వేలవేల భావాలతో “వెయ్యినూట పదహార్లు”

రాసిన వారు: శైలజామిత్ర
(వ్యాసం యూనీకోడీకరించడంలో సహాయం చేసిన శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు -పుస్తకం.నెట్)
**************
అల చిన్నదే..తీరం చూస్తే చాలు అల్లరి చేస్తుంది..అలాగే అక్షరం చిన్నదే కానీ భావంతో కలిస్తే అలజడి సృష్టిస్తుంది..ఎంతో పుణ్యం చేసుకుంటేనే సిరి వరిస్తుందంట.కానీ నేనంటాను అంతకంటే పుణ్యం చేసుకుంటేనే సిరా మనల్ని వరిస్తుందని..ఎందరో కవుల సమ్మేళనం,ఎన్నెన్నో భావాల అంతరంగం కలిపి చిలికితే ఒలికేవి అక్షరసుమాలు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యిన్నూట పదహారు మినీ కవితలు ఒక చోట చేర్చి,అందమైన మాలగా కూర్చి పాఠకుల ముందు నిలబెట్టి వెలిగించడం అనేది మాటలతో పనికాదు.కేవలం చేతలే దీనికి సమాధానం.అందుకే రాతల కవి చేతల విమర్శకులు డా|| రావి రంగారావు గారికే సాధ్యమయింది.కవిత పెద్దదయితే వచన కవితని,చిన్నదిగా ముగిస్తే మినీకవితని చాలా మంది ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు..కానీ అది పూర్తిగా తప్పని,మినీ కవిత్వం నిర్మాణ శిల్పం పూర్తిగా వేరనీ సంపాదకులు రావి రంగారావు అభిప్రాయపడుతున్నారు.స్వలాభం కోసమో,స్వప్రయోజనం కోసమో,చేసిన ప్రయోగం కాదిది.ఒక సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన అధ్భుత ప్రక్రియ ఇది..ఇవి నిన్న మొన్నటి కవితల సమాహారం కాదు.దాదాపుగా 1970 నుండి నేటివరకు ప్రఖ్యాత కవులనుండి నిన్ననే కలం పట్టిన నవ కవుల వరకు కవిత్వంలో సత్తువ వుంటే చాలు అలాంటివాటికి పెద్ద పీట వేసి కేవలం అక్షరాలంబనతో కలిసివున్న భావాల పొందికనే వీరు మినీ కవిత్వంగా అంగీకరించారు.సాహిత్యంలో ఎన్ని లఘు కవితా ప్రక్రియలు వచ్చినా అన్నీ మినీకవితనుండి వచ్చిన పిల్లకాలువలే!మినీ కవితే కదా పెద్ద కష్టమేమీ కాదు అనుకునేవారు అనేకం.కానీ పిల్లల కథ రాయాలన్నా ప్రతి ఒక్కరూ పిల్లల మనస్తత్వానికి ఎదగాల్సిందే!అలాగే మినీ కవిత రాయాలన్నా కవిగా ఎదగాల్సిందే!ఇది వాస్తవం అనుకునే వీరు నేడు మినీ కవితా ఉద్యమాన్ని ఒక భాధ్యతగా నడిపిస్తున్నారు..ఆ భాధ్యతను మనం గమనిస్తే..

మినీ కవిత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కాళోజీ కవిత “పుటక నీది / చావు నీది / బతుకంతా దేశానిది..” తర్వాత ఆరుద్ర కవిత “ఎన్ని గజాలు రాసాడని కాదు / ఎన్ని నిజాలు / రాసాడన్నదే ముఖ్యం” అనేవి తెలియని వారుండరు.అయితే కవిత్వం సమాజ పరమైంది.అదే కవిత్వం మానవీయతా పరమైంది.కానీ వ్యక్తి పరమైంది కూడా అని ఈ కవిత ద్వారా నిరూపిస్తారు ప్రముఖ కవి తనికెళ్ళభరణి. “”శ్రీశ్రీ అంటె / రెండు మెరుస్తోన్న / కొడవళ్ళు! / శ్రీశ్రీ అంటె / రెండు చెమరుస్తోన్న / కళ్ళు!”

