“అనేక” మలుపుల మేలు కలయిక!

రాసిన వారు: రవి వీరెల్లి
*************
ప్రపంచీకరణ నేపద్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆర్ధిక అసమానతలు పెరిగాయి. కొత్త వాదాలు, కొత్త ఉద్యమాలు పాదుకుంటున్నాయి. మారిపోతున్న కాలంలో మానవీయ విలువలు, సంబంధాలు మారుతున్నాయి. కవిత్వం కూడా కాలానికి తగినట్లుగా మారుతూ రావాలి. కవులు ఈ మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకుంటూ జీవితాన్ని, సమాజాన్ని అన్ని కోణాల నుండి దర్శిస్తూ సమాజపు గొంతుకను కవిత్వం ద్వారా వినిపించాలి, వినిపిస్తున్నారు కూడా. మనకు అఫ్సర్, వంశీకృష్ణల సంపాదకీయంలో వచ్చిన ‘అనేక- పదేళ్ళ కవిత్వం’ చదివితే పోయిన పదేళ్ళలో కవిత్వం కూడా ఎన్ని మలుపులు తిరిగిందో ఖచ్చితంగా తెలుస్తుంది.

2000 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు తెలుగు సమాజంలో కవిత్వం తిరిగిన మలుపులను దాదాపు 200 మంది కవుల గొంతుకలలో వినిపిస్తూ, ఈ సందర్భాలనన్నిటిని చరిత్రగతిలో మరుగున పడకుండా ‘అనేక’ సంకలనం ప్రచురించడం కోసం అఫ్సర్, వంశీకృష్ణలు పడ్డ శ్రమ వృధా కాలేదు. ఈ పదేళ్ళలో, సమాజంలో చోటుచేసుకున్న అసమానతలు, అనేక విధాలైన అస్తిత్వ వాదాలుగా రూపు దిద్దుకుంటున్న నేపద్యంలో, వెయ్యి ముఖాలుగా విస్తరించిన కవిత్వ అస్తిత్వవేదనను బలంగా అభివ్యక్తికరిస్తూ, ఈ అనేక కొత్త గొంతుకలు చెప్పే కొత్త కొత్త విషయాలు మనల్ని తన్మయత్వంలోకి తోస్తూనే మనలో ఆలోచనలు రేకిత్తిస్తాయి. ఈ పదేళ్ళలో కవిత్వం సమాజంలోని స్థితిగతుల్ని స్పృశిస్తూ ప్రపంచీకరణ నీడలో అభ్యుదయ ప్రేరకమై, సమాజహితకరం అయి సాగిందా అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఈ సంకలనంలో దొరుకుతుంది.

“ప్రతి మలుపు దగ్గరా కవులు కవిత్వ సాధనం పనితీరుని పరీక్షించుకుంటారు. అది ఎంతవరకు కొత్త వాస్తవికతను పట్టుకోగలదన్నశోదనలో పడతారు. పాత రచనా ధోరణి ఇంకే మాత్రం పనికి రావటం లేదన్న సందిగ్దం నుంచి ఈ శోధన మొదలవుతుంది. ఈ ప్రయత్నం కేవలం కవిత్వాన్ని మార్చే ప్రయాస మాత్రమే కాదు. తక్షణ వాస్తవికతను కవిత్వీకరించాలన్న తపన మాత్రమే కాదు. ఆ వాస్తవికతను ఎంతో కొంత మార్చాలన్న తపనా, ప్రయత్నం కూడా అందులో వుంటాయి.” అంటున్న సంపాదకుల వాదన కొట్టి పడేసేది కాదు. సమాజాన్ని మార్చాలన్న తపన, ప్రయత్నమూ కొత్త గొంతుకలోచ్చిన ఈ కవుల కవితల్లో స్పష్టంగా వినిపిస్తుంది.

