పుస్తకం
All about booksపుస్తకాలు

March 28, 2011

అనేక : ఆవలితీరం

More articles by »
Written by: అతిథి

రాసిన వారు: జాన్ హైడ్ కనుమూరి
*******************

Aneka2000-2009 కాలంలో నేను ఎక్కడ, ఎటు, ఎలా… ఇలా నన్ను నేను బేరీజు వేసుకున్నప్పుడు, ఇదే కాలంలో నేను-సాహిత్యపు సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకోవడానికి ఓ మహత్తర అవకాశం చిక్కింది. 1999 సంవత్సరం నాటికి నాకున్న మద్యపానానికి పూర్తి బానిసత్వం నా వ్యక్తిగతం. కంప్యూటరు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉద్యోగావసరం. వొక్కడి సంపాదనతో ఇద్దరిపిల్లలతో నగరంలో అద్దె ఇంట్లో గుట్టుగా మధ్యతరగతి సంసారం చేసుకుంటున్న కుటుంబంలో నా భార్యకూడా పనిచేయాల్సిన అవసరం రావటం , వాటి పరిస్థితుల మధ్య నలిగిపోవటం కుటుంబ జీవితం. నా కుటుంబ పరిస్థితులు ఒడిదుడుకులలో సాగడానికి గల కారణాలను అన్వేషించలేదు కాని, బయట పడటానికి ఓ ఆలంబన కవిత్వం. ఏమి చదివానో ఏమి రాసానో గుర్తులేదు కానీ పదేళ్ళుపైన గడచిపోయాయి. మద్యపాన వ్యసనాన్నుండి నన్ను సంస్కరించిందీ కవిత్వం.

ఇక నా అస్థిత్వ-ఆర్థిక- సామాజిక స్థితిగతులను గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేని స్థితిలోనే వున్నాను.వీటన్నిటి మధ్య “అనేక” పదేళ్ళకవిత్వంలో నాకూ ఓ చోటు దొరకటం లేదా ఆ చోటులోకి నేను చేరుకోవడం గొప్ప విశేషంగా భావిస్తాను నేను.

ఈ కాలంలో మొదలయ్యిన కవితా వార్షిక సంకలనాలు, వివిధ పత్రికల్లో వస్తున్న, అంతర్జాలంలో వస్తున్న వాటిని పరిశీలిస్తూనే వున్నందువల్ల ఇందులోని చాలా కవితలు చదువుతున్నప్పుడు ఇదివరకే ఈ కవిత చదివాను కదా అనే భావన కలిగింది. ఎనిమిది భాగాలున్న ఈ సంకలనంలో 182 కవితలతో 13 పేజీల సంపాదకుల పలుకులు, 373 పేజీల కవిత్వంతో వున్న పుస్తకం. ఎగిరే సీతాకోకచిలుకలు వాలిన అట్ట లోపలవున్న కవిత్వానికి సూచికగా మన కళ్ళముందు ఎగురుతుంటాయి. ఎవరికివారు లోపలికి పయనించాల్సిందే. కానీ నాకు పుస్తకాన్ని వెనుకనుంచి చదవటం అలవాటు. అదే పద్దతిలో చివరనుంచి రెండు భా గాలను చదివాను.

సృజనలోకం, వరంగల్ ప్రచురించిన కవితా వార్షిక -2006 ను 18 మార్చి 2007 తేదిన, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్, హనుమకొండ ఆవిష్కరణ సభలో కొండేపూడి నిర్మల మాట్లాడుతూ వ్యక్త పరచిన అనుమానం నిజం కాదని ఈ సంకలనం నిరూపిస్తుంది. ఎందుకంటే ఈ భాగంలో వున్న (కవులు, కవియత్రులు) ఎక్కువమంది కొత్తవారు మరియు యువకులు ఉండటం విశేషం. ‘మనిషి వస్తువుకింద పడి చచ్చాడు’ ఓ కవి అన్నవాక్యాలను గుర్తుచేస్తూ వస్తువుకున్న ప్రాముఖ్యత సంకలనం ద్వారా యువతరానికి చేరుతుందాయని ప్రశ్నించారు. యువతకోసం చేతులు కాల్చుకోవల్సివుంటుందని చమత్కరించారు. ప్రపంచీకరణమీద ఎలా దాడి చెయ్యాలి అనేది, వక్తీకరణశక్తి మీద ఆధారపడివుంటుంది. నిజమైన కవిత్వానికి, కవికి వేదికలు తక్కువయ్యాయని చెబుతూ ‘చివరి చిరునామా’ తో ముగించారు

అయితే అనేకలోని కొత్త కవులను, అందులోనూ యువతను చూస్తుంటే కొండేపూడి నిర్మల గారి ప్రశ్నకు జవాబు దొరికి నట్టే అనిపిస్తుంది నాకు.

