ప్రేమను ప్రతిపాదించే కవిత్వం

రాసిన వారు: బొల్లోజు బాబా
(ఈ వ్యాసం మార్చి 2011 “పాల పిట్ట” మాసపత్రికలో ప్రచురింపబడింది. శ్రీ గుడిపాటి గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను ….. బొల్లోజు బాబా)
**********************
ఓ కొత్తమొహంజోదారో, ఇసకగుడి కవితాసంపుటులను వెలువరించిన ­ఆకెళ్ళ రవిప్రకాష్ తాజా సంకలనం పేరు “ప్రేమ ప్రతిపాదన”. దీనిలో మొత్తం 47 కవితలున్నాయి. వేటిలోనూ అస్ఫష్టతా ఛాయలు కనిపించవు. అన్వయ కాఠిన్య తిరగళ్ళను కట్టుకొని లేవు. ఇజాల చట్రాలలో తమను తాము బంధించుకోవు. స్వేచ్చగా, సౌందర్యంగా, సాంద్రంగా సాగుతూ- అదే సమయంలో ఈ కవి చేస్తున్నది ఉపరితల దర్శనం కాదనీ ప్రతీ వాక్యం వెనుకా లోతైన అవగాహనా, రెండున్నర దశాబ్దాల కాలంలో నిర్మించుకొన్న తనదైన నిర్ధిష్టమైన శైలి, ఒక థీమ్ ఉన్నాయని తెలియచేస్తూంటాయి.

నా కవిత్వం అనే కవితలో …
//తేమగా ఆకుల చుట్టూ పరుచుకున్న చీకటిని
సాయంత్రపు రాగంలోకి సన్నగా కరిగిపోయే మధ్యాహ్నపు హోరుగాలిని
సముద్రపు కళ్ళల్లోకి వేదనల వలల్ని
రాత్రి గూడులో స్వచ్ఛంగా
చమక్కుమంటున్న గతం పక్షినీ,
మునివేళ్ళ అంచుల్లోంచి
జాలువారుతున్న కాంతిపర్వతాలనీ,
అనువదిస్తూ,
నిండారా నా ఆత్మనదిలో స్నానిస్తూ
స్వప్నిస్తూ,
స్వప్నిస్తూ,
స్వప్నిస్తూ.
—- అంటూ ఈ కవి తన కవిత్వాన్ని చాలా స్పష్టంగా నిర్వచించుకొన్నాడు. “స్వప్నాల్ని నమ్ముకో ఎందుకంటే వాటిలోనే స్వర్గలోకపు ద్వారాలు దాగొని ఉన్నాయన్న” ఖలీల్ జిబ్రాన్ మాటలు ఇక్కడ స్మరణదాయకం.

సరిహద్దుల మీద పెద్దగా నమ్మకం లేదు నాకు
కాశ్మీర్ అయితేనేం కాందహార్ అయితేనేం
సరిహద్దుల్ని అతిక్రమిస్తాయి కాబట్టి
పక్షులంటే యిష్టం నాకు.
పక్షి పైకి ఎగిరిన కొద్దీ దానిముందు
సరిహద్దులన్నీ వెలతెల పోతాయి.
(ప్రేమ ప్రతిపాదన) అంటూ మొదలౌతుందీ సంకలనం. సరిహద్దులు మన జీవితాల్ని శాసిస్తాయి. అవి ఓ ప్రాంతానివో, ఒక భాషవో, ఒక అనుభవానివో లేక ఒక ఆలోచనవో కావొచ్చు. మానవచరిత్రలో సరిహద్దులు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తించాడు కనుకనే ఈ కవి సరిహద్దులు లేని ప్రపంచాన్ని స్వప్నిస్తున్నాడు. అందుకే ఈ ప్రపంచానికి ఒక “ప్రేమ ప్రతిపాదన” చేస్తున్నాడు. దీని అక్షరక్షరంలో నిజాయితీ, లోకంపట్ల అవ్యాజమైన ప్రేమ కనిపిస్తాయి.

