శ్రీమదాంధ్రమహాభారతము ఎందుకు చదవాలి ? ఆరణ్యపర్వము – నన్నయ కృతము – తృతీయ చతుర్థాశ్వాసములు

(ఈ సిరీస్ లో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవొచ్చు). ఆది సభా పర్వాల పరిచయం ముగిసింది. అరణ్య పర్వం గురించిన పరిచయం లో మూడో వ్యాసం ఇది. మొదటి రెండు వ్యాసాలూ గతం లో వచ్చాయి. అరణ్యపర్వం గురించిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.)
*********************

ప్రాచీన భారతీయకాలమాన ప్రకారం యుగాలు నాలుగు. 1.కృతయుగం – 17,28.000 సం., 2. త్రేతాయుగం – 12,96,000 సం., 3. ద్వాపర యుగం – 8,64,000 సం., 4. కలియుగం – 4,32,000 సం.

దుర్గములు ఆఱు. 1. ధన్వదుర్గం (నాలుగు ప్రక్కలా అయిదామడల మేఱ మరుభూమి గల కోట) 2. మహీదుర్గం (చుట్టూ మట్టి ప్రాకారం గల కోట) 3. వార్క్షదుర్గం (చుట్టూ చెట్టు చేమలు గల కోట) 4. జలదుర్గం (చుట్టూ నీరు గల కోట ) 5. నరదుర్గం ( చుట్టూ చతురంగబలాలు గల కోట) 6. గిరిదుర్గం (చుట్టూ కొండలు గల కోట).

సముద్ర వర్ణన

రంగదుత్తుంగ తరంగ హస్తంబుల నాడెడునది వోలె, నతుల వేగ

వాతావధూతమై వఱలెడునది వోలెఁ బర్వత కందరోపాంత తతులఁ

దొడరెడునదివోలె, ధ్రువఫేనవితతుల నగియెడునది వోలె, నాగనక్ర

మకరతతుల క్షుభ్యమాణమై తద్బాధ కోపనియది వోలె, నుచ్చ భీమ

నినద మగుచు నున్న నీరధి యొద్దకు నమరగణముతో మహామునీంద్ర

గరుడ ఖచర గంధర్వ పన్నగ యక్షగణముతోడ నరుగుదెంచి. 3-3-38

( ప్రకాశించే ఎత్తైన కెరటాల చేతులతో నాట్యం చేసేదానివలె, మిక్కిలి వేగమైన ఝంఝంమారుతం చేత తోయబడినదానివలె, పర్వతగుహల మధ్య ఉరికే దానివలె, తెడ్లు ఆడటం వలన ఏర్పడిన నురుగుల సముదాయంతో నవ్వుతున్నదానివలె, పాములు, జలచరాలు, మొసళ్ళు మొదలైన వాటిచేత కదిపి కుదపబడుతున్నదై, ఆ బాధకు తాళలేనిదానివలె హెచ్చుగా భయంకరంగా ధ్వని చేస్తున్న సముద్రం దగ్గఱికి అగస్త్యమహర్షి గరుడులు, ఆకాశచారులు, సిద్ధులు, ఉరగులు, గంధర్వులు, యక్షులు మొదలైన దేవతాజాతులతో కలసి వచ్చాడు.) అగస్త్యుని సముద్రపానం, తరువాత దానిలో దాగిన కాలకేయులను దేవతలు సంహరించటం జరిగిన ఘట్టం లోనిదీ పద్యం. అగస్త్యుడు సముద్రపానం చేసినపుడు ఆ నీరంతా అగస్త్యుని కడుపులో జీర్ణమైపోతుంది. తిరిగి సముద్రాన్ని నీటితో నింపటానికి భగీరథుడు విశ్వప్రయత్నం చేసి గంగను ఆకాశం నుండి భూమిమీదకు తీసుకొని వస్తాడు. భూమిమీదకు గంగ దిగిన విధం ఎలా ఉందంటే—

ఇలకున్ గంగ తరంగసంగతులతో నేతెంచె నాశాంతరం

బులు నాకాశముఁ గప్పుచుం దగ మహాభూత ప్రపంచంబుతోఁ

జెలువై యుండఁగ దాని నీశ్వరుఁడు దాల్చెన్ సంగతోత్తుంగ పిం

గళజూటాగ్రమునందుఁ బద్మదళసంకాశంబుగా లీలతోన్. 3-3-82

(గంగానది కెరటాల కదలికల ఊపు తూగులతో ఆకాశాన్నీ, దిగంతరాలనూ క్రమ్ముకుంటూ భూమిపైకి వచ్చింది. గొప్ప ప్రాణికోటుల సమూహాలతో శోభిల్లేటటువంటి ఆ గంగను శివుడు తన ఎత్తైన గోరోజనం రంగుకల జటాజూటం పైభాగాన తామరపూరేకు పోలికగా విలాసంగా ధరించాడు ) నన్నయ కవితాశిల్పానికి అంతర్భాగమైన అక్షరరమ్యతకూ ప్రసన్నకథాకవితార్థయుక్తికీ ఈ పద్యం ఉదాహరణప్రాయం.

సాగరులకు సద్గతిగా ! సాగరమున కట్లు సలిలసంపూర్ణముగా

భూగతయై భాగీరథి ! భాగీరథకీర్తి భువనపంక్తుల నించెన్. 3-3-84

(సగరుడి కొడుకులకు పుణ్యగతి కలిగేటట్లుగా, సముద్రానికి నిండా నీరు నిండేటట్లుగా, గంగానది భూలోకానికి దిగివచ్చి భగీరథుడి యశస్సును సమస్తలోకాలలో వ్యాపింపజేసింది.) గంగకు భాగీరథి అనే పర్యాయపదం ఏర్పడటానికి ఉపపత్తిని ఈ పద్యం వెల్లడిస్తుంది.

