చిన్నప్పటి రష్యన్ కథలు

ఇంట్లో ఉన్న చెత్త పడేద్దామని పాత నోట్సులూ, పత్రికలూ గట్రా పడేస్తూ ఉంటే, ఒక చివర్లో కనబడ్డాయివి – రష్యన్ పిల్లల పుస్తకాల తెలుగు అనువాదాలు. ఒక్కసారిగా మనసు ఒక పదిహేను-ఇరవయ్యేళ్ళు వెనక్కేళ్ళింది. మళ్ళీ అవి తీసుకుని చదవడం మొదలుపెట్టాను. కనబడ్డవి ఐదారు పుస్తకాలే అయినా కూడా, చదువుతూ ఉంటే, అందమైన అనుభూతి. చిన్నప్పుడు అమ్మా,నాన్నల సాయంతో చదివిన కథలు పెద్దైపోయాక (హతవిధీ!) అమ్మతో కలిసి చదివి, ‘ఈ కథ బాగుంది. ఇదంత గొప్పగా లేదూ అని కామెంట్లేసుకుంటూ చదవడం – అందమైన అనుభూతి కాదూ మరి? అలా నాకు తవ్వకాల్లో కనబడ్డ కొన్ని పుస్తకాల గురించి.. పనిగట్టుకుని వీలైనంత వివరంగా రాస్తున్నాను – ఎందుకంటే, ఇవి బయట దొరుకుతున్నాయో లేదో అన్న అనుమానం కలిగి.

అడవిలో ఇళ్ళు
రచన: వి. బియాంకి
బొమ్మలు: ఎం. మితురిచ్
అనువాదం: నాలుగు కథల్లో – మూడు ఆర్వీయార్, ఒకటి రాచమల్లు రామచంద్రారెడ్డి
ప్రచురణ : ‘రాదుగ’, మాస్కో.
1988 లో దీని వెల పన్నెండు రూపాయలు!! 🙂

మొదటి కథ – అడవిలో ఇళ్ళు: ఒక బుజ్జి స్వాలో పిట్ట తన గుంపు నుంచి తప్పిపోయి, చివర్లో తన ఇంటిని చేరడం దీని కథ. అయితే, ఇందులో, స్వాలో పిట్ట రాత్రి తలదాచుకోడానికి ఇల్లు వెదుకుతూ రకరకాల పక్షుల ఇళ్ళను సందర్శిస్తుంది. అందుకే ఆ టైటిల్. చిన్నప్పటి నుంచి ‘బుజ్జి స్వాలో’ ‘బుజ్జి స్వాలో’ అనుకుంటూ మేము (నేను, తమ్ముడు) కొన్ని వందల సార్లు తల్చుకుని ఉంటాము. ఆఖరుకి మా అమ్మని అడిగితే కూడా కథ గుర్తు పట్టేసింది 🙂

రెండో కథ: యెర్ర గుట్ట : మళ్ళీ పక్షుల కథే. ఈ కథ చివర్లో పిల్లిపై వివిధ పక్షులు దాడిచేసి దాన్ని భయపెట్టి తరిమేస్తాయ్ 🙂 లీడ్ పెయిర్ అయిన పక్షుల పేర్లు భలే ఉంటాయి – చిక్, చిరికా :))

గబగబా ఇల్లు చేరుకున్న చీమ: ఒక చీమ గబగబా ఇల్లు చేరుకోవాలన్న తాపత్రేయంలో (చీమ కుటుంబాల్లో రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయంట. సుర్యాస్తమయానికి ఇల్లు చేరుకోకుంటే, గేట్లు వేసేస్తారంట!) ఎన్ని పురుగుల సాయంతో వెళ్ళిందో, ఒక్కొక్క పురుగూ ఎలా నడుస్తుందో – పేడపురుగు మొదలుకుని గొల్లభామ దాకా రకరకాల వాటి గురించి చెబుతారు.

మొదటి వేట: ఒక కుక్క అడవిలో పక్షుల్ని,పురుగుల్ని వేటాడదామనుకుంటే, ప్రతి ఒక్కటీ దాన్ని ఎలా ఏడిపించి ఠోకరా ఇచ్చాయి? అన్నది ఈ కథ.

-మొత్తంగా ఈ పుస్తకం బాగా సరదాగా ఉంటుంది కానీ, బొమ్మలు అంత ఆకర్షణీయంగా లేవు.

