రంగనాయకమ్మ గారి, “పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం[మార్క్స్‌ ‘కాపిటల్‌’ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు]” – మనకి తెలియాల్సిన కనీస సమాజ జ్ఞానం

రాసిన వారు: జె.యు.బి.వి.ప్రసాద్
********************
ఒక పంజాబీ పెద్ద మనిషితో పరిచయం అయింది. ఆయన ఒక యూనివర్శిటీలో బస్‌ డ్రైవరుగా పని చేస్తూ వుంటాడు. అతని భార్య ఏదో పాథాలజీ పరిశోధనశాలలో చిన్న ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ కిద్దరు పిల్లలు. పెద్దాడు ఏడో తరగతి. రెండో వాడు ఐదో తరగతి. నేను వారానికి, వాళ్ళిద్దరికీ కలిపి, రోజుకి రెండేసి గంటల చెప్పున, రెండ్రోజులు చదువు చెబుతాను. అంటే, ‘సవ్యసాచి’ లాగా, ఒకే సమయంలో రెండు వేర్వేరు తరగతుల వారికి చదువు చెబుతాను. నా నాలుగ్గంటల శ్రమకి గానూ, ఆ పెద్ద మనిషి, ప్రతీ శుక్ర వారం రాత్రీ, కొన్ని చపాతీలూ, రెండు కూరలూ, ఒక డబ్బాడు పెరుగూ ఇస్తాడు. నాక్కావల్సిన తిండి ఆయన నాకు పెడితే, వారికి కావల్సిన చదువు నేను వారికి చెప్పానన్న మాట. ఇక్కడ చదువుకీ, తిండికీ మారకం జరిగింది. దీన్నే బార్టరు పద్ధతి అంటారు. మారకం విలువ (డబ్బు కొలత) చూడకుండా, ఉపయోగపు విలువ దృష్టితో, “ఒకరికి కావలసింది ఇచ్చి, తమకి కావలిసింది తీసుకున్నారు”.

ఈ పదాలు కొంచెం ‘కఠినంగా’ వున్నాయా? అవును, వాటి అర్థాలు తెలియక పోతే, కఠినంగానే అనిపిస్తాయి.

ఆ పంజాబీ పిల్లలిద్దరూ చాలా చురుగ్గా వుంటారు. మా సంభాషణ లన్నీ ఇంగ్లీషు లోనే జరిగాయి.

“డబ్బంటే ఏమిటీ తెలుసా మీకు?” అనడిగాను. ఈ మధ్యనే ఈ ప్రశ్న అడగాలని నేర్చుకున్నాను.

“ఎందుకు తెలియదూ? బాగా తెలుసు” అన్నారిద్దరూ యుగళ కంఠంతో.

“మరయితే చెప్పండి” అన్నాను ఆసక్తితో.

చిన్నాడు మాటల కోసం తడుముకున్నాడు.

“మరే, మరే, మనం ఏదన్నా కొనుక్కోవాలంటే, వాళ్ళకి ఏదయితే ఇవ్వాలో, దాన్నే, ‘డబ్బు’ అంటాము” అని చెప్పాడు పెద్దాడు.

వాడు చెప్పింది కావలిసిన సమాధానం కాకపోయినా, తప్పు సమాధానం కూడా కాదు కదా?

“మరి బంగారం ఎందుకు ఎక్కువ ఖరీదో తెలుసా?” అనడిగాను.

“ఎందుకేవిటీ, అది ఎక్కడా దొరకదు కదా? అందుకే” అని చెప్పాడు చిన్నాడు చురుగ్గా.

నవ్వాను.

“ఏమన్నా కొనుక్కోవాలంటే, మనకి ‘డబ్బు’ ఎక్కణ్ణించీ వస్తుందీ? ఎలా వస్తుందీ?” అనడిగాను.

కాస్సేపాలోచించారు అన్నదమ్ములిద్దరూ.

“బయటికి వెళ్ళి పని చేస్తే, మనకి ‘డబ్బు’ ఇస్తారు. దాంతో మనం మనకి కావల్సినవి కొనుక్కుంటాం. మాకైతే, మా అమ్మా, నాన్నా బయట పని చేసి, డబ్బు సంపాదించి, అందులోంచి కొంత ఇస్తారు.” అన్నాడు పెద్దాడు.