నేడు స్త్రీ అన్నింటా ముందుంటోందని ,పురుషులతో సమానంగా జీవిస్తోందని అనడమే తప్ప కంటికి కనిపించడంలేదు. కేవలంసంపాదనలో తప్ప..అనే అర్థం వచ్చేలా జానకి రచించిన మినీ కవిత “నాడు అపవాదు వేసి / ఆలిని వదిలేసాడు / నేడు కట్నం సొమ్ము / చాల్లేదని తరిమేసాడు ఇల్లలిని /కాలం ఎక్కడ మారింది-కారణాలు తప్ప”అనే కవిత సమాజం పై వ్యంగ్యం అద్భుతంగా పండించారు.అలాగే ఇక్కడ మరో ఆణిముత్యం “దేశనాయకులు / చచ్చిపోయారని / ఈ ప్రజలంతా ఏడుస్తుంటే / నేనూ ఏడ్చా / అయితే వాళ్ళు పోయినందుకు కాదు /నా దేశం నోట్లో / మట్టి కొట్టిపోయినందుకు”అని జీడిగుంట కలం నుండి జాలువారింది.
కలల ప్రవాహంలో కదిలిపోయే సంఘటనలన్నీ నేలమీద ఒకపుడు జరిగినవే!.మనం అనుకుంటాం!!ఇదేంటి?నాకు కల ఇలా వచ్చింది,ఆశపడినా,ఆశయంగా మార్చుకున్నా,ఆవేదన చెందినా కనీసం ఒకటిరెండు సార్లు ఆలోచించినా జీవిత కాలంలో ఎపుడు జరిగినా అవన్నీ ఒక మాలగా చేరి తలలో నిక్షిప్తమై ఉంటుంది.ఎపుడైతే శరీర భాగాలు అన్నీ తమ తమ కార్యక్రమాలు నిర్వర్తించి సేదదీరుతుంటాయో అపుడు మెల్లగా బయటకు వచ్చి స్వైర్య విహారం చేస్తుంటాయి.ఒకవిధంగా బయటకు పోవడమే అనుకోవాలి.

అందుకే వాటిని ఆహ్వానించాలి!ఆహ్వానించడం అంటే చెడువైతే బయటకు పంపేయాలి.లేకుంటే ఆనందించాలి అంతే!ఎందుకిలా అన్నాను అనుకుంటూ ఇక్కడ చదివితే మానవత అనే కవితలో “ఎండిన చెట్టు పట్టుకు / వేల్లాడుతున్న మొండి పక్షులు / ఆకాశం వర్శిస్తుందని / చెట్టు చిగురిస్తుందని/గుండె దిటవు చేసుకోబట్టే/ఇంకా బతగ్గలుగుతున్నాయి”అంటారు కీర్తిప్రియ.అంటే సమాజం ఎలా ఉన్నా కూడా ఇంకా మానవత్వం ఓపికతో తన వంతు తాను పనిని చేసుకోబట్టే ఇంకా సృష్టి నిలబడుతోందని చెప్పే తీరు కడు రమ్యంగా వుంది.

