మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

parvaప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించింది కత్తి మహేష్ కుమార్ గారి ఈ టపా. పుస్తక సమీక్షలు నాకు కొత్త కాబట్టి సమీక్షించే సాహసం చెయ్యకుండా పుస్తకం చదివాకా నాకు కలిగిన అభిప్రాయాలేవో నిజాయితీగా చెప్పడం మాత్రమే చేస్తాను.

మహాభారత కథ చదివిన/తెలిసిన ఆలోచనాపరులెవ్వరికైనా అనేక ప్రశ్నలు కలగడం సహజం. మచ్చుకి –
పాండవులు దేవతల వరం వల్ల పుట్టినవారా? (immaculate conception?)
ద్రౌపది అయోనిజా? యజ్ఞకుండం లోంచి పుట్టిందా?
వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి అక్షయ వస్త్రాలనిచ్చి కృష్ణుడు మహిమ చూపించాడా?
అస్త్రాలు అంటే ఏమిటి?
శాపాలు నిజంగా జరుగుతాయా?
గాంధారికి వందమంది పిల్లలు కలగడం సాధ్యమేనా?
కృష్ణుడు రాయబార సమయంలో విశ్వరూపం చూపించాడా?
లక్షలమంది ఒకచోట చేరి యుద్ధం చెయ్యడం ఆ కాలంలో సాధ్యపడిందా? వాళ్ళకి ఆహారం, కాలకృత్యాలూ గట్రా ఎలా కుదిరి ఉంటాయి?
అతి వృద్ధుడైన భీష్ముడు యుద్ధం ఎలా చేశాడు? అతనికి నిజంగా స్వచ్ఛంద మరణం ఉందా? ఒంటికి గుచ్చుకున్న బాణాలే అతనికి నిజంగా పడక అయ్యాయా? సెప్టిక్ అవకుండా గాయాలతో అన్నాళ్ళు ఎలా ఉన్నాడు?

ఇటువంటి ప్రశ్నలు పుట్టలు పుట్టలుగా పుట్టుకుని వస్తాయి – కొంచం ఆలోచించడానికి సాహసించేవాళ్ళకి. ఈమాత్రం ఆలోచించగలిగినవాళ్ళకి Occam’s razor గురించి తెలిసే ఉంటుంది. నమ్మడానికి కష్టంగా అనిపించే  అంశాలని విశ్లేషించడానికి ఈ రేజర్ని వాడ్డం బుద్ధిజీవులకి మంచి సరదాని ఇస్తుంది. పైన చెప్పిన ఏ ప్రశ్ననైనా తీసుకోండి. దానికి వీలైనన్ని సమాధానాల్ని ఆలోచించండి. వాటిల్లో అతి తక్కువ ఊహాగానాలతో, సరళంగా ఉన్న సమాధానాన్ని ఎన్నుకోండి. అలా ఎంపిక చేసుకోడమే Occam’s razor ని ఉపయోగించడం అంటే.

ఉదాహరణ –
వివరించాల్సిన అంశం: మానవుల కలయిక లేకుండానే దైవాంశతో గర్భం కలగడం (immaculate conception)
వివరణ 1: దేముడి దయ ఉంటే సాధ్యమే.
వివరణ 2: దైవాంశతో గర్భం కలిగిందని చెప్తున్న వ్యక్తి బహుశా అత్యాచారానికి గురై ఉంటుంది. తనవాళ్ళ దగ్గర దైవాంశ అని అబద్ధం చెప్పి ఉంటుంది.

ఈ రెండు వివరణల్లోనూ రెండోది చాలా సరళమైనది కాబట్టి Occam’s razor ప్రకారం రెండోదే అంగీకారయోగ్యం అవుతుంది.

ఇప్పుడు సరదా ఉన్నవాళ్ళెవరైనా మహాభారతం గురించి మీకు పుట్టిన ప్రశ్నలన్నిటికీ ఈ రేజర్ని ఉపయోగించి సమాధానాలు వెతకండి. తర్వాత ‘పర్వ’ నవల చదువుకోండి. మీ సమాధానాలనీ నవల్లోని విషయాల్నీ పోల్చి చూసుకోండి. పెద్దగా ఆశ్చర్యం కలగదు! ‘అలాంటప్పుడు, ఈ మాత్రం సమాధానాలు మేం ఆలోచించుకోలేమా, దానికోసం ఈ నవల ఎందుకు చదవాలి’ అంటే – సరే, మనకు ఇప్పటివరకు తెలిసిన చరిత్ర జ్ఞానం ప్రకారం మీరు మహాభారతాన్ని అర్థం చేసుకోడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఆర్యులంటే ఎవరు? వాళ్ళ సంస్కృతి ఏమిటి? వాళ్ళు ఏం తినేవారు? ఏం తాగేవారు? వాళ్ళ నమ్మకాలు ఏమిటి? వాళ్ళలో కుల వ్యవస్థ ఉందా? సూత కులం అంటే ఏమిటి? ఎలా పుట్టింది? రాక్షసులు అంటే ఎవరు? దేవతలు, నాగులు, గంధర్వులూ అంటే ఎవరు? ఆర్య సమాజంలో వివాహాచారాలు, కట్టుబాట్లు ఎలా ఉండేవి? బహుభర్తృత్వం పాత సమాజాల్లో ఉండేదా?

ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలిసినా  – ఈ చారిత్రక నేపథ్యంలో చిత్రించిన ఒక జీవన దృశ్యాన్ని (నవలని) ఎప్పుడైనా చదివారా? అదీగాక- అతి పరిచయమైన, అతి సన్నిహితమైన, మహాభారతం లాంటి మహోజ్జ్వల కథల్ని ఈ నేపథ్య చిత్రణలో చదివారా? చదవకపోతే తప్పకుండా చదవాల్సిన నవల ‘పర్వ’.

హేతువాద ఆలొచనా దృక్పథంతోనూ,ఈ చారిత్రికాంశాలతోనూ బొత్తిగా పరిచయం లేకుండా కేవలం మహాభారతం యొక్క ఉజ్జ్వలత్వంతో మాత్రమే మీకు పరిచయం ఉంటే మాత్రం ఈ నవల చదవడానికి మీరు గుండె దిటవు చేసుకోవాల్సిందే.

కానీ ఇవన్నీ మీకు బాగానే తెలిసి ఉంటే, ఈ నవల చదివాకా – ‘ఇందులో పెద్ద విషయం ఏముంది? ఈ మాత్రం లాజిక్కుల్ని ఉపయోగించి రామాయణ, భాగవతాల్ని కూడా నవలల్లాగా నేను రాయలేనా?’ అని మీరు అనేస్తే నేనూ మహాకవి శ్రీశ్రీ గారిలాగే, ‘శభాష్,తప్పకుండా రాయగలరు. అసలు ఏ రచన చదివినా ఇలా నేనెందుకు రాయలేను అనిపించడమే ఆ రచన గొప్పదనడానికి కొలమానం’ అంటాను. (శ్రీశ్రీ గారు ఒక కవి సమ్మేళనంలో కవిత చదివార్ట. అది విన్న కుర్రాడొకడు లేచి, ‘ఓస్, కవిత్వమంటే ఇంతేనా, ఈ మాత్రం నేను రాయలేనా?’ అన్నాట్ట.)

అదలా ఉంచితే, మహాభారత కథతో చిన్నతనం నుంచీ పరిచయం ఉన్న వ్యక్తిగా ఒక రెండు చిన్న పొరపాట్లు మాత్రం నాకు ఈ నవల్లో కనిపించాయి. (బహుశా నాదే పొరపాటు కావచ్చు. నేను సంస్కృత మహాభారతం చదవలేదు. పరిశోధనాత్మక దృష్టితో అసలు చదవలేదు.)
1. పాండవుల్లో అర్జునుణ్ణి మినహాయించి, మిగతా వాళ్ళెవరికీ ద్రౌపది తప్ప  వేరే భార్యలు లేరనడం పొరపాటు కావచ్చు. నాకు తెలిసినంతవరకు వాళ్ళందరికీ ఎవరి భార్యలు వారికి ఉన్నారు. ద్రౌపది మాత్రమే ఉమ్మడి భార్యా, పట్టమహిషీను.
2. వ్యాసుడి తాతగారు వశిష్ఠుడు కాదు, శక్తి మహర్షి. ఆ శక్తి మహర్షి తండ్రి వశిష్ఠుడు. అంటే వ్యాసుడి ముత్తాత గారు వశిష్ఠుడు.
వీటిని కూడా పక్కనపెట్టండి.

‘పర్వ’ లోని పాత్రలూ, కథా మహాభారతానివే అయినా, మనకి చిరపరిచితమైన పాత్రలు కావవి. వాటి స్వభావాల్లో సమూలమైన మార్పులు కనిపిస్తాయి. పాండవులు సయోధ్య కలిగిన అన్నాదమ్ములు కారు. అలాగే కృష్ణ బలరాములూను. అందరూ భైరప్ప గారి కలం పోటుకి బలహీనపడిపోయి కనిపిస్తారు. కొంతమటుకు తట్టుకు నిలబడగలిగింది భీముడూ, కృష్ణుడూ మాత్రమే. (ద్రౌపదీ, కుంతీ కూడా పరవాలేదు.) మరీ దెబ్బతినిపోయింది ధర్మరాజూ, వ్యాసుడూ, మహాభారతానికి theme అయిన ‘ధర్మం’ అనబడే ఒక అయోమయపు భావనాను. వీళ్ళందర్లోకీ పాపం, వ్యాసుణ్ణి చూస్తే జాలి వేస్తుంది. ఇన్ని వేల (క్షమించాలి, వందల) సంవత్సరాలుగా ఒక జాతి ప్రజల  మనస్సుల్లో పూజలందుకుంటున్న ఆ మహానుభావుడు దీనాతిదీనంగా కనిపిస్తాడు. మనబోటి నాస్తికుల ప్రశ్నలకే దెబ్బతినిపోతాడు.

