పుస్తకం
All about booksపుస్తకభాష

May 16, 2011

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము– పంచమాశ్వాసము(రెండవ భాగము)

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి?
ఆరణ్యపర్వము– పంచమాశ్వాసము(రెండవ భాగము)

***************
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో నాలుగో వ్యాసం ఇది. మొదటి మూడు వ్యాసాలూ గతం లో వచ్చాయి. అరణ్యపర్వం గురించిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
****************

‘ ఇంద్రియంబు లనఁగ నెయ్యవి? యవి నిగ్ర ! హింపకున్నఁ బాప మేమి దొడరు?
నిగ్రహించువానికి నగు ఫలం ! బెట్టి?’ దనిన నాతఁ డిట్టు లనియె.3-5-79
(‘ఇంద్రియాలు అనగా ఏవి? ఇంద్రియాలను అదుపులో పెట్టకపోతే కలిగే పాపమేమి? వాటిని నిగ్రహించేవాడికి కలిగే లాభ మేమి?’ అని అడిగిన కౌశికుడి ప్రశ్నలకు ధర్మవ్యాధుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.)
‘ విను విషయజ్ఞానమునకు! ననయంబును మనసు మూల మది కామక్రో
ధనిరూఢ మగుచుఁ బురుషుని ! ననిశము నెలయించు నింద్రియార్థక్రియలన్.3-5-80
(‘ఇంద్రియార్థాల తెలివిడికి ఆధారమైనది మనస్సు. అది కోరికలతో కోపతాపాలతో కూడితే మనుజుడిని విషయభోగాలవైపు తరలిస్తుంది.) ఇంద్రియార్థాలు అయిదు. శబ్దం,స్పర్శం, రూపం, రసం, గంధం.
ఇంద్రియార్థంబుల కెలసిన పురుషుండు! గాఢరాగంబున గరఁగుచుండు;
రాగంబు వలనఁ దిరంబగు లోభంబు! లోభియై కరుణకు లోనుగాఁడు;
మఱి సముద్ధతవృత్తి మరగుఁ బాపక్రియఁ ! దగువారు సెప్పెడి తగవు వినఁడు;
కుజనుల దెసఁ బ్రీతి గొఱలు; దుల్యంబులు ! గాకుండు వాఙ్మనఃకర్మభంగుఁ;

