తెలుగు పద్యమూ – మా నాన్న

యాదృచ్ఛికంగా మదర్స్ డే ముందువారంలో అమ్మపదం పుస్తకం చదివి, పుస్తకం.నెట్‌కు పరిచయం చేశాను. (మొదటి భాగం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ). సమతూకం కోసం ఫాదర్స్ డేకి ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి అనుకొంటుండగా, అమ్మపదం పుస్తకాన్ని నాకు అందచేసిన దేవినేని మధుసూదనరావుగారే మళ్ళీ యాదృచ్ఛికంగా నిన్న ఈ పుస్తకం ఇచ్చారు.

“తెలుగు పద్యం నిన్ను సమూహం నుంచి వేరుచేసి సింహాసనం మీద కూర్చోబెడుతుంది” అని చెప్పి తనలో పద్యం మీద అభిమానాన్ని, ఆసక్తిని, అనురక్తిని కలిగించి, రగిలించి తనచే పద్యాలు కంఠస్థం చేయించిన నాన్న జ్ఙాపకంగా, ఇప్పటి బడిపిల్లలకీ, యువతకీ కానుకగా ఇవ్వాలని ఒక కొడుకు తెచ్చిన పుస్తకం ఇది.

ఈ పుస్తకం చదువుతుంటే నాకు అమెరికాలో నేషనల్ పబ్లిక్ రేడియోలో ప్రతి శుక్రవారం పొద్దున్నే వచ్చే స్టొరీ కోర్ (Story Corps) అనే కార్యక్రమం గుర్తొచ్చింది. అందులో మామూలు మనుషులు వారి వారి కథలను సంభాషణల రూపంలో చెపుతారు. ఈ కథలన్నిటినీ వారి మాటల్లో రికార్డు చేసి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరుస్తున్నారు. ఆ కోవకు చెందిన ఒక కథ – ఒక తండ్రి గురించి ముగ్గురు పిల్లలు చెప్పిన కథ ఈ పుస్తకం మొదటిభాగంలో కనిపించింది.

చిత్తూరు జిల్లా కలకడ మండలం రాతిగుంటపల్లె గ్రామంలో, ధర్మము, పుణ్యము తెలిసిన పెద్దమనిషి, రైతు శ్రీ కోట వెంకటయ్య నాయుడు. ఆయన కుమారుడు కోట పురుషోత్తముడు తన తండ్రిని గురించి, ఆయన తనకు నేర్పిన జీవితపాఠాలని గురించి గుర్తు చేసుకున్నారు మొదటి భాగంలో. వెంకటయ్య గారు బడికి వెళ్ళేందుకు వీలు లేక మూడవ తరగతి తర్వాత బడిచదువు మానుకోవలసి వచ్చినా, పట్టుదలతో తనకుతానుగా చదువుకుని, చాలా విషయాలు నేర్చుకొన్నారు. పండితుల్లాగా మాట్లాడేవారట. వారి ఊరిలో ప్రజోపయోగమైన కార్యాలు చాలా చేశారు. విద్యకు పెద్దపీఠం వేసేవారు. పిల్లలకు సత్ప్రవర్తన నేర్పడానికి సర్వదా ప్రయత్నించేవారు. మంచికి చెడ్డకి తేడాను పిల్లలకు విపులంగా నేర్పడమే కాకుండా ఆచరించి చూపేవారు. మాదిగపల్లె దగ్గర విరిగిపోయిన పరేందిమాను చుట్టూ ఉన్న పిలకల్ని పెళ్ళగించుదామని పిల్లతనంగా ఉత్సాహపడిన కొడుక్కు ఆయన చెప్పిన మాట చూడండి, “ఇతరులు నాటిన చెట్ల కాయల్ని నువ్వు అనుభవించావు కదా. నువ్వు నువ్వుగా ఒక్క చెట్టును కూడా నాటలేదు. పాపం గాలి వచ్చి విరిగిపోయిన మాదిగపల్లోళ్ళ పరేంది చెట్టు పిలకల్ని వేస్తే వాటిని పెరికి వినోదిద్దామని చూస్తున్నావు ఇది దుర్మార్గం కాదా? వాళ్ళు పెంచిన చెట్టు పిలకల్ని ఇంచేసి పెరికేసి మాదిగపల్లి పిలకాయలకు పరేందికాయలు లేకుండా చేయటం చెడ్డపని కాదా?” తప్పు తెలుసుకున్న కుమారుడు మర్నాడు ఒక నేరేడుచెట్టు, కొబ్బరి చెట్టు నాటాడట.

