The God Delusion

“The God Delusion” అన్న పుస్తకం రిచర్డ్ డాకిన్స్ రచించిన ప్రసిద్ధి చెందిన పుస్తకం. ఈ పుస్తకాన్ని నాస్తికత్వపు భగవద్గీతలాగా వర్ణిస్తూ కూడా ఉంటారు చాలామంది. డాకిన్స్ విషయానికొస్తే ఆక్స్‍ఫోర్డ్ విశ్వవిద్యాలయం లో ఆచార్యులుగా ఉన్నారు ప్రస్తుతం. 70లలో “The selfish gene” ద్వారా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. తరువాత కూడా ప్రధానంగా డార్విన్ సిద్ధాంతం ద్వారా సృష్టిని అర్థం చేసుకోవడం, సృష్టికర్త ఉన్నాడు అన్న వాదనకి వ్యతిరేకంగా పరిశోధన చేయడం ద్వారా డాకిన్స్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. “The blind watchmaker” అన్నది వీరి మరో ప్రముఖ పుస్తకం.

ఇక ప్రస్తుత పుస్తకం విషయానికొస్తే, దీనిని “దేవుడి భ్రమలో” అన్న పేరుతో సరిశెట్టి ఇన్నయ్య గారు తెలుగులోకి అనువదించారు. పేరుని బట్టి పుస్తకం ఏ విషయం గురించి అన్న విషయం మీద అవగాహన కలిగే ఉంటుందనుకుంటాను అందరికీ. ఈ పుస్తకం ప్రధానంగా “దేవుడు ఉన్నాడు అని నమ్మడం ఒట్టి భ్రమ” అన్న పాయింటు మీద సాగుతుంది. మీరు అస్తికులా, నాస్తికులా అన్న విషయం పక్కన పెడితే, నేను అస్తికురాలినా, నాస్తికురాలినా అన్న విషయం కూడా ఇక్కడ పక్కన పెడితే, ఈ పుస్తకాన్ని ఓ పుస్తకంగా చూస్తూ రాస్తున్న వ్యాసమిదని గమనించగలరు. Personal bias ని వీలైనంత వరకు పక్కనపెట్టి ఈ పుస్తకాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.