లిహమునందుఁ బుణ్యహీనుఁడై చెడిపోవుఁ ! బరమునందు దుఃఖభరము నొందుఁ;
గాన యింద్రియార్థగతిఁ బోక సాధుసం ! సర్గఁ జేసి సుగతిఁ జనుట యొప్పు.3-5-81
( విషయసుఖాలకు చిక్కిన మనుజుడు మిక్కుటమైన కామప్రవృత్తికి లోనౌతాడు. మిక్కుటమైన కామప్రవృత్తికి లోనుకావటం వలన చాలాకాలం నిలిచే లోభం ఏర్పడుతుంది. లోభి కావటం వలన దయకు దూరమైనవాడౌతాడు. గర్వానికి లోనౌతాడు. పాపకార్యాలకు పాల్పడతాడు; యోగ్యులైనవారు చెప్పే ధర్మాన్ని ఆలకించడు. చెడ్డవారి స్నేహం చేస్తాడు. వాక్కుకు, మనస్సుకు, చేతలకు, బొత్తిగా పొంతన కుదరదు. ఆవిధంగా అతడు ఈలోకంలో చెడిపోతాడు. పరం దక్కక అతడు దుఃఖమగ్నుడౌతాడు. కాబట్టి విషయభోగాలలో మనస్సును చిక్కనీయక, సాధుజనుల సహవాసం చేసి సుగతికి పోవటం మంచిది.)
వ. ఇంద్రియంబు లన నెయ్యవి యనియు, నింద్రియ జయసిద్ధియు నీవు నన్నడిగితివి; తత్ప్రకారంబు బ్రహ్మవిద్యావిషయంబు మాబోఁటివారికి నవాచ్యంబై యుండు; నైనను నీవు సద్బ్రాహ్మణప్రవరుండవు గావున సద్బ్రాహ్మణ ప్రియం బవశ్యకర్తవ్యంబు; పరమబ్రహ్మవిదు లైన బ్రాహ్మణవరులకు నమస్కరించి, బ్రహ్మవిద్యాప్రపంచం బెఱింగించెద; నవధాన పరుండ వై యాకర్ణిపుము.3-5-82
(ఇంద్రియాలు అనగా ఏవి? ఇంద్రియనిగ్రహం ఎలా లభిస్తుంది? అని నీవు నన్ను ప్రశ్నించావు. అది ఆధ్యాత్మిక తత్త్వం. అది నాబోటివారు చెప్పడానికి అలవి కానిది; అయినను నీవు బ్రాహ్మణోత్తముడవు. జిజ్ఞాసువవు; తెలిసికొనటానికి యోగ్యత యున్నవాడవు. మంచి విప్రుల కోరిక ఈడేర్చటం తప్పనిసరిగా చేయవలసినపని. కాబట్టి, మహానుభావులు, ఆధ్యాత్మిక తత్త్వకోవిదులు అయిన బ్రాహ్మణోత్తములను ధ్యానించి, వారికి సవినయంగా నమస్కరించి, బ్రహ్మజ్ఞానాన్ని గూర్చి నీకు సవిస్తరంగా తెలుపగలను. ఏకాగ్రతతో కూడిన నిష్ఠతో ఆలకించుము.)- కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవటానికి కొన్ని కొన్ని అర్హతలు మనకు ఉండాలి. ఆ అర్హతలను మనం సంపాదించుకోవాల్సి ఉందన్నమాట.
అంబరము వాయు వగ్ని దోయమ్ము ధరణి ! భూతపంచక మిది క్రమంబున మహాత్మ!
శబ్ద సంస్పర్శ రూప రసములు గంధ ! సంయుతంబుగ భూతపంచక గుణములు.3-5-83
(గొప్ప ఆత్మగల ఓ కౌశికమహర్షీ ! ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనేవి పంచభూతాలు. వీటి గుణాలు వరుసగా నాదం, స్పర్శ, ఆకృతి, ద్రవం, వాసనలు. అనగా: ఆకాశగుణం శబ్దం, వాయుగుణం స్పర్శం, అగ్నిగుణం రూపం, నీటిగుణం రసం, భూమిగుణం గంధం.)
ఒనరఁగ నాకస మాదిగ ! ననులోమముతోడ నిమ్మహాభూతము లే
నును బుట్టు నొకటి కొక్కటి ! యనయముఁ బ్రతిలోమగతి లయంబునఁ బొందున్. 3-5-84
(ఆకసం మొదలుగా పంచభూతాలు వరుసగా అనులోమ క్రమంలో పుట్టుతాయి. అవి ప్రతిలోమ క్రమంలో లయమౌతాయి. (అనగా ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీటినుండి భూమి పుట్టుతాయి. ఇక ప్రతిలోమ క్రమాన ప్రళయకాలంలో భూమి నీటిలో, నీరు అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో లయిస్తాయి.)
వ. శ్రోత్రంబును ద్వక్కును జక్షువును జిహ్వయు ఘ్రాణంబును నను నియ్యేనగు నింద్రియంబులు శబ్ద స్పర్శ రూప రస గంధంబు లింద్రియవిషయంబు లై యుండు; నింద్రియపంచకంబునకు షష్టంబై మనస్సు ప్రకాశిల్లు ; సప్తమాష్టమంబు లై బుద్ధియు నహంకారంబును వర్తిల్లు; సత్త్వంబును రజస్సును దమస్సును గుణంబు లై యుండు ; నీ చెప్పంబడిన మహాభూతప్రముఖ ప్రపంచంబంతయు నవ్యక్తం బను తత్వంబునం దావిర్భతిరోభావంబులం బొందుచుండు. 3-5-85
(చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు – ఇవి ఐదు ఇంద్రియాలు.శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం ఇవి ఐదు ఇంద్రియార్థాలు. వీటికి పంచతన్మాత్రలు అని వ్యపదేశం. ఇంద్రియపంచకానికి తోడు ఆరవది మనస్సు, బుద్ధి ఏడవది. అహంకారం ఎనిమిదవది. సత్త్వం, రజస్సు, తమస్సు – ఇవి మూడున్నూ త్రిగుణాలు. ఈ భూతప్రపంచం సర్వమున్నూ ‘అవ్యక్తం’ అనే తత్త్వంలో ఉదయిస్తుంది. తిరిగి అందులోనే లయిస్తుంది.)
అవ్యక్త తత్త్వ మరయఁగ ! నవ్యక్తం బయ్యు నిట్టి దై లక్ష్య మగున్
సువ్యక్తేంద్రియ భూతా ! ది వ్యవహారార్థ లింగదృష్టాకృతి యై.3-5-86
(అవ్యక్తమై అగోచరమయ్యే తత్త్వం – అవాఙ్మానస గోచరం అనిచర్వచనీయం అనుభవైకవేద్యం అయినదే అయినను, లోకవ్యవహారంలో, ఇంద్రియాలకు భూతాలకు అనువయిన భావనలో లింగభేదంతో కూడిన రూపంతో కన్పించవచ్చును. ఆవిధంగానే అవ్యక్తతత్త్వాన్ని లౌకికులైన మానవులు గ్రహించ వీలు కల్గుతుంది. అనగా అవ్యక్తతత్త్వం వ్యవహారంలో సాకారం కావచ్చును. అసలు అది నిరాకారం. అవ్యక్తం.)
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె.3-5-87
అనఘ ! శబ్దాది విషయంబులందుఁ దగిలి ! యిచ్చ జరియించు నెప్పుడు నింద్రియములు,
బుధుడు దత్స్వభావముఁ దనబుద్ధి నెఱిఁగి ! యేమఱక వానిఁ దగఁ గుదియింపవలయు.3-5-88
(ఓ పుణ్యాత్ముడా! ఇంద్రియాలు శబ్దం మొదలైన భోగసాధనాలలో చిక్కుకొని, ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటాయి. బుద్ధిమంతుడు ఏమఱుపాటు చెందక జ్ఞానాన్ని ఆర్జించి ఇంద్రియాలను నిగ్రహించాలి.)
ధీరుడుఁ నిర్జితేంద్రియుఁడు దెల్లముగాఁ దనుఁ గాంచు భూత వి
స్తారనిగూఢ మైన పరతత్త్వముగాఁ, దనయందు భూత వి
స్తారము నెల్లఁ గాంచు సతతస్ఫుటదర్శనుఁ డై సమగ్ర వి
స్ఫారతఁ బొంది నిర్మలతపంబులయందుఁ జలింప కెన్నఁడున్. 3-5-89
(స్వచ్ఛమైన తపస్సులు చేసి జ్ఞానాన్ని ఆర్జించిన మహనీయుడు సర్వభూతాలలో తనను తెలిసికొంటాడు; తనయందు సర్వభూతాలను తెలిసికొంటాడు.)
విశేషం:’ఏకమ్ సత్ విప్రాః బహుధా వదంతి’ , ‘ ఏకమేవా2ద్వితీయమ్’ – మున్నగు ఉపనిషద్వాక్యాలకు అనురూపమైనది ఈ పద్యం. భిన్ననామరూపభేదాత్మక మైన ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న ఆత్మపదార్థాన్ని తపస్వి అయినవాడు ఇంద్రియనిగ్రహంతో గుర్తించగలడు.
తప మనఁగ సకల విషయ ! వ్యపేత మగు నట్టి బుద్ధివైభవము సుమీ!
తపమున సుస్థిరుఁ డగు యో! గపరునకుం గలవె యొండు కర్తవ్యంబుల్.3-5-90
(తపస్సు అనగా అన్ని విషయాలనుండి వెనుకకు మరలిన మనస్సుతో కూడిన వైరాగ్యమే కదా! తపస్సులో నిలుకడ కనిన యోగికి ఇక చేయవలసిన పనులు వేరేమీ ఉండవు.)
స్వర్గనరకంబు లింద్రియ ! వర్గ సమాచరణమునన వచ్చును వినవే!
స్వర్గమగుఁ దన్నివారణ ! దుర్గతి యగుఁ దన్నిరోధ దుర్బలత మెయిన్. 3-5-91
( ఇంద్రియాలను నిగ్రహించటం వలన స్వర్గం లభిస్తుంది. ఆ ఇంద్రియాలను నిగ్రహించజాలని బలహీనత వలననే నరకం ప్రాప్తిస్తుంది.)
విశేషం : పాపాలు చేసిన వారికి యమలోకం ప్రాప్తిస్తుందనిన్నీ, పుణ్యాలు చేసిన వారికి స్వర్గం లభిస్తుందనిన్నీ – పురాణ సాహిత్యంలో చేప్పబడిన అంశం. అర్థవాదరూపంగా గ్రహించనగునని భారత సందేశం.
“న మోక్షో నభసః పృష్ఠే ! న పాతాళే న భూతలే !
సర్వాశాసంక్షయే చేతః క్షయో మోక్ష ఇతీర్యతే!”
(మోక్షం అనేది ఆకాశం వెనుకగాని పాతాళంలో గాని భూమిమీద గాని ఉండే చోటు గాదు. ఆశాపరివృత మైన చిత్తవృత్తి నశించటమే నిజమైన మోక్షం. – అన్న వేదవాక్య మిక్కడ అనుసంధించదగింది.)
అరదము దేహ, మింద్రియము లశ్వము, లాత్ముఁడు సూతుఁ డమ్మహా
తురగచయంబు ధైర్య మను తోరపుఁ బగ్గములన్ దృఢంబుగా
నురవడిఁ బోక యుండ వెర వొప్పఁగఁ బట్టినవాఁడు సేమపుం
దెరువున నేఁగు నప్పరమధీరుఁడు సువ్వె యుదారుఁ డెయ్యడన్. 3-5-92
(ఈ దేహమే ఒక రథం. ఇంద్రియాలు ఈ రథానికి పూన్చిన గుఱ్ఱాలు – అని చెప్పవచ్చును. ఆత్మయే ఈ రథాన్ని నడిపే సారథి. చలించని చిత్తం అనే పగ్గాలను చేతబూని ఉపాయంతో ఎవడు ఈ గుఱ్ఱాలను తన అదుపులో పెట్టి నడపగలడో అట్టివాడే ధీరుడు. అట్టివాడే క్షేమమార్గాన పోయేవాడు.)
విశేషం : అనుభవం మిక్కిలి ప్రాచీనమైనది. “ఆత్మానం రథినం విద్ది శరీరం రథ మేన తు” – ఇత్యాదులు, మఱియు “యస్తువిజ్ఞానవాన్ భవతి ! యుక్తేన మనసా సదా ! తస్యేంద్రియాణి వశ్యాని ! సదశ్వా ఇవ సారథేః” అనే ఉపనిషద్వాక్యాలు ఇట స్మరింపదగినవి.
ఇంద్రియంబులు దివిచిన యెడక పాఱు ! చుండు మన సెప్డుఁ; ముడుపకున్న
నెడలి చెడిపోవు బుద్ధి యుదీర్ణపవన ! హతిఁ బయోనిధిలోఁ గల మవియు నట్లు.3-5-93
(ఇంద్రియాలు ఆకర్షించిన చోటికే మనసు సదా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ప్రసారవేగాన్ని అదుపులో పెట్టకపోతే సముద్రంలో పెనుగాలి తాకిడికి పగిలి నశించే పడవవలె, బుద్ధి పాడైపోతుంది.)
ఏనింద్రియములు మనసును ! బూని తనవశంబ యైన బురుషుండు గదా
ధ్యానసమాధిసమగ్రుఁడు ! వానిం గీర్తింతు రమరవరులున్ మునులున్.’ 3-5-94
(ఐదు ఇంద్రియాలను తన వశం చేసికొనినవాడే కదా ధ్యానయోగి; అట్టివాడినేగదా దేవతలు, ఋషులు పొగడుతారు.’ )
వ. అనిన నవ్విప్రుండు సత్త్వరజస్తమోగుణంబులతెఱం గెఱింగింపు మనిన నెఱు కి ట్లనియె.3-5-95
(అని చెప్పిన కౌశికమునితో ధర్మవ్యాధుడు ఇట్లా పలికాడు.)
అతినిందితము తమోగుణ ! మతిబోధమయంబు సత్త్వ మనయంబుఁ బ్రకా
శత నొప్పు; నుభయగుణమి ! శ్రతఁ బరఁగు రజోగుణంబు సన్నుతచరితా ! 3-5-96
(పొగడబడిన శీలం కల ఓ కౌశికమునీ ! తమోగుణం మిక్కిలి హేయమైనది. సత్త్వగుణం జ్ఞానంతో కూడి వెలుగొందేది. ఇక రజోగుణమా, తమోగుణ సత్త్వగుణాల రెంటియొక్క సమ్మేళనం.)
అసుఖాకారత నిద్ర దైన్యము విమోహం బక్షమత్వంబుఁ దా
మసభావంబులు ; రాగలోభజడతామానంబు లూహింప రా
జసవృత్తంబులు; ధైర్యశాంతికరుణాసంతోషవిద్యాదు లిం
పెసఁగన్ సాత్త్వికచేష్టితంబులు; నిజం బి ట్లాత్మఁ గ న్మిన్నియున్.3-5-97
(సంతృప్తి లేని రూపం, నిద్దురమత్తులో ఉండటం, హీనత్వం, మిక్కుటమైన భ్రాంతి, సహనం లేకపోవటం అనేవి తమోగుణాన్ని సూచించే లక్షణాలు. దురాశ, పిసినిగొట్టుతనం, జడత్వం, దురహంకారం రజోగుణాన్ని సూచించే లక్షణాలు. ఆపద దాపురించినప్పటికీ చలించని చిత్తవృత్తి, మానసిక సంతృప్తి, జాలి, సంతోషం, తెలివితేటలు మొదలైనవి సత్త్వగుణాన్ని సూచించే లక్షణాలు. ఇది నిజం. ఇదంతా నీ మనస్సులో గ్రహించుము.)
అనఘుఁడు సాత్త్వికుం డగు మహాత్ముఁడు బోధనిరూఢి సర్వముం
గనికొని లోకవృత్తములు గావని రోసి సమస్తసంగభం
గనిరతుఁ డై తొరంగు మమకారవికార మహంక్రియాచ్యుతిం
బనుపడి సంయమప్రకట భావన నుత్తమశాంతిఁ గై కొనున్.3-5-98
(పాపరహితుడైన మహానుభావుడు జ్ఞానాన్ని ఆర్జించి, ఐహికంలోని విషయాలు అన్నీ సరిఅయినవికావని తెలిసికొని, వైరాగ్యభావాన్ని సంపాదించుకొని, సంగమము త్యజించి, అహంకారాన్ని నిర్మూలించుకొంటాడు. అహంకారం జారిపోవటం చేత ఇంద్రియనిగ్రహం ఏర్పడినట్టి యోగీశ్వరుడు గొప్పశాంతిని అనుభవిస్తాడు.)
వ.సత్త్వగుణనిబద్ధుం డగునేని శూద్రుం డైనను జన్మాంతరంబున వైశ్వత్వంబు నొంది క్రమంబున రాజభూసురభావంబులు భజించి భవ విముక్తుండగు’ నని చెప్పిన నమ్మహీదేవుం డమ్మహానుభావు నభినందించి, 3-5-99
( సత్త్వగుణాలు కలవాడు ఈ జన్మలో శూద్రుడై పుట్టి ఉన్నప్పటికిన్నీ, మరుజన్మలో వైశ్యుడై పుట్టుతాడు. అట్లే వరుసగా – తదుపరి జన్మలలో క్షత్రియుడై బ్రాహ్మణు డై పుట్టుతాడు. అప్పుడు జన్మరాహిత్యాన్ని పొందగలడు‘ అని చెప్పగా, కౌశికుడు ధర్మవ్యాధుడిని అభినందించాడు.)
‘ దేహమున ధాతు సంశ్రయదీప్తుఁ డగుచు! వహ్ని యెట్లుండు ? శారీరవాయువులకు
నెలవు లెయ్యవి ? యవి నాకు నిశ్చయముగఁ ! జెప్పు’ మనుటయు నిట్లని చెప్పె నతఁడు. 3-5-100
(మానవశరీరంలో ధాతువుల ఆశ్రయంచేత అగ్ని ఎట్లా ప్రజ్వలిస్తుంది? శరీరంలోని వాయువులకు ఆటపట్టులు ఏవి? ఈ విషయాలను దయచేసి నాకు సందేహాలకు ఆస్కారం లేని రీతిగా – వివరించి తెలుప వేడికోలు.)
విశేషం: దేహం – అనేక ధాతువులతో ఏర్పడేది. ధాతువు అనగా ఆధారభూతమైన పదార్థం అని అర్థం. ధాతువులు ఏడు. అవి – వస, అస్సక్కు, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రం. పక్షాంతరంలో మఱి కొందఱు ధాతువు లనగా – రోమం, త్వక్కు, మాంసం, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణం. అందుచేత సంఖ్యాశాస్త్రంలో ధాతువుకు సప్తసంఖ్యాపరిగణనం ఏర్పడింది.
మూర్ధదేశమునకు వర్ధితం బై పర్వు ! నాత్మాగ్ని; నాభి దదాశ్రయంబు;
శిరమునఁ బావకాంతరమునఁ జరియించుఁ ! బ్రాణుండు; భూతాత్మభావుఁ డతఁడు;
వరుసఁ బ్రాణాపాను లిరువురు నయ్యగ్ని ! వెలిగింతు రనపేతవృత్తు లగుచు;
గుదవస్తితలము లాస్పదములుగా వహ్ని ! పరిగతుం డగుచు నపానుఁ డుండు;

