రోమన్ తెలుగు పుస్తకాల ముద్రణ : ఆవశ్యకతా, అవకాశాలూ, లాభనష్టాలూ

ఇటీవల ఒడిశా రాష్ట్రానికి చెందిన తెలుగుజిల్లా బరంపురంలో ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. తెలుగుజాతి, తెలుగుభాష, తెలుగు చరిత్ర-సంస్కృతుల ఔన్నత్యాల్ని నెమరు వేసుకుని ఎవఱింటికి వారు వెళ్ళారు. తెలుగుభాషకు ఎదురవుతున్న అనాదరణను ప్రస్తావించి చాలామంది బాధపడ్డారు. ఇంత రోజువారీ రొడ్డకొట్టుడు (routine) మధ్య కొట్టొచ్చినట్లు కానవచ్చిన మార్పు – మన దగ్గఱ ముక్కులు పిండి పన్నులు దండుకుంటున్న ఆంధ్రప్రభుత్వానికి మన రాష్ట్రభాష పరిరక్షణ విషయంలోతప్పనిసరిగా ఒక పాత్ర ఉందనీ, మాతృభాష అనేది ఇష్టమొచ్చినప్పుడు నేర్చుకుని, లేనప్పుడు మానేసే ఒక వ్యక్తిగత అభీష్టమో (personal preference), సాంస్కృతిక పురావస్తువో (cultural relic) కాదనే తెలివిడీ, స్పృహా అందఱిలోనూ నెమ్మది నెమ్మదిగా కలుగుతూండడం. ఈ స్పృహా, ఈ భాషాభిమానమూ భాషాచైతన్య స్థాయికి ఎదిగి, సార్వజనీనంగా విస్తరించి, ఒక ఉద్యమంగా ఉన్నతీభవించి, ఒక విప్లవంగా విజృంభించే రోజు రావాలని ఆశించడం మినహా ప్రస్తుతానికి ఏమీ చేయలేం.

తెలుగువారు ఇన్నికోట్లమంది, అన్నికోట్లమంది అని చెప్పుకుని మురిసిపోవడమే తప్ప “ఈ తెలుగువారిలో ఎంతమందికి తెలుగు వ్రాయనూ, చదవనూ వచ్చు ?” అనే ప్రశ్న మనమెప్పుడూ వేసుకోం. బరంపురంవాళ్ళు వేసుకున్నారు కానీ మఱీ అంత లోతుగా వేసుకోలేదు. అదే కాదు, ఇంకా చాలా చాలా ప్రశ్నలు మనం వేసుకోం. భాష సజీవంగా ఉండాలంటే దాన్ని రోజూ మాట్లాడితే సరిపోతుందా ? రోజూ మాట్లాడే తెలుగులో తెలుగుపాలు ఎంత ? ఒక భాషని భాషగా నిలబెట్టడానికి ఆ మాత్రం పదజాల పరిజ్ఞానం సరిపోతుందా ? భాష అంటే కేవలం “రా, పో, కూర్చో, తిను, ఉండు, వెళ్ళు, చాలు, కావాలి, వద్దు” అంటూ పొడిపొడిగా మాట్లాడేదేనా ? సామెతలూ, పొడుపుకథలూ, నుడికారాలూ, జాతీయాలూ, పద్యాలూ, పాటలూ, పదబంధాలూ, శబ్దపల్లవాలూ, వాక్యనిర్మాణాలూ ఇత్యాదిగా గల భాషాశాఖలూ, ఆకులూ, పువ్వులూ, కాయలూ, వేళ్లూ అన్నీ నఱికేస్తే భాషావృక్షానికి మనుగడ ఉంటుందా ? మన భావాత్మక వాతావరణాన్ని (thought climate) ని ముంచెత్తుతున్న ఇప్పటి ఆంగ్ల మాధ్యమ విద్యా వాతావరణంలో ఇవన్నీ యథాపూర్వంగా బతికి బట్టకట్టే మార్గమేదైనా ఉందా ?

