Leaving Home – Art Buchwald

ఈ పుస్తకం – ప్రఖ్యాత అమెరికన్ రచయిత, పాత్రికేయుడూ అయిన ఆర్ట్ బుక్వాల్డ్ గారి స్వీయానుభవాల సంకలనం. “ఆత్మకథ” అని ఎందుకు అనడంలేదు అంటే, ఇలా ఆయన చాలా పుస్తకాలు రాసారు కనుకా, ఇందులో జీవితంలోని తొలి నాళ్ళ గురించే ఉంది కనుకా. ఈ పుస్తకంలో ఆయన తన బాల్యం మొదలై, తాను పెరిగి పెద్దవాడయ్యి, కొన్నాళ్ళు నౌకాదళం లో పనిచేసి, తరువాత కొన్నాళ్ళు విశ్వవిద్యాలయంలో, అది కాక కొన్ని చిరుద్యోగాలూ – అన్నీ అయ్యాక ప్యారిస్ వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ముగుస్తుంది.

ఆయన శైలిలో నాకు కనిపించిన సొగసు ఏమిటంటే, ఏడుపుని కూడా నవ్వుతూ చెప్పగలగడం. ఎక్కడా ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించినట్లు అనిపించదు. కానీ, నిక్కచ్చిగానే ఉంటాడు. ఆయన బాల్యం లో మరీ అంత సుఖపడిపోయిన సందర్భాలు చాలా తక్కువ. అయినా కూడా, మనకి ఒక విషాద గాథ చదువుతున్నట్లు అనిపించదు. అంటే, బాధ అర్థం చేసుకోలేమని కాదు. ఆ అర్థం చేస్కుకోవడంలో కూడా బుక్వాల్డ్ మనకి ఒక హుందాతనం ఇస్తాడు. ఆయన చెప్పేంత హుందాగా మనమూ వినగలుగుతాం (మెలోడ్రామా లేకుండా అనమాట). నాకు, గ్రూచో మార్క్స్ శైలి కూడా చాలా ఇష్టం (చదివినంతలో). అయితే, ఆయన ఆత్మకథ చదువుతున్నప్పుడు కూడా నాకు వన్ లైనర్లూ, పంచ్ డైలాగులూ తప్పిస్తే మరింకే విషయమూ గుర్తు ఉండేది కాదు. ఈ పోలిక ఎందుకు మొదలుపెట్టానంటే, నాకు ఇద్దరూ ఒకే కారణానికి ఇష్టంగా ఉండేది మొదట్లో – వారి హాస్యం, వ్యంగ్యం మిళితమైన శైలుల వల్ల. కానీ, నేను ఈ పుస్తకం చదివే నాటికి ఇద్దరివీ చెరి రెండు పుస్తకాలే చదివినా (గ్రూచో మార్క్స్ ది కొంచెం ఎక్కువ చదివా అనుకోండి), బుక్వాల్డ్ మనసులో నిలిచిపోయినంతగా మార్క్స్ నిలిచిపోలేదు . ఎందుకూ? అని ఆలోచిస్తే, నాకు అనిపించింది ఇదీ: బుక్వాల్డ్ విషయం చెప్పడానికి తన శైలిని ఆలంబనగా తీస్కుంటాడు. మార్క్స్ తన శైలిలో చెప్పడం
కోసం విషయాన్నే ఆలంబనగా తీసుకుంటాడు అని. (నేను ఇద్దరివీ చదివింది బహు తక్కువ. ఇప్పటికి ఈ అభిప్రాయం ఏర్పడ్డది. అంతే!)

ఆర్ట్ బుక్వాల్డ్ ను హిందూ పత్రిక ఆఖరి పేజీలో స్కూలు రోజుల్లో రోజూ చూస్తూనే ఉన్నా, ఇటీవలి కాలంలోనే చదవడం మొదలుపెట్టాను. ఇదే రెండో పుస్తకం. అయినా కూడా, బాగా దగ్గరివాడు అయిపోయాడు. ఆయన ఫొటోగా కాక, రచయిత గా నా జీవితంలోకి అడుగుపెట్టాక, చాలాసార్లు ఆయన్ని తల్చుకున్నాను అనే చెప్పాలి. ఇందుకు మూడు కారణాలు ఉండొచ్చు.

ఒకటి – నేను చదివిన రెండూ ఆయన స్వీయానుభవాలు కావడం.
రెండు – ఆయన గతం వెనుక ఎంత తీవ్రమైన డిప్రెషన్ ఉందో తెలిసాక, అందులోంచి బైటకి రాగలిగినందుకు ఆయనపై గౌరవం కలగడం
మూడు – వీటన్నింటికీ అతీతంగా నవ్వుతూ, నవ్విస్తూ బ్రతకగలగడం.

