City Beautiful

’పుస్తకం’ లో ఇది నా మొదటి వ్యాసం కాబట్టి ముందు నా గురించి కాస్తా చెప్పాలి. నేను ఒక ఇంబెసైల్ వెధవను. చిన్నప్పుడు షాడో పుస్తకాలు, కాస్త పెద్దయ్యాక యండమూరి వి. వీటితో పాటు అప్పుడప్పుడు మరికొంతమంది తెలుగు రచనలు చదివి తెలుగు సాహిత్యం మొత్తం నమిలి మింగేసినట్టు ఫీలవుతూ ఉండేవాడిని. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి తెలుగు సాహిత్యం గురించి కారు కూతలు కూసేవాడిని. అంతటితో ఆగకుండా అంతర్ముఖం పుస్తకం ఒక పాతిక కాపీలు కొని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చి చదవమని బలవంత పెట్టేవాడిని. నేను బలవంత పెట్టానే అనుకోండి, వాళ్ళలో ఒక్క వెధవైనా “ఏమిట్రా ఈ పుస్తకం పాడు మెలో డ్రామా” అనో లేదా “ప్చ్…లాభం లేదురా, సొసైటీ లోని స్టీరియోటైప్స్ గురించి రాసిన మరో స్టీరియోటిపికల్ నవల” అనో ఏదైనా క్రిటిసైజ్ చేసిన వాడు ఒక్కడూ కనిపించలేదు సరికదా అందరూ పుస్తకం చదివాక ధేభ్యం మొహలేసుకుని “గుండెల్ని పిండేశాడురా” అన్నవాళ్ళే. తప్పంతా నాదైనప్పుడు ఆ గాడిద కొడుకులనుకుని ఏం లాభం. ఏదో నా అదృష్టం బావుండి అబిడ్స్ లో అనుకోకుండా దొరికిన L’Étranger పుస్తకం చదివి అద్దంలో మొహం చూసుకుని ఉమ్మి వేసుకున్నాను. పోనీ లెద్దూ అని Camus నన్ను వేలు పట్టుకుని అదే అబిడ్స్ వీధుల్లో తిప్పి మరి కొంత మంది రచయితలను పరిచయం చేశాడు. ఒక్కొక్క పుస్తకం చదువుతుంటే, లోకంలోని ఇంబెసైల్ ముండాకొడుకులందరూ కట్టకట్టుకుని చెత్త పుస్తకాలన్నింటినీ పాపులరైజ్ చేసి దొబ్బారు కానీ ఇలాంటి ఆణిముత్యాల గురించి ఒక్కడూ చెప్పిచావలేదేమి అని తిట్టుకున్నాను. ఇలా కొన్ని పుస్తకాలు చదివాక గానీ అర్థం కాలేదు నాకు తెలిసింది గోరంతా కూడా కాదని.