బాలలకథలు
రచన: లేవ్ తోల్‌స్తోయ్ (టాల్స్టాయ్)
రాదుగ ప్రచురణాలయం, మాస్కో

ఈ పుస్తకంలో పదమూడు కథలున్నాయ్. రెండు మూడు కథలు పక్కన పెడితే, అన్నీ ఇప్పటికీ చదివి ‘వావ్!’ అనుకునేవి. మొత్తం మళ్ళి చదివాను, మా అమ్మ చేత కూడా కొన్ని చదివించాను. ‘చిన్న పిల్ల-కుక్క గొడుగులూ, ‘ప్లం గింజా, ‘సింహం చిన్నకుక్కా అన్నింటికంటే బాగా గుర్తుండిపోయిన కథలు. ముఖ్యంగా, ‘సింహం-చిన్నకుక్కా చదువుతూ ఉంటే, చిన్నప్పుడు మొదటిసారి అమ్మో,నాన్నో చెబుతూ ఉంటే వినడం లీలగా గుర్తొచ్చింది. ‘సొరచేప’,’గంతు’ పిల్లల కథల్లా అనిపించలేదు. పుస్తకం మొత్తం పెన్సిల్ డ్రాయింగుల్లా ఉన్నాయి బొమ్మలు. చాలా బాగున్నాయ్. ఇంతకీ, అనువాదం చేసిందెవరో, బొమ్మలు గీసిందెవరో కనబడలేదు. అనువాద భాష కాస్త వ్యావహారికానికి దూరంగా అనిపించింది. అందులో వాడిన పదాలు కొన్ని అలా ఉన్నాయి మరి!

కప్ప ప్రయాణం
రచన: వి.గార్షిన్
చిత్రాలు: ఎన్.చరూషిన్
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి
‘ప్రగతీ ప్రచురణాలయం, మాస్కో
1975 ఎడిషన్. ఎనభైలలో కొన్ననాటికి ఇది ఐదు రూపాయలు!

-ఈ కథ అందరూ వినే ఉంటారు..కప్ప రెండు బాతుల మధ్య కర్రను పెట్టి, దాన్ని కరుచుకుని గాల్లో ఎగిరి వెళ్ళే కథే. బొమ్మలు అవీ బానే ఉన్నాయి కానీ, అద్భుతంగా ఏమీ లేవు. అయితే, భాష సరళంగా ఉంది.

ధైర్యం గల చీమ:
రచన: టి.మకారొవా
అనువాదం: ఆర్వీయార్
చిత్రాలు: జి.పవ్లీషిన్

-ఒక చీమ కుటుంబం తమ ఇల్లు పోగొట్టుకుని, కాలక్రమంలో ధైర్యంగా నిలదొక్కుకునే కథ. కథకంటే కూడా ఇందులో మనల్ని కట్టిపడేసేవి బొమ్మలు. ఆ బొమ్మల కోసమే పిల్లలకి ఈ పుస్తకం తప్పక ఇవ్వాలేమో అనిపిస్తుంది…

సింహం చిన్నకుక్క, రాబందు
రచన: టాల్స్టాయ్
అనువాదం: వుప్పల లక్ష్మణరావు
చిత్రాలు: వి.దువీదోవ్
‘ప్రగతి ప్రచురణాలయం’, మాస్కో
’82 ముద్రణ, వెల రెండు రూపాయలు

– ఇవి ముందర చెప్పిన ‘బాలల కథలు’ లో ఉన్న రెండు కథలే. అయితే, ప్రచురణకర్తలు వేరే. కనుక, అనువాదకులు వేరే అనుకుంటున్నా. బొమ్మలైతే ఖచ్చితంగా వేరే మనిషి. ఇందులో రంగు రంగుల బొమ్మలున్నాయ్ మరి!

జీవిత రీతులు
రచన, బొమ్మలు: ఇ.చరూషిన్
అనువాదం: అట్టేరి కుప్పురాజులు
‘ప్రగతీ ప్రచురణాలయం, మాస్కో

-ఉడుత మొదలుకుని, ఏనుగు దాకా అడవిలోని జంతువుల గురించి కొన్ని వాక్యాల పరిచయం, బొమ్మలతో సహా.

ఎన్.రాద్లోవ్ బొమ్మల కథలు
రచన: నీన గేర్నెట్, నతాలి దిలక్తోరస్క్యా
అనువాదం: వుప్పల లక్ష్మణరావు
‘రాదుగ’ ప్రచురణాలయం

-నాకు వీటన్నింటిలోకీ, అన్నింటికంటే నచ్చిన, నచ్చుతున్న, నచ్చబోయే పుస్తకం ఇదే. అద్భుతమైన బొమ్మలు. కింద ఆ డబ్బింగ్ సినిమా లాంటి అనువాదాలు చూసి విసుగేసింది కానీ, ఈ కథలకి ఆ బొమ్మలుంటే చాలు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే, నిజానికి.

