కులాలను అధిగమించే దాటు ఎప్పుడు?

‘గతం నీకు చూపించే దారి బ్రతుకు మీద కులం గుర్రాల సవారీ!’ అంటారు వాస్తవిక దృష్టితో కుందుర్తి. ‘మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడగ రెండె కులములు..’ అన్నారు అభ్యుదయ మార్గాన గురజాడ. విశ్వవేదికపై భారతదేశాన్ని విభిన్నంగా, కొంత సంక్లిష్టంగా నిలిపే అంశం.. ఇక్కడున్న కులవ్యవస్థ. భారతీయులుగా పుట్టిన మనం మన ఇచ్ఛానుసారం మతాన్ని మార్చుకోగలమేమో కానీ, పుట్టుకతో సంక్రమించిన కులాన్ని మాత్రం మార్చుకోలేం. అంతటి శక్తిమంతమైన కులవ్యవస్థ ప్రభావం సామాజిక, ఆర్థిక రంగాల్లో శతాబ్దాల తరబడి ఉన్నట్టే, సాహిత్యంలోనూ ఉంది.

ధర్మశ్రీ, వంశవృక్ష, గృహభంగ, పర్వ.. మొదలైన జనాదరణ పొందిన నవలలను రాసిన డాక్టర్‌ ఎస్‌ ఎల్‌ భైరప్ప రాసిన మరో నవల ‘దాటు’. కన్నడనాట పాఠకులు ఆసక్తితో చదివే గొప్ప రచయితగా పేరు పొంది, తన రచనల అనువాదాల ద్వారా ఎన్నో భారతీయ భాషల పాఠకులకు సుపరిచితులైన ప్రసిద్ధ రచయిత ఆయన. ఆయన లేఖిని నుంచి వెలువడి 2005లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని సాధించిన నవల ఇది. కుల వ్యవస్థలోని కుళ్లును బట్టబయలు చేస్తూ, సుమారు ఒక తరం కిందటి కర్నాటక గ్రామీణ జీవన వ్యవస్థ నేపథ్యంగా వచ్చిందీ నవల. కుల విభక్తమైన సమాజాన్ని చిత్రిస్తూ సాగి
మూడు తరాల ఆలోచన ధోరణులను ప్రతిబింబిస్తుంది దాటు. బలమైన లౌకిక దృక్పథంతో జీవితంలోని మౌలిక సమస్యల పట్ల లోతైన అవగాహనతో గ్రామీణ వాతావరణాన్ని వాస్తవిక దృష్టితో చిత్రిస్తూ సాగే నవల.