ఒక భాషకు చెందిన ప్రజలు తమ లిపిని తాము నేర్చుకోకపోవడం వల్లా, తద్ద్వారా తమ భాషను తామెన్నడూ లిఖితరూపంలో దర్శనం చేసుకోకపోవడం వల్లా చాలా అనర్థాలు సంభవిస్తాయి. అవి శాశ్వత స్వభావం గలిగినటువంటివి. వాటిని పూడ్చుకోవడం తదనంతర కాలంలో ఎన్నటికీ సాధ్యం కాకపోవచ్చు. వాటిల్లో తొలుదొల్త ఎన్నదగినది, తమ పాత సాహిత్యంతో ఆ ప్రజలకు లంకె (link) తెగిపోవడం. తద్ద్వారా పూర్వోదాహరణల అపరిచయం, లేదా లేమి (want of precedents) వల్ల ఆ భాషలో సృజనాత్మకత దెబ్బదింటుంది. రెండోది, భాష స్థిరత్వాన్ని కోల్పోవడం. వ్రాతలో ఆ భాషని ఎలా వ్రాస్తారో, ఎలా పలుకుతారో (phonetics) తెలియకా, శిక్షణిచ్చేవారు లేకా, వాడుకలో ఆ భాషలోని పదాలకున్న ప్రామాణిక స్వరూపం (standardization) సమూలంగా, బహువేగంగా మారుతూ ఆఖరికి నశించిపోవచ్చు. ప్రామాణికత అంటూ ఏమీ లేకపోవడంతో ఎవఱిష్టమొచ్చినట్లు వారు దాన్ని మాట్లాడుతూ, రాస్తూ చివఱికి ఆ భాష అంతరించడానికి (extinction) కారణమౌతారు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సిన పిండితార్థమేమంటే – వ్యవహారం భాషనీ, జాతినీ ఎంతగా నిలబెడుతుందో, లిపిపరిజ్ఞానం దాన్ని అంతకంటే ఎక్కువ నిలబెడుతుందని !

తెలుగులో అక్షరాస్యులు (literate) కాని తెలుగువారిని, ముఖ్యంగా నగర నాగరీక విద్యావంతుల్ని అక్షరాస్యుల్ని చేయడానికి ఒక పెద్ద ఉద్యమమే అవసరమవుతుంది. మనం చేఱేకుల్ని (placards) పట్టుకుని తెలుక్కి మద్దతుగా నినాదాలిస్తూ వీథిన పడడంతో పాటు ప్రాదేశిక మండళ్ళు (committees) గా ఏర్పడి, స్థానికంగా ఏయే ఇళ్ళల్లో తెలుగు వ్రాయడమూ, చదవడమూ రాని పిల్లలూ, పెద్దవాళ్ళూ ఉన్నారో గుర్తించి, వారి యింటికి రోజూ వెళ్ళి తెలుగులో ట్యూషన్ చెప్పే ప్రయత్నమేదైనా చేయాలి. 12 – 14 ఏళ్ల లోపు పిల్లలకు లిపి నేర్పడం సులభం. అది దాటితే చాలా కష్టం. మనుషులు ఎదిగినకొద్దీ భౌతిక అవరోధాలేమీ లేకపోయినా అనేక మానసిక అవరోధాల (mental barriers) తో బాధపడడం మొదలుపెడతారు. వారి పూర్వజ్ఞానాల/ అనుభవాల మోతబరువు ప్రస్తుత జ్ఞానసంపాదనకు అడ్డుపడుతుంది. అది తమ హేతువాదం, స్వీయ విచక్షణాశక్తి, వ్యక్తిత్వం అని భ్రమిస్తారు. కానీ నిజానికి వారు అన్ని రకాల జ్ఞానాలనూ ప్రతిఘటిస్తారు. వారు ఎదక్కముందు ఎంతవఱకూ తెలుసుకుని ఉన్నారో శాశ్వతంగా అక్కడే ఆగిపోతారు. ఇది నూటికి 90 శాతం మంది విషయం.