ప్రశ్నలంటూ పుట్టడం మొదలయ్యాకా ఎన్ని సమాధానాలు తెలిసినా ప్రశ్నలు మిగిలిపోతూనే ఉంటాయి. అలాగే నాకూ ఓ ప్రశ్న మిగిలిపోయింది, ‘పర్వ’ చదివాకా. పాతకాలపు వ్యక్తులంటే మనంత తార్కిక బుద్ధి కలిగినవారు కాదు. మనంత తెలిసినవారూ కాదు. కూపస్థ మండూకాలు. వాళ్ళ సిద్ధాంతాలూ, ఆదర్శాలూ మనకి పేలపిండీ, ఒడియాలూను. అయినా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చెయ్యగలిగారు కదా. మరి మన ఆధునికుల ఊహా చిత్రాల్లో వాళ్ళు ఎందుకంత దీనంగా కనిపిస్తారా, అని. ఆఫ్టరాల్, ఈ రోజుల్లో గల్లీలో తిరిగే ఛోటా రాజకీయనాయకుడికి కూడా పెద్ద పరివారమూ, పలుకుబడీ, గొప్ప చైతన్యవంతమైన జీవితమూ ఉంటాయి కదా. చిన్నా, చితకా రచయితలకే అభిమాన సంఘాలూ, బిరుదులూ, శాలువాలూ ఉంటాయి కదా. మరి అప్పట్లో దేశాల్నేలిన రాజులూ, ఆదర్శ పురుషులని పేరుగాంచిన వాళ్ళూ, వేదాల్ని విభజించినవాళ్ళూ మరీ అంత దీనంగా బతికారంటారా? ఈ ప్రశ్నకీ కొన్ని సమాధానాలు ఊహించుకున్నాను.

1. వాళ్ళ జీవితాల్లోని ఉజ్జ్వలత్వం అబద్ధం. ఈ కథలన్నీ విజేతలు రాయించుకున్నవీ, భట్రాజు పొగడ్తలూను. లోకం గుడ్డిది కాబట్టి ఇంతకాలం ఇవి చెల్లుబాటయ్యాయి.
2. పూర్వకాలంలో కొంతమంది జనాలు ఒక స్ఫూర్తితో బతికారు. ఆ స్ఫూర్తే వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళని ప్రభావితం చేసి తరతరాలుగా నిలిచిపోయింది. వాళ్ళ జీవితాలు legends అయిపోయి వాళ్ళ చుట్టూ మాయ,మంత్రాలు అల్లుకున్నాయి. వాటిని తొలగించేసినా ఇప్పటికీ ఆ స్ఫూర్తికి నష్టం కలగదు. ఆ స్ఫూర్తిని చంపుకోలేకే ఇప్పటికీ ఈ కథల్ని పట్టుకు వేళ్ళాడుతున్నాం.
3. దేవతలు భూమ్మీద సంచరించారు. వాళ్ళ కథలే ఇవి. ఇవన్నీ దైవలీలలు, మనకి అర్థం కావు. మనకి అర్థం కాకపోయినా వీటిని విశ్వసించాలి.
4. ఇదంతా అర్థం లేని చెత్త. దీనిమీద సమయం వృధా చేసుకోడం దండుగ.

పైన చెప్పిన సమాధానాలమీద కూడా  Occam’s razor ని ఉపయోగించాలి. అది ఎవరికివాళ్ళు చేసుకోవాల్సిన పని.

మొత్తానికి మహాభారతంలోని ‘ఆత్మ/స్ఫూర్తి’ గురించి పట్టించుకోకపోతే, ‘పర్వ’ చాలా గొప్ప నవల. అందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

Details of the book:
Parva
Author: S.L.Bhyrappa
Flipkart Link – here.