గడఁగి విణ్మూత్రనిర్గమకారి యతఁడు;! కర్మబలయాత్మకారి యై కంఠతలము
నం దుదానుండు వర్తించు; నఖిలదేహ ! సంధులందును వ్యానుండు సంచరించు. 3-5-101
(ఆత్మాగ్ని నాభినుండి శిరస్సువఱకు వ్యాపిస్తూంటుంది. నాభి దానికి ఆశ్రయం. ఫ్రాణుడు అనే వాయువు, ఆ అగ్నిమధ్యగా శిరస్సులో చలిస్తూంటుంది. అతడు సర్వభూతాలకు జీవత్వాన్ని ప్రసాదించేవాడు. ప్రాణుడికి తోడుగా అపానుడు ఎల్లప్పుడు ఆ అగ్నిని జ్వలింప చేస్తుంటాడు. అపానుడు ముడ్డి, పొత్తికడుపు మధ్య అగ్నిచేత పరివేష్ఠితుడై ఉంటాడు. అతడే మలమూత్రాలను విసర్జించేటట్లుగా చేస్తాడు. ఉదానుడు అనే వాయువు కంఠంలో నివసిస్తాడు. కర్మతంత్రాన్ని నడుపుతాడు. వ్యానుడు అనేవాయువు శరీరంలోని వివిధాలైన అవయవాలు ఒకదానితో మరియొకటి కలిసేచోటులలో ఉంటుంది.)
విశేషం: పంచప్రాణాలు 5. ప్రాణం, అపానం, ఉదానం, వ్యానం, సమానం – అనే పేర్లు కలిగిన వాయువులు. ఈ పద్యంలో నాలుగింటిని గూర్చి చెప్పటం జరిగింది. సమాన వాయువు గుఱించి తఱువాతి పద్యంలో—
విను, ప్రాణాపానులు న ! య్యనలుఁడుఁ బ్రాపుగ సమానుఁ డన్నరసవిపా
చనుఁ డగుచు నాభిదేశం ! బున నుండును సకలధాతుపోషకవృత్తిన్. 3-5-102
(సమానుఢు అనేపేరు గల వాయువు నాభిప్రదేశంలో ఉండి, ఆహార పానీయాలను జీర్ణింపజేసి, శరీరంలోని ధాతువులు పెంపొందేటట్లుగా చేస్తుంది. సమానుడు ఆత్మాగ్నికి ప్రాణాపానులకు తోడై సహకరిస్తాడు.)
ఇది పరమయోగదర్శన ! విదితం బిప్పాటఁ బవనవిదు లైన మునుల్
వదలక యభ్యాసవిధిన్ ! ముదమున ధరియింతు రాత్మమూర్ధతలమునన్.3-5-103
(పంచప్రాణాలను గూర్చినట్టి, ఆత్మాగ్నిని గూర్చినట్టి ఈ పరిజ్ఞానం గొప్పయోగదర్శనం వలన మాత్రమే తెలియదగింది. అభ్యాసం వలన నిష్ణాతు లైన ఋషులు ఆత్మను మూర్ధప్రదేశంలో ధరిస్తారు.)
విశేషం: ‘యోగదర్శనం’ – అనే ప్రయోగం మిక్కిలి అర్థవంతమైనది. దర్శనం అనగా క్రోడీకరించబడిన జ్ఞానం. ‘షడ్దర్శనములు’ , ‘సర్వదర్శనసార సంగ్రహము’- మున్నగు శీర్షికలు అనుశీలించదగినవి.
వ. ప్రాణాపానసమాహితుండై సకలదేహంబులందును జరియించుచున్న పావకుండు జీవాత్ముండుగా నెఱుంగు; మతండు జలంబుల నున్న కమలపత్రంబునుంబోలె దేహంబునం దుండియు నిర్లేపస్వరూపదీపితుం డయి వెలుంగుచుండు; నిట్టి జీవాత్ముండ కదా పరమాత్ముండు. 3-5-104
(ప్రాణుడు అపానుడు అనబడే వాయువులతో కలిసిమెలిసి అన్ని శరీరాలలో నడయాడే అగ్నియే జీవాత్మ అని తెలిసికొనుము. నీటిలో తడిసిపోకుండగా ఉండే తామరాకువలె ఆ జీవాత్మ దేహంలో నిర్లిప్తుడై ఉంటాడు. ఆ జీవాత్మయే పరమాత్మ.)
చేతన రహితక్షేత్రముఁ ! జేతనముం బొరయఁజేయు జీవాత్మ దశో
పేతుఁడు పరమాత్ముఁడు వి ! ఖ్యాతుఁడు త్రైలోక్యసంప్రకల్పనుఁ డనఘా!3-5-105
( అచేతన మైన దేహాన్ని చేతనంగా చేసేవాడు ‘జీవాత్మ’గా భాసించే ఆ పరమాత్మయే. అతడు సుప్రసిద్ధుడు. మూడులోకాలను సృష్టించగల శక్తి కలవాడు.)
భూతములయందు వెలిఁగెడు ! భూతాత్ముని నెఱుఁగుదురు ప్రబుద్ధులు నిత్య
జ్యోతిర్మయు నవ్యయు న ! ద్వైతం బగు బుద్ధి సూక్ష్మధర్మమువలనన్.’ 3-5-106
(స్థూలదృష్టికి భిన్ననామరూపభేదాలచేత సాక్షాత్కరించే జగత్తులో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని సూక్ష్మదృష్టితో గ్రహించగల జ్ఞానులు అద్వైతయోగం వలన జ్యోతిర్మయుడైన, శాశ్వతుడైన భూతాత్మునిగా గుర్తిస్తారు.’)
విశేషం: ఎఱ్ఱాప్రెగడకు శంకరాచార్యులవారు ప్రతిపాదించిన ‘అద్వైత’ సిద్ధాంతంపై గల మక్కువ ఇక్కడ వ్యక్తమౌతున్నది.
వ.అని మఱియుఁ గౌశికునకు ధర్మవ్యాధుండు బ్రహ్మవిద్యాప్రభావంబు తెఱంగు సంప్రయోగరహస్యంబు తెలియ ని ట్లనియె.3-5-107
(అని చెప్పిఅంతటితో ఆగకుండా, ధర్మవ్యాధుడు వేదాంతజ్ఞానంయొక్క మహిమ ఆచరణలో ఎట్లా వెలువడుతుందో కౌశికుడికి ఇట్లా తెలియజెప్పాడు.)
విశేషం: ఇట – ‘సంప్రయోగరహస్యంబు తెలియన్’ అనే ప్రయోగం అనుశీలించదగింది. సిద్ధాంతం వేరు. దానిని అనుభూతిలోకి తెచ్చుకొని ఆచరణ లోనికి అనువదించటం వేరు. సిద్ధాంతం అందరకూ తెలిసినదే కావచ్చును. దాని ఆచరణలోనికి దానిని అనువదించటానికి – ‘సంప్రయోగరహస్యములు’ – తెలియవలెను. అవి నిగూఢ విషయాలు. ఆ రహస్యాలను వెల్లడించేది తరువాతి పద్యం. అనగా ధర్మవ్యాధుడు కౌశికుడికి కేవలసిద్ధాంత జ్ఞానాన్ని మాత్రమే తెలిపి ఊరుకొనక, సంప్రయోగరహస్యాలను కూడ వివరించాడు.
‘ తెలివినొందిన బుద్ధిగల మహాత్ముండు శు! భాశుభ కర్మములందుఁ జొరఁడు;
క్రమమున సౌఖ్యదుఃఖము లాదిగా నశే ! షద్వంద్వములయందు సమత నుండు;
విను, మట్టి పుణ్యున కొనరింపవలయు కా ! ర్యం బెఱింగించెద ననుదినంబు
నియతాశియును జితేంద్రియుఁడు నై పూర్వరా ! త్రమ్మున నపరరాత్రమ్మునందు

