కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు

రాసిన వారు: మాలతి నిడదవోలు
*******************
నోరి నరసింహశాస్త్రిగారు (1900-1978) పిన్నవయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించి దాదాపు ఆరు దశాబ్దాలపాటు కవిత్వం, నాటకం, కథ, నవల, విమర్శవంటి ప్రధాన సాహిత్యప్రక్రియలలో ప్రతిభావంతమయిన రచనలు చేసి కవిసామ్రాట్ బిరుదునందుకున్నారు (1947). వివిధ సాహితీసంస్థల్లో ప్రముఖపాత్ర వహించి తెలుగుసాహిత్యంపట్ల తమకి గల అభిమానాన్నీ అభినివేశాన్నీ సగర్వంగా ప్రకటించుకున్నారు.

నరసింహశాస్త్రిగారు 1900లో జూన్ 2వ తేదీన హనుమచ్చాస్త్రి, మహలక్ష్మి దంపతులకు జన్మించారు. బి.ఎ. (1919) బి. యల్. (1925) పట్టభద్రులు. శ్రీ కల్యాణానంద భారతీస్వామివారివద్ద దీక్ష స్వీకరించారు.

నరసింహశాస్త్రిగారు బహుభాషాకోవిదులు. “సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు కన్నడభాషలలో అతివేలమయిన అభినివేశం సంపాదించుకున్న మనీషులు” అంటారు దేవులపల్లి రామానుజరావుగారు ఈవ్యాససంకలనానికి తొలిపలుకులో. “సాహిత్యోద్యమంలో అగ్రేసరులు. సాహిత్యంలో అన్నిరంగాల్లోనూ వారు చేసిన కృషి ప్రామాణికం” అంటారు నరసింహశాస్త్రిగారి కుమారులు హనుమచ్ఛాస్త్రిగారు తమ ముందుమాటలో.

శాస్త్రిగారి మొదటి పద్యసంపుటి ప్రచురణ అయేనాటికి వారికి 19 ఏళ్ళుట. ఆతరవాత ఆరు దశాబ్దాలలో ఆయన కవితలతోనే మొదలు పెట్టినా, వారికి ప్రజాబాహుళ్యంలో పేరు తెచ్చిపెట్టినవి చారిత్ర్యకనవలలు (నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి). తొలినవల వాఘీరా. శాస్త్రిగారి ఇతరరచనలు, దేవీభాగవతము (3 స్కంధాలు). నాటికలు, పద్యనాటికలు, విమర్శ వ్యాసాలు, సమీక్షలు, పీఠికలు వారి పాండిత్యప్రకర్షకి దీటురాళ్ళుగా నిలిచేయి. భావనాటికలు అన్న పదబంధం వారే సృష్టించి కఠినపదజాలంతో భావానికే ప్రాధాన్యతనిచ్చి నాటికాప్రక్రియకి మరొక గౌణ్యం తెచ్చిపెట్టేరుట. ఇంకా అనేక కవితలు, పద్య, గద్య రూపకములు, కర్పూరద్వీపయాత్ర (పిల్లలనవల), శబ్దవేధి రాశారు.

కవులజీవితములు ఆధారంగా రాసిన నవలలు సార్వభౌముడు, కవిద్వయము, ధూర్జటి. తదితర చారిత్రకనవలలలో కవులజీవితాలు చేర్చడంద్వారా నరసింహశాస్త్రిగారు కవులయందు తమకి గల ప్రత్యేకగౌరవం ప్రకటించుకున్నారు.

సూక్ష్మంగా ఇవీ మనకి కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారి సారస్వతవ్యాసాలు, ఐదవసంపుటానికి ముందుమాటద్వారా తెలిసే విశేషాలు. శాస్త్రిగారు రచించిన 70 వ్యాసాలు, కొన్ని ఇంతవరకూ అముద్రితాలు ఏర్చి కూర్చారుట ఈసంకలనంలో.

