స్త్రీల వ్రతకథలు

“ధర్మాచరణలో స్త్రీలకూ, పురుషులకూ తేడా ఉందా ? లేక ఆ తేడా ఉండాల్సిందేనా ? పురుషుల ఆచరణలు స్త్రీలకు ఉపయుక్తమేనా ? లేక స్త్రీలకంటూ ప్రత్యేకమైన ధర్మాచరణలు అవసరమా ?” అని ప్రశ్నిస్తే “ఓ, కావాల్సినంత తేడా ఉంది. పురుషుల ఆచరణలన్నీ స్త్రీలకు ఉపయుక్తం కావు. వారికి ఉపయుక్తమయ్యే ధర్మాచరణలు తప్పనిసరిగా విభిన్నంగా ఉంటాయి” అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకలా ? అంటే, స్త్రీశరీర ధర్మాలూ, పురుష శరీర ధర్మాలూ ఒకటి కావు. అందుచేత స్త్రీ మనోధర్మాలూ, పురుష మనోధర్మాలూ కూడా ఒకటి కావు. లౌకిక జీవనంలో పురుషులది ప్రధానపాత్ర కాగా స్త్రీలది సహాయక పాత్ర. అందుచేత సంసార సాగరాన్ని పురుషులు చూసే కోణమూ, స్త్రీలు చూసే కోణమూ తేడాగా ఉంటాయి. ఆర్థిక భారమంతా తమ మీదే పడిపోవడంతోనూ, అది తమ మగతనపు నిర్వచనం మీద మోపే బలాత్కారం చేతనూ ఎక్కువమంది పురుషులు పైకి వ్యక్తీకరించక పోయినా, సంసార జీవితాన్ని అంతర్గతంగా ఒక నిరసన, నిర్వేదభావంతో పరికిస్తారు. స్త్రీల మీదున్న భారాలకి ఆర్థిక స్వభావం లేకపోవడం వల్ల ఎన్ని అసంతృప్తులున్నప్పటికీ సంసార జీవితమే వారికి మిక్కిలి ప్రీతికరంగా ఉంటుంది. వారికి ఇంటితోనూ, భర్తాపిల్లలతోనూ మమత్వం (attachment) ఎక్కువ. ఇవి కాక ఇతరేతర వస్తు ఆకర్షణలు ఉంటాయి. ధర్మకార్యాల కంటే కుటుంబం పేరు చెబితేనే వారు ఉత్సాహంగా రంగంలోకి దిగుతారు. అందుచేత పురుషులు చదివి ఉత్తేజం పొందే వేదాంతాలూ, తత్త్వశాస్త్రాలూ, యోగాలూ స్త్రీల ఆచరణకు అయోగ్యంగా, వారి హృదయాలకి నిస్సారంగా, విషప్రాయంగా ఉంటాయి. పూజలూ, వ్రతాలూ, ఉత్సవాలూ, వేడుకలూ, విందులూ, వినోదాలూ మొదలైనవి వారికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కాబట్టి హిందూధర్మంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తెలుగుహిందూ సంప్రదాయంలో నోముల రూపంలో స్త్రీల మతం ఒకటి ప్రత్యేకంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు, ఆ పేరు పెట్టకపోయినా !

