ధ్వన్యాలోకము – అంటే?

కొంతకాలంగా గూగుల్ బజ్జులో ధ్వన్యాలోకం గురించి రెండుమూడు ప్రస్తావనలు, అలంకారశాస్త్రానికి సంబంధించి కొన్ని చిన్నచిన్న శబ్దచర్చలు జరిగాయి.   అలంకారశాస్త్రం (లక్షణశాస్త్రం) గురించి క్లుప్తంగా చెప్పమని సౌమ్య గారు అడిగారు. నేను సంస్కృత విద్యార్థిని మాత్రమే. అందునా ఇటువంటి విషయాలలో తప్పులు వ్రాయడం మంచిదికాదు. అంచేత (అయినా) చాలా క్లుప్తంగా ఒకట్రెండు విషయాలతో ఈ వ్యాసం వ్రాయటానికి సాహసిస్తున్నాను. ముఖ్యంగా ’ధ్వన్యాలోకం’ గురించి.

భారతదేశ అలంకారశాస్త్రం దాదాపు వేదకాలమంత ప్రాచీనమైనది. అగ్నిపురాణంలోనూ ఈ అలంకారశాస్త్రవిషయాలు ఉన్నాయిట. వాక్కు ఎలా పుడుతుంది, దానికి సంబంధించిన అనేకానేక వ్యాపారాలను వ్యాకరణం చెబుతుంది. అలంకార శాస్త్రం – శబ్దం యొక్క వృత్తులు, శబ్దం కావ్యంలో ఎలా ప్రయోగించబడుతుంది? కావ్యం అంటే ఏమిటి? కావ్యప్రయోజనం, కావ్యలక్షణాలు, కావ్యభేదాలు, అలంకారాలు, రసం, నవరసాలు.. ఇలా అనేకమైన కావ్య సంబంధ విషయాలను గురించి కూలంకషంగా వివరించి, నియమాలను నిబద్ధం చేసే శాస్త్రం.

భరతుడి నాట్యశాస్త్రం అలంకారశాస్త్రానికి దాదాపుగా మొదటిది. అలంకారశాస్త్రంలో వందకు పైన గ్రంథాలు పండితులు వ్రాసి ఉన్నారు. ఈ శాస్త్రాన్ని మథించిన వారిలో కాశ్మీరవాసులు ముఖ్యులు.

భరతుడు, కుంతకుడు, భామహుడు, వామనుడు, దండి, ఆనందవర్ధనుడు, మమ్మటుడు, అభినవగుప్తుడు, ధనంజయుడు, విద్యానాథుడు, జగన్నాథుడు వంటి పండితులు అలంకారశాస్త్రాన్ని విశదీకరిస్తూ, విపులంగా గ్రంథాలు వ్రాశారు.

************************************************************

’ధ్వన్యాలోకము’ – ఆలోకము అంటే ప్రకాశము లేదా కాంతి (ఆలోకౌ దర్శనోద్ద్యోతౌ – అమరం). ధ్వన్యాలోకము అంటే – ధ్వని అనబడే కాంతి. ధ్వని అంటే మనం ఊహించే sound కాదు. ’ధ్వని’ గురించి తెలియాలంటే శబ్దార్థాలను గురించి క్లుప్తంగానైనా తెలియాలి.

వాక్కు – పరా, పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలు. ఈ వాక్కు ఎలా పుడుతుంది అని వ్యాకరణం చెబుతుంది. ఈ వాక్కు వెలువడిన తర్వాత అది ’శబ్దం’గా పరిగణిస్తాం. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా ఒక అర్థం. (కొన్ని శబ్దాలకు నానార్థాలు ఉంటాయి, కానీ అందులో ఒక్కొక్కదానిని నిర్దుష్టంగానే స్వీకరించాలి). అలా
నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని ’వాచకం’లేదా ’అభిద’ అంటారు. ఆ శబ్దం తాలూకు అర్థాన్ని ’వాచ్యం’ అంటారు. ఉదాహరణకు గోవు అనే శబ్దానికి ఓ నిర్దుష్టమైన అర్థం ఉన్నది. ఇది జాతిని సూచిస్తుంది. (బౌద్ధులు శబ్దానికి నిర్దుష్టమైన అర్థం ఉందని ఒప్పుకోరు. అదొక పెద్ద వ్యవహారం, ఇక్కడ చర్చించట్లేదు.)

ఇలా ఒక్కో శబ్దానికి (లేదా ఆ శబ్దం తాలూకు ప్రయోగానికి) ఒకే అర్థం ఉంటుందా? లేక ఇంకా ఏమైనానా? తెలుసుకుందాం. మీ దగ్గరకు ఓ నార్తిండియా అతను వచ్చాడు. అతడు ’అమరావతి’ అనే ఊరిని చూడాలనుకుంటున్నాడు. అతడితో మీ చర్చ ఇలా జరిగింది.