“బయట పని చెయ్యక పోతే, డబ్బు రాదా?”

“రాదు. పని చెయ్యకుండా డబ్బు ఎలా వస్తుందీ?”

“మరి చాలా మందికి ఏ పనీ చెయ్యకుండానే బోలెడు డబ్బు వచ్చేస్తోంది. మరి దాన్నేమంటారూ?”

“అంటే, వాళ్ళు ఎవరో పని చేసిన వాళ్ళ దగ్గిర్నించీ డబ్బు తీసేసుకుంటున్నారన్న మాట” అన్నాడు పెద్దాడు వెంటనే.

ఆ మాటలకి ముచ్చటేసింది. ఇంత చిన్న విషయం ఎందరో పెద్ద వాళ్ళకి కూడా అర్థం కాదు కదా?

“వచ్చే వారం నించీ, ప్రతీ క్లాసు లోనూ మీకు సమాజం గురించి చిన్న చిన్న విషయాలు చెబుతాను, ఓ పది నిమిషాల సేపు. వింటారా?” అనడిగాను.

వాళ్ళు బుద్ధిగా తలూపారు.

ఆ రోజు సాయంత్రమే, మా చుట్టాలబ్బాయి వచ్చాడు. అతను వచ్చేటప్పటికి, రంగనాయకమ్మ గారు రాసిన, “పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం” పుస్తకం, రెండో సారి చదువుతున్నాను.

ఆ పుస్తకం పేరు చూసి కూడా, “ఏం పుస్తకం చదువుతున్నా వన్నయ్యా?” అనడిగాడు నవ్వుతూ.

ఆ పుస్తకం పేరు అతనికి కనబడేలా పట్టుకున్నాను నవ్వుతూ.

“పేరు చదివా నన్నయ్యా. అందులో వున్న విషయాలేంటీ? అవి తెలుసుకుందామని” అన్నాడతను.

“చెబుతా గానీ, ముందర ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు” అని, డబ్బు గురించీ, బంగారం గురించీ ప్రశ్నలడిగాను.

అనుకున్నట్టుగానే, అంత పెద్ద చదువులు చదివిన ఆ పెద్ద మనిషి, ఒక్క ప్రశ్నకీ సమాధానం సరిగా చెప్పలేదు. ఎటొచ్చీ అతనికి నిజాయితీ వుంది. తన జవాబులు తర్క బద్ధంగా లేవని వెంటనే ఒప్పేసుకున్నాడు.

“ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలకి జవాబులు వున్నాయా?” అని ఆసక్తిగా అడిగాడు.

“ఉన్నాయి. సరుకు అంటే చెబుతుంది. ఉపయోగపు విలువ, మారకం విలువ గురించి చెబుతుంది. ఉత్పత్తి క్రమం గురించి చెబుతుంది. అదనపు విలువ గురించి చెబుతుంది. రక రకాల శ్రమల గురించి చెబుతుంది. బూర్జువా సంస్కృతి గురించి చెబుతుంది. ఇంకా చాలా విషయాలు చెబుతుంది.”

“మరి ఈ విషయాలన్నీ చిన్న పిల్లలకి అర్థం అవుతాయా?”

“మరీ చిన్న పిల్లలకి అర్థం కావు. నాలుగో తరగతి గానీ, ఐదో తరగతి గానీ చదివే పిల్లలకి అర్థం అవుతాయి చక్కగా. పిల్లలే కాదు పెద్దాళ్ళు కూడా చదవాలి ఈ పుస్తకం.”

“పెద్దాళ్ళీ పుస్తకం చదివితే చాలా?”

“కాదు. పెద్దాళ్ళు ముందర ఈ పుస్తకం చదివాక, రంగనాయకమ్మ గారు రాసిన, ‘ కాపిటల్‌ పరిచయం’ చదవాలి. అప్పటికి చాలా స్పష్టత వస్తుంది.”

“ఊఁ ఈ పుస్తకంలో ఇంకా ఏమేం వున్నాయి?”

“విషయ సూచిక చూడు” అని చూపించాను.