ప్రచురణకర్తలు ఈసంకలనం విషయసూచికలో ఈ వ్యాసాలని రెండు భాగాలుగానూ, ఉపభాగాలుగానూ విభజించారు మొదటిభాగంలో వ్యాసాలు – సాహితీ విమర్శ, గీర్వాణ సాహితి, కవిత్రయ సాహితి, ప్రబంధ సాహితి, నవ్య సాహితి, నాటక సాహితి, హాస్య సాహితి, (రెండు వ్యాసాలు), చరిత్ర, సంస్కృతి, సాహితీ మూర్తులు, పీఠికలూ-సమీక్షలూ, భక్తి సాహితి (ఒక వ్యాసం మాత్రమే)

రెండవభాగంలో – సాహిత్య విమర్శ, గీర్వాణ సాహితి, కవిత్రయ సాహితి, సాహిత్యోద్యమము, నవ్య సాహితి, నాటక సాహితి, కథా సాహితి, హాస్య సాహితి (ఒకటి), చరిత్ర సంస్కృతి, సాహితీ మూర్తులు, పీఠికలూ-సమీక్షలూ. మరో రెండు శీర్షికలకింద రెండే వ్యాసాలు, హిత సాహితి, భక్తి సాహితి ఉన్నాయి.

ఈవిభజనమీద నా అభిప్రాయం చివర్లో చెప్తాను.

ఈసంకలనం సాహిత్యవ్యాసాల సంకలనమే అయినా, శాస్త్రిగారు సాహిత్యపరంగానే చర్చించినా, వీటిలో సందర్భానుసారంగా మన దేశచరిత్ర, ఆంధ్రులచరిత్ర, శిల్పం, సంగీతంవంటి ఇతరవిషయాలు కూడా సూక్ష్మదృష్టితో వివరంగా చర్చించారు. ఉదాహరణకి, ఉత్తమ వాగ్గేయకారుడు సుబ్రహ్మణ్యకవి వ్యాసంలో (పు. 165-184) శార్ఙ్గదేవుడు ప్రతిపాదించిన ప్రమాణాలూ, ఉత్తమవాగ్గేయకారుని లక్షణాలు, క్షేత్రయ్య, బాలాంత్రపు రజనీకాంతరావు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి సంగీతవిమర్శకుల అభిప్రాయాలతో తమ అభిప్రాయాలు జోడించి వ్యాసాన్ని పటిష్ఠం చేశారు.

శిలాశిల్పకళ లో శిల్పం అంటే ఒక రాయిని చెక్కడం కాదు, ఆ శిలలో స్వయంభువై అంతర్గతంగా ఉన్న మూర్తిని దర్శించి, “పరస్థలాల”ను (ఆమూర్తిని ఆవరించుకుని, మరుగుపరుచుతున్న రాతిభాగాలను, తొలగించి మూర్తిని బహిర్గతం చేయడంట (పు. 191). ఇటువంటి ప్రతిభ ఒక్క శిలా శిల్పికి మాత్రమే ఉంటుంది కానీ ఇతర కళాకారులకి కాదు అని కూడా అంటారు శాస్త్రిగారు.

బాపిరాజుగారి హిమబిందు చర్చిస్తున్నప్పుడు, శిల్పం, సంగీతంలో బాపిరాజుగారికున్న విషయపరిజ్ఞానం చెప్తారు. ఆధునికకవిత్వంలో లయగురించి మాటాడుతూ సందర్భోచితంగా వీణ ధనమ్మగారు రాగప్రస్తారపద్ధతిలో ప్రవేశపెట్టిన నూతన రీతులు ఎత్తి చూపిస్తారు. దాదాపు ప్రతివ్యాసంలోనూ ఆ కవి, రచయిత, లేదా ఆ కాలంలోని ఒక ప్రత్యేకకోణాన్ని ఆవిష్కరించేరు.