సాధారణంగా సంకలనానికి రాసే ‘ముందు మాట’ సంకలనంలోని వస్తువు పరిధిని నియంత్రించి పాఠకుడి ఊహా శక్తికి కూడా పరిధిలు నిర్ణయిస్తుంది అంటారు. కాని అఫ్సర్, వంశీకృష్ణలు రాసిన ‘ప్రపంచీకరణ నీడలో పదేళ్ళు’ వ్యాసం పాఠకుల ఆలోచన పరిధుల్ని మరింత విస్తరింపజేసి కొత్త చర్చకి నాంది పలికే విధంగా వుంది. ఈ పదేళ్ళలో వచ్చిన మేలు/మూల మలుపుల గురించి చెప్పడమే కాకుండా, ఆ మలుపులు కొత్త సందర్భంలో ఎలా వొదుగుతాయో చెప్పడం వల్ల చర్చకి కావలసిన అనుకూలమయిన వాతావరణాన్ని ఈ ముందు మాట కల్పిస్తోంది.

అనేక లో వివిధ విభాగాల కింద కవితలు కూర్చడం మంచి ఆలోచన. ఈ విభాగాలు కవిత్వ తీవ్రతని చెబుతూనే, కవిత తాత్వికత వైపు మన దృష్టి మల్లిస్తాయి. “అతడు – ఆమె”, “ఆవలి తీరం” లాంటి విభాగాలు నిజంగా వొక తాజాదనాన్ని ఇస్తున్నాయి.

‘అనేక’ సంకలం చరిత్రలో మొదటి సారి డయాస్పోరా రచయితలకు పెద్ద పీట వేసింది అనేది మనకు ఈ సంకలనం లో అధికంగా కనిపించే విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కవుల కవితలు చూస్తే అర్ధమైతుంది. ‘ఆవలి తీరం’ భాగంలోని కవితల్లో డయాస్పోరా కవుల భావావేశం మరియు ప్రపంచీకరణ మనిషి జీవితంలో సృష్టించిన అయోమయం కనిపిస్తుంది. ‘అక్కడేం లేదంట’ అనే కవితలో కే.సి చేకూరి, “నా సెంటు సీసాలు, వాచీలు ఎవరికి అక్కర్లేదిప్పుడు/నీక్కావాలంటే చెప్పు ఇక్కడో వెయ్యిగజం ఉంది చౌకలో/నేను ముందున్నట్లా వెనకపడ్డట్లా?” అని అయోమయ పడతాడు. అలాగే వినీల్ కుమార్ ‘గుర్తుందా గోదారీ’ అంటూ గోదారి మీద బెంగెట్టుకుంటాడు.

ఈ సంకలనంలోని కవితలని ఏడు ప్రధానమైన భావనలుగా క్షితిజలంబంగా వర్గీకరించినా, ఈ ఏడు వర్గాలను స్పృశిస్తూ- ప్రపంచీకరణ, IT రంగం, వలసలు, ఉద్యమాలు, స్థానికత, ప్రవాస వేదన ఇలా ఇంకెన్నో అంశాలు ముఖ్య వస్తువులుగా క్షితిజసమాంతరంగా ఈ సంకలమంతా ప్రవహిస్తూ మన ఆలోచనల్ని పదునెక్కిస్తుంటాయి. పదేళ్ళ కవిత్వాన్ని ఇలా భాగాలుగా విభజించి ప్రతి విభాగంలో ఇమిడే అర్ధవంతమైన కవితలను ఏరి కూర్చటం ఏమాత్రము సాధారణమైన విషయం కాదు.