ఋష్యశృంగుని చరిత్రలో

చనుదెంచి తరుణి మునినం ! దను చిత్తంబునకు వైకృతముఁ జేసె; విలా

సినుల సహాలాప సహా ! సన సహయానములు బంధసమములు గావే ! 3-3-111

(వేశ్యాపుత్రిక అయిన లేజవరాలు వచ్చి ఋషికుమారుడైన ఋశ్యశృంగుడి మనస్సులో వికారాన్ని కల్గించింది. అందచందాలతో హొయలొలికే మిటారికత్తెలతో కలసిమెలసి మాట్లాడటం, దగ్గఱగా ఒకచోట కూర్చోవటం, తిరుగాడటం చెఱతో సమానాలు కదా! ) నన్నయ కవితాశిల్పానికి విశిష్టత చేకూర్చిన నానారుచిరార్థసూక్తినిధిత్వానికి ఈ పద్యం ఉదాహరణప్రాయం.

యజ్ఞాన్ని చేయించే ఋత్విజులు 16 మంది. 1. బ్రహ్మ 2. ఉద్గాత 3. హోత 4. అధ్వర్యుడు 5. బ్రాహ్మణాచ్ఛంసి 6. ప్రస్తోత 7. మైత్రావరుణుడు 8. ప్రతిప్రస్థాత 9. పోత 10. ప్రతిహర్త 11. అచ్ఛావాకుఁడు 12. నేష్ట 13. అగ్నీధ్రుడు 14. సుబ్రహ్మణ్యుఁడు 15. గ్రావస్తుతుఁడు 16. ఉన్నేత.

అష్టదిగ్గజాలు: ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం.

పరశురాముని చరిత్ర, కార్తవీర్యార్జునుని చరిత్ర, విని గోదావరీ స్నానమాచరించి యుండగా శ్రీకృష్ణబలరాములు వారిని చూడ వస్తారు. రోమశుడు పాండవులకు సౌకన్యాఖ్యానం ,మాంధాతృ చరిత్ర, సోమకుడనే రాజర్షి చరిత్ర, శిబి యను రాజర్షి చరిత్ర వగైరా కథలను చెప్తాడు.

శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించదలచిన ఇంద్రాగ్నులు డేగరూపంలోనూ పావురం రూపంలోనూ మారి పావురం డేగవలని భయంతో శిబిని ఆశ్రయిస్తుంది. పావురానికి శిబి అభయం ఇస్తాడు. డేగ నా కాహారంగా విధిచే నిర్ణయింపబడిన పావురాన్ని రక్షించి నీవు ధర్మవ్యతిరేకం చేస్తున్నావు అని అంటూ

ధర్మజ్ఞు లైన పురుషులు ! ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్

ధర్మముగా మదిఁ దలఁపరు; ! ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్. 3-3-230

( ధర్మస్వరూపాన్ని ఎఱిగిన జ్ఞానులు ధర్మానికి ఏమాత్రం కీడు కలిగించే ధర్మాన్నైనా, ధర్మంగా మనస్సులో భావించరు. అచ్చమైన ధర్మం జగత్తుకంతటికీ మేలు చేకూర్చాలి.) అంటాడు డేగరూపంలోని ఇంద్రుడు శిబితో.

వ. ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు; శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి యను వేదవచనంబు గలదు గావున దీని నాకు నాహారంబుగా ని మ్మనిన దానికి శిబి ఈ పావురం ప్రాణభయంతో వచ్చి నన్ను అశ్రయించింది. ఆశ్రయించిన వానిని ఎటువంటి నీచుడైనా విడువలేడు కదా ! ఇక నేను ఎట్లా నన్ను ఆశ్రయించిన పావురాన్ని విడిచిపెట్టగలను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం కాదుకదా! నీవే చెప్పు అంటాడు.

మహాభారతం పంచమ వేదం. మహాభారతంలో చాలాచోట్ల ధర్మంపై చర్చలు కొనసాగాయి. ధర్మస్వరూప నిరూపణకు, ధర్మసూక్ష్మ వివరణకు మహాభారతంలో పేర్కొనదగినవి, ముఖ్యమైనవి రెండు ఉపాఖ్యానాలు. 1. ధర్మవ్యాధో పాఖ్యానం,2.శిబి గాథ. ’అహింసా పరమో ధర్మః’ అన్న అహింసా నిర్వచనంలో ధర్మసూక్ష్మాన్ని ఆరయవలసి యున్నది. బౌద్ధమతానికి  ’అహింసా పరమో ధర్మః’ అన్నది జీవనాడి. పరోపకారార్థం తమ శరీరాలను అర్పించి ‘పరోప కారార్థ మిదం శరీరమ్’ అన్న వాక్యానికి జీవదుదాహరణలు బోధిసత్వుడు, శిబి, జీమూతవాహనుడు మున్నగు మహనీయులు. ఈ పద్యం ధర్మసూక్ష్మానికి జీవనాడి విశ్వశ్రేయం అని ప్రతిపాదిస్తున్నది. ఏది ధర్మం? రెండు ధర్మాలు విప్రతిపన్నాలైనవి ఉన్నట్లైతే పరమధర్మ మేది ? ఇక్కడ డేగ ఈ ప్రశ్ననే శిబికి వేసింది. పావురాన్ని కాపాడటం నీవు ధర్మంగా భావిస్తే, నా ఆహారం మాట ఏమవుతుంది? అని శిబిని సూటిగా అడిగింది. ‘ ఒక ధర్మానికి హాని కలిగించే మరొక ధర్మం విశ్వజనీనం కాలేదు. అది అభాస ధర్మమే కాని పరమ ధర్మం కాదు’ అని ఈ పద్యంలో డేగ ప్రతిపాదించింది. డేగలకు పావురాలు ప్రకృతిసిద్ధమైన ఆహారమైనపుడు ‘అహింసా పరమో ధర్మః’ అన్నది ఎట్లా చెల్లుతుంది అనేది ప్రశ్న. దానికి శిబి

ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను ! నాశ్రయించె నాశ్రితు నెట్టి యధముఁ డయిన

విడువఁ డనినను నే నెట్లు విడుతు దీని? ! నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె ? చెపుమ. 3-3-232

నీవు పక్షివయ్యును ధర్మ మెఱింగినట్ల పలికితి; శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొం డెద్ది? నీ యాఁకలి ఈ పావురాన్ని తింటేకాని తీరదా నీ ప్రయత్నం కేవలం నీ పొట్టపోసుకొని ఆకలి తీర్చుకోవటానికైతే ఈ అడవిలోని లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైనవాటి మాంసం దీనికంటే అధికంగా నీకు సమకూర్చుతాను. ఈ పావురం మీది ఆగ్రహాన్ని విడిచిపెట్టు. నేను ఈ పక్షిని ఎట్లా అయినా విడిచి పెట్టను అంటాడు. దానికి డేగ

నాకు విహిత భక్షణం బిది; యిప్పక్షిఁ ! బూని కావ నీకు బుద్ధియేని

యవనినాథ ! దీనియంత నీమాంసంబు ! దూఁచి నాకుఁ బెట్టు తొలఁగ కిపుడ.’ 3-3-234 అంటుంది డేగ శిబితో.

దానికి శిబి సంతోషించి తన మాంసం కోసి తరాజుతో తూకం వేస్తుంటే ఎంతకీ పావురం వైపే తరాజు మొగ్గుతుంటే చివరికి తానే తరాజులో కూర్చుంటాడు శిబి. అతని ధర్మనిరతికి మెచ్చి ఇంద్రాగ్నులు ప్రత్యక్షమై అతని కీర్తి చిరకాలం ప్రశస్తమయ్యేలా వరం ఇచ్చి మాయమౌతారు.

తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావక్రుని చరిత్ర చెప్తాడు.

పూర్వం ఏకపాదుడనే మునీశ్వరుడు తన భార్య సుజాత గర్భంతో ఉండగా తన శిష్యులకు అనవతరమూ విశ్రాంతి లేకుండా వేదాధ్యయనం చేయిస్తుండగా గర్భస్థుడయిన అర్భకుడు తండ్రితో

ఎడఁబడక యహోరాత్రులు ! వడిఁగొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్

గడు నిద్రలేమి నెంతయు ! జడమతులై చదువు దప్పఁ జదువుచు నుండన్.‘ 3-3-238

(నీ శిష్యులు పగలనక, రేయనక ఎడతెఱపిలేకుండా విద్యాభ్యాసంచేయటంచేత వారు మందబుద్ధులవుతూ నిద్ర లేకపోవటంచేత వేదపాఠాలను తప్పుగా చదువుతున్నారు. ఈ విధంగా తప్పులు చదివించటం ఎందుకు?)

వ. అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు నీ వధ్యయనంబునకు వక్రంబుగాఁ బలికితివి గావున నెనిమిది వంకలు గల శరీరంబుతో జన్మింపుమని కొడుకునకు శాపం బిచ్చిన.

అని నిందించిన గర్భస్థ శిశువుమీద ఆగ్రహించి తండ్రి అయిన ఏకపాదుడు ‘నీవు వేదాధ్యయనాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి అష్టావక్రుడివై పుట్టుము’ అని శపించాడు.

ఈ అష్టావక్రునికి శ్వేతకేతుడనేవాడు మేనమామ వరస. శ్వేతకేతుడు ఉద్దాలకుని తనయుడు. వారిద్దరూ ఉద్దాలకుని వద్ద 12 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి గొప్పవిద్యావంతులయ్యారు. ఓరోజు అష్టావక్రుడు ఉద్దాలకుని తొడపై ఎక్కి ఆడుకుంటుండగా శ్వేతకేతుడు అతనితో – నా తండ్రి తొడమీద ఎందుకు ఎక్కావు నీవెళ్ళి నీ తండ్రి తొడ ఎక్కు- అంటాడు. అష్టావక్రుడప్పుడు తల్లి సుజాత ద్వారా తన తండ్రి ఏకపాదుడు జనకుని సభలో వంది చేత ఓడింపబడినాడని తెలిసికొని జనకుని సభకు వెళ్తారు. వీరిద్దరూ బాలురవటం చేత ద్వారపాలకులు వీరిని సభలోనికి వెళ్ళకుండా అడ్డగిస్తారు. మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారని అడగ్గా—

అలఘులగు వృద్ధవిద్వాం! సులకు మహాయాజ్ఞికులకుఁ జొర నర్హంబై

విలసిల్లు యజ్ఞసభ సొర ! వలవదు చనుఁ; డీరు చిఱుతవారల రనినన్.3-3-247

(‘ మహానుభావులైన వృద్ధులైన విద్వాంసులు, అనుభవజ్ఞులగు ఋత్విజులు మాత్రమే ఈ యజ్ఞవాటికలో ప్రవేశించటానికి అర్హులు, మీరు పసిబిడ్డలు. ఈ యజ్ఞంలో ప్రవేశించే అర్హత మీకు లేదు’- అని చెప్పగా)

అలయక యేండ్లు గడుం బె క్కులు జీవించుట నరగలుగుటయుం దగు వృ

ద్ధుల లక్షణమే జ్ఞానము గలఁ డేనిన్ బాలుఁ డయినఁ గడు వృద్ధు మహిన్. 3-3-248

(‘చాలా సంవత్సరాలు ఓర్పుతో బ్రతకటం, వెండ్రుకలు తెల్లబడటం ముసలివారికి చిహ్నాలా ? జ్ఞానం కలవాడైతే బాలుడైనా పెద్దగానే భాసిల్లుతాడు.’) అని అంటారు . రాజానుమతితో వీరికి సభాప్రవేశం కలిగిస్తారు. జనకుడు వేసిన చిక్కుప్రశ్నలన్నింటికీ సదుత్తరాల నిచ్చి, వీరిద్దరూ అక్కడి పండితులనూ, వందినీ వాదంలో విద్యలలో ఓడిస్తారు.

