శ్రీమదాంధ్రమహాభారతం -ఎందుకు చదవాలి? ఆరణ్యపర్వం- నాల్గవఆశ్వాసం- ఎఱ్ఱాప్రెగ్గడ

శ్రీమదాంధ్రమహాభారతము – ఎందుకు చదవాలి?
ఆరణ్యపర్వశేషము – ఎఱ్ఱాప్రెగ్గడ
నాల్గవ ఆశ్వాసము
*********************
(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు. ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో నాలుగో వ్యాసం ఇది. మొదటి మూడు వ్యాసాలూ గతం లో వచ్చాయి. అరణ్యపర్వం గురించిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
*********************
“భారత కావ్యహార మొక భాగము నన్నయభట్టు గూర్చె ము
క్తారమణీయ వాక్యములఁ దక్కిన భాగము సోమయాజి పెం
పార నొనర్చె, రెంటిఁ గలయన్ శివదాసుఁడు మధ్యనాయక
శ్రీ రచియించె శారద ధరింపఁ, గవిత్రయకీర్తి మించఁగన్.” -చింతలపూడి ఎల్లనార్యుడు(తారకబ్రహ్మరాజీయము)
ఈ పై పద్యంతో శ్రీ జి.వి.సుబ్రహ్మణ్యంగారు ఎఱ్ఱాప్రెగ్గడ ఆరణ్యపర్వశేషానికి వారి పీఠికను మొదలుపెట్టారు. అందుచేత నేనుకూడా అలానే చేస్తే బావుంటుందని అనిపించి అలానే మొదలు పెడుతున్నాను. శ్రీమదాంధ్రమహాభారతం శారద మక్కువతో ధరించే ముక్తారమణీయ కావ్యహారం. అందులో కొంత భాగం నన్నయభట్టు కూర్చాడు. తక్కిన భాగం తిక్కన సోమయాజి సమకూర్చాడు. శంభుదాసుడైన ఎఱ్ఱాప్రెగ్గడ ఆ దండకు మధ్యనాయక మణిశ్రీని సంధానించాడు. దానితో కవిత్రయ కీర్తి మిన్నంటింది. ఆంధ్ర భారతి ధరించే భారత కావ్యహార నాయకమణిశ్రీ – ఎఱ్ఱాప్రెగ్గడ నన్నయ పేర వెలయించిన ఈ ఆరణ్యపర్వ శేషం.
జక్కన తన విక్రమార్క చరిత్రములో కవిత్రయాన్ని ఇలా శ్లాఘించాడు.
“వేయి విధంబులందుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్
పాయక చెప్పి రిట్లు రసబంధుర వాగ్విభవాభిరామ ధౌ
రేయులు శబ్దశాసన వరేణ్యులు నాఁగఁ బ్రశస్తి కెక్కిరే
యేయెడ నన్నపార్యుగతి నిద్ధర? నట్టి మహాత్ము గొల్చెదన్.

పరువడి భారతాఖ్య గల పంచమవేదము నాంధ్రభాష సు
స్థిరత రచించుచోఁ గృతిపతిత్వముఁ గోరి ప్రసన్నుఁడైన యా
హరిహరనాథుచేఁ బడసె నవ్యయసౌఖ్యపదంబు నెవ్వఁ డా
పురుషవరేణ్యుఁ దిక్కకవిఁ బూని నుతింతుఁ గృతాధ్వరోత్సవున్.

ఈ త్రయిఁ దాఁ బ్రబంధ పరమేశ్వరుఁడై విరచించె శబ్ద వై
చిత్రి నరణ్యపర్వమున శేషము శ్రీ నరసింహ రామ చా
రిత్రములన్ బుధవ్రతగరిష్ఠత నెఱ్ఱయ శంభుదాసుఁ డా
చిత్రకవిత్వ వాగ్విభవ జృంభితుఁ గొల్చెద భక్తియుక్తితోన్.”
జక్కన కవిత్రయాన్ని వారి వారి బిరుద నామాలతో పై పద్యాలలో గుర్తించి ఒక వైశిష్ట్యాన్ని ప్రతిపాదించాడు. నన్నయ – “శబ్దశాసనుడు”, తిక్కన – “సోమయాజి”, ఎఱ్ఱన- ”ప్రబంధపరమేశ్వరుడు”.
ఎఱ్ఱన వ్రాసిన కృతులు -4. అవి రామాయణం, ఆరణ్యపర్వశేషం, హరివంశం, నృసింహపురాణం అనేవి. నన్నయ తరువాత నన్నయవలె కవిత్వం చెప్పినవాడు ఎఱ్ఱాప్రెగ్గడ. నన్నయభాగంలో ఇతిహాస స్వభావం ఎక్కువ, ఎఱ్ఱన భాగంలో పురాణ స్వభావం ఎక్కువ. కవిత్రయం వారి శైలులను పెద్దలు ఈవిధంగా వింగడించారు.
నన్నయ శైలి : ధ్వని ప్రస్థానం, వస్తుధ్వని – రసదృష్టి, – కైశికీవృత్తి – వైదర్భీరీతి – ద్రాక్షాపాకం – ప్రసాదగుణం.
తిక్కన శైలి : ధ్వని ప్రస్థానం, రసధ్వని – అభినయ దృష్టి – సాత్వతి, అర్థ కైశికీ వృత్తి – వైదర్భీ రీతి – ద్రాక్షాపాకం – ప్రసాదగుణం.
ఎఱ్ఱన శైలి : ధ్వని ప్రస్థానం, అలంకార ధ్వని – చతురోక్తి – భారతీ వృత్తి – పాంచాలీ రీతి – కదళీ పాకం – మాధుర్య గుణం.
ఈ ఆరణ్యపర్వశేషంలో మనకు తారసిల్లే కథలు – వైవస్వత మనువృత్తాంతం, దేశకాల పరిగణన కథనం, ఖగోళ రహస్యాలు, ఇంద్రద్యుమ్నుడి కథ, వ్రీహిద్రోణోపాఖ్యానం, ధర్మాధర్మానుష్ఠాన ఫలవిపాక వైచిత్రి, అత్రిగౌతమ సంవాదం, సరస్వతీ గీత, పుణ్యపాప ఫలానుభవ విశేషాలు, ప్రఖ్యాత కథలు( వైవస్వతుడి చరిత్రం, కువలాశ్వ చరిత్రం లేదా దుందుమారుడి కథ, మధుకైటభ వృత్తాంతం, అంగిరసుడనే అగ్ని చరిత్రం), అఖ్యాయికలు( బ్రాహ్మణ ప్రభావం, కర్ణుడి జన్మ వృత్తాంతం), దృష్టాంతరూప కథలు (రామాయణ కథ, సావిత్ర్యుపాఖ్యానం, ధర్మార్థ విషయ చర్చ( ధర్మవ్యాధకౌశిక సంభాషణం, అత్రి గౌతమ సంవాదం,సత్యద్రౌపదీ సంవాదం, యక్షప్రశ్నలు- ధర్మజుడి సమాధానాలు )మొదలగునవి.
ఆరణ్యపర్వంలో ధర్మజుడు చేసింది శ్రవణ, మనన, నిదిధ్యాసనలు. శ్రవణం ద్వారా విని, మననం ద్వారా మథించి, తెలిసికొన్నతత్త్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొనటంలో చేసే తీవ్రమైన ప్రయత్నమే నిదిధ్యాసనం. శంకరులు ఈ మూడింటి తారతమ్యాన్ని వివేకచూడామణిలో ఇలా చెప్పారు.
“శృతే శతగుణం విద్యా న్మననం మననా దపి
నిదిధ్యానం లక్షగుణ మనంతం నిర్వికల్పకం”
శ్రవణం కంటె మననం వందరెట్లు గొప్పది. మననం కంటె నిదిధ్యాసనం లక్షరెట్లు శక్తివంతమైనది. నిర్వికల్ప సమాధి వీటన్నటికంటె లెక్కలేనన్ని రెట్లు గొప్పది. బ్రహ్మానందాన్ని పొందటానికి శ్రవణాదులు మూడూ మూడు మెట్లు. శంకరులు ఆత్మబోధలో-
“శ్రవణాధిభి రుద్దీప్తో జ్ఞానాగ్ని పరితాపితః
జీవః సర్వమలా న్ముక్తః స్వర్ణవత్ ద్యోతతే స్వయమ్”. అని అన్నారు
శ్రవణ మనన నిదిధ్యాసనల వలన ప్రదీప్తుడై, జ్ఞానాగ్ని వలన తేజోవంతుడై, సర్వపాపాలనుండి విముక్తుడై, జీవుడు బంగారం వలె ప్రకాశిస్తాడు. యక్షపరీక్షలో ఉత్తీర్ణుడైన ధర్మజుడు పుటం పెట్టిన బంగారంవంటివాడు.
