బి.వి.వి.ప్రసాద్ హైకూలు – ఒక పరిచయం

రాసిన వారు: శ్రీనివాస్ వురుపుటూరి
********************

ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్. పుస్తకాల పేర్లు:

1) హైకూ
2) పూలు రాలాయి

అంతకు మునుపు, చివరాఖరి ఎనభైలల్లో, హైకూల గురించి చేరా గారు రాయగా చదివినప్పుడూ, అడపాదడపా పెన్నా శివరామకృష్ణ గారివో, గాలి నాసర రెడ్డి గారివో హైకూలను చూసినప్పుడూ, అర్థం కాక – “ఇదేదో కవిత్వంలో పొదుపు ఉద్యమంలా ఉంది” అని అనుకున్నాను చాలాకాలం. ప్రసాద్ గారి హైకూలను చదవటం నాకు కనువిప్పు కలిగించింది.

హైకూ ఒక జపానీయ ఛందో రీతి. పదిహేడు మాత్రలకి పరిమితం. ఆ మాట వినగానే (ఒకోసారి, ఆ మాట వినకపోయినప్పటికీ) హైకూలను మినీ కవితలతోనో, నానీలతోనో పోల్చి కవిత్వపు ఫాషన్‌గా కొట్టిపారేస్తారు కొందరు. కానీ, వీటికీ హైకూలకీ బోలెడంత వ్యత్యాసం! మినీ కవితలూ, నానీలూ చమత్కారికల్లా ఉంటాయి. కోటబిలిటీ కోసం రాసినట్లుంటాయి. హైకూ మాటో? హైకూకి ఓ తాత్త్విక నేపథ్యం ఉంది! కొన్ని వందల ఏళ్ళుగా సాగి వస్తున్న సజీవ సంప్రదాయం, హైకూ. తత్త్వమెరిగిన కవి రాసిన హైకూ పాఠకుడికి ఎంతో విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. అందుకు అందమైన సాక్ష్యాలు ఇప్పుడు మీకు పరిచితమవుతున్న ఈ రెండు పుస్తకాలు.

నాకు అర్థమైనంతలో –

హైకూ కవితకి బాగా నప్పే వస్తువులు ప్రకృతీ, పసిపిల్లలున్నూ. హైకూ కవి మనః ప్రవృత్తిలో అపరిమితమైన సంవేదనాశీలతా, సునిశిత పరిశీలనా శక్తీ, ఏకాంత ప్రియత్వమూ, మామూలు వస్తువుల్లో అనుభవాలలో కొత్తదనాన్ని పట్టుకోగల లోచూపూ, ఓ రకమైన నిర్మోహత్వమూ, తనని తాను మరుగు పరచుకోగల వినమ్రతా భాగమై ఉండాలి. శాంతమూ, కరుణా, సున్నితమైన హాస్యమూ – ఇవీ హైకూ కవితకి ప్రధాన రసాలు.

సూచనాప్రాయంగా చెప్పి పాఠకుడిని ఒక ధ్యానస్థితిలోకి, ఒక సున్నితత్వంలోకి తీసుకెళ్ళటంలో ఉంటుంది కవి నేర్పు. అయిదారు పొడి మాటలతోనే ఓ పదచిత్రం గీయాలి, అంతే! ఆ తరువాత పని పాఠకుడికి వదిలేయాలి. చంద్రుడిని చూపించే వేలు” అని వర్ణించారు హైకూని ఇస్మాయిల్ గారు, దృశ్యాదృశ్యం పుస్తకానికి సమకూర్చిన భూమికలో.

ప్రసాద్ గారి హైకూలని చదివాక కలిగే ఊరటా, ఆహ్లాద భావనా, జాగృతమైనట్లనిపించే సంవేదనాశీలతా అనుభవైకవేద్యాలు. నా ప్రయాణాల్లో, ప్రవాసాల్లో, ఈ హైకూ సంపుటాలను నా దగ్గర ఉంచుకునే వాణ్ణి నేను. ఓ ఒంటరి రాత్రి తటాలున ఏదో ఓ పేజీ తెరిచి, హృదయాన్ని తాకే హైకూలను ఒకటో రెండో చదివి, నిశ్చలత్వాన్నో, సన్నని కదలికనో, ఓ సున్నితమైన స్పందననో అనుభూతిలోకి తెచ్చుకోవటం ఎంత బావుంటుందో!