శాస్త్రిగారు ఈవ్యాసాలలో చర్చించిన అంశాలు – విమర్శ, కవిత్వం, ఆధునిక కవిత్వరీతులు, పూర్వకవిత్వం, వివిధకాలాల్లో కవులు రచనల్లో ప్రత్యేకతలు, చరిత్రకీ చారిత్రక నవలకీ గల అవినాభావసంబంధం, ప్రబంధాలు, చరిత్రకీ కావ్యాలకీ గల అనుబందం – ఇలాటి సాహిత్యవిభాగాలే కాక, సాహిత్యానికి అనుబంధంగా విలసిల్లిన నాటకం, శిల్పం, సంగీతం, వంటి ఇతరకళలగురించి నరసింహశాస్త్రిగారు చర్చించిన తీరు అద్భుతం. ఈమద్య అద్భుతం అన్నమాట వాడడం మనకి పరిపాటి అయిపోయింది. కానీ నోరివారి రచనలవిషయంలో అది అక్షరసత్యం.

సాధారణంగా వ్యాసాలు అంటే పొడిపొడిగా ఓ రెండో మూడో మాటలు చెప్తే చాలు. ఓ చిన్న వ్యాసం అయిపోతుంది. (ఈ వ్యాసంలాగే అనుకోండి :)). ఈసంకలనంలో అలా తేలిపోయినవి రెండో మూడో వ్యాసాలున్నాయి.

ఆ రెండో, మూడో వదిలేస్తే, మిగతా వాటిలో నరసింహశాస్త్రిగారు ప్రతివిషయాన్నీ ఎంతో నిశితంగా పరిశీలించి, క్షుణ్ణంగా ఆలోచించి, కూలంకషంగా చర్చించడం కనిపిస్తుంది. మన దేశమన్నా, సంస్కృతి అన్నా శాస్త్రిగారికి గల ప్రేమాభిమానాలు అనుక్షణం పొడగడతాయి మనకి ఈ వ్యాసాలలో. ఆంగ్లేయులపాలన కారణంగా మనసాహిత్యంలో వచ్చిన మార్పులు ఆయన ఆనాడే గమనించి అక్షరగతం చేశారు. ఆంగ్లేయ చరిత్రకారులు వారికోణంలోనుండీ చేసిన యుగవిభజన, మన సంస్కృతిపట్ల వారు చూపిన అల్పదృష్టి మనం స్వీకరించడం మూలంగా మనచరిత్ర మనకే అర్థం కాకుండా పోయింది. అలా ఇంగ్లీషువాళ్ళు రాసిన భారతదేశ చరిత్రకాక మన పురాణాలూ, వేదాలూ చదివి, మనచరిత్ర మనం సరిగ్గా తిరగరాసుకోవాలి. మన భారతం, రామాయణం చారిత్రకదృష్టితో చదవాలి అన్నది శాస్త్రిగారి అభిమతం.

మనదేశ చరిత్రలో వేదకాలంనుండీ, బౌద్ధులూ, జైనులూ, తురుష్కులూ, హూణులూ ఆంగ్లేయులూ – ఇలా వచ్చినవారిమూలంగా ఎటువంటి మార్పులకి లోనయిందో ఎత్తి చూపేరు. ఆంగ్లేయులు రాసిన చరిత్ర వదిలి, మనచరిత్రని ఎలా చదువుకోవాలో కూడా విశదం చేశారు.

ఆంధ్రదేశ చరిత్రలో తెలుగువాళ్ళు తెలుగుని నిర్లక్ష్యం చేసి ఆంగ్లాన్ని ఆదర్శంగా గ్రహించడంమూలంగా మన చరిత్ర ఎలా వక్రీకృతం అయిందో చూపేరు.

