పుస్తకాల ఒడిలో

రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
**********************

“ఒక్కోసారి బాగా బోర్ కొడుతుంది,రొటీన్ గా అనిపిస్తుంది ఏం చేసినా అలాంటప్పుడు,ఏ రైల్లోనో వెళ్లిన చోటికే వెళ్తుంటాం అలాంటప్పుడో ఓ పుస్తకం పట్టుకుని చదువుకుంటే బాగుంటుంది.అంతేగానీ అదో పనిగా పెట్టుకుని చదవడం ఏంటి? అయినా కాస్ట్ సంగతి వదిలేస్తే ప్రతి నిమిషం విలువైంది మన లైఫ్ లో అంతంత సేపు ఆ నవళ్లూ జీవితచరిత్రలూ చదవడం ఎంత టైంవేస్టు? ఆ సబ్జెక్ట్ బుక్స్ ఎలాగా తప్పవు” నేను చాలా అభిమానించే ఓ పెద్దాయన నా పుస్తకాల పిచ్చి(ఆయన భాషలో) గురించి తెలిసి ఇచ్చిన క్లాసు. నాకు ఆవేశం తన్నుకొస్తోంది మరో సందర్భం లో ఐతే అణుచుకునే వాడినే అప్పుడు మాత్రం నా ఆవేశం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.అది చూసి కావచ్చు..కాస్త అనునయంగా “ఎవరో చెప్పిన దాన్ని బట్టి,ఎక్కడో దొరికిన దాన్ని బట్టి రాసేది చరిత్ర…ఇక దాని మీద ఆధారపడ్డ చారిత్రిక నవలల వైనం ఏం చెబుతావు.రాసేవాడు ఎటు మొగ్గితే దాన్ని అటు వర్గీకరిస్తాడు.ఆత్మకథలు అంటేనే తన గురించి తానూ సెప్పుకునేవి ఎలా కావాలంటే అలా చెప్తాడు..నేనూ ఒకప్పుడు…”అంటూ ఏదో చెప్పుకుపోతున్నారు కానీ అదేమీ నాకు పట్టడం లేదు.

పుస్తకాలు చదవడం మానమంటే నాకు దాచుకోలేని ఉద్వేగం వస్తుంది.ఆరాధించే పరదేవతనో,మరో జన్మనిచ్చిన తల్లినో,రక్తమాంసాల్లో ఇంకిపోయిన వ్యక్తిత్వాన్నో అవమానించిన వారిపై మాట భగ్గుమంటుంది.కానీ దాని వెనుక వెన్నలాంటి పసిమనసు ఉంది.నా గతం ఉంది.
నేను ౩వ క్లాసులో ఉండగా మాకు అప్పుతెచ్చుకునే తీసివేతలు చెప్తున్నారు. పది లోంచి ఇరవై రెండు తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పుతెచ్సుకోవాలి అనేది లెక్క.మేడం ఆ లెక్క హోంవర్కు ఇచ్చారు నేను చాలా శ్రద్ధగా చేసాను.తర్వాతి రోజు తెచ్చి చూపిస్తే,నా హోంవర్క్ బుక్ అవతలకి విసిరేశారు..తప్పు చేసానని.బయట నుంచుని వేరే వాళ్ళ పుస్తకాల నుంచి రాసుకొమ్మన్నారు.రాసాను. తర్వాతి రోజు అదే మోడల్ లెక్క మళ్లీ తప్పు. ఆ రోజు నీల్ డౌన్(మోకాళ్ళ మీద నుంచోవడం) చేయించారు.తర్వాతి రోజు ఇడియట్ అని రాసిన పలక మెళ్ళో వేసారు.అలా పరీక్షలలోను ఆ లెక్కలు చెయ్యలేదు. ఆ తప్పుకి అన్ని సార్లూ శిక్షించిన మేడం ఎప్పుడు ఎందుకు తప్పు చేస్తున్నావని అడగలేదు.బహుశా అలాంటి ఆలోచనే టీచర్లకి రాదేమో.
ఎందుకు చేసానంటే? సింపుల్. ఆమె అప్పు తెచ్చుకుని పది లోంచి ఇరవై రెండు తీసేస్తే మైనస్ పన్నెండు అంది.ఫాలో ఐతే గొడవ ఉండేది కాదు. కానీ తెచ్చుకున్న అప్పు తీర్చాలిగా అనుకుని తీర్చేశాను ఆన్సర్ ఇరవై రెండు అయ్యింది. లెక్క తప్పింది. ఒక్కసారైనా అడిగి ఆ అప్పు తీర్చక్కరలేదు అని ఉంటే లెక్కల్లో వెనకబడే వాణ్ని కాదేమో.