అలా మొదలుపెట్టి నాలుగైదు ఆంగ్ల పుస్తకాలు చదివానో లేదో నేను మళ్లీ నా ఇగోయిస్టిక్ రూట్ లో ప్రయాణం మొదలుపెట్టాను, కనిపించిన వాడి దగ్గరికళ్ళా వెళ్ళి అంతర్ముఖం ఉంది చూశారా? అది పెద్ద ఫార్స్. అసలు కేమూ రాసిన స్ట్రేంజర్ చదివే దాకా ఆ విషయం నాకు అర్థమే కాలేదని ఉపన్యాసాలు దంచడం మొదలుపెట్టాను. అప్పటికి నేనేదో పెద్ద సాహితీ విమర్శకుడినా అంటే అదీ లేదు. చేసేది ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. నాకెందుకు చెప్పండి ఈ విమర్శలు విశ్లేషణలు. అయినా మనసు వింటుందా? నేనేదో బుద్ధుడికి మల్లే జ్ఞానోదయం పొందినట్టు అది అందరికీ కలుగచేయాలని తీట. అందుకే నేను చదివిన నాలుగు పుస్తకాల గురించి పనిగట్టుకుని అందరి దగ్గరా వెధవ్వాగుడు వాగేవాడిని. నా వాగుడంతా విన్న ఒక పెద్ద మనిషి ఏమిటయ్యా నువ్వు చెప్పేది ఆ పుస్తకాలను మించిన తెలుగు పుస్తకాలున్నాయి తెలుసా అని నాలుగు చీవాట్లు పెట్టి చేతిలో శ్రీపాద, కొకు, ఇంకా కొందరు తెలుగు రచయితల పుస్తకాలు పెట్టి వెళ్ళిపోయాడు. అవి చదివాక తెలుగులోనూ గొప్ప రచయితలున్నారని అర్థమయుంది. ఇలా తెలుగులోనూ పదో పాతికో మంచి పుస్తకాలు చదివిన అనుభవం నాకు నేర్పిన పాఠమేమిటంటే నేనొక పెద్ద పాచిమొహం గాడినని, ఇంకా సగం సగం నిద్ర పోతూ లోకం గురించి కలలు తప్ప నాదంతా ఉత్తుత్తి వ్యవహారమేనని తేల్చేసాను.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న రాత్రి కేశవ రెడ్డి రాసిన అని సిటీ బ్యూటిపుల్ అనే నవల చదివాను. నిన్న మొన్నటి దాకా ముసుగేసుకుని ముండమోపిలా దిగులుగా ఇంట్లో కూర్చున్న వాడిని రాత్రి చదివిన ఈ పుస్తకం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని పేడి మొహం వేసుకుని మళ్ళీ బయలుదేరాను. నా సబ్ కాన్షియస్ ఉంది చూశారూ, అది విరగబడి నవ్వుతుంది ఇప్పుడు. “మూర్ఖుడా నీకేదో పెద్ద తెలుసనుకుని ప్రపంచానికి చెప్పబోయి ఇప్పటికి లక్షా ముప్ఫై సార్లు బోర్లాపడి మూతి పళ్ళు పగలగొట్టుకున్నది చాలదూ ఇప్పుడీ పుస్తకం గురించి చెప్పకపోతే లోకానికేమి నష్టమొచ్చినట్టు” అని తెగ నవ్వులే నవ్వులు. అంతటితో ఆగితే ఫర్వాలేదు. ఏదో పుస్తకం గురించి రాస్తానని వచ్చి మధ్యలో మన బోడి పరిచయాలు అవసరమా? అని ప్రశ్నలు కూడా.