అందుచేత తెలుగులిపి తెలియని, ఎదిగిన అందఱు తెలుగు పిల్లలకీ, వయోజనుల (adults) కీ తెలుగులిపిని ఉన్నపళాన నేర్పలేం. వారికి తెలిసిన లిపి ద్వారా వారికి తెలుగు సాహిత్యపు మాధుర్యాన్ని రుచి చూపాల్సి ఉంటుంది. విదేశాల్లోనూ, విరాష్ట్రాల్లోనూ నివసించే కోట్లాదిమంది తెలుగువారికి తెలుగు మాట్లాడడం బాగానే వచ్చు. తెలుగు టెలివిజన్ కార్యక్రమాల్ని వారూ మనలాగే అర్థం చేసుకొని ఆస్వాదించగలరు. కానీ తెలుగులో చదవలేరు, వ్రాయలేరు. వ్రాతలో ఉన్న ప్రతి తెలుగు సామగ్రీ వారికి విదేశీయంగానే జమ. తెలుగులిపి నేర్చుకోవడానికి ఆ ప్రాంతాల్లో వ్యవస్థాగతమైన ఏర్పాట్లు కఱువు. ఇక్కడ కూడా, మన రాష్ట్రప్రభుత్వం రూపొందించిన చిత్ర విచిత్ర నియమ నిబంధనల వల్ల కె.జి. నుంచి పి.జి. దాకా, రాష్ట్రభాష అయిన తెలుగు అక్షరాల మొహమే చూడ నవసరం లేకుండా మనిషి విద్యావంతుడయ్యే ఒక సర్వలోక విరుద్ధమైన అపూర్వ సదుపాయం మన రాష్ట్రంలో ఉంది. మన యొక్క ఈ కాస్మోపాలిటన్ తత్త్వానికి మనమంతా గర్వించాలి. కానీ అలాంటివారి దగ్గఱికి తెలుగు సాహిత్యాన్ని తీసుకువెళితే తప్ప ఈ భాషనీ, దీని సాహితీ సంప్రదాయాల్నీ కాపాడలేం. ఎందుకంటే ఇలా చిన్నతనం నుంచీ తెలుగుమొహం చూడకుండా విద్యావంతులైనవారిలో అధిక సంఖ్యాకులు సమాజంలో చాలా ధనికులూ, పరపతిమంతులూ, అధికారవంతులూను ! కనుక మన లక్ష్యసాధన దిశగా వారిని కలుపుకొని పోకుండా నిర్లక్ష్యం చేయలేం. గతంలో నాకు ఒకచోట తారసిల్లిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1 కోటీ 33 లక్షలమంది పిల్లలు బళ్ళకు వెళుతున్నారట. కానీ వారిలో తెలుగు నేర్చుకుంటున్నది 90 లక్షల మందే. మిహతా 43 లక్షలమందినీ ఏం చేద్దాం ? తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయకుండా అలా గాలికొదిలేద్దామా ? కాలక్షేపం కోసం చదువుకోవడానికి ప్రతివారికీ అనునిత్యమూ ఏదో ఒక పఠన సామగ్రి (Reading material) కావాలి. వారికి తెలుగక్షరాలు రాక, వారు కేవలం ఇంగ్లీషు పుస్తకాలే పట్టుకు కూర్చుంటారు. వారి మనోమయ ప్రపంచంలో ఎల్లెడలా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాయే. తెలుగుభాష శూన్యం. తెలుగుసమాజం అదృశ్యం. తెలుగు చరిత్ర మాయం. తెలుగు సంప్రదాయాలు జానే దేవ్.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజల స్థాయిలో మనకున్న ఒక తాత్కాలిక మార్గం – తెలుగు పుస్తకాలు ఏకకాలంలో రెండు, మూడు లిపుల్లో లభ్యమయ్యేలా చూడడం. ప్రస్తుతం ’ఈమాట’ ఆన్‌లైన్ పత్రికవారు తమ ప్రచురణను తెలుగు, ఇంగ్లీషు రెండు లిపుల్లోనూ అందుబాటులో ఉంచుతున్నారు. అయితే వారు వాడుతున్నది RTS. అందులో లేఖన సౌలభ్యమే తప్ప పఠన సౌలభ్యం లేదు. పదమధ్యపు క్యాప్సుతో అది ఆద్యంతమూ అత్యంత వికారదర్శనం కలిగి ఉంటుంది. ఇది మనకు గడ్డుగా గోచరించడానికి బహుశా ఓ కారణం – ఇది మనం అలవాటుపడ్డ ఇంగ్లీషు పదాల రూపంతో సరిపోలకపోవడం. ఉదాహరణకు-

ముళ్ళపూడిగారు మద్రాసులో మరణించారు
అనే వాక్యాన్ని RTS లో
muLLapUDigAru madrAsulO maraNincAru
అని వ్రాస్తారు.