ఈ సంకలనం అఫ్సర్ గారి కవిత ‘పద్యం పుట్టుక గురించి’ పద్యం కోసం ఆరాటపడుతూ మొదలై కౌముది గారి ‘మీకోసం నేనో పద్యం రాస్తాను’ తో ముగుస్తుంది. సంకలనం మొదటి భాగం ‘అక్షరం’లో, పద్య జాడల కోసం పరితపిస్తూ తమ హృదయాంతరాల్లో ఉన్న కవిత్వపు ఉనికిని ప్రశ్నించుకుంటూ కవిత్వాన్ని మళ్లీ నిర్వచించుకుంటున్న కవుల గుండె చప్పుళ్ళు పినిపిస్తాయి. రెండవ బాగం ‘అనుభవం’ లోని కవితల్లో, వాస్తవానికి దగ్గరగా అనుభవాన్ని అనుభవంగా యధాతదంగా చిత్రీకరించడానికి కవులు ఉపయోగించిన పద చిత్రాలు మనకు మాటలకందని అనుభూతిని మిగులుస్తాయి. మూడవ భాగం ‘అస్తిత్వం’ లోని కవితల్లో సమాజాన్ని అవగాహన చేసుకున్న ఆధునిక ఆందోళనల గొంతు వినిపిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వం పట్ల స్పష్టమైన దృక్పధం కనిపిస్తుంది. ఈ విభాగంలోని కవితలు చదువరి అస్తిత్వ పరిధులు కూడా విస్తరింపజేసి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. ‘ఆందోళన’ విభాగంలోని కవితల్లో కవి జనజీవన స్రవంతిలో మమేకమై సమాజం లోని వాస్తవికతను మనతో ఏకరువు పెడుతున్నట్టుగా ఉంటుంది. ‘మనం కోరుకునే శాంతి/గుండె చప్పుడుకు, తుపాకి మొనకు మధ్య/ఊగిసలాడుతుంది’ అంటూ, యాకూబ్ కవి ‘రేషన్ లో శాంతిని ఈ రాజ్యం ఎంత కేటాయిస్తే/అంతే సంచిలో తెచ్చుకోవాలి.’ అని వాపోతాడు.

మిగతా విభాగాల్లోని కవితల్లో ఆందోళన, ఆవేదన, ఆవేశం, ప్రగతిశీల భావనలతో పాటు పాఠకుడి హృదయంతరాలల్లోకి వాడిగా చొచ్చుకుపోయే కవితాత్మ కనిపిస్తుంది. ఎస్. రవికుమార్ ‘స్థితి’ అనే కవితలో ‘జీవితం అనేక దృశ్యాలుగా మారినప్పుడు/కాలం మిగిల్చిన కన్నీటి/కథలను పేర్చుకోవడం తప్ప/రేపటి కోసం ఎదురుచూపు ఉండదు’ అంటూ ఆందోళన చెందుతాడు.

చివరగా, కవులు తమ కలాలను కాలాలకు అనుగుణంగా ప్రతీ మలుపు దగ్గర సానబట్టుకుంటూ, సమకాలీన పరిస్థితులకు దర్పణమై జీవితాన్ని అన్నికోణాల నుండి చూస్తూ, సమాజానికో దిక్కూ, దిశా నిర్దేశించే దిశగా కదులుతున్నారని ఈ సంకలనం నిరూపిస్తుంది. అంతేకాకుండా ఈ పదేళ్ళలో తెలుగు సాహిత్యం తన ఉనికిని తనే ప్రశ్నించుకుంటూ అస్తిత్వ స్పృహతో పూర్తి పరిపూర్ణత సంతరించుకుని కొత్తపుంతలు తొక్కుతున్నది అన్నది కూడా ఈ సంకలనం ద్వారా తెలుస్తుంది.

పుస్తకం వివరాలు:
అనేక, పదేళ్ళ కవిత్వం
పుటలు: 404, వెల : రూ. 199.
డాలర్లలో : $ 9.99
సంపాదకులు: అఫ్సర్, వంశీ కృష్ణ
సారంగ సంపాదకులు: రాజ్ కారంచేడు
సారంగ బుక్స్ మిగిలిన వివరాలకు: www.saarangabooks.com

ఇండియాలో ప్రతులకు:
Palapitta Books
Flat No: 3, MIG -II
Block-6, A.P.H.B.
Baghlingampally,
Hyderabad-500 044 AP India
Direct: 040-27678430
Mobile Phone: 984 878 7284
Email: palapittabooks@gmail.com