ఈ పుస్తకంలో వున్న చాప్టర్లు:

1. ‘డబ్బు’ అంటే ఏమిటి’
2. ‘వస్తువుల’ అంటే ఏమిటి?
3. ‘వస్తువుల్ని’ ఎలా తయారు చేస్తారు?
4. చొక్కాని ఎవరు కుట్టారు?
5. ముడి పదార్ధానికి, ముడి పదార్థం!
6. ‘చెట్టు’కి ముడి పదార్థం ఏది?
7. సహాయక పదార్థాలు
8. ‘శ్రమ’ అంటే ఏమిటి?
9. వస్తువుల్ని తయారు చెయ్యని శ్రమలు
10. ‘శ్రమ’ అంటే – పనే, కానీ ప్రతీ శ్రమా పని కాదు!
11. ‘మారకాలు’ అంటే ఏమిటి?
12. వస్తువు ‘ఉపయోగపు విలువ’
13. వస్తువుకి ‘మారకం విలువ’
14. వస్తువుని తొందరగా చేస్తే? ఆలస్యంగా చేస్తే?
15. పాత శ్రమా, కొత్త శ్రమా
16. ‘విలువ’ని ఎలా చూడగలం?
17. వస్తువు విలువ, వస్తువుకి బైట ఎందుకు ఉంటుంది?
18. విలువ అసహజమైనది!
19. విలువ అంతా శ్రమదే! అది, ఏ పదార్థానికీ కాదు!
20. సహజ పదార్థమూ + శ్రమ = వస్తువు
21. బార్టర్‌ మారకాల సమస్య!
22. డబ్బు వచ్చేసింది.
23. ‘డబ్బు’తో ఏం చేస్తారు?
24. ‘ఉపయోగపు విలువ’ లేని, ‘విలువ’ మాత్రమే వున్న విచిత్ర వస్తువే – డబ్బు
25. డబ్బు, మారకాలకు మధ్యవర్తా?
26. డబ్బు, సమస్త వస్తువులకూ ‘విలువ రూపం!’
27. ‘ఉపయోగపు విలువ’ లేని ‘విలువ’ కూడా లేని మరింత వింత వస్తువు కాయితం డబ్బు!
28. డబ్బు స్థానంలోకి, బంగారం పోయి, కాయితం వచ్చిందా?
29. శ్రమలు చెయ్యడం ఎందుకు?
30. శ్రమల్లో తేడాలు
31. ‘విలువ’ అంటే శ్రమ; ‘శ్రమ’ అంటే విలువ కాదు
32. శ్రమ, ‘విలువ’గా, మారడం ఎలా జరుగుతుంది?
33. డబ్బు అనేది ‘రూపం లేని శ్రమ!’
34. మానవ సంబంధాలు అంటే శ్రమ సంబంధాలే!
35. ‘శ్రమని దోచడం’ మొదలైంది!
36. బానిస యజమానుల వికృత సంస్కృతి
37. పేద-ధనిక తేడాల కారణం
38. శతృ వర్గాలు
39. ‘ఆస్తి’ గురించి రావలసిన ప్రశ్న!
40. బానిస యజమానుల సమాజంలోనే వర్తకమూ – వర్తక లాభమూ, అప్పులూ – వడ్డీలూ!
41. బానిస యజమానుల సమాజంలోనే ‘రాజ్యపాలన’ ప్రారంభం
42. బానిసలకు, మత గ్రంధాలు బోధించిన పాప పుణ్యాలూ, స్వర్గ నరకాలూ!
43. యజమానీ శ్రామిక సంబంధాలు!
44. భూస్వాముల సమాజం
45. ‘భూమి కౌలు’ అంటే, శ్రమ దోపిడీ!
46. పెట్టుబడిదారీ విధానం ప్రారంభం!
47. పెట్టుబడి లక్ష్యం – లాభం!
48. పాత శ్రమా + కొత్త శ్రమా = ఉత్పత్తికి మొత్తం శ్రమ
49. ‘ధర’ గురించి కొన్ని అంశాలు
50. ‘అదనపు శ్రమ’ ఎలా జరుగుతంది?