ప్రకృతం సమీక్షించబడుతున్న “స్త్రీల వ్రతకథలు” అనే పుస్తకం అలాంటి స్త్రీజనోపయుక్తమైన సుమారు ౨౦౦ వ్రతాల్ని వాటి వెనకున్న గాథలతో సహా అందిస్తోంది. వీటిల్లో కొన్ని మాత్రమే భారతదేశమంతటా ఆచరణలో ఉన్నవి. ఎక్కువభాగం తెలుగువారికి సంబంధించినవే. దీన్ని వ్రాసినది వాస్తవానికి శ్రీ బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారైనప్పటికీ, ఏ కారణం చేతనో ఇది వారి ధర్మపత్ని, శ్రీమతి బొమ్మకంటి రుక్మిణిగారి పేరిట ముద్రించబడింది. నిజానికి ఇది బజారులో దొఱికే అనేకానేక మహాజన మత (Mass religion) గ్రంథాల్లో ఒకటి కాదు. మఱేమంటే – ఒక మహా పరిశోధనగ్రంథం. రచయిత అనేక జిల్లాలు స్వయంగా తిరిగి, తొంభయ్యేళ్ళ పండువార్ధక్యంలో ఉన్న అత్యంత సీనియర్ స్త్రీలను సైతం దర్శించి, మాట్లాడి నమోదు చేసిన వివరాలివి. ఎందుకంటే ఇందులో వర్ణించబడిన వ్రతాల్లో ఎక్కువ భాగాన్ని తెలుగుస్త్రీలు మర్చిపోయి చాలా కాలమవుతోంది. కొన్నికొన్ని ఆచరణలో ఉన్నప్పటికీ వాటి వెనకున్న చరిత్ర ఏంటో మర్చిపోయారు. కొన్ని ఇంకా చేస్తూ ఉన్నారు గానీ వాటికి గల శాస్త్ర ప్రామాణ్యమూ, ఫలశ్రుతీ ఏమీ తెలియరాదు. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రిగారు వీటన్నింటినీ త్రవ్వితీసి, క్రోడీకరించి మళ్ళా జనసామాన్యం దృష్టికి తేవడానికి ఒక గొప్ప ఉద్యమస్ఫూర్తితో, ఓర్పుతో, ఓపికతో నడుం కట్టారు, సఫలీకృతులయ్యారు. వారికి తెలుగు హిందూజాతి శాశ్వతంగా ఋణపడిపోయింది.

రచయిత మాటల్లో-

“భర్త యొక్క పరిపూర్ణానురాగాన్నీ, సవతుల మీద సర్వాధికారాన్నీ, సత్సంతానాన్నీ, సౌభాగ్యాన్నీ, సిరిసంపదల్నీ మత్రమే ఆశిస్తూ “నవ్వితే పెదిమనీ, నడిస్తే గడపనీ” దాటకుండా మసులుకున్న సాధ్వీమతల్లులుండే నాటి కాలానివి ఈ వ్రతాలు. మఱిప్పుడు ఇవి పనికొస్తాయా ? భర్త అనురాగం పెర్సంటేజికి వస్తే కోర్టులున్నాయి. విడాకుల చట్టాలున్నాయి. సవతుల బెడద ఇప్పుడు లేనేలేదు. సంతానానికీ సిజేరియన్లూ అవీ చాలానే వచ్చాయి. మఱింకా ఈ వ్రతాలెందుకు ? ఎవఱు పాటిస్తారు ?” అని కొందఱి ప్రశ్న. అనేకమంది పాటిస్తారన్నదే మా జవాబు. మనం ఎంత కంప్యూటర్ యుగంలో ఉన్నప్పటికీ కూడా, పోష్ బంగళాల్లో తులసికోటలుంటునే ఉన్నాయి. గాలాడని ఇనప్పెట్టెల్లో లక్ష్మీదేవి చిత్రపటాలూ, అగరొత్తులూ పెడుతూనే ఉన్నారు. శుక్ర, శనివారాలలో పురుషులు తమ శ్రీమతులని తాకడానికి కూడా తటపటాయిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలీనాటికీ కూడా మహిళాభక్తురాళ్ళతో కిటకిటలాడిపోతూనే ఉన్నాయి.”

పై గద్య వ్రాసేటప్పుడు బహుశా రచయిత మర్చిపోయిన విషయమేమంటే “కోర్టులూ, చట్టాలూ భార్యాభర్తల సంబంధాన్ని విడగొట్టగలవు తప్ప కలపలేవు. అవి ఎమర్జెన్సీ ఎగ్జిట్లే తప్ప సింహద్వారాలు కావు” అనేది. రెండోది – “సవతుల్ని చట్టపరంగా నిషేధించినంత మాత్రాన వారు సమాజంలో లక్షలాదిగా లేకుండా పోలేదు” అనేది కూడా ! అవ్యాజమైన భర్తృవాల్లభ్యమూ, సుఖసంసారమూ, స్వకీయమైన, సహజమైన సత్సంతానమూ, ఆరోగ్యమూ, ఐశ్వర్యమూ – ఇలాంటివన్నీ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సరే, విస్తారమైన పూర్వ పుణ్యబలం వల్లనే సాధ్యం. వ్రతాలు కాలం చెల్లినవి (out-dated) అంటే, దేవుడే ఔట్-డేటెడ్ అన్నట్లవుతుంది.