స్కూల్లో ఓ అందరికీ తెలిసిన ఎవరూ చెప్పని రూల్ ఒకటి ఉండేది.అది ఉన్నది ఉన్నట్టు పరీక్షల్లో రాయాలని.అంటే అక్షరం అక్షరం దింపాలి.కానీ అదేమీ జబ్బో గానీ నేను ఉన్నదున్నట్టు రాసేవాడిని కాదు.అర్ధం చేసుకుని నా మాటల్లో రాసేవాడిని.టీచర్లు అడ్డంగా కొట్టేసే వారు. ఒకటి రెండు సార్లు “మేటర్ ఒకటే కదా సర్” అంటే “సొంత కవిత్వమా?”అనేవారు.అలా మార్కులూ అల్లరీ కూడా లేక అదోలా ఉండేవాడిని.

బెంచి మీద నిలబెట్టినప్పుడు పక్కబెంచ్ వాళ్ళు ‘యూస్ లెస్ ఫెలో’ అని నవ్వులు..బయట వంగున్నప్పుడు పక్కక్లాస్ కి వెళ్తున్న సర్ ‘అసహ్యమైన పురుగు’ని చూసినట్టు చూపులు..నాలో నిరాశా నిస్పృహలు..అంటే స్కూల్ అంటే.బాగా అల్లరి చేసేవాళ్ళని వదిలి టీచర్లు మెత్తగా ఉన్నవాళ్ళను అవమానిస్తారు.తోటి వాళ్ళు నిక్ నేంలు పెడతారు.ఎవడో ఒక ఫ్రెండ్ ఉన్నా వాడు కూడా జాలే చూపిస్తాడు. జీవితం అస్తవ్యస్తంగానూ,రసహీనంగానూ అనిపించేది.సైకిల్ తొక్కుతూ శీతాకాలం ఎండలో అలా ఊరి చివర చెరువు వరకూ ఏ దారి తగిలితే ఆదారి పట్టుకుని ఏడుస్తూ వెళ్ళేవాడిని.ఒంటరిగా ఏడవడం ఏంటో సుఖంగా ఉండేది. ఇలాంటి అకాడమిక్ లైఫ్ కి సమాంతరంగా ఓ హాబీ ఉండేది.

తెలుగు చదవడం రావట్లేదని ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్యగారు చందమామ చదవడం అలవాటు చేసారు.చందమామ,బాలమిత్ర,బాల జ్యోతి,బుజ్జాయి లాంటివి బలవంతంగానైనా కొనిపించుకునేవాడిని.అలాంటివి నాకు తోచిన కథలు ఏవో రాసి మురిసిపోయేవాడిని.అందులో బొమ్మలు చూసి వేసే వాడిని.ఆ తర్వాత పెరిగే కొద్దీ బాలల బొమ్మల రామాయణం,మహా భారతం,శ్రీ కృష్ణ లీలలు,అల్లావుద్దీన్ అద్భుత దీపం,అక్బర్-బీర్బల్,తెనాలి రామకృష్ణ కథలు లాంటివి చదివేవాడిని. బొమ్మలు కొనమనే వాడిని కాదు పుస్తకాలు కొనమని హింస పెట్టేవాడిని(ఇప్పుడు ఆశ్చర్యం గా ఉంటుంది).మా ఇంట్లో ఈనాడు ఆదివారం మొదటి సంచిక నుంచీ వందలాదిగా ఆదివారం పుస్తకాలు,కొన్ని ఉదయం ఆదివారం సంచికలూ ఉండేవి.అవన్నీ చదివే వాడిని. డిసెంబరు,నవంబరు నెలల్లో ఈనాడు ప్రచురించిన ‘మిలీనియం మహనీయులు’ అనే శీర్షిక దాచుకుని దాచుకుని చదివే వాడిని.ఇలా నాతో పాటుగా చదివే అలవాటు పెరిగి పెద్దదైంది(వ్యసనమైంది అంటారు కొందరు.ఆనందమే).

మేగజైన్లలో పద వినోదం పజిల్స్ అవలీలగా పూర్తి చేసే అలవాటుతో మొదలు పెట్టి,ఎనిమిదవ క్లాసు లోనే అష్టావధానం,శతావధానం మొదలైన ప్రక్రియల్లో పృచ్చకుడిగా పాల్గొని ఆ పద్య క్రీడావినోదం చూసే భాగ్యం మా నాన్న గారి ద్వారా కలిగింది.అదే సమయం లో నేను ఆదివారం సాయంత్రాలు కళా సూర్యనారాయణ శర్మ గారనే గురువు గారి వద్దకు పంపితే పద్యం అల్లడం నేర్చాను. కందము,ఆటవెలది,తేటగీతి లాంటివి రాసేవాడిని.ఆశువుగా రాసే ప్రయత్నం చేసేవాడిని.

