బెంగళూరులో పుస్తకాల కొనుగోలు అనుభవాలు

బెంగళూరులో పుస్తకాల కొనుగోలు గురించి రాయాలని కొన్నాళ్ళుగా అనుకుంటున్నాను. నేను ఈ సంవత్సరమున్నర కాలంలో ఇక్కడ వివిధ పుస్తకాల షాపులు చూశాను – కాలక్షేపానికి వెళ్ళినవి కొన్ని, నిజంగానే అసలక్కడ ఏముందో చూద్దాం అనుకుని వెళ్ళినవి కొన్ని. సీరియస్ గా ఇష్టపడ్డవి కొన్ని. అన్నింటి గురించే‌ ఈ టపా.

మొదట చైన్ షాపుల దగ్గరికి వస్తాను.
క్రాస్వర్డ్: గరుడా మాల్, ఇందిరా నగర్ : ఇందిరా నగర్ షాపు కాస్త పర్లేదు కానీ, గరుడా మాల్ లోని క్రాస్వర్డ్ మాత్రం మహా వీర బోరు షాపు. పోయిన ఏడాది నా వద్ద రెండున్నర వేలకి క్రాస్వర్డ్ కూపన్లు ఉంటేనూ, ఇష్టం లేకున్నా, తప్పక, గరుడా మాల్ క్రాస్వర్డ్ కి వెళ్ళాను…అప్పటికి బెంగళూరులో నాకు అదొక్క క్రాస్వర్డే తెలుసు కనుక. ఆ, ఈ మధ్య కాలంలో పుస్తకాల ధరలు ఆకాశాన్నంటున్నాయి కదా. అందునా, వీడు రూపాయి కూడా తగ్గించడు…రెండున్నర వేలు ఎంతలో అయిపోతాయి? అనుకున్నా. కానీ, ఎంతకీ అవ్వవే. ఒక పది పుస్తకాలేమో కొన్నా ఆ వేళ. కానీ, ఎంత కష్టపడి ఎంపిక చేశానో ఇంకా గుర్తుంది. పరమ విసుగు పుట్టింది ఆ కలెక్షన్ చూసి.

తరువాత, మా ఆఫీసు దగ్గరలోనే, ఇందిరా నగర్ లో ఒక క్రాస్వర్డ్ ఉందని కనుక్కుని, అక్కడికి వెళ్ళాను. ఇక్కడ కలెక్షన్ బాగుంది కానీ, మళ్ళీ అవే పేర్లు…అవే పుస్తకాలు. సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు బొత్తిగా 🙂

సప్నా బుక్ హౌస్, సదాశివనగర్:
ఇండియాస్ లార్జెస్ట్ బుక్ హౌస్ – అన్న ట్యాగ్‌లైన్ చూసి, అబ్బ చా! అనుకుని, బెంగళూరొచ్చిన మొదటి వారంలో మొదటి సారి వెళ్ళా ఇక్కడికి. పుస్తకాలు తక్కువ, హంగులు ఎక్కువా! చిన్న పిల్లల బొమ్మలు, గేంస్ సీడీలు ఎక్కువగా కనబడ్డాయి పుస్తకాల కంటే.

రిలయంస్ టైం అవుట్, మంత్రీ మాల్:
ఇక్కడ కలెక్షన్ బాగుంది. కాకపోతే, మరీ కంజెస్టేడ్. ఎక్కువ సమయం గడిపితే సఫొకేషన్ కలుగుతుంది. అసలే మాల్ లో ఉన్నామో ఏమో..ఒకటే గోల కూడా!

ఒడిస్సీ – ఇందిరానగర్:
మొదటి సారి వెళ్ళినపుడు బానే అనిపించింది కానీ, రెండో సారి వెళ్ళినపుడు బోరు కొట్టింది. అవే టైటిల్స్ ఉన్నట్లు కనబడ్డంతో. వీళ్ళకి పుస్తకాలు సర్దడం తెలీదనుకుంటాను. 🙂

ల్యాండ్ మార్క్, కోరమంగళ:
ఈ చైన్ షాపులన్నింటిలో, కలెక్షన్ పరంగా నాకు బాగా నచ్చినది ఇదొక్కటే. నేను ఒక్కసారే, బెంగళూరు ఫోరం లోని స్టోర్ కి వెళ్ళాను. కాస్త ఇరుగ్గా అనిపించింది, బహుశా చాలా మంది కొనుగోలుదారులు ఉన్నందుకేమో! కానీ, చాలా మంచి కలెక్షన్ ఉంది. నాకు చాలా నచ్చింది.