యోగధారణనిరతుఁడై యుండవలయు;! నపుడు బోధదీపంబున నాత్ము నాత్మ
యందుఁ గనుచు నివాతదీపానుకారి ! యై వెలుంగుచు నమృతమయత్వ మొందు. 3-5-108
(‘జ్ఞానాన్నిఆర్జించిన మహానుభావుడు మంచిపనులలో గాని చెడుపనులలోగాని నిర్లిప్తుడుగా ఉంటాడు. అట్టివాడు – సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలకు అతీతుడు. అన్నిటియెడల అతడు సమభావాన్ని పెంపొందించుకుంటాడు. అట్టి పుణ్యాత్ముడు చేయవలసిన కర్తవ్యాలను వివరిస్తాను వినుము. ప్రతిదినం, ఎల్లవేళల అతడు యోగసాధన చేస్తూ, మితాహారియై ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించిన యోగి ఆత్మలో పరమాత్మను దర్శించి, గాలి లేనిచోట వెలుగొందే దీపంవలె నిశ్చలు డై ప్రకాశిస్తాడు. అమృతమయుడు ఔతాడు.)
విశేషం: (1) “తమసో మా జ్యోతిర్గమయ, అసతో మా సద్గమయ,
మృత్యో ర్మా అమృతం గమయ” – అనే వేదమంత్రాన్ని ఇక్కడ అనుసంధించుకోవాలి.
(11) ద్వంద్వాతీతుడు అయిన స్థితప్రఙ్ఞుడిని గూర్చి విపులంగా భగవద్గీత రెండవ అధ్యాయంలో వివరించబడింది.
కామంబును క్రోధంబును ! నేమఱక జయింపవలయు నెల్ల విధములన్
ధీమహిత! యిదియ సతత ! క్షేమంకర మైన విధము గృతబుద్ధులకున్. 3-5-109
ఇటువంటి ఆణిముత్యాలనేరుకోవటం కోసమే మనం భారతాన్ని అధ్యయనం చేయటం.
(మేధావి అయిన ఓ కౌశికమహర్షీ ! ఎల్లప్పుడును ఏమరక కామక్రోధాలను అణచిపెట్టాలి. మనస్సు పరిపక్వమైనవారలకు ఇది ఒక్కటి మాత్రమే శుభాన్ని చేకూర్చే ఉత్తమ మార్గం.)
నిత్యముఁ గర్మియుఁ గర్మఫల ! త్యాగియు నగుట లెస్స లౌల్యవియోగం
బత్యుత్తమ యోగము ద !త్ర్పత్యయలక్ష్యుండు సూవె బ్రాహ్మణుఁడు మహిన్. 3-5-110
(మనుజుడు ఎల్లప్పుడు కర్మను ఆచరిస్తూనే ఉండవలెను. కాని, ఆ కర్మలవలన కలిగే ఫలాన్ని మాత్రం విడనాడాలి. తాను చేసే పనులలోనే మునిగి తేలుతుండటం మంచిది కాదు. కర్మఫలితాలను విడనాడటమే మిక్కిలి మంచిదైన యోగం. నిజానికి జ్ఞానాన్ని ఆర్జించిన బ్రాహ్మణుడు ఈ ఆశయానికి నిదర్శనప్రాయుడుగా అనుష్ఠానవేదాంతిగా బ్రదుకనగును.)
అరయఁగ జీవితంబు గడునస్థిర; మింత యెఱింగి యాత్మ నె
వ్వరిదెసఁ గీడురోయక ధ్రువం బగు మైత్రి భజించి సత్కృపా
నిరతుఁడు నిష్పరిగ్రహుఁడు నిత్యతపస్వియు నిత్యతృప్తుఁడుం
బరమశమాన్వితుండు నగు బ్రాహ్మణుఁ డొందు సనాతన స్థితిన్. 3-5-111
( ఆలోచన చేస్తే మానవుల బ్రతుకులు బొత్తిగా నిలుకడ లేనట్టివి. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తనలో తెలిసికొనినవాడు ఎవరికిని ఎట్టి అపకారాన్ని తలపోయడు. అందరియెడ ప్రేమపూర్వక మైన స్నేహభావాన్నే పెంపొందించుకుంటాడు. అట్టి జ్ఞాని, ఎల్లప్పుడు జాలితో నిండిన గుండె కలవాడయి, ఎల్లప్పుడు తపస్సు చేసికొంటూ ఎవరినీ యాచించడు. ఎవరిదగ్గఱనుండీ ఏమీ తీసికొనడు. అతడు నిత్యసంతృప్తుడు. ఆ విధంగా గొప్ప ఇంద్రియనిగ్రహం సాధించిన బ్రాహ్మణుడు, శాశ్వతమైన ఆనందస్థితిని పొందగలడు.)
వ. నీ వడిగిన యఖిలధర్మంబులు సంక్షేపరూపంబున నెఱింగించితి నింక నెయ్యది వినవల‘ తనినం గౌశికుండు ‘మహాత్మా! వినవలయునవి యెల్లను విశదంబుగా వింటిం; బ్రబుద్ధుండ నైతి ; నీవు సర్వజ్ఞుండవగుట దెల్లం బయ్యె’ ననిన ధర్మవ్యాధుం డతని కి ట్లనియె. 3-5-112
(నీవు ప్రశ్నించిన విషయాలు అన్నిటిని గూర్చి నేను నాకు తెలిసినంతమేర కుదించి నీకు తెలియజేసి ఉన్నాను. ఇక, నీవు మఱి యేవిషయాలనుగూర్చి తెలియగోరుతున్నావు?’ – అని ధర్మవ్యాధుడు కౌశికుడిని అడిగాడు. అంతట కౌశికుడు, ‘మహానుభావా! వినవలసిన విషయాలను అన్నింటిని నీవు విశదంగా వివరించి చెప్పగా విన్నాను. నీవు చెప్పిన విషయాలవలన నేను ఆధ్యాత్మికంగా మేలుకొన గలిగాను. నీవు అన్ని విషయాలు తెలిసిన సర్వజ్ఞుడవు అని నేను గుర్తించగలిగాను‘ – అని ధర్మవ్యాధుడికి ధన్యవాదాలు సమర్పించాడు. అప్పుడు కౌశికుడితో ధర్మవ్యాధుడు ఈ విధంగా చెప్పాడు.)
‘ఏ నిమ్మెయి నుత్తమ జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం
బైనది గల దొక ధర్మము భూనుత ! యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్. 3-5-113
(ఓ కౌశిక మహర్షీ ! నీవు నన్ను సర్వజ్ఞుడ వంటూ ప్రస్తుతించావు. ఈ రీతిగా, నాకు ఇంతటి విజ్ఞానం సంక్రమించడానికి మూల మైన ధర్మం ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేటట్లుగా ఎరిగించగలను.)
విశేషం :1.ధర్మం అనేది ఒక ఆశయం. విశ్వశ్రేయానికి ఆధారభూతమైన ఆదర్శం. –‘ధర్మము’ ఆ ధర్మం కంటికి కనిపించేది కాదు గదా! అయినను – ధర్మవ్యాధుడు తనకు ఆధారభూతమైన ఆ ధర్మాన్ని ప్రత్యక్షంగా కౌశికుడికి చూపించగలనని చెప్పుతున్నాడు ! జననీజనకులే తనకు ప్రత్యక్ష దైవాలు అనిన్నీ, మాతాపితల సేవ తన ఆదర్శం అనిన్నీ ధర్మవ్యాధుడు చెప్పి – కౌశికుడికి తన తల్లిదండ్రుల్ని చూపిచాడు.
11. ధర్మం అనిర్వచనీయం. సుప్రసిద్ధమైనది పెద్దల నిర్వచనం ఈ క్రింది శ్లోకంలో కానవచ్చును.
శ్లో!! ధృతి క్షమా దమో2స్తేయం ! శౌచ మింద్రియ నిగ్రహం !
ధీ ర్విద్యా సత్య మక్రోధో ! దశకం ధర్మలక్షణమ్.!!
వ. అభ్యంతర గృహంబునకు ర ‘మ్మని యతని దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాశీను లైన వారిం దన జననీ జనకుల నభిమతాహారపరితోషితులఁ బరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల నతనికి జూపి, తానును దత్పాదప్రమాణంబు సేసి, వారలఁ గుశలం బడిగిన, నయ్యిరువురుం బత్త్రున కి ట్లనిరి.3-5-114
(అంతట ధర్మవ్యాధుడు కౌశికమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి, తన ఇంటిలో ఉన్న ఒక గదిలోకి తీసుకొని వెళ్ళాడు: అది మిక్కిలి అందమైనది. ఆ అభ్యంతర గృహానికి నలువైపుల సావిడులు ఉన్నాయి. మంచి గాలి వెలుతురు అక్కడికి చేరుతున్నాయి. అది ఒక పెద్దమేడ. ఆ మేడపై పెక్కు పరిమళాలు గుబాళిస్తాయి. అందు, గొప్ప ఆసనాలమీద ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. కోరిన ఆహారాన్ని వారు గైకొని, సంతృప్తిగా సేదతీరుతున్నారు. వారిదేహాలపై క్రొంగొత్త పువ్వులు, ధగధగలాడే నగలు ఒప్పారుతున్నాయి. ధర్మవ్యాధుడు తన తలిదండ్రులను కౌశికుడికి పరిచయం చేసి, తాను వారలిరువురి పాదాలకు మ్రొక్కి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడి తలిదంఢ్రులు తమ తనయుడితో ఇట్లా పలికారు.)
‘ అన్న! కుమార ! నీయట్టి సత్పుత్త్రుండు ! గలుగ మా కేమిటఁ గడమ సెపుమ!
నీ చేయు ధర్మంబ నీకుఁ దోడయ్యెడుఁ ! బరమాయు రర్థసంపదలుఁ గనుము;
నీ చరిత్రంబున నిఖిలవంశముఁ బవి ! త్రిత మయ్యె మానుషదేహ మేల
ధరియించితో కాని తత్త్వమారయఁ బర ! దేవత వీవు; సందియము వలదు;

