పరవశించే పలకరింపు మాల – మహారధి “ముచ్చట్లు”

రాసిన వారు: శైలజా మిత్ర
***************
మనిషికి మనసు ఒక ఆయుధం.. ఆ ఆయుధం చాలా గొప్పది. అందుకే మనిషి జన్మ ఒక వరం అంటాము. సరిగ్గా ఒక ఏడాది పాటు ఒక ఇంట్లో మనం అద్దెకున్నామంటే చాలు-ఆ పరిసరాలతోటి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలతోటి, పరిచయాలు, అలవాట్లు, ఇలా ప్రతి ఒక్కరితోను మనకు తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఏదేని విషయంలో ఆ చోటును ఖాళీ చెయ్యాల్సి వస్తే తెలియని దుఃఖం వస్తుంది. ఇక్కడ తెలియని దుఃఖం అని ఎందుకన్నాను ఆంటే ఎవరికీ మనం తెలుపుకోలేము. అలాగని గుండెల్లో దాచుకోలేము. అలాంటి ఆవేదన అన్నమాట. ప్రముఖ కవులు శ్రీ మహారధి గొప్ప రచయితగా ఎందరో గొప్ప నటులతోనూ, సాంకేతిక వర్గాలతోను చిరపరిచితులవ్వడం పెద్ద విశేషమేమి కాదు. నటసార్వభౌమ స్వర్గీయ ఎన్.టి.రామారావు నుండి నేడు నటిస్తున్న నటులవరకు వీరికి స్నేహ బాంధవ్యాలు ఉండటం సహజం. కానీ వారందరి పరిచయాలను మనకు తెలియజేస్తూ వారి స్వభావాలను కూడా తెలియజేస్తూ వాటికి ఒక పుస్తక రూపం ఇవ్వడం అనేది గొప్ప ప్రక్రియగా మనం అనుకోవచ్చు. మరి ఇందరి మనస్తత్వాలను తెలియజేసిన మహారధి గారు నాకు తెలిసినంతవరకు ముక్కుసూటి మనిషి. వీరికి నచ్చని విషయాన్నయినా, నచ్చిన విషయాన్నయినా కచ్చితంగా ముఖం మీద చెప్పడం వీరి నైజం. ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవాన్ని నిలదీయడం వీరి సహజ లక్షణం. పుస్తక సమీక్షకు ఇక్కడ వీరి మనస్తత్వాన్ని గూర్చి చెప్పడం ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వీరు ఎంతోమంది స్నేహితుల తోటి, సినీ రంగంలోని సన్నిహితులతోటి జరిగిన సంభాషణను తెలియజేసిన గ్రంథం ఇది. అందుకే ఇక్కడ వీరి మనస్తత్వం కూడా ప్రస్తావించాల్సిందే.. ఉదాహరణకు ఇక సాహితీ సభలో అతిధిగా హాజరై వీరు అక్కడ చర్చిస్తున్న నేటి సినిమాలు- తీరుతెన్నులు అనే అంశం గురించి:అందరూ సినిమా యువతను పాడుచేస్తోందని, స్త్రీల వస్త్రధారణ, ద్వందార్ధపు మాటలు మూలంగా కుటుంబ పరంగా ఎవరు చూడలేక పోతున్నామని, ఎన్నో విషయాలను మాట్లాడారు. అన్నీ విన్న మహారధి గారు ఆవేశంగా మీకు తెలుసా ఒక్క సినిమా తీయడానికి ఎంతమంది తమ సమయాన్ని , డబ్బుని, శక్తిని వినియోగిస్తారో? మీకు తెలుసా ఒక్కో సినిమా తీస్తే వచ్చే రాబడితో ఎంతమంది కుటుంబాలు ఆధార పడి ఉంటాయో ? మీరంతా ఇక్కడ ఫ్యాన్ కింద కుర్చుని మీకు తోచినట్లు సినిమాల వల్ల యువత పాడవుతోందని ఎవరికీ తోచిన రీతిలో వారు మాట్లాడుతున్నారే ? మీకేమి తెలుసని? అని ఆవేశంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది.. అక్కడ వీరు మాట్లాడిన దాంట్లో నిజం ఉన్నా లేకున్నా, ముఖంపై మాట్లాడినవారందరినీ అలా అందడం అతని ముక్కుసూటి తనానికి నిదర్శనం.ఇలా ఏ ఒక్కచోటే కాదు ఏ సభలో హాజరయినా ఏదో విషయంలో వీరు ఆవేశ పడటం సభలో అలజడి రేగడం సర్వసాధారణం.