ఇక, బెంగళూరంటే నాకు గుర్తొచ్చేంత గుర్తుండిపోయిన షాపులు:

సెలెక్ట్ బుక్ షాపు

నాగరాజు గారు ఒకసారి సెలెక్ట్ బుక్ షాపులో ఎవరో ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళారు. అదే అక్కడికి నేను మొదటిసారి, చివరిసారీ వెళ్ళడం. కానీ, ఆ ఒక్కసారి లోనే, ఈ షాపు నాకు బాగా గుర్తుండిపోయింది. నాకు పుస్తకాల షాపు అంటే, అంతులేనంత వైవిధ్యం ఉండాలి మొదటగా. ఆ తరువాతే నేను మరేమన్నా చూసేది అక్కడ.నేను చూసిన కాసేపట్లో ఆ వైవిధ్యం ఇక్కడ కనబడ్డది. ఉన్న పుస్తకాలు నేను చదివే రేంజిలో ఉంటాయా లేదా అన్నది వేరే విషయం. అలాగే, మూర్తిగారు అక్కడ కూర్చుని ఆయన కథ చెబుతున్న దృశ్యం నా మనసులో నిలిచిపోవడం కూడా, ఈ షాపు నచ్చడానికి ఒక కారణం అనుకుంటాను. ఆరోజుటి అనుభవం గురించి ఇక్కడ రాసాను. సెలెక్ట్ బుక్ షాప్ కి అరవై ఏళ్ళు నిండిన సందర్భంగా వేసిన పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన పరిచయం ఇక్కడ చదవొచ్చు.


Strand Book Stall

డికెన్సన్ రోడ్డులో మణిపాల్ సెంటర్ లో ఉందీ షాపు. కలెక్షన్ బానే ఉంది కానీ, స్ట్రాండ్ వారు ప్రతి ఏడూ రెండు సార్లు నిర్వహించే పుస్తక ప్రదర్శన లో పెట్టే పుస్తకాల సంఖ్యతో పోలిస్తే, ఈ షాపు అసలు లెక్కలోకి రాదని నా అభిప్రాయం. వీరితో కొన్నాళ్ళ క్రితం జరిపిన ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు.

స్నేహా బుక్ హౌస్
శ్రీనగర మెయిన్ రోడ్డుపై ఒక చిన్న షాపు ఇది. నన్నెందుకు ఆకర్షించింది అంటే – ప్రత్యేకం కన్నడ పుస్తకాలనే అమ్ముతున్నారు కనుక. వీరితో కొన్నాళ్ళ క్రితం జరిపిన సంభాషణను ఇక్కడ చూడవచ్చు.

సుధా బుక్ హౌస్

పూర్ణిమ, విశాల పుణ్యమా అని నాకీ షాపు గురించి తెలిసింది. రాజాఈ నగర్లో ఉన్న ఈ షాపు నాకు వీటన్నింటిలోకీ -పాత పుస్తకాల షాపులోకి వెళ్ళిన భావన కలిగించింది. తుమ్ముతూ, దగ్గుతూనే, పైన అరల్లో దుమ్ము కొట్టుకుపోయిన పుస్తకాలని తీసి ఏమిటవి? అని కుతూహలంగా చూడ్డం మరిచిపోలేని అనుభవం. ఆ ఇమేజ్ కి తగినట్లే బయట ఎప్పుడూ నాకు కనబడని పుస్తకాలు కొన్ని దొరికాయి.