అహింసా ధర్మ మస్తేయం శౌచ మింద్రియనిగ్రహః
దానం దమో దయా క్షాంతిః సర్వేషాం ధర్మసాధనమ్. – యాజ్ఞవల్క్యస్మృతి.
అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, దానం, దయ, క్షాంతి మొదలైన వాటి ద్వారా ధర్మసాధనం చేయవచ్చును.
“ధృతి క్షమా దయా2స్తేయం శాంత మింద్రియనిగ్రహః
హ్రీ ర్విద్యా సత్య మక్రోధో దశకం ధర్మ లక్షణమ్”.
అని మహాభారతం చెపుతున్నది. ధృతి, క్షమ, దయ, అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, లజ్జ, విద్య, సత్యం, అక్రోధం అనే పది లక్షణాలు కలది ధర్మం. యక్షప్రశ్నల చివర ధర్ముడు తన రూపాలు పది అని, తనను చేరే మార్గాలు ఆరు అనీ చెప్పాడు.
ఎఱ్ఱన నృసింహపురాణంలో తన ఆత్మసంవేదనని ఇలా వినిపించాడు.
మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి క్రమ్మ రా
యంచలు కూయఁ గ్రౌంచమును నావలఁ గూయఁ గడంగుభంగిఁ బ్రౌ
ఢాంచిత శబ్దసారులు మహాకవు లాద్యులు కావ్యశయ్యఁ గీ
లించిన కీర్తిసంగసుఖలీలకు నేనును గాంక్షఁ జేసితిన్.
ఎఱ్ఱన ఆరణ్యపర్వశేషాన్ని నన్నయ పేరుమీదనే తెనిగించాడు. ఇది ప్రబంధ పరమేశ్వరుడి ప్రయోగ భూమి. నన్నయ ప్రసాద కవి. ఎఱ్ఱన మధుర కవి. నన్నయ రమ్య, రమణీయ శబ్దాలను వాడితే ఎఱ్ఱన మధుర, మాధుర్య, మనోహర శబ్దాలను వాడాడు. నన్నయ కవిత రమింపచేస్తుంది. తిక్కన కవిత మనసును వికసింపచేస్తుంది. ఎఱ్ఱన కవిత కవిత హృదయాలను ద్రవింపచేస్తుంది.
“పరిఢవింతుఁ బ్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు” కాశీఖండము 1.13 అని శ్రీనాథుడి ప్రశంస.
నిశ్శంక కొమ్మయ కవి అనే ఆయన తన వీరమాహేశ్వరం లో ఎఱ్ఱన గుఱించి ఇలా వాక్రుచ్చాడు.
“నన్నయభట్టుఁ గావ్యరచనానిధిఁ, దిక్కన సోమయాజి న
చ్ఛిన్న మహత్వ సంవిహితశేముషి,; నెఱ్ఱయప్రెగ్గడన్ సము
త్పన్న నవ ప్రబంధరస భావన నింపునఁ బ్రార్థనాంజలుల్
మున్నుగ నాత్మలోఁ దలతు మువ్వురఁ ; మువ్వురఁ బోలు పుణ్యులన్.”
ఈ పద్యం కవిత్రయాన్ని వారి వారి ప్రత్యేక కవితా వ్యక్తిత్వాలతో స్మరించి కవితాసిద్ధిని పొందాలని భక్తితో భావించే ఒక అవిచ్ఛిన్న సంప్రదాయానికి మరొక ఉదాహరణం. ఈ విధంగా ఎన్నో పద్యాలను పేర్కొన వచ్చును. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు – ఋషివంటి నన్నయ రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపుఁదెనుగుతోఁట, ఎఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు – అని ప్రశంసించారు. రండి, మన మిప్పుడు ప్రబంధపరమేశ్వరకృత ఆరణ్యపర్వ శేషాన్ని అవలోకిద్దాం, ఆనందిద్దాం.
స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ చూడగన్. 3-4-142
శారదరాత్రులు – పద్యం వలెనే ఈ పద్యం కూడా చదువుకునే రోజుల్లో మాకు కంఠస్థం చేయదగిన పద్యంగా ఉండేది.
(శరత్కాలంలో సూర్యోదయ సమయాలు కనులపండువుగా శోభిల్లాయి. అప్పుడు మబ్బులు క్రమ్మటాలు తొలగిపోయాయి. బాలభానుడి కిరణాలు విస్తరించాయి. పద్మాలు వికసించి, శోభాయమానంగా వెలుగొందాయి. హంసలు, బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు చేసే కలరవాలు వెల్లివిరిసాయి.)
ఉద్ధురం అంటే దట్టంగా వ్యాపించటం, ఉద్ధురతరం అంటే మిక్కిలి దట్టంగా వ్యాపించటం.
దానాంభపటలంబునం బృధుపయోధారావళిం దాల్చి గ
ర్జానిర్ఘోషము బృంహితచ్ఛలనఁ బ్రచ్ఛాదించి ప్రవృట్పయో
దానీకంబు శరద్భయంబున నిగూఢాకారతన్ డిగ్గె నాఁ
గా నొప్పారె మదోత్కటద్విరదసంఘంబుల్ వనాంతరంబునన్. 3-4-143
(అడవిలో మదించిన ఏనుగులగుంపులు విలసిల్లాయి. శరత్కాలానికి వెఱచి, వానాకాలంలోని మబ్బులగుంపు మారువేషంలో భూమికి దిగి వచ్చాయా అన్నట్లు అవి కనిపించాయి.మదించిన ఏనుగులు కాబట్టి వాటికి మదజలం స్రవించటం కద్దు. అవి మబ్బులకు ఉండే నీటిజల్లులో అన్నట్లు ఉన్నాయి. అట్లే, ఏనుగులు చేసే బృంహితధ్వనులు మేఘాల గర్జనలో అన్నట్లున్నాయి.)
కలనీలకంఠకోలా హలలీలలు సెలఁగె, రాజహంసకులంబుల్
విలసించె, సప్తవర్ణా వని విగళిత కుసుమ కుటజ వాటిక లడరెన్. 3-4-144
(నెమళ్ళ కలరవాలతో కూడిన ఆటలు విలసిల్లాయి. అనగా నెమళులు అవ్యక్తమధురాలైన ధ్వనులు చేస్తూ నృత్యం చేసాయి. రాజహంసల గుంపులు శోభిల్లాయి. ఏడాకుల అరటి చెట్ల గుంపులు మరియు పూలురాలిన కొండమల్లెల పొదలు విలసిల్లాయి.) శరదృతువులో కొండమల్లె (పొన్న) చెట్లనుండి తెల్లని పువ్వులు రాలుతాయి.
అతిగాంభీర్యవిభూతి నేకచుళుకాహంకారనిశ్శేషశో
షితపాథోధిపయస్కుఁ డైన ముని దోఁచెం బుణ్యతేజోమయా
కృతి నయ్యామ్యదిగంతవీథిఁ బ్రకటక్రీడాగర్వ గ
ర్జిత మండూకకళంకితాంబుశుచితాసిద్ధిప్రదానాచార్యుఁడై. 3-4-145
(ఆ శరత్కాలంలో ఆకసాన దక్షిణదిశలో అగస్త్యనక్షత్రం కన్పించింది. ఆ అగస్త్యుడు మిక్కుటమైన నిండు వ్యక్తిత్వంగల మహర్షి. ఆయన సమస్త సముద్రజలాన్ని తనపుడిసిలి పట్టి, ఒక్క చుక్క మిగులకుండ త్రాగివేశాడు. అంతవరకు బెకబెకమని సవ్వడి చేస్తూ క్రీడాలాలసలైన కప్పలవలన బురదగా చేయబడిన నీళ్ళకు నిర్మలత్వాన్ని ప్రసాదించే గురువు ఆ అగస్త్యుడు.) వర్షాకాలంలో కప్పలు బెకబెక మంటాయి. అది కప్పలకు ఋతుకాలం. వర్షాకాలంలో నీళ్ళు బురదగా వుంటాయికదా. శరత్కాలంలో అగస్త్య నక్షత్రోదయ మౌతుంది. అప్పుడు నీరు నిర్మల మౌతుంది.