ప్రతిరోజునీ ఒక మధురస్మృతిగా మలచుకోవాలని చెప్పేవారట. ఎట్లా అంటే, “సత్కార్యాలతో, అమృతం కురిపించే వాక్కులతో”. రోజూ చేయగల, మధురస్మృతులిచ్చే వందలాది సత్కార్యాలకి, కానీ ఖర్చు లేని గొప్ప పనులకి ఆయన చెప్పిన ఉదాహరణలు:
ఆవు గంగడొలును అరచేత్తో దువ్వు
ఎదురింటి పిల్లాణ్ణి ఎత్తుకుని ఎగరేసి ముద్దాడు
గాటికాడ ఉన్న ఎద్దు నోటికి పచ్చిగడ్డిని అందించు
మంచిపద్యం నేర్చుకుని అప్పచెప్పు
పిచ్చిక్కి బియ్యపునూక వెయ్యి
పక్కింటి ముసలవ్వ చేతినుంచి చేంతాడందుకుని నీళ్ళు తోడిపెట్టు
పిల్లికి పాలూ కూడూ పెట్టు
నాయనమ్మ చేతుల్ని చెంపకు ఆనించుకుని తృప్తిపొందు
మొక్క నాటి పెంచు
పుస్తకానికి అట్ట వేసుకో
వానొచ్చినప్పుడు మట్టి వాసనను రుచి చూడు
అరచేతిలో సంగటిముద్దేసుకుని గుంతలో ఊరుబిండి పెట్టుకుని కూలీల మధ్య తిను
కానగాకుతో పీక చేసి ఊదు
సంక్రాంతికి ఎద్దుకొమ్ములు జివిరి రంగులేసి కొమ్ములకు ఊపిరిబుడ్డలు కట్టు
చెరువు కొళ్ళబోయే రోజు పిలకాయల్తో కలిసి చేపలు పట్టు
కపిల తోలేటప్పుడు జిళ్ళ వెయ్యి
చెట్టెక్కి చింతచిగురు కొయ్యి
ఇసక నారవలో చెలమ తీసి వొంగి నోరు పెట్టి ఆ నీళ్ళు తాగు
మంచిపని ఎవరు చేసినా అదేపనిగా ప్రశంసించు
పెద్దలను గౌరవించు.

వేంకటయ్య గారి సంస్కారం, ధర్మ చింతన, ఆ విలువల్ని తమ సంతానంలో పెంపొందించటానికి ఆయన పడ్డ తపన గురించి చదువుతుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. మంచిగా జీవించటానికి, మంచితనం పెంచటానికి కృషిచేసిన ఆయనకి చేయెత్తి నమస్కారం పెట్టాలనిపించింది.

పురుషోత్తం గారు కాలక్రమేణా విద్యార్థి దశలో ఏఐఎస్సెఫ్‌లో కార్యకర్తగా ఉండి, పదేళ్ళు ఆర్థికశాస్త్రం లెక్చరర్‌గా పనిచేసి, ఆ తర్వాత కొన్నాళ్ళు వ్యాపారం చేసి, “ఖాళీ”గా ఉంటున్న తరుణంలో, తెలుగుభాషోద్యమంపట్ల ఆకర్షితులయ్యారు. తిరుపతి తెలుగు భాషోద్యమ సమితిలో కార్యవర్గ సభ్యులు. వారి నాన్న స్ఫూర్తిగా ఆయన సేకరించిన పిడికెడు మంచి పద్యాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించి వీలైనంతమంది పిల్లల చేతుల్లోకి చేర్చటానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ పుస్తకంలో కవిత్రయం మహాభారతం నుంచి, నేటి నానీల దాకా, చాలా ప్రసిద్ధమైన తెలుగు పద్యాలు, గీతాలు ఉన్నాయి. వాటిలో చాలాభాగం తెలుగు భాష, తెలుగు నేలను ప్రస్తుతించేవి (మా తెలుగుతల్లికి మల్లెపూదండ, చేయెత్తి జేకొట్టు తెలుగోడా, ఆంధ్రపౌరుషము వంటివి). మరి కొన్ని ప్రబోధాత్మకమైన సుభాషితాలు (సుమతీ శతకం, ఏనుగు లక్ష్మణ కవి…). మరికొన్ని వివిధ కారణాల వల్ల ప్రసిద్ధి చెందిన తెలుగు పద్యాలు (తల్లీ నిన్ను దలంచి, బావా ఎప్పుడు వచ్చితీవు…). నన్నయ నుంచి కత్తి పద్మారావు వరకూ అన్ని తరాల తెలుగు కవులు ఈ పుస్తకంలో కనిపిస్తారు. పాత పరిచయమున్న చాలా పద్యాలు, మన సంస్కృతిలో, మన చరిత్రలో భాగమైన పద్యాలు ఈ పుస్తకంలో మనల్ని పలకరిస్తాయి. పుస్తకం చిన్నదే ఐనా, పెన్నిధిని దాచుకొంది.