ఈ విధమైన వర్ణక్రమం (spellings) తో ఒక పూర్తి పుస్తకాన్ని చదవడమంటే ఎలా ఉంటుందో అది పాఠకుల ఊహకే వదిలేస్తున్నాను. తెలుగు పుస్తకాల్ని ఇలా రోమన్ లిపిలో అందుబాటు చేయాలంటే ఆ రోమన్ లిపిని తెలుగువారి ఉచ్చారణకు అనుగుణంగా స్వల్పంగా మార్చుకోవాలి. లేకపోతే బారుబారు స్పెల్లింగులు తయారై తెలుగు వాక్యాలు చదవడం ఒక నేత్రహింసగా పరిణమిస్తుంది. ఉదాహరణకు – ఫ్రెంచిభాషలో రోమన్ లిపిని ఎలాగైతే డయాక్రిటిక్స్ జతచేసి వాడుకుంటారో అలా చేయాలి. రోమన్ లిపిలో లేని తెలుగు అక్షరాల్ని డయాక్రిటిక్స్ సహాయంతో కల్పించుకోవాలి. అప్పుడు తెలుగు పదాల స్వకీయతనూ, సాంప్రదాయిక పలుకుబడినీ కోల్పోకుండా తెలుగు సాహిత్యాన్ని అందఱికీ అందుబాటులోకి తేగలుగుతాం.

ఉదాహరణకు ఫ్రెంచి డయాక్రిటిక్స్ ని ఉపయోగించి పైవాక్యాన్నే ఇలా వ్రాయవచ్చు :

Mułłapúði gáru Madrásu ló marańincháru.

వర్ణలోపాన్ని సూచించే అపాస్ట్రఫీతో సంధికార్యాల్ని సూచించవచ్చు. ఉదాహరణకు-

అతనిక్కడికొచ్చాడు = atan’ ikkaðik’ occhaaðu.

ఫ్రెంచి డయాక్రిటిక్స్ వినియోగం పై నాకు సంపూర్ణ అవగాహన లేదు. కానీ అలాంటివి తెలుగుని లిప్యంతరణ (transliteration) చేయడానికి మిక్కిలి ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నాను.

You Might Also Like

6 Comments

  1. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    అసలు బోధనే లేకుండా పోతున్న వాతావరణంలో బోధనాపద్ధతుల గుఱించి ఏం పట్టుపడతాం ? రాజకీయ మద్దతు లేకుండా భాష పరిస్థితి అణువంతైనా మెఱుగుపడదు. ఇంగ్లీషు ఆ దేశానికి 400 ఏళ్ళ నుంచి జాతీయభాష. తెలుగేమో తన జాతీయభాష హోదాని కోల్పోయి 400 ఏళ్ళవుతోంది. మఱి దీనికి ఈ దుర్గతి పట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇది ఇప్పుడు ఏ దేశానికీ జాతీయభాష కాదు. ఇది కూడా మళ్ళీ ఏదో ఒక దేశానికి జాతీయభాష అయితే తప్ప దీని దశ తిరగదు. అప్పుడు గానీ దీన్ని మనం చూస్తున్న perception లో మార్పు రాదు.

  2. లలిత (తెలుగు4కిడ్స్)