వాఙ్మనఃకర్మములఁ బితృవత్సలత్వ ! మొక్కరూపుగఁ జలుపుచు నున్నయట్టి
సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్న్యు ! నొకని నెన్నంగఁ దగుఁ గాక యొరులు గలరె!’ 3-5-115
(‘ప్రియమైన కుమారా! ధర్మవ్యాధా! నీ వంటి మంచికొడుకు మాకు ఉండగా, ఇక మాకేమి లోటు? నీవు ధర్మమూర్తివి. నీవు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షించగలదు. నీవు చిరకాలం జీవించి ధనధాన్యసంపదలతో తులతూగుదువుగాక. నీ ప్రవర్తన వలన మన వంశం పావనమైనది. నీవు కారణజన్ముడవు. నీవు దేవతలలో దేవతవు గాని మనుష్యమాత్రుడవు గావు. అసలు ఈ భూలోకంలో నీవు ఎందుకు ఈ మానవదేహాన్ని ధరించి అవతరించావో మాకు తెలియదు. నీవు త్రికరణశుద్ధితో తలిదండ్రులను ఆరాధిస్తున్నావు. ఇందుకు ఎంతమాత్రం సందియము లేదు. నీ దీక్ష నిరుపమానం. తలిదండ్రులను ఆరాధించటంలో నిన్ను ముందు చెప్పి, తదుపరి పరశురాముడిని చెప్పాలి. మరి యెవ్వరును నీకు సాటి రారు.’)
వ. అని పలికి ; రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం కౌశికుం జూపి ‘యిమ్మహాత్ముండు మనలఁ జూచువేడ్క నిట వచ్చె’ నని చెప్పిన నావృద్ధు లతనికి నర్హసత్కారంబులు గావించినం, గైకొని, యతండు వారలఁ గుశలం బడిగె; నంత నవవ్విప్రునకు లుబ్ధకుం డి ట్లనియె. 3-5-116
(అని చెప్పిన పిమ్మట ధర్మవ్యాధుడు తన తలిదండ్రులకు కౌశికుడిని చూపించి, ‘ఈ మహానుభావుడు మనలను చూడవలె నని పూనికతో ఇక్కడికి వచ్చాడు’అని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగతమర్యాదలు చేసారు. కౌశికుడు వారి యోగక్షేమాలనుగూర్చి ప్రశ్నించాడు. అంతట ధర్మవ్యాధుడు కౌశికుడికి ఇట్లా చెప్పాడు.)
‘ జననుత ! వీరు నా జననియు జనకుండుఁ ! జూవె ! వీరలకు శుశ్రూష సేసి,
యిట్టి పరిజ్ఞాన మేనుఁ బ్రాపించితి ! నమరులఁ బూజింతు రర్థి నెల్ల
వారును ; నొండు దైవంబుల నెఱుఁగ; నీ ! వృద్ధుల నాపాలి వేల్పు లనఘ!
కమనీయ ఫలపుష్పగంధభూషణవస్త్ర ! ములు మనోహరభక్ష్యభోజ్యములును