కవయిత్రి ఓల్గా గారిలా అన్నారట, ప్రసాద్ గారికి రాసిన ఓ ఉత్తరంలో: “వంద భయాలతో, వేయి ఆందోళనలతో సతమతమవుతున్న సందర్భంలో మీ రాలిన పూలు అందుకున్నాను. క్షణంలోనే నా మనస్సు ఒక నిష్కళంకమైన, ప్రసన్నమైన విషాదానుభూతితో నిండిపోయింది” (డేవిడ్ షుల్మన్ గారి Spring, Heat, Rains: A South Indian Diary నుంచి. ఓల్గా గారి అనుభూతిని వర్ణించేందుకు ఆయన వాడిన పదబంధం: “immaculate, serene sorrow”). తన మిత్రులకి పంచిపెట్టేందుకని ఓ వంద ప్రతులను కొనుక్కున్నారట ఆవిడ.

ఈ రెండు పుస్తకాలకి కవి రాసుకున్న పరిచయ వ్యాసాలు ఎంతో విలువైనవి. హైకూ సంకలనం లోని ‘ప్రకృతీ, జీవితం హైకూల మయమే’ నుంచి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను:

“దృశ్యానికీ, అదృశ్యానికీ; శబ్దానికీ, నిశ్శబ్దానికీ మధ్య సున్నితమైన సరిహద్దు రేఖ హైకూ. హైకూ కవి ఆ సరిహద్దుల్లో సంచరిస్తూ ఉంటాడు. దృశ్యం నుంచి అదృశ్యానికీ, శబ్దం నుంచి నిశ్శబ్దానికీ కవి పాఠకుని తీసుకెళతాడు. ఆ నిశ్శబ్దం శబ్దం కంటే చైతన్యవంతంగానూ, అదృశ్యం దృశ్యం కంటే రసమయంగానూ ఉంటాయి.”

“హైకూ కవికి ప్రపంచమంటే ప్రేమ ఉంటుంది. ఉదాసీనత కూడా ఉంటుంది. వేరువేరు సమయాలలో కాక, రెండూ ఏకకాలంలో ఉంటాయి. ప్రేమ శిఖరాగ్రానికి చేరినపుడు, సాధారణ దృష్టికి అది ఉదాసీనతలా గోచరిస్తుంది. ప్రతి క్షణం, ప్రతి చర్యలో తాను ప్రేమించాల్సింది దేన్నో గుర్తిస్తూనే వుంటాడు. పక్షిని ప్రేమించేవాడు పంజరంలో పెడతాడు. పక్షిని ప్రేమించటం అంటే పక్షి స్వేచ్ఛని ప్రేమించటమే అని తెలిసిన వాడు ఉదాసీనుడిగా కనిపించే మహా ప్రేమికుడవుతాడు.”

“మంచి హైకూ కవి కావటానికి, ఒకరు ముందు కవి కావాలి. తరువాత కవి కాకుండా పోవాలి.”

“హైకూ రాయటం సులువే. మంచి హైకూ రాయటం మరీ సులువు. హైకూ కవి కావటమే కష్టం.”

ముగించే ముందు కొన్ని హైకూలు:

చేయి పట్టుకుంది నిద్రలో,
పాప కలలోకి
ఎలా వెళ్ళను?
********

నీటి పై
రాలిన పూవుని
ప్రతిబింబం చేరుకుంటుంది.
*********

ఎంత అందంగా నవ్విందీ!
పాపాయికి చెప్పాలి
పెద్దయ్యాక.
********
గాలి.
పూలు ఊగాయి.
వాటిపై సీతాకోకా.
*********

ఆమె వచ్చి అంది.
“చందమామ”
మళ్ళీ నిశ్శబ్దం.
*********

చేప దొరికింది.
విలవిల్లాడింది
కొలను.
*********
రాలిన చినుకు
ఆకాశం వైపు
ఎగిరింది బెంగతో.
*********
నక్షత్రాకాశం.
మెట్ల దారి,
కొండ మీద గుడి వరకూ.
**********
ఈ అక్షరాలు చూస్తారు
కానీ ఈ కాగితం చుట్టూ
ఉన్న నిశ్శబ్దాన్నీ, రాత్రినీ…
**********
కలలో ఎవరో అన్నారు
మేలుకో… మేలుకో…
కానీ ఎలాగో చెప్పలేదు!