విశదశారదాంబుద పరివేష్టనమునఁ బొలుచు గగనంబు ప్రతిబింబములొ యనంగ
వికచకాశవనీ పరివేష్టనమున నతిశయిల్లె నిర్మలకమలాకరములు. 3-4-146
(తెల్లని శరత్కాల మేఘాలు చుట్టుముట్టి ఉన్న ఆకసానికి ప్రతిరూపాలో అను నట్లు తెల్లనిపూలు పూచిన రెల్లుమొక్కలచేత చుట్టుకొనబడిన నిర్మల సరస్సులు శోభిల్లాయి.) తెల్లని శరత్కాల మేఘాలు రెల్లుపూలవలె ఉంటాయి. ఇది ఎఱ్ఱన శరత్కాల వర్ణన. విష్ణుదేవుడి రథానికి కట్టబడే 4 గుఱ్ఱాల పేర్లు. శైభ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం.
శ్రీకృష్ణుడు సత్యభామా దేవితో కలసి అరణ్యవాసం చేస్తున్న పాండవులవద్దకు వస్తాడు. వచ్చి ధర్మనందనుని వ్యక్తిత్వాన్ని బహుథా ప్రశంసిస్తాడు. అప్పుడక్కటికి మార్కండేయ మహాముని విచ్చేస్తాడు. ఆయనతో శ్రీకృష్ణు డిలా అంటాడు.
‘ఏనును బాండునందనులు నిమ్మునిముఖ్యులు నిప్డు లోకస
మ్మానితవాక్య ! నీదయిన మంజులవాగమృతప్రవాహమున్
వీనులదోయి నించుచును వేడుకఁ గ్రోలికొనంగ నాత్మలం
బూనెద; మస్మదీప్సితము పూర్ణము సేయఁగ నర్హ మెమ్మెయిన్. 3-4-164
దేవ నరదేవ ధరణీ ! దేవ చరిత్రములు భర్తృదేవత లనఁగా
భూవినుత లయిన సతుల ! ప్రభావము లెఱిఁగింపు మోలిఁ బ్రస్ఫుటములుగన్.’ 3-4-166
(‘వాక్య నిపుణుడవైన మార్కండేయమహర్షీ ! నేనున్నూ, పాండవులున్నూ, ఇక్కడి మునిశ్రేష్ఠులున్నూ మీ మాటలను వినవలెనని ఉవ్విళ్ళూరుతున్నాం. మీ పలుకులు లోకంలోని ప్రజ లెల్లరూ గౌరవించేవి, మీ వాగమృతం మా వీనులకు విందు చేయాలి. మా ఈ కోరికను తాము దయేచేసి మన్నించ వేడికోలు. దేవతల, రాజుల, బ్రాహ్మణుల వృత్తాంతాలను, మహాపతివ్రతలుగా భూలోకంలో యశస్సు నార్జించిన సతీమణుల మహిమలను వరుసగా తేటతెల్లమయ్యేటట్లు ఎఱిగించుము’.) అని ఇలా అడుగుతున్నపుడు నారదులవారు కూడా అక్కడికి విచ్చేసి – కృష్ణుడు, పాండవులు సంతోషించేటట్లు పుణ్యకథలను చెప్పమని- చెప్పి తన దారిని తాను వెళ్తారు. ధర్మరాజప్పుడు మార్కండేయ మహర్షితో ఇదివరకు తాను మునీశ్వరులను అడిగినట్లుగానే మళ్ళీ ఇలా అడుగుతున్నాడు.
‘కడగి ధర్మముతోడ నడచుచు మేమిట్లు ! దందడి దుఃఖంబుఁ బొందుటయును
నేపున నెప్పుడు పాపంబు సేయుచు ! ధృతరాష్ట్రజులు సుఖోన్నతు లగుటయుఁ,
గని యివ్విపర్యమునకు నే నూహింతుఁ ! బాయక నరు డిప్డు సేయు కర్మ
మున ఫల మిందుఁ బొందునొ ? పరలోకంబు ! నందుఁ బొందునొ ? యిందు నందుఁ గనునొ?
విశ్వకర్తయైన యీశ్వరుఁ గానని ! పురుషుఁ గర్మఫలము పొరయకున్నె?
యొడలితోనఁ గృతము వెడలిపోవునొ ? యిది ! దెలియవలయు నాకు నలఘుపుణ్య!’ 3-4-168
(‘మార్కండేయ మహామునీ ! మేము పూనికతో ధర్మం ఆచరిస్తున్నవారమే అయినప్పటికీ ఈవిధంగా ఇడుమలు పొందుతూ మిక్కుటమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ధృతరాష్ట్రతనూజులు ఎల్లప్పుడు పాపకార్యాలు చేస్తున్నవారే అయినప్పటికీ గొప్పసౌఖ్యాలను అనుభవిస్తున్నారు. ఈవిపరీతస్థితిని గురించి నేను ఎక్కువగా ఆలోచించవలసి వస్తోంది. మనుజుడు ఈభూలోకంలో ఇప్పుడు చేసే కర్మఫలం ఇక్కడే అనుభవిస్తాడా ? లేక ఇహంలోనూ పరంలోనూ కూడా అనుభవిస్తాడా ? సృష్టికర్తఅయిన పరమేశ్వరుడిని సందర్శించని మానవుడిని కర్మఫలం పొందకుండా ఉంటుందా ? మరణించిన పిదప శరీరంతోపాటు చేసిన కర్మకూడా వెడలిపోతుందా ? ఓ మహానుభావా ! ఈ విషయాన్ని నాకు తేటతెల్లం చేయండి’.) అని ధర్మరాజు అడగగా మార్కంచేయుడు – ఓ ధర్మరాజా పూర్వకాలంలో, బ్రహ్మదేవుడు తొలుత సృష్టికి ఉపక్రమించిన సమయంలో మనుష్యుల శరీరాలు నిర్మలాలై ఉన్నాయి. వారు పుణ్యాత్ములై ఉన్నారు. అట్టి మనుజులు గొప్పబలవంతులై ఎల్లప్పుడు సత్యాన్నే పలికేవారు. వారికోరికలు ఈడేరేవి. వారు జ్ఞానులు. వారు సర్వస్వతంత్రులై దేవతలు వెళ్ళే దారులలో పయనించగలిగారు. తక్కువ ప్రయత్నంతో ఎక్కువఫలితాలను సులువుగా పొందగలిగారు. వారు సమస్తధర్మాలు తెలిసికొనగలిగారు. వారికి అసూయ మొదలైన దుర్గుణాలు ఉండేవి కావు. వారికి వేలకొలది కొడుకులు, కూతుళ్ళు ఉండేవారు. వారు వేలకొలది సంవత్సరాలు జీవించేవారు. కాని, కాలం గడిచినపిదప, మనుష్యులలో కామం,క్రోధం మొదలైన దుర్గుణాలు ప్రవేశించాయి. వారి ప్రవర్తనలో మాయ చొరబడింది. అందుచేత దేవతలు వారిని విడనాడారు. తదుపరి, వారు బలం లేని శరీరాలతో, ఆయుర్దాయం క్షీణించి, దరిద్రులై, చేసిన గొప్ప ప్రయత్నాలకు తక్కువ ఫలితాలు పొంది, పెక్కు జబ్బులచేత పీడించబడ సాగారు. ఇక ఒకరి నొకరు నిందించు కొంటూ, వేదాలను దేవుడిని నిరసించి పాపకార్యాలు చేస్తూ, మరణానంతరం పశుపక్ష్యాదులుగా తిరిగి జన్మించసాగారు. నరకంలోని అగ్నిలో వేగుతూ, పుట్టుతూ చస్తూ సంసారవలయంలో చిక్కుకొని బ్రదుకసాగారు.)
విశేషం: పుట్టటం, చావటం, మరలా పుట్టటం, చావటం అనే విషవలయాన్నిగూర్చి భారతీయవేదాంతులు పలుతావుల నొక్కి వక్కాణించి ఉన్నారు. తొలుత సృష్టియొక్క తొలి ఉషస్సులలో ధర్మదేవత కామధేనురూపాన నాల్గుపాదాలతో నడచిన దనిన్నీ, రాను రాను కలియుగంలో ఏకపాదమాత్రంగా నిలిచిన దనిన్నీ మూలమహాభారతంలో కనబడుతుంది.
మనుజులు పుణ్యపాపములు మానక యి ట్లొనరించుచుం దుదిం
దనువు దొఱంగి పోవునెడఁ దప్పదు నీడయవోలెఁ గర్మమున్
వెనుకన యేఁగి భూరిసుఖవిస్మృతియుం బటుదుఃఖదైన్యమున్
దనుకఁగఁ జేయుఁ ; గ్రమ్మఱఁగఁ దాన యొనర్చు భవంబు దేహికిన్. 3-4-170
(ఈ విధంగా జననమరణాల వలయంలో తగుల్కొని మానవులు పుణ్యాలు పాపాలు విడనాడక చేయటం చేత, చనిపోయిన తఱువాత కూడా వారి కర్మ నీడవలె వెనువెంటనే నడచివెళ్ళి, సౌఖ్యాన్ని మరపుకు తెచ్చి , దుఃఖం వలన అధిక దైన్యానికి పాల్పడ జేసి శరీరధారులకు మరల మరల జన్మలను కలిగిస్తూనే ఉంటుంది.)