అలాగే కొన్ని మిని కవితా ముత్యాలను మనం ఏరుకుందాం “దేశానికి వెన్నముక గ్రామం /గ్రామానికి వెన్నముక రైతు/వెన్నెముక ఎపుడూ వెనకబడే వుంటుంది/రైతు ఎన్నడూ వెనకబడే వున్నాడు.అనే నాగరాజు గారి మిని కవిత.”శాంతి పావురం/స్వయంగా వెళ్ళింది/భద్రత లేదని/ఫిర్యాదు చేయడానికి/పాపం!/పదిమంది విందుకు పలావ్ గా మారింది” అనే వై.కె.మూర్తి గారి కవిత,”కోట్ల మందికి/అన్నం పెడుతున్నాడు/’గంజి నీళ్ల’తో కడుపు నింపుకుంటున్నాడు” అనే సిహెచ్.వి.యస్ బ్రహ్మానందరావు గారి కవిత,”నిన్ను /దొంగలనుండి/కాపాడే నీ కుక్కకు తెలియదు/నువ్వే/పెద్ద దొంగవని/” అనే కమలారామ్ కవిత,”అమ్మా/ఆకలేస్తోంది/వెయ్యండో చపాతి/లేదా ఇవ్వండో తుపాకి/తీర్చుకుంటా/నా/తరతరాల బాకీ’ ’అనే బి.భారతి కవిత గొప్ప మిని కవితలు..”పేవ్ మెంటూ,పార్లమెంటూ /రెండూ ఒకటే/ఎంగిలిమెతుకుల కోసం ఒక పోట్లాట/వేలం పదవుల కోసం/మరో కాట్లాట” అనే తేజస్విత కవిత చదివితే అర్ఠమవుతుంది మినీ కవితలు ఎలా ఉండాలి అనే విషయం..ఇవి కేవలం మచ్చుకు మాత్రమే.ఈ సంకలనంలో ప్రతి కవిత గుండెను తట్టిలేపే ప్రభంజనం.ఎలాంటి సంకోచాలకు,ఎటువంటి మొహమాటాలకు తావివ్వకుండా అక్షరాన్ని ఆదర్శవంతంగా జనం ముందు నిలబెట్టడానికి రావి రంగారావు చేసిన అద్భుత ప్రయోగం ఈ సంకలనం.

బతుకంతా డబ్బుకోసమో,పదవికోసమో,పేరు కోసమో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు ఒక్క మనిషిని కూడా సాధించలేకుండా ఒంటరిగా చనిపోవడం జీవితంగా మారిపోయింది.అలాంటి సందర్భంలో రచించారేమో కవి వాసాల శౌరి “ఈ జన్మకు/సార్ధకత ఎపుడు?/నువ్వు రాలిపోతే/రెండు కన్నీటిబొట్లు/రాలినపుడు/..ఎంతో వాస్తవమైన కవిత అనిపించక మానదు.మినీ కవిత్వంలో మెనీ భావాలంటూ రావి రంగారావుగారి కలం ఒక గ్రంధాక్రుతిలో మనల్ని పలకరించింది.అలాంటి ఎన్నోభావాలకు అక్షరాకృతిని అందించాలనే వీరి ప్రయత్నంలో మరో కవిత మన హ్రుదయాల్ని తట్టిపలకరిస్తోంది చూడండి!”అరవై దాటినా/అమ్మ ఉన్నంతకాలం/తల్లిచాటు పిల్లను నేను/అమ్మపోయాక/పిల్లచాటు తల్లిని నేను” అనే వారణాసి లక్ష్మీనరసమ్మ గారి కవితకు

“ఇక్కడందరూ/మేకలే/పచ్చగడ్డిని కాదు/పచ్చకాగితం మేయనిదే/పనిచేయరు” అనే ఆరేపల్లి చందన గారి అధ్బుతమైన వ్యక్తీకరణను అభినందించాల్సిందే!ఇప్పుడర్ధమవుతుంది ఆరుద్రగారి కవితలోని ఆంతర్యం “ఎన్నిగజాలు/రాసాడన్నది కాదు/ఎన్ని నిజాలు రాసాడన్నదే/కవిత్వం”అనే వాస్తవం..