ఇవన్నీ కుక్కలే
రచన: ఇ.అకీముష్కిన్
చిత్రాలు: ఎ.కెలేయ్‌నికోవ్
అనువాదం: ఆర్వీయార్
‘రాదుగ’ ప్రచురణాలయం, మాస్కో.

-అబ్బో, ఈ పుస్తకం చూస్తే నాకు మా చెడ్డ భయం. రకరకాల తోడేళ్ళూ, నక్కలూ వీటి గురించిన బొమ్మలతో కూడిన చిన్న చిన్న పరిచయ వ్యాసాలు. నా జన్మలో ఒక్కసారి కూడా వీటిని నేను పూర్తి చెయ్యలేనేమో. మరి ఆ బొమ్మలు చూస్తూంటే ఎప్పుడూ భయం వేసి ఆపేస్తూ ఉన్నట్లు గుర్తు చిన్నప్పుడు. హీహీహీ. ఇప్పుడు కూడా, ఆ నక్కల బొమ్మలు చూస్తే, చదవబుద్దేయదు. ఏదో, కనబడ్డది కనుక తిరగేసానంతే!!

ఇప్పటికి అదండీ సంగతి. మీరు కూడా మీ చిన్నప్పటి పుస్తకాల గురించి రాయరాదూ? ఎవరో ఒకరు మొదలుపెట్టకపోతే, అసలా పుస్తకాలు ఉన్నట్లు వేరే పిల్లలకి ఎలా తెలుస్తుంది చెప్పండి? 🙂

You Might Also Like

22 Comments

  1. d a narasimha raju

    నేను కూడా సోవియట్ పుస్తకాలకు వీరాభిమానిని .ఎన్నాళ్ళుగానో ఆ పుస్తకాలకోసం ఆ కథల కోసం
    ఎంతగానో తపించిపోతున్నాను.ఇప్పుడు ఇక్కడ ఈ సైట్ లో ఈ పుస్తకకాల వివరాలు మీవివరాలు చూసి
    చాలా ఉత్సుకత కల్గింది .

  2. Anil battula

    సోవియట్ తెలుగు పుస్తకాల బ్లాగ్ : http://sovietbooksintelugu.blogspot.in/

  3. Anil battula

    Yelchuri Muralidhar rao garu,

    You gave a very valuable information on “SOVIET LITERATURE”
    Thanks alot andi…
    I hope you have a good collection of soviet books.please give your mail id or contact..mine is fualoflife@gmail.com
    I am a die hard fan of soviet books…espacially translations…
    Nice meeting u..

    Anil battula
    9676365115

  4. ఏల్చూరి మురళీధరరావు

    అసూర్యంపశ్య గారు!