పుస్తకాన్ని అందంగా ముద్రించారు. అచ్చుతప్పులు ఉన్నట్లు లేవు. ప్రామాణికమైన పద్యాలను సంకలనం చేసినా, ఈ సంకలనం వెనుక ఒక ప్రణాళిక, పద్ధతి ఉన్నట్లు తోచలేదు.

ఈ పుస్తకం 2006లో ప్రచురింపబడి, రెండు ముద్రణలు పొందింది. రెండవ ముద్రణలో 10,000 ప్రతులు ముద్రించారట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూడబోతే, తెలుగుభాషకోసం తిరుపతిలో పెద్దెత్తునే ప్రయత్నాలు సాగుతున్నట్టున్నాయి.

ఉత్తముడైన ఒక తండ్రికి కుమారుడు ప్రేమగా ఇచ్చిన నివాళి.
గుర్తుంచుకోవలసిన పద్యాల సంకలనం.


తెలుగు పద్యమూ – మా నాన్న
కోట పురుషోత్తం
2006 (రెండు ముద్రణలు)
ప్రచురణ: తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి
ప్రతులకు:
శ్రీమతి రాటకొండ కల్పన
కీర్తి కోవెల
9-66-15ఎ, న్యూ మారుతినగర్
ముత్యాలరెడ్డి పల్లె, తిరుపతి 517502
ఫోన్: 877-2240803; 94402 71699
99 పే; 50 రూ.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************

You Might Also Like

6 Comments

  1. ముత్తేవి రవీంద్రనాథ్

    చక్కటి పుస్తకానికి చకచక్కటి పరిచయం. తన తండ్రిగారి కారణంగానే కోట పురుషోత్తం గారికి తెలుగు పద్యం అంటే అంతటి అభిమానం ఏర్పడిందని ఆయనే ఎప్పుడూ చెపుతూ ఉంటారు. కనుక అది తెలిసిన విషయమే. ఈ పుస్తక పరిచయం ద్వారా కొత్తగా తెలుసుకున్న విషయం ఆయన తండ్రిగారు ఆయనలో ఎంతగా మానవత్వ విలువలు నూరిపోశారన్నది. అన్నట్టు పరేంది చెట్టు అంటే పరికి (కానరేగు – Ziziphus
    oenoplia) చెట్టేనా డా. జంపాల గారూ ? లేక వేరే ఏదైనా వృక్షమా ?

  2. పుస్తకం » Blog Archive » మా నాన్నగారు

    […] ఉన్నాయి. గతవారం పరిచయం చేసిన తెలుగుపద్యమూ-మానాన్న కూడా ఒక తండ్రికి కుమారుడు ఇచ్చిన […]

  3. కర్లపాలెం హనుమంత రావు

    చాలా మంచి పుస్తకాన్ని మా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతల౦డీ!

  4. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.

    అవునండీ !
    “వలస దేవర” నవల్లో మొదటి తరానికి చెందిన పెద్దప్పలో చాలా నమూనాలున్నాయి.
    ఆ నమూనాలయిన వారిలో పాపిరెడ్డిగారి పల్లె శ్రీనివాసులు రెడ్డి, కలికిరి అమరనాథరెడ్డి, బట్టావారిపల్లె రామచంద్రనాయుడి భార్య దేవక్క, కోపూరివాండ్లపల్లె శ్రీనివాసులు నాయుడు, ఎల్లింకోళ్ళపల్లి సుధాకర నాయుడు, దేవలపల్లి మధుసూదన నాయుడు, తిరప్తి సుదర్శన్, కలకడ తస్లీమా తండ్రి గారూ ( ఆయన పేరు నాకు అప్పట్లోనూ గుర్తుండేదికాదు, ఇప్పుడూ గుర్తులేదు. కొన్ని విశిష్ట వ్యక్తిత్వాలు పేర్లని మించి విస్తరిస్తాయి.) బాటవారిపల్లె రాణి, రెడ్డప్పయ్యవారూ ఇలా చాలామందే వున్నారు. వారిలో కొంతమందిని నేను కళ్ళతో చూడలేదు. అయినా వాళ్ళు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నారు. కనిపిస్తూనే వుంటారు.
    అలా మూర్తీభవించిన మనిషితనం తాలూకూ నమూనాల్లో కోట వెంకటయ్య ఒకరు.
    ఒక పరిచయం లేని యువకుడిని ఒక యువతి స్వయంగా పరిచయంచేసుకుని ఏమాత్రం అరమరికల్లేకుండా ఇంటికి తీసుకువెళ్ళి అన్నంపెట్టి పంపించడం అనేది నేను అంతకు ముందెన్నడూ చూడలేదు వినలేదు సరి కదా అప్పట్లో అది కనీసం నా ఊహకి కూడా అందని విషయం. అలాగే అరిసెలని అతిరసాలంటారనీ బెల్లపు అరిసెలు మొహం మొత్తకుండా వుండటానికి నెయ్యీ పప్పూ నంజుకు తింటారనీ తెలిసింది కూడా ఆ రోజే. సరిగ్గా ఇంచుమించు ఇలాంటి అనుభవమే నాకు కడప దగ్గరి రావనపల్లెలో కూడా ఎదురయ్యింది.
    రాయలసీమంటే కేవలం కక్షలూ కార్పణ్యాలు అనే దురభిప్రాయాలని ప్రచారం చేస్తూ ఇతర ప్రాంతాలవారిని భయ భ్రాంతులకి గురి చేసే సినిమాలకీ మీడియాకీ ఈ విషయాలు ఎలా తెలుస్తాయో ఎప్పటికి తెలుస్తాయో అసలు తెలుస్తాయో తెలియవో ఎవరికి తెలుసు ?
    మీరు ఈ పుస్తకాన్ని సమీక్షించడం ద్వారా నిన్నటినించీ నన్ను కలకడ కలికిరి గుర్రంకొండ కె వి పల్లె మండలాల్లో తిప్పుతూనే వున్నారు. ఆ తీయని స్పర్శని పధ్నాలుగేళ్ళ తరువాత మళ్ళీ అనుభూతింపజేస్తున్నందుకు మరోసారి అభివందనాలు.