మనుషులే ఇంబెసైల్ అనుకున్నాను, ఇలా మనస్సులు, అంతర్-మనస్సులు కూడా ఇంబెసైల్ గా ఉంటాయని అనుకోలేదు. అయినా కూడా ఆ మనసులేవో నావే కాబట్టి నా కష్టాలేవో నేను పడతానులెండి. ఇంతకీ కేశవరెడ్డి పుస్తకాని సంగతికొస్తే దాని గురించి మాట్లాదేముందు అంపశయ్య గురించి కాస్తా చెప్పుకోవాలి. అంపశయ్యలోలాగే సిటీ బ్యూటిఫుల్ కూడా ఒక విద్యార్థి జీవితంలో ఒక్క రోజు జీవితాన్ని మన కళ్ళముందుంచుతుంది. నా దృష్టిలో అంపశయ్య కంటే వంద రెట్లు మంచి నలవ ఇది. అంపశయ్యలో లాగే ఇదీ చైతన్య స్రవంతిలా సాగుతుంది. కానీ అంపశయ్యలోలాగా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండదు నెరేటివ్. చాలా నాచురల్గా ఎటువంటి ఆర్బాటం లేకుండా సాగుతుంది. కానీ ఎందుకో ఇంబెసైల్ ముండాకొడుకులు దీన్నంత ఫేమస్ చేసి చావలేదు. క్యాచర్ ఇన్ ది రై గురించి అడగండి మన తెలుగు వాళ్ళలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసి ఉండడమేమిటి అందులోని కాల్ ఫీల్డ్ గాడు వీళ్ళకి చిన్నప్పుడు చెడ్డీ దోస్త్ అయినట్టు వాడితో తమని ఐడింటిఫై కూడా చేసుకుని నలుగురితో హాయిగా తిరుగుతూనే తామేదో alienate అయినట్టు విషాద గాధలు వల్లిస్తారు. ఒరే కాల్ ఫీల్డ్ గాడు ఎక్కడో అమెరికా లో పుట్టి అక్కడే పెరిగి చచ్చిన పాత్ర. వాడి గురించి తెగ ఫీలయిపోవడం కంటే కేశవ రెడ్డి సృష్టి దేవీదాస్ గాడి గురించి తెలుసుకు చావరా అని వీళ్ళకి మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. మన వాళ్ళు ఎప్పుడూ ఇంతే కదా శరత్ చంద్ర దేవదాస్ మన వాళ్ళకి గొప్ప. అదే దైవమిచ్చిన భార్యలోని రాధాకృష్ణ గురించి అడగండి ఒక్కడికీ తెలిసి చావదు. అంతెందుకు అమ్మ చచ్చిపోయిందని మొదలయ్యే ’స్ట్రేంజర్’ గురించి తెలిసిన తెలుగు వాళ్ళకీ అమ్మచచ్చిపోయిందని ముగిసే ’శూన్యం’గురించి తెలిసిన తెలుగువాళ్ళకీ నిష్పత్తి కడితే కనీసం 3:1 అయినా ఉంటుందని నా అనుమానం.

ఈ లెక్కల పక్కల సంగతి పక్కనబెడితే మొన్న రాత్రి నిద్రపట్టక తచ్చట్లాడుతూ కప్ బోర్డ్ లో బూజుపట్టిపోతున్న సిటి బ్యూటిఫుల్ పట్టుకుని సోఫాలో కూలబడ్డాను. పుస్తకం తెరవగానే “Less alone when alone లేక ఇక్కడా మనుషులేనా?” అనే వాక్యంతోనే కట్టిపడేశాడు రచయిత కేశవరెడ్డి. ఈ మధ్యకాలంలో సింగిల్ సిట్టింగ్ లో చదివేసిన పుస్తకం ఇదొక్కటే. నిజం చెప్పొద్దూ పడి పడి నవ్వుకున్నాను. పొద్దున్నే నా రూమ్ మేట్ ఒకడు “రాత్రి తెగనవ్వుతున్నావు ఏంటి సంగతి?” అనడిగితే సైలెంట్ గా పుస్తకం చేతిలో పెట్టాను. వాడు రెండు రోజులు ఆపుతూ ఆపుతూ పుస్తకం చదివి ఫర్వాలేదు మంచి కామెడీ నవల అన్నాడు. నీ బొంద ఇంత మంచి పుస్తకాన్ని కామెడీ అని ఎలా తీసిపారేస్తావురా ఇంబెసైల్ వెధవా అని వాడ్ని తిట్టాలని ఉండింది. కానీ వాడితో ఇది వరకే ఇలాంటి విషయాల గురించి వాదించి ఉండడం చేత వాడ్ని నాలా పాడు చెయ్యడం నా వల్ల కాలేక పోవడంతో వృధా ప్రయత్నం అని సర్దుకుపోయాను. అయినా పుస్తకం చదివేముందు పోనీ చదివేశాకయినా ఒక సారి ముందు మాట చదవాలని తెలియదా? అది చదివుంటే ఈ నవల హాస్య నవల కాదని విషయం వాడు గ్రహించేవాడు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నేను విరగబడి నవ్వుకున్నదెక్కడంటే….ఈ పుస్తకం కి వచ్చిన స్పందన గురించి కేశవ రెడ్డి చెప్తూ “…ఏ నవలకూ రానంతటి స్పందన్, పాఠకుల ఉత్తరాల రూపాన, ఈ నవలకు వచ్చింది. ఐతే కొన్ని ఉత్తరాలు చదివి నేను ఖంగుతినాల్సి వచ్చింది. ’మీ సీరియల్ రెగ్యులర్ గా చదువుతున్నాం, హీరోగారి డైలాగులు చదివి ఇంటిల్లిపాది కడుపుచేత పట్టుకుని నవ్వుకున్నాం…’ ఈ ధోరణిలో కొన్ని ఉత్తరాలు వచ్చాయి. పాఠకులు ఈ కథలో కేవలం హాస్యాన్ని మాత్రమే చూసి అంతటితో ఆగిపోతే రచయితగా నేను ఘోరంగా ఫైల్ అయినట్టే.” అని రాసుకొచ్చారు. ఇది చదివి నేను కిందపడి దొర్లి దొర్లి నవ్వుకున్నాను. కల్ట్ ఫేవరేట్ కావాల్సిన పుస్తకాన్ని ఇగ్నోర్ చేసేసి ఎప్పుడో మిమ్మల్ని ఫైల్ చేసేశారు మిస్టర్ కేశవ్ రావు అని నాలోనేను పడి పడి నవ్వుకున్నాను.