౧౯౬ పుటల కైవారం గల ఈ పుస్తకంలో జాబితా కట్టిన వ్రతాలూ అవీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ పేర్లలో తొణికిసలాడే తెలుగు దేశిసంప్రదాయమూ, వాటి ద్వారా ధ్వనించే ఆనాటి తెలుగు స్త్రీల ముగ్ధత, నిరాడంబరత మిక్కిలి ఆకట్టుకుంటాయి. ఒక గొప్ప సాంస్కృతిక వైభవానికి ఇవి అద్దంపట్టుతున్నాయి.

౧.అంగరాగాల నోము ౨. అక్షయ బోండాల నోము ౩. అట్లతద్దె ౪. అట్లమీది ఆవపువ్వునోము ౫. అనంతపద్మనాభవ్రతం ౬. అనఘాష్టమి ౭. అన్నం ముట్టని ఆదివారాల నోము ౮. అమావాస్యా-సోమవారం నోము ౯. ఆముక్తాభరణ సప్తమీ వ్రతం ౧౦. అష్టలక్ష్మీవ్రతం ౧౧. ఆపదలేని ఆదివారాల నోము-1 ౧౨. ఆపదలేని ఆదివారాల నోము-2 ౧౩. ఇప్పతదియ నోము ౧౪. ఉగ్గుగౌరీ నోము ౧౫. ఉండ్రాళ్ళ తద్దె ౧౬. ఉదయకుంకుమ నోము ౧౭. ఉప్పుగౌరి నోము-1 ౧౮. ఉప్పుగౌరి నోము-2 ౧౯. ఋషిపంచమి ౨౦. ఐదుపువ్వుల తాంబూలం నోము ౨౧. కందగౌరి నోము ౨౨. కడుపు కదలని గౌరి నోము ౨౩. కన్యాకుమారి నోము ౨౪. కన్నెతులసి నోము ౨౫. కమలవత్తుల నోము ౨౬. కఱుళ్ళ గౌరి నోము ౨౭. కల్యాణగౌరి నోము ౨౮. కాటుక గౌరి నోము ౨౯. కాత్యాయనీవ్రతం ౩౦. కామేశ్వరీవ్రతం ౩౧. కామేశ్వరి పాట నోము ౩౨. కార్తీక చలిమిళ్ళ నోము ౩౩. కార్తీక వ్రతం ౩౪. కుంకుమగౌరి నోము-1 ౩౫. కుంకుమగౌరి నోము-2 ౩౬. కుంకుమగౌరి నోము-3 ౩౭. కుందేటి అమావాస్య కథ నోము ౩౮. కుజగౌరీవ్రతం ౩౯. కృత్తిక దీపాల నోము ౪౦. కృత్తికాదివారాల నోము ౪౧. కృత్తికా సోమవారాల నోము ౪౨. కృత్తికా మంగళవారాల నోము ౪౩. కృత్తికా బుధవారాల నోము ౪౪. కృత్తికా గురువారాల నోము ౪౫. కృత్తికా శుక్రవారాల నోము ౪౬. కృత్తికా శనివారాల నోము ౪౭. కేదారేశుడి నోము ౪౮. కృష్ణాష్టమి నోములు ౪౯. కొబ్బరి గౌరీవ్రతం ౫౦. కైలాసగౌరి నోము