వైయక్తిక అనుభవాన్ని సామాజిక అనుభవం చేసినపుడే అద్భుతమైన కవిత్వం పుడుతుందన్న రహస్యం తెలిసిన వాడు రవి ప్రకాష్. ఈ ప్రక్రియలో పదాల రణగొణ ధ్వనుల్ని నాశనం చేసి- ఒక గాఢమైన నిశ్శబ్దాన్ని వాక్యాలలో నింపుతాడు. అనేక దైనందిక అనుభవాలు గొప్ప లయతో అంతే గొప్ప శిల్పంతో ఈ కవి స్వరంలోంచి ప్రవహించి చక్కని కవితలుగా రూపుదిద్దుకొన్నాయి.

ఇంటికి దూరంగా ఒక హోటల్ గదిలో నిద్రరాని రాత్రి గురించి వ్రాసిన కవిత ఆ అనుభవాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింప చేస్తుంది.
నిద్రరాని నా కళ్ళు
నలుపు ఆకాశం మీద
ఎగురుతున్న
వలస పక్షుల రెక్కల్లా వణుకుతూ (హోటల్) ……..
అంటూ ముగిసే ఈ కవితలో హోటల్ అనేది మనది కాని ఓ ప్రపంచానికో/సంస్కృతికో ప్రతీక.

కాలం నుదిటిమీద అనే కవితలో పలికించిన భావాలు రవిప్రకాష్ ను గొప్ప మానవతా వాదిగా నిలబెడ్తాయి.
అందరి జీవితాల్ని అందంగా తీర్చి దిద్ది
తీరం మీద చిన్న గుర్తుకూడా
మిగలని ప్రేమ మూర్తుల జాబితాని
కాలం నుదుటమీద కొత్తగా
ఎవరయినా దిద్దితే బాగుణ్ణు
— (కాలం నుదుటమీద). తిలక్ మానవుడిని ఏ ప్లేన్ లో చూస్తూ కవితలు వ్రాసాడో అదే ప్లేన్ లోంచి చూస్తూ రాసిన కవితలా అనిపిస్తుంది.

విల్లుపురం జంక్షన్ అనే కవితలో నిరీక్షణ కు కవి ఇచ్చిన దృశ్యరూపం రంగుల చీకట్లను సంతరించుకొవటం ఒక అద్బుతం.

రాత్రిలోకి కిక్కిరిసిన జనం.
క్షణాలు నిమిషాల్ని
నిమిషాలు గంటల్నీ నిర్ధయగా చదువుతూంటాయి.
చీకటిలోకి చేతులు చాస్తుంది
తలలా వేళాడుతున్న గడియారం.//
అసలెప్పుడైనా కలగన్నానా
ఒక అపరిచిత ధ్వని సముదాయంలో
అదే పనిగా కొట్టుకుపోతానని ——
(విల్లుపురం జంక్షన్)

రాత్రుళ్ళ దారాలు
అవిశ్రాంతంగా వేదనల
అదృశ్య వస్త్రాల్ని
మనసు మగ్గం మీద నేస్తున్నపుడు
ప్రశాంతంగా నాలో కొలువు తీరు ——-
(అంతర్యామి)

యానాం గోదారికి వంతెన కట్టిన సందర్భంలో ఆ నదీ ప్రవాహాన్ని జీవనయానంతో పోలుస్తూ రాసిన ఓ కవితలో….
నది ఎన్నటికీ రహదారి కాదు
సులువుగా దాటే ఉపాయం వెతుక్కోవటానికి,
అది నా గత వర్తమానాల్ని
కలుపుతూ సాగే ప్రవాహం
అందుకే మీరంతా తలో వంతెనా కట్టుకుని
నదిని దాటి వెళ్ళిపోండి
ఈ రేవునీ, పడవల్నీ, తెరచాపల్నీ నాకొదిలేసి.
(జీవనదీ సందర్భం) అంటూ ఈ కవితలో పలికించిన నవ్యత, భావుకత చాలు రవిప్రకాష్ కవిత్వపు లోతుల్ని అంచనా వేయటానికి. ఈ కవిత లో ఉన్న సందర్భం, వ్యక్తీకరణ, కధనం, లోతైన ముగింపు వెరసి ఈ కవితే ఓ సజీవ నదైంది.

