మయూరుని సూర్య శతకం

రాసిన వారు: కె.ఎం.చంద్రమోహన్
******************************
మయూరుని పేరు నేను మొదటిసారి వినడం శ్రీనాధుని కావ్యాలలోనే. “భట్ట బాణ మయూర భవభూతి శివభద్ర కాళిదాసుల మహాకవుల దలచి…” అని కాశీ ఖండంలో బాణ, భవభూతి, కాళిదాసాదుల సరసన నిలిపి ప్రార్థించాడు. మయూరుడు అన్న పేరు ఆకర్షణీయంగా తోచడంతో ఈ మయూరుడెవరా అని అప్పట్లో వెదకడమూ, సూర్య శతక కర్త అని తెలిశాక ఒకే ఒక శతకంవ్రాసిన కవికి కాళిదాసాదులతో సామ్యమా అని ఆశ్చర్యపడి ఆ విషయం తరువాత మరిచి పోవడం జరిగింది.

ఈ మధ్యన మళ్ళీ గరికపాటి వారి ’కాశీఖండం వ్యాఖ్యానం’ విన్నాను. అందులో వారు శ్రీనాధుని కాశీ ఖండంలో సూర్యోదయ వర్ణనలోని కొన్ని పద్యాలు మయూరుని పద్యాలకు కాపీ అని చెప్పారు. ఆ మూల పద్యాలను కూడా ఉదహరించారు. అది విన్నాక మళ్ళీ ఆసక్తి కలిగింది. శ్రీనాధుడు కూడా కాపీ కొట్టేసేంత గొప్పగా పద్యాలు వ్రాసిన మయూరుని గురించి తెలుసుకోవాలని వెదికితే, ఈమాటలో సూర్య శతకం దొరికింది. అత్యంత ప్రౌఢంగాను, కఠినమైన పదప్రయోగాలు, దూరాన్వయక్లిష్టాన్వయాలతో నారికేళపాకంలో ఉన్న ఆ పద్యాలకు టీక ఎక్కడైనా దొరుకుతుందా అని గాలించాను. నా అదృష్టం బాగుండి తెలుగులో టీకా తాత్పర్య సహితంగా సూర్య శతకం దొరికింది. కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ ఆస్థాన పండితులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాన్ అయిన శ్రీ కూచిభట్ల చంద్రశేఖర శర్మ గారు టీకా తాత్పర్యాలను రచించారు. విజయవాడ శివకామాశ్వరీ గ్రంథ మాల వారు 2003 ఫిబ్రవరిలో ప్రచురించారు.. కేవలం వేయి ప్రతులు ముద్రించిన ఈ పుస్తకం 2011 లో నాకు దొరకడం గొప్ప విషయమే.

శతకంలో ఇచ్చిన పరిచయం ప్రకారం మయూరుడు శ్రీహర్ష చక్రవర్తి ఆస్థానంలోని వాడు. బాణుని సమకాలికుడు మాత్రమే కాక బాణుని బావమరిది కూడా. ఏదో గొడవ వలన బాణుడు శపించడం వలననో, లేక బాణుని భార్య అయిన తన సోదరి శాపం వలననో కుష్ఠువ్యాధి గ్రస్తుడవుతాడు. ఆ బాధ భరించలేక వంద పద్యాల్లో సూర్యుని ప్రార్థించి వ్యాధినుండి విముక్తుడవుతాడు. మమ్మటుడు కూడా తన కావ్య ప్రకాశికలో ఈ కథను పేర్కొన్నాడు. ఐతే శతకంలో మయూరుడు తన విషయాన్ని ఎక్కడా చెప్పుకోలేదు. కథలలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా మయూరుడు బాణునితో సరిసమానమైన ప్రతిభా సంపత్తి కలిగినవాడన్నది నిర్వివాదాంశం. “భక్త మయూర వక్త్రాబ్జ పదవిన్యాస శాలినీ నర్తకీవవరీవర్తి సభా మధ్యే సరస్వతీ” అని జయ మంగళుడు మయూరుని కీర్తించాడు. భక్తుడైన మయూరుని ముఖపద్మంపై పదవిన్యాసం చేస్తున్న సరస్వతి సభలో నర్తకిలా అతిశయంగా ఒప్పుతున్నదని భావం. రాజశేఖరుడు మయూరుని ఇలా శ్లాఘించాడు:

“దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం
విషవిద్యేవ మాయూరీ మయూరీ వాఙ్నికృంతతి”
(నెమలి క్రేంకారం వంటి మయూరుని వాక్కు నీచకవులనే విషసర్పాల చెవిని సోకగానే విషవిద్య వలే వారి దర్పాన్ని నశింపజేస్తుంది)

మయూరుని సూర్య శతకం చదివితే పై ప్రశంసల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని తెలిసింది. శతకంలో ఒక్కో పద్యం చదువుతున్న కొద్దీ, మయూరుడు కేవలం వంద పద్యాలతో మహా కవి ఎలా అయ్యాడో అర్థమవసాగింది. అద్భుతమైన వర్ణనలు, భాషపై సంపూర్ణమైన అధికారం, రచనా విధానంలో ప్రౌఢిమ అనితర సాధ్యంగా తోచింది. శతకంలో ఏ పద్యం ఉదహరించాలో ఎంచుకోవడం కష్టమైన పనే.. కనుక మొదటి పద్యంతోనే ప్రారంభిస్తాను.

“జంభారీతీభ కుంభోద్భవమివ దధతస్సాంద్ర సింధూర రేణుం
రక్తాస్సిక్తా ఇవౌఘై రుదయతటీ ధాతు ధారాద్రవస్య
ఆయాంత్యా తుల్య కాలం కమలవన రుచేవారుణా వో విభూత్యై
భూయాసు ర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః || “

జంభ + అరాతి + ఇభ + కుంభ + ఉద్భవం = ఇంద్రుని వాహనమైన ఐరావతం యొక్క కుంభస్థలం నుండి పుట్టిన
సాంద్ర సింధూర రేణుం = దట్టమైన సింధూరపు ధూళిని
దధతః ఇవ = ధరించినట్లు
ఉదయ గిరి తటీ = తూర్పు కొండ చరియలందు
ధాతు ధారా ద్రవస్య = ధాతువుల యొక్క రసధారలయొక్క
ఓఘైః + సిక్తాః + రక్తాః ఇవ = ప్రవాహం చేత తడుపబడి ఎర్రని రంగును కలిగినట్లు
తుల్యకాలం = అదే సమయంలో (సూర్యోదయంతో బాటుగా)
ఆయాంత్యా = వచ్చుచున్నటువంటి
కమల వన రుచా = పద్మవనం యొక్క కాంతిచే
అరుణాః ఇవ = ఎర్రనైనవిగా ఉన్నటువంటి
భువనం + భాసయంతః = ముల్లోకాలను ప్రకాశింప చేయుచున్నవై
భానవీయాః = సూర్యుని యొక్క
భానవః = కిరణాలు
వః = మీ యొక్క
విభూత్యై = ఐశ్వర్యము కొరకు
భూయాసుః = అగును గాక

తాత్పర్యం: సూర్యకిరణాలు ఐరావతం కుంభస్థలంనుండి పుట్టిన సింధూరపు ధూళికమ్ముకున్నట్లు ఉన్నాయి. ఉదయం స్వర్గంనుండి బయలుదేరినప్పుడు స్వర్గలోకపు వస్తువులతో పోలిక అన్నమాట. తరువాత తూర్పు కొండ చరియల లోని గైరికాది ధాతువుల ద్రవాలచే తడిచి ఎర్రబడినవా అన్నట్లు కనబడుతున్నాయి. తరువాత సూర్యుని రాకతో బాటే వికసించిన పద్మ వనంయొక్క ఎర్రని కాంతితో ఎర్రబడినట్లు కనిపిస్తున్నాయి. భూమిని చేరిన కిరణాలు అలా కనిపిస్తున్నాయన్న మాట. ఈ విధంగా ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్న భానుని కిరణాలు మీ అందరి సంపదలకూ కారణమగు గాక!