ఇదొక్కటే కాదు పడి పడి నవ్వుకునే విషయాలు చాలా చాలా ఉన్నాయి కానీ ఆ నవ్వు ఆనందంతో కాదని చదివితే మీరొప్పుకుంటారు. ఉదాహరణకు ఈ పుస్తకంలో చాలామంది ఇంబెసైల్ ముండాకొడుకుల గురించి భలే చెప్తాడు ఈ కథలోని ముఖ్యపాత్ర ఐన దేవీదాస్. తాండవన్ అనే ఒకడి గురించి చదవండి మీకే అర్థమవుతుంది.

“ఈ మధ్య వీడితో కలిసి ఒక సినిమాకెళ్లాను. యం.జి.ఆర్. సినిమా. తెర మీద క్రెడిట్ కార్డ్స్ పడక పూర్వమే ఒక పదేండ్ల పిల్లవాడు తల్లిదండ్రులను పోగొట్టుకోవడము, అనాధ అయిపోవడమూ జరుగుతుంది. పిల్లవాడు ఆకలికి తాళలేక ఒక అంగట్లోంచి రొట్టెముక్కను దొంగలిస్తాడు. “దొంగ, దొంగ” అంటూ జనం వాడి వెంట పడతారు. పిల్లవాడు ఎవరికీ చిక్కకుండా వీధి వెంబడి పరుగు ప్రారంభిస్తాడు. అప్పుడు తెర మెల్లగా కిందకు దిగి, తెరమీద వాడి పాదాలు మాత్రం కనిపిస్తుంటాయి. ఆ పాదాలు పరిగెడుతూనే ఉంటాయి. కొంతసేపటికి ఆ చిన్న పాదాలు పెద్దవుతాయి. క్రెడిట్ కార్డ్స్ ముగిశాక కెమెరా పైకి లేస్తుంది. తెర మీద యం.జి.ఆర్ అడుగుల వెంబడి పరుగిడుతుండడం కనిపిస్తుంది. నా పక్కన ఉన్న తాండవన్ “ఆ పిల్లవాడేడీ? ఆ పిల్లవాడేడీ?” అంటూ అరవడం ప్రారంభించాడు. నేను లేచి నాలుగు వరసల కవతల కూర్చున్నాను. ”

మరో సారి సబ్ కాన్శష్ డిస్ట్రబెన్స్. దాని గోలేంటంటే పుస్తకం గురించి తక్కువ నా గురించి ఎక్కువా చెప్పుకుంటున్నానని దాని బాధ. ఓసి మనసా! ఇది పుస్తకం గురించి కంటే ఈ పుస్తకం చదివాక నా ఎక్స్పీరీయన్స్ గురించి చెప్దామనే ఈ వ్యాసం మొదలుపెట్టానే. అందుకే నీకలా అనిపించొడొచ్చు అని దాన్ని సమాధానం పరిచేశాను. అయినా కూడా ఒక పుస్తకం పరిచయం చెయ్యడం ఇలానా అనుకునే వారికోసం ఈ పుస్తకం గురించి మరి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను.