నిజంగా, బుక్వాల్డ్ ఖ్యాతి ముందు తెలిసాక, బుక్వాల్డ్ తల్లి అతను పుట్టగానే మానసిక ఆస్పత్రి లో చేరి, ముప్పై ఐదేళ్ళు అక్కడే ఉంది మరణించిందనీ, అతను తల్లి లేకుండా పెరిగాడనీ – అంతే కాదు, చాలా కాలం తండ్రి తమని అందర్నీ పోషించలేని కారణంగా, బాల్యం మొత్తం అనాథ శరణాలయాల్లో గడిపాడనీ, ఆపై, తన జీవితం లో రెండు సందర్భాల్లో తీవ్ర మానసిక సమస్యల వల్ల ఆస్పత్రిలో కాలం గడిపాడనీ – ఈ విషయాలు తెలిస్తే – ఎంత ఆశ్చర్యం కలుగుతుందో – నాకు ప్రత్యక్ష్యానుభావం. అవన్నీ కష్టాలు కాదు – నిజాలు. ఇంకా, ఆయన తానూ ఆస్పత్రిలో ఉన్నప్పటి అనుభవాల గురించి రాసినవి చదవలేదు. కానీ, సూటిగా, ఏడవకుండా, నవ్వుతూ, నవ్విస్తూ, ఆ కథలని కూడా స్పూర్తిదాయకంగా చెప్పగలడాయన. అసలు తక్కినవన్నీ పక్కన పెడితే, ఆయన బ్రతకనేర్చిన వాడు :). బ్రతుకునెరిగిన వాడు కూడా. ఆ కారణానికైనా బుక్వాల్డ్ ని చదవాలేమో.

పుస్తకం వివరాలు:
Art Buchwald – Leaving Home
254 Pages
Ballantine Books
ISBN: 0-449-90972-7
(పుస్తకం నేను చూసిన ఆన్లైన్ స్టోర్లలో అవుటాఫ్ స్టాక్ అని ఉంది. నేను పారిస్ లోని ఒక షాపులో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. ఫ్లిప్కార్ట్ లంకె అయితే ఇక్కడ ఉంది)

You Might Also Like

2 Comments

  1. Umasankar

    నిన్ననే ఈ పుస్తకం చదవటం పూర్తి చేసాను.

    పుస్తకం చివరిపేజీ అయిపోగానే మళ్ళా మొదట్నుంచి నాకు నచ్చిన విషయాలను ఇంకోసారి చదువుకున్న పుస్తకమిది.

    ఇందులో Art Buchwald చెప్పాలనుకున్నవన్నీ హుందాగా,నిర్భయంగా చెప్పేసాడు. అమ్మ బ్రతికేఉన్నా చనిపోయిందని అందరికీ అబద్దం చెప్పటమూ, యవ్వనపు తొలినాళ్ళ తిరుగుళ్ళూ, న్యూయార్క్ వీధుల్లో పనీ పాటా లేకుండా తిరిగిన రోజులూ, బాయ్ ఫ్రెండ్ తో గొడవపడ్డ అమ్మాయిలైనా దొరక్కపోతారా అని కాలేజీ బయట ఎదురుచూపులూ,అనాధ శరణాలయాల్లో పడ్డ కష్టాలూ, చిన్నప్పుడు చెప్పిన అబద్దాలూ, ఆల్కహాల్ అలవాటూ, his lack of Mechanical aptitude in Marine Corps..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..

    ఛదువుతున్నప్పుడు మససులో అట్టడగున కదిలే విషాదాన్నీ,దుఖాన్నీ పైకిరానీకుండా ఆయన రాసిన వ్యంగ్యం విజయవంతంగా అడ్డుపడిందేమో అనిపిస్తుంది నాకు. అన్నేసి కష్టాలను అంత సునాయాసంగా చెప్పడం అంత సులభం కాదనుకుంటా..

    పుస్తకం.నెట్ లోనే కొన్నిరోజుల క్రితం ఈ పుస్తకం గురించి తెలుసుకొని ,ఉత్సుకత కొద్దీ చదివిన పుస్తకమిది. నిరాశపరచలెదు సరికదా, ఆయన రాసిన పుస్తకాలు మరికొన్ని చదివే అవకాశాన్నీ, అదృష్టాన్నీ కలిగించింది. Thank you very much.

    1. Nagini

      Nice introduction…. Thank you…:-)

Leave a Reply