’భానవో భానవీయాః’ అన్నది ఎంత సుందర పద ప్రయోగమో గమనించండి! ఇలాంటి శ్లేషాలంకార పద ప్రయోగాలు, శబ్దాలంకారాలు శతకంలోని ప్రతి పద్యంలోనూ కనిపిస్తాయి. పై పద్యంలో “మీ అందరికీ శుభాలు కలుగు గాక” అని చెప్పడాన్ని బట్టి తన కుష్ఠువ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ శతకం చెప్పలేదనే భావన కలుగుతుంది.

శతకంలో మొత్తం 102 పద్యాలున్నాయి. అన్నీ స్రగ్ధరా వృత్తంలో నడిచాయి. ఇందులో మొదటి 43 పద్యాలలో సూర్యకాంతిని, తరువాత 6 పద్యాలలో సూర్యుని రథాశ్వాలను, అటుపైన 11 పద్యాలలో సూర్య రథాన్ని, తరువాత 12 పద్యాలలో సూర్య సారథి అరుణుని, పిదప 8 పద్యాలలో సూర్య మండలాన్ని మిగిలిన 20 పద్యాలలో సూర్యుని గురించి వర్ణించాడు. చివరి 2 పద్యాలు ఫలశృతిగా చెప్పబడ్డాయి. ఇవి మయూరుడే రచించాడో ఇతరులెవరైనా చేర్చారో తెలియదు. సూర్యుని గురించి మన పూర్వీకులకున్న జ్ఞానం, విజ్ఞానం పద్యాల్లో కనిపిస్తాయి. కెప్లరు, కోపర్నికస్ లకు ముందు సూర్యకేంద్రక సిద్ధాంతం గానీ, భూమి గుండ్రంగా ఉందన్న సంగతి గానీ తెలియవని పాశ్చాత్యులు వ్రాసిన పుస్తకాలను గుడ్డిగా భట్టీయం వేసినందుకు సిగ్గుతో తలదించుకునేలా చేసే వర్ణనలు సూర్య శతకంలో కనుపిస్తాయి. ఉదాహరణకు ఈ పద్యం :

ద్వీపే యోస్తాచలోస్మిన్భవతి ఖలు స ఏవాపరత్రోదయాద్రి
ర్యా యామిన్యుజ్వ్జలేన్దుద్యుతిరిహ దివసోన్యత్ర తీవ్రాతపః సః
యద్వశ్యౌ దేశకాలావితి నియమయతో నో తు యం దేశకాలా
వవ్యాత్స స్వప్రభుత్వాహితభువనహితో హేతురహ్నామినో వః

తాత్పర్యం: ఈ జంబూద్వీపంలో సూర్యునికి ఏది అస్తాద్రియో, అదే ఇతర ద్వీపమందు ఉదయాద్రి. ఈ ద్వీపమందు ఏ రాత్రి వెన్నెల ప్రకాశించునో, మరొక ద్వీపంలో అదే సమయాన ఎండగా ఉంటుంది. సూర్యుని దేశ కాలాలు నియమింపలేవు. సూర్యుడే దేశ కాలాలను నియంత్రిస్తున్నాడు. తన పాలనచే లోకాలకు హితం చేకూర్చుచున్నాడు. అట్టి దినకరుడైన సూర్యుడు మిమ్ములను రక్షించు గాక.

ఇక్కడ ద్వీపం అన్నది ఖండం అనే అర్థంలో తీసుకోవాలి. మనదేశంలో సాయంత్రం ఐనప్పుడు భూమ్మీద మరో ఖండంలో సూర్యోదయం అవుతుంటుంది. ఇక్కడ రాత్రయినప్పుడు మరో చోట ఎండ కాస్తుంటుంది. భూగోళం మీద మన ప్రాచీనుల అవగాహనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి! దీనికి శ్రీనాధుని తెలుగు సేత చూడండి:

సీ. ఒకదీవి నేకొండ ఉదయాద్రియై దోఁచు
అది యొండు దీవికి నస్త శిఖరి
ఒకదీవి తొలిసంధ్య ఉన్మేషమును జూపు
ఉదయించు మలిసంధ్య నొండు దీవి
ఒకదీవి నిండు చంద్రికలు మిన్నులఁబ్రాఁకు
నొక దీవి బీరెండ యుబ్బి కాయు
ఒకదీవి ఠవళించు నొకఋతు ప్రారంభ
మొకదీవి నివురొత్తు నొండు ఋతువు
దక్షిణాయన మొకదీవి తళుకుఁ జూపు
ఉత్తరాయన మొకదీవి నుప్పతిల్లు
ఇన్నిటికి యత్ప్రభావంబు హేతుభూత
మట్టి రవితేరు సాగె లంకాద్రి మీద

మయూరుడు క్లుప్తంగా చెప్పినదాన్ని మరికాస్త సాగదీసి తన శైలిలో చెప్పాడు శ్రీనాధుడు. శ్రీనాధుడు తెనిగించిన మరో మయూరుని పద్యం అరుణుని వర్ణించేది.

శాతః శ్యామాలతాయాః పరశురివ తమోరణ్యవహ్నేరివార్చిః
ప్రాచ్యేవాగ్రే గ్రహీతుం గ్రహకుముదవనం ప్రాగుదస్తోగ్రహస్తః
ఏక్యం భిన్దన్య్దుభూమ్యోరవధిరివ విధాతేవ విశ్వప్రబోధం
వాహానాం వో వినేతా వ్యపనయతు విపన్నామ ధామాధిపస్య

దీనికి శ్రీనాధుని అనువాదం ఇలా:

సీ. చిరుసాన పట్టించి చికిలి చేయించిన
గండ్రగొడ్డలి నిశా గహన లతకు
కార్కొన్న నిబిడాంధకార ధారాచ్ఛటా
సత్రవాటికి వీతిహోత్ర జిహ్వ
నక్షత్ర కుముద కాననము గిల్లెడు బోటి
ప్రాచి యెత్తిన హస్త పల్లవాగ్ర
మరసి మింటికి మంటి కైక్య సందేహమ్ము
పరిహరింపంగ నేర్పడ్డ యవధి
సృష్టి కందెర, తొలిసంధ్య చెలిమికాడు
కుంటు, వినతా మహాదేవి కొడుకు గుఱ్ఱ
సవితృ సారథి, కట్టెఱ్ఱ చాయ వేలుపు
అరుణుడుదయించె ప్రాగ్దిశాభ్యంతరమున

శ్యామా లతాయా: శాతః పరశు రివ … ’చీకటి అనే లతను నరకడానికి వాడే గొడ్డలి వలె’ అని మయూరుడు వ్రాసింది శ్రీనాధునికి చాలలేదు. ఆ గొడ్డలికి చిరుసాన పట్టించి చికిలి చేయించి, ఆ తీగను గహన లత గా మారిస్తే తప్ప కవిసార్వభౌముని నాలుక దురద తీరలేదు! ఈ రెండు పద్యాలు కాశీ ఖండంలోనివి.

మయూరుని భాషా పాండితీ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే అంతూ దరీ తెలియవు గాని, శబ్దంపై మయూరుని అధికారాన్ని చూపే ఒక పద్యం ఉదహరిస్తాను:

వ్యగ్రైరగ్ర్య గ్రహేన్దుగ్రసనగురు భరైర్నో సమగ్రైరుదగ్రైః
ప్రత్యగ్రైరీషదుగ్రైరుదయగిరిగతో గోగణైర్గౌరయన్‌ గామ్‌
ఉద్గాఢార్చిర్విలీనామరనగరనగగ్రావగర్భామివాహ్నా
మగ్రే శ్రేయో విధత్తే గ్లపయతు గహనం స గ్రహగ్రామణీర్వః

అర్థం ఇదీ.