ఆప్పుడు పడింది ముడి,స్కూల్లో నిరుత్సాహ జీవితానికి ఈ విజయం ఉత్తేజం ఇచ్చింది.ఆత్మన్యూనతకు దారితీస్తున్న ఆ వాతావరణం లో,కవి సమ్మేళనాల్లో,పద్య పోటీల్లో బహుమతులు స్కూలుకి తెస్తే,మా హెడ్మాస్టారు ప్రేయర్ లోఅందరి ముందూ నా పేరు పడిన వార్తా చదివి,వాళ్ళు ఇచ్చిన షీల్డు మళ్ళీ ఇచ్చి చప్పట్లు కొట్టించే వారు.కనీసం వారికి ఒక సారి అది జరిగేది.అది నా మీద నాకు నమ్మకాన్నీ,పట్టుదలనీ ఇచ్చింది. మొండి ధైర్యంతో చదువు మెడలు వంచాను.

కోడి కిలికినట్టు రాస్తాననే పేరు తెచ్చుకున్న నేను.. బాపు శైలిలో తెలుగు రాయడం మొదలు పెట్టాను..ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నట్టు రాసే ప్రాక్టీస్ చేసి అలా కాకున్నా అందంగా రాయడం నేర్చాను.పాస్ కావడానికే నానా తంటాలు పడవలసిన వాడిని అప్పటి నుండీ చివరి వరకూ మంచి మార్కులే తెచ్చుకున్నాను.ఎస్.ఎస్.సి లో తెలుగు తొంభై ఐదు మార్కులు వచ్చాయి.తెలుగులో తొంభై ఐదు మార్కులు జిల్లాలో టాప్ అన్నారు.

స్కూల్లో నేను రాసిన కురచ కందం(అన్నీ హ్రస్వ అక్షరాలే ఉన్న కందం) చదివి మా మ్యాథ్స్ సార్ అబ్బురపడి స్కూల్లో అయిదువందల మందికి పైగా స్టూడెంట్స్ ముందు మీటింగ్ లో నా గురించి ఇరవై నిముషాలు మాట్లాడుతూనే ఉన్నారు(నిజానికి మీటింగ్ సందర్భం వేరు).స్కూల్ వదిలి వెళ్ళిపోయే సమయం లో మా ప్రిన్సిపాల్ గారు మా అమ్మా నాన్నలూ నన్నూ కూర్చోబెట్టుకుని, “మీ అబ్బాయిని గురించి చాలా మంది టీచర్లకు తెలియదు.ఒకరోజు వస్తుంది ఆరోజు మీ అబ్బాయి మా స్కూల్ కి వచ్చినప్పుడు పూర్ణకుంభం తో స్వాగతం చెప్పాల్సి వస్తుంది…చెప్తాము”,అన్నారు అంతవాడిని కాదు గాని గురు వాక్కు.ఎంత ఆత్మ విశ్వాసం కలిగిందో చెప్పలేను.

ఆ పైన కాలేజీల్లోనూ,ఎలాంటి సందర్భాల్లోనైనా నా పుస్తక పఠనం తగ్గించలేదు.బీ.ఫార్మసీ మొదటి ఏడాదే ఆదివారం పూట దూరవిద్యలో బి.ఏ.,ఎం.ఏ వాళ్లకు తెలుగు చెప్పడం ప్రారంభించి..ఆ జీతంతో పుస్తకాలు కొనుక్కునే ఏర్పాటు చేసుకున్నాను. హనుమంతరావు గారనే ఇంగ్లీషు ప్రొఫెసర్,తెలుగు సంస్కృతాల్లో లోతులు తెలిసినవారనీ,సిరివెన్నెల వద్ద కొన్నాళ్ళు ఉండీ,అవకాశాలు వచ్చినా తృణీకరించి వచ్చేశారనీ తెలిసి నా అంతట నేనుగా వారింటికి వెళ్లి పరిచయం చేసుకున్నాను. నాటి నుండి నా దృక్పథం విశాలమవడం లోనూ,పుస్తకాలిచ్చి చదవమంటూనూ,ఎలా ఎంచుకోవాలో చెప్తూనూ గురువయ్యారు.

అలా అంత అనుబంధం ఉంది నా జీవితం లో…పుస్తకానికి.అందుకే పుస్తకం నాకు తల్లి,తండ్రి,గురువు,దైవం.ఆ పుస్తకాలు చదవడం వల్ల నీకు వచ్చే “లాభం” ఏమిటి?అన్న ప్రశ్న అమ్మా నాన్నల్ని ప్రేమించడం వల్ల నీకు ‘లాభమే’మిటి అన్నట్టుంది.