    ఏమోనండీ. నాకు అనిపించేది ఒక్కటే. తెలుగులో బోలెడంత వైవిధ్యంతో ముఖ్యంగా పిల్లలని, ఈ మధ్య అవగాహనకి వస్తున్న దాని ప్రకరం పదేళ్ళనుంచి కాలేజీకి వచ్చే లోపు చదవగల సాహిత్యాన్ని బాగా పోగు చేయ్యాలి, తయారు చెయ్యాలి, అందించాలి. తెలుగుతో పరిచయం లేని వారి సంగతేమో, తెలుగు కోసం ఆవురావురావురుమంటూ ఎదురు చూసే వారికి అందించగలిగితే భాష సంగతేమో కానీ వారి దాహం తీర్చిన పుణ్యం దక్కుతుంది.
    సంస్కృత పదాలూ, ఆంగ్ల పదాలు దూరం దూరం అంటూ గిరి గీసుకు కూఛుని, తెలుగులో తెలియనిది అడిగితే ఎక్కడ తిడతారో అని భయపడే అవస్థ అంతర్జాలంలో. అదే అంతర్జాలంలో ఇప్పుడూ అందుబాటులో ఉన్న ఆంధ్రభారతి వారి డిక్షనరీ, సాహితీ వారిదీ, ఇంకొకటి రెండు కలిసి ఓ నాలుగేళ్ళ క్రితం కన్నా ఇప్పుడు ఎక్కువ సౌలభ్యంగా ఉంటోంది. ఆంగ్లం చూసి నేర్చుకోవాలిసినది కూడా ఉంది. ఎన్ని “పూర్తి” ఆంగ్ల పదాలు? పూర్తిగా అమెరికాలో తయారైన కార్లు ఎన్ని?
    జాతీయాలూ, నుడికారాలు, పుస్తకాలలో, అంతర్జాలంలో అందుబాటులోకి తెచ్చుకోవాలి. బాగా అవసరం అయ్యేవి Synonyms. పద సంపద విరివిగా పెరగాలి. ఏ వేటూరి పాటలో ముళ్ళపూడి గారి మాటలో గుర్తు తెచ్చుకుంటే ఎన్ని పదాలు మళ్ళీ గుర్తుకు వస్తాయో.
    తెలుగు రెండో భాషగా నేర్పించే బడులలో అయినా, మొదటి భాషగా నేర్పించేటప్పుడైనా, పునాదులు బలంగా పడాలి. “భాష” నేర్పించాలి. తెలుగే కదా రాదా అన్నట్టు ఉండ కూడదు. ఇక్కడ ఆంగ్లం నేర్పే పద్ధతులు, మొదటి భాషగానే, భాషా పరమైన ఎన్ని ప్రక్రియలు నేర్పిస్తాయో. (ఇక్కడి టీచర్లు కొందరికి అవి కూడా తక్కువ అనిపిస్తాయి).
    నాకు “వ్యక్తీకరించడం” తెలిసినది ఆంగ్ల బోధనా పద్ధతుల వల్లనే. అదే నాకు తెలుగుకి కూడా సహాయకారి.

  3. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    మీరన్నది నిజమే. అసలు కంటే కొసఱు ముఖ్యమైపోవడం ఒక బెడదే. కాదనడం లేదు. ఇందుమూలంగా మనం తెలుగులిపికి రోమన్ ని ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించడం లేదు. అందుకే రెండు మూడు లిపుల్లో తెలుగు పుస్తకాల్ని అందుబాటులో ఉంచమంటున్నాను. అప్పుడు తెలుగు యొక్క స్వలిపి స్థానం దానికే ఉంటుంది. మనం చెప్పినా అన్ని పుస్తకాల్నీ ఇలాగే ముద్రించడం సాధ్యం కాదు. ముద్రించినా రోమన్ లో మనం చేస్తున్న డయాక్రిటికల్ మార్పుల దృష్ట్యా అందఱూ వీటిని చదవలేరు. కొన్ని రావచ్చు. కొందఱు ఇలా చదవొచ్చు. స్వచ్ఛమైన మాతృస్తన్యాన్ని గ్రోలలేని అభాగ్య శిశువులకే ఈ డబ్బాపాలు ప్రిస్క్రైబ్ చేయబడుతున్నాయి.

  4. రాఘవ

    ప్రత్యామ్నాయాలు చూపిస్తే, వాటికే పరిమితమైపోయే ప్రమాదం ఉందండీ.

  5. సౌమ్య

    ఈ వ్యాసం చదువుతూ ఉంటే నాకు ఇదే విషయమై కొన్నాళ్ళ క్రితం చదివిన ఒక థీసిస్ గుర్తొచ్చింది. 1988 లో Simon Fraser University లో సబ్మిట్ చేసిన పీ.హెచ్.డీ థీసిస్ అది. నాకు ఏదో వెదుకుతూ ఉంటే కనబడ్డది.

