సినిమాలు – మనవీ, వాళ్ళవీ

రాసిన వారు: నిడదవోలు మాలతి
*******************
(సత్యజిత్ రాయ్ వ్యాసాల సంకలనం‌ “Our films, Their films” తెలుగు అనువాదం ఇటీవలే వచ్చిన విషయం పుస్తకం.నెట్ పాఠకులకి తెలిసే ఉంటుంది. మాలతి గారు రాసిన ఈ వ్యాసం మొదట్లో ఆ అనువాదానికి ముందుమాటగా వెయ్యాలనుకున్నా, కారణాంతరాల వల్ల కుదర్లేదు. అందువల్ల, ఇప్పుడు ఇక్కడ పుస్తకం.నెట్లో ప్రచురిస్తున్నాం!)

సౌమ్య ఎంతో అభిమానంతో నన్ను తన మొదటిపుస్తకానికి ముందుమాట రాయమని కోరితే నాకు పరమానందమయింది. ఆ తరవాత ఈ ముందుమాట రాయడానికి నాకున్న అర్హతలేమిటి అని నేను దీర్ఘంగానే ఆలోచించుకోవలసివచ్చింది. ప్రధానంగా సౌమ్యకి నాయందున్న అభిమానమే అని చెప్పుకున్నా, ఆ తరవాత మరికొన్ని విషయాలు కూడా తోచేయి. మాయిద్దరికీ అనువాదాలయందున్న ఆసక్తి. దాదాపు మూడేళ్ళగా ఈవిషయం అప్పడప్పుడు మాకబుర్లలో ఏదోవంక ప్రవేశిస్తూనే ఉంది. నేను తెలుగునించి ఇంగ్లీషులోకి అనువాదాలు చేస్తుంటే, సౌమ్య ఇంగ్లీషునించి తెలుగులోకి అనువాదం చేయడం జరిగిందిక్కడ.

ఈ వ్యాసాలు సినీరంగానికి సంబంధించినవి. ఈనాటి యువతలాగే నేనూ నాకాలంలో చాలా సినిమాలే చూశాను. నేను సైతం పథేర్ పాంచాలీ, బైసికిల్ థీఫ్‌లాటి సినిమాలు చూశాను. అయితే, ఈ నాటియువతకి భిన్నంగా, సాంకేతికపరిజ్ఞానం సంబంధించినంతవరకూ మాత్రం నేను చాలా వెనకబడి ఉన్నాననే చెప్పాలి. ఏ సినిమాకి ఎవరు దర్శకుడు, ఏ ఛాయాగ్రాహకుడు ఎక్కడ తన ప్రతిభ చూపేడు లాటి ఆలోచనలు నాకెప్పుడూ రాలేదు. మల్లీశ్వరి పెద్ద హిట్టయేవరకూ నాకు బి.యన్. రెఢ్డి అని ఒక దర్శకుడున్నాడనే తెలీదు. టెన్ కమాండ్మెంట్స్ చూసినప్పుడు మాత్రం ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది అనుకున్నట్టే గుర్తు! ఈమధ్యనే ఇలాటివిషయాల్లో కూడా కొంత ఆసక్తి నాకు మొదలయింది. ఒక కారణం మాఅమ్మాయి హాలివుడ్ నటులజాబితాలో చేరడం. రెండోది సౌమ్య ఈ అనువాదాలు ప్రారంభించినప్పట్నించీ, నన్ను తరుచూ సలహాలు అడగడం.

ఏ కళకైనా సర్వసాధారణమయిన గుణం ఒకటి ఉంది. సంగీతం, సాహిత్యం, నాట్యం – ఇవన్నీ ఏ సాంకేతికపరిజ్ఞానం లేని సాధారణపాఠకులనీ, శ్రోతలనీ, ప్రేక్షకులనీ యాదృచ్ఛికంగానే అలరించగలగడం. యమ్మెస్ సుబ్బలక్ష్మిగాత్రానికి స్పందించని తెలుగువాడు ఉంటాడనుకోను. ఆ విషయపరిజ్ఞానం ఉన్నవారు ఫలానా అంశాలమూలంగా ఈకళ వీరిని ఆకట్టుకోగలిగింది అని నిర్ణయాలు చేస్తారు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, చెప్పిన సినిమాలు నాకు చాలా చాలా నచ్చేయి. ఎందుకు నచ్చేయో అప్పట్లో నాకు తెలీలేదు కానీ ఇప్పుడు ఇలాటివ్యాసాలద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది. సత్యజిత్ రాయ్ చిత్రకారుడుగా ప్రారంభించి, సినీరంగంలో శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోడానికి కారణం ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కావడం. ఆవిషయం ఈవ్యాసాలు చదువుతుంటే సుస్పష్టంగా తెలిసింది నాకు.