ఈ నవల్లోకెల్లా నాకు బాగా నచ్చిన ఒక చిత్రీకరణ:

“…నేను నేరుగా బీచికెళ్ళకుండా ఇక్కడికెందుకొచ్చానో అర్థం గాకుండా ఉంది. కాని ఆ బీచి అంతకన్న బోరుగా ఉంటుంది. ఇంట్లో పొద్దస్తమానం తన్నుకుంటూ ఉండి సాయంత్రం బీచికొచ్చి మహా ఒద్దికగా బతుకున్నట్లు కనిపించడానికి ప్రయత్నించే దంపతులు, నీటి మీద అల్లంత దూరాన ఉన్న స్టీమర్ను ప్రియురాలికి చూపించి అది మాస్కోనుంచో, మైసూరు నుంచో వచ్చిందని కోతలు కోసే ప్రియుళ్ళు, నీటి అంచువద్ద నిలబడి అలలు తరుముకుని వచ్చినప్పుడు చీర చెంగులు పైకెత్తి పట్టుకుని కోతుల్లాగా నవ్వుతూ వెనక్కు పరుగెత్తుకొచ్చే ఆడవాళ్ళు, ఇసుకలో గూడులు కట్టుతూ తాము పసిపిల్లల కన్నా నిష్కల్మష హృదుయులమని తెలియజేయడానికి ప్రయత్నించే ముసలివాళ్లూ, ఇరవై పైసల బఠాణీ పొట్లాన్ని పందొమ్మిది పైసలికిస్తేనే కొంటామని కీచులాడే ప్రబుద్ధులు…బీచి ఇసుక మీద ఎటు చూసినా ఇలాంటి బూటకపు చేష్టలే కనిపిస్తాయి.”

పైనే చెప్పినట్టు ఇది హాస్య నవల కాదు. కేశవ రెడ్డి మాటల్లోనే చెప్పాలంటే, “ఈ సమాజం ఏర్పరుచుకున్న బూటకపు విలువలను, బోడి సంప్రదాయాలను ఆమోదించలేని ఒక ఉలిపికట్టె కథ ఇది. దీనిని కేవలం ఒక హాస్య నవలగా మాత్రమే భావించే పాఠకులు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని నాకు నమ్మకముంది.”

మరోమాట. ఈ పుస్తకం ముందుమాటలో డా.గురవారెడ్డి హెచ్చరించినట్టు “మొదటి పేజీలో బాల్యం, రెండో అధ్యాయంలో శృంగారం, మూడో అంకంలో అపార్థం, నాల్గో పర్వంలో శుభం కావాలనుకునే పాఠకులకు ఓ చిన్న విన్నపం -హెచ్చరిక: ఈ పుస్తకం చదవొద్దు”

ఫైనల్ గా చెప్పొచ్చేదేమిటంటే, బెంగాల్ కి ఒక దేవదాస్ నిచ్చిన శరత్ చంద్ర లాగే తెలుగువాళ్ళకి ఒక దేవీదాస్ నిచ్చాడు కేశవరెడ్డి. దేవదాస్ తెలిసినంతగా దేవీ దాస్ అందరికీ తెలియకపోవచ్చు కానీ ఎప్పుడోకపుడు ఎవరో ఒకరికైనా ఎక్కడో దగ్గర దేవీ దాస్ తారసపడతాడు. పలకరించేటప్పుడు కాస్తా జాగ్రత్త ఇంబెసైల్ ముండకొడకా అని దేవీదాస్ తిట్టిపోసినా పోస్తాడు. అదృష్టం బావుంటే ఇలాంగో లాగా స్నేహం చేసినా చేస్తాడు.