    1940-వ దశకానికి మునుపు సోవియట్ రష్యా సామ్యవాదభావజాలాన్ని ప్రచారం చేయటానికి భారతదేశంలోని పాఠకులకోసం రష్యన్ సాహిత్యాన్ని అనువదింపజేసి ప్రచురించటం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం భూపేంద్రనాథ్ గుప్తా గారితో బెంగాలీలో మొదలై, క్రమంగా దేశభాషలన్నింటికీ విస్తరించింది. ఈ ప్రచారవ్యూహం ఆ రోజులలో పరిపరివిధాల సాగింది. మేధావులకోసం మార్క్స్ ఏంగెల్స్ లెనిన్ మహాశయుల రచనలు, వాటిపై వెలసిన వ్యాఖ్యానాల ప్రచురణ; వైజ్ఞానికదృష్టి కలవారికోసం భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితశాస్త్రం, వృక్షశాస్త్రం, వైద్యచికిత్స, భూగోళవిజ్ఞానం, అంతరిక్షయానం, గ్రహనక్షత్త్రతారకాదుల పరిచయం విషయాలుగా శాస్త్రవేత్తలకోసం, సామాన్యులకోసం ఉత్తమ గ్రంథాలను ప్రోగ్రెస్ పబ్లిషర్స్, రాదుగ ప్రచురణాలయం, మీర్ పబ్లిషర్స్, పీపుల్స్ పబ్లికేషన్స్ వంటి సంస్థలు ప్రచారంలోకి తెచ్చాయి. ఆ రోజులలో విశ్వమంతటా విస్తృతప్రభావాన్ని నెఱపిన అలెగ్జాందర్ పుష్కిన్, నికోలాయ్ గొగోల్, తుర్గెనీవ్, టాల్‌స్టాయ్, దాస్తొయేవ్‌స్కీ, ఆంటన్ చెహోవ్, మాగ్జిమ్ గోర్కీ, రోబెర్త్ రొజ్‌స్త్వెన్‌స్కీ, ఎద్వెర్దాస్ మెఝెలైతిస్, ఎవ్గెనీ దొల్మతోవ్‌స్కీ వంటి మహామహుల రచనలన్నిటినీ సమర్థులైన రచయితలచేత అనువదింపజేసి ప్రకటించారు. మయకోవ్‌స్కీ, లెఫ్ ఒషానిన్, రసూల్ గమ్జతోవ్, బాల్త్రుసైతిస్, అన్నా బునీనా, దెమెంత్యేవ్, అలెక్సీ కొల్త్సోవ్, మిహాయిల్ లెర్మంతోవ్ ల కవితాఖండికలన్నీ తెలుగువారికి పరిచితమైనాయి. వీటికితోడు రష్యన్ సాహిత్యవిమర్శ గ్రంథాలు, తత్త్వశాస్త్ర – కళావిమర్శ గ్రంథాలు, పర్యాటక గాథలు, భాషాశాస్త్రగ్రంథాలు, అలెక్సే సాకోల్స్కీ “మొదటి ఎత్తు” వంటి క్రీడాసాహిత్యగ్రంథాలు అందుబాటులోకి వచ్చాయి. యాకోవ్ పెరెల్మాన్ రచనను కొడవటిగంటి కుటుంబరావు గారు “నిత్యజీవితంలో భౌతికశాస్త్రం” అన్న పేరిట ఆంధ్రీకరించారు. ఆ పుస్తకానికున్న ప్రచారం సంగతి దాచినా దాగేది కాదు. 1971లో ప్రగతి ప్రచురణాలయం మాస్కో నుంచి శ్రీశ్రీ గారి వ్లదీమీర్ మయకోవ్‌స్కీ అద్భుతమైన “లెనిన్” కావ్యానువాదాన్ని ప్రకటించింది. “అభ్యుదయ”, “ప్రజాశక్తి”, “మనదేశం”, “నవత”, “ప్రగతి”, “ప్రతిభ”, “సోవియట్ భూమి” మొదలైన పత్రికలు ఈ వాఙ్మయానికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించాయి. సెట్టి ఈశ్వరరావు గారు “విశాలాంధ్ర” పత్రికను ప్రారంభించి, ప్రగతిశీలసాహిత్యానికి విశాలమైన నేపథ్యాన్ని కల్పించారు. “త్వమేవాహం”, “నయాగరా”, “వజ్రాయుధం”, “సంఘర్షణ” కావ్యాల తొలి విపుల విమర్శలతోపాటు రష్యన్ జానపద బాలసాహిత్యాన్ని ప్రకటించిన ఘనత కూడా ఆయనకే చెందాలి. ఆ రోజులలో రీడర్స్ డైజెస్ట్ వంటి పత్రికల ద్వారా వెలువడుతుండిన రష్యన్ వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకొని, “సాధక్” అన్న పేరుతో ఈశ్వరరావు గారు విమర్శవ్యాసాలను వ్రాసేవారు. ఆ తర్వాత “విశాలాంధ్ర” టైటిల్ ను కమ్యూనిస్టు పార్టీకి వారి దినపత్రికకోసం ఇచ్చివేశారు.