విను మనుజున కెవ్విధమునఁ ! దన చేసిన సుకృత దుష్కృతంబులు నెఱయం
దన కనుభవింపఁ బా లివి;! తనువు సెడుం గాని కర్మతతి సెడ దనఘా! 3 – 4 -171
(పాపరహితుడ వైన ఓ ధర్మరాజా! నేను వివరించేది సావధానంగా ఆలకించుము. మనుజులు తాము చేసిన పుణ్యపాపాలఫలం ఏవిధంగానైనా సరే అనుభవింపక తప్పదు. శరీరం నశించిపోతుంది కాని, కర్మ(ఫల) సముదాయం మాత్రం ఎన్నటికీ నశించదు.)
ఈ లోకమ యగుఁ గొందఱ; ! కాలోకమ కొందఱకు; నిహంబును బరమున్
మే లగుఁ గొందఱ కధిపా ! యే లోకము లేదు వినవె యిలఁ గొందఱకున్. 3-4-173
(ధర్మరాజా! కొందరు ఈ భూలోకంలో సౌఖ్యం అనుభవిస్తారు. కొందరకు పరలోకసౌఖ్యం కలుగుతుంది. కొందరికి ఇహపరాలలో రెండింటను మేలు కలుగుతుంది. కొందరికి ఇహపరసౌఖ్యాలు రెండూ దక్కవు. ఈ విషయాన్ని సావధానంగా వివరిస్తాను.)
ధనములు సాలఁ గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్
మనమున నెన్నడున్ సుకృతమార్గము పొంతకుఁ బోక లోభమో
హనిహతబుద్ధు లై తిరుగునట్టి జనుల్ పరలోకసౌఖ్యముల్
గనుటకు నేర రిప్పటి సుఖంబులు మేలయి తోఁచు వారికిన్. 3-4-175
(అధిక సంపదలు కలిగి, పుణ్యం ఆర్జించే మార్గాలవైపునకు పోవక, లోభ మోహాలకు లోనై, విషయసుఖాలను అనుభవించవచ్చునని మనస్సులో ఎల్లప్పుడు తలపోసే వారు, ఆముష్మిక సౌఖ్యాన్ని సంపాదించ సమర్థులు కారు. వారికి ఐహికసుఖాలే మంచివిగా కనబడుతూ ఉంటాయి.)
విశేషం: ఇంద్రియ నిగ్రహంతో కూడిన ఆత్మసంయమనమే విశ్వవిజయంగా సనాతన భారతీయ సంస్కృతి పలుతావుల నొక్కి చెప్పింది.
ఉపవాసవ్రత సంతతాధ్యయన తీర్థోపాసనాది క్రియై
క పరత్వంబునఁ జేసి యైహికము దుఃఖప్రాయమై పోవఁగా
విపులానందముఁ బొందఁ గల్గుఁ దుది నావిర్భూతభోగైకలో
లుపబుద్ధిం జిరపుణ్యశీలురకు నాలోకంబునన్ భూవరా !3-4-176
(ధర్మరాజా! నియమ నిష్ఠలతో కూడిన ఉపవాసవ్రతాలు, వేదాధ్యయనం, తీర్థయాత్రలు, మొదలైన పుణ్యకార్యాలు నిరంతరంగా చేయటంచేత ఈ లోకంలోని అనుభవం దుఃఖమయం కాగా, చివరకు కేవల సౌఖ్యాలే సత్యమైన సౌఖ్యాలే అనుభవించాలనే తలంపు జనించటంచేత చిరపుణ్యశీలురైన వీరికి పరలోకంలో గొప్ప సౌఖ్యన్ని పొందటానికి వీలు కలుగుతుంది.)
ధర్మమ సల్పుచుం దగిలి ధర్మపథంబునఁ జేసి యర్థముం
బేర్మియుఁ గాంచి ధర్మవిధిఁ బెండిలి యై ప్రజలన్ సృజించి స
త్కర్మములం బ్రశస్తములుగాఁ గ్రతువుల్ వొనరించు సజ్జనుల్
ధర్మజ!యిందు నందును ముదంబునఁ గాంతు రభీష్టసౌఖ్యముల్. 3-4-177
(ధర్మరాజా! ధర్మాన్ని ఆచరించి, ధర్మమార్గాన్ని అనుసరించి, ధనాన్ని, గొప్పతనాన్ని ఆర్జించి, ధర్మయుక్తంగా వివాహం చేసికొని సంతానాన్ని కని, మంచికర్మలను ఆచరించి, మెచ్చదగిన యజ్ఞాలను చేసే మంచివారు ఈ భూలోకంలో ఆ పరలోకంలోకూడ వారు కోరుకొన్న సౌఖ్యాలను అనుభవిస్తారు.)
సత్యమును శమంబు శౌచంబు లేక, నా స్తిక్యమును నిషిద్ధసేవనంబు
గలిగి తిరుగు దుష్టకష్టజనశ్రేణి పొలియు నుభయలోకములకుఁ గాక. 3-4-178
(నిజాన్ని చెప్పక, ఇంద్రియనిగ్రహం పాటించక ; పరిశుభ్రత(పవిత్రత) కలిగిఉండక, చేయగూడని పనులను చేస్తూ, నాస్తికులై తిరిగేవారు ఇహపరలోకాలు రెంటికి చెడినవారై చెడునడవడికతో దుఃఖాన్ని అనుభవిస్తూ నశిస్తారు.)
ఇది మానవుల కర్మ నడిచే తీరు. మీరు కాలక్రమేణా మీరు యుద్ధంలో శత్రువులను జయించి శుభాలను పొందగలరు అని చెప్పాడు. తఱువాత ధర్మరాజు మార్కండేయమహామునిని బ్రాహ్మణ ప్రభావాన్ని గుఱించి చెప్పమంటాడు. తార్క్ష్యుడనే మహాముని తన ఆశ్రమం గుఱించి బ్రాహ్మణ ప్రభావం గుఱించి హైహయులకు చెప్పిన విధాన్ని వర్ణిస్తూ ఇలా అంటాడు.
ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్,
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్నఁడున్. 3-4-190
(ఈ ఆశ్రమంలో మేము కొన్ని నియమాలను నిష్ఠతో ఆచరిస్తాం. ఇక్కడ మేం ఎన్నడును కాలహరణం చేయం, ఆహారం పరిశుభ్రంగా ఉంచుతాం, అతిథులను పూజిస్తాం, సత్యవ్రతాన్ని సదా పాటిస్తాం, శాంతి, బ్రహ్మచర్యం మాకు మేలైన అనుష్ఠానాలు. ఇట్టి నియమాలను నిష్ఠతో పాటించటం చేత, ఇక్కడ మాకు మృత్యుభయమే లేదు. అట్లాగే ఎటువంటి భయాందోళనలకూ ఈ ఆశ్రమంలో తావు లేదు. ఇది మా ప్రభావము. మీకు పాపము చేశామనే భయం అక్కఱలేదు. వెళ్ళండి అని చెపుతాడు. ఇదే బ్రాహ్మణ ప్రభావం అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెపుతాడు.)
కాలం యొక్క విలువను గుర్తించి ఒక్క నిముషం కూడా వృథాపుచ్చకపోవటం, ఆహారపరిశుభ్రత, అతిథి సత్కారం, నిత్యసత్యవ్రతం, బ్రహ్మచర్యదీక్ష, శాంతి – అలనాటి ప్రాచీనభారతీయ ఆశ్రమ జీవితంలో మృత్యుంజయసిద్ధిగా అనుష్ఠింపబడేవనేది సుస్పష్టం.
