సిలకమ్మ కథలసంకలనం – డా. వాసా ప్రభావతి.

వ్యాసం పంపినవారు: నిడదవోలు మాలతి

silikamma

డా. వాసా ప్రభావతిగారు రాసిన 15 కథలలో పాత, కొత్త సంప్రదాయాల మేలుకలయిక గుబాళిస్తుంది. ఇందులో కొన్ని కథలు గతించిపోతున్న వ్యవస్థలగురించి చెప్తాయి. కొన్ని కథలు మధ్యతరగతి కుటుంబాల్లో ఎదురయే సాధకబాధకాలు చర్చిస్తాయి. కొన్నికథల్లో ఈనాటి ప్రగతిధోరణి చోటు చేసుకుంటుంది.

“గెద్ద” సోదెమనిషి. సోదె చెప్పడం ఒక వృత్తి మాత్రమే కాదు, కళ కూడా. అందులో ఒక విధమయిన సామాజికత కూడా వుంది. కలవారిఇళ్ల స్త్రీలకష్టసుఖాలు పంచుకోడం వుంది. సోదె చెప్పి పొట్టపోషించుకునే ఈస్త్రీలో మానవత్వం మనని ఆకట్టుకుంటుంది. సోదె విద్యపట్ల ఆమెకున్న ఆసక్తి, తన తదనంతరం దాన్ని ఎవరు నిలబెడతారన్న తపన, వారసత్వంగా కోడలికి ఒప్పజెప్పాలన్న ఆకాంక్ష – ఇవన్నీ సోదెమనిషిని స్వయంగా చూసినవారికి మాత్రమే అర్థమవుతుంది. ప్రభావతిగారికి అర్థమయింది అనిపిస్తుంది ఈకథ చదివితే. (దీనికి నా ఆంగ్లానువాదం తూలిక.నెట్‌లో చూడొచ్చు.)

అలాగే గతించిపోతున్న మరో వ్యవస్థ – వున్నచోట వుండకుండా, తిన్నచోట తినకుండా, గంపలెత్తుకుని ఊరూరా తిరిగే లంబాడీ తండాలు. “చుక్క” కధలో మారుతున్నకాలంలో మారిపోతున్న సాంప్రదాయాలతోపాటు, ఒక లంబాడీతల్లి ఆలోచనాధోరణిలో వచ్చిన మార్పు మన మనసుల్ని పట్టి కుదిపేసేలా ఆవిష్కరించడం జరిగింది. తల్లిప్రేమ ఎలాటి త్యాగానికి ఒడబడగలదో చిత్రించడంలో కృతకృత్యులయేరు రచయిత్రి.

“గోపన్న పెళ్లాం సానా సదువుకుందంట. ఆ డబ్బంతా ఆమే పోగుసేసిందంట” అంటూ ఊరివారిచేత మెప్పులు పొందిన సిలకమ్మ “నాలుగో కళాసు సదివిన” అని సంబరపడిపోతూ చెప్పుకోగల ఇల్లాలు. ఆచదువుతోనే ఆమె భర్తా, అత్తగారి జీవితాలలో తేగలిగిన మార్పు ఎవరిచేతనైనా శభాష్ అనిపిస్తుంది. కావలసింది డిగ్రీలు కాదు, తనజీవితాన్నీ, దానితో ముడివడిన భర్తా, అత్తా జీవితాలనీ చక్కదిద్దుకోడంలోనే కదా వుంది తెలివి.

ఈకథల్లో ప్రధానపాత్రలకి అచ్చమయిన తెలుగు పేర్లు మరింతగా ఆకట్టుకున్నాయి నన్ను!.

అయితే అన్నికథలూ ఒకే మూసలోంచి తీసినట్టు ఈ సాంప్రదాయాలపుట్ట కాదు. ఆత్రేయపురంపల్లె (గోదావరి జిల్లా)లో పుట్టి భాగ్యనగరం మెట్టిన రచయిత్రికి పల్లెలో వేడుకలు ఎంతో పట్నంలో సరదాలూ అంతే.

“మిసెస్. రామనాథం”, “కాలంవెంట మనిషి” లాటి కథల్లో నాగరికత తెస్తున్న మార్పులు ప్రధానాంశాలు. బారిష్టర్ పార్వతీశంలో వటీరావుతో మొదలయిందనుకుంటాను భార్యలు తమ పేర్లవెంట భర్తలపేర్లు తగిలించుకోడం. ఆరోజుల్లో అది నాగరీకం భావించారు. అయితే సూక్ష్మంగా ఆలోచిస్తే అవగతమయేది తన్మూలంగా భార్యల అస్తిత్వానికి కలిగే నష్టం. కథకురాలికి తనపేరు చెప్పుకుంటున్నప్పుడు మిసెస్ రామనాథం మొహం ఎందుకు కళ తప్పిందో, ఆమెకి తల్లిదండ్రులు మక్కువగా పెట్టుకున్న పేరేమిటో తెలియాలంటే ఈకథ చదివితీరాల్సిందే.

