20 things I learnt about browsers and the web

గూగుల్ వాళ్ళ మార్కెటింగ్ అంటే నాకు మహా ఇష్టం. తెలివిగా మార్కెటింగ్ చేయడం ఎలాగో వాళ్ళకి తెలుసని నా అభిప్రాయం. ఇటీవలి కాలంలో ఆన్లైనులో విడుదల చేసిన ’20 Things I learnt about Browsers and the web’ అన్న పుస్తకం ఇందుకు ఒక ఉదాహరణ. పైకి ఈ పుస్తకం బ్రౌజర్లు, ఇంటర్నెట్ పనితీరు గురించి ప్రాథమిక అవగాహన కలిగించేదే అయినా, ఒక కోణంలో చూస్తే, గూగుల్ ఓఎస్ కి ప్రాపగండా లా అనిపిస్తుంది. అది అర్థమయ్యాక కూడా, పుస్తకం చదివేందుకు నాకైతే ఏమీ అభ్యంతరం కలుగలేదు. అదంతా తెలిసిన సంగతే అయినా కూడా, ఎవరికన్నా సులభంగా అర్థమయ్యేలా రాసారు కనుక, చదివాను. అందుకే తెలివైన మార్కెటింగ్ అంటున్నది. పుస్తకం వాళ్ళ మార్కెటింగ్ కే రాసినా, జన బాహుళ్యానికి కొంత విజ్ఞానం ఇస్తున్నారు కనుక. సరే, విషయానికొస్తాను.ఈ పుస్తకంలో -వెబ్ ఎలా పనిచేస్తుంది? బ్రౌజర్లు ఏమి చేస్తాయి?వాటిలో గల సౌకర్యాలు ఏమిటి? వెబ్సైట్లు నిర్మించే సాధనాలేమిటి? – ఇటువంటి విషయాల పై, ప్రాథమిక స్థాయిలో అవగాహన కలిగిస్తుంది. ఇది ప్రధానంగా, ఐటీ పరిచయం లేని వారికి, కేవలం మెయిల్స్ పంపుకోవడం, కొన్ని వెబ్సైట్లు చూడ్డానికి తప్ప కంప్యూటరు మరి దేనికీ వాడని నాన్-ఐటీ పీపుల్ కోసం రాయబడ్డది. (అదే, విండోస్ వదిలి అందరూ క్రోం ఓఎస్ వైపుకి మగ్గాలి అన్న మార్కెటింగ్ స్ట్రాటెజీ…అంటారు లెండి కొందరు).

ఇరవై సంగతులు ఇవీ:

1.ఇంటర్నెట్ అంటే ఏమిటి?
2.క్లౌడ్ కంప్యూటింగ్ ఏమిటి?
3.వెబ్ అప్లికేషన్ అంటే ఏమిటి? ఏమిటి వాటి వల్ల ప్రయోజనం? (ఇక్కడ గూగుల్ ఆప్స్ గురించి కాసేపు టముకు టముకు)
4.హెచ్.టీ.ఎం.ఎల్. , జావాస్క్రిప్ట్, సీఎసెస్, ఏజాక్స్ – ఏమిటివన్నీ??
5.కొత్తగా అందరూ మాట్లాడుకుంటున్న హెచ్.టీ.ఎం.ఎల్. 5 అంటే ఏమిటి?
6.బ్రౌజర్లలో 3డీ ప్రయోగాలు ఎలా చేస్తారు?
7.పాత బ్రౌజర్లను ఎందుకు వదలాలి? కొత్త బ్రౌజర్లకి మారాల్సిన అవసరం ఏమిటి? (ఇక్కడ కాసేపు క్రోం గురించి టముకేసారు)
8.ప్లగిన్ లు, వాటి ఉపయోగాలు, ఇబ్బందులు (చిన్న టముకు)
9.బ్రౌజర్లలో వాడే ఎక్స్టెన్షనులు ఎలా చేస్తారు? ఎందుకు ఉపయోగపడతాయి?
10.మన బ్రౌజర్ లోని బుక్మార్కులను, ఇతర సెట్టింగ్స్ ను, ఆన్లైన్ లో నిలువ చేసుకోగల – ‘సింక్రొనైజేషన్’ గురించిన ఒక చిన్న పరిచయం (క్రోం‌టముకు మళ్ళీ వచ్చేసిందండోయ్!)
11.’కుకీ’ ల గురించి చిన్న పరిచయం. క్రోం కుకీ నిర్వహణ విధానం ప్రత్యేకత గురించి కొంచెం వివరణ.
12.బ్రౌజర్లలో వ్యక్తిగత సమాచారం కాపాడుకోవడం గురించి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా వాడాలి? అన్న దాని గురించి ఒక చిన్న పరిచయం, క్రోం ని ఉదాహరణగా తీసుకుని..
13.మన సమాచారాన్ని బ్రౌజర్ల ద్వారా దొంగిలించే – మాల్వేర్ ప్రోగ్రాములు, ఫిషింగ్ దాడుల గురించి పరిచయం .
14.ఈ విధమైన దాడులను బ్రౌజర్లు ఎలా ఎదుర్కొంటాయి? (క్రోం లోని ఫీచర్ల ఉదాహరణతో)
15.వెబ్సైట్ లంకెల గురించి ఒక చిన్న పరిచయం. అలాగే, లంకె నిజమైనదా, మాల్వేర్ ప్రోగ్రాములదా, కనుక్కోవడానికి ఒక ప్రాథమిక స్థాయి చిట్కాతో.
16.మనం టైప్ చేసే లంకె పేరుకీ, దాని తాలూకా వెబ్సైటు మన బ్రౌజర్లో కనబడ్డానికి మధ్య జరిగే కథ ఏమిటి?
17.ఏ వెబ్సైటు నిజమైనది? అన్నది నిర్థారించే ‘Validation Certificate’ ఎలా పొందుతుంది? దాన్ని మనం ఎలా గుర్తించవచ్చు?
18. కొత్త తరం వెబ్ బ్రౌజర్ల సాంకేతికత గురించి, మన అవసరాలకి అవి వేగంగా ఎలా స్పందిస్తున్నాయో చెబుతూ, ఒక చిన్న పరిచయం. క్రోం లో గల ‘DNS Pre-resolution’ గురించి కాసేపు…
19. బ్రౌజర్లలో ఓపెన్-సోర్స్ ఉపయోగాల గురించి
20. ఇంతసేపూ చెప్పిన సంగతుల సింహావలోకనం.

ఈ పుస్తకాన్ని తయారు చేసినవారు:
Illustration: Christoph Niemann
Writers/Editors: Min Li Chan, Fritz Holznagel, Michael Krantz
Project Curator: Min Li Chan with the Google Chrome Team
Design: Fi, Paul Truong
Development: Fi

పుస్తకం వెబ్సైటు ఇదీ: http://www.20thingsilearned.com/
నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిన బ్లాగు టపా, గూగుల్ బ్లాగులో ఇక్కడ చదవండి.

మొత్తానికి, పుస్తకం అయితే, హిడెన్ అజెండా ఏమున్నా కూడా, చదూకోడానికి సులభంగా అర్థమయ్యేలా ఉంది. బిగినర్లకి బాగా పనికొస్తుంది. బొమ్మలూ, గ్రాఫిక్ ఎఫెక్టులూ బాగున్నాయి. ఇవి రాబోయే తరం ఈబుక్కులు కాబోలు!

You Might Also Like

Leave a Reply