51. ‘అదనపు విలువ’ని ఎవరెవరు తింటారు?
52. అదనపు శ్రమ, అదనపు విలువ, అదనపు ఉత్పత్తి
53. ‘పెట్టిబడి’ బ్రహ్మాండమైన అబద్ధం!
54. లాభం వచ్చేది పెట్టుబడికా, పెట్టుబడిదారుడికా?
55. భూస్వామ్య కౌలు, 2 భాగాలైంది!
56. శ్రమ ఎరగని కౌలు రైతు!
57. శ్రమ దోపిడీ, ఈ నాటికీ ప్రపంచమంతటా సాగుతూనే వుంది!
58. బూర్జువా మాంత్రికుడు!
59. ‘ధర’ గురించి ప్రధాన సందేహం!
60. ‘విలువ’ గురించి పరిశోధన 2 వేల సంవత్సరాల కిందట ప్రారంభమైంది!
61. మేధావుల అజ్ఞానాలు!
62. శ్రమ దోపిడీ జరుగుతుందనే రహస్యాన్ని కనిపెట్టింది ఎవరు?
63. ఉత్పాదక శ్రమలూ, అనుత్పాదక శ్రమలూ!
64. అనుత్పాదక శ్రామికులు అదనపు విలువని ఇస్తారా?
65. పెట్టుబడిదారుడి పని స్తలంలో అనుత్పాదక శ్రమలు
66. ‘ఉత్పత్తి సాధనాల విలువ’ బదిలీ
67. వర్తక కార్మికులు అనుత్పాదక కార్మికులే!
68. దేశంలో వున్న డబ్బు అంతా ఉత్పాదక కార్మికుల శ్రమలదే!
69. ఉత్పత్తి తయారైన తర్వాత కూడా చేరే విలువలు
70. ఉత్పత్తి తయారైన తర్వాత
71. మారకం శ్రమలు విలువలుగా మారవు
72. కుటుంబ శ్రమలు
73. పోటీ! అసహ్యమైన మాట!
74. ఉత్పత్తి శక్తి!
75. పాలించే వర్గ భావాలే ప్రజల భావాలు!
76. భారీ యంత్రాలూ, విమానాలూ, కంప్యూటర్లూ, అన్నీ పనిముట్లే! సూది లాంటివే!
77. నిరుద్యోగం, పెట్టుబడిదారీ విధానం సృష్టి!
78. ప్రతీ జీతమూ ‘శ్రమ శక్తి విలువ’ కాదు!
79. పెట్టుబడిదార్ల ఆదాయాల్ని చూపించే కొన్ని మచ్చు తునకలు!
80. భారత దేశపు కులాలు ‘దోపిడీ శ్రమ విభజన’ ఫలితాలు!
81. పెట్టుబడిదారీ ధర!
82. పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు ‘లాభం’ గురించి ఏం చెపుతారు?
83. పెట్టుబడిదారీ సృష్టి – సంక్షోభాలు
84. సంక్షోభాల గురించి మరి కొంత
85. సంక్షోభాల వార్తలు కొన్ని
86. మానవులందరూ వర్గ మానవులే. ‘వర్గం’ అనేది ఏక శిల కాదు!
87. యుగ యుగాల మకిలితో వున్న కార్మిక వర్గం
88. ఈ దోపిడీ ప్రపంచం మారదా?
89. వర్గాల మధ్య సామరస్యంతో ఐక్యత ఏర్పడదా?
90. తల – ఆలోచించడానికి!
91. స్వర్ణ యుగం, వెనక కాదు, ముందు ఉంది
92. సమ సమాజం ప్రారంభం!
93. కమ్యూనిజం తర్వాత కమ్యూనిజమే!
94. కార్మిక వర్గం, సాధించ వలసిందేమిటి?
95. భ్రమల్ని, వాస్తవాలు ఓడించి తీరుతాయి.”