వీరి కెపుడు నివేదింతు, వేడ్కఁ బుత్త్ర ! దారసహితుండ నై నియతముగ సేవ
యాచరింతును; వేదముల్ యజ్ఞములు వ్ర ! తంబులును వీర నా కను తలఁపు దృఢము. 3-5-117
(‘ప్రజలచేత కీర్తించబడినవాడా ! నా తలిదండ్రులు వీరే. వీరికి పరిచర్య చేయటంచేతనే నాకు ఈ పరిజ్ఞానం లభించింది. అందరూ వేడుకతో తమకోరికలు ఈడేరటానికై దేవతలను పూజిస్తారు. నాకు నా తలిదండ్రులే ప్రత్యక్ష దేవతలు. వేరే దేవతలను నేను ఎఱుగను. ఈ ముదుసలులే నాపాలిటి వేల్పులు. వీరలను, చందనచర్చతో, పండ్లతో, పూవులతో వారలకు కావలసిన తినుబండారాలతో అర్చిస్తాను. నాశ్రీమతితో నా బిడ్డలతో కలిసి వీరికి సేవ చేస్తాను. వారి సేవయే నేను చేసే యజ్ఞం. అదియే వేదాలు , నోములు – అనే భావమే నాలో లోతుగా నాటుకొని ఉన్నది.)
జనని జనకుఁడు సద్గురుఁ డనలుఁ డాత్ముఁ డనఁగ నియ్యేవురును నే గృహస్థుచేత
సుగతివాంఛఁ బ్రసాదితు లగుదు రట్టి వాఁడ సూవె ధర్మాత్ముండు వసుధమీఁద’. 3-5-118
( పుణ్యం కోరే గృహమేధి – తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే అయిదుగురిని అర్చించి సంతోషపరచాలి. భూమిపై అట్టి గృహస్థుడే ధర్మాత్ముడు.)
వ. అని చెప్పి యిట్లనియెఁ:’బతివ్రత పనుపునం జేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్నయెడకుం జనుదెంచిన నప్పతివ్రతవలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నెఱింగించితిఁ గాని, నీదెస నాదు చిత్తంబు ప్రియంపడియుండదు; నీ చేసిన యకార్యం బొక్కటి గల దది యెయ్యది యనిన; 3-5-119
(అని చెప్పి ధర్మవ్యాధుడు ఇట్లా పలికాడు: ‘ఆ పతివ్రత అనుగ్రహంతో నిన్ను పంపింది కాబట్టి, ఆమెపై నాకు గల గౌరవప్రపత్తి చేతను, నీవు జిజ్ఞాసువుగా నే నున్న చోటికే వచ్చి అడిగావు కాబట్టి నాకు తెలిసిన మేరకు అంతయు నీకు తెలియజెప్పాను. కాని, నీయందు నాకు ప్రీతి యేర్పడలేదు. దానికి ఒక మూలకారణం ఉన్నది. నీవు చేసినది ఒక చెడ్డపని ఉన్నది. ఆ చెడ్డపని యేది అని అడిగితే.)
ఎంతయు వృద్ధు లై తమకు నీ వొకరుండవ తెప్ప గాఁగ న
త్యంతముదంబునన్ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని
శ్చింతుఁడ వై సదాధ్యయనశీలత వారియనుజ్ఞ లేక యే
కాంతమ యెమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. 3-5-120
(నీ తలిదండ్రులు మిక్కిలి ముసలివారు. వారికి నీవు ఒకడవే ఆధారం. నీమీదనే తమ ప్రేముడిని అంతయు పెట్టుకొని బ్రదుకుతున్న నీతలిదండ్రులను వదలిపెట్టావు. వారిని వదలివచ్చేటప్పుడు నీవు వారి అనుమతిని తీసికొనలేదు. నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని ఆర్జించి, తరింప నెంచావు . కాని, నీ తలిదండ్రులగతి ఏమవుతుందో అని ఆలోచించలేదు. కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు.)
నీక వగచి వగచి నిర్భిన్నహృదయు లై ! విగతచక్షు లైరి వినవె? వార;
లరిగి యింక నైన నమ్ముదుసళ్ళ యు ! దగ్రశోకవహ్ని నార్పవయ్య! 3-5-121
(నీకోసమే మిక్కుటంగా గుండెలు పగిలేటట్లు నీ తలిదండ్రులు ఏడ్చి యేడ్చి గ్రుడ్డివారయ్యారు. ఆ సంగతి నీవు ఆలకించలేదా? ఇకమీదటనైనా, నీవు వారి దగ్గఱకు పోయి, ఆ ముదుసలుల శోకాగ్నిని ఆర్పవలెను సుమా!) (మనలో చాలామంది ఇటువంటి దోషాలను చేస్తున్నవారే కదా)
నీయధ్యనమ్మును సుకృ ! తాయాసము నిష్ఫలంబు లై చను గురుసే
వాయుక్తి లేక తక్కినఁ ! జేయుము నా పలుకు; మేలు సేకురు నీకున్’. 3-5-122
(నీ చదువుగాని, పుణ్యాన్ని ఆర్జించటానికై నీవు పడే శ్రమ గాని, తలిదండ్రులకు పరిచర్య చేయకపోతే వ్యర్థాలౌతాయి సుమా ! నేను చెప్పిన విధంగా నడుచుకొనుము.నీకు మేలు కలుగుతుంది’.)
విశేషం: గురు శబ్దానికి విశాలమైన అర్థం ఉంది. గురువులు =తలిదండ్రులు, మాతామహ పితామహులు, పినతండ్రి, అన్న, మేనమామ, ఉపాధ్యాయుడు, విద్య చెప్పినవాడు, మంత్రోపదేశం చేసినవాడు. గురుపరిచర్య – లేకుంటే జ్ఞానం కలుగదు అని సనాతన సంప్రదాయం.
వ. అనినఁ గౌశికుం డతని కి ట్లనియె. 3-5-123
‘ ఇది యట్టిద నీ చెప్పిన! సదమలహితవాక్యభంగి సకలము వింటివ్
వదలక యిమ్మెయిన చరిం ! చెద గురుజనములకుఁ బ్రీతిఁ జేసెద ననఘా!3-5-124
(అని చెప్పిన ధర్మవ్యాధుడితో కౌశికుడు ఇట్లా పలికాడు: ‘పుణ్యాత్ముడవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు చెప్పినమాటలు సరిఅయినవే. స్వచ్ఛమైనవే. నాకు మేలు చేకూర్చేవే. వాటిని సావధానంగా విన్నాను. నీవు చెప్పినవిధంగా నడుచుకొంటాను. నా తలిదండ్రులకు పరిచర్య చేసి నాజన్మ సార్థకం చేసికొంటాను.)
నాదైన భాగ్యవశమునఁ ! గాదే నీతోడి చెలిమి గలిగెం, బరమా
హ్లాదమనస్కుఁడ నైతి, శు ! భోదయముల కెల్ల నింక యుక్తుఁడ నైతిన్. 3-5-125
(నీతో స్నేహం కలగటం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. నాకు కలుగబోయే శుభాల కన్నిటికి ఇది సూచకం.)
పాపకృతం బగు దుర్గతి ! మోపుఁ గనకయుండ ననుఁ బ్రభోదాత్మక లీ
లాపరిణతుఁ గావించితి;! నాపాలిటి వేల్ప వీవ నరనుతచరితా !34-5-126
(జనులచేత పొగడబడే ప్రవర్తన కలవాడా, ఓ ధర్మవ్యాధా! పాపం చేయటంచేత దుర్గతి ప్రాప్తించి ఆ బరువు మోస్తూ బ్రదుకకుండ నీవు నన్ను ఉద్ధరించి, నాకు జ్ఞానం గలిగించి, గొప్పవాడినిగా నేను వికసించేటట్లు చేశావు. నీవే నాపాలిటి దేవుడవు.)
అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో;
విను, పదివేవురం దొకఁడు విశ్రుతధర్మపరాయణుండు గ
ల్గునొ కలుగండొ సందియము; గోరి సనాతనధర్మ మూఁది యె
వ్వనికిని నీకుఁ బోలె బుధవత్సల ! యిట్లు చరింపవచ్చునే. 3-5-127
(జ్ఞానులచేత ఆదరింపబడెడి ఓ ధర్మవ్యాధుడా! ధర్మమార్గం మిక్కిలి సూక్ష్మమైనది. సాటి లేనిది. ఎట్టివారలకును అది అందుబాటులో ఉండనట్టిది. ఈ భూప్రజలలో పదివేలమంది జనులలో ఒకడైనను అచ్చమైన ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు పేరుప్రతిష్ఠలు ఆర్జించినవాడు ఉన్నాడా? ఉన్నట్లు ఖండితంగా చెప్పలేం. సనాతన ధర్మాన్ని నీవలె గ్రహించిన అనుష్ఠానవేదాంతి మరియొకడు లేడు.)
నిను నొక శూద్రుగాఁ దలంపనేర గుణాకర; నీ చరిత్రముం
గన మది నద్భుతం బొలసెఁ; గావున నెయ్యది కారణంబుగా
నొనరఁగ నిట్టి జన్మమును నొందితి చెప్పుము; భూతభావివ
ర్తనములయందు నీకు విదితంబులు గానివి గల్గ వెమ్మెయిన్.’ 3-5-128
(మంచి గుణాలకు నెలవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు ఒక శూద్రుడవు మాత్రమే అని భావించలేను. నీ శీలాన్ని అనుశీలించగా నా మనస్సులో ఇది మిక్కిలి వింతగా ఉన్నది. నీవు ఏకారణం వలన శూద్రజన్మను పొందావో దయచేసి చెప్పుము. నీవు త్రికాలజ్ఞుడవు. నీకు తెలియని అంశాలు గతానికి సంబంధించినవిగాని భవిష్యత్తుకు సంబంధించినవిగాని లేవు’.)
వ. అనిన నతనికి ధర్మవ్యాధుం డిట్లనియె.3-5-129
( అని కౌశికుడు పల్కగా, ధర్మవ్యాధుడు అతడికి ఈ విధంగా బదులు పలికాడు.)
‘జననుత ! నీ వెయ్యది యడి! గినఁ దెలుపుట నా కవశ్యకృత్యము గాదే!
విను చెప్పెదఁ; బూర్వభవం ! బున నే నొక బ్రాహ్మణుండఁ బుణ్యచరితుఁడన్.3-5-130
(ప్రజలచేత కీర్తించబడిన ఓ కౌశికమునీ ! నీవు ఏ ప్రశ్నలు వేసినా వాటికి అన్నింటికి సమాధానాలు చెప్పటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గతజన్మలో నేను ఒక బ్రాహ్మణుడను. సుకృతాన్ని ఆర్జించే ప్రవర్తన కలవాడిని.)
వ. వేదవేదాంగపారంగతుండ నై యుండుదు; నాకుం బ్రియసఖుం డైన యొక్క రాజపుత్త్రుతోడి సంగతిం జేసి ధనుర్వేదంబును నభ్యసించితి; నొక్కనాఁ డమ్మహీపతి వేఁట వోయిన నేనును నతనితోడన చని వనంబునం బెక్కుమృగంబుల నేయుచుండ నం దొక్కబాణంబు దృణలతాంతిరితదేహుండైన మునివరు నొక్కరు దాఁకిన నతఁడు హా ! యనుచుం బడియె; నంత నేనును.3-5-131
(పూర్వజన్మలో నేను వేదాలను, వేదాంగాలను క్షుణ్ణంగా చదివిన వాడినే. కాని, నాకు ఒక రాకుమారుడితో స్నేహం ఏర్పడటంచేత విలువిద్యను నేర్చాను. ఒకానొకరోజున ఆ మహారాజుతో నేనుగూడ అడవికి వేటకు పోయి పెక్కుజంతువులను సంహరించాను. అంతలో నాబాణ మొకటి, గడ్డిచేతను, తీగెలచేతను కప్పబడిన ఒక మునివరుడి శరీరానికి తాకింది. వెంటనే అతడు హాహాకారం చేస్తూ బాధతో నేలపై ఒరిగిపోయాడు. అప్పుడు నేను.)
దాయఁబోయి తీవ్రసాయకవిద్ధుఁ డై ! పొరలుచున్న విప్రవరునిఁ జూచి
తలఁకి యనునయంపుఁ బలుకులు పలికినఁ, ! గినిసి యిట్టు లనియె మునివరుండు. 3-5-132
(అంతట నేను బ్రాహ్మణోత్తముడిని సమీపించాను. అతడు నాబాణంచేత ఛేదించబడిన శరీరం కలవాడై బాధచేత ఇటూఅటూ పొరలాడుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూచి చలించినవాడినై నేను ఓదార్పుమాటలను పలుకగా, ఆవిప్రుడు మిక్కిలి ఆగ్రహించి ఈ విధంగా అన్నాడు.)
‘బ్రాహ్మణుండవయ్యుఁ బాపప్రవృత్తివై ! శూద్రకర్మమునకుఁ జొచ్చి తీవు
గాన నిక్కువము మృగవ్యాధజన్ముండ ! వగుము మీఁద’ ననియెఁ ననిన నేను. 3-5-133