ఈ పుస్తకాన్ని పది భాగాలుగా విభజించారు. మతమంటే అర్థమేమిటన్న ప్రశ్న మొదలుకుని అసలు దేవుడున్నట్లా లేనట్లా అన్న చర్చ లేవనెత్తి, మతం మనిషికి ఎందుకు అవసరం కావొచ్చో వివరిస్తూ ముగుస్తుంది ఈ పుస్తకం. ఒక్కో భాగం గురించి వివరంగా ఎలా చెప్పాలో అని ఆలోచించి పాయింట్ల పద్ధతి నయమని అనిపించి ఇలా రాస్తున్నాను:
1. The religious non-believer: ఇందులో తాను మతం అన్న పదాన్ని ఈ పుస్తకంలో ఏ అర్థంతో వాడుతున్నానో వివరంగా చెప్పారు రచయిత. మతాన్ని – Einsteinian Religion, Supernatural religion అని రెండు రకాలుగా విభజించారు. మొదటిరకం – దేవుడు అని ప్రత్యేకంగా పూజలు గట్రా చేసే తరహా కాక ఉదాహరణకి – పని యే నా దేవుడు, లేకుంటే – “God is energy” ఇలాంటి భావనల గురించి. రెండో రకం – దేవుడు ఉన్నాడు. ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు – ఇలాంటి భావనలు గలది. ఈ పుస్తకంలో రెండో రకాన్ని గురించిన తర్కం ఉంటుంది.
2. The God hypothesis: దేవుడు అన్న కాన్సెప్ట్ గురించి ఉన్న వివిధ తర్కాలు, వాటి గురించిన పరిచయాలు ఉంటాయి ఇక్కడ. Polytheism – బహు దేవతా పూజ, mono theism, secularism – సర్వ మత సమభావం, Agnosticism – దేవుడున్నాడా లేదా అన్న అనుమానం – ఇలా విభిన్న రకాలైన వాదాల గురించి సవివరంగా చెప్పడమే కాక – NOMA, Neville Chamberlain school of evolutionists, Little green men – వంటి విభిన్న భావజాలాలున్న సమాజాల గురించి కూడా పరిచయం చేస్తారు ఈ భాగంలో.
3. Arguments for God’s existence: ఇందులో దేవుడు ఉన్నాడు అని బలంగా వాదించే వాదనల గురించిన పరిచయం, ఆ వాదనకి సపోర్టుగా వారు చెప్పే కారణాలు, విభిన్న కోణాల నుండి దేవుడి ఉనికిని నిరూపిస్తూ ఉండే వాదాల గురించిన సవివరమైన చర్చ ఉంటుంది.
4. Why there is almost certainly no God: ఈ భాగం నుండి ఈ పుస్తకం అసలైన ధ్యేయం పాఠకులని చేరడం మొదలుపెడుతుందని నా అభిప్రాయం. ముందు చెప్పిన వాదాలకి ప్రతివాదం చేస్తూ, అవి ఎక్కడ తప్పాయో, ఎందుకు వాటిలో చెప్పిన కొన్ని వాక్యాలు చెల్లవో వివరిస్తూ, దేవుడు ఎందుకు ఉండే అవకాశం లేదు అన్న విషయంలో రచయిత తన వాదం వినిపిస్తారు.
5. Roots of religion: ఈ భాగంలో మతం ఎలా పుట్టి ఉంటుంది? అసలు మతం ఎందుకు పుట్టి ఉంటుంది వంటి ప్రాథమిక ప్రశ్నలని పరిశోధిస్తారు రచయిత. మతమంటూ ఒకటి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? మతం అన్న కాన్సెప్ట్ లేకుండా ఉంటే ఏమిటి? – ఇలా సాగుతుంది ఈ భాగంలో వ్యాసమంతా.
6. Roots of morality: Why are we good?: ప్రధానంగా మతమన్నది ఉంది కనుకనే మనుష్యుల్లో మానవత్వం ఉంది అన్న వాదనని వ్యతిరేకిస్తూ మొదలౌతుంది ఈ భాగం. మతమే కారణమా మనలోని మంచితనానికి? అన్న ప్రశ్న లేవనెత్తి, మతం లేకపోయినా moral values అనేవి ఉండడానికి ఉండే అవకాశం ఎలా ఉందో వివరంగా చెప్పి నిరూపిస్తారు రచయిత ఈ భాగంలో.
7. The Good book: Changing moral zeitgeist: ఇక్కడ ప్రధానంగా మారుతున్న సామాజిక విలువలు, మతంపై దాని ప్రభావమూ, అప్పటి ఆలోచనల్లోనూ, ఇప్పటి ఆలోచనల్లోనూ వచ్చిన మార్పులూ వంటి విషయాల గురించి చర్చిస్తారు. అయితే, ఈ భాగం ప్రధానంగా రకరకాల సామాజికాంశాలకి అన్వయించొచ్చు అనిపించింది. Changing Zeitgeist అన్నది ఆసక్తికరమైన చర్చ జరగాల్సిన అంశం.
8. Whats wrong with religion? Why be so hostile? : ఈ భాగంలో ఇక రచయిత చెప్పదలుచుకున్న విషయంలోని పవర్ పతాకస్థాయికి చేరుకుంటుందని చెప్పవచ్చు. మతమన్నది ఉంటే ఉండింది – సమస్యేమిటి? అన్న ప్రశ్న తో మొదలై – మతం వల్ల చరిత్రలో జరిగిన గొడవల గురించి చెబుతూ, మతం అన్నది ఎందుకు ఉండకూడదో సమర్థంగా వాదిస్తూ సాగుతుంది ఈ భాగం.
9. Childhood, abuse and the escape from religion: చిన్నతనం నుండీ అందరి మనసుల్లోనూ మతతత్వ భావజాలం ఎలా నింపుతారో, దాని ప్రభావం వారిపై ఎంత తీవ్రంగా ఉంటుందో, దాని పర్యవసానం ఏమిటో వివరిస్తుంది ఈ భాగం.
10. A much needed gap?: చివరగా మతాన్ని మనుష్యులు ఎందుకు ఆశ్రయిస్తారో, మతం ఏ సమయాల్లో మనిషిని ఆకర్షిస్తుందో వంటి విషయాలు చర్చిస్తూ పుస్తకాన్ని దేవుడు అన్నది ఎందుకు భ్రమ? అన్నది మళ్ళీ చెబుతూ ముగిస్తారు రచయిత.