బ్లాసమ్స్
చర్చ్ స్ట్రీట్ లో ఉన్న ఈ షాపుపై నాకు మొదట్నుంచీ ఎందుకో సదభిప్రాయం లేదు. నాకీ షాపు గురించి మొదట చెప్పిన వారు అంత పాజిటివ్ గా చెప్పకపోవడం వల్లనేమో. అందువల్ల ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే, ఒకసారి పూర్ణిమ వచ్చినపుడు వెళ్ళాను. నాకు ఇక్కడి షాపుల్లో అన్నింటికంటే నచ్చింది ఇది – వైవిధ్యం పరంగా. ఎక్కువగా కొనకపోయినా (కొనడం మానేద్దాం అని డిసైడైన రోజుల్లో వెళ్ళాను), నాకు ఆసక్తికరంగా అనిపించే పుస్తకాలు అనేకం కనిపించాయి. బహుశా, వీళ్ళు పుస్తకాలు కొనడం, అమ్మడం రెండూ చేయడం వల్లనేమో. అయితే, మూడంతస్థుల ఈ షాపులో నాకు ఏదో ఒక లైబ్రరీ ముద్ర ఉన్న పుస్తకాలు కూడా బానే కనిపించాయి :)) కొట్టేశారనుకోవాలో, కొట్టేసిన వారి దగ్గర కొన్నారనుకోవాలో మరి!

బుక్వార్మ్

బ్రిగేడ్ రోడ్డు లో సెలెక్ట్ బుక్ షాపుకి వెళ్ళే ముందు సెల్లార్ లో కనిపిస్తుందీ షాపు. ఇక్కడ కూడా భిన్నాంశాల మీద మంచి కలెక్షన్లు కనబడ్డాయి. గ్రూచో మార్క్స్ ఆత్మకథ దొరకబుచ్చుకున్నది ఇక్కడే! ఇక్కడ మాత్రం కావాల్సినంత సమయం గడపొచ్చు – ఎంతైందన్నది తెలీకుండా. అలాగే, పుస్తకాల ధరలు కూడా బయటతో పోలిస్తే అందుబాటులో ఉండటం మరో విశేషం.

హిగ్గిన్ బోతమ్స్:

షాపు చాలా పెద్దది. ఎంజీ రోడ్డులో డెక్కన్ హెరాల్డ్ ఆఫీసుకి కాస్త పక్కగా ఉంటుంది. రెండు మూడు అంతస్థుల పుస్తకాలు. ఇక్కడే తమిళ, కన్నడ, మలయాళ పుస్తకాలకి కూడా ఆరలు చూశాను కానీ, తెలుగు పుస్తకాలు కనబడలేదు. అయితే, ఈ కలెక్షన్ కంటే కూడా నాకు ఈ షాపే బాగా గుర్తుండి పోయింది. ఆ విశాలమైన భవనం, పాతకాలపు లుక్స్, బోలెడంత ఏకాంతం, నిశబ్దం – బాగా గుర్తుండిపోయాయి.

– ‘గంగారాంస్’ వంక నోరు తెరుచుకుని చాలాసార్లు చూశాను కానీ, లోపలికి వెళ్ళే అవకాశం చిక్కలేదింకా. కనుక, ఇక్కడితో, ఈ వ్యాసం ముగించవచ్చేమో!

You Might Also Like

15 Comments

  1. Pavankumar

    నాకు నచ్హిన బూక్ షొప్స్ Landmark and Reliance timeout at Cunnungham road..
    టెలుగు బూక్స్ కొసం, విషలంద్ర వల్లు ఒకసరి బూక్ ఫెస్త్ లొ కలిసినప్పుదు avenue road లొ branch వుంది అని చెప్పరు.
    నాకు idea లెదు.
    విషలంద్ర , Hyd contact 04024602946

  2. SASTRY

    CHAMARAJPET VEDANTA BOOK HOUSE YOU CAN FIND TELEUGU BOOKS

  3. razu

    i forget a name of a book called ‘the secrets behind amazing beaty of lotusflowers’. a great book. i lost it during the time of heavy torrents.

  4. subhadra

    గంగారాంస్ లో చాలా పుస్తకాలు ఉంటాయి.. కానీ నిలబడి చూడటానికి స్థలం తక్కువ. క్రాస్వర్డ్లు చాలానే ఉన్నాయి కానీ మీరన్నట్టు అన్నింట్లోనూ ఒకటే వాతావరణం. కన్నింగ్ హాం రోడ్ లో ఉన్న రిలయెన్స్ టైం ఔట్ బావుంది. కూర్చుని పుస్తకాలు చదువుకోవచ్చు, పైగా ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరుకుతాయి ( మరీ పెద్ద కలక్షన్ కాకపోయినా). అద్దెకు తెచ్చి చదువుకోవాలంటే ఎల్లూర్ లైబ్రరీ ఉంది, సఫీనా ప్లాజా పక్కన ( బ్లూ క్రాస్ చెంబర్స్లో). చూడండి.. అన్నింటింటికంటే ఆసక్తి కరమైన విషయం చెప్తాను. సంచార గ్రంధాలయం ( రెండు వారాలకొకసారి వస్తుందిట) లొ చాల పుస్తకాలు చూసాను ( ఫిక్షన్ అనుకోండి). తెలుగు నవల్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ ఆ గ్రంధాలయం వచ్చే వేళలు మాత్రం ఉద్యోగస్తులకి వీలు కావు.