  5. Jampala Chowdary

    ముష్టూరు, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి అంటే మీరు వలసదేవర, వంజె రచయిత శ్రీరామచంద్రమూర్తిగారేనా? నమస్కారం.

    వెంకటయ్య గారి గురించి, వారి కుటుంబసభ్యుల గురించి పురుషోత్తం గారు పుస్తకంలో చెప్పినదానికి, మీరు చెప్పిన మీ అనుభవానికీ బాగా సరిపోయింది. కుటుంబసభ్యులకు అంతటి సంస్కారం, సహాయదృక్పథం అలవాటుచేయడానికి ఆయన సర్వదా కృషిచేసినట్లు, అది సఫలీకృతమయినట్లు కనిపిస్తుంది.

  6. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.

    ( జంపాల చౌదరిగారూ,
    ఒక్కసారిగా పాతికేళ్ళనాటి మధుర స్మృతులకి మళ్ళీ జీవం పోసినందుకు మీకు నా అభివందనాలు.)

    మిద్దె

    ముష్టూరు నాకు బతుకిచ్చిన అమ్మయితే రాతిగుంటపల్లె నాకు అన్నం పెట్టిన తల్లి.

    మర్చిపోలేను.
    ఆక్కడి ఆప్యాయతలూ అభిమానాలూ ఆత్మీయతలూ
    ఏనాటికీ మర్చిపోలేను.
    మరీ ముఖ్యంగా ఆ మిద్దెని.

    ఎక్కడినుంచో వచ్చిన నేను
    ఎవరో తెలియని నేను
    దారి కానరాక మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో
    చింతమాను కింద ఒంటరిగా నిలబడి దిక్కులు చూస్తూ వుంటే..,
    ఓ చెల్లి ఎదురొచ్చి
    నోరారా అన్నా అని పిలిచి తన్ను తాను పరిచయంచేసుకుంది.
    ఆ మిద్దెలోకి తీసుకువెళ్ళింది
    అన్నం పెట్టి పంపింది

    ఆకలి వేళల
    అమ్మలా ఆదరించి
    అన్నంపెట్టి అమృతం పంచే మిద్దె
    అదే..,
    అప్పుడు నేను అన్నం తిన్న మిద్దె అదే.
    ఆ మిద్దె నాకు బాగా తెలుసు.
    ఆ మిద్దె యజమాని కూడా బాగా తెలుసు.
    ఆయన నాకు చిర పరిచితుడే.
    కొన్ని పరిచయాలకి కరచాలనాలతో పని లేదు.
    కంటి చూపులతో పని లేదు.
    ఆ మిద్దెలో అణువణువునా ఆయన జాడలే.
    అన్నీ ఆయన గురించి అడక్కుండానే ఎన్నో చెబుతాయి,
    ఏ పరిచయం లేని నన్ను తీసుకువెళ్ళి ఆకలి తీర్చి పంపమని
    ఆ బంగారు తల్లికి ఎవరు చెప్పారు ?
    ఆ మిద్దెలో తిరుగాడిన సంస్కార ఫలం కాదా అది ?
    కొన్ని అంతే
    ఏవీ ప్రత్యక్షంగా చెప్పవు
    ఆ మిద్దె కూడా అంతే…

    అదే కోటోళ్ళ ఎంకటయ్య మిద్దె.
    మనిషితనం నిండిన ఆ మిద్దె
    కోటోళ్ళ పురుషోత్తమ్ కంటె రెండు దశాబ్దాల ముందునించే తెలుసు !

Leave a Reply