ఇక ఏ గ్రంధంలో ఎన్ టి ఆర్ మొదలుకొని ఎస్.వి.ఆర్., కృష్ణ, కాంచనమాల, కృష్ణకుమారి, రేలంగి, చిత్తూరు నాగయ్య, కే.బి. తిలక్, చక్రపాణి, నాగిరెడ్డి, చక్రపాణి, సి.ఎస్. ఆర్, ఆంజనేయులు, సౌందర్య, మహాకవి శ్రీ శ్రీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, శోభన్ బాబు, అమితాబచ్చేన్, ప్రతి పేజీలో మనం చూడదగినవారే. వారిగురించి, వారితో పరిచయం ఎలా ఉంటుందో తెలుసుకోదగ్గవారే. కళ అనేది వస్తుతః వచ్చేది కాదు వాస్తుతః వచ్చేది. నటనలో అభినివేశం, రచనలో వాస్తవం, నృత్యంలో అభివ్యక్తీకరణం, చిత్రలేఖనం అయితే పరిశీలనాత్మకం, ఉండాలని మాత్రమే గమనించే రోజులు దాదాపుగా పోయాయనే చెప్పాలి.. ఎందుకంటే నేడు లలితకళలు కూడా వారిలో ఉన్న తపనను, గొప్పదనాన్ని అలుసుగా తీసుకుని కాసులకో, లేక పలుకుబడికో, ఆధారపడుతూ ఉంటున్నాయి. ఈ రోజుల్లో కావాల్సినంత పలుకుబడి, ఎదుటివారికి ఉపయోగపడే ఉపయోగపడే స్థానం ఉంటే చాలు ఆకాశపథంలోనికి దుసుకుపోవచ్చు. అలాగే ఏమిలేని వారిలో ఎంతగా విద్యా దాగున్నా అది ఒక విద్యగా ఒప్పుకోలేరు.అందుకే నేడు ఈ స్థానాల కోసం వెదుకులాట , వెంపర్లాట. కానీ అది కేవలం చదువున్న అజ్ఞానులు చేసే పని. విద్యలో సత్తువ ఉంటే బతికున్నప్పుడు గుర్తింపు రాకున్నా, ఈ దేహాన్ని వీడినప్పుడైనా భావితరాలు గుర్తిస్తాయి. కానీ నటన అలాకాదు. నటించే మెప్పించాలి. అవకాశాలు తప్పక రావాలి. ఆ విషయంలో మహారధితో నటుడు శోభన్ బాబు పడిన ఆవేదన ఎంతో బాధ కలిగిస్తుంది. ఎంతగా అవకాశాలకోసం ఎదురుచూసారో పాపం! అనిపించేలా ఉంది. మేధో సంపన్నమయిన సాహిత్యంలోనే ఎంతో మేధస్సు ఉన్నా మూల పడిన వారు ఉన్నప్పుడు ఇక రంగుల ప్రపంచంలో ఇలాంటివి మామూలే అనడం అతిశయోక్తి కాదు. కాకుంటే ఎంత ఎత్తులో ఉన్నా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా మరణం ముందు అందరూ సమానులే. అని గొప్పనటి సౌందర్య మరణం మనకు బాధను కలిగిస్తుంది. ఇక పరిచయం ఉన్న మహారధిగారికి బాధను కలిగించడం అతిశయోక్తి కాదు. ప్రతి పుట్టుక తల్లికి ఎంత బాధను కలిగిస్తుందో కానీ ప్రతి మరణం మాత్రం జీవిత విలువలను తెలియజేస్తుంది.

ఇలా ఒక్కరు కాదు దాదాపు ౯౨ మంది ప్రముఖులు, ఉద్దండులతో తనకు కలిగిన పరిచయం. వారిమధ్య సంభాషణ అన్నీ ఏమాత్రం భేషజం లేకుండా అందరిని సమానంగా పలకరిస్తున్న నిరాడంబర, నిష్కర్శమయిన పరిచయాన్ని, వారి వారి మనస్తత్వాన్ని మనకు అందించారు. ఇది కవితల గ్రంథం కాదు. నవల కాదు. పరిచయంలో ఇద్దరిమధ్య జరిగిన సంభాషణ తో వారి మధ్య జరిగే సంభాషణ తో వారి మధ్య ఉన్న ఆత్మీయత ను తెలియజేయడమే వీరి ఉద్దేశ్యం. ఒక్కొక్కరికి చాలా మందితో పరిచయాలుండవచ్చు. కానీ అవి ఎంతవరకు మనకు ఆనందాన్ని కలుగాజేస్తున్నాయి? అనేది చాలా అవసరం. నేడు ప్రముఖ సినీ రచయిత శ్రీ మహారధి గారి మాట సుదంటురాయిలా ఉన్నా మనసుమాట మనసు మాత్రం సున్నిపిండి లాంటిదని వీరి పరిచయాల్ని బట్టి అర్థమవుతుంది.ఇదో గొప్ప ప్రయోగం. ఒకవిధంగా విలక్షణమయిన ఏ ప్రయోగం నిరంతరం పాఠకులకు, ఇటు మేధో సంపన్నులకు మార్గదర్శకంగా , కాలక్షేపంగా నిలిచిపోతుందని నిస్సంకోచకంగా చెప్పవచ్చు.