తరవాత చారిత్రకనవల వ్యాసంలో చరిత్ర నేపథ్యంలో సాహిత్యం ఎలా విస్తరిల్లిందో వివరించేరు. దేశంలో ధర్మం క్షీణదశకి దిగజారిపోయినప్పుడు, ప్రజలని ధార్మికదృష్టివేపు మళ్ళించి, వారిని ఉత్తేజపరచడానికీ, తిరిగి ధర్మం నెలకొల్పడానికీ భారతం, రామాయణంవంటి కావ్యరచన జరిగిందంటూ, చరిత్రకీ చారిత్రకనవలలకీ గల అవినాభావ సంబందం వివరించడమే కాక, కావ్యరచనకోసం కవులు చేసే కల్పనలు కూడా విశదం చేసేరు. రచయిత చారిత్రకసత్యాలను గ్రహించవచ్చు కానీ వాటినన్నిటినీ యథాతథంగా నవలలోనో ప్రబంధంలోనో పొందుపరచవలసిన అవుసరంలేదని శాస్త్రిగారివాదన. కవికి తనకావ్యానికి అవుసరమయిన మార్పులూ చేర్పులూ చేసుకోడానికి అధికారం ఉంటుంది. తన రుద్రమదేవి, చారిత్రక నవలలో ఆ మహారాజ్ఞి పాలనలో ఆరు సంవత్సరాలకాలాన్ని ఆరునెలలకి కుదించడం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే, చారిత్రకనవలా రచయిత చరిత్రని క్షణ్ణంగా పరిశీలించి, అర్థం చేసుకుని రాయాలి. అది కూడా అవుసరమే. అందుకే శాస్త్రిగారు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసినా, తమనవలలకి చారిత్రక ఆధారాలను చాలా నిశితంగా పరిశోధించి, తెలుసుకున్న తరవాతే నవలారచనకి పూనుకున్నారు.

ఇదేవిషయాన్ని మరింత విస్తృతంగా ఆంధ్రభాషలో చారిత్రకనవల (759) అన్న మరొక వ్యాసంలో చర్చించేరు. ఇది వెనకటి వ్యాసానికి పొడిగింపులా కనిపిస్తుంది.

స్వతంత్రభారతములో చరిత్ర రచన
(721) – శాస్త్రిగారి చారిత్రకనవలలు అర్థం చేసుకోడానికి, ఈ వ్యాసాలు మంచి నేపథ్యాన్ని అందిస్తాయి. చారిత్రకనవలలు రాయదల్చుకున్నవారికి కూడా ఉపయోగపడతాయి.

శాస్త్రిగారి హాస్యరచనలు – పరీక్ష తప్పడం, షష్ఠిపూర్తి ఉత్సవములు. పరీక్ష తప్పడంలో హాస్యచతురత మనని అట్టే ఆకట్టుకోదు. మనం ఇలాటివిషయంమీద ఇప్పటికి చాలా చదివి ఉండడంచేత. రెండోవ్యాసం షష్ఠిపూర్తి ఉత్సవం అన్నది నిజానికి బంధుమిత్రులతో కలిసి జరుపుకునే ఉత్సవం కాదనీ, అరవైలు నిండిన పెద్దమనిషి మృత్యురూపంలో వచ్చే ఉగ్రరథుడిబారినిండి తప్పించుకోడానికి ఆచరంచే శాంతి కర్మ అనీ అంటున్నారు శాస్త్రిగారు. అంచేత కూడా ఇందులో హాస్యం కంటే టీకాతాత్పర్యాలకే ఎక్కువ ప్రాధాన్యం.

మూడో హాస్య రచన ముష్టి కవిత్వము. ఈవ్యాసంలో శాస్త్రిగారు వ్యంగ్యంగా ఈనాటి కవులు రాజకీయాలలో పడి, పేరుకోసం, డబ్బుకోసం నానా రకాలా రాస్తున్న కవితలని తీవ్రంగా ఖండించడం కనిపిస్తుంది.