*************************
పుస్తకం వివరాలు:
సిటీ బ్యూటిఫుల్ – కేశవ రెడ్డి
ప్రచురణ: నందిని పబ్లికేషన్స్, 2003
పేజీలు: 92
ధర: 50 రూ.
AVKF లంకె ఇక్కడ
విశాలాంధ్ర లో లభిస్తుంది.
***************************

You Might Also Like

17 Comments

  1. varaprasaad.k

    విరుచుకు పడిన తుపానులా,బ్రీత్లెస్ పాటలా ,నయాగరా అంత దూకుడుగా,రాజధాని ఎక్సప్రెస్సులా,వెంకయ్య నాయుడు గారి స్పీచిలా దంచి దంచి కుమ్మి కుమ్మి ఎత్తి కుదేసారు మహాప్రభో.ఇలాంటి పెనుగాలికి చివురుటాకుల వణికించారు సామీ.అంతా బావుంది మిగతా బుక్కులన్నీ గొప్పవే కాదన్ను,కేశవ రెడ్డిగారిని అభిమానిస్తాం కాదన్ను,ఇంగ్లీషోళ్లను చూసి జ్ఞానం తెచ్చుకోవాలన్నారు అదీ కాదన్ను,అంతర్ముఖాన్ని ఎందుకంత పల్చన చేయాలా అని నా సందేహం.ఎవరినో గొప్పోన్ని చెయ్యటానికి వేరొకరిని దింపేయటం రైటేనా.ఒక్క సారి ఆలోచించండి’

  2. Independent

    “పదో పాతికో మంచి పుస్తకాలు చదివిన అనుభవం నాకు నేర్పిన పాఠమేమిటంటే నేనొక పెద్ద పాచిమొహం గాడినని, ఇంకా సగం సగం నిద్ర పోతూ లోకం గురించి కలలు తప్ప నాదంతా ఉత్తుత్తి వ్యవహారమేనని తేల్చేసాను”

    Hey, why are you talking about me Mr Anweshi? I hurted 🙂

    As Meher said above, one of the best innovative reviews on Pustakam.net. Certainly made me feel like reading the book. I have one of his books in my study room, which I bought in my last visit to India. Haven’t read that yet. I have to pull it out now.

    పోతే, beach అబ్జర్వేషన్ గురించి..బానే ఉంది కానీ, ఇలాంటి అబ్జర్వేషన్లేముంది లెండి, చాలా రకాలుగా చూడొచ్చు. కొంచెం సినికల్ గా అనిపించింది నాకయితే, కానీ కాంటెక్స్ట్ మిస్సింగ్ కదా, అందుకని జడ్జి చేయకూడదనుకున్నా.

  3. dvrao

    మంచి రచయితలైయుండి సరైన గుర్తింపు రాని రచయితల్లో కేశవరెడ్డి గార్ని, పతంజలి గార్ని చెప్పుకోవచ్చు.

  4. Vijaya Bhanu Kote

    novel style of introducing a book. loved reading Anveshi garu 🙂

  5. కెక్యూబ్ వర్మ

    ఇలా మనలోని అహాన్ని కడిగిపారేసే పుస్తకాన్ని తమదైన వినూత్న శైలిలో పరిచయం చేసినందుకు అన్వేషి గారికి ధన్యవాదాలు..

  6. అరిపిరాల సత్యప్రసాద్

    చాలా మంచి రివ్యూ.. మీరు నన్ను కూడా ఇంబిసైల్ అంటూ తిట్టనంటే ఒక మాట… కేశవరెడ్డి మిగిలిన పుస్తకాలు చదవండి.. మిగిలినవి అన్నీ village based – underprivileged stories అయితే ఈ కథ మాత్రం urban based – privileged class కి సంబంధించిన కథ. రెండు రకాల కథలు వ్రాయగలిగి కూడా మొదటి వర్గంలోనే ఎక్కువ కథలు ఎందుకు వ్రాశారు? ఈ రెండు రకాల కథలలో వుండే వైరుధ్యాలు ఏమిటి అనేవి అనుభవయోగ్యమే గాని చెప్తే అర్థం కావు…

  7. B.Ajay Prasad

    How to write in telugu in this blog?