యః = ఏ సూర్యుడు
ఉదయగిరి గత: = ఉదయ పర్వతాన్ని పొందినవాడై
వ్యగ్రైః = అంతటా ప్రసరించుచున్నట్టియు
అగ్ర్య = తూర్పు దిక్కునందున్న
గ్రహ = గ్రహాలైన
ఇందు = చంద్రుడు మొదలగు వారియొక్క
గ్రసన = తిరస్కరించుట యొక్క
గురుభరైః = గొప్ప భారం కలవియును,
నో సమగ్రైః = సంపూర్ణములు కానివియును
ఉదగ్రైః = పెద్దగా పెరుగుచున్నట్టియును
ప్రత్యగ్రైః = వినూత్నములైనట్టియును
ఈషత్ + ఉగ్రైః = కొద్దిగా వేడిని కలిగినట్టివియును
గోగణైః = కిరణ సమూహములచే
అహ్నాం + అగ్రే = పగళ్ళ యొక్క ప్రారంభమున (ఉదయ కాలంలో)
గాం = భూమిని
ఉద్గాఢ = మిక్కుటమైన
అర్చిన్ = కాంతులలో
విలీన = కలిసి పోయిన
గ్రావ గర్భాం = శిలలు గర్భమందు కల
అమర నగర నగ = మేరుపర్వతం యొక్క
గౌరయన్ = బంగారు రంగు కలదానిగా
శ్రేయః = శ్రీయస్సును
విధత్తే = కలిగించుచున్నాడో
సః = ఆ
గ్రహ గ్రామణీ = గ్రహ నాయకుడైన సూర్యుడు
వః = మీయొక్క
గహనం = పాపమును
గ్లపయతు = పోగొట్టు గాక

తాత్పర్యం: సూర్యుడు, ఉదయాద్రిపై ఉదయ కాలంలో చకచకా నడుస్తూ తనకు తూర్పుదిక్కునున్న చంద్రాది గ్రహాలను తన లేతకిరణాలలో వెలవెల బోయేటట్లు చేస్తున్నాడు. ఉదయ కాలం కనుక ఆ కిరణాలు సంపూర్ణం కాదు. కొంచెం వేడిగా ఉన్నాయి. పెరుగుతున్నాయి. అట్టి కిరణాలచే ఈ భూమిని, ఆ కాంతులను తమలో ఇముడ్చుకొని బంగారు రంగులో ప్రకాశిస్తున్న మేరు పర్వత శిలలు కలదానిగా చేస్తూ శ్రేయస్సును కలిగిస్తున్నాడు. అట్టి గ్రహనాయకుడైన సూర్యుడు మీ పాపాలను పోగొట్టు గాక!

ఈ పుస్తకం ఇంకా దొరుతుందో లేదో తెలియదు. ఇంత మంచి కవిత్వం సంస్కృత సాహిత్యాభిమానులకు అందుబాటులోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

దివః కిం బాన్ధవః స్యాత్ప్రియసుహృదథవాచార్య ఆహోస్విదర్యో
రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమోజః
ఏవం నిర్ణీయతే యః క ఇవ న జగతాం సర్వథా సర్వదాసౌ
సర్వాకారోపకారీ దిశతు దశశతాభీషురభ్యర్థితం వః

“ఈ లోకములలో సూర్యుని ఏమని భావించాలి? దేవుడనియా? బంధువనియా? ఆచార్యుడనియా? లేక కులీనుడైన ప్రభువనియా? అది కాకుంటే సర్వలోక రక్షకుడనియా? మరి సూర్యుని లోకాలకు కన్నులాంటివాడందామా? దీపమందామా? పోనీ పూజ్యుడందామా? లేక ప్రాణమే అందామా? జన్మ కారణమందామా? పైన చెప్పినవారిలో సూర్యుడ్ని ఎవరని చెప్పగలం? నిజానికి వీరిలో ఒక్కడని సూర్యుని వర్ణించలేము. ఎందుకంటే సర్వ కాలాల్లో, సర్వ విధాలా, సర్వాన్నీ ఇచ్చేవాడు సూర్యుడు. సర్వ దేవత రూపమున, బాంధవాది రూపమున, లోకాలకు మహోపకారం కలిగించేవాడు సూర్యుడు. అతడు సర్వ దేవతా స్వరూపుడు. అట్టి సహస్ర కిరణ సూర్యుడు మిమ్ములను రక్షించు గాక!”

****************
శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారి తెలుగు వ్యాఖ్యతో సూర్యశతకం ఏ.వీ.కే.ఎఫ్ లో లభ్యం. లంకె ఇదిగో!

You Might Also Like

7 Comments

  1. N.karthik

    I want to buy this book

  2. Kumar

    Thanqqqqq…….thanqqqqq …….