తరువాత రోమశుడు ధర్మరాజుకు యువక్రీతుని చరితాన్నిచెపుతాడు. యువక్రీతుడు భరద్వాజుని కుమారుడు. రైభ్యుని కొడుకులు అర్థావసుడు, పరావసుడు అనేవారిద్దరు గురుశుశ్రూష చేసి సకల విద్యలనూ అభ్యసిస్తారు. వారిని చూసి మాత్సర్యంపొంది తాను వారిలా ఎక్కువకాలం కష్టపడి గురువులను సేవించి విద్యనభ్యసించకుండా తపస్సు ద్వారా సకల విద్యలనూ సాధించాలని అనుకుంటాడు. అలా అనితలచి ఉగ్రమైన తపస్సుచేస్తుండగా ఇంద్రుడు అతని వద్దకువచ్చి – నీవు ఎందుకింతవుగ్రంగా తపస్సు చేస్తున్నావు? నీకేం కావాలి ? ఇంద్రుడికి యువక్రీతుడీవిధంగా జవాబు చెప్పాడు.

చదువకయును నాకు సర్వవేదంబులు! సర్వశాస్త్రములును సంభవిల్ల

వలయు నని తలంచి వదలక నిష్ఠతో ! నుగ్రతపముఁ జేయుచున్నవాఁడ. 3-3-254

(‘ఏ గురువు దగ్గఱ విద్యాభ్యాసం చేయకుండానే సర్వవేదాలు, సకలశాస్త్రాలు అవగతం కావాలి – అని నిష్ఠతో తీవ్రమైన తపస్సు చేస్తున్నాను’) అనగా వానికింద్రుడీ విధంగా అంటాడు.

గురుముఖమునఁ బడయక దు ! ష్కర తపమునఁ జేసి పడయగాఁబడు విద్యల్

పరమార్థము మదమును మ ! త్సరమును గావించు నెట్టి సాధుల కైనన్.-3-3-256

వ. ఇది విద్యోపార్థనంబున కుపాయంబు గా దని వారించి యరిగిన-

(‘ అధ్యాపకుడి నోటి ద్వారా జరిగే ప్రబోధాన్ని పొందక తీవ్రమైన తపస్సు వలన పొందేటటువంటి విద్యలు పరమార్థంలో ఎటువంటి మంచివారికైనా కూడా గర్వాన్ని అసూయను రేకెత్తిస్తాయి. ఇది విద్యను సంపాదించటానికి తగిన పద్ధతి కాదు ‘) – అని చెప్పి ఇంద్రుడు వెళ్తాడు. అయినా సరే అతడు తన తపస్సును మానకుండా కొనసాగిస్తాడు. అప్పుడు ఇంద్రుడు కృశించిన దేహం కల ముసలిబ్రాహ్మణుని రూపం ధరించి , బలం లేకున్నా పిడికిళ్ళతో ఇసుకను పోస్తూ మితి లేనటువంటి లోతు గల గంగ నీటివెల్లువనకు అడ్డంగా ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తూ యువక్రీతుడికి కనిపిస్తాడు. ఆ ముసలి బ్రాహ్మణుని యత్నం చూసి యువక్రీతుడు అతనితో నవ్వుతూ- నూరేళ్ళునిండిన ముసలివాడివి, మిక్కిలి కృశించి వున్నావు . ఎందుకు అసాధ్యమైన లక్ష్యమందు ఆసక్తి కలిగి మందబుద్ధి వైనావు? ఇంక ఏనాటికి ఈ ఆనకట్ట పూర్తయ్యేనయ్యా?- అని అధిక్షేపిస్తాడు. ఇలా కొంత కథ నడచిన తర్వాత యువక్రీతుడు నాకంటే రైభ్యునికీ అధిక శక్తి ఎలా కలిగింది ? అని అడుగుతాడు. దానికి దేవతలు అతనితో –

గురు శుశ్రూష యొనర్చుచుఁ ! బరమ క్లేశమునఁ జేసి పడసిన విద్యల్

స్ఫురియించుఁగాక ; గురుముఖ ! విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్ ?’ 3-3-282

(‘గురువుగారికి పరిచర్య చేస్తూ, మిక్కుటమైన ప్రయాసను ఓర్చుకొని అభ్యసించిన చదువులు శోభిస్తాయి కాని, అధ్యాపకుడి నోటినుండి (గురు ముఖతః) అభ్యసించకుండా ఆర్జించిన విద్యలు ఎక్కడైనా శోభిస్తాయా?’)

రైభ్యుడు గురుముఖతః విద్యలు నేర్చాడు, నీవు అలాకాక తపస్సుతో విద్యలు పొందావు, అందుచేత అతని శక్తిముందు నీ శక్తి తక్కువ అని చెప్పి దేవతలు వెళ్ళిపోయారు. అదీ విద్యను పొందే విధానం. మహాభారత పఠనం వల్ల మనకు ఇటువంటి సూక్ష్మాలు ఎన్నో తెలియవస్తాయి.

సౌగంధికాపహరణ ఘట్టానికొస్తే అక్కడ హనుమంతుడు భీమునికి నాలుగుయుగాల వర్తనాన్ని ఇలా వర్ణిస్తాడు.

కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు ! నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ

మనఘ ! వర్తిల్లు; నచ్యుతుం డయ్యుగమున ! శుక్లవర్ణుఁడై ప్రజల గాచుచు వెలుంగు. 3-3-336

(‘ పాపరహితుడవైన ఓ భీమసేనా ! కృతయుగంలో చేయటమే గాని చేయవలసినటువంటిది లేదు. ధర్మం నాలుగు పాదాలతో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆయుగంలో తెల్లటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతూ వెలుగొందుతుంటాడు.)

కృతయుగంలో నిర్వహించవలసిన కర్తవ్యాలను నూటికి నూరుపాళ్ళూ అందరూ నిర్వహిస్తుంటారు. కాబట్టి చేయబడనటువంటి కర్తవ్యమే ఆ యుగాన ఉండదని చెప్పబడింది. అందుచేత ధర్మం నాలుగు పాదాలు అంటే నూటికి నూరుపాళ్ళు.

వ. అది సనాతన ధర్మసనాథం; బందుల బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రు లేకవేదక్రియాయోగులై యకామ ఫలసంయోగంబునఁ బుణ్యలోకంబులు వడయుదు; రందు నసూయాభిచారదర్పపైశునవిగ్రహ క్రోధమద మత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియ క్షయంబులు లేవు. మఱియుఁ ద్రేతాయుగంబునందుఁ ద్రిపాదంబై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞ తపో దానది క్రియల వర్తింతు రందు రక్తవర్ణుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబుఁ జేయు.

(ఆ కృతయుగం శాశ్వతస్వరూపమైన ధర్మంతో కూడిఉంటుంది. అందు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఒకే విధమయిన వేదం ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారై ఉంటారు. వారికి కోరికలు లేకుండగానే సంక్రమించే ఫలాల వలన ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గుణవిజృంభణ ఉండదు. మంచిగుణాలకు చెడుఉద్దేశ్యాలు ఆరోపింపబడవు. శత్రువులపై పగ తీర్చుకోవటానికి మంత్ర తంత్ర కర్మలు జరగవు. డాబు, పిసినిగొట్టు తనం, కలహస్వభావం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెఱపు, దుఃఖం, రోగం, ప్రజానాశనం, ఇంద్రియ పటుత్వం తగ్గటం ఉండవు. ఇంక త్రేతాయుగంలో ధర్మం మూడుపాదాలతో ప్రవర్తిల్లుతుంది. అందులో జనులు ఎల్లప్పుడూ నిజం చెప్పటం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు తపస్సు దానం మొదలైన పుణ్యకార్యాలను చేయటంలో ప్రజలు ఆసక్తి కలవారౌతారు. ఆ త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు ఎర్రటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతాడు.)

ద్వాపరంబున రెండుపాదములఁ జేసి నడచు ! ధర్మువు వేదముల్ నాల్గుదెఱఁగు

లై ప్రవర్తిల్లు వేదశాస్త్రార్థ చోది ! తంబులై ధర్మకామముల్ ధరణిఁ బరఁగు. 3-3-338

(ద్వాపరయుగంలో ధర్మం రెండుపాదాల నడుస్తుంది.వేదాలు నాలుగు తెఱగులుగా ప్రవర్తిల్లుతాయి. వేదాలలోను, శాస్త్రాలలోను ప్రతిపాదించబడిన భావాలచేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి.)

సత్యశమహీను లగుదురు జనులు గామ ! కాములై చేయుదురు బహుక్రతువు లోలి;

నందుఁ ద్రైలోక్యవందితుం డచ్యుతుండు ! కృష్ణవర్ణుఁడై జగము రక్షించు మఱియు. 3-3-339

(ఆ ద్వాపరయుగంలో ప్రజలు నిజాన్ని మాట్లాడటం తప్పుతారు. అందరు ఇంద్రియనిగ్రహాన్ని కోల్పోతారు. కోరికలయెడల ఆసక్తి కలవారై పెక్కు యజ్ఞాలు నిర్వహిస్తారు. ఆ యుగంలో విష్ణుదేవుడు నీలవర్ణుడై జగత్తును కాపాడుతాడు.)

కలియుగమునందు ధర్మము ! బలమఱి వర్తిల్లు నేకపాదంబున నం

దలఘుఁడు కృష్ణుఁడు జగతీ ! వలయము రక్షించుఁ బీతవర్ణుం డగుచున్. 3-3-340

(ఆ కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒకే చరణాన నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపురంగు కలవాడై ప్రపంచాన్ని కాపాడుతాడు.)

వ. అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబున దమ్మెఱుంగక యధర్మవర్తు లగుదు రందుఁ జేసిన తపోదానాదికర్మంబులుస్వల్పంబులయ్యును బహు ఫలంబులగునని యుగవర్తన ప్రకారంబులు జెప్పి3-3-341

(ఆ కలియుగంలోని జనులు కోరికలు, కోపం మొదలైన ఆఱు దుర్గుణాలను(అరిషడ్వర్గాలు) పెంచుకొని, తమను తాము తెలిసికొనలేని ఆవేశం కలిగి అధర్మమార్గంలో వర్తిల్లుతారు.కాని, ఆ కలియుగంలో చేసిన తపం, దానం మొదలైన సత్కార్యాలు స్వల్పమైనవైనా హెచ్చు ఫలితాలను ఇస్తాయి’ అని హనుమంతుడు భీమునకు ఆ యా యుగాలు ప్రవర్తించే తీరుతెన్నులను తెలియజేస్తాడు.)

అప్పుడు భీముడు హనుమంతుణ్ణి సముద్రలంఘనం నాటి అతని రూపాన్ని చూడాలని ఉందని కోరగా హనుమంతు డతని కా రూపాన్ని చూపిస్తాడు. హనుమంతుడు భీమునితో- నీవు సౌగంధికాహరణానికి వెళ్తున్నావు, అక్కడ సాహసం చెయ్యొద్దు. దేవతలు భక్తి సాధ్యులు గాని సాహసక్రియాసాధ్యులు కారు. ఆచారంబున ధర్మంబు వుట్టు; ధర్మంబువలన వేదప్రతిష్ఠ యగు; వేదంబులం జేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు; అట్టి యజ్ఞంబులన దేవతలు తృప్తులగుదురు.