ఈ రెండు కవితా సంపుటాలూ దొరికితే విశాలాంధ్రలో దొరకవచ్చును. లేదా బి.వి.వి.ప్రసాద్ గారినే నేరుగా సంప్రదించండి. నాకు తెలిసిన చిరునామా:

B.V.V.Prasad
23-97, Sajjapuram,
Tanuku – 534 211

**
ఈ పుస్తకం ఇప్పుడు కినిగె.కాం లో లభ్యం.

You Might Also Like

10 Comments

  1. BVV Prasad

    వురుపుటూరి శ్రీనివాస్ గారూ, మీ వ్యాసం, సహృదయుల పరామర్శలూ ఇప్పుడే చూసాను. ధన్యవాదాలు అందరికీ, ముఖ్యంగా మీకూ. నా హైకూలన్నీ ఇప్పుడు కినిగె లో ఈ బుక్ గా దొరుకుతాయి. నా రచనా వ్యాసంగాన్ని గమనించే ఆసక్తి ఎవరికైనా ఉంటే, నా బ్లాగ్ చూడవచ్చును. http://bvvprasad.blogspot.in/ మీ.. బివివి ప్రసాద్

  2. Srinivas Vuruputuri

    అభినందనలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు. భూషణ్ గారికి, అధ్యయనం ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

    శ్రీనివాస్ నాగులపల్లి గారికి

    మీ ప్రశ్నకి సమాధానం భూషణ్ గారు బుడుగోయ్ గారికిచ్చిన జవాబులో దొరికే ఉంటుంది. ఇదిగో, ఇంకొంచెం సమాచారం…

    హైకూ 17 మాత్రలకి పరిమితమయ్యే పద్యమే.

    వికీపీడియా నుంచి:

    “In contrast to English verse typically characterized by meter, Japanese verse counts sound units (moras), known as “on”. Traditional haiku consist of 17 on, in three phrases of five, seven, and five on, respectively.”

    “on” మన మాత్రకి సమానం!

    ‘పూలు రాలాయి’ సంపుటంలో చేర్చిన పరిచయ వ్యాసంలో ప్రసాద్ గారు ఇలా అన్నారు:

    “హైకూ అంటే రూపం కాదు, సారం అని గ్రహించాలి. గేయం, పద్యం, వచన కవిత, మినీ కవిత రూప ప్రధానమైన ప్రక్రియలు. హైకూ తత్వ ప్రధానమైన ప్రక్రియ. అక్షరనియమం పాటించినా – ఏ ఆలోచన కానీ, అన్ని అనుభూతులు కానీ – హైకూలు కాలేవు. పాటించకున్నా హైకూ అనుభూతులు, హైకూ కాకుండా పోవు. అక్షర నియమంతో ప్రారంభమైన జపాన్ హైకూలలోనూ ఆ నియమాన్ని ఉపేక్షించటం తరచూ జరిగేది. జపాన్ నుంచి 50 – 60 దేశాలకు వ్యాపించినా, అన్ని దేశాలలోనూ రూపం కన్నా, సారానికే ప్రాధాన్యతనిచ్చారు. విదేశాలలో హైకూ పట్టుబడిన కవులు – పాద విభజన అవసరం లేనపుడు ఏక వాక్యంలో హైకూ సాధించటం కూడ జరుగుతుంది”

  3. Srinivas Nagulapalli

    మంచి పరిచయం, చక్కని హైకూలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

    హైకూలో పదిహేడు మాత్రలు అంటే అవి ఛందస్సులో చెప్పే “మాత్రలు” అవునో కాదో సరిగ్గా అర్థం కాలేదు. ఉదహరించిన వాటిలో పదిహేడు అక్షరాలకు మించే ఉన్నాయి. ఏది ఏమైనా హృద్యంగా అందంగా ఉన్నాయి.

    గుప్పెడు అక్షరాలు
    హాయిగా తాకాయి
    హైకూలు
    =====
    విధేయుడు
    _శ్రీనివాస్

