సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”

రాసిన వారు: పి.కుసుమ కుమారి
******************
సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు” అనే పుస్తకము రచయిత బి. సుబ్బారావు గారి తెలుగు సాహిత్యాభిమానానికి నిలువుటద్దముగా వెలువడినది. సాహితీ సమరాంగణ సార్వభౌముని వివరాల సేకరణకై రచయిత చాలా శ్రమించారు.

“తెలుగదేల యన్న దేశంబు తెలుగేను;
తెలుగు వల్లభుండ తెలుగొకండ;
ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి;
దేశ భాషలందు తెలుగు లెస్స”

అంటూ మన తెలుగు గొప్పదనాన్ని ఆంధ్రులకు అవగతం అయ్యేట్టు చేసిన కృష్ణదేవరాయలు గురించి, మరల మరల జ్ఞాపకం చేసుకోవడం అంటే – ఆంధ్ర భోజునికి ఒక చిన్న పూవుతో అర్చన చేయడమే!

“శ్రీ కృష్ణ దేవరాయలు” జీవిత ఘట్టాలను, ఆ నాటి దేశ కాల పరిస్థితులను చారిత్రక విశేషాలను
క్రమ పద్ధతిలో వరుసగా వివరించారు. ప్రథమ అధ్యాయంలో “ క్రీ.శ. 1300 ప్రాంతమున
దక్షిణ భారతావని స్థితి” ని కూలంకషంగా చూపారు. వరుసగా నాలుగు రాజ్యాల గురించి చెప్పారు.
యాదవ సామ్రాజ్యం( దేవ గిరి రాజధాని) ;కాకతీయ (రాజధాని ఓరుగల్లు); హొయసల (ద్వార సముద్రం రాజధాని) ; పాండ్య ( మధుర రాజధాని) ;

ఈ నాలుగు ప్రధాన సామ్రాజ్యాలు దక్షిణ భారతానివి. వైభవోపేతంగా విరాజిల్లుతున్నాయి. అప్పటి దాకా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన తురుష్కులకు దక్షిణ భారత సీమలలోని తుల తూచలేనంతటి సంపదలపై కన్ను పడింది. ఫలితంగా ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు. జలాలుద్దీన్ తమ్ముని కుమారుడు అల్లవుద్దీన్ ఖిల్జీ ( ఇతడు చితోడ్ రాజ్యము, రాణీ పద్మినీ దేవి ” సతి ” / ప్రాణ త్యాగమునకు కారకుడు ఐ, ప్రజలకు గుర్తుకు వస్తాడు.) జలాలుద్దిన్ కు సైన్యాధ్యక్షుడు, అలుడు కూడా . 1291 లో ఢిల్లీ సుల్తాను ఆజ్ఞ లేకుండా, ధనాశతో – సుల్తానుకు తెలీకుండా ,
దేవగిరిపైకి దండెత్తి, గెలిచాడు. అపార ధన రాసులతో తిరిగి వెళ్ళి, తన మామ ఐన జలాలుద్దీన్ ని కూడా మట్టుబెట్టి తానే ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు.

ఈ రీతిగా చిన్న విషయాలు కూడా రచయిత కలం దాటి పోకుండా, సవివరంగా ఉటంకించబడినవి.
2 వ ప్రకరణంలో విద్యారణ్య స్వామి, హరి హర రాయలు, బుక్క రాయలు విజయ నగర సామ్రాజ్య స్థాపనము మొదలుకొని, శ్రీ కృష్ణ దేవరాయలు విజయ నగర సామ్రాజ్యనికి 1509 లో పట్టాభిషిక్తుడు ఐన ఘట్టాలను చెప్పారు. 3 వ అధ్యాయంలో కృష్ణ రాయలు రాజ్యాధిపత్యము చేపట్టు నాటికి, ఆయన ముందున్న సమస్యలను, తత్ఫలితంగా – ఉదయ గిరిపై రాయలు దండయాత్ర” ఇత్యాదులను చిత్రించారు. వరుసగా రాయలు సాధించిన ఘన విజయాలను పేర్కొన్నారు.

సాహిత్య పోషణలో దిశా నిర్దేశం చేసిన సామ్రాట్టు రాయలు. అష్ట దిగ్గజములు – వీరి ప్రస్తావన తిప్పలూరు శాసనం – లో ఉన్న విషయాన్ని చరిత్రకారులకూ, చదువరుల దృష్టికి తెచ్చారు.
దిగ్విజయ యాత్ర చేసిన ప్రతి చోట రాయలు, దేవళముల నిర్మాణములను గానీ, కోవెలలకు భూరి విరాళాలను ఇవ్వడము గానీ ఆచరించే వాడు. “భువన విజయము” భవన శిల్ప కళా వైభవము, రాణి వాసము, అల్లసాని పెద్దనాది కవివర్యుల పద్యాలను ఉదహరిస్తూ విజయనగర సామ్రాజ్యాధిపతి తేజస్సును నిరూపించారు.

ఈ పొత్తములో ఉదహరించిన పోర్చుగీస్ యాత్రికుడు డిమ్మన్ గోస్ పెయిజ్ , వాక్యాలు-
“శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతి రోజు వేకువ జామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నువ్వుల నూనెతో దేహ మర్దనము చేయించుకొనును. ఆ తరువాత ధోవతిని ధట్టీగా కట్టి, బరువైన దిమ్మలను చేతులతో పైకి ఎత్తుతూ, వ్యాయామము చేయును. ఆ తరువాత తన శరీరము పైనున్న నూనె ఇంకిపోయేవఱకూ కత్తి సాము చేయును. ఆ తరువాత తన వద్ద నుండు వస్తాదులతో మల్ల యుద్ధము చేయును. తదనంతరము ఒక పెద్ద మైదానములో గుఱ్ఱపు స్వారీ చేయును.”(పేజీ 23);

ఉపసంహారము గా , రాయలు తదనంతర పరిణామాలనూ, తళ్ళి కోట యుద్ధము జరుగుటకు కారణాలనూ, తదనంతర పరిణామాలనూ విపులీకరించారు. 5 వ ప్రకరణంలో సామ్రాజ్య వైభవమును, ప్రజల జీవన శైలినీ, కళా ప్రియత్వమునూ,పాలనా వ్యవస్థనూ సోపాన క్రమంలో వర్ణించారు.

శ్రీ సాయిరాం ఆఫ్ సెట్ , ఒంగోలు – వారి ముద్రణలో కవర్ పేజీ, పుస్తకములో అచ్చు తప్పులు లేవు, ముద్రణ అందంగా ఉన్నది. కరతలామలకం చేసిన కృషికి, ఈ పుస్తకంలోని ప్రతి పుట నిదర్శనమే!

సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”
Price ; Rs25/-
ప్రతులకు;
Bollapalli subba rav, ( Retd Bank Manager),
“Srinivas” ; 7-2-13 Lawyer Pet,
2 va vidhi, Ongole – 523002 ;
ph; 08592-234262 ; Cell; 9705456900

You Might Also Like

2 Comments

    1. kadambari

      ధన్యవాదాలు మందాకిని గారూ!
      – kusuma telugu

Leave a Reply