    రాదుగ సంస్థ ఏర్పడిన తర్వాత రష్యన్ బాలసాహిత్యాన్ని తెలుగు విభాగానికి స్వెత్లానా గారు, ఓల్గా బరాన్నికోవా గారు, కొంత కొంత నికితా గురోవ్ గారు సంపాదకులుగా ఉండి కొడవటిగంటి కుటుంబరావు గారు, ఉప్పల లక్ష్మణరావు గారు, నిడమర్తి ఉమా రాజేశ్వరరావు గారు వంటి ఉద్దండులచేత అనువాదం చేయించి చౌక ధరలకు విశాలాంధ్ర సంస్థ ద్వారానూ, సంచార గ్రంథాలయాల మూలాననూ తెలుగుదేశంలోని పల్లెపల్లెకీ ఆ గ్రంథాలను వ్యాపింపజేశారు. “స్పుత్నిక్” పత్రిక బాలవిజ్ఞానవ్యాప్తికి చేసిన దోహదాన్ని మాటలలో చెప్పలేము. బులతోవ్ “మాషా – ఎలుగుబంటి”, అర్కాది గైదార్ “చుక్ గెక్ అన్నదమ్ములు”, బుల్గకోవ్ “బుట్టాలు వేసిన తువాలు”, బొరిసోవ్ “సోమరిపోతు దయ్యాలు”, “వెర్లియోక”, నెతుబోనా “జిత్తులమారి, వెర్రిబాగులవాడు”, జి. స్పిరిన్ “పాదుషా కత్తికి ఎదురుకత్తి”, “కూతురు – సవతి కూతురు”, నికోలాయ్ నోసోవ్ “నెస్నైకా చంద్రమండల యాత్ర”, అలెక్సీ టాల్‌స్టాయ్ “నికితా బాల్యం”, బులాతోవ్ “మాయగుర్రం” వంటివి తెలుగువారి పుస్తకాలే అయ్యాయి. మీరు, డా. అబ్బరాజు మైథిలి గారు పేర్కొన్నవే కాక తుర్గిస్తాన్, సమర్ఖండ్, అజర్ బైజాన్, ఉక్రెయిన్, తజకిస్తాన్, బైలో రష్యా, చువాష్ జానపద కథలు; రష్యన్ జానపద కథలు సంపుటాలు సంపుటాలుగా ధారావాహికంగా వచ్చాయి. ఆ రచనలను కొడవటిగంటి కుటుంబరావు, ఉప్పల లక్ష్మణరావు, నిడమర్తి ఉమా రాజేశ్వరరావు, ఆర్వీయార్, సెట్టి ఈశ్వరరావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, మానేపల్లి తాతారావు, మండలీక సుబ్బారావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, కె. వాసుదేవరావు, మహీధర నళినీమోహన్, వసంతరావు వెంకటరావు, బాలశౌరి రెడ్డి, దాసరి సుబ్రహ్మణ్యం, రెంటాల గోపాలకృష్ణ, అవసరాల సూర్యారావు, వేమరాజు భానుమూర్తి, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, మహీధర రామమోహనరావు, పరకాల సూర్యమోహన్, శ్రీకాంత్, మందలపర్తి కిషోర్ వంటి విద్వదనువాదకులు తెనిగించి తెలుగు పాఠకలోకానికి తీర్చలేని ఋణభారాన్ని మిగిల్చారు. మహీధర నళినీమోహన్ గారి పుణ్యమా అని “నసీరుద్దీన్ కథలు” తెలుగు బాలలకు వాచోవిధేయం అయ్యాయి. విశాలాంధ్ర పుణ్యమా అని అవి రష్యన్ కథలనే పిల్లలు భావిస్తుంటారు. రెంటాల గోపాలకృష్ణ గారి “ఈసఫ్ కథలు” చదవనివారుండరు. చక్రపాణి గారి “చందమామ”, ఇంకా “బాలమిత్ర”, “చంద్రభాను”, “బాల”, “పాపాయి”, “బొమ్మరిల్లు”, “బాలానందం”, “ప్రమోద”, “జగతి” వంటి పత్రికలన్నింటిలోనూ రష్యన్ బాలసాహిత్యం అనువాదాలు వెలువడ్డాయి. కొండపల్లి వీరవెంకయ్య అండ్ కో, గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్, గోపాల్ అండ్ కో, దక్షిణ భారత ప్రచార సభ, దేశి ప్రచురణాలయం “బాలల బొమ్మల” సంపుటాలను వెలువరించి, రష్యన్ జానపద గాథల పుస్తకాలను ప్రకటించి చేసిన మేలు ఇంతా అంతా కాదు.

    ఇప్పటికే చాలా వ్రాసినట్లున్నాను. అప్పటికీ, వక్తవ్యాంశం కాబట్టి జ్ఞాపకం ఉన్న రష్యన్ బాలసాహిత్య రచనలను మాత్రమే ప్రస్తావించాను.

    విష్ణుపురాణంలో కథొకటున్నది: వైవస్వత మన్వంతరంలో కుశస్థలికి రాజు రైవత కకుద్మి కూతురు పెళ్ళికోసం సంబంధాలు వెతికి వెతికి చివఱికి లలాటలిఖితం ఏమిటో ఆ బ్రహ్మనే అడుగుదామని సత్యలోకానికి వెళ్ళాడట. అక్కడేదో నాట్యప్రదర్శన జరుగుతుంటే అది పూర్తయ్యేదాకా వేచి ఉందామని చూస్తూ నిలిచిపోయాడట. నాట్యం పూర్తయి అందరూ ఇళ్ళకు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన బ్రహ్మదేవుని ఎదుటపడి “స్వామీ, నా కూతురు పెళ్ళి మాటేమిటి?” అని అడిగాడట. బ్రహ్మదేవుడు, “ఏమయ్యోయి, నువ్విక్కడ నిలబడి ఉండగా భూలోకంలో ఏండ్లూ పూండ్లూ గడిచిపోయాయి. చతుర్యుగాలకు చతుర్యుగాలు దొర్లిపోయాయి. లోకం నువ్వనుకొన్నట్లు లేదు. ఇరవై ఏడో ద్వాపరం వచ్చింది. నువ్వు వెళ్ళి నందగోపుని కొడుకు బలరాముడికి నీ కూతురు రేవతినిచ్చి పెళ్ళిచెయ్యి” అన్నాడట.