(‘నీవు పుట్టింది బ్రాహ్మణకులంలో. కాని, చెడ్డవైన హింసాకృత్యాలు చేయటానికి పూనుకొన్నావు. హింస శూద్రుల కనువైనది కాని బ్రాహ్మణులకు తగినపని కాదు. కావున, నీవు రాబోయే జన్మలో శూద్రుడువుగా జన్మించి మృగవ్యాధవృత్తితో బ్రతుకగలవు. ఇది తథ్యం.’ అని శపించాడు. అపుడు నేను ఆ బ్రాహ్మణోత్తముడితో ఈ విధంగా నివేదించుకొన్నాను.)
‘ఎఱుఁగక తప్పు సేసితి సహింపగదే ! కడుదుర్భవంబునం
బఱుపకుమయ్య’ నావుడుఁ గృపన్ మునినాథుఁడు ‘దప్ప దివ్విధం;
బెఱుకుకులంబునందు జనియించియు ధర్మువు లెల్ల నిమ్ముగా
నెఱిఁగెద, తల్లిదండ్రులకు నెంతయుఁ బ్రీతి యొనర్తు భక్తితోన్. 3-5-134
(‘అజ్ఞానంచేత ఇట్టి అపరాధం చేసాను. క్షమించ వేడికోలు. నన్ను చెడుజన్మం పొందేటట్లుగా చేయకుమా మహానుభావా!’ అని నేను ప్రార్థించాను. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు నాపై దయకలిగి ‘నా శాపానికి తిరుగు లేదు. నీవు ఎఱుకవై జన్మించినప్పటికిన్నీ, ధర్మాధర్మ పరిజ్ఞానం కలవాడవు కాగలవు. అంతేకాక, తల్లిదండ్రులకు భక్తితో శుశ్రూషచేసి తరించగలవు.)
వ . గురుశుశ్రూషం జేసి నీకుఁ బరమశోభనం బగు ; జాతిస్మరత్వంబునుం గలుగు; నపర జన్మంబునఁ బరమబ్రాహ్మణుండ వయ్యెద’ వని యనుగ్రహించిన, నవ్విప్రుని దేహంబునందు నాటిన బాణంబు మెత్తన పెఱికి, యతనిం దదీయాశ్రమంబునకుం జేర్చితి; నాచేసిన పుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు నొందం డయ్యె; నాకు నిట్టిజన్మంబు నొందవలసె‘ నని చెప్పినం గౌశికుం డిట్లనియె. 3-5-135
(‘పెద్దలకు (తలిదండ్రులకు) సేవ చేయటం వలన నీకు మిక్కుటమైన మేలు కలుగగలదు. అపుడు నీకు పూర్వజన్మపరిజ్ఞానంగూడ ఉంటుంది. తదుపరి జన్మలో మరల నీవు బ్రాహ్మణుడ వై పుట్టగలవు.’ అని అతడు దయతో పలికాడు. అంతట నేను ఆ బ్రాహ్మణోత్తముడి శరీరంలో గ్రుచ్చుకొనిన బాణాన్ని మృదువుగా పెరికి, బయటకు తీశాను. పిమ్మట అతడిని ఆతడి ఆశ్రమానికి చేర్చాను. నా పుణ్యం వలన అతడికి మృత్యుప్రమాదం తప్పింది. కాని, నాకు ఈ శూద్రజన్మ తారసిల్లింది.’ అని చెప్పిన ధర్మవ్యాధుడితో కౌశికుడు ఈ విధంగా అన్నాడు.)
‘జన్మ మిట్టిది, చరితంబు చంద మిట్టి ! దెన్నఁడును నిట్టిచోద్య మే నెందుఁ జూడ;
నింక జన్మాంతరముదాఁక నేల ? యిపుడ ! పుణ్యచరిత మై నీవు విప్రుఁడవ కావె! 3-5-136
(‘ప్రస్తుతం నీజన్మ చూస్తే శూద్రజన్మం. కానీ, ప్రవర్తన తీరు అనుశీలిస్తే ఇది ఒక వింత. ఇట్టి వింత ఇంతవరకు నేను ఎన్నడూ చూచి ఉండలేదు. నీవు మరుజన్మ వరకు ఆగవలెనా? ఈ జన్మంలోనే పుణ్యచరిత్రుడవయిన నీవు నిజంగా బ్రాహ్మణుడవే సుమా!)
పాపవర్తనుండు బ్రాహ్మణుం డయ్యును నిజము శూద్రుకంటె నీచతముడు
సత్యశౌచధర్మశాలి శూద్రుం డయ్యు నతఁడు సద్ద్విజుండ యనిరి మునులు.3-5-137
(చెడుప్రవర్తన కలవాడు బ్రాహ్మణకులంలో పుట్టినప్పటికినీ శూద్రునకంటే అధముడే. ఇది నిజం. పరిశుభ్రత పాటించి సత్యాన్నే పలికే ధర్మాత్ముడు శూద్రకులంలో జన్మించినప్పటికిన్నీ అతడు సద్బ్రాహ్మణుడే అని మునులు తీర్పుచెప్పారు.)
విశేషం: మహాభారతం నిష్కర్షగా ఎవడును జన్మచేత బ్రాహ్మణుడు కాజాల డనిన్నీ, ‘సత్యశౌచధర్మశాలి’ మాత్రమే నిజమైన బ్రాహ్మణుడనిన్నీ నిర్ణయించింది. అందుచేత ఈ పద్యం మిక్కిలి విలువైనది. అంతేకాక, ఒకవేళ ‘సత్యశౌచధర్మశాలి’ శూద్రకులంలో జన్మించినప్పటికిన్నీ, అతడు నిజంగా బ్రాహ్మణుడే అని నొక్కి వక్కాణించింది. ఇచ్చట ‘అనిరి మునులు’ అనే ప్రయోగం అనుశీలించదగింది. లోకవ్యవహారంలో జన్మ ‘కులమును’ నిర్ణయించవచ్చును గాని ఆర్షదృష్టిలో లేదు. మునుల దృష్టిలో ‘సత్యశౌచధర్మశాలి’ శూద్రకులంలో పుట్టినప్పటికీ బ్రాహ్మణుడే. కౌశికుడి దృష్టిలో ఈజన్మంలోనే శూద్రకులంలో పుట్టిన ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడే.
అనయంబు నాత్మకర్మం ! బున నతినీచ మగు భవముఁ బొందవలసెనే
యని నీవు నిరంతరమును ! మనమున దుఃఖింపవలదు మహితచరిత్రా ! 3-5-138
( గొప్పదైన నడవడిగల ఓ మహానుభావా! ధర్మవ్యాధుడా! పూర్వజన్మలో చేసిన కర్మయొక్క విపరిపాకంవలన ఈజన్మలో నీచ మైన జన్మం ఏర్పడింది కదా అని నీవు మనస్సులో సదా విచారించ వలదు.)
నిజగుణదోషకర్మముల నెట్టన మేలును గీడు వచ్చుఁ ద
త్ప్రజనితసౌఖ్యదుఃఖములఁ బ్రాజ్ఞులు దుల్యమనస్కు లై మనో
రుజలును దేహజంబు లగు రోగములున్ హితధర్మకర్మభే
షజములఁ జేసి పాపుదురు సర్వము సాత్త్వికదృష్టిఁ జూచుచున్.3-5-139
(తాము లోగడ మంచిపనులను చేస్తే తదుపరి మేలు కలుగుతుంది. అట్లే చెడుపనులను చేసిఉంటే కీడు కలుగుతుంది. ఆ విధంగా ఏర్పడే సుఖదుఃఖాలను పండితులు సమబుద్ధితో అనుభవిస్తారు. అట్టిసాధుజనులు అన్నిటిని సాత్త్వికదృష్టితోనే చూస్తూ తమకు ఏర్పడే మానసికవ్యాధులను, శారీరకవ్యాధులను అను వైన ధర్మకర్మలు చేయటం ద్వారా పాపుకొంటారు.)
ప్రియములు వాయుటయును న ! ప్రియములు వెసఁ బొందుటయును బెల్లుగ నగుఁ ద
త్క్రియలందు మూఢమతికి హృ ! దయతాపము పాయ దెపుడు దరికొనుచుండున్.3-5-140
(శుభాలు దూరంకావటం, అశుభాలు దాపురించటం ఎక్కువగా ఏర్పడేటప్పుడు మూఢుడు మిక్కుటమైన హృదయపరితాపానికి లోనౌతూ ఉంటాడు. అందుమూలాన ఆ తాపం తగ్గదు సరిగదా, సదా మండుతూ ఉంటుంది.)
వగతుమన్న నెవ్వారికి వగవఁ జనదు ! చిత్తమున నేమిటికి సంతసింపరాదు
కాన గతమునందును ననాగతమునందు ! వగవ రార్యులు సంతోషవంతు లగుచు. 3-5-141
(ఎంతటి కష్టాలు దాపురించినా దుఃఖించరాదు. అట్లే, ఎప్పుడును సంతోషించరాదు. ఆర్యులు జరిగిన కాలాన్ని గూర్చి గాని భవిష్యత్ కాలాన్నిగూర్చిగాని శోకించక – సదా సంతృప్తులై ఉంటారు.)
వగపునఁ దేజోహీనుం ! డగు నాత్మహితక్రియలకు నక్షముఁ డగు న
వ్వగపు దొఱఁగి యుద్యోగము ! దగఁ జేయఁగఁ గలుగు నంచితము లగు శుభముల్. 3-5142
(దుఃఖం వలన కాంతి కోలుపోవటం సంభవిస్తుంది; దుఃఖంవలన, తనకు మేలు కలిగించేపనులు నిర్వహించే సామర్థ్యం కొరవడుతుంది. దుఃఖాన్ని వీడి, సరి అయిన ప్రయత్నాలను చేస్తే మంచిగా శుభాలు కలుగుతాయి.)
వ. కావున భూతంబుల సదసత్ప్రకారంబులు గనికొని ధీరుండ వై యుండు’ మనిన ధర్మవ్యాధుండు ‘మహాత్మా! నీ చెప్పినయంతవట్టు నిదర్శనంబులుగాఁ గొని యేను నిఃఖేదుండ నై యున్నవాఁడ; భవిష్యత్కాలసద్భావంబునందు సమాహితుండ నై యుండువాడ’ ననియె; నంత నా భూదేవుండు. 3-5-143
(కాబట్టి సర్వపదార్థాల ఆంతర్యంలోని సత్యాసత్యసమీక్ష చేసి స్థైర్యంతో బ్రదుకుము అని కౌశికముని చెప్పాడు. అంతట ధర్మవ్యాధుడు ‘మహానుభావా ! నీవు చెప్పిన ఆదర్శాలకు ఉదాహరణప్రాయంగానే నేను నా బ్రతుకును తీర్చిదిద్దుకొంటున్నాను. నేను నిత్యసంతృప్తుడను. భవిష్యత్కాలంలో నాకు శుభం చేకూరగలదని నా నమ్మకం’ అని అన్నాడు. అంతట కౌశికముని ఈ విధంగా బదులుపలికాడు.)
‘అతులిత పుణ్యమూర్తివి, కృతాత్ముఁడ వెందును నీవు ధర్మ మూ
ర్జితముగ నెప్పు డేమఱక చేయుచు నుండుము, నిత్యశోభన
స్థితి వెలుగొందు ; మేను భవదీయసమాగతిఁ జేసి ధర్మ సు
స్థితమతి నైతి న న్ననుమతింపు గుణాకర! పోయి వచ్చెదన్’. 3-5-144
(‘మంచిగుణాలకు నెలవైన ఓ ధర్మవ్యాధుడా! నీవు పున్నెముల ప్రోవవు. నీ జీవితం ధన్యమైనది. సదా ధర్మాన్నే ఆచరించేవాడవై నీ బ్రతుకును తీర్చిదిద్దుకొనుము. నీ చరిత్రవలన ధర్మం విస్తరించి వెలుగొంద గలదు. నీకు ఎల్లప్పుడు మేలు కలుగుగాక. నిన్ను కలిసికొనటంచేత నా జన్మం ధన్యమైనదిగా భావిస్తున్నాను. నీవలన నేను ధర్మసూక్ష్మాలను తెలిసికొన గలిగాను. నీమూలాన నాకు జ్ఞానోదయ మైనది. ఇక దయచేసి నాకు సెలవును అనుగ్రహించుము. నిన్ను వీడ్కొని నేను పోయి వస్తాను’.)
వ. అని వానికిం బ్రదక్షిణంబు సేసి వీడ్కొని చని కౌశికుండు నిజ జననీజనకుల కతిభక్తి శుశ్రూష చేసి కృతార్థుండయ్యెం: బాండవోత్తమా! నీ యడిగిన తెఱంగునం బతివ్రతామహాత్మ్యంబును బితృశుశ్రూషావిశేషంబును హీనవర్ణుండైనవాఁడు ధర్మంబు సలుపు నుపాయంబును జెప్పితి’ ననిన విని ధర్మతనయుండు సంతసిల్లి మఱియు మార్కండేయు నిట్లని యడిగె.3-5-145
( అంతట కౌశికముని ధర్మవ్యాధుడికి ప్రదక్షిణనమస్కారం చేసి అతడి వీడ్కోలు గైకొని తన స్వస్థానానికి వెళ్ళాడు. అచట అతడు తన తలిదండ్రులకు సేవ చేసి తరించాడు. ఓ ధర్మరాజా ! ఇంతకుముందు నీ వడిగిన ప్రశ్నలు 1) భర్తకు శుశ్రూష చేసి ధన్యత్వం చెందిన పతివ్రతల మహిమ, 2) తలిదండ్రులకు పరిచర్య చేయటంలోని విశేషం 3) తక్కువకులంలో పుట్టినవాడు ధర్మాత్ముడై వెలుగొందే విధానం గూర్చి నీకు సోదాహరణంగా వివరించి ఉన్నాను’- అని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అన్నాడు. ధర్మరాజు మిక్కిలి సంతోషించి మఱియు ఇట్లా పలికాడు.)
ఇక్కడితో ధర్మవ్యాధోపాఖ్యానం ముగిసింది. ఈ ఉపాఖ్యానం అంటే నా కెందుకో చాలా ఇష్టం. కనుక పూర్తిగా ఏమీ వదలకుండా ఎక్కించటం జరిగింది. కొందరికి విసుగ్గా అనిపించవచ్చనే శంక కూడా ఓమూల ఉన్నది. భారతంలో ఇటువంటి అందమైన ఉపాఖ్యానా లెన్నెన్నో ఉన్నాయి. అందుకనే మనం భారతాన్ని తప్పక చదివి ఆనందించాలి. ఇదే నా కోరిక.About the Author(s)

