భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

రాసిన వారు: పి.ఆర్.తిమిరి
****************
సార్వకాలీన సోదరభావం అవసరాన్ని నొక్కి చెప్పే…భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం ఒక మహోజ్జ్వల ఘట్టం. సువిశాల భారతదేశపు ప్రజల ఐకమత్యాన్ని చాటి చెప్పే ఉదంతం మరొకటి లేనేలేదు. నాటి స్వాతంత్య్రోద్యమంలో కుల, మత, వయో, లింగభేదాలు లేకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అసంఖ్యాకంగా పాల్గొన్నారు. భారతదేశపు గడ్డమీద పుట్టిన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు తదితరులందరూ భారతీయులే. వీరందరినీ ఒకే తాటిమీద నడిపింది స్వాతంత్య్రోద్యమం. ఈ పోరాటంలో ముస్లింల పాత్ర తక్కువదేం కాదు. అయితే అనేక మంది ముస్లింవీరుల త్యాగాలు చరిత్రకెక్కగలిగితే మరెంతో మంది ముస్లింయోధుల వీరోచిత గాథలు మరుగున పడిపోయాయి. మబ్బుల చాటుకు వెళ్లిపోయాయి. భారతదేశం ఉన్నంతవరకూ నిత్యం స్మరించుకోదగిన వారి త్యాగాలు అలా మరుగున పడిపోవడం సమంజసం కాదని గుర్తించిన ఓ ముస్లిం రచయిత చరిత్ర మూలాలను తవ్వి, జాతిరత్నాలను వెలికి తీశారు. మబ్బులను తొలగింపజేసి ముస్లిం స్వాతంత్య్ర వీరులనే నక్షత్రాలను మనకు కనిపించేలా చేశారు. ఆయనే ‘చేయి తిరిగిన చరిత్ర రచయిత అంటూ ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్‌ పేర్కొన్న సయ్యద్‌ నశీర్‌ అహామ్మద్‌! ఆయన మనకందించిన రత్న భాండాగారవే ‘భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు.’

ఈ పుస్తకంలోని అంశాలను నాలుగు భాగాలుగా రచయిత మనకందించారు. 1 .భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర, 2. పోరాటంలో పాల్గొన్న 50 మంది వీరుల జీవిత చిత్రణ..3. ప్రజాపోరాటాల్లో భాగస్వామ్యం వహించిన అయిదుగురి జీవిత వివరాలు 4. స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న వారి సంక్షిప్త వివరాలు జిల్లాల వారీగా….

ఇక చివర్లో మీతో ఒక మాట అంటూ గ్రంథం చివర్లో రచయిత విషయ సేకరణకు గాను తాను అనుభవించిన దూషణ, భూషణలను వివరించారు. నిజానికి చరిత్ర గ్రంథ రచన చాలా కష్టం.ఊహాలు, అంచనాలు అసలే ఉండకూడదు కదా…తగిన ఆధారాలు ఎలా లభ్యమవుతాయి?భవిష్యత్తు వర్తమానంలోకి, వర్తమానం భూతకాలంలోకి అంటే గతంలోకి జారుకుంటున్న క్రమంలో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు సంపాదించడం కష్టసాధ్యమే. స్వాతంత్య్ర పోరాటం విషయానికి వస్తే… భారతదేశం పరాయి పాలన నుంచి విముక్తం కావాలని, భారతీయులందరూ స్వేచ్ఛా వాయువులు అనుభవించాలనే ఏకైక లక్ష్యంతో పదహారేళ్ల నుంచి అరవై ఏళ్లకు పైబడిన వారు కూడా పోరాటంలోకి ఉరికారు…. పురుషులు, స్త్రీలు అన్న భేదం లేకుండా. ముస్లిం స్త్రీలు కూడా మత కట్టుబాట్లను తెంచుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం విశేషం. ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకిన వారందరూ కీర్తి ప్రతిష్ఠల కోసమో పేరు పెంపుల కోసమో ఆ పని చేయలేదు. త్యాగాలకు సిద్ధమై ప్రవాహ సదృశంగా, సహజంగా దూసుకువెళ్లారు. తాము చేసిన త్యాగాలను చెప్పుకునే వారు కాదు. అందుకనే సమర యోధుల చరిత్రల్లో రికార్డుల కెక్కనివే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆనాటి ముస్లిం వీరుల వివరాలను సేకరించడంలో ఎంతటి వ్యయప్రయాసలు ఎదురవుతాయో ఊహించడం కూడా కష్టమే. రచయిత పడిన ప్రయాసలు చదివితే రెండు విషయాలు అర్థమవుతాయి…. ఒకటి సమర యోధుల త్యాగాలకు ఈ తరం వారిలో విలువే లేదని, రెండు….. నేటి సమాజంలో మానవీయ విలువలు మృగ్యమైపోయి, స్వప్రయోజన కాంక్షలు పెచ్చరిల్లిపోతున్నాయని……