మార్కండేయుడు ధర్మరాజుకు బ్రహ్మక్షత్రస్వరూపనిదర్శనం బయిన అత్రిగౌతమ సంవాదాన్నిలా చెపుతాడు. పూర్వం అత్రిమహర్షి తన భార్యతో నేను సన్యాసాశ్రమానికి వెళ్తున్నాను, నీవు నాతో వస్తావా లేక నీ కొడుకులదగ్గఱే ఉండదలచావా అని అడగ్గా ఆమె కుటుంబం యోక్కబరువు బాధ్యతలను ఎలా నిర్వహించుకోవాలో కొడుకులకు వివరించి దానికై వారికి వలసిన ధనం ఏర్పాటు చేయకుండా సన్యాసాశ్రమానికి వెళ్ళటం ధర్మయుక్తం కాదు, కనుక మీరు వైన్యభూజనపతి దగ్గఱకువెళ్ళి ధనాన్ని యాచించి తీసుకొనివచ్చి పిల్లలకు ఇచ్చి మనం ఆశ్రమానికి వెళ్దాం అంటుంది. సరే అని అత్రి వైన్యుని దగ్గఱకువెళ్ళి అతడిని నువ్వు బ్రహ్మదేవుడిని, ఇంద్రుడివి, చంద్రుడివి అని బాగా పొగడుతాడు.ఆ సభలో పొగడ్తను విన్న గౌతముడనే ముని నోరరరిగిలా ప్రేలుతున్నావు, శంకలేక ఒక మానవమాత్రుడిని ఈ విధంగా పొగడవచ్చా అని వివాదానికి దిగుతాడు. ఆ వివాదపరిష్కారార్థం మునులంతా కలసి సనత్కుమారుని వద్దకు వెళ్ళగా ఆయన
అత్రి నిజంబ పల్కెఁ ; దగ నాతని వాక్యము ధర్మయుక్త మీ
ధాత్రి సమస్తమున్ బృహదుదగ్రభుజాగ్రమునందుఁ దాల్చు సత్
క్షత్రియుఁ డెల్లవారలను గావను బ్రోవఁ బ్రభుండు; గావునన్
శత్రునిషూదనుం డతఁడు శక్రుఁడు నీశ్వరుఁడున్ విధాతయున్. 3-4-202
(అత్రి చేసింది సరైన వాదమే. అతడి ప్రతివాదన సత్యమైనదే, ధర్మంతో కూడినదే. ఈ భూమండలాన్ని సమర్థవంతమైన తనభుజస్కంధాలమీద ధరించే సత్ క్షత్రియుడు, అందరిని కాపాడే ప్రభువు. శత్రువులను నిర్జించేవాడు. కాబట్టి అతడే ఇంద్రుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు అని చెప్పటం సముచితం.)
జనులకు నెల్లను బూజ్యుఁడు ! జనపాలుం డతనిమహితశాసనమున స
జ్జనులును మునులును సద్విధిఁ ! జనువారలు గాక; కడవఁ జన దెవ్వరికిన్.3-4-203
( ప్రజలందరికి ఆరాధించదగినవాడు ప్రజలను పరిపాలించే ప్రభువు. మీరజాలని అతడి ఆజ్ఞవలననే మంచివారు, ఋషులు మంచిమార్గంలో నడవగలరు. ఎవ్వరూ అతడి ఆనతి జవదాటరాదు.) పరాక్రమంతో భూజనులను పరిపాలించే ప్రభువుయొక్క మహిమను ఏవిధంగా వర్ణించటానికి వీలవుతుంది? విశిష్టమైన పరిపాలనాదక్షత కలవాడు, గొప్పప్రభువు, అదృష్టాన్ని తనవశం చేసికొన్నవాడు, సత్యాన్ని కాపాడటానికి ఆగ్రహావేశం కలవాడు, ప్రజలను క్రమశిక్షణతో నడిపించేవాడు, ధర్మంతో కూడిన నడవడిక కలవాడు అనే అర్థాలు కల శబ్దాలతో వేదాలు రాజును అభివర్ణిస్తాయి. పూర్వకాలంలో అధర్మం ప్రబలుతుందేమోననే భయంతో, బ్రాహ్మణులు తమశక్తియుక్తులను రాజులయందు దాచిపెట్టారు. ఆసమయంనుండి, బ్రాహ్మణుల తేజస్సు క్షత్రియుల గొప్పదనం కదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. క్షాత్రబలం లేని బ్రాహ్మణశక్తి, బ్రాహ్మణశక్తి లేని క్షాత్రం రాణించ జాలవు. క్షత్రియుడు బ్రాహ్మణులను పూజించటంచేత, తేజస్సును ఆర్జించి, సూర్యుడు చీకటిని పోగొట్టేటట్లు పాపాలను హరింపజేయగలడు. అందుచేత క్షత్రియుడు అందరికంటె అధికుడు. ఇది నిశ్చయం – అని సనత్కుమారుడు తీర్పు చెప్పాడు. ఆ తీర్పును వినిన మునులందరూ వైన్యుని వద్దకువెళ్ళి ఈ వివరమంతా చెప్తారు. దానికి సంతోషించిన వైన్యుడు అత్రికి వలసిన ధనాన్ని ఇచ్చి పంపిస్తాడు. అత్రి ఆ ధనాన్ని కొడుకులకు పంచిపెట్టి తను భార్యతో కలసి వనాలకు తపస్సు చేసుకోవటానికి వెళ్తాడు. ఇలా మార్కండేయుడు పాండవులకు చెప్పి- సరస్వతీ గీత – అనే ఇతిహాసం చెప్తాను, దానిలో విశిష్టధర్మాలు ఎన్నో ఉన్నాయి, వినండి అని ఇలా చెప్తాడు.పూర్వం తార్ క్ష్యుండు అనే మునివరుడు భారతి నారాధించి ఆమె ఫ్రత్యక్షం కాగా ఆమెని ఇలా అడుగుతాడు.
పురుషున కెయ్యది ధర్మువు? పురుషుం డెద్దానఁ బరమ పుణ్యాత్మకుఁ డై
చిరపుణ్యగతులు పడయును ? దిరముగ నిది యానతిమ్ము దేవీ నాకున్. 3-4-208
(‘ఓ సరస్వతీ దేవీ! దయతో ఈ ప్రశ్నలకు నీవు సరైన సమాధానాలను నాకు సెలవిమ్ము. మనుజుడు పాటించవలసిన ధర్మం ఏది? మనుజుడు ఏవిధంగా పుణ్యగతులు సంపాదించగలుగుతాడు? ఆపుణ్యం ఎట్లా శాశ్వతంగా ఉంటుంది? నీవు చెప్పే సమాధానాలు నా మనస్సుకు సదా అంటిపెట్టుకుని ఉండేటట్లు సెలవిమ్ము’) అని అడుగుతాడు. అప్పుడు భారతి అతనితో ఇలా చెప్తుంది. ఇదిగో ! ఇటువంటి మంచి మంచి విషయాలను తెలుసుకోవటం కోసమనే మనం శ్రీమదాంధ్రమహాభారతాన్ని తప్పకుండా చదవాలి అని నా కనిపిస్తుంది.
‘ధృతి వేదంబులు నాలుగుం జదివి భూదేవుండు నానాధ్వర
వ్రతుఁ డై యుండెడునట్టిపుణ్యుఁ డమరావాసంబునం దుండు ను
న్నతవృత్తస్తనభారమంథర మరున్నారీపరీరంభ సం
భృత రోమాంచ సమంచితాంగుఁ డగుచుం బెక్కేండ్లు సంప్రీతితోన్. 3-4-210
(దీక్షతో నాలుగు వేదాలు పఠించి, పెక్కు యాగాలు చేసి పుణ్యాన్ని ఆర్జించిన బ్రాహ్మణుడు మరణించిన పిమ్మట స్వర్గలోకానికి పోతాడు. అక్కడ గబ్బిగుబ్బలతో నడయాడే అప్సరసల కౌగిలింతలవలన ఏర్పడిన గగుర్పాటుగల దేహంతో అతడు పెక్కు సంవత్సరాలు మిక్కిలి సంతోషంతో గడుపుతాడు.)
మేలగుక్రేపుతోఁ బాలు సాలఁగ గల్గి ! లాలితం బగు తొలిచూలు మొదవుఁ
బాత్రభూతుం డైన శ్రోత్రియునకు నిచ్చు! సదమలచరితుఁ డమ్మొదవు మేన
నెన్నిరోమము లుండు నన్ని వేలేఁడులు ! సురలోకసౌఖ్యవిస్ఫురణ నొందు;
భారంబునకుఁ జాలి భూరిసత్వాఢ్య మై ! బిరుదైన యెద్దు భూసురున కిచ్చి
నరుఁడు ధేనుదశక మిరవొంద నిచ్చిన ! ఫలము వడయు; మఱియు వలువ లొసఁగి
చంద్రలోకమునకు సంప్రీతుఁడై చనుఁ; ! గనక మిచ్చి నాకమునకు నరుగు. 3-4-211
(మంచిదూడతో ఉండి, ఎక్కువ పాల నిస్తున్న మొదటి చూలు ఆవును యోగ్యుడైన శ్రోత్రియబ్రాహ్మణుడికి దానమిచ్చిన పుణ్యాత్ముడు (మరణానంతరం) స్వర్గలోకానికి చేరతాడు. ఆ ఆవు దేహం మీద ఎన్నివెండ్రుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఆ దాత స్వర్గలోకంలో ఉంటాడు. బరువు మోయగల బలం కలిగిన కోడెయెద్దును బ్రాహ్మణుడికి దానం చేసినవాడు పది ఆవులను దానం చేసిన పుణ్యఫలాన్ని ఆర్జిస్తాడు. మరియు, వస్త్రదానం చేస్తే చంద్రలోకానికి పోతాడు. బంగారాన్ని దాన మిస్తే స్వర్గలోకం పొందుతాడు.)