ఎవిఆర్ మూర్తి గారి కవిత చూడండి “శ్రామికుల/ఆకలి ఎముకలతో/నిర్మించిన/భారతదేశం పరువే/…తాజ్ మహల్”అంటారు.కవిత్వంలో సత్తువ వుంటే కన్నీళ్ళు వస్తాయి.కన్నీళ్ళలో నిజం వుంటే వాస్తవాలు కలం రూపంలో సాక్షాత్కరిస్తాయి…ఏదో మూడక్షరాల కలయిక కాదు కవిత్వం.ఏడు వాక్యాల పొందిక కాదు భావం.మాటలకు రూపకల్పనగా నిలిచిన ఈ అమృతతుల్యమైన అక్షరాల్ని గమనించండి! “తనకు జన్మనిచ్చినందుకు/పత్తి/వత్తిఅయింది/అతని ఆత్మహత్యకు/కారణమయినందుకు/అతని తలవైపున/దీపమైంది”అనే చిమ్మపూడి గారి కవిత ఒక తలమానికంగా నిలిచిందంటే అతిశయోక్తికాదు “పట్టపగలు /అరుంధతి నక్షత్రం/అబద్దంతోనే ఆరంభమయింది/జీవితాంతం ఆ..’సత్యం’ తోనే”అనే జనజ్వాల కవిత వాస్తవంలో ఉన్నతంగా అమరింది..మిని కవిత్వాన్ని ఒక ఉద్యమంలా ముందుకు నడిపిస్తూ యువకవుల చేత,విద్యార్థుల చేత కూడా రాయించి కవితా సౌరభాన్ని నలుదిక్కులా ప్రవహింపచేస్తున్న ఒక నిస్వార్థమైన కలం ఈ పుస్తక సంపాదకులు మినీ కవితా పితామహులు కలం నుండి వచ్చే కవితాత్మలను గమనిద్దాం “చెత్త పుస్తకాలు/అద్దాల షోరూముల్లో/మంచి రచనలు/ఫుట్ పాత్ మీద/నిజం ఎపుడూ/నేలమీదే/ఋతువును బట్టి మొలకెత్తడానికి…” అంటూ నేటి స్వీయగ్రంధాల స్థితిగతుల్ని ఎండగట్టిన వైనం కళ్ళముందుంచేరు..ఒక్క అక్షరం చాలు కదా మనలోని కవితను తట్టి లేపడానికి అన్నట్లు ఒక్క భావం చాలు కవి గుండెను కొలిచి పూజించడానికి అన్నదానికి రావి రంగారావు గారి మరో కవితను చదివి తరించాల్సిందే” ఒక వ్యక్తి/సంకెళ్ళతో/మోసుకొచ్చింది కాదు/ఒక శక్తిగా/స్వేచ్ఛతో/దూసుకొచ్చింది”అని మినీ కవిత గురించి చెప్పేరు.వాక్యాలు కావు..అక్షర సత్యాలు..

ఇలాగే ప్రతి కవిత సమాజంలో ప్రతినిత్యం మనకు కనిపించే ఆవేదనల్ని,అన్యాయాల్ని,అక్రమాల్ని,భ్రమల్ని అన్నింటిని ప్రశ్నించే తీరులో ఉన్న కవిత్వాల్ని ఏర్చి కూర్చి కవితల మాలగా అలంకరించి అందించిన ఈ “వెయ్యినూట పదహార్లు” మినీ కవితల సంకలనం లఘుకవితలు రాసేవారికి ఒక పెద్దబాలశిక్ష లాంటిది.వృక్షం ఉన్నది నీడనివ్వడానికే!కవిత్వం ఉన్నది సమాజాన్ని ఉధ్ధరించడానికే!వీటికి ఒక స్థానాన్ని కల్పించిన రంగారావు గారు ఉన్నది మినీకవిత్వాన్ని పండించడానికే!! “వెయ్యినూట పదహార్లు సంకలనంలో దాదాపు ఆరు వందల మంది కవుల మినీ కవితలతో పాటు అదనంగా 52 పేజీలలో మినీ కవిత శిల్ప రహస్యాలను తెలియజేసేరు.లఘుకవితా ప్రియులందరూ చదివి తీరవలసిన సంకలనం ఇది.రక రకాల శుభకార్యాల సందర్భంగా బందుమిత్రులకు బహుమతిగా ఇవ్వదగిన అధ్భుతమయిన గ్రంధం ఇది.

ప్రతులకు
వెల: 116 రూ||
డా|| రావి రంగారావు,20/151-1,3/1,మోనికా రెసిడెన్సీ,కొబ్బరితోట,చిలకలపూడి,మచిలీపట్నం-521002..
సెల్:9247581825

You Might Also Like

One Comment

  1. Purnima

    >> “పట్టపగలు /అరుంధతి నక్షత్రం/అబద్దంతోనే ఆరంభమయింది/జీవితాంతం ఆ..’సత్యం’ తోనే”

    Wow!

Leave a Reply