    అందులో ఇలాగే, హీబ్రూ భాషను రెండో భాషగా నేర్చుకునే వారి కోసం, మొదట భాష స్వభావం, పదజాలం అదీ అలవాటుపడేదాకా రోమన్ లిపి ఉపయోగించి నేర్పడం గురించి చాలా వివరంగా చర్చించారు. వాళ్ళ ఉద్దేశ్యంలో ఇది వర్కవుట్ అయ్యే పద్ధతే.

    అయితే, మన ఖర్మ ఏమిటంటే, తెలుగు వారిక్కూడా తెలుగు ఇలాగే నేర్పవలసి రావడం!

  6. ఉష

    మీరు సూచించిన లిపి విధానం బావుంది. కానీ ఉచ్చారణ దోషాలకి పూర్తి సౌలభ్యం అదీ కాదు, కాస్త లిఖిత పరమైన శ్రమని తగ్గిస్తుంది. లెజిబిలిటీ సులభమవొచ్చు. కనుకా మొత్తంగా ఒకటి కాక మరొక విధానం అంతే. పోతే, తెలుగు భాషా లిపిని, లిఖితపూర్వకంగా భాషను సంరక్షించే ఆవశ్యకతని గూర్చిన వ్యాసం కనుకా నా అభిప్రాయం పూర్తిగా ఇక్కడ చెందకపోవచ్చు. కానీ, తెలుగు మాట్లాడగల పిల్లలకి భాష/లిపి తో సమస్య లేదు, వారు అసలు పుస్తకపఠనం దిశగా మళ్ళకపోవటమే అసలు సంగతి – పాఠ్యాంశాలు కాక పైన దినపత్రికలు, పుస్తకాలు చదువుతున్నవారు తగ్గారు; అందుమూలాన తెలుగు చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు పట్ల అవగాహనాలోపానికి గురౌతున్నారు. వీరికి ఏ లిపిలో ఉన్నా పరిష్కారం పుస్తక లభ్యత కాదు. అసలు మాట్లాడటానికే ఇష్టపడనివారు మరికొందరు. వీరికి భాష పట్ల అభిమానాన్ని కలుగజేయటం పెంపకంలో భాగం. వాళ్ళు ఎదిగినాక తెలియాల్సిన/ఉపయోగించాల్సిన జ్ఞానసముపార్జనకి, మాతృభాషా పరిజ్ఞానం అలవరుచుకోవడానికీ నడుమ సమతుల్య లోపం కొట్టొచ్చినట్టుగా ఉంది. ఈ మధ్యనే మన ప్రాంతాలు తిరిగి వచ్చాను కనుకా నేను గమనించినవి ప్రధాన అంశాలివి. నాకు సిడ్నీలో కలిసి పనిచేసిన కూర్గ్ ప్రాంతపు వారొకరు గుర్తుకు వస్తున్నారు – ఆహారం, వేడుకలు, సాంప్రదాయాలు అన్నిటితో పాటుగా వారి భాష మరవలేదు – అసలు సంగతి ఏమంటే వారి భాషకి లిపి లేదు. మరి ఇన్నిటినీ ఎన్నో తరతరాలుగా అందింపు ఎలా సాధ్యమైంటారు? నేను చూసినంతలో భాషాభిమానం కొరవడిపోతుంది. ఇక, అమెరికా వరకు తెలుగు బడులు [ఇళ్ళలో నడుపబడేవి], విశ్వవిద్యాలయాల్లో ఇవ్వబడే కోర్సుల్లోనూ భాషని – మాట్లాడటం, రాయటం వరకు నేర్పుతాము/రు. ఆపైన ఇంకాస్త ముందుకు తీసుకు వెళ్ళటం ఆయా పిల్లల, గురువుల మీదన ఆధారపడి ఉంది. కానీ లిపి, లిఖితపూర్వకంగా మాత్రం భాషని విస్మరించటం జరగదిక్కడ. చరిత్ర, సాంప్రదాయాల పరిచయమూ వాడలము. వినియోగం పరిమితమవటమే బాధ.

Leave a Reply