ఇదీ ఈ పుస్తకం గురించి. శైలి పరంగా చెప్పాలంటే, ఇది చాలా passion తో రాయబడిన పుస్తకం. అంతే కాక ఆగకుండా చదివించగలిగేంత ఆకర్షణీయంగా రాయగలిగిన పుస్తకం. చాలాచోట్ల convincing గా కూడా ఉంది. అంటే, ఈ పుస్తకం నా సందేహాలని పటాపంచలు చేసింది అని చెప్పలేను కానీ జీవితంలో నేను చదివిన “ముఖ్యమైన” పుస్తకాల్లో ఇది ఒకటి అని మాత్రం చెప్పగలను. Rational thinking ఉండాలని నమ్మేవారికి ఈ పుస్తకం ఉపకరించవచ్చు – ఆ భావజాలంలో పడి కొట్టుకుపోము అని నమ్మకం కలిగి ఉంటే చాలు. ఇలాంటి ఒక పుస్తకం ఇంత ఆసక్తి కరంగా ఉంటుందని మాత్రం నేను ఊహించలేదు. ఈ పుస్తకం కోసం ఎంత పరిశోధన చేసారో విరివిగా రాసిన నోట్లనూ, చివరి అపెండిక్స్ నూ, ఈ 400+ పేజీల పుస్తకంలో దాదాపు ప్రతి పేజీలోని కంటెంట్ నీ చూస్తే ఇట్టే అర్థమౌతుంది. ఎటొచ్చీ నాకు అర్థం కానిది ఏమిటీ అంటే, ఇది international best seller ఎలా అయిందా అనే. క్రైస్తవ మతం పై ఇంత తీవ్రంగా విరుచుకుపడ్డ పుస్తకాన్ని జనం ఎలా జీర్ణించుకోగలిగారా అని.

నా మటుకైతే ఈ పుస్తకం చాలా నచ్చింది. నన్ను అడిగితే చదవమనే సలహా ఇస్తాను కూడానూ. అయితే, మొత్తం పుస్తకమంతా క్రైస్తవ మతాన్నే కేస్ స్టడీగా తీసుకుంటుంది. హిందూ మతం గానీ, ఇతర మతాల గురించి గానీ ప్రస్తావన చాలా చాలా తక్కువ. అది రచయిత కి ఈ మతాల గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కావొచ్చు. అది వేరే విషయం. చాలా రోజులదాకా – “collapse of atheism”, “bloody history of communism” – వంటి హరూన్ యహ్యా వీడియోలు చూసి చూసి ఉన్న నాకు ఈ పుస్తకం పూర్తి వ్యతిరేక దృక్పథాన్ని చూపింది. ఈ విధంగా నా ఆలోచనా విధానంలో ఒక బ్యాలెన్స్ ని తీసుకురావడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడిందని నా నమ్మకం.

పుస్తకం వివరాలు:
The God Delusion, Richard Dawkins.
ISBN: 9780552774291
Cost: Rs 315
Publishers: Black swan
Purchase at: Amazon.com here
Purchase at Flipkart:

You Might Also Like

8 Comments

  1. Rajendra Prasad Chimata

    ఇప్పుడు ఈ పుస్తకం రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ లో ఫ్రీ గాదొరుకుతుంది

  2. Dr. Rajendra Prasad Chimata

    చాలాbబాగుంది. ప్రపంచం లో చాలా మందికి దేవుడు లేడని తెలుసు. కానీ బయటపడేందుకు ధైర్యం ఉండదు. అలాంటి వాళ్లకు మంచి అవగాహన కల్పించే గొప్ప పుస్తకం l

  3. innaiah narisetti

    The Telugu translation of God Delusion was done by Narisetti Innaiah and published by Alakananda Publishers, Vijayawada, India
    You can read as ebook at:

    http://www.centerforinquiry.net/uploads/attachments/Devudi%20Bramaloa.pdf

    Devudi Bhramalo is the Telugu title

    1. Vinod Reddy

      I am interested in the book Devudu Bhramalo .how to get ebook

  4. పుస్తకం » Blog Archive » జనవరిలో పుస్తకం.నెట్

    […] మాత్రం ఆంగ్ల పుస్తకాల పరిచయాలు (The God Delusion, The Davinci Code, Books Vs Cigarettes, Leaving Microsoft to change the world, Letters of Swami […]

  5. పూర్ణిమ

    That was one thorough review!

    Thanks a ton for introducing it.

  6. chavakiran

    Thanks for this review + Intro of this book

    I added yet another book to my yet to read book stack 🙂

  7. అన్వేషి

    చాలా బావుంది మీ పరిచయం.
    ధన్యవాదాలు

Leave a Reply to Rajendra Prasad Chimata Cancel