కవిత్వం కవియొక్క ఆత్మకథ. ఇక మిగిలినవన్నీ ఫుట్ నోట్సుల వంటివి అన్న యవ్ జెనీ మాటలకు రవి ప్రకాష్ పదేళ్ళ వ్యత్యాసంతో వ్రాసిన రెండు కవితలు అద్దం పడతాయి.
1. నాలుగు చితుకుల మధ్య
మండుతున్న సూర్యగోళం ముందు
ఒక మహా కావ్యానికి ఆవిష్కర్తలా
కూర్చునుంటాడు నాన్న//
దుఖాఃన్ని పోగులుగా లాగిపెట్టి
పదే పదే మంత్రాల్ని వల్లిస్తుంటాడాయన
పదం పదంలోనూ కోల్పోయిన
ఒక వ్యక్తిని తిరిగి తెచ్చుకొంటాడు
— (నిరంతరయాత్ర – ఇసకగుడి, 2000)
2. అమ్మ నుదిటి మీంచి జారిపోయిన
సూర్యబింబం కనురెప్పల్నించీ
నిరంతరంగా స్రవిస్తూనే వుంటుంది.
దుఖాఃన్ని పోగులుగా లాగిపెట్టి
మంత్రాన్ని పదే పదే వల్లిస్తూ
మూడు భూప్రపంచాల మధ్యకి
నాన్న జ్ఞాపకాల్ని ఆహ్వానిస్తాను
. (దేహ వస్త్రం – ప్రేమ ప్రతిపాదన, 2011)
ఈ రెండు కవితలలో కవి తాత, తండ్రి గార్ల సంస్మరణ కర్మలు గొప్ప తాత్వికతతో, ఆర్ద్రంగా, విశ్వజనీనతతో ఆవిష్కరింపబడ్డాయి. జీవన సందర్భాలపై వెలుగును ప్రసరింపచేసే ఒక్క వాక్యమైనా చాలు రసాత్మకం అయితీరుతుందనటానికీ, తాను నడచిన మార్గపు ఆనవాళ్ళని కవి తన కవిత్వంలో జారవిడుస్తాడు అనటానికీ కవితలే చక్కని ఉదాహరణలు.

నిన్ను రాయవద్దని ఎవరైనా నిలువరించినపుడు, చచ్చినా సరే రాసి తీరాలన్న పట్టుదల నీలో ఉన్నప్పుడే కవిత్వం రాయటానికి ఉపక్రమించు – అని రిల్కే ఒక ఔత్సాహిక కవికి సలహా ఇస్తాడు. అదే విధంగా ప్రాపంచిక వ్యవహారాల వత్తిడుల వల్ల రాయకుండా ఉండలేనితనం కూడా కవికి నరక ప్రాయమే. రాయలేనితనం కవినెట్లా బాధిస్తుందో రవిప్రకాష్ అక్షరం అనే కవితలో సూటిగా ఆవిష్కరింపబడింది. ఇందులో ఒక చోట…

రాయలేని తనం
నా ఆత్మ మూలాల్లోకి
చొరబడి నన్ను జ్వలిస్తుంది…….
. అంటాడు. అంతే కాదట తనలోని “కవిమరణాన్ని ప్రకటించుకొన్న ప్రతిసారీ అసంఖ్యాక కవితా రహదారులు మళ్ళీ మళ్ళీ మహోదృతంగా నాలోకి సుడులు తిరుగుతూ”……. ప్రవేశిస్తాయి అనటం ద్వారా జీవితాన్ని సంపూర్ణం చేసేది ఎప్పటికయినా కవిత్వమే అని నిరూపిస్తాడు.

కవికి ఉన్న సామాజిక అవగాహన అనేక కవితలలో ప్రతిబింబించింది. ఉదా. మహానాయకులు చెప్పిన విషయాలను గాలికొదిలేసి వారిని విగ్రహాలుగా వీధి చివర ప్రతిష్ఠించుకోవటంలోని డొల్లతనాన్ని విగ్రహం అనే కవితలో….
నడిచి నడిచి అలసిపోయి చౌరస్తాలో
దిక్కుతోచక ఆగిపోయిన ఆదర్శంలా
మిగిలి ఉంటుంది విగ్రహం.
(విగ్రహం) అని ఎత్తిచూపుతాడు. ఈ నిర్లక్ష్యపు పర్యవసానం “యుద్ధం యిపుడు మన వూపిరి పొలిమేరల్లోనే వుంది” అనటం ద్వారా ఈ కవి రాబోయే పునఃసృష్టిని సూచిస్తున్నారనిపించక మానదు.