    రైవత కకుద్మి వెనక్కి తిరిగివచ్చి చూసేసరికి తాటిచెట్లంత మనుషులుండే చోట అయిదారడుగుల మరుగుజ్జు లున్నారట. ఆ శక్తి, ఆ తెలివితేటలు, ఆ సత్త్వసంపద, ఆ సామర్థ్యం, ఆ ప్రతిభ ఏవీ లేవట. “అయ్యో, లోకం ఎంతలో ఎలా అయిపోయింది, ఎట్లాంటి బతుకుచూసి ఎట్లాంటి బతుకు చూడవలసివచ్చింది,” అని తెల్లపోయి, కుమార్తెను బలరాముడికి ఇచ్చి పెళ్ళిచేసి కర్తవ్యం ముగించాడట.

    రష్యన్ బాలసాహిత్యపు స్వర్ణయుగం ముగిసిపోయి రెండు దశాబ్దాలు దాటకమునుపే నేటి తెలుగు బాలసాహిత్యం స్థితిని చూస్తే రైవత కకుద్మి మనోభావాలు అనుభవానికి వస్తాయనిపిస్తుంది నాకు.

    ఏదో జ్ఞాపకం వచ్చి సోది రాశానని కోపం తెచ్చుకోకండి.

  5. mythili

    ఇంకా ‘ బుల్లి మట్టి ఇల్లు ‘,’బంగారుగిన్నె ‘ ..ఇలాంటి హార్డ్ బాక్ పుస్తకాలూ ఉన్నాయి.ఆ అనువాదాల భాష కూడా వింతగా,సరదాగా ఉంటుంది.ఉప్పల లక్ష్మణ రావు గారివయితే ఇంకా.ఆయన అనువదించిన ‘ వర్షంలో నక్షత్రాలు ‘ అనే కథల సంపుటిని భద్రంగా దాచాము. ‘బంతిమీద డాన్స్ చేసిన అమ్మాయి ‘ ,’రంగులపేటిక ‘,వర్షంలో నక్షత్రాలు ‘ చాలా మంచి ‘పిల్లల ‘ కథలు అందులో.

  6. sridhar

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు …థాంక్ యు అండి

  7. దిలీప్

    నేను చదివిన రష్యన్ పుస్తకాలలో నాకు “నొప్పి డాక్టర్” మరియు “కలాతపస్వి యొగోరి” అంటే చాలా ఇష్టం

  8. శివరామప్రసాద్ కప్పగంతు

    గోర్కీ ఆత్మకథ మూడు భాగాలు “నా బాల్యం”, “నా బాల్య సేవ”, “నా విశ్వవిద్యాలయాలు” మా ఊరు వెళ్లి ఎంతో ఓపికగా ఆటకంతా వెతికి పట్టుకున్నాను. ఎంత రష్యాలో ప్రింటు ఐన పుస్తకాలు అయినా, పేజీలు  గోధుమ రంగుకు తిరిగిపోయ్యాయి. పేజీలు  పెళుసు అయిపోయ్యాయి. వీటిని స్కాన్ చేసే మహా పని వీలుని బట్టి చెయ్యాలి. వీటిని ప్రస్తుతం జాగ్రత్తగా చదువుతున్నాను (దాదాపు 30+ సంవత్సరాల తరువాత), త్వరలో గోర్కీ ఆత్మకథల గురించి ఒక సమగ్రమైన వ్యాసం వ్రాద్దామని కోరిక. గోర్కీ వ్రాసిన కథలు నవలలు ఒక ఎత్తైతే ఆయన ఆత్మ కథ ఒక్కటే ఆ రచనలన్నిటికీ సాటి వస్తుంది, అంతటి లోతైన రచన, అంతటి పరిశీలన, తనకు తారసపడిన ప్రతి వ్యక్తీ గురించిన నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఒక ఆత్మకథ అంటే ఇలా ఉండాలి అని ఒక మంచి స్టాండర్డ్ ఏర్పరిచారు మాక్జిం గోర్కీ.