౫౧. గండాల గౌరి నోము ౫౨. గంగ నోము ౫౩. గంతల గౌరి నోము-1 ౫౪. గంతల గౌరి నోము-2 ౫౫. గంధం-తాంబూలం నోము ౫౬. గజలక్ష్మీ నోము ౫౭. గజగౌరీ వ్రతం ౫౮. గడప గౌరీవ్రతం ౫౯. గణేశుని నోములు ౬౦. గరుడ పంచమీవ్రతం ౬౧. గ్రహణ గౌరీనోము ౬౨. గాజుల గౌరి నోము ౬౩. గ్రామకుంకుమ నోము ౬౪. గుమ్మడి గౌరి నోము ౬౫. గూనదీపాలూ, బానదీపాల నోము ౬౬. గొడిసె నోము ౬౮. గోపూజావ్రతం ౬౯. గోఫాష్టమీ వ్రతం ౭౦. గో త్రిరాత్ర వ్రతం ౭౧. గోద్వాదశీ వ్రతం ౭౨. గోవత్సద్వాదశీ వ్రతం ౭౩. గోపద్మవ్రతం ౭౪. చాతుర్మాస్య వ్రతం ౭౫. చాంద్రాయణ వ్రతం ౭౬. చద్దికూటి మంగళవారాల వ్రతం ౭౭. చల్లచిత్తగౌరి నోము ౭౮. చిట్టిబొట్టునోము ౭౯. చిక్కుళ్ళ గౌరి నోము ౮౦. చిత్రగుప్తుడి నోము-1 ౮౧. చిత్రగుప్తుడి నోము-2 ౮౨. చిత్రగుప్తుడి నోము-3 ౮౩. చిత్రగుప్తుడి నోము-4 ౮౪. చిలకముగ్గుల నోము-1 ౮౫. చిలకముగ్గుల నోము-2 ౮౬. డోలాగౌరీవ్రతం ౮౭. తరగని ఆదివారాల నోము ౮౮. తవుడు గౌరీనోము ౮౯. దంపతి-తాంబూలాల నోము-1 ౯౦. దంపతి-తాంబూలాల నోము-2 ౯౧. దంపతి-తాంబూలాల నోము-3 ౯౨. దిశాగౌరీవ్రతం ౯౩. దీపదానాల నోము ౯౪. ధైర్యగౌరీ నోము ౯౫. ధైర్యలక్ష్మీనోము ౯౬. నందికేశుడి నోము ౯౭. ధనుర్మాసవ్రతం ౯౮. నిత్యగౌరీనోము ౯౯. నందావ్రతం ౧౦౦. నరసింహ ఖడ్గాల నోము

ఇలాంటివి ఇంకో వంద ఉన్నాయి ఈ పుస్తకంలో !

(ముగింపు రెండో భాగంలో)

You Might Also Like

3 Comments

  1. narasimharao mallina

    మా కోడలు అమెరికానుండి వచ్చింది. ఈనెల 12న తిరిగి అమెరికా వెళ్తున్నది. మా ఇంటిలో మా ఆవిడ ఏవో కొన్ని కొన్ని వ్రతాలు, నోములు పూర్వకాలంలో చేసినట్లు గుర్తు. కాని మా కోడలు ఈమధ్యన ఇండియాకొచ్చి కొన్ని కొన్ని వ్రతాలూ, నోములూ చేస్తూఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటున్నది. ఆమె ఉప్పుగౌరీనోము నోచిందట. అలాగే చిక్కుళ్ళ గౌరీ నోమూను. భోజనాలు చేస్తున్నప్పుడు ఉప్పు అనే మాట అనకూడదనిన్నీ అలా అంటే తాను అన్నం దగ్గఱనుంచి లేచివెళ్ళిపోయి చెయ్యి కడుగుకొని వచ్చి మళ్ళీ భోజనం దగ్గఉ కూర్చోవటం చూసి నాకు ఆశ్చర్యమనిపించింది. మా కోడలు m.c.a. చదువుకొనింది. ఆమె నోముల పుస్తకాలు చదవటం చూసి నాకూ చదవాలనిపించింది. మా యింట్లో ఎంతోకాలం నుంచి ఈ పుస్తకాలు ఉన్నాగానీ ఎప్పుడూ చదవాలనిపించలేదు. మీ పరిచయం చదివాక నాకూ చదవాలనిపిస్తోందండి.

  2. తాడేపల్లి

    ఇది రాజమండ్రిలో గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వారి పుస్తకాల దుకాణంలో దొఱుకుతుంది. వారికి రాష్ట్రమంతటా పుస్తక పంపిణీ నెట్‍వర్క్ ఉంది కనుక మిహతా పెద్ద పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కూడా ప్రయత్నించవచ్చు.

  3. Geetha

    Good information,Next week i am going to india. Where can i get this book?

Leave a Reply