    This review is nice. This novel has come in Andhra Jyothy Weekly once upon a time as serial with BALI painting pictures. Anwaeshi should also see those pictures. Soon after CITY BEAUTIFUL, his next serial “RAMUDUNDAADU RAAJJIVUNDAADI” has come in the next issue of ANDHRA JYOTHY when Puranam Subramanya Sharma was the editor.

  8. swathy

    పరిచయం చాలా బాగుంది … తప్పకుండా చదవాలనిపించేలా ఉంది మీ సమీక్ష

  9. కె.మహేష్ కుమార్

    తెలుగు నవలా ప్రపంచంలో ఎదురులేని మొనగాడు డా”కేశవరెడ్డి. ఇన్ క్రెడిబుల్ గాడెస్,రాముడుండాడు రాజ్జివుండాది, చివరి గుడిసె, మూగవాడి పిల్లనగ్రోవి,మునెమ్మ ఒక్కొక్క నవలా ఒక్కో ప్రభంజనం, విప్లవం. మా చిత్తూరోడని కాదుగానీ…మరో నవలాకారునిలో ఈ తెగువ, విషయవైవిధ్యం, మాండలికంపై పట్టు, మానవత్వంపై నమ్మకం చూపించండి?

  10. Padmaja

    Very good review about this book. I really liked this book. Did you read other writings of Dr. keshava reddy. Another great book is “Athadu Adavini jayinchadu.”

  11. Meher

    ఈ “పుస్తకం” సైటులో పుస్తకాన్ని కొని తీరాలనిపించేలా పరిచయం చేసిన మొదటి సమీక్ష ఇది (కనీసం నా వరకూ). మీ నుంచి మరిన్ని సమీక్షల కోసం ఎదురు చూస్తాం.

  12. అరుణ పప్పు

    అన్వేషి గారూ,
    భలే వినూత్నంగా రాశారు మీరు పరిచయం. ఇంకొన్ని రాయండి. కేశవరెడ్డి గారిదీ పుస్తకం చదవలేదు. తప్పక చదువుతా.

  13. nagamurali

    Terrific review. ఇలా రాసిన మీరు ఇంబెసైల్ అయితే మరి నాలాంటి జనం ఏమవుతారు!! వా…. 🙁

  14. Sowmya

    భలే రాసారు పరిచయం! ఇంకా ఇంకా మరెన్నో మీరు పుస్తకానికి రాయాల్ని ఆశిస్తూ…

  15. రవి

    ఈ పుస్తకాన్ని సీరియల్ గా వచ్చేప్పుడు చదివినట్టు గుర్తు. ఇంకో సారి చదవాలి.

  16. ఇంకో ఇంబెసైలు వెధవ

    మీలాగే నేనూ యండమూరి మార్కు తెలుగు నవలల్లోని యెర్రిమొర్రి రాతల్జదివి అపర పండితుడి లెవెల్లో పోజుల్దొబ్బినోడినే. ఒకటే తేడా! మీరు మానేశారు… మేవింకా అవే గొప్పలు వెలగబెడుతున్నాం. తెలియని పుస్తకం గురించి తెలిసిన భాషలో బాగా చెప్పారు. వెంటనే కొని చదవాలని వుంది. పోతే, చదివాక మళ్ళీ పోజులు దొబ్బడం షరామామూలనుకోండి 🙂

  17. Purnima

    AWESOME! Feel like reading this book again!

    Thanks for your wonderful insight!

Leave a Reply to Sowmya Cancel