కార్యసిద్ధిపొంటెఁ గాలంబు దేశంబు ! నెఱిఁగి బుద్ధిమంతు లెల్ల ప్రొద్దు

సాహసంబు విడిచి సామాద్యుపాయ ప్ర ! యుక్తి చేయుదురు యథోచితముగ. 3-3-348

(ఏ కర్తవ్యాన్ని నెరవేర్చటంలోనైనా బుద్ధిమంతులు తగిన సమయాన్ని తగిన స్థలాన్ని తెలిసికొని సాహసాన్ని వదలి సామదాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించతగునో అట్లాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు.)

హనుమంతుడు – యుద్ధ సమయంలో నన్ను తలచుకోండి. అర్జునుని రథకేతనము మీద ఉండి మీ మీ యుద్ధసామర్థ్యాల్ని చూడగలవాడను అని చెప్పి అదృశ్యుడౌతాడు.

ఉత్తమక్షత్త్రియుం డేల యొరుల నడిగి ! వేఁడువాఁడగుఁ ? దన భుజవిక్రమమున

నన్యధనము లుపార్జించి యర్థిజనుల ! కిచ్చి కీర్తి దిక్కుల వెలయించుఁ గాక. 3-3 365

కుబేరుని ప్రార్థించి సౌగంధిక పుష్పములను తీసుకొని వెళ్ల వచ్చని భీమసేనుడితో కుబేరుని భటులు అన్నసమయంలో భీముడు వారితో ఇలా అంటాడు.

వారినందరినీ ఓడించి సౌగంధికాహరణం చేస్తాడు భీమసేనుడు. తరువాత జటాసురుడనే రాక్షసుడు పాండవుల అతిథిగా ఉంటూ భీమసేనుడు దూరంగా ఉన్నప్పుడు ద్రౌపదిని, ధర్మరాజును, నకులుడిని యెత్తికొని పోతుండగా సహదేవుడు భీముడిని పిలుస్తాడు. ధర్మరాజు జటాసురునితో

అతిథివై వచ్చి నీవు మాయందు  గుడిచి ! యసురవై యిట్లు యెగ్గు సేయంగ నగునె?

యెందుఁ గుడిచినచోటికి నెగ్గు సేయ ! రెట్టి దుర్జను లైనను నెఱుక విడిచి. 3-3-390

(నీవు మా దగ్గఱకు అతిథిగా వచ్చి మాతో కలసి తిండి తిని, రాక్షసుడివై ఉపకారం చేసినవారికి అపకారం చేయతగునా? ఎంతటి చెడ్డవారైనప్పటికీ, తిండిపెట్టినవారికి బుద్ధిలేకుండా కీడు చేయరు.)

భీముడు జటాసురునితో యుద్ధం చేసి అతడిని చంపివేస్తాడు. ఇక్కడితో ఆరణ్యపర్వం తృతీయాశ్వాసము ముగుస్తుంది. చతుర్థాశ్వాసము లోనికి ప్రవేశిద్దాం రండి. ఈ ఆశ్వాసాన్ని నన్నయగారు పూర్తిగా తెనిగించలేదు. ఆయన తెనిగించినంతవఱకూ చూద్దాం, రండి.

చతుర్థాశ్వాసము

ఈ ఆశ్వాసంలో ప్రసిద్ధి చెందిన ఘట్టం నహుష ప్రశ్నలు.

నహుషుడు పాండవుల వంశంలో ఎంతో పురాతన కాలంలో ఉన్న రాజు. అతడు దేవేంద్రపదవిని అధిష్ఠించి గర్వితుడై వేయిమంది బ్రాహ్మణులు మోస్తున్న రథాన్ని ఎక్కి వారికి అవమానం చెయ్యగా పామువై పడిఉండమని అగస్త్య మహాముని అతనికి శాపం ఇచ్చాడు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవ్వరు సరియైన సమాధానం చెబుతారో వారివలన నీకు శాప విముక్తి అవుతుంది అని అగస్త్యుడు శాపవిమోచనం గుఱించి చెప్పాడు. నహుషుడు భీముడిని పట్టుకొని తనప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరతాడు. భీముడు సమాధానాలు చెప్పలేక నహుషుని బందీగా మిగులుతాడు. అప్పుడు ధర్మరాజు భీముని విడిపించటానికివచ్చి నహుషప్రశ్నలకుఆ నహుష ప్రశ్నలకు ధర్మరాజు సదుత్తరాలను ఇచ్చి అతని శాపం పోగొడతాడు. ఆ నహుష ప్రశ్నలు వాటి జవాబులు –

ఘనుఁడ! యే గుణములు గలవాఁడు బ్రాహ్మణుం?! డతని కెఱుఁగఁదగినయట్టి వస్తు

వెద్ది ? దీని నాకు నెఱుఁగింపుమనిన ని ! ట్లనుచుఁ జెప్పెఁ బాండవాగ్రజుండు. 3-4-126

(‘ఓ గొప్పవాడా! ఏగుణాలున్నవాడు బ్రాహ్మణుడుడని అనబడతాడు? అతనికి తెలియదగిన పరమార్థమేది? ఈ విషయాన్ని సవిస్తరంగా నాకు తెలుపునది.’ అని పెనుబాము ప్రశ్నించగా, పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు ఈ విధంగా బదులు పలికాడు.)