“అబ్బో! చాలా పెద్ద పుస్తకం అన్న మాట!”

“అబ్బెబ్బే! ఇందులో వున్న పేజీలు 384. ప్రతీ చాప్టరూ చిన్నదే.”

“అలాగా!”

“అసలు వీటిని చాప్టర్లు అనకూడదు. పిల్లల కోసం రాసిన పాఠ్య పుస్తకం. ప్రతీదీ ఒక పాఠం. ఇవి మార్క్స్‌ ‘కాపిటల్‌’ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు. ప్రతీ పాఠం లోనూ ముద్దొచ్చే బొమ్మలు వున్నాయి. ఒక బొమ్మలో భూస్వామీ, భూస్వామి భార్యా కూడా, ఇతరుల లాగే, తట్టలు మోస్తూ, మట్టి తవ్వుతూ, పని చేస్తూ వుంటారు. అలాంటి మార్పు జరిగితే, అది ఎంత బాగుంటుందో! ప్రతీ పాఠం చివరా, ప్రశ్నలూ, జవాబులూ కూడా వున్నాయి. మొదట పాఠం చదవాలి. తర్వాత ప్రశ్న చదివి, జవాబు మనకి మనం చెప్పు కోవాలి. ఆ తర్వాత, పుస్తకంలో వున్న జవాబుతో మన జవాబుని పోల్చి చూసుకోవాలి. కరెక్టుగా వుంటే సంతోషించాలి. తప్పయితే, కరెక్టు జవాబు తెలుసుకుని సంతోషించాలి. ఇంగ్లీషులో, ‘విన్‌ విన్‌” అంటారే, అలాగన్న మాట.”

“ఎవరన్నా నువ్వు చెప్పినట్టు చదవ గలరా?”

“ఎందుకు చదవలేరూ? ఆంధ్ర ప్రదేశ్‌ లోనే, చాలా చోట్ల, కొన్ని సంఘాల వాళ్ళు, ఈ పుస్తకాన్ని, ‘అధ్యయన తరగతుల్లో’ చదువుతున్నారని విన్నాను. సామాజిక శాస్త్రం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస వుండాలే గానీ, ఎంతో ఇష్టంగా చదువుతారు, ఇంత సులభ శైలిలో వున్న పుస్తకాల్ని. శ్రమా, మారకాలూ, ఉత్పత్తీ, అదనపు విలువా, పని చేసే వాళ్ళూ, పని చేయని వాళ్ళూ, డబ్బూ, బంగారం, లాంటి విషయాలన్నీ సామాజిక సైన్సుకి సంబంధించినవి. ప్రకృతికి సంబంధించిన విషయం అయితే, పరిశోధనాశాలలో పరీక్ష నాళికలూ, గట్రా ఉపయోగించి, రుజువు చెయ్యొచ్చు. సామాజిక సైన్సుకి సంబంధించిన విషయాలు తర్కంతో మాత్రమే రుజువు అవుతాయి. సమాజమే పరిశోధనాశాల. మనుషులే పరీక్షా నాళికలు.”

అతను నవ్వాడు నా కవిత్వానికి.

“ఇలాంటి సామాజిక సైన్సు విషయాలు పిల్లలకి చిన్నప్పట్నించీ అర్థం అయ్యేలా చెప్పక పోతే, పెద్దయ్యాక ఎన్నెన్నో విషయాలు అర్థం చేసుకోలేక కష్టపడి పోతారు.”

“నువ్వు చెబుతుంటే ఇంకా వినాలని వుంది. చెప్పు చెప్పు.”

“నేనెంత చెప్పినా, అది నువ్వు చదివిన దానితో సమానం కాదు. నువ్వు ఈ పుస్తకం చదివి తీరాలి. అప్పుడే నీకు కొంత జ్ఞానం వస్తుంది. కొత్తగా నేర్చుకున్న జ్ఞానం చాలా సంతోషాన్ని కలగ జేస్తుంది.”

“తప్పకుండా చదువుతాను గానీ, ఇంకా కొన్ని విశేషాలు చెప్పు ఈ పుస్తకం గురించి.”

“ఈ పుస్తకం లోని పాఠాల పేర్లు చెప్పడమే, ఈ పుస్తకం గురించి చెప్పినట్టు. ఆ పాఠాల పేర్లు చదివితేనే, కొంత తెలుస్తుంది. ఇక లోపలి విషయాలు చదివితే, ఇంకా తెలుస్తుంది. ఇంకో విషయం. 384 పేజీలు వుండి, రాయల్‌ సైజులో హార్డ్‌ బండులో వున్న ఈ పుస్తకం ఖరీదు 100 రూపాయలు మాత్రమే. ‘ఈ పుస్తకం ధర గురించి’ అని పుస్తకం చివరలో రంగనాయకమ్మ గారు ఒక మాట రాశారు. అది చదివితే, పుస్తకం ధర ఎలా నిర్ణయించారూ అన్నది తెలుస్తుంది.”

“ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?”

“ఈ పుస్తకం దొరికే చోటు: అరుణా పబ్లిషింగ్‌ హౌస్‌, ఏలూరు రోడ్డు, విజయవాడ – 520 002 (ఫోను: 0866-2431181). అంతే కాదు, హైదరాబాదులో కూడా ఈ పుస్తకం దొరుకుతుంది..”

“మరి అమెరికాలోనో, వేరే దేశంలోనో వున్న వాళ్ళు, ఈ పుస్తకం తెప్పించు కోవాలంటే ఎలాగా? ఆ పుస్తకాల షాపు వాళ్ళు, అమెరికాకి పుస్తకం పోస్టులో పంపుతారా?”

“ఏమో! ఆ సంగతి నాకు తెలియదు. అయితే, ‘అభో-విభో-కందాళం ఫౌండేషన్‌’ వారు ఈ పుస్తకాన్ని ఇంటరునెట్‌లో స్వల్ప ధరకి అమ్ముతున్నారు. విదేశాల్లో ఉన్న వారు, ఈ లింకు ఉపయోగించి, ఆ పుస్తకం తెప్పించుకోవచ్చు.”

“బాగుంది, బాగుంది. మరి…”

“ముందర ఈ పుస్తకం చదివి అప్పుడు మాట్టాడు ఇందులోని సంగతుల గురించి. ఒక విషయం గురించి మాట్టాడాలంటే, ఆ విషయం గురించి కనీసంగా నైనా తెలుసుకుని మాట్టాడాలి. చదువు ముందర. ఆఖరుగా, రంగనాయకమ్మ గారు, అట్ట వెనకాల రాసిన కొన్ని మాటలు చదువుతాను, విను.”

– “పిల్లలకు సైన్సు విషయాలు కుడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం.”

– “…….. మనం మనుషులం; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, ఏ జ్ఞానాలూ అక్కర లేదు. కానీ, మనుషులకు, మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్థిక శాస్త్రమే, మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ, వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి – ఇవాల్టి – రేపటి జీవితాల్ని చూపిస్తుంది. ఇది ప్రతీ మనిషికీ తెలిసి వుండాలి.”

You Might Also Like

11 Comments

  1. m.surya narayana reddy

    రంగనాయకమ్మ గారి రచనలు వాటి గురించి మీ వెబ్ సైట్ లో తెలపడం వల్ల ఎంతో ప్రయోజకరంగా వుంది చాల మందికి వారి రచనలు చదివె అవకాసం కల్పిసున్నమీకు దన్యవాదాలు వారి రచనలు నీటి సమాజానికి ఎంతో అవసరం వుంది .

    మరక సూర్య నారాయణ రెడ్డి.పులివెందల.

  2. సౌమ్య

    నేనూ ఇవ్వాళే ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. చాలా సులభంగా అర్థమయ్యేరీతిలో ఉంది ఇప్పటిదాకా. అప్పట్లో మీ పరిచయం తరువాతే ఈ పుస్తకం గురించి తెలిసింది కనుక ధన్యవాదాలు.

  3. Rambabu

    పుస్తకం చదివితే ఎటువంటి విషయాలు తెలుస్తాయో చాలా సులభంగా అర్ధమయ్యే రీతిలో రాసారు. సరుకు గురుంచి , మారకం విలువ గురుంచి , అదనపు విలువ గురుంచి, శ్రమల గురుంచి , రరకాల శ్రమల గురుంచి,ఉత్పత్తి శక్తుల గురుంచి , ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. నా దగ్గర ఈ పుస్తకం ఉంది . ఈరోజే చదవటం మొదలు పెడతాను .

  4. తార

    దీని ఆంగ్ల అనువాదం ఎక్కడైనా దొరుకుతుందా?

    ఆ ఏమీ లేదు, నాకు కార్లా హాఫ్ అనే ఒకావిడ మీద చాలా కోపం ఉన్నది, ఆవిడకి ఇది పంపిద్దాం అని, కాకపొతే ప్రాణాపాయం లేకుండా మొదటి నాలుగైదు పేజీలే పంపిస్తాను, అంతవరకూ ఆంగ్లానువాదం దొరికినా పర్లేదు.