ప్రపంచ సాహిత్యంలో స్త్రీవాదం వినిపించినంత విస్త్రుతంగా, బలంగా పురుషుని కోణాన్ని ఆవిష్కరించిన సందర్భాలు కానరావు. కొత్తలిపి అనే కవితలో….
ఆర్ధిక స్వేచ్ఛకోసమో
శ్రమ ఫలితం కోసమో
నాలోని సగం నాతో చేసే యుద్దపు
ఓనమాలు కూడా అర్ధం కానివాణ్ణి
ఇంకా తపిస్తూనే ఉంటాను//
బహుసా ఈ లిపిని
మీరెవ్వరూ అనువదించరు.
(కొత్తలిపి) అని అంటాడు. ఈ కవితా వస్తువులోని నవ్యతా, దృక్కోణం ఆలోచింపచేసేదిగా ఉంటుంది.

భోపాల్ విషవాయువుల బాధితుల గురించి (మరణం పక్కగది), రోడ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతున్నదని ఉత్తరం వ్రాసినందుకు హత్యచేయబడిన సత్యేంద్రకుమార్ అనే యువ ఇంజనీర్ గురించీ (ఓ మహాత్మా), తస్లిమా నస్రీన్ పై (ద్విఖండిత), మదర్ థెరెసా పై (దీప శిఖ) వ్రాసిన కవితల ద్వారా – ఈ కవి అలంకారాలు, పదచిత్రాలతో సామాజిక వాస్తవికతను సుందరీకరించే బాపతుకాదని, స్పష్టతతో, బాధ్యతతో పదాలను పదునెక్కించి సంధించే రకమని అర్ధమౌతుంది. మరీ ముఖ్యంగా ద్విఖండిత కవిత. భావస్వేచ్ఛకు మన కాలపు సింబల్ తస్లిమా నస్రీన్. ఆమె ఆత్మకధ పేరు ద్విఖండిత. నమ్మిన భావాలను బతికించుకోవటం కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని సమర్ధించటం ఒక సామాజిక బాధ్యత. అందుకనే ఇలా అంటాడు
తనని తను
పరాయి దేశాలకు
వెలివేసుకొని
ఆంక్షలు వివక్షలు లేని
కొత్తయుగపు ఆకాంక్షని
మనందరికీ
కానుకగా యిస్తోంది.
(ద్విఖండిత)

చెట్ట్లుకూలుతున్న దృశ్యం అనే కవితలో ఎవర్ని నిందించాలో తెలియని, అసలు కారణాలుఏమిటో కూడా అర్ధం కాని ఒకానొక భీభత్స, భయానక దృశ్యావిష్కరణ అద్బుతంగా జరిగింది. చాలా లోతైన గొప్ప కవిత.

ఈ కవికి నగర జీవనం ఒక లౌల్యమేమో ననిపిస్తూంది. శివారెడ్డి గారు ముందుమాటలో చెప్పినట్లు రవిప్రకాష్ మూడు సంపుటాలలో సుమారు 14 కవితలు నగరజీవనం మీదో లేక ఆ నేపథ్యంతోనో ఉంటాయి. నగరం అంటేనే కొత్త స్వరాలు, కొత్త ఘర్షణలు, కొత్త అనుభూతులు. ఇవే కదా కవిత్వానికి ముడిసరుకు. “గొప్ప కళా ఖండాలన్నీ నగరాల్లోనే జనించాయి” అని ఎజ్రా పౌండ్ అన్నది అందుకేనేమో. ఈ సంకలనంలో “నగరం నా దేహం” అన్న దీర్ఘకవితలో. నగర జీవనం కొత్త అర్ధాలతో అగుపిస్తుంది.