సత్యక్షమాదమశౌచదయాతపో! దానశీలంబు లెందేనిఁ గాన

నగు నట్టివాఁడు బ్రాహ్మణుఁడు సుఖంబు దుః! ఖంబు నై నెడ విమోహంబు నొంద

కునికియ వానికి నుత్తమం బగు విద్య’! యనిన నీ చెప్పిన గుణము లివియు

క్రియ శూద్రునందుఁ గల్గిన నతం డుత్తమ ! ద్విజుడు గానేర్చునే? నిజము విడిచి

నట్టు లయిన బ్రాహ్మణాదివర్ణవిభాగ ! మెట్లు గలుగునయ్య? హీను లధికు

లను వివేక మది యపార్థకం బగుఁగాదె!’ యనిన ననియె నంతకాత్మజుండు. 3-4-127

(‘సత్యం, సహనం, ఇంద్రియనిగ్రహం, శుచిత్వం, కరుణ, తపస్సు, త్యాగం, సత్ స్వభావం అనే గుణాలు ఎవడి ప్రవర్తనలో ప్రస్ఫుటంగా కన్పిస్తాయో అట్టివాడే బ్రాహ్మణుడు. సుఖం, దుఃఖం ఏర్పడే పట్టులలో తాను మోహం పొందక సమబుద్ధితో ఉండగలగటమే బ్రాహ్మణుడు ఆర్జింపదగిన గొప్పచదువు’ – అని ధర్మరాజు పలికాడు. అంతట, నహుషుడు ‘ఓ ధర్మరాజా నీవు బ్రాహ్మణత్వం సత్ప్రవర్తనవలన సద్గుణాలవలన మాత్రమే సంప్రాప్తిస్తుందని పలుకుతున్నావు. అట్లయితే, నీవు పేర్కొనిన ఆ సద్గుణాలు ఆ సత్ప్రవర్తన శూద్రకులంలో పుట్టినవాడిలో కన్పిస్తే అతడిని బ్రాహ్మణుడు అని చెప్పగలవా ? అట్లయితే ఇక, అగ్రజన్ములు హీనజన్ములు అనే కులవిభాగం ఎట్లా ఏర్పడుతుంది ? హీనులు అధికులు కాగలరా ? అపార్థం కలుగకుండ వివరించవలసింది‘ – అని ఎదురు ప్రశ్న వేయగా ధర్మరాజు ఇట్లా పలికాడు.

విశేషం: ప్రాచీనభారతీయసాహిత్యంలో సంఘంలో బ్రాహ్మణుడికి విశేష ప్రతిపత్తి ఉండేది. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించేవాడు. ఎవడు బ్రాహ్మణుడు ? మహాభారతంలో రెండుతావుల గ్రుచ్చి గ్రుచ్చి వేయబడింది ఈ ప్రశ్న. ( ఈ ప్రశ్నే యక్షప్రశ్నలలో కూడా ఉన్నది). బ్రాహ్మణత్వం జన్మచేత మాత్రమే లభించదు అనే విషయాన్ని’ద్విజ’ శబ్దం నొక్కి చెప్పుతున్నది. ద్విజుడు – అనగా రెండుపుట్టుకలు కలవాడు. ఒకపుట్టువు – ప్రాకృత జన్మం,  జ్ఞాన సముపార్జన పిమ్మట లభించేది రెండవ జన్మం. (యక్షప్రశ్నలనుకూడ పరిశీలించండి.)

వ. ప్రమాదంబున వర్ణసంకరం బయినప్పుడు వర్ణ పరీక్షార్థంబుగా బ్రాహ్మణాదులకు వృత్తంబు వేఱువేఱ స్వాయం భవుండైన మనువు సెప్పె; సత్యాదిగుణంబులు శూద్రునందు గలిగెనేని వాఁడు సచ్ఛూద్రుండుఁగాక బ్రాహ్మణుండు గానేర్చునే ? యవి బ్రాహ్మణునందు లేనినాఁడు శూద్రుం డనంబడుఁ గావున వృత్తంబ యుత్తమంబు. 3-4-128

(ప్రమాదాలు సంభవించి వర్ణసాంకర్యం ఏర్పడినప్పుడు కులాలను నిర్ణయించటానికై వేరు వేరు ప్రవర్తనలను గుణాలను స్వాయుంభువ మనువు నిర్ణయించి చెప్పాడు. సత్యం మున్నగు మంచి లక్షణాలు శూద్రకులంలో జన్మించిన వాడిలో ఉన్నప్పుడు అతడు మంచి శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణుడు కాగలడా అట్టి సద్గుణాలతో కూడిన సత్ప్రవర్తన బ్రహ్మణకులంలో పుట్టినవాడిలో లేనియెడల, అట్టివాడు శూద్రుడు అని చెప్పక తప్పదు. కాబట్టి సత్ప్రవర్తనే గొప్పది.)

వృత్తవంతుండు వెండియు వివిధగతుల వృత్తవంతుండు గా నేర్చు వృత్తహీను

డైనవాఁడు విహీనుండ యండ్రు గాన విత్తరక్షకుఁ గడు మేలు వృత్తరక్ష. 3-4-129

(మంచినడవడి కలవాడు, మరల మరల పెక్కుభంగుల తన సౌశీల్యాన్ని కాపాడుకొనగలడు. సత్ప్రవర్తన లేనివాడు, ఎన్నటికిని లేనివాడే.ధనాన్ని కాపాడుకొనటంకంటె తన సౌశీల్యసత్ప్రవర్తనలు కాపాడుకొనటమే మేలు.)

అలా అనగా అజగరం మరలా ఇలా అన్నది.