కృతమతి యై యేడేఁడులు హుతవహు ఘృతమునను బ్రీతి నొందించిన సు
వ్రతుఁ డీరేడుతరంబుల పితరులఁ గొని దివికి నేఁగుఁ బెంపెసలారన్. 3-4-212
( దీక్షతో ఏడుసంవత్సరాలు అగ్నిహోత్రుడిని నేతితో వేల్చి సంతృప్తి చెందించిన నైష్ఠికుడు పదునాలుగు తరాలకు చెందిన పితృదేవతలను తనతోపాటు తీసికొని గొప్పదనం ఒప్పారేటట్లుగా స్వర్గలోకానికి వెళ్ళుతాడు.)
సతతంబును శుచి యై దే ! వతలఁ బ్రదీపాగ్నియందు వదలక సంత
ర్పితులుఁగఁ జేసి వడయు నం ! చితముగ గోలోకవాస చిరసౌఖ్యంబుల్. 3-4-213
(ఎల్లప్పుడును పవిత్రతను పాటించి, అగ్నిహోత్రంలో నిరంతరాయంగా హవిస్సులు వేల్చి దేవతలను తృప్తి పొందించేవాడు చాలాకాలం గోలోకంలో సౌఖ్యాలను అనుభవిస్తాడు.) అని అంటూ-
అగ్నిహోత్రం నా స్వరూపానికి సంబంధించిం దని తెలిసికొనుము అన్నియజ్ఞాలలోనూ సమకూర్పబడే వస్తువులు అన్నియు నాకు సంబంధించినవే. నేను అగ్నిహోతృడిముఖంలో నుండి పుట్టుతాను. ఆత్మనుగూర్చిన పరిజ్ఞానం గల విద్వాంసులు అందరకు సమస్త సందేహాలను తీర్చగలను ఎల్లప్పుడు వేద వేదాంగ పారాయణ చేస్తూ, దానధర్మాలు చేసి దుఃఖాతీతులై బ్రదికే మహాత్ములు ఉండేచోటు నా విశిష్టస్థానం. తేనె పాలు చక్కెర మాంసం పిండివంటలు పుష్కలంగా వెచ్చించి(తేనె, పాలు అనే నీళ్ళతో, చక్కెరలనే ఇసుకతెన్నెలతో, మాంసం, పిండివంటలు అనే తీరాలతో, పాయసాలనే బురదలతో అనేక నదులను కల్పించి) యజ్ఞాలు చేసి దేవతలకు సంప్రీతి చేకూర్చే నైష్ఠికులు మరణానంతరం నా లోకానికి చేరగలరు.’ అని సరస్వతీ దేవి ఆనతిచ్చింది. అంత ఆమెకు తార్ క్ష్యుడు భక్తితో నమస్కరించి ఇట్లా ప్రార్థించాడు.
అంబ ! నవాంబుజోజ్వలకరాంబుజ ! శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి ! ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిరా
చుంబితదిగ్విభాగ ! శ్రుతిసూక్తవివిక్తనిజప్రభావ ! భా
వాంబరవీధి విశ్రుతవిహారి ! ననుం గృపఁ జూడు భారతీ ! 3-4-215
( అమ్మా! సరస్వతీ దేవీ ! క్రొత్తపద్మాలవలె ధగధగలాడే చేతులు కలదానా ! శరత్కాలంలోని వెన్నెలవెలుగువలె మిలమిలలాడే మనోహరాకారం కలదానా ! దిగ్దిగంతాలవరకూ కాంతులు వెల్లివిరియజేసే రత్నభూషలు కలదానా ! వేదాలలోని సూక్తాలలో వెల్లడించబడిన స్వీయమహిమ కలిగినదానా ! ఆలోచనల ఆకాశపుదారుల్లో ప్రశస్తరీతిలో విహరించేదానా ! నన్ను దయతో మన్నించుము.)
ఈ పద్యం తెలుగువారి నాలుకలపై చాటువువలె చిరకాలంనుండి నాట్యమాడుతున్నది. చాలామందికి ఈపద్యం వ్రాసిన కవి ఎఱ్ఱన అని తెలియదు. పోతన భాగవతం లోని అవతారికలో ఈపద్యం కన్పించటం చేత పలువురు ఇది పోతన కవికృతమనిన్నీ, భాగవతం లోని పద్యం అనిన్నీ భ్రమించటం కద్దు. అనుప్రాసాలంకార ప్రియుడైన పోతన మహాకవి ఈ పద్యాన్ని తన భాగవత అవతారికలో ఒజ్జబంతిగా స్వీకరించి చేర్చెనని భావించవచ్చును. (ఈ పద్యం నా కెంతెంతో ఇష్టమైన పద్యం. చిన్నప్పుడు, స్కూల్లో చడువుతున్నప్పుడు ఇది కూడా మాకు కంఠస్థం చేయదగిన పద్యంగా ఉండేది.) తరువాత మార్కండేయుడు ధర్మరాజుకు వైవస్వత మనువు చరిత్ర చెపుతాడు.
ప్రాచీన భారతీయసంస్కృతి పదునాల్గురు మనువులను పేర్కొంటున్నది. ఈ సందర్భంగా హరివంశమ్(1-7-4) లోని ఈ శ్లోకాన్ని ఓసారి చూద్దాము.
“స్వాయుంభువో మను స్తాత మను స్స్వారోచిష స్తథా
ఉత్తమ స్తామస శ్చైవ రైవత శ్చాక్షుష స్తథా
వైవస్వతశ్చ కౌరవ్య సాంప్రతో మను రుచ్యతే
సావర్ణిశ్చ మను స్తాత భౌచ్యో రౌచ్య స్తథైవ చ
త థైవ మేరు సావర్ణా శ్చత్వారో మనవ స్ప్మృతాః”
మన్వంతరం అనగా డెబ్బదియొక్క దివ్యయుగాల కాలం. ప్రస్తుతం జరుగుచున్నది ఏడవ మనువు వైవస్వతమన్వంతరం. మన్వంతరం – కృతయుగం-17,28,000 మానవ వత్సరాలు; త్రేతాయుగం-12,96,000 మానవ వత్సరాలు; ద్వాపరయుగం- 8,64,000 మానవ వత్సరాలు; కలియుగం- 4,32,000 మానవ వత్సరాలు. ఈ నాలుగు యుగాలు కలిసిన కాలం ఒక మహాయుగం. వేయి మహాయుగాలు కలిస్తే హ్రహ్మకు ఒక పగలు. అట్లే బ్రహ్మకు ఒక రాత్రి. ఒక బ్రహ్మ దివసంలో పదునాల్గురు మనువులు పరిపాలిస్తారు. అనగా 337142658 సంవత్సరాలు ఒక మన్వంతరం. ఇంతవరకు స్వాయుంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు అనే మనువుల ఏలుబడి గడిచింది. ప్రస్తుతం గడుస్తున్నది వైవస్వత మన్వంతరం. – అందులో – ప్రస్తుతం కలియుగం ఇరువది ఎనిమిదవ ఆవృత్తం.
మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వైవస్వత మనువు భగవంతుడైన మత్స్యం సహాయంతో సప్తఋషులను ఒక ఓడ సహాయంతో కాపాడటాన్ని గుఱించి, తదనంతరం మహాప్రళయాన్ని గుఱించి వివరిస్తాడు. ఆ సందర్భంలో నారాయణుడు తన మహాత్మ్యాన్ని మార్కండేయునకు వర్ణిస్తూ,
నారము లందురు జలముల:! నారయ నారములు నాకు నయనం బగుటన్
నారాయణుఁ డనుపేర న ! పారనిగమఫణితులందుఁ బరఁగుదుఁ బేర్మిన్. 3-4-265
(ఓ మార్కండేయ మహర్షీ! జలాలకు పర్యాయపదం నారములు. నాకు జలాలు స్థానం. అందుచేత నాకు ‘నారాయణుడు’(నారములు స్థానంగా కలవాడు) అనే సార్థకనామధేయం ఏర్పడింది.)
అట్టి నారాయణాఖ్యుండ నైన నేను శాశ్వతుండ నై ప్రభుఁడనై సకలజగము
లోలిఁ బుట్టింతుఁ బాలింతు నుచితవేళ సంహరింతుఁ జిదానందశాలి నగుచు. 3-4-266
(ఆ విధంగా ‘నారాయణుడు’ అనే పేరుకల నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, పాలించేవాడిని, జ్ఞానంతో కూడిన ఆనందం కలవాడినౌతూ, వెల్లివిరిసే ఈ లోకాలనన్నిటిని క్రమంగా నేనే సృష్టిస్తాను, నేనే ఏలుకొంటాను, తగిన సమయంలో వాటిని లయం చేస్తాను.)