నానృషిః కురుతే కావ్యమ్. కవులు బృహద్గ్రంథాలు రాసినా, చిన్న పుస్తకం రాసినా ఋషులకి సహజమైన ధార్మికదృష్టీ, సత్యశోధనాదృష్టి, నిష్ఠ, ఆత్మసంయమనం వంటి గుణాలు కలిగి ఉండాలి. క్రోధాన్నీ, కామాన్నీ, ద్వేషాన్నీ వస్తువుగా గ్రహించినప్పుడు కూడా ఋషులవలె సంయమనంతో చేస్తారు సత్కవులు. పూర్వం కవులు శరీరాలని పోషించుకోడానికి ప్రభువులమీద ఆధారపడినప్పుడు కూడా వారు తమ హృదయాలను స్వతంత్రంగానే ఉంచుకుని క్రూరప్రభువులను కూడా మానవులగా మార్చగలిగేరు. అందుకు భిన్నంగా ఈరోజుల్లో కవులు, కొంతమంది కవులు కానీవారు కూడా, తమ హృదయాలని రాజకీయనాయకులకీ బానిసల్ని చేసుకుని, మహా కవులుగా చెలామణీ అవుతున్నారు అంటారు నోరివారు. (పు. 38). రచయితలు అలా రాజకీయాల, “ఇజముల” పెద్ద పాములనోళ్ళ పడకుండా హెచ్చరించవలసిన బాధ్యత విమర్శకులది అని కూడా అంటారు. ఇది 1968లో 4వ ఆలిండియా తెలుగు రచయితలసదస్సులో సమర్పించిన ఉపన్యాసం. గత 40ఏళ్ళలో పరిస్థితి ఏమైనా మారిందా? మనం మరోసారి తిరిగి చూసుకోవాలి!

విమర్శప్రమాణాల గురించిన చర్చలో ఒకొక అంశం తీసుకుని ఎత్తిచూపిన కోణాలు మనం ఆలోచించుకోడానికి చాలా ఉపయోగకరం. మనని చాలా ఆలోచింపచేస్తాయి ఇవి.

నన్నయ మొదలుకొని కవులూ, రచయితలూ ఏదో ఒకరకం నవ్యత “పాషను”పేరున ప్రవేశపెడుతూనే ఉన్నారు. నన్నయ అనువాదం ఫాషను చేశాడు. కృష్ణశాస్త్రి ఏడుపు ఫాషను చేశాడు అంటూ చిన్న చమత్కారంతో వివిధకాలాలలో కవులు ప్రవేశపెట్టిన నూతనరీతులు చక్కగా వివరించడం నాకు నచ్చింది. అసలు ఆధునికత అంటే ఏమిటి? ఎప్పుడు ఏది ఆధునికరచన అనిపించుకుంటుంది? ఇలాటి ప్రశ్నలతో నోరివారు మనదృష్టిని ఆకట్టుకుంటారు. ఈనాటి రచయితలగురించి వారి వ్యాఖ్య చూడండి. పాశ్చాత్యులు అమ్మకాలకోసం నవ్యత ఏదో ఒకటి పెడతారనీ, మన “నవనాగరీకులు పాదాలతో నడవడం చాలించి పాదరక్షలతో నడుస్తూ ఉంటే, అతి నవ నాగరీకులు కాళ్ళు పైనా తల కిందా పెట్టి శీర్షాసనంతో నడవవలసి వస్తున్నది” (పు. 75.0).

నన్నయ తెలుగులో భారతం రాయడానికి ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులు కారణమంటూ, నన్నయ భారతాన్ని చారిత్రకదృష్టితో వ్రాశాడని దృష్టాంతాలతో నిరూపించారు. నాకు చాలా నచ్చిన వ్యాసాల్లో ఇదొకటి. ఈవ్యాసంలో గల ధర్మసూక్ష్మాలూ, కావ్యధర్మాలూ సాహిత్యాభిమానులకి చాలా పనికొస్తాయి. అలాగే నాటకాలగురించిన వ్యాసాలలో, వివిధములైన దృశ్యనాటకాలకీ, శ్రవ్యనాటకాలకీ గల ప్రత్యేకలక్షణాలూ, వాటికీ, సంస్కృతనాటకాలకీ, పాశ్చాత్యనాటకాలకీ గల వ్యత్యాసాలు చక్కగా వివరించారు.