అప్రియంబుఁ జేసియు మఱి యనృతవాది ! యయ్యు హింస గావింపని యమ్మహాత్ముం

డేఁగు సుగతికి నం; డ్రది యె ట్లహింస ! యనఘ యింత విశేష మెట్లయ్యె చెపుమ!’3-4-131

( పాపరహితుడవైన ఓ మహాత్మా! ఇతరులకు అపకారాలు చేసి, అసత్యాలు పలికినప్పటికిని హింసచేయనివాడు పుణ్యలోకాన్ని ఆర్జిస్తాడు అని పెద్దలు చెప్పుతారు. ఇది యెట్లా సాధ్యం?  ‘ అహింస ’ ఇంతటి పరమ ధర్మం ఎట్లా అయిందో దయచేసి నాకు వివరించి చెప్పుము.)

వ. అనిన ధర్మతనయుం డి ట్లనియె : ‘దానంబును బ్రియంబుచేఁతయును సత్యంబును నహింసయు ననునవి నాలుగును సమంబుల యయినను నహింస విశేషం; బెట్లనిన దేవమనుష్యతిర్యగ్యోను లను మూఁడు గతుల యందును మనుష్యుండు దానాదిగుణంబులు గలిగి యహింసాపరుం డయిన దేవగతి వడయు; విపరీతవర్తనుండు తిర్యగ్యోనులం బొందు నని యిట్లు తన చేసిన ప్రశ్నంబులకు నుత్తరంబులు చెప్పిన ధర్మరాజున కతిప్రీతుం డై భీమసేనుని విడిచి శాపవిముక్తుండై దివ్యరూపంబు సేకొనియున్న నహుషువలన నధ్యాత్మవిద్యారహస్యంబు లిమ్ముగా నెఱింగి యుధిష్ఠిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు వచ్చియున్నంత.

(అనిన, ధర్మరాజు ఈవిధంగా చెప్పాడు; ’దానం, పరోపకారం, సత్యం, అహింస – అనేవి నాలుగున్నూ సమానాలైన గొప్పధర్మాలే. అయినను, వాటిలో అహింస మిక్కిలి గొప్పది. జీవుడు – దేవతలలో మనుజులలో జంతువులలో పునర్జన్మం ఎత్తుతూ ఉంటాడు కదా! అందులో దానదయాది గుణాలు కలవాడై అహింసను దీక్షతో ఆచరించినవాడు దేవజన్మం పొందుతాడు ; హింసాపరుడు జంతువుగా జన్మిస్తాడు. దానాది సద్గుణాలు కలిగి అహింసాపరుడైన మనుజుడికి దివ్యత్వం లభిస్తుంది కాబట్టి ‘అహింస’ పరమధర్మంగా పేర్కొనబడింది‘  అని చెప్పాడు. అంతట నహుషుడు, ధర్మరాజు చెప్పిన సమాధానాలకు మిక్కిలి ప్రీతిచెందినవాడై భీముడిని విడిచిపెట్టాడు. అప్పుడు నహుషుడికి శాపవిమోచనం ఏర్పడి అతడు దివ్యమైన ఆకృతితో నిలిచి, ధర్మరాజుకు పెక్కు అధ్యాత్మిక విద్యారహస్యాలను బోధించాడు. అంతట ధర్మరాజు భీముని తోడ్కొని తన నెలవుకు వెళ్ళాడు.)

అప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం గడిచిన తర్వాత శరత్కాలం వచ్చింది. ఆ శారద రాత్రుల వర్ణనతో నన్నయగారి శ్రీమదాంధ్రమహాభారతానువాదం పూర్తవుతుంది. ఆ చివరి పద్యం ఇదిగో ఇక్కడ చూడండి.

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం

జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో

దారసమీరసౌరభము తాల్చి సుధాంశునికీర్యమాణ క

ర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబులై. 3-4-141

అవి శరత్కాలంలోని రాత్రులు మిక్కిలి ప్రకాశమానా లైన నక్షత్ర మాలికలతో కూడిఉన్నవి. వికసించిన కొంగ్రొత్త తెల్లకలువల దట్టమైన సుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి. అంతటా వెదజల్లబడిన కప్పురపుపుప్పొడివలె ఆకసాన్ని ఆవరించిన చంద్రుడి వెన్నెల వెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా ఉన్నాయి.

నన్నయభట్టు కవిత్వం సంపూర్ణం. ఇది ఆరణ్యపర్వ ప్రథమ భాగం. ఇకనుండి ప్రబంధపరమేశ్వరుడైన ఎఱ్ఱానామాత్యుని రచన లోనికి ప్రవేశిద్దాం. రండి.

You Might Also Like

2 Comments

  1. నరసింహారావు మల్లిన

    రాఘవగారూ!
    మీ పద్యం చాలా బాగుందండీ. మీలా అలవోకగా పద్యాలు వ్రాయటం ఎప్పటికైనా నేర్చుకోవాలి. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ప్రబంధపరమేశ్వరుడు, శంభుదాసుడు అని పేరుగాంచిన ఎఱ్ఱన గారి ఆరణ్యపర్వ శేషం లోనికి ఈ రోజే ప్రవేశిస్తున్నాను. బహుశః ఈ భాగం ఒక్కపోస్టుతో పూర్తికాకపోవచ్చనుకుంటున్నాను. మన ప్రయత్నలోపం లేకుండా అందరికీ నచ్చేలా వ్రాయాలని ప్రయత్నం.

  2. రాఘవ

    మిన్నగ భారతంబుఁ బ్రజ మేల్చదువం దొలి నాంధ్రమందు వ్రా
    సెన్ననుకంపనాఁగ నెదసీమలఁ జేరి వసించువానికిన్
    నన్నయకున్ దెనుంగునకు నాదికవీశ్వరుఁడైనవానికిన్
    సన్నుతి సేతుఁ గేల్కవనుఁ జక్కఁగ మోడిచి నేను భక్తితో

    మల్లినవారూ, చాలా సంతోషమండీ. ఎఱ్ఱనగారి భారతంకోసం ఎదురుచూస్తూంటాను.

Leave a Reply