ఆనాటి సమర వీరుల్లోని దేశభక్తిని మనం ఈనాటి వ్యక్తుల్లో మచ్చుకైనా చూడలేం. అసలు దేశభక్తులంటే గౌరవం లేనివాళ్లకు దేశభక్తి ఎలా అబ్బుతుంది? అయితే ఆనాటి పోరాటాలాంటివాటిల్లో పాల్గొంటేనే దేశభక్తి ఉన్నట్లు కాదు…ఆనాటి దేశభక్తుల వారసత్వానికి భంగం కలగకుండా, దేశ సంక్షేమానికి నష్టం వాటిల్లకుండా, దేశప్రతిష్ఠను పెంపొందింపజేసే విధంగా నడచుకోవడమే ఇప్పటి దేశభక్తి! కులమతాలకు అతీతంగా సోదరభావంతో మెలగడమే ఇప్పటి అవసరం.

ఈ పుస్తకం ఎందుకు చదవాలి? భారత స్వాతంత్య్రోద్యమం గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం కదా… ఆ ఉద్యమంలో కులమతాలకు అతీతంగా ఎందరో ఆస్తిపాస్తులను, ఆత్మీయులను, బంధువులను, ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేశారు…. ఆ ఘట్టాలనన్నింటినీ చదువుకున్నాం. మరి ఇప్పుడెందుకీ పుస్తకం? అనే సందేహాలు వచ్చిపడవచ్చు.

మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభభాయి పటేల్‌, సుభాష్‌చంద్రబోస్‌, లాలా లజపతిరాయ్‌, తదితరులందరి గురించీ జాతి ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుంది. అయితే స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసి, చరిత్రకెక్కని వారి మాటేమిటి? ఎందరి పేర్లే అసలు తెలియనే తెలియవు. పేర్లే కాదు… అనేక సంఘటనలు కూడా చరిత్ర పుటల నుంచి తప్పించుకున్నాయి. ప్రప్రథమ స్వాతంత్య్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు పేరుతో 1857లో జరిగిందని చరిత్రలో చదువుకున్నాం. అంతకు ముందే విశాఖలో 1780 లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సైనిక స్థావరంలో సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడని, అదే స్వాతంత్య్ర పోరాటానికి బీజప్రాయమని ఇపుడు తెలుసుకుంటున్నాము. ఈ ఘట్టం ఈ పుస్తకంలో ఉంది! ఈ ఉదంతానికి సానుకూలంగా విశ్వవిద్యాలయ చరిత్ర ఆచార్యుల స్పందనలు కూడా రచయిత ఈ గ్రంథంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో, ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకు తెలియని ముస్లిం వీరుల జీవిత రేఖలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం. చరిత్ర రచన ఎప్పుడూ పరిశోధనాత్మకంగా ఉంటూ సరికొత్త అంశాలను వెలుగులోకి తీసుకురాగలగాలి. ప్రజాజీవితంలోని వెలుగు చూడని కోణాలను బయటపెట్టగలగాలి. చరిత్ర రచన అంటే తారీఖులు సహా ఏ రాజు ఎప్పటినుంచి ఎప్పటివరకూ పాలించాడు? రాజ్య విస్తరణకు ఎంత మేరకు రక్తపుటేరులు పారించాడు? రాణుల విలాస కథలు ఏమిటి? ఇవి కావు కదా?! సామాన్య ప్రజాజీవితాలతో సంబంధం ఉండేదే అసలైన చరిత్ర….ఇదే నశీర్‌ అహామ్మద్‌ రచనల్లో కనిపిస్తుంది.