సత్కీరుని కథ ఔచిత్యము (పు. 504) ఇది ధూర్జటి కృతం శ్రీ కాళహస్తీశ్వర శతకం లో ఐదవ ఆస్వాశంలో 92 పద్యాలలో చెప్పిన కథట. వీరి మరొక వ్యాసం ధూర్జటిలో ఈ సత్కీరునికథకీ ధూర్జటి జీవితానికీ సామ్యాలు ఎత్తి చూపేరు.

సాహితీ సమితి కవులు (పు. 595), సాహితీసమితి సాహిత్య కృషి (పు. 713), నవ్యసాహిత్య పరిషత్తు (పు. 748) – ఈమూడు వ్యాసాల్లో మనకి పరిచితమయిన చాలామంది పేర్లు – తల్లావఝ్ఝల శివశంకరస్వామి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రివంటివారితో పాటు, ఈనాడు అట్టేమందికి తెలీని పేర్లు కూడా చాలా కనిపించి, అబ్భ మనకి ఇంతమంది గొప్ప రచయితలున్నారా అనిపిస్తుంది. ఇంకా ఇతరవ్యాసాల్లో, ఎఱ్ఱయ, తిక్కన, వంటి ప్రాచీనకవులమీదా, వేలూరి శివరామశాస్త్రిగారు, తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ, గిడుగు రామ్మూర్తివంటి ఆధునిక కవులమీదా కూడా విశేషరచనలున్నాయి.

కొన్ని వ్యాసాలు విడిగా ఒక చిన్నపుస్తకంగా ప్రచురించడానికి తగినంత సమాచారం కలిగి ఉన్నాయి. ఉదాహరణకి ఈ వ్యాసాలు చూడండి – నాగేశ్వరరావు పంతులుగారు తత్త్వవేత్త, గ్రంథకర్త (237), పూర్ణపురుషుడు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు (253), స్వర్గీయ శ్రీ శివలెంక శంభుప్రసాద్ సాహిత్యవికాసానికి చేసిన సేవ (349), ఇవి ఈ సంకలనంలో ఒకేచోట వరసగా పెట్టి ఉంటే సౌలభ్యంగా ఉండేది పాఠకులకి.

కొన్ని వ్యాసాలు నాకు కొరుకుడు పడలేదు. ముఖ్యంగా సంస్కృతకవులు, ప్రబంధాలగురించి రాసిన వ్యాసాలలాటివి. నాకు కవిత్వరీతులలో పరిచయం లేకపోవడంచేత. కనీసం ఈవ్యాసాలలో ఉదహరించిన పద్యాలకీ, శ్లోకాలకీ సూచనప్రాయంగానైనా అర్థాలు ఇచ్చిఉంటే కొంత సౌలభ్యం ఉండేది.