  4. తమ్మినేని యదుకుల భూషణ్

    @budugoy:
    నాకు తెలిసి హైకూ ను ఆంధ్ర పాఠక లోకానికి పరిచయం చేసింది మా గురుదేవులు సంజీవ దేవ్ గారు.
    తర్వాత శ్రీనివాస్ ఈ వ్యాసంలో రాసినట్టు ‘చివరాఖరి ఎనభైల్లో చేరా’ నాసర రెడ్డి హైకూలను తన చేరాతల్లో ప్రస్తావించారు.( తర్వాత , ఇస్మాయిల్ గారు ఈ ప్రక్రియను అందిపుచ్చుకొని ఎన్నో హైకూ సంకలనాలు వేశారు. గోదావరి జిల్లాల్లో ఈ హైకూ బాగా పెరిగింది . ప్రసాద్ గారు హైకూ కవుల్లో ముఖ్యులు . ఇస్మాయిల్ అవార్డు గ్రహీత గోపిరెడ్డి రామకృష్ణా రావు కూడా హైకూ కవే. ఎక్కడో , మూలా సుబ్రహ్మణ్యం రాసిన చక్కని సమీక్ష ఉండాలి ) కానీ , అప్పట్లో జపనీస్ భాషా పరిజ్ఞానం లేక హైకూ పూర్వా పరాలు ఎవరికీ సరిగా తెలియవు.తెలుగు సంస్కృతం నుండి పదాలు స్వీకరించినట్టు , జపనీస్ చైనీస్ నుండి పదాలను సంగ్రహిస్తుంది. చైనీస్ లో గుణింతాలు లేవు. జపనీస్ ఈ విషయంలో మన భాషకు దగ్గర ( తెలుగు గుణింతాల తో పూర్తిగా map చేయలేక పోయినా ). అప్పట్లో నా సందేహం, జపనీస్ చైనీస్ పదాలను సంగ్రహించి నప్పుడు ౧౭ మాత్రల నియమం ఎలా పాటిస్తుంది ?? నేను హైకూలు అనువాదం చేస్తున్నప్పుడు , చేసిన పరిశోధనలో మరిన్ని విషయాలు తెలిశాయి. చైనీస్ పదాన్ని
    ఎలా ఉచ్చరిస్తారో అలాగా తమ గుణింతంలో రాసుకొంటారు. చైనీస్ లో టావో అన్న పదాన్ని
    ఒక బొమ్మతో సూచిస్తారు , దాన్ని జపనీస్ లో వాడ వలసి వస్తే ,మన తెలుగు లో మనం రాసినట్టే టావో అని రాసుకుంటారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే , పదిహేడు మాత్రల నియమం మారనిది.
    హైకూ semantics పూర్తిగా వేరు. జపనీస్ లో ఈ తరహా క్లుప్తత కవి సమయాల ద్వారా తీసుకు వస్తారు , ఋతు సంబంధమైన పదం వేయగానే పాఠకులకు అర్థమై పోతుంది, కవి సూచన ప్రాయంగా ఏమి చెప్ప దలుచు కొన్నాడో. కావున,శతాబ్దాల తరబడి వారి సంస్కృతిలో భాగమైన హైకూ ను ఇతర భాషల్లో ఒప్పించడం అంత సులువు కాదు. కారణం, మన సంస్కృతిలో ఈ కవిత్వం భాగం కాదు.
    పూర్తి స్థాయి అనువాదాలు వచ్చి ఈ చిక్కులను విడమర్చి చెప్పి లక్షణాలను స్పష్టంగా చూపిస్తే గాని
    అడుగు ముందుకు పడదు. కానీ , ఇప్పటికే , ఈ దిశలో రెండు దశాబ్దాల కృషి జరిగింది.ఇదే , ఇబ్బంది ఇంగ్లీషులో కూడా ఉంది.చాలా మంది హైకూ కవిత్వం రాసినా అది వీరి సంస్కృతి లో భాగం కాదు కాబట్టి, సంస్కృతి మూలాలనుండి బయలు దేరి ౧౭ మాత్రల నియమంగా స్థిరపడ్డ క్లుప్తత లేని కారణంగా అంత బాగోవు. ( అర్థ బోధ కోసం ఇక్కడ సంస్కృతి అన్న పదం వాడినా ,ఈ సందర్భంలో వాడదగిన ఖచ్చితమైన పదం నాగరకత /నాగరికత ) . హైకూ భాషను అర్థం చేసుకోవడానికి ఒక ఆంగ్ల విమర్శకుడు
    అది దాదాపు telegram భాష అంటాడు. మనము ,అనగా జపనీయులు కాని వాళ్ళం టెలిగ్రాం లో ఎలాంటి భాష వాడతాం ?? మదర్ సీరియస్ , స్టార్ట్ ఇమ్మీడియట్లీ .. చాలా ఖాళీలను వదిలేస్తాం
    ఆ ఖాళీలను పాఠకులు పూరించుకుంటారు. ఎలా అంటే సంప్రదాయం ( కవి సమయాలు
    ఋతు సంబంధమైన పదం వగైరాలు ) దన్నుతో. ఈ కారణాల వలన హైకూ రచనలో
    మన కవులది ఎదురీతే అని వేరే చెప్పాలా ??

  5. janrise

    The way you explained about the depth of Haikuu is really outstanding.

  6. budugoy

    “తత్త్వమెరిగిన కవి రాసిన హైకూ పాఠకుడికి ఎంతో విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది”
    మంచి విలువైన మాట చెప్పారు. చాలా హృద్యంగా ఉన్నాయి మీరు కోట్ చేసిన హైకూలు. ఎలాగైనా పుస్తకాన్ని చదవాలనిపించేలా.