వ్యాసాలు అన్నీ సినిమా తీయడానికి కావలసిన అంశాలు పాఠ్యపుస్తకంలా చర్చించలేదు. తాను సినిమారంగంలో ప్రవేశించేక, సినిమా తీసే విధానంలో ఒకొక కోణాన్నీ ఎలా పరిశీలించడం జరిగిందో, క్రమంగా ఒకొక అంశానికి అవసరమైన సామర్థ్యాన్ని ఎలా పెంపొందికుంటూ వచ్చేడో చక్కగా వివరించడం జరిగింది. అంచేత ఇది ఒక “సినిమాలు తీయడానికి సంబంధించిన సాంకేతికగ్రంథం”లా అనిపించదు. అయినా ప్రధానాంశాలని వివరించడంచేత సినిమాలు తీద్దాం అనుకునేవారికీ, సినిమాలు ఎలా తీస్తారో అని ఆలోచించేవారికీ ఉపయోగపడే పుస్తకమే.
సాంకేతకపరిజ్ఞానమే కాక టీమ్ స్పిరిట్‌కి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి ఈవ్యాసాలలో. నటులతో, ఛాయాగ్రాహకులతో, ఇతర సాంకేతికనిపుణులతో పని చేస్తూ, వారి సహకారం అవసరమైనచోట పొందుతూ, తన స్వంత ఆలోచనలనీ అభిప్రాయాలనీ అమలు పరచడం కత్తిమీద సాములాటిది ఏ దర్శకుడికైనా. దానికి బలమైన వ్యక్తిత్వం కావాలి. రాయ్ వ్యక్తిత్వం ఈవ్యాసాలద్వారా తెలుసుకోగలం.

పథేర్ పాంచాలీ నిర్మిస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్యలూ, ఆయన పరిష్కరించుకున్న విధానం మరొక కథ చదువుతున్నంత ఆసక్తికరంగా ఉంది. సినీరంగంలో ప్రముఖులైన విదేశీ దర్శకులు రెన్వా, గొడార్డ్ వంటివారు తీసిన సినిమాల విశ్లేషణలో కూడా రాయ్ సునిశితదృష్టి మనకి గోచరమవుతుంది. రెన్వాతో రాయ్ పరిచయం, ఆయన వారినుండి గ్రహించినవిషయాలూ ఎంతో ఆసక్తికరంగానూ, విజ్ఞానదాయకంగానూ ఉన్నాయి. మన సినిమాల్లో లోపాలేమిటీ, నిర్మాతలూ, దర్శకులూ ఎందుకు వాటిని దిద్దుకుని విదేశీచిత్రాలతో సరితూగగల చిత్రాలు నిర్మించడానికి ప్రయత్నించరు వంటివి కూడా రాయ్ చర్చిస్తుంటే, నాకు మన తెలుగుకథ స్థితి తలపుకొస్తోంది. ఈనాటి తెలుగుకథ పరమదౌర్భాగ్యస్థితిలో ఉందనేవారు దానికి చెప్పేకారణాలకీ, ఆనాడు సత్యజిత్ రాయ్ భారతీయ సినిమాలస్థితిగురించి చెప్పిన కారణాలకీ అట్టే తేడా లేదు.

పోతే, అనువాదం గురించి ఒక మాట కూడా చెప్పడం న్యాయం అనుకుంటాను. సాధారణంగా అనువాదం మొదలు పెట్టినప్పుడు అనువాదకుడు భాషవిషయంలో ఒక నిర్ణయం చేసుకోవాలి. నలభైలలో శిష్టజనవ్యావహారికం అంటూ ఒకరకం కృతక భాష (డయలెక్ట్?) మన పత్రికలూ, సినిమాలూ తయారు చేసి ప్రాచుర్యంలోకి తెచ్చేయి. ఈ వ్యావహారికం క్రమేణా మారుతూ వస్తోంది. మాలపల్లి వ్యావహారికంలో రాసేనని రచయిత చెప్పుకున్నా ఇప్పుడు మనకి అది వ్యావహారికంలా అనిపించదు. ఈనాటి వ్యావహారికం లేక వాడుకభాష ఎంత మారిపోయిందో నేను వేరే చెప్పక్కర్లేదు కదా. ఇందులో ఇంగ్లీషెంత, తెలుగెంత, సంస్కృతం ఎంత అన్నది నిశ్చయంగా చెప్పడం కష్టం.

ఈ సంకలనం చదువుతుంటే, అనువాదకురాలికి మంచితెలుగులో అనువాదం అందించాలన్న ఆసక్తి స్పష్టమే. అయితే ఈ అనువాదంలో అది ఒక పద్ధతిలో జరిగినట్టు లేదు. లేదా, నాకే ఈనాటి వాడుకభాషతో పరిచయం లేకపోవడం కావచ్చు. పైగా, నేను మూలం చూడలేదు కనక మూలానికి తగినట్టుగా ఈ అనువాదం ఉందేమో కూడా నాకు తెలీదు. కొన్ని చోట్ల ఎంతో గంభీరంగా చెప్తున్నట్టుంటుంది. కొన్నిచోట్ల నడవలోనో, నాలుగువీధులకూడలిలోనో నలుగురు చేరి చెప్పుకునే కబుర్లలా అనిపిస్తుంది. మొత్తంమీద చదువుతుంటే, నాకు తెలీనిసంగతులూ, సాంకేతికవిషయాలూ రాస్తున్నప్పుడు కూడా విసుగనిపించలేదు ఎక్కడా. పాఠకులు కూడా అలాగే స్పందించగలరన్న విశ్వాసం నాకుంది. సౌమ్య భవిష్యత్తులో అనువాదాలతోనే కాక స్వీయరచనలతోనూ పాఠకుల ఆదరాభిమానాలు ఇతోధికంగా పొందగలదని ఆకాంక్షిస్తూ…

నిడదవోలు మాలతి.
అక్టోబరు 17, 2010.

You Might Also Like

Leave a Reply