  5. raaju

    under the clear blue sky, you take left or right side in the life or in the books, i can say exact location of that shop- okay then you take a side as you like- exactly under the clear blue sky, where eagles dashing in the high skies behind the great sun, when you walk through these great green streets- okay, then leave it all this nonsense-i told about a book, which i saw in that bookshop and i buy it without paying money. its a great classic, and a masterpiece unrecognized by fools- the name of masterpiece i reade recently is- ‘the continnution of butterflies’.

  6. మేధ

    @భావకుడన్ గారు:
    >>ఉమా థియేటర్
    బెంగళూరు లో ఎక్కడ ఉంది ఈ థియేటర్?

    1. సౌమ్య

      @Medha: Bulltemple Road.

  7. భావకుడన్

    కత్తెరగుప్ప (నేనలాగే పలుకుతా మరి 🙂 ఫుడ్ వరల్డ్ పక్కన హోటల్ పైన ఒక పాత పుస్తకాల షాప్ ఉంది. పేరు గుర్తు లేదు కాని “తెలుగు పుస్తకాలు పాతవి ఎప్పడివో దొరుకుతాయి” చప్పరించేస్తూ అన్నారు తెలిసినవాళ్ళు

    తెలుగులో భక్తికి సంబంధించినవి ఎన్నో పుస్తకాలు ఇంక్లూడింగ్ గోరఖ్పూర్ వారి వాల్మీకి రామాయణం…ఉమా థియేటర్ ఎదురుగా ఉన్న/పక్క సందులో వేదాంత బుక్ హవుస్లో కాని అదే సందులో ఉన్న ఇంకో రెండు మూడు పుస్తకాల షాపుల్లో కాని దొరుకుతాయి. అమ్మ ప్రకారం ఆ వీధిలో వేదాంత బుక్ షాప్ ఒకటే ఉంది. కాని నేను అది మధ్యాహ్నం సిఎస్టాకు బంద్ చేస్తే అదే సందులో అనుకుంటా ఇంకో రెండు మూడు పుస్తకాల షాపులు చూసాను భక్తి పుస్తకాలవి. కొంచం వెతికితే ఈసీగానే దొరుకుతాయి షాపులు.

  8. raaju

    i refer to you a bookshop name in banglore, which you never find in your lifetime. the name of bookshop- i visit frequently is ‘the peoples bookshop’.

  9. sarada

    అవునండి, బెంగళూరులో తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, ఎవరికైనా తెలిస్తే!! 🙂

  10. మేధ

    @IndianMinerva: Try in Reliance Timeout, Cunningham Road.. They have moderate collection of telugu books…

  11. Indian Minerva

    Blossoms లో మాత్రమే నాకు Shifu, You’ll do anything for a laugh దొరికిందండీ కాకపోతే second hand.
    అసలు తెలుగు పుస్తకాలెక్కడ దొరుకుతాయో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ ఎవరైనా.

  12. krishnapriya

    బాగుంది.. మీ విశ్లేషణ… గంగా రాం కి నేను వెళ్లాను..ఒక్కసారి. పాత కాలం పుస్తకాల షాప్ లా అక్కడ నుంచుని పుస్తకాలు చూడటం బాగుంది కానీ.. ఎక్కువ సమయం లేకపోవటం తో పూర్తి స్థాయి లో ఎక్స్ ప్లోర్ చేయలేక పోయాను 🙁

  13. రాఘవ

    గంగారాంస్-లో మీరు అనుకున్న వైవిధ్యం ఐతే కనబడుతుంది కానీనండీ, తెలుగు పుస్తకాలు దొఱకటం మృగ్యం.

Leave a Reply to krishnapriya Cancel