కథ విషయానికొస్తే, తుమకూరు జిల్లాలో తిరుమలగిరి అన్న చిన్న పల్లెటూరు. అక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు వెంకటరమణయ్య కొడుకు వెంకటేశం, కుమార్తె సత్యభామ. ఇంటరు తప్పిన వెంకటేశం ఊళ్లో పలుకుబడి సంపాదిస్తే, సత్య చరిత్ర ముఖ్యాంశంగా ఎమ్మే చదివి ప్రథమశ్రేణి పట్టా సంపాదించింది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని పెరిగిన ఆ పిల్ల తెలివితేటలను తండ్రి సుమారుగా అర్థం చేసుకుంటాడు, అటువంటి పిల్లకు తగిన వరుడినెలా తేవాలా అని ఆలోచిస్తుంటాడు. ఆ ఊరి కోటను కట్టించిన పాలెగాండ్ల వంశంవాడైన మేలగిరిగౌడ ఉపమంత్రిగా చేస్తున్నాడు. మామూలుగా వకీలు, స్వదేశీ ఉద్యమంలో పాల్గొని సబర్మతీ ఆశ్రమంలో గాంధీగారి దగ్గర ఉండి వచ్చినవాడు. అతని కుమారుడు శ్రీనివాసును ప్రేమించింది సత్య. కులాంతర వివాహానికి ఇంట్లో, ఊళ్లో ఆమోదం లభించడం కష్టమని ఇద్దరికీ తెలుసు. ఈ విషయం తెలియగానే తండ్రి సత్య దగ్గరకు బెంగుళూరు వెళ్లి మరీ చెప్పుతో కొట్టొస్తాడు. అటువైపు పై కులం అమ్మాయిని చేసుకుంటే హాని జరుగుతుందని నమ్మే శ్రీనివాసు కుటుంబ సభ్యులూ ఈ పెళ్లిని ఆపడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంటారు. తల్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. నానారకాలుగా మభ్యపెట్టి ఆ బలహీన మనస్కుణ్ని లొంగదీసి, తమ కులం అమ్మాయి కుముదినితో పెళ్లి జరిపిస్తారు. తర్వాత జరిగిన పరిణామాలు నవల. అయితే ఇదంతా జరగడంలో పాత్రల అంతర్మథనం, సమాజంలో కులాల ప్రభావం వీటన్నిటినీ చిత్రించిన దాటును చదువుతుంటే పాఠకులకు కలిగే భావతీవ్రత, అవగాహన గొప్పవి. వాటికోసమే దాటును చదవాలి.
ఇతర భాషల్లో ఎంత గొప్ప రచన అయినప్పటికీ, అనువాదం ఆ గొప్పదనాన్ని పట్టిస్తేనే ఆ రచన మనకూ మనసుకు పడుతుంది. ఆరకంగా చూసినప్పుడు ‘దాటు’ నవలను కన్నడం నుంచి తెలుగులోకి అనువాదం చేసిన పరిమి రామనరసింహం ప్రత్యేకంగా ప్రశంసాపాత్రులు. మూలంలోని  భావాన్ని, భాషనూ అంతే హృద్యంగా తెలుగులోకి అందించడంలో ఆయన ప్రతిభ అపూర్వమయింది. పాత తరపు పల్లెటూరి నుడికారానికి తగిన అభివ్యక్తిని తెలుగులోనికి తీసుకురావటం అంత సులువైన విషయమేమీ కాదు. దాన్ని సునాయాసంగా పూర్తిచేశారు పరిమి రామనరసింహం. ‘నవలలో చిత్రించిన వ్యవస్థ పట్ల, దానికి బాధ్యులైన వారి పట్ల మూల రచయిత వ్యక్తం చేసే తిరస్కార భావం ఈ రచనకు ఆయువుపట్టుగా నాకనిపించింది. దాన్ని తెలుగులోకి తేవటానికి కృషి చేశాను..’ అని చెప్పుకొన్న ఆయన ఆ పనిలో పూర్తిగా కృతకృత్యులయ్యారు. ‘దాటు అనే మాట  తెలుగులో అధిగమించు అనే అర్థంలో క్రియాపదంగానే వాడుకలో ప్రసిద్ధం. కన్నడంలోనూ అంతే. నవలకు ఈ పేరు పెట్టడంలో మూల రచయిత అధిగమనం అన్న నామవాచకార్థంలో వాడారు. నేను కూడా ఆ పనే చేశాను..’ అన్న రామనరసింహం కృషి ‘దాటు’ను పాఠకుల మనోఫలకంపై చిరస్థాయిగా ముద్ర వేస్తుంది.

Details of the Book:
Daatu – S.L.Bhyrappa
Flipkart link: here

You Might Also Like

10 Comments

  1. Ravindra nath

    బైరప్ప గారి బిట్టి పుస్తకాన్ని ప్రిజం పబ్లిష్ చేసింది . దాటు పుస్తకం అనువాదం ఆయన విష్యం మీ బ్లాగ్ లో చూసేంత వరకు తెలియదు . చాల సంతోషం మంచి పుస్తకం త్రన్స్లాటే అయ్యుంటానికి , ఆ పుస్తకం గురించి మీ పరిచయం కూడా చాల బాగుంది .

  2. Ravindra nath

    దాటు పుస్తకాన్ని కన్నడం లో పబ్లిష్ చేసింది ప్రిజం . ఆ పుస్తకం తెలుగు లో అనువాదం ఆయన విష్యం మీ బ్లాగ్ లో చూసేంత వరకు తెలియదు . చాల సంతోషం మంచి పుస్తకం త్రన్స్లాటే అయ్యుంటానికి , ఆ పుస్తకం గురించి మీ పరిచయం కూడా చాల బాగుంది .