మల్లిన నరసింహారావు

ప్రస్తుతం ఉద్యోగరీత్యా పెద్దాపురంలో నివాసం. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామం. వయస్సు 63 సంవత్సరాలు.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి – ఆరణ్యపర్వం-పంచమాశ్వాసము- నాల్గవభాగం(ఎఱ్ఱన కృతం)

(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అర...
by మల్లిన నరసింహారావు
0

 
 

శ్రీమదాంధ్రమహా భారతము – ఎందుకు చదవాలి ? ఆరణ్యపర్వము (పంచమాశ్వాసము- మూడవ భాగము- ఎఱ్ఱన కృతము)

*************** (ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసిం...
by మల్లిన నరసింహారావు
0

 
 

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వము-పంచమాశ్వాసము-ఎఱ్ఱాప్రెగ్గడ

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వ పంచమాశ్వాసము – ఎఱ్ఱాప్రెగ్గడ **************...
by మల్లిన నరసింహారావు
2

 

 

శ్రీమదాంధ్రమహాభారతం -ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వం- నాల్గవఆశ్వాసం- ఎఱ్ఱాప్రెగ్గడ

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వశేషము – ఎఱ్ఱాప్రెగ్గడ నాల్గవ ఆశ్వా...
by మల్లిన నరసింహారావు
1

 
 

శ్రీమదాంధ్రమహాభారతము ఎందుకు చదవాలి ? ఆరణ్యపర్వము – నన్నయ కృతము – తృతీయ చతుర్థాశ్వాసములు

(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అర...
by మల్లిన నరసింహారావు
2

 
 

శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి – 3.1 (ఆరణ్యపర్వం – రెండవ ఆశ్వాసం)

(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అర...
by మల్లిన నరసింహారావు
2