    హైకూల్లో దృశ్యాన్ని యధాతథంగా అందించి పాఠకుణ్ణి కవిసమయానికి దగ్గరగా తీసుకెళ్ళడంకోసమే ఆ పదిహేడు మాత్రల పరిమితి. చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇంత అందమైన పద్యాల్లో కూడా రెండు-మూడు సాంప్రదాయిక హైకూ నిర్వచనంతో తూగవని నా అభిప్రాయం. ఉదాహరణకి “కలలోకి ఎలా వెళ్ళగలను?” అన్నప్పుడు దృశ్యంలోకి కవి ఆలోచన చొరబడింది. అలాగే చివరి రెండూ.

    బి.వి.వి.ప్రసాద్ గారు, నాసర రెడ్డి గారు, ఇస్మాయిల్ గారు ఎవరూ కూడా పదిహేడు సిలబుల్స్ నియమాన్ని పట్టించుకున్నట్టు లేరు. జపనీయులదీ మనలాగే అజంత భాష. వారికిలేనిది మనకి ఉన్న ఇబ్బంది ఏమిటో? ఎవరైన జపనీస్ భాషతో పరిచయం ఉన్న పాఠకులు ఉన్నారా పుస్తకం పాఠకుల్లో…

  7. మెహెర్

    మీ పరిచయం బాగుంది. చాలా హైకూల జోలికెళ్లి, ఆ ప్రక్రియకి కవిత్వంతో కన్నా చాతుర్యంతో నిమిత్తం ఎక్కువ అన్న అభిప్రాయానికి వచ్చేసాను. ఇక్కడి హైకూలూ, ఈయన ఆలోచనలూ చదివాకా వాటికి కావాల్సింది కవిత్వమే కాదు, అంతకు మించి ధ్యాన దృష్టి ముఖ్యం అనిపించేలా వున్నాయి.

    “మంచి హైకూ కవి కావటానికి, ఒకరు ముందు కవి కావాలి. తరువాత కవి కాకుండా పోవాలి.”

    ద్యోతక భావం కన్నా ఎక్కువ వ్యక్తీకరిస్తోందీ వాక్యం. ఈ వాక్యం కూడా బాగుంది:

    “…ప్రేమ శిఖరాగ్రానికి చేరినపుడు, సాధారణ దృష్టికి అది ఉదాసీనతలా గోచరిస్తుంది. ప్రతి క్షణం, ప్రతి చర్యలో తాను ప్రేమించాల్సింది దేన్నో గుర్తిస్తూనే వుంటాడు. పక్షిని ప్రేమించేవాడు పంజరంలో పెడతాడు. పక్షిని ప్రేమించటం అంటే పక్షి స్వేచ్ఛని ప్రేమించటమే అని తెలిసిన వాడు ఉదాసీనుడిగా కనిపించే మహా ప్రేమికుడవుతాడు.”

    ముఖ్యంగా ఈ పరిసరాల్లో ప్రస్తుత రొద మధ్య బాగా విన్పించాయి. కవిత్వంలో నిశ్శబ్దం సంగతేమోగానీ, కవిత్వం చుట్టూ నిశ్శబ్దం కావాలిప్పుడు.

  8. చంద్ర మోహన్

    చాలా మంచి పరిచయం. పుస్తక పరిచయం కంటే హైకూ పరిచయం ఎక్కువగా ఉండడం బాగుంది. ఉదహరించిన హైకూలు కూడా హైకూల లాగానే ఉన్నాయి, తెలుగులో హైకూల పేరిట వచ్చిన బోలెడన్ని ఇతర రచనల్లా లేవు.

  9. mohanramprasad

    Your review is so good and informative.

  10. లలిత (తెలుగు4కిడ్స్)

    వివాదాల సుడిగాలి తేలిపోయి చల్లని పిల్లగాలి వచ్చి తాకినట్లుంది ఈ వ్యాసం చదువుతుంటే.
    చాలా బాగా పరిచయం చేశారు హైకూలను, పుస్తకాలనీ, హైకూ తత్వాన్నీ. మా చిన్నబ్బాయికి బడిలో పరిచయం చేశారు ఈ మధ్యే. అది syllables కి మించి జరిగిందో లేదో తెలీదు. టోటో ఛాన్ పుస్తక పరిచయమప్పుడు కాస్త తెలిసింది ఈ ప్రక్రియ గురించి. అంతవరకూ హైకూ అని విన్నా అదో పేరున్న ప్రక్రియ అని తెలియదు.
    ఇప్పుడు నేను కాస్త సాధికారంగా మా పిల్లలతో ఈ అంశం గురించి మాట్లాడగలను.
    ధన్యవాదాలు.

Leave a Reply to mohanramprasad Cancel