    కొద్దిగా సహాయం చేద్దురు.

    1. n.k babu, editor NANI children monthly.

      ranganayakamma garu english lo testunnaru.

  5. దుర్గ

    మా దగ్గిర ఇంతకుముందు రంగనాయకమ్మగారు రాసిన ‘తెలుగు నేర్పడం ఎలా?’ అనే పుస్తకం వుంది. నేను మా పిల్లలకు తెలుగు ఆ పుస్తకం చదివే నేర్పించాను, నేర్పిస్తున్నాను. ఈ పుస్తకాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. తెప్పించుకుని చదివి పిల్లలకు కూడా నేర్పిస్తాను. మా చుట్టు పక్కల పిల్లలకు కూడా తెలుగు
    నేర్పాలని నా కోరిక కానీ వారందరూ, చిన్న జియ్యర్ స్వామి వారు స్థాపించి ‘ ప్రజ్ఞ ని ‘ స్థాపించి పిల్లలందరికీ శ్లోకాలు, భారత, రామాయణం కథలు, పెద్ద పిల్లలకు, వేదాలు అవి నేర్పిస్తున్నారు. అందరూ అక్కడికే వెడతారు. మా పిల్లలను పంపించమని వారికి ఆశ్చర్యం! ఈ పుస్తకాల గురించి తెలిపినందుకు చాలా చాలా సంతోషం.

  6. bollojubaba

    పరిచయం విభిన్నంగా ఉంది

    పుస్తకం అద్బుతంగా ఉంటుంది. ఇది వచ్చిన కొత్తలో మా ఎకనమిక్స్ మాస్టారు, “మే పిల్లలకు ఈ విధంగా పాఠాలు చెప్పలేకపోతున్నాం” అంటూ తెగ ఇదయిపోతూంటే నాకు ఆశ్చర్యం కలిగి, తీసుకొని చదివానీ పుస్తకం నాకు తెలిసిన/తెలియని చాలా విషయాలు కొత్తకోణంలో చెప్పబడ్డాయి.

    బాగానే గుర్తుచేసారు. మా అమ్మాయికి ఈ సమ్మర్ ప్రెసెంటేషన్ గా ఇస్తానీ పుస్తకాన్ని 🙂

    బొల్లోజు బాబా

  7. d.l.vidya

    It is an excellent review to the excellent book “Pillala kosam arthika saastram”.Ranganayakamma garu wrote the book in a language that can be easily understood by children.Prasad garu wrote the review in “Unga Unga language”,so that even the new born develop interest to read it as early as they can.The person who told that “Educative classes” are going on on this book and on “Introduction to Marx’s Capital BY RANGANAYAKAMMA GARU IN SOME PLACES OF ANDHRAPRADESH is I. In Kakinada also we are in an opinion to do the same.We don’t know when that can be materialized.If this process goes on every where ,I am dreaming that I die only after seeing the Communist society, if my life continues till my hundredth year.Prasad garu’s review is full of creativity. Pillala kosam arthika sastram is moving very fast in Andhrapradesh.

  8. manjari lakshmi

    పరిచయం చేసే విధానం చాలా చాలా బాగుంది. రంగనాయకమ్మ గారు చెప్పే విషయాలే ఎంతో తేలికైన భాషలో ఉంటాయనుకుంటే, ప్రసాద్ గారి పరిచయం ఇంకా తేలికైన భాషలో, బుజ్జి పిల్లలకు కూడా అర్ధమయ్యేట్లుగా ఉంది. ఈ పుస్తకాన్ని పరిచయం చేసి చాలా, చాలా మంచి పని చేసారు

  9. Praveen Sarma

    అరుణా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు పోస్ట్‌లో కూడా పుస్తకాలు పంపిస్తారు. నేను ఓసారి అరుణా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళకి ఉత్తరం వ్రాసాను. వాళ్ళు నాకు సమాధానం వ్రాసారు. పోస్టల్ చార్జిలు ఎంతవుతాయో వాళ్ళే చెపుతారు.

  10. వేణు

    సంభాషణ రూపంలో రాసిన ఈ పుస్తక పరిచయం విభిన్నంగా ఉంది. చాలా సరళంగా రాశారు. బాగుంది!

Leave a Reply