అలనాటి సమర వీరులు అందరూ ఒక్కొక్కరూ ఒక్కో ఇటుక రాయిగా మారి స్వేచ్ఛా భారత సౌధంగా ఏర్పడ్డారు. ఈ సౌధంలో ప్రతి ఇటుకా ముఖ్యమైనదే. అందులో ఒక్క ఇటుకను తీసేసినా గోడకు కన్నం (వెలితి) కనిపిస్తుంది! కాల గమనంలో ఒక్కో ఇటుక చొప్పున తీసేసుకుంటూ పోతే గోడలు బలహీనపడి చివరకు సౌధం ఉనికి లేకుండా పోతుంది కదా! అందుకనే భారత స్వాతంత్య్ర పోరాటమనే మహాయజ్ఞంలో సమిథలైన వారందరి గురించీ తెలుసుకోవాలి. వారిని స్మరించుకోవాలి. వారి జీవిత ఘట్టాలలోని ధైర్యసాహసాలను, తెగింపునూ వర్తమాన దైనందిన జీవితాల్లో అనువర్తింపజేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. ఈ కర్తవ్యాన్ని ఈ పుస్తకం తెలియజెపుతుంది. ఇప్పటికి కూడా ఐకమత్యం, సోదరభావాలతో ఉంటే ఎంతటి శక్తిమంతులం అవుతామో పరోక్షంగా ఈ రచన మనకు బోధిస్తుంది.

చరిత్ర పుస్తకాలను చదివి, ఆయా అంశాలను తిరగరాసి పుస్తకాలను తేవడం వేరు. స్వయంగా పరిశోధించి, అనేక ప్రాంతాలు తిరిగి, విషయ సేకరణ చేసి, వాస్తవాలు బేరీజు వేసుకుని చరిత్ర పుస్తకాలు ముద్రించడం వేరు! ఇది చరిత్రమీద నిజమైన గౌరవం, అభిమానం ఉన్నవారు చేసే పని. ఈ కృషి గుభాళింపులను ఈ పుస్తకం ప్రతి పుటలోనూ ఆస్వాదించవచ్చు. అందుకే ఈ పుస్తకం చదవాలి. నశీర్‌ అహామ్మద్‌ రాసిన మరికొన్ని పుస్తకాలు:
1. భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లింలు, (1757 నుంచి 1947 వరకు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల్లో ముస్లింల పాత్ర)
2. మైసూరు పులి: టిపూ సుల్తాన్‌, (ఆదిలోనే ఆంగ్లేయుల కుటిల యత్నాలను గ్రహించి, వారిని ఎదిరించిన వీరుని కథ )
3. షహీద్‌ యే ఆజం : అష్ఫాఖుల్లా ఖాన్‌, (విప్లవ వీరుని జీవిత కథ )
4. భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం ప్రజాపోరాటాలు (బెంగాల్‌ సన్యాసులు, ఫకీర్ల ఉద్యమం, వహాబీ యోధుల తిరుగుబాటు, తదితరాలు)
5. భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం మహిళలు ( 61 మంది ముస్లిం మహిళల వీరగాథలు)
6. భారత స్వాతంత్య్ర సంగ్రామం: ముస్లిం యోధులు…1, ( 35 మంది ముస్లిం యోధాగ్రేసరుల చరిత్ర)
7. చిరస్మరణీయులు ( వంద మంది ముస్లిం యోధుల పోరాట చరిత్ర)
8. 1857 ముస్లింలు (ముస్లింల త్యాగాల వివరణ)
9. అక్షర శిల్పులు (250 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకుల ఫోటోలు, చిరునామాలతో పాటు పూర్తి వివరాలు)
10వ పుస్తకం…… ఇపుడు మీరు సమీక్ష చదివిన ‘భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు’

ఈ గ్రంథాలన్నీ చరిత్ర ప్రధానాంశాలుగా కలిగినవే. రచన విధానం నల్లేరుపై బండి నడకలా సాఫీగా సాగిపోతుంది. అందరూ తప్పక చదవాల్సిన పుస్తకాలు ఇవి.

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు
రచన: సయ్యద్‌ నశీర్‌ అహామ్మద్‌
పుటలు: 394, వెల: రూ. 250/
ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, శివప్రసాద్‌ వీధి,
కొత్తపేట, వినుకొండ-522 647, గుంటూరు జిల్లా.
మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.

You Might Also Like

3 Comments

  1. Mohammed Ghouse

    The reviews are wonderful.
    Thanks a lot to Mr Syed Naseer Ahmed.
    I wish him All the Best.

    –Mohammed Ghouse,MA.,(English)
    Post& Vill: Kusumanchi,
    Dt. Khammam AP
    PIN 507159
    Cell: 9440028914.

  2. రాజేంద్రకుమార్ దేవరపల్లి

    అక్షర శిల్పులు,ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు ఈరెండు పుస్తకాలు చదివానండి.అసలీ నశీర్ గారు వినుకొండలో ఊండి ఇంతసమాచారం ఎలా సేకరించగలుగుతున్నారా అని ఆశ్చర్యపోతూ ఉన్నాను.మీ సమీక్ష నాకు నచ్చింది.

Leave a Reply to prtamiri Cancel