  3. భాస్కరభొట్ల జనార్దన శర్మ

    నాకు సూర్యారాధన పైన లేక సూర్యుడి విషయమైన ఏ పుస్తకమైనా అత్యంత సంభ్రమాన్నిస్తుంది.. ఈ పుస్తకం గురించి మొదటిసారిగా ఇక్కడే తెలుసుకున్నాను.. మీరిచ్చిన ఉదాహరణలు , మచ్చు లు చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి..ఇంత గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. .

  4. రాఘవ

    మఱొక మాట. శ్రీనాథుడి పద్యాలు ఉదహరించారు చూచారా, అది మఱీ బాగుంది. 🙂

  5. రాఘవ

    ౦ మీ పరిచయం బాగుంది.

    ౧ ఇదివఱకెప్పుడో ఈమాటలో అనుకుంటాను తొలిసారి చూచానండీ ఈ మయూరశతకాన్ని. అప్పుడు మొదటిపద్యం విడగొట్టకుని అర్థం చేసుకునేసరికి నాకున్న ఓపికకి తరువాత చదువుదాములే అనిపించింది. తరువాత దాదాపు ఆఱు నెలల క్రితం ఈ పద్యాలు చదివి తెగ ఆశ్చర్యపోయాను ఏం వ్రాసారూ ఈ మయూరకవి అని!

    ౨ ఈ శతకపు కాగితం ప్రతి నావద్ద లేదు, కొనుక్కోవాలి.

    ౩ “2003 ఫిబ్రవరిలో ప్రచురించారు… కేవలం వేయి ప్రతులు ముద్రించిన ఈ పుస్తకం 2011 లో నాకు దొరకడం గొప్ప విషయమే.” అంటూ మీరు పొఱబడుతున్నారండీ, 2023 లో కూడా ఈ పుస్తకం ప్రతులు దొఱికినా ఆశ్చర్యపోనక్కఱలేదు. సంస్కృతం ఎవరికి కావాలండీ? “మనవాళ్లు వఠి వెధవాయిలోయ్” అని ఊరకే అన్నాడా గిరీశం!

  6. రవి

    సాధారణంగా లౌకిక సంస్కృత సాహిత్య ప్రస్తావన వచ్చినప్పుడు అనేకులు పంచమహా కావ్యాలు, రూపకాలు, కొద్దో గొప్పో చంపూ కావ్యాలను ఎక్కువగా ప్రస్తావిస్తారు. శతకాలను అంతగా పండితమ్మన్యులు పట్టించుకున్నట్టు కనబడదు. మయూరశతకం అందుకు ఒక మినహాయింపు కావచ్చును. అంచేతనే జయదేవుడు కవితాకన్యక కర్ణాభరణంగా మయూరుని పేర్కొన్నాడు.

    మమ్మటుని కావ్యప్రకాశాన్ని మీరు ప్రస్తావించారు. అందులో కావ్యప్రయోజనాల గురించి చెప్పేటప్పుడు మయూరుని ప్రస్తావన వస్తుంది.

    “కాలిదాసాదీనామివ యశః, శ్రీహర్షాదేర్ధావకాదీనామివ ధనం, రాజాదిగతోచితాచారపరిజ్ఞానమ్, ఆదిత్యాదేర్మయూరాదీనామివానర్థనివారణమ్..” ఇలా చెప్పుకుంటూ వస్తాడు. అంటే “కాలిదాసాదులకు వలె కీర్తిని, ధావకాదులకు శ్రీహర్షాదుల వద్దనుండి వలె ధనాన్ని, రాజుల నడవడిక తెలుపడం ద్వారా వ్యవహార జ్ఞానాన్ని, సూర్యుని నుండి మయూరాది కబులకు వలె అనర్థనివారణనూ…” కావ్యం ప్రయోజనంగా ఇస్తుందంటాడు.

    బాణభట్టు మయూరుడు బంధువు అన్న విషయం ఆసక్తికరంగా ఉంది.

    అద్భుతమైన గ్రంథం గురించి చెప్పారు. నెనర్లు.

    1. kusuma1955

      బాణభట్టు మయూరుడు బంధువు – surprise

Leave a Reply