ఆవలితీరం : ఇందులో 17 కవితలు వున్నాయి. ప్రవాసానికి, వలస సాహిత్యానికి ప్రతీకగా ఈ భాగం వుంది. అది వలసపోవటమా లేక ప్రవాసమా ఏదైనప్పటికి ఆ వదిలివెళ్ళిన నేలను, వదిలివెళ్ళిన మనుషులను, జ్ఞాపకాలలోకి లాక్కెళుతుంది. సంగినేని రవీంద్ర కవిత “బొంబాయి బస్సు” మనల్ని కరీంనగర్ బస్సుస్టాండుకు తీసుకువెళుతుంది. వలసపోవల్సిన అవసరాన్ని గుర్తించి వీడ్కోలు చెబుతున్న దృశ్యం లోని భావాలని వొలికిస్తాడు.

నా తల్లి చేతిబువ్వ మల్లెప్పుడో
నా పల్లె మట్టి గంధం మరకెప్పుడో…
అని పలవరిస్తూ, రోదిస్తో కదిలిపోతున్న గుండె బరువు మన హృదయాలలోకి ఇంకడం మొదలౌతుంది. కదిలిపోతున్న బస్సులోంచి..

అయ్యాడ్రైవర్ సార్!
జర ఆరంసే గాడీ చలావో
బస్సులోవున్నది జనం కాదు
అస్తవ్యస్త జీవితాల వ్యధాభరిత కన్నీళ్ళు
ఒలికిపోతాయి సుమా..
జర జాగ్రత్త మరి!!

వదిలివెళ్ళిన ఊరి అందాలను అనుభూతులను నెమరువేసుకుంటూ హేమంతపు వుదయాన్ని మనకళ్ళముందు అక్షరాలతో చిత్రీకరించారు రాధిక రిమ్మలపూడి. వేకువ ఝాములో గుడిలో మేఅకొలుపు గీతాలు, దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు … ఇలా ధనుర్మాసపు అనుభూతులున్న ప్రతివారినీ వారివారి జ్ఞాపకాల్లోకి నడిపిస్తుంది. వలసపోవటంవల్ల ఖాళీ అయిన వూరు, కోల్పోతున్న వునికికై నారాయణస్వామి “యాడికి పోయిన్రు?” కవితలో హృదయ వేదనపడుతూ మనల్నీ అందులోకి నడిపిస్తాడు, మాండలికాన్ని ఆస్వాదించేలా చేస్తాడు.

వూర్లల్ల పిలుద్దామన్నా
ఒక్క వయస్సు పొల్లగాడు
కనబడలేదు…

వూర్లకు వూర్లే
ఎందుకు చిన్నబోయినయోనని
మెండకబోయిన కొమ్మలు
యెక్కలు బట్టి యేడుస్తున్నాయి.

జ్ఞాపకాలను పదిలపర్చుకుంటూ మరువం ఉష “ఈ జాడలు” కవితలో మారుతున్న కాలం జాడల మధ్య వెదకుతున్న జాడలే కనిపిస్తాయి.

తరం మారి ఆ చేతికర్ర
నాన్న చేతికొచ్చినా
అడుగడుగునా తాతయ్య జాడలే
అవసరంలేదని ఆ కవ్వం
అటక మీదకు చేర్చినా
అమ్మమ్మ చిలికిన వెన్న వాసన వీడలేదే
. …
అన్నిటా ఆజాడలే గాఢమైన నీడలే
ఏ జాడ నేను మరువగలను? లేదని ఏజాడకై నేను అన్వేషించను?
నను వీడక నా వెంబడే నడిచే ఈ జాడల్లు, నా గుండె వేసిన వూడలు

నగలపెట్టె ను మనముందు విప్పుతూ నిషిగంధ కనిపిస్తుంది.

నగలు పెట్టె
ఎన్నేళ్ళ అపురూప సేకరణో
పెట్టె నిండిపోయింది

అన్నీ ధరించి
ఆకస్మిల వైభవాన్ని
నీకు పరిచయంచేస్తే
ఏదీ నాకావల్సిన ఆమోదం?

అస్తిత్వానికి ప్రతీకగా
ఇంకా నా ముక్కున మెరుస్తున్న ముక్కుపుడక “

నగలలో కన్పించే పుడక ముక్కుకే వుండాలని నిర్ధారించినట్లు స్త్రీని వస్తువుచేసి ఇదే తన స్థానం అనిచెప్పే వస్తుతనం గురించి చెప్పకనే చెబుతుంది.