జనన మరణాల జాడ ఎవరికి తెలుసు.
ఈ నిరంతర ప్రయాణంలో
నా అంగాంగాలతో
అలుపు లేకుండా
చెలిమి చేసిన
ఎడతెగని మజిలీ యీ నగరం
ఈ నగరం నా దేహం ……
అని తాను నివసిస్తున్న పాండిచేరీ నగరంతో తాను మమేకమయినవిధాన్ని వర్ణిస్తాడు.

నగర జీవనం తరువాత రవిప్రకాష్ కవిత్వంలో బలంగా వినిపించే మరో వస్తువు సముద్రం. ఈ సంకలనంలో ముంబాయి సముద్రం, విన్నపాలు వినవలె అనే కవితలకి సముద్రమే కాన్వాసు.
గంధకపు వాసనలో
మునిగి తేలుతున్న
మురికి వాడలన్నీ
రాత్రిలోకి కురిసిన
వర్షపు దారాల్లోకి చిక్కడతాయి.
(ముంబాయి సముద్రం) మురికి వాడలు వర్షపు దారాల్లోకి చిక్కడతాయి అన్న ప్రయోగం కొత్తది, చాలా బాగుంది.

’వెర్టికల్ పొయెం’ అనే కవితలో లో వసుధైక కుటుంబాన్ని ఈ కవి స్వప్నించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఇజాల పరిమితులలో చిక్కడి, గోడ అవతల ఏముందో చూడ సాహసించలేని అక్షరాశ్రయులను “కాసేపు నిలువెత్తుగా దూసుకుపోదాం” రమ్మని ఆహ్వానిస్తాడు. ఎగిరిన కొద్దీ మేడలూ పూరిళ్ళూ ఒక్కటై కనపడతాయట, ఎగిరిన కొద్దీ భూప్రపంచం మొత్తం సమైక్యంగా కనిపిస్తుందట- ఎగిరి ఎగిరి చిట్టచివరకు తొలకరిగా కురుద్దాం రండి అని సహ అక్షరాశ్రయులను పిలుస్తున్నాడీ కవి. ఈ కవితలో కనిపించే మరో ఆశక్తి కలిగించే అంశమేమిటంటే – ఈ కవితనిర్మాణంలో తీసుకొన్న ప్రతీకలు చదువరిని క్రమక్రమంగా ఆకాశంలోకి తీసుకెళ్ళి మరలా భూమిని చేర్చిన అనుభూతిని కలిగిస్తాయి. అది శిల్పంపై కవి సాధించిన పట్టు.

ఈ కవితల్లో పదచిత్రాల సౌందర్యం, ఆర్థ్రత, జీవితాన్ని చదివి చేసిన వాఖ్యానం, పదబంధాల నవ్యత్వం, తాత్వికత ఉన్నాయి. చక్కని చిక్కని కవిత్వం ఇష్టపడేవారికి “ప్రేమ ప్రతిపాదన” తప్పక నచ్చుతుంది.

ఆసుపత్రిగీతం, ముసుగు, అనగనగా యీరోజు వంటి కవితలలో కవిత్వాంశ పలుచబడినట్లున్నా కవితా వస్తువుని కొత్తగా చూపిన విధానం బాగుంది. ఈ సంకలనంలో మూడు అనువాద కవితలు కూడా ఉన్నాయి. రెండు నెరుడావి (ఒక్కటిగా, ప్రశ్నలు), ఒకటి జిబ్రాన్ ది (ఏడు పశ్చాత్తాపాలు).

ఈ పుస్తకానికి ముందుమాట శ్రీ శివారెడ్డిగారు, ఆత్మీయ వాక్యాలు శ్రీ దాట్ల దేవదానం రాజు గారు వ్రాసారు. అందమైన కవర్ పేజీ డిజైన్ చేసింది శ్రీ అక్బర్. శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్ గారు ఉద్యోగరీత్యా పుదుచేరీ సివిల్ సర్వీసులో డైరెక్టరు స్థాయిలో పనిచేస్తున్నారు.

కాపీల కొరకు
పాలపిట్ట బుక్స్,
16-11-20/6/1/1,403,
విజయసాయి రెసిడెన్సీ,
మలక్ పేట్, హైదరాబాద్ – 500036

బొల్లోజు బాబా గారికి సంబంధించి పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలను ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

3 Comments

  1. chittibabu

    good review

  2. siva

    very balanced review

Leave a Reply