” మహారధీ ముచ్చట్లు”
త్రిపురనేని మహారధి
వెల: 60 rs /-
ప్రతులకు :
త్రిపురనేని మహారధి
బి, 118 , మధురానగర్
ఎస్.ఆర్. నగర్,
హైదరాబాద్- 500 038
ఫోన్: 040 -23817888
మరియు విశాలాంధ్ర అన్నీ బ్రాంచీలలో

*****************************
శైలజామిత్ర గారు పుస్తకం.నెట్లో రాసిన ఇతర వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు.

You Might Also Like

2 Comments

  1. రాజేంద్రకుమార్ దేవరపల్లి

    ప్రముఖసాహితీసృజనశీలి శైలజామిత్ర గారు తెలుగు వెబ్ పత్రికలలో తనరచనలు ప్రారంభించటం ముదావహం.ఆమెకు నా స్వాగతం.మహారథి ముచ్చట్లు అన్న పుస్తకం వెలువడిందన్న సంగతిని నాలాంటివాళ్లకు చాలామందికి తెలియజేసినందుకు ధన్యవాదాలు.అపరిమితమైన ప్రజ్ఞాపాటవాలు వుండికూడా ఎందుకో రావాల్సినంత గుర్తింపురాని వ్యక్తి మహారథి,తెలుగు సినిమా పరిశ్రమ ఉత్థ్హానపతనాలను అత్యంతసమీపంగా ఉండి చూసిన మనిషాయన.అలాంటి అనుభవశాలి గ్రంథస్తం చేసిన ఈ పుస్తకం ఎప్పుడు చదువుదామా అని నాలాంటి బద్దకస్తుడికి కూడా ఆసక్తి కలిగించేలా ఉంది సమీక్ష.
    అయితే కొన్ని వాక్యాలు నాకు అర్థంకాలేదు,ఉదాహరణకు… కళ అనేది వస్తుతః వచ్చేది కాదు వాస్తుతః వచ్చేది,…పరిచయంలో ఇద్దరిమధ్య జరిగిన సంభాషణ తో వారి మధ్య జరిగే సంభాషణ తో వారి మధ్య ఉన్న ఆత్మీయత ను తెలియజేయడమే వీరి ఉద్దేశ్యం….ఇలాంటివి అదేవిధంగా ఒకవాక్యంలో జరిపిన అని ఉండాల్సిన చోట జరిగిన అని వాడారు,ముద్రారాక్షసాలు విస్తారంగా ఉన్నాయి.నాకు తెలిసినంతవరకూ శైలజామిత్రగారికి యునికోడ్ తెలుగు టైపింగ్ కొత్త,కాబట్టి పుస్తకం.నెట్ నిర్వాహకులైనా వాటిని సవరించి ఉండాల్సింది.కొద్ది సంవత్సరాలక్రితం వైజాగ్ ప్రెస్ క్లబ్ లో మహారథిని కలిసి కాసేపుమాట్లాడటం తప్ప ఆయనతో
    నాకు పెద్దగా పరిచయం లేదు కానీ,పరిచయమున్నవారిని ప్రభావితం చెయ్యగల శక్తివంతమైన వ్యక్తిత్వం ఆయనది అని ఆకళింపు చేసుకోగలిగాను.యేమీలేని ఆకులు ఎగిరెగిరి పడే సినిమా పరిశ్రమలో అన్నీ ఉండికూడా అణిగి ఉండటం యే కొద్దిమందివల్లో అవుతుంది.అలాంటి కొద్దిమందిలో ముందుండే వారు మహారథి.శైలజామిత్రా గారి నుంచి మరిన్ని పుస్తకసమీక్షలు ఆశిస్తున్నాను.

Leave a Reply