  9. swathi

    ma intlo kuda adavilo illu pustakma vundandi.inak bhadramga dachukunam
    ma abbyi peddavdyaaka vadiki chadivi vinapinchali

  10. వక్కలంక కిషోర్

    అప్పట్లో రష్యన్ పుస్తకాలు బాగా వచ్చేవి. తెలుగులో మంచి నాణ్యత ఉన్న పిల్లల పుస్తకాలంటూ ఉంటే అవి రష్యన్ పుస్తకాలే! ఎంతో క్వాలిటీ ఉన్న అలాంటి పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లిష్ లోనే దొరుకుతూ ఉంటాయి. మన మాతృభాషలో మంచి రంగులతో బొమ్మలతో నాణ్యత కలిగిన పుస్తకాలు చదవాలంటే ఏకైక అవకాశం రష్యన్ పుస్తకాలే! చిన్నప్పటినుంచీ అలాంటి అందమైన పుస్తకాలు చదివితే వాటి ప్రభావం పిల్లలమీద చాలా ఉంటుంది.అయితే రష్యన్ పుస్తకాల్లో తెలుగుభాష సహజంగా ఉండకపోవడం బాధాకరం. ఏదేమైనా తెలుగువాళ్లకి కూడా ఇప్పుడు తెలుగులో మంచి నాణ్యత కలిగిన తెలుగుపుస్తకాలు ప్రచురించే అవకాశం టెక్నాలజీ ఇచ్చింది. కానీ ఎవరూ ఆ దిశలో పెద్దగా ప్రయత్నాలు సాగించడం లేదు. కారణం… తెలుగుపిల్లలంతా ఇప్పుడు ఇంగ్లిష్ పుస్తకాలు చదువుతున్నారు. ఇది చాలా బాధగా ఉంటోంది. అయితే ఒక్క ఉపశమనం ఏమిటంటే కార్టూన్ ఛానెల్స్ తెలుగుని ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఆ తెలుగు కూడా అడ్డదిడ్డంగానే ఉంటోంది. సహజమైన తెలుగు కలిగి ఉండి.. మంచి నాణ్యత కలిగిన పుస్తకాలు చదువుకునే భాగ్యం… ఛానెల్స్ లో మంచి తెలుగుదనం కలిగిన నాణ్యత గల కార్టూన్లు చూసే భాగ్యం… తెలుగు పిల్లలకి లేదా అని తలుచుకున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. బాల్యం ఒక్కసారి గడిచిపోయాక మళ్లీ రాదు. భాష పునాదులు అక్కడే పడాలి. ఎవరైనా అలాంటి నిజమైన ప్రాజెక్టుని హృదయపూర్వకంగా ప్రారంభిస్తే నా శక్తివంచనలేకుండా సాయపడడానికి నేను సిద్ధం.

  11. Mamatha

    I remember reading Tolstoy’s stories. My parents recently brought “Bommala Kathalu” published by manchi pustakam for my daughter… when I saw the book, I was overwhelmed with memories.. I remembered tiniest details of the stories and the drawings. Thanks to Asuryampasya for reminding us of the other books and manchi pustakam and pustakam.net for doing a great job.

  12. విజయ్

    అవును, తోల్‌స్తోయ్ కథలు నేనూ చదివాను. విశాలాంధ్రలో దొరకని పుస్తకాలు ఎవరైనా అప్లోడ్ చేయండి 🙂

  13. ramya

    చిన్నప్పటి రష్యన్ కథలు అని చూసి వచ్చాను 🙂
    మీ పోస్ట్ చదవగానే చిన్నప్పటినుండీ నా దగ్గరున్న ఆ పుస్తకాలన్నీ పోగేసుకుని కూర్చున్నా. చిరిపోయి చివరి మొదటి పేజీలు లేకుండా వున్నవి కొన్ని, పిల్లల చేతుల్లో చిరిగి నేను రిపేర్ చేసి పెట్టుకున్నవి కొన్ని. పోగొట్టుకున్నవి లెక్కేలేదు.
    వీటిల్లో నేను మళ్ళీ కొత్తగా కొన్నవి నొప్పి డాక్టరు అడవిలో ఇళ్ళూ, బుల్లి మట్టి ఇల్లు ఈ మూడూ ఇప్పటికీ విశాలాంద్రలో దొరుకుతున్నాయి.
    మా బాబుకి బాగా నచ్చిన మొట్ట మొదటి కథ బుల్లిమట్టి ఇల్లు లోని ముళ్ళంగి దుంప కథ. సరిగా మాటలు రాకున్నా చెప్పటానికి ట్రై చేసేవాడు. దుంప లాగుతున్నానంటు కుండీలో మొక్కలన్నీ పీకేసేవాడు 🙂 అలా చేస్తున్నప్పుడు వెనక మేం అందరం వాడిని పట్టు కోవాలి కథలో లా 🙂 దీంట్లో బొమ్మలూ చాలా బావున్నాయ్.
    నొప్పి డాక్టర్ పిల్లలు బాగా ఇష్టపడతారు. మొత్తం పెద్ద కథలా వున్నా, దేనికదే కథల్లా చదివేలా కథలుగా ఉంటుంది, దీంట్లో బొమ్మలు మా వాడికి చాలా నచ్చాయి.
    దీంట్లో బొమ్మల వల్ల పుస్తకం పెద్దదిగా అనిపిస్తోంది కానీ. రోజూ ఓకథ్ రాసేయ వచ్చండి. మరీ పెద్ద కథలేం కాదు