ఈ గ్రంథంలో వ్యాసాల వరుసక్రమంగురించి ఒక మాట చెప్పక తప్పదు. ఈ సంకనలంలో తొలి వ్యాసం ఆంధ్రకవిత్వమూ- శ్రేయస్సూ అన్నది సాహితీ సమితి రజితోత్సవసమావేశంలో చదివిన నివేదిక. కవిత్వధోరణుల్లో శ్రేయస్సు కలిగించేది, ప్రేయస్సు కలిగించేది అంటూ రెండుగా విభజించి విస్తృతంగా తెలుగుకవిత్వాన్ని చర్చించారు. తరవాతి వ్యాసం ఆంధ్రసంస్కృతి, ఆంధ్రులచరిత్ర. మూడో వ్యాసం. నేటి సాహిత్య విమర్శ నాలుగోవ్యాసం… ఇలా సాగిపోతాయి మనం వరసగా చదువుకుంటూ పోతే. అంటే కదాచితుగా ముందువ్యాసానికీ, తరవాతి వ్యాసానికీ అనుబంధం కనిపించినా, మొత్తంమీద విషయపరంగా చెల్లాచెదురుగానే ఉంటాయి. నిషయసూచికలో ఇచ్చిన వరుసక్రమంలో కూడా లేవు. అక్కడ ఇచ్చిన పుటల సంఖ్యలు మూలంలో పుటలకి సంబంధించినవేమో కానీ ఈ పిడియఫ్ ప్రతికి అనుగుణంగా మాత్రం లేవు. ప్రచురించిన కాలాన్ని అనుసరించి కానీ చర్చించినవిషయాలని బట్టి కానీ చేసినట్టు కూడా కనిపించదు ఈ వరుసక్రమం. పైగా కొన్ని పేజీలు పునశ్చరణ అయేయి. నేను ఈవ్యాసంలో ఇచ్చిన పుటలసంఖ్యలు పిడియఫ్‌లో సంఖ్యలు.

నోరివారి సాహిత్యవ్యాసంగం, ఐదవసంపుటం అంటే వారి మొత్తం సాహిత్యంలో ఇది వ్యాసాలసంకలనం. పిడియఫ్‌లో 946 పేజీలున్న ఈగ్రంథంలో నరసింహశాస్త్రిగారు పొందుపరచిన వస్తుబాహుళ్యం అమేయం. నిజానికి ఇది చిన్నసైజు తెలుగు సాహిత్య విజ్ఞానసర్వస్వం అనుకోవచ్చు. ఇందులో శాస్త్రిగారు వివరించిన ప్రత్యేకమైన సాహిత్య పదజాలం కూడా నాకు కొత్తపాఠంలా అనిపించింది. ఉదాహరణకి, సాహిత్యపరంగా శ్రేయస్సు, ప్రేయస్సు, సంగీతంలో ధాతువు, మాతువు, శిల్పంలో పరస్థలాలు వంటి పదాలు ఈ పుస్తకంద్వారానే తెలుసుకున్నాను. నేను దీన్ని రిఫెరెన్స్ వాల్యూమ్‌గా వాడుకుంటాననడంలో సందేహం లేదు.

ఈసంకలనం అంతర్జాలంలో, తెలుగుపరిశోధన సైటులో పిడియఫ్ ఫార్మాటులో ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చి. లింకు ఇక్కడ.

నోరి నరసింహశాస్త్రిగారి ఇతర సాహిత్యసంపద, నవలలూ, సమీక్షలూ, మొదలైనవి avkf.org లో దొరుకుతాయి.

You Might Also Like

4 Comments

  1. bhaskar kondreddy

    మంచి పరిచయం ,, బాగుందండి,.

  2. మాలతి

    నోరి నరసింహశాస్త్రిగారు శబ్దవేధి అన్న పుస్తకం రాసేరని ఈ పుస్తకంలో ఉంది కానీ మరే వివరాలూ లేవు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు. ముఖ్యంగా నాకు కావలిసింది- అది కేవలం ధనుర్విద్యకి సంబంధించిన విషయచర్చా, కావ్యమా, నవలా అన్నది. ధన్యవాదాలు. – మాలతి

  3. mallina narasimharao

    ఈ పుస్తకాన్ని చదవటానికి ప్రారంభించాను. 30 పేజీలు పూర్తయింది. వీలు చూసుకుని పూర్తి చేయాలి. ఎన్నో మంచి మంచి విషయాలు తెలిసే అవకాశం. వదలుకోకూడదు.

  4. mallina narasimharao

    వాఘిరాను చిన్నప్పుడు పాఠశాలలో నాన్ డిటెయిల్ పుస్తకంగా మేము చదువుకున్న గుర్తు. మంచి పుస్తకం.

Leave a Reply