You Might Also Like

45 Comments

  1. G K S Raja

    ఈ పుస్తకం ఇప్పటికీ దొరకడం లేదు. మంచి సమీక్ష రాశారు. నిష్కర్షగ చెప్పడానికి కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గినట్టున్నారు.
    కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు- అప్పట్లోనే కాదు ఇప్పట్లో వ్రాసినవైనా గుడ్డిగా ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. మానవుడి జ్ఞాన పరిధి పెరుగుతున్న కొద్దీ పాతవాటిలో నిగూఢమయిన గొప్ప విషయాలతోబాటు అసంబద్ధ విషయాలూ గోచరమవుతుంటాయి. వాటిపై దృష్టి సారించి కొన్నింటిని పక్కకు పెట్టాలి. కొన్నింటిని సవరించుకోవాలి, సరిచేసుకోవాలి. కల్పితాలనూ, కనికట్లనూ సమర్ధించుకుంటూ పోకూడదు. అవి మహత్తు గలవి, వాటిని ఏమీ అనకూడదు అనుకునే వారికి ఇక చెప్పేదేముంటుంది? ప్రతీదీ కాలానుగుణంగా మారుతుంటుంది. నిత్యచైతన్యమైనవే అన్నీ. ఎంతోమంది మేధావులు రాసిన రాజ్యాంగాన్ని కూడా సవరించుకుంటున్నాం కదా! అలాగే పురాణాలైనా, ఇతిహాసాలైనా పరిశీలనకు నిలబడాలి.

  2. VG

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? online లో ఎక్కడ లేదు.

    1. VG

      I mean to buy also it is not available anywhere. Any bookshops or libraries in Hyderabad that carry this book?

  3. భారతీయ నవల | పుస్తకం

    […] * భైరప్పగారు రాసిన ‘వంశవృక్ష’ కు తెలుగు అనువాదమైన ‘వెండితెర నవల’ గురించి ఇక్కడ చూడవచ్చు. (పర్వ పుస్తకంపై పుస్తకం.నెట్ వ్యాసం ఇక్కడ.) […]

  4. Bhaskara Rami Reddy

    నరసింహా రావు గారూ, మీరు ఎలాగూ మహాభారత పర్వాలను టైపు చేస్తున్నారు కాబట్టి, వీలైతే పద్నాలగవ పర్వాన్నుంచి చేస్తే మహాభారతమంతా అంతర్జాలంలో లభిస్తుందేమో. ఇప్పటికే పద్నాలుగు పర్వాలను http://groups.google.com/group/andhramahabharatam వీరు యూనికోడ్ లో చేసి వున్నారు. ఓ సలహా మాత్రమే

  5. narasimharao mallina

    పుస్తకం డాట్ నెట్ లో శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి? అనే శీర్షికన వరుసగా నేను నాకు బాగా నచ్చిన కొన్ని మహాభారత భాగాలను ఉంటంకిస్తూ వ్రాస్తున్నాను. పూర్తిగా మహాభారతం చదివే ఓపిక, తీరిక లేనివారికి సంక్షిప్తంగా పరిచయం చేసుకోవటానికి ఇది పనికివస్తుందని నా అభిప్రాయం. ప్రస్తుతానికి ఆది సభాపర్వాలు, నన్నయ గారి ఆరణ్యపర్వం పూర్తయి, ఎఱ్ఱాప్రెగ్గడగారి భారతభాగంలో పంచమాశ్వాసం దగ్గఱికి వచ్చాను. వీలుకుదిరితే చదవండి.భగవంతుడి దయతో మొత్తం మహా భారతం అన్ని పర్వాలను గుఱించీ వ్రాయాలని నా సంకల్పం. వేరేగా మహాభారతం- ఆణిముత్యాలు పేరుతో ఓ బ్లాగు కూడా ప్రారంభించి ఉన్నాను.కాని , ప్రస్తుతం దీనిలో పెద్దగా వ్రాయటం లేదు.తఱువాత, తఱువాత సమయం చిక్కితే వ్రాసే ప్రయత్నం చేస్తాను.బ్లాగు url పైన ఇచ్చాను.

  6. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] 10. పర్వ – ఎస్.ఎల్. భైరప్ప (అను. గంగిశెట్టి […]

  7. ప్రసాద్

    మహభారతంలో పాండవులు జన్మించిన ప్రదేశాన్ని, మరియు కురుక్షేత్రయుద్ధం జరిగిన ప్రదేశాన్ని ఇప్పుడు ఏమంటారు.

  8. kirun kumar

    మనకున్న పురాణాలూ, ఇతిహాసాలు ఎందుకు రాసారంటే, మనకు, మన ముందు తరాల వారికీ మార్గదర్శకంగా ఉండాలనే తలంపుతో మన పూర్వికులు వ్రాసినవే రామాయణ, మహా భారతాలు. వాటిలోని తప్పొప్పులను ఎంచటానికి కాదు. మానవ జీవితాలలో మనం ఎలా జీవించాలి మరియు ఎలా జీవించకూడదో ఆయా….. పురాణాలూ, ఇతిహాసాలు మొదలైన వాటిని చదివి అందులోని మర్మాన్ని గ్రహించి ఒక చక్కటి జీవితాన్ని పొంది మన ముందు తరాల వారికీ అందించాలి. అంతే కానీ వాటిలోని తప్పొప్పులను ఎత్తి చూపటం సమంజసం కాదు.

Leave a Reply