  14. సౌమ్య

    అవును, టాల్‌స్టాయ్ పిల్లల కథలు, రాద్లోవ్ బొమ్మల కథలు – నేను మంచి పుస్తకం వారి షాపులో చూశాను.

  15. ఎన్ వేణుగోపాల్

    ఆ పాత పుస్తకాలలో (అపాతమధురాలలో) కొన్నిటిని ఇటీవల మంచి పుస్తకం సురేష, భాగ్యలక్ష్మి ప్రచురించి మళ్లీ అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.

  16. Sujata

    This one is The Best of Pustakam.net !

  17. Praveen Sarma

    RVR గారు, రాచమల్లు రామచంద్రారెడ్డి గారు నాకు బాగా తెలుసు. వారు తెలుగులోకి అనువదించిన సైద్ధాంతిక గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి కానీ వారు చిన్నపిల్లల కథలు కూడా ట్రాన్స్లేట్ చేశారని నాకు తెలియదు.

  18. శివరామప్రసాద్ కప్పగంతు

    ఛుక్ గెక్ అన్నదమ్ముల కథ, వర్షంలో నక్షత్రాలు…..ఇంకా……తిమూర్ అతని దళం….నాకు గుర్తున్నవి. ఆ పైన “అయిలీత” అనే పుస్తకం హీరోలిద్దరూ శుక్ర గ్రహం మీదకు అనుకుంటాను వెళ్తారు……ఈ పుస్తకాలు ఎవరిదగ్గరన్నా ఇప్పుడు దొరుకుతాయా! నొప్పి డాక్టరు పుస్తకం మా పిల్లలు తెగ చదవి నలిపేశారు. ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది.

    ఛుక్ గెక్ అన్నదమ్ముల కథ ఈ మధ్యనే కనపడింది. వీలు చూసుకుని వ్రాద్దామని పక్కన పెట్టాను. బాగా గుర్తు చేశారు.

    రష్యా నుంచి వచ్చిన పుస్తకాలు ఆ రోజుల్లో కారు చౌకగా అమ్మేవారు. అన్ని కూడా అప్పట్లో రూపాయి రెండు రూపాయల లోపే. ఛుక్ గెక్ అన్నదమ్ముల కథ చక్కటి బైండ్ పుస్తకం పెద్ద సైజులో ప్రచురించారు, రూపాయకో రూపాయి పావలాకో (1974 75 ప్రాంతాల్లో)కొన్న గుర్తు. దిటవు గుండెలు (రష్యన్లు జర్మన్ ఆక్రమిత ప్రాంతంలో చేసిన యుద్ధ విశేషాలు-నిజం కథ)అనే పుస్తకం రెండు రూపాయలు. రష్యా పతనంతో ఈ పుస్తకాల సరఫరా ఆగిపోయింది. ఇప్పటి పిల్లలకు ఈ పుస్తకాల గురించి ఇలా ఇంటర్ నెట్ లో తెలుసుకోవాలి. ఆ పుస్తకాలు ఉన్న వారు స్కాన్ చేసి తమ తమ బ్లాగుల్లో ఉంచగలిగితే. నేను నా దగ్గర ఉన్న ఛుక్ గెక్ పుస్తకం త్వరలో నా బ్లాగులో ఉంచాలని అనుకుంటున్నాను.

    1. Asooryampasya

      శివరామప్రసాద్ గారూ: ‘నొప్పి డాక్టర్’ నా దగ్గరుంది. అయితే, అది పెద్దది కనుక స్కాన్ చేయలేనేమో. తక్కినవి కొన్నైనా చేసేందుకు ప్రయత్నిస్తాను.

    2. Ruth

      I have “Aileetha ” with me 🙂 n few more science fictions like “Ikathiyandar”, “Gulaabi meghaalu” , “Prathiroopaalu” …

Leave a Reply