గుప్పిట్లో అగ్ని కణం-లజ్జ

రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
***********************
పుస్తకప్రియులదో చిత్రమైన ప్రపంచం. వారి అల్మొరాలోకి మనం తొంగి చూస్తే పుస్తకాలు కనిపిస్తాయి. కానీ వారికి మాత్రం వాటి చుట్టూ దట్టంగా భావనలు తీగల్లా అల్లుకుని ఉంటాయి. ఒక్కసారి చదివేసిన పుస్తకం మళ్లీ అందుకున్నప్పుడు కథ ఎంతవరకూ గుర్తొస్తుందో కానీ కొన్ని అనుభూతులు, భావాలు దట్టంగా అల్లుకున్న తీగల్లా కనిపిస్తాయి.

అలాగే లజ్జ నవల చూస్తే భయంకరమైన పఠనానుభవానికి సంబంధించినవీ.. ఆ పుస్తకం నాలో రేపిన ఆర్ధ్రానుభూతులూ దట్టంగా అల్లుకున్న తీగల్లా కనిపించాయి. కాని చిత్రంగా మనసు ఆ బాధాకరమైన పఠనానుభవం వైపే లాగింది… మళ్లీ లజ్జ లోకి వెళ్లిపోయా. ఈ పుస్తకం కథగా చెప్పుకోవాలంటే అంతగా ఏముండదు-కానీ మనం చదువుతుంటే అనుభవించేదే ఎక్కువ. నవల చదువుతుంటే ఎవరో ఇంట్లోకి రాబోతున్నట్టూ, ఇల్లంతా బద్దలుకొట్టి.,స్త్రీలను ఎత్తుకుపోతున్నట్టూ అలజడి కలుగుతుంది. ఎప్పుడు ఎవడు చొరబడతాడోనన్న భయాల్లో-అలజడిలో ప్రారంభమై క్రమంగా మన స్పందన… నవల చివరకు చేరుతోంటే నిరాసక్తంగా, చేతగాని ఆదర్శవాది ఆలోచనల్లా నిర్జీవంగా మారిపోతుంది.

1993లో తస్లీమా నస్రిన్ బెంగాలీలో వ్రాసిన ఈ నవల ఆరునెలల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది…ఆ లోగానే అరవై వేల ప్రతులు అమ్ముడయ్యాయి. ఆమెను చంపమంటూ ఫత్వాలు,ఆపై భారతదేశంలో ప్రవాసం హైదరాబాద్ లో దాడి తర్వాతి ఘటనలు. బంగ్లాదేశ్ లో అధిక సంఖ్యాకులైన ముస్లిములు అల్ప సంఖ్యాకులైన హిందువుల్ని హింసించడం ఇందులోని కథావస్తువు. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే- లజ్జ (బంగ్లాదేశ్ పౌరులు) అందరి సామూహిక పరాజయానికి సాక్ష్యపత్రం.ఈ నవలలోని వాక్యం-“భారతదేశంలో నాలుగువేలకు తక్కువకాకుండా మతకలహాలు జరిగాయట. కానీ అక్కడ ముస్లింలు దేశాన్ని వదిలి పారిపోవడంలేదు.వాళ్లూ దాడులు చేస్తున్నారు. కనీ బంగ్లాదేశ్లోని హిందువులు అలా కాదు. వాళ్లకు ఒక కాలు బంగ్లాదేశ్లో, మరోకాలు భారతదేశంలో ఉన్నాయి. మరోలా చెప్పాలంటే భారత దేశంలో ముస్లింలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ బంగ్లాదేశ్ లో హిదువులు పారిపోతున్నారు. ఇక్కడ హిందువులు రెండవశ్రేణి పౌరులు కద పోరాడే హక్కు ఎక్కడుంది?”..అన్నది పరిస్థితిని వివరిస్తుంది.

ఇదంతా వదిలిపెట్టినా-లజ్జ చదువుతుంటే మాయ(ఒక పాత్ర పేరు) నా చెల్లెల్లా అనిపిస్తుంది. ముష్కరులు ఎత్తుకుపోయి ఇంకా ఆచూకీ దొరకని వాళ్లు నా చెల్లెళ్లలా అనిపించారు. నేనున్న గది కిటికీల్లోంచి ఎవరో వస్తున్నరని.. నా మాయని కాపాడుకోవాలని ఆరాటపడ్డాను. చివరికి మతం పేరిట అమాయకులపై తెగబడ్డ ఉన్మాదులపై అసహ్యం వేసింది, పక్కదేశం లో చెల్లెళ్లున్నారని తెలిసి ఎలా బాబ్రీ మసీదు కూల్చారనిపించింది. అసలు బాబ్రీ మసీదు కూలుస్తున్నప్పుడు హిందువు ఎమాలోచిస్తూ ఉండుంటాడు?హిందూ స్త్రీని లాక్కెళ్తూ, వాళ్ళ ఇంటికి నిప్పుపెడుతూ ముస్లిం మనసులో ఏమనుకుంటూంటాడు? మసీదులో నిరాకారుడైన అల్లా కాళీ విగ్రహాన్ని ముక్కలు చేస్తుంటే ఏమనుకుంటాడు? గుండెను దడదడలాడించే ఆందోళనను పంటిబిగువన భరించైనా.. ఆ ఆర్ధ్రమైన అనుభూతి కోసం చదవండి-లజ్జ.

లజ్జ
వెల: రూ. ౮౦
మూలం: తస్లీమా నస్రీన్,
అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య,
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ప్రతులకు: అన్ని విశాలాంధ్ర శాఖలు.

You Might Also Like

2 Comments

  1. Gks Raja

    Yes! Worth reading. Read long back. Tapped me to read once again. Thank you.
    gksraja.blogspot.com

  2. Praveen Sarma

    లజ్జ నవల నేను చదివాను. బంగ్లాదేశ్‌లో ముస్లింలు హిందువులని ఊచకోసేటప్పుడు చనిపోయిన వ్యక్తి నరకాగ్నిలో శాస్వతంగా కాలుతుండాలని దేవుడిని కోరుతారని విన్నాను. ఇటువంటివి వినడానికే గగ్గుర్పాటుగా ఉంటాయి.

Leave a Reply