది.

    “అందం, ఆనందం దగ్గరగా వస్తే ఇంత దుర్నిరీక్ష్యాలై దుర్భరాలై ఉంటాయని అతను ఊహించుకోలేదు. ఇప్పుడు గ్రహించి కూడా తప్పించుకోలేడు.” – కానుక, ముళ్ళపూడి

    చదివిన ప్రతీసారి నా పరిస్థితి కూడా ఇదే!

    “నేలబారు సినీ గీతాల్ని విడిచిపెట్టి, నిజమైన సాహితీ సృజనకు నడుం కట్టి ఉంటే, తెలుగు సాహిత్యపు జవసత్వాలు మరో వంద రెట్లు పెరిగి ఉండేవనిపిస్తుంది. అయితే, ఆయన సినీగీత రచయిత కాకపోయి ఉంటే, నిత్యం జనం నోళ్ళలో నానుతూండే ఏకైక సాహితీ ప్రక్రియ యొక్క నాణ్యత మరో వెయ్యి రెట్లు పడిపోయి ఉండేది.” – వేటూరిని గురించిన ఒక అభిప్రాయం. కథలుగా మరిన్ని కానుకలు ఇవ్వలేకపోయినా, సినిమాలుగా ఇచ్చారన్న మాటేగా!

    Thanks a ton, for the article!

  5. vanaja vanamali

    ఎంత చక్కని కానుకని ఇచ్చారు.. మనసైన ధన్యవాదములు.

Leave a Reply