You Might Also Like

8 Comments

  1. kavitha

    ఆనేకలో అనేకమంది రాశారు గాని అందులో కవులు కాని వాళ్ళే ఎక్కువ. సెలెక్షన్ ఏమి బాగా లేదు.గుర్తుంచుకోదగ్గ కవితలు రెండువందల్లో ఇరవై ఉంటాయి.
    – కవిత

  2. Nutakki Raghavendra Rao

    Dear Ravi “అనేక” మలుపుల మేలు కలయిక ….పరిచయం చాల బాగుంది.!as you expressed,
    “తక్షణ వాస్తవికతను కవిత్వీకరించాలన్న తపన మాత్రమే కాదు. ఆ వాస్తవికతను ఎంతో కొంత మార్చాలన్న తపనా, ప్రయత్నం కూడా అందులో వుంటాయి.” అంటున్న సంపాదకుల వాదన కొట్టి పడేసేది కాదు….nice
    to go through it….Nutakki Raghavendra Rao.

  3. Raji

    “అనేక” మలుపుల మేలు కలయిక! రవి గారు చాల చక్క గా రాసారు ఈ వ్యాసం. కవిత్వం సమాజానికి తోడ్పడ గలదన్న రవి గారి స్పందన బావుంది . ఈ చక్కని వ్యాసం చదివాక నేను కూడా “అనేక” చదివాను. నిజం గా “అనేక” ఒక చక్కని ప్రయత్నం. కవితలన్నీ ఒక కూర్పుగా చేసిన అఫ్సర్ మరియు వంశీకృష్ణ గార్ల ప్రయత్నం నిజంగా హర్షనీయం.

    –రాజి

  4. రవి వీరెల్లి

    వర్మ గారు, జగధాత్రి గారు, వెంకట్ గారు:
    ధన్యవాదాలు.

    రామకృష్ణ గారు:
    థాంక్స్. కవిత్వానికున్న కొన్ని ప్రత్యేకతల వల్ల దానికి సమాజాన్ని మార్చగలిగే గుణం ఉంటుందనుకుంటున్నాను.

    -రవి వీరెల్లి

  5. రామకృష్ణ

    రవి గారు, మంచి సంకలనాన్ని పరిచయం చేసినందుకు థాంక్స్.
    ఈ రోజే చదవడం మొదలెట్టాను. సంకలనం లోని ‘ముందు మాట’ ఆలోచనలు రేకెత్తించే విధంగానే కాదు కవ్వించే ధోరణి లో కూడా ఉంది. అయితే, కవిత్వం పదేళ్ళలో తిరిగిన మలుపులను చిత్రీకరిస్తూ ఇలా సంకలనంగా తీసుకురావాలన్న ఆలోచన చాలా కొత్తగా ఉంది. మంచి ఆలోచన. అఫ్సర్ గారికి, వంశీకృష్ణ గారికి నా అభినందనలు.
    నిజంగా కవిత్వానికి సమాజాన్ని మార్చే గుణం ఉందంటారా?

    -రామకృష్ణ

  6. Venkat

    I do not know about poetry but after reading your review, now I am very much interested in reading it.

    Very good Review and thanks for the very good telugu language you used.

  7. jagaddhatri

    ANEKA palu vishayamsala padella kavithvam nu ponduparichindi anadamlo sandeham ledu. aneka sardhaka namadheyame. vishay charchaku avakasamiche o reference guide ani cheppavchu. parichayam chesina ravinder ki abhinanadanalu…..love j

  8. కెక్యూబ్ వర్మ

    రవి వీరెల్లి గారు ‘అనేక’లో పొందుపరచిన 182 కవుల హృదయ స్పందనలను ప్రోదిచేసిన విషయాన్ని ఆత్మీయంగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు కవుల సామాజిక విశ్లేషణను అంచనా వేసే కరదీపికగా అనేక తప్పక గుర్తింపబడుతుంది. సంపాదకుల కృషి శ్లాఘనీయం..

Leave a Reply