అంబుజాసనుఁ డింద్రుఁ డీశ్వరుఁ డంతకుండు ధనేశ్వరుం
డంబుధీశుఁడు లోనుగా సుర లస్మదాకృతు; లుర్వి పా
దంబు, లగ్ని ముఖంబు, సూర్యసుధాకరుల్ నయనంబు, లీ
యంబరంబు శిరంబుగా నిటు లద్భుతాకృతి నుండుదున్.3-4-267
(పద్మం పీఠంగా గల బ్రహ్మదేవుడున్నూ, వేల్పులను పాలించే ఇంద్రుడున్నూ, ధనానికి అధిపతి అయిన కుబేరుడున్నూ, సముద్రాలకు అధిపతి అయిన వరుణుడున్నూ, మిగిలిన వారందరున్నూ , నా అంశను పంచుకొన్న నా ప్రతినిధులే సుమా ! భూమి నాయొక్క పాదాలు, అగ్నిహోత్రుడు నా ముఖం, సూర్యచంద్రులు నా నేత్రాలు, ఈ ఆకాశం నా శిరస్సు, ఈ విధమైన అద్భుతాకారం ధరించి నేను విలసిల్లుతాను.) ఇంకా
ఎప్పుడు ధర్మహాని యగు, నెప్పు డధర్మము మీఱుఁ గ్రూరు లై
యెప్పుడు దైత్యు లుబ్బుదురు, హీనతఁ బొందుదు రెప్డు వేల్పు లే
నప్పుడు సత్కులీనులగృహంబుల నుద్భవ మొంది లీలమై
నెప్పటియట్ల నిల్పుదు సురేంద్రుల నంచిత ధర్మపద్ధతిన్. 3-4-276
( లోకంలో ఎప్పుడు ధర్మానికి కీడు ఏర్పడుతుందో, ఎప్పుడు అధర్మం విజృంభిస్తుందో , ఎప్పుడు రాక్షసులు క్రూరులై అతిశయిస్తారో, ఎప్పుడు వేల్పులు హీనస్థితికి దిగజారుతారో, అప్పుడు మంచికులానికి సంబంధించిన వారి ఇండ్లలో జన్మించి, దేవతలను దేవేంద్రుడిని కాపాడి యథాప్రకారం ధర్మమార్గంలో నిలబెట్టుతాను.)
యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత ! అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్!!
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ! ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే !!
ఈ ఘట్టం భగవద్గీతలోని శ్రీకృష్ణుని ప్రవచనం. ఈ శ్లోకాలకు ఎఱ్ఱాప్రగ్గెడ వారి అనువాదం పై పద్యం. ఇవే శ్లోకాలను కీ.శే. శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిగారు వారి భగవద్గీత ఆంధ్రీకరణంలో ఇలా అనువదించారు.
చంపకమాల.
యుగ యుగమందు ధర్మము లయోమయమై నశియింపుచుండ,నా
యుగ యుగమందు ధర్మము యథోచిత రీతిని నుద్ధరింప , బు
ట్టుగఁ గొనుచుందు మాయను నిటుల్ స్వవశంబగు కారణమ్మునన్ ,
జగమున దుష్టులన్ దునిమి , సాధుగణంబుల రక్షసేయగన్. ౫
తరువాత కలియుగంలో ధర్మం ఏకపాదాన వర్తిల్లుతుందని చెప్తూ ఆ విషయాన్ని ఇంకా ఇలా వివరిస్తున్నారు. చూడండి.
సత్యంబు నరులకు సంక్షిప్త మగు; సత్య ! హాని నాయువు గడు నఱిగిపోవు;
నాయువు దఱిఁగిన నల్పంబు లగు విద్య ! లల్పవిద్యలను మోహంబు మిగులు;
మోహంబు వలనఁ బై ముసురు లోభంబు; లో ! భావేశమునఁ గామ మగ్గలించుఁ;
గామంబుపెంపునఁ గడఁగుఁ గ్రోధంబు; క్రో ! ధంబున వైర మెంతయును బెరుఁగు;

వైరమున నశేషవర్ణులు నన్యోన్య ! పీడ సేయుచును విభిన్న బుద్ధి
నొక్కఁడొకని మేర నుండక వర్ణ సం ! కరము సేయఁగలరు కలియుగమున. 3-4-287

(మనుజులలో సత్యం తరిగిపోతుంది. సత్యహానిమూలంగా ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయుస్సు క్షీణించటం వలన చదువులు తరిగిపోతాయి. అల్పవిద్యలవలన మోహం ప్రబలుతుంది. మోహం ప్రబలటం వలన లోభం పైగ్రమ్ముతుంది. లోభం విజృంభించటంచేత కామం అధికమౌతుంది. కామం వలన కోపం ఏర్పడుతుంది. క్రోధం అతిశయించటం వలన పగ ఏర్పడుతుంది. పగ ఏర్పడటం వలన భిన్నకులాలవారు అన్యోన్యహింసకు పాల్పడతారు. ఈవిధంగా ఎవరిహద్దులలో వారు ఇమడకపోవటం చేత వర్ణసాంకర్యం ఏర్పడుతుంది.)
జపనియమస్వాధ్యాయ ప్రపంచములు ! విడువఁగలరు బ్రాహ్మణులు, జనా
ధిప! శూద్రులు విపుల తపః ! క్షపితులు గాఁగలరు, వినవె!కలికాలమునన్. 3-4-288
(జనులకు ప్రభువైన ఓ ధర్మరాజా ! కలికాలంలో బ్రాహ్మణులు మంత్రాలను వల్లెవేయటం మానేస్తారు, నిగ్రహాన్ని కోల్పోతారు, వేదాధ్యయనాన్ని వీడుతారు; శూద్రులు తపస్సు నాచరిస్తారు. ఈ విషయాలను సావధానంగా ఆలకించు.)
వివిధవ్యాఘ్రమృగోరగాకులము లై విస్తీర్ణశూన్యాటవీ
నివహాభీలము లై యరాజకము లై నిర్మూలధర్మంబు లై
ద్రవిళాభీరతురుష్కబర్బరపుళిందవ్యాప్తిదుష్టంబు లై
భువిలో నెల్లెడఁ బాడగున్ జనపదంబుల్ దద్యుగాంతంబునన్. 3-4-289
(కలియుగంలో, భూమిమీద అన్నిచోటులలో ప్రజలు నివసించే పల్లెలు పాడయిపోతాయి. పెక్కు పెద్దపులులకు జంతువులకు పాములకు నెలవై భయంకరాలోతాయి. అడవులు విస్తరించి పల్లెలను భయంకరంగా క్రమ్ముతాయి. అవి రాజకాలోతాయి. ప్రభుత్వాధికారం నశిస్తుంది. ధర్మాలు నిర్మూలించబడతాయి. దుష్టులైన ద్రవిళులు, అభీరులు, తురుష్కులు, పుళిందులు విజృంభిస్తారు. జనపదాలు సర్వనాశన మౌతాయి.)
క్షత్త్రియజాతులు శూద్రచ ! రిత్త్రంబున శౌర్యమును సిరియుఁ దేజంబున్
మైత్త్రియును లేక చెదరి ధ ! రిత్త్రీశ్వర! శూన్యు లై చరించెదరు ధరన్. 3-4-290
(ఓ ధర్మరాజా ! పరాక్రమప్రభావంచేత రాజ్యంలోని ప్రజలను రక్షించి పరిపాలించవలసిన రాచకొలంవారు శౌర్యం, సంపద, తేజస్సు, మైత్రి లేకుండ, దిగజారిపోయి సేవకావృత్తిని అవలంబించే శూద్రులవలె భూలోకంలో తిరుగాడుతారు.)
రసగంధద్రవ్యంబులు ! పసచెడు, సస్యంబు లల్పఫలము లగు, మహిం
బసిపాఁడి దఱుఁగుఁ, దరువులఁ ! గుసుమఫలంబులును గరముఁ గొంచెంబు లగున్. 3-4-291
(భూలోకంలో ద్రావకాలు, సువాసనద్రవ్యాలు సారాన్ని కోల్పోతాయి. పంటలదిగుబడి తగ్గిపోతుంది. ఆవులపాలు తరిగిపోతాయి. వృక్షాలవలన పువ్వులు, పండ్లు మిక్కిలి కొంచెంగా లభిస్తాయి.)