ధ్యానంలో కె.వి.ఎస్. రామారావు కుంచెలరంగుల్తో ఇంద్రజాలికుడ్ని దర్శించమంటాడు.

వర్షానంతరంలో – డా. వైదేహి శశిధర్, గుర్తుందా గోదావరీలో వినీల్ కుమార్ ప్రోదిచేసుకునే అనుభవాల జ్ఞాపకాలు, రవికిరణ్ తిమ్మిరెడ్డి బైపోలార్ భూతం, పద్మలత “అన్నీ చెప్పగల భాష” ఇలా కొన్ని అనుభవాలు, అనుభూతులతో ఆవలితీరం సుసపన్నమైదనే చెప్పాలి.

శ్రీ శివారెడ్డి అనేకకు రాసిన ప్రశంస :

అనేక ఒక గొప్ప ప్రయత్నం. నేననుకున్నదీ, చేద్దామనుకున్నదీ, బహుశా కలకన్నదీ అఫ్సరూ, వంశీకృష్ణా చేసి చూపించారు. కొత్త తరానికి చెందిన ప్రతిభావంతులయిన కవులు, గొప్ప ఊహాశక్తి కలిగిన కవులు, వస్తువులోకి ప్రవేశించి కళానిర్మాణం చేసే కొత్త తరం కవుల కవిత్వంతో ఈ పుస్తకం తేవడం నన్ను ముగ్దుణ్ణి చేసింది. నేనెప్పుడూ నా తరం కవులకీ , నా ముందు తరం కవులకీ చెబుతూ వుంటాను, ఈ కొత్త తరం కవుల్నించి మనం నేర్చుకోవసింది చాలావున్నది అని! ముఖ్యంగా తాజాతనం, వస్తువును ప్రదర్శించే తీరూ, దాన్ని కళారూపంగా మలిచే అభివ్యక్తి లాంటివి. బహుశా ఈ నాటి కవి పైపైకి మట్లాడం మానేసి, ఒకదాని ప్రభావం కలిగించిన అంతర్లోక సంక్షోభాలనించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక కొత్త సందర్భంలో పుట్టడమే వాళ్ళకొక గొప్పవరం. ప్రాగ్మెంటేషన్ అవుతున్న సందర్భంలో జీవితాన్ని అన్ని కోణాలనుంచి అన్ని పార్శాల నుంచి పట్టుకుంటానికి ఈ కొత్త తరం కవులు ప్రయత్నించారని అనేక చూపించింది. అఫ్సర్, వంశీకృష్ణల ముందు మాట ఇదివరకి మనం చూడని లోతుల్ని పార్శ్వాలని స్పృశించే ప్రయత్నంచేసింది.

ఈ భాగంలో అంతర్జాలంనుండి వెలువడిన కవితలను చేర్చడంద్వారా అంతర్జాలంలోని కవిత్వంవైపు అందరి దృష్టి ఆకర్షించగలది ఆశిస్తున్నాను.

అనంతరం

సాహిత్యంలో సూచికలాంటివారు కొందరు ఈ దశాబ్ద కాలంలో తుదిశ్వాసల గవినిలోనికి అడుగు పెట్టారు. అలాంటివారిని జ్ఞాపకం చేసుకోవటం అవసరమే కదా! ఈ భాగం మాత్రం మొక్కుబడిగా చేసినట్లనిపించింది. మరచిన వారిలో కొందరు

మద్దూరి నాగేశ్ బాబు
ఇస్మాయిల్
స్మైల్
గుంటూరు శేషేంద్ర శర్మ
భార్గవీ రావు……..

మిగతా భాగాలగురించి ఇంకోసారి రాస్తాను

“అనేక” సంకలనం గురించి వచ్చిన ఇతర వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు.

**************************

పుస్తకం వివరాలు:
అనేక, పదేళ్ళ కవిత్వం
పుటలు: 404, వెల : రూ. 199.
డాలర్లలో : $ 9.99
సంపాదకులు: అఫ్సర్, వంశీ కృష్ణ
సారంగ సంపాదకులు: రాజ్ కారంచేడు
సారంగ బుక్స్ మిగిలిన వివరాలకు: www.saarangabooks.com

ఇండియాలో ప్రతులకు:
Palapitta Books
Flat No: 3, MIG -II
Block-6, A.P.H.B.
Baghlingampally,
Hyderabad-500 044 AP India
Direct: 040-27678430
Mobile Phone: 984 878 7284
Email: palapittabooks@gmail.comAbout the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0