You Might Also Like

10 Comments

  1. ఆ.సౌమ్య

    చాలా బాగా రాసారు.

  2. కొత్తపాళీ

    ఈ టపా ఇంతకాలం మిస్సయినందుకు బాధగా ఉంది.

    1. pavan santhosh surampudi

      థాంక్సండీ. నిజంగా చెప్తున్నాను.. ఈ వ్యాసం చదివినప్పుడల్లా కన్నీళ్లు తన్నుకొస్తాయి.

  3. gks raja

    పవన్ సంతోష్ గారూ! ఇదెక్కడి విచిత్రమండి– ఇది నేను వ్రాసుకున్నదే అన్నట్టుగా ఉంది.మీలాగ పద్యాలు వ్రాయడం తప్ప. నాకు కూడా 7వ తరగతిలో మధ్యలో జరిగే పరీక్షలకు సొంతంగా వ్రాసినందుకు నన్ను కొట్టలేక పేపరుపై అడ్డంగా కొట్టేశారు మా మాష్టారు. బిక్కమొహం వేసుకొని మా నాన్నకు చెబితే ఆయన మర్నాడు మా స్కూలుకి వచ్చి,హెడ్ మాష్టారితో మాట్లాడి స్టాఫ్ రూం లో పెద్ద పంచాయతీయే పెట్టారు. అందరు మాష్టర్ల సమక్షంలో నా పేపరు మూల్యాంకనం చేసి నూటికి 90 మార్కులోచ్చినట్టు నిర్ధారించారు. ఆ రోజున మా నాన్న నా మీద నమ్మకంతో అలా నిర్ధారణ చేయించక పోయి ఉంటే నేనూ భట్టియంగాడినే అయి ఉండేవాణ్ణి. అంతేకాదు, పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగి ఉండేది కాదేమో! మా నాన్నగారు సొంతంగా అలోచించి అర్ధం చేసుకోవాలని, కేవలం క్లాసు పుస్తకాలకే పరిమితం కాకూడదని, నాకు బోధించడమే కాకుండా– మాష్టార్లకు కూడా నచ్చజెప్పారు.
    ఏమైనప్పటికీ మంచి విషయాన్నిచక్కగా చెప్పినందుకు అభినందనలు. ఇలాంటి సంగతులకు వెంటనే ప్రతిస్పందించే జంపాల చౌదరి గార్కి వందనాలు.
    రాజా.

  4. సూరంపూడి పవన్ సంతోష్

    @జంపాల చౌదరి గారు,
    నిజమేనండీ కృతజ్ఞతలు

    ప్రతాప్,వెంకట్ గార్లకి,
    కృతజ్ఞతలు.నా భావాలు అర్ధం చేసుకోగలిగిన ఆప్తులు ఇంతమంది కనబడ్డారు కనకే ఆత్మీయంగా భళ్ళుమన్నాను.ఇప్పటికీ ఈ వ్యాసం చదివితే కళ్ళునిండిపోతున్నాయి.

    సుధాకర్,వాణీ నాయుడు గార్లకి,
    ఒకలాంటి పక్షులం కనుకే ఈ కొమ్మను వెతుక్కున్నాం.
    అభినందనలకు కృతజ్ఞతలు

    –సంతోష్ సూరంపూడి

  5. vani naidu

    chala baavundi. pustakaalu chadavadamante chaala ishtam. oka manchi holiday ante haayiga chettu kinda kurchi vesukoni migata prapancham uniki lekundaa oka manchi pustakamlo nannu nenu marchipovadamu.

  6. sudhakar

    ఎన్నో సంవత్సరాలు నేను అనుభవిస్తున్న ఫీలింగ్స్ కి మీరు అక్షర రూపం ఇచ్చారు.

    మీ వ్యాసం నన్ను కదిలించింది.

    సుధాకర్

  7. venkat

    చాలా బాగా రాసారు, ఆత్మీయం గా.

  8. Pratap

    మంచి పుస్తకం మనతో వుంటే కనిపించని ఒక పెద్ద అండ వున్నట్లే అనేది నా అభిప్రాయం.
    చాలా బాగా మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కృతజ్ఞతలు!!

  9. జంపాల చౌదరి

    “మంచి పుస్తకం నీడన మనసెంతో చల్లన,” కదండీ పవన్ సంతోష్‌గారూ.
    బాగుంది. థాంక్ యూ.

Leave a Reply to vani naidu Cancel