అరులు మిగులఁ గొని రాజులు ! నరులకు నెంతయును భయ మొనర్తురు; ధరణీ
సురులు గడఁగి వాణిజ్యముఁ ! గరిసనమును జేయఁగలరు కలియుగవేళన్. 3-4-292
( కలియుగ సమయంలో ప్రభువులు పన్నులు మిక్కుటంగా విధించి, వసూలుచేసి మనుజులను పీడించి, భయపెట్టుతారు.బ్రాహ్మణులు వర్తకవ్యాపారానికి దిగుతారు. సేద్యాన్ని చేస్తారు.)
పాషండదర్శనబహుళంబు లయ్యెడు ! వర్ణాశ్రమంబులు వసుమతీశ!
తవిలి శరీరంబుఁ దద్దయుఁ బ్రోతురు ! పుణ్యఫలంబులు బొంకు లనుచుఁ;
గాలంబుతోఁ గూడఁ గలుగవు వానలు;! పొల్లులై బీజముల్ పొలసిపోవుఁ;
గ్రయవిక్రయంబులఁ గపటంబు దఱచగుఁ;! గడగి యిల్లడసొమ్ము లడఁచికొండ్రు;
సాధుచరితు లైన జనులు దుర్గతుల రో! గములఁ దెగుదు రల్పకాలమునన
పాపపరులు లగ్గుఁ బరమాయువును నరో! గతయు సిరియుఁ బొందఁ గాంతు రెందు. 3-4-293
(ఓ ధర్మరాజా! కలియుగంలో వర్ణాశ్రమాలు నాస్తికవేదాంతంలో ప్రబలుతాయి. పుణ్యపాపఫలాలు అసత్యాలని నిరసిస్తూ మనుజులు దేహాన్నే ముఖ్యంగా భావించి దేహసంరక్షణకే పూనుకొంటారు. సకాలంలో వర్షాలు కురియవు. విత్తనాలు సారంలేనివై పొల్లుగా పరిణమిస్తాయి. క్రయవిక్రయవ్యాపారాలలో మోసం అధికమౌతుంది. తాకట్టుగా తమవద్ద పెట్టిన ఆభరణాలను అన్యాయంగా దాచివేస్తారు. సాధుజనులు అష్టకష్టాలు అనుభవిస్తారు, రోగాలతో బాధపడి అల్పాయుష్కులై మరణిస్తారు. పాపులు దీర్ఘాయువులై విలసిల్లి శుభాలు అనుభవిస్తారు, సిరిసంపదలతో తులతూగుతారు!)
పాషండులు =నాస్తికులు. దేవుడు లేడనీ, వేదాలు ప్రామాణికాలు కావనీ చెప్పేవారు. పాషండులలో చార్వాకులు సుప్రసిద్ధులు.’ఋణం కృత్వా ఘృతం పిబేత్’ ‘అప్పుచేసి నేయి త్రాగుము’ అనేది వారి వేదాంతం. దర్శనం అంటే తాత్త్విక సిద్ధాంతసంపుటం.
ఉఱవగు నారికెపంటలు, గొఱియల పాఁడియును దఱచగుం, బురుషులకుం
దెఱవలు సుట్టము లయ్యెద, రెఱచియు భుజియింతు రర్థి నెల్ల జనంబుల్. 3-4-294
(ఆహారానికి పనికిరాని ఆరికెమొక్కల సేద్యం ఎక్కువ అవుతుంది. గొర్రెలపాడి అభివృద్ధి చెందుతుంది. మగవారికి ఆడువారితో వైవాహికబంధానికి వెలి అయిన చుట్టరికం ఏర్పడుతుంది. మనుజులు అందరూ మాంసాహారులు ఔతారు.)
సుతుఁ డవమానించు జనకుఁ; బతి !నవమానించు భార్య; పడఁతులుఁ బతులున్
మతి నొండొరువుల మెచ్చక ! సతతము జరియింతు రిష్టసంచారములన్. 3-4-299
(కుమారుడు తండ్రిని అవమానిస్తాడు. భార్య భర్తను కించపరుస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు లక్ష్యపెట్టక, ఇచ్చవచ్చినట్లు సంచరిస్తారు.)
పదియాఱు వర్షముల్ పరమాయువయ్యెడు ! ధరణీశ ! కలియుగాంతమున వినవె;
యేడును నెనిమిదియేండ్ల ప్రాయంబునఁ ! బ్రజ లుద్భవింతురు భామినులకు;
ద్రవ్యవిహీనులై దాత యొక్కఁడు లేక ! యన్యోన్య తస్కరు లగుదు రెందు;
నెఱిఁగెడువారును నెంతయుఁ గ్రూరు లై ! చెనసి పాపంబు సేసెదరు సూవె!
యన్నవిక్రయ మొనరింతు రఖిలజనులు, ! వేదవిక్రయు లగుదురు విప్రవరులు,
పణ్యయోనుల యగుదురు పద్మముఖులు ! గష్టతర మైన యక్కలికాలవేళ. 3-4-301
(ఓ ధర్మరాజా!కలియుగంలో ప్రజల ఆయుః ప్రమాణం పదియారేండ్లకు మించదు. ఏడెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసరికే ఆడపిల్లలు సంతానవతులు ఔతారు. దానం చేసే దాతలు కరవై, ప్రజలు ఒకరిసొత్తు నొకరు అపహరిస్తారు. తెలిసిన జ్ఞానులు సయితం మిక్కిలి దుష్టులై, వెనుకాడక పాపకృత్యాలు చేస్తారు. అంతేకాక, పరమదుఃఖంతో నిండిన ఆ కలికాలంలో అందరును అన్నాన్ని ధనం కొఱకై అమ్ముతారు. బ్రాహ్మణోత్తములు జ్ఞానాన్ని అమ్ముకుంటారు. అందమైన ఆడవారు తమ మానాలను ధనం కొఱకై అమ్ముకుంటారు.)
శృతిధర్మంబులు శూద్రులు ప్రతిభం జెప్పంగ వినుచు బ్రాహ్మణజాతుల్
ధృతి సెడి తత్సేవకు లై యతినిందితకర్మకారు లయ్యెద రధిపా!3-4-303
(వేదాలకు సంబంధించిన ధర్మాలనుగూర్చి శూద్రులు వివరించి చెప్పగా, బ్రాహ్మణులలోని పెక్కుతెగలవారు వీను లొగ్గి వింటారు. అంతేకాక, ధైర్యం కోలుపోయి వారు ఆ శూద్రులకు సేవకులౌతారు. మిక్కిలి నిందించదగిన పనులు చేసేవారౌతారు.)
గురు గొనియాడఁడు శిష్యుడు; ! గురునకు శిష్యునెడ వంచకుం డగు; మది నొం
డొరువుల నొల్లరు బంధులు; !పొరిఁబొరి గఱవు లగుఁ బ్రజకు; బొడమును భయముల్. 3-4-305
(కలియుగంలో శిష్యుడు గురువును మెచ్చడు.గురువు శిష్యుడిని మోసగిస్తాడు. బంధువులు ఒకరి నొకరు అనురాగంతో చూడరు. మాటిమాటికి కరవులు ఏర్పడుతాయి. ప్రజలకు భయాందోళనలు అధికమౌతాయి.) ఇటువంటి కలియుగంలో విష్ణువు కల్కి రూపంలో ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు.తిరిగి కృతయుగం ఆరంభమౌతుంది. మార్కండేయుడు ధర్మరాజుకు బ్రాహ్మణప్రభావాన్ని తెలియజేస్తాడు. తఱువాత ఇంద్రద్యుమ్నుని చరితాన్ని కూడా ధర్మరాజుకు చెప్తాడు.కువలాశ్వుచరిత్ర తఱువాతి కథ. ఇంకా మధుకైటభుల కథ కూడా మార్కండేయుడు ధర్మరాజుకు చెప్తాడు. ఇక్కడితో ఎఱ్ఱాప్రెగ్గడ నన్నయ పేరుమీదుగా అనువదించిన నాల్గవ ఆశ్వాసం పూర్తవుతుంది. ఇంక ఐదవ ఆశ్వాసం లోనికి ప్రవేశిద్దాం, రండి.

You Might Also Like

One Comment

  1. రాఘవ

    ఇప్పుడున్నదానికంటె చెడురోజులు వర్ణింపబడ్డాయీ అంటే కలిప్రభావం ఇంకా మనం అంతగా చూడలేదనే అనుకోవాలి. కలియుగంలో ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంటే, రానురానూ ఎంత పతనావస్థకు చేరుతామో అని అనిపిస్తుంది!

    ఎఱ్ఱన్నగారి మిగతాభాగంకోసం ఎదురుచూస్తూంటానండీ.

    నమస్సులతో, భవదీయుడు

Leave a Reply