  3. భైరప్పగారి ‘దాటు’ | పుస్తకం

    […] కనబడ్డ మరికొన్ని పరిచయాలు (1, 2, 3, […]

  4. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] (అను. గంగిశెట్టి లక్ష్మీనారాయణ) 11. దాటు – ఎస్.ఎల్. భైరప్ప (అను. పరిమి […]

  5. పుస్తకం » Blog Archive » మాలపల్లి

    […] ఇదివరలో పుస్తకంలో వచ్చిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.). ఇవన్నీ కాక, ఎక్కడ ఆ […]

  6. అరుణ పప్పు

    పరిచయం బాగుందన్న వారందరికీ ధన్యవాదాలు. కొండయద్దమందు కొంచెమైయుండదా అన్నట్టు పుస్తకం తీరుతెన్నులు పరిచయంలో కొంతే అర్థమవుతాయి. అందునా భైరప్పగారి పుస్తకాలు పర్వ, దాటు వంటివి పరిచయం పరిధిలో ఒదగవని నా అభిప్రాయం. వాటిలోని భావ విషయ విస్తృతి చదివి అర్థం చేసుకోవాల్సిందే. ఆయన మిగిలిన నవలలు నేనింకా చదవాలి. అందరికీ నమస్కారం.

  7. దార్ల

    దాటు నవల చాలా పెద్దది. చదవడానికి చాలా సమయం పడుతుంది.చదివి, అవగాహన చేసుకున్నది మన మాటల్లో రాయాలి. ఆ పనిని ఈ సమీక్షలో చాలా వరకూ బాగానే నిర్వహించారు.ఈ నవలను మా గురువు గారు అనువదించారు. ఈ నవలను మీరు గమనిస్తే పదాలను విభజించి ముద్రించడంలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అది భవిష్యత్తులో యంత్రానువాదం జరిగేటప్పుడు తెలుగు పదాలను సులభంగా గుర్తించడాని ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
    మీరు నవలను సమీక్షిస్తూ”మూడు తరాల ఆలోచన ధోరణులను ప్రతిబింబిస్తుంది దాటు. బలమైన లౌకిక దృక్పథంతో జీవితంలోని మౌలిక సమస్యల పట్ల లోతైన అవగాహనతో గ్రామీణ వాతావరణాన్ని వాస్తవిక దృష్టితో చిత్రిస్తూ సాగే నవల.” అనడం బాగుంది.
    అనుబంధంలో కొన్ని పదాలను ఇచ్చారు. అవి పాఠకులకు చాలా ఉపయోగపడతాయనుకుంటున్నాను.
    దీన్ని ప్రచురించకముందు నుండే రెండు మూడు సార్లు చదివినా, దానిపై సమీక్ష రాయడానికి భయపడ్డాను. గురువు గారి గ్రంథం కదా!
    నవలలో సత్య గొప్పపాత్ర.ఆమె నిర్మించుకున్న ఇల్లు నాకు నిజంగానే చూసినట్లు అనిపిస్తుంది. సమీక్ష ఇంకా కొంచెం లోతుగా చేస్తే బాగుండేదేమో!
    సౌమ్య గారు దీని గురించి రాశానని చెప్పిన లింక్ చూశాను. దీనిలో ” సత్యభామ ఆయన మరణం తరువాత జంధ్యం ధరించడం, హోమం చేయడం…వంటి విషయాలు నా ఊహకు అందలేదు. ఇక ముగింపు వాక్యాలు…. literal గా అయితే అర్థమయ్యాయి కానీ, అసలు ఆ వాక్యాల్లో ఏమి చెప్పదలుచుకున్నారో అర్థం కాలేదు” అనే అభిప్రాయం చెప్పడంలో సౌమ్య గారికి ఎంతో నిజాయితీ ఉందనిపించింది.
    ఇరువురికీ నా అభినందనలు.
    ప్రయత్నం చేసిన మీకు నా అభినందనలు
    మీ
    దార్ల

  8. Sowmya

    దాటు చాలా బాగా రాయబడిన నవల. నాకు బాగా నచ్చింది. అప్పట్లో దీని గురించి బ్లాగాను కూడా : vbsowmya.wordpress.com/2008/02/04/daatu-bhairappa/

  9. nagamurali

    సమీక్ష చాలా బాగుంది. ధన్యవాదాలు. ఎవరైనా ‘ఆవరణ’ కూడా రివ్యూ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నా.

  10. కె.మహేష్ కుమార్

    వరుసగా బైరప్ప గారి నవలలు పరిచయం అయిపోతున్నాయే! బాగుంది. ఇక ఈ నవల నేనూ చదవాలి.

Leave a Reply