“సంధ్యలో విరిసిన చెంగల్వ” ప్రధానాంశం సామాన్యమే – రాత్రి భార్యని చావగొట్టి, తెల్లారినతరవాత తెలివొచ్చి క్షమాపణలు చెప్పుకునే భర్త – అయినా యజమానురాలు ఆ భార్యాభర్తల వ్యక్తిత్వాలలో అలౌకికమయిన జీవనమాధుర్యాన్ని చూడగలగడం విశేషం. అందుకే కథకి కవితాత్మకమయిన శీర్షిక ఇవ్వడం జరిగింది అనుకుంటాను.

“వాన కారు కోయిల” అంటే అర్థం ఈకథ చదివితే కానీ తెలీలేదు నాకు. నిజానికి ఇందుకే నేను ఈనాటి యువతరానికి పాతకథలు చదవండో అని చెప్తుంటాను. తెలుగుభాష గొప్పో, బీదో చెప్పను కానీ అందులో అందాలు తెలుసుకోవాలంటే, ముందుతరంవారు రాసిన కథలు ఒక్కటే మార్గం. కాలేజీలో చదివే తెలుగు పాఠాలకంటే, ఈకథలే ఎక్కువ చవులూరు నుడికారం అందించడానికి తగును. ప్రభావతిగారు సంస్కృతాంధ్రాలలో నిష్ణాతురాలు. ఆ పోడిమి ఈకథలోనూ, ఇలాటి మరిరెండు కథల్లోనూ చూడగలం.

“కాలంవెంట మనిషి” శీర్షికలో ఒక చమత్కారం వుంది. మనసంస్కృతిలో కాలానికి ఒక ప్రత్యేకమయిన సౌకర్యం వుంది. క్రియాహీనతకీ, క్రియాశీలతకీ కూడా వాడుకోగలం ఆపదాన్ని. “ఏంచేస్తాం, కాలం కలిసిరావడంలేదు” అంటూ తమ క్రియారాహిత్యాన్ని సమర్థించుకునేవారు కొందరయితే, “కాలం మన చేతుల్లోనే వుంది. మనమే దాన్ని నడిపించాలి” అంటూ ప్రగతిపథంవేపు సాగేవారు కొందరు. ఆవిధంగా ఈకథ ఆదర్శవంతమయిన కథ. కథానాయకి కుంతలకి వైధవ్యం ప్రాప్తించినపుడు జరిగే కర్మకాండ వివరించడం జరిగింది. ఈరోజుల్లో ఇంకా ఇవి పాటిస్తున్నారేమో నాకు తెలీదు కానీ ఆసంఘటనని ప్రతీత్మకంగా అర్థంచేసుకున్నాను నేను. అంటే ఆసమయంలో ఆ స్త్రీ అనుభవించిన దుర్భరవేదనా, సాటి ఆడవారు ఆమెని మాటలతో హింసకి గురిచేయడం తప్పక జరిగేవే ఎక్కడయినా.

తాను ఆశావాదినని చెప్పుకునే ప్రభావతిగారి ప్రగతిశీలత దాదాపు అన్ని కథల్లోనూ కనిపిస్తుంది.

వీటన్నిటిలోనూ ఇసుమంత వేరుగా వున్నకథ ఆవకాయ జాడీ. ఈకథలో రచయిత్రి హాస్యచతురత కూడా ద్యోతకమవుతుంది మనకి. అయ్యగారు స్నానం చేస్తుంటే, ఆయనగారి జానెడు పిలక తడిసిందో లేదో, మరో రెండు చెంబులు పొయ్యనా అంటున్న పనిపిల్ల మాటలు చదువుతుంటే, మనముంగిళ్లలో అరమరికలు లేని జీవితాలు మరోసారి గుర్తొచ్చింది నాకు.

పాటకజనం, మధ్యతరగతి తెలుగుజీవితాలను చక్కగా ఆవిష్కరించిన కథలసంకలనం ఇది.

పుస్తకం వివరాలు.
Silakamma (Vasa Prabhavathi)

J. Meenakshi

Vasa Nilayam,

Municipal Colony,

Malakpet

Hyderabad 500 036

(040) 24549178

Price: Rs. 75/-

పుస్తకం.నెట్ లో చూశాం వివరాలు అని కూడా చెప్పండి వారికి మరి.

You Might Also Like

3 Comments

  1. Sowmya

    నాకు అన్నింటికంటే ఆ చివరి వాక్యం నచ్చింది. అప్పుడైతే పుస్తకం కి పబ్లిసిటీ లభిస్తుంది కదా.. 😉
    Thanks Malathi garu.

  2. Vaidehi Sasidhar

    మాలతి గారూ,
    “సిలకమ్మ” కధాసంకలనంపై ఆసక్తి కలిగేట్లు పరిచయం చేసారు.బావుంది.ఇక చదవటమే మిగిలింది.

Leave a Reply