అతడు: బుద్ధస్థూపం ఉన్న అమరావతి ఎక్కడుంది?
మీరు: ఆంధ్రా, గుంటూరు జిల్లాలో
అతడు: మహారాష్ట్ర, గోదావరి ఒడ్డున అని విన్నాను?
మీరు: ఆ అమరావతి వేరే. ఇది ’కృష్ణ తాలూకు అమరావతి’.

’కృష్ణ తాలూకు అమరావతి’ – కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి అని మీ ఉద్దేశ్యం. ఇక్కడ ’కృష్ణ తాలూకు అమరావతి’ అనే మాటకు యథాతథంగా అర్థం లేదు. అమరావతి అన్న శబ్దం గురించి చెప్పాలంటే  దాని ’లక్షణం’ చెప్పాలి. ఆ లక్షణంతోనే ఆ శబ్దానికి ఓ అర్థం వస్తుంది. ఇలాంటి శబ్దాన్ని లక్షణం, దాని అర్థాన్ని లక్ష్యం అంటారు. ఇక్కడ మరోమాట. శబ్దం అంటే ఒకేపదం కదా, కృష్ణ తాలూకు అమరావతి అనే లక్షణ శబ్దంలో రెండు పదాలు ఉన్నాయేంటి అని ఓ డవుటు? దీని గురించి చేంతాడంత వివరణ వ్రాశారు మన పండితులు. శబ్దానికి అర్థం అభిద ద్వారానే వస్తుంది. అయితే ఈ అభిద మరో పదంతో కలిసినప్పుడు ఒక్కో సందర్భంలో అర్థం మారిపోతుంది. ఆ సందర్భాలు –  ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు,  ముఖ్యార్థంతో సంబంధం ఉన్నప్పుడు, స్వతంత్ర ప్రయోజనమొక్కటి ఉన్నప్పుడు, రూఢిగా ఆ ఆ శబ్దం జనసామాన్యంలో పాతుకుపోయినప్పుడు. ఈ సందర్భాలలో అన్యార్థం శబ్దం మీద ఆరోపితమవుతుంది.

– ఇదుగోనండి ఇలా శబ్దవృత్తులు అభిద, లక్షణాలని తీర్మానించారు. చాలాకాలం ఈ విధంగానే అనుకుంటూ ఉన్నారు, ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనుడు మూడో రకమైన శబ్దం ఉందని లేవనెత్తేదాకా! ఆ మూడవ శబ్దమే ’ధ్వని’. ఓ ఉదాహరణతో ధ్వని గురించి చూద్దాం.

కానీ అంతకుముందు రెండు చిన్న విషయాలు. ఇందాక వాచకం ఉదాహరణలో ’గోవు ’అన్నాం. ’శరచ్చంద్రకౌముదీరుచిరధవళసుందరగోవు’- ఇలా ఉపమాలంకారాలు తగిలించామనుకోండి. శబ్దవృత్తి వేరు కాదు. అది ’అలంకారమే’అవుతుంది తప్ప స్వతంత్రప్రతిపత్తిని సంతరించుకొనజాలదు.

ధ్వని – కొక ఉదాహరణ.

“భమ ధమ్మిఅ వీసత్థో సో సుణఓ అజ్జ మారిఓ దేణ
గోలాణఇకచ్చకుడఙ్గవాసిణా దరిఅసీహేణ”
– గాథాసప్తశతి.

ఒక బ్రాహ్మణుడు గోదావరి ఒడ్డున పూలుకోసుకోడానికి వచ్చాడు. అక్కడ పూపొదలు చాలా ఉన్నాయి. అక్కడ ఓ స్వైరిణి వచ్చింది. ఆమె ఒకతనితో వ్యభిచరించడానికి ఈ ప్రదేశం ఎన్నుకుంది. ఈ బ్రాహ్మణుని వల్ల ఆమెకు ఇబ్బంది. అందుకని అతనితో అంటూంది, “అయ్యా! బాగా పూలుకోసుకో. ఇక్కడ ప్రతిరోజు అందరిమీద పడి మొరుగుతుండే కుక్క కూడా లేదు. ఈ మధ్యనే సింహం వచ్చి కుక్కను తినేసిందట”.

ఆమె మాటలకు బయటకు కనిపించే అర్థం (వేరే చెప్పాలా? :)) – అయ్యా, తొందరగా వెళ్ళు, ఓ సింహం ఈ ప్రాంతాలలో తిరుగుతూంది అని.

తన మనసులో ఉన్న ఊహ – సింహం భయంతో ఇతణ్ణి తరిమేస్తే, నా పని నేను సావకాశంగా చూసుకోవచ్చు కదా – అని.

ఇలా ప్రత్యక్షంగా కనిపించే శబ్దార్థము ద్వారా పరోక్షమైన శబ్దార్థమును సూచించడాన్ని (వ్యంగ్యాన్ని) ఆనందవర్ధనుడు – ధ్వని అన్నాడు. ఈ ధ్వనియే కావ్యం యొక్క ఆత్మ అని ఆనందవర్ధనుడు నిర్ధారించాడు. ఈ భావన కొత్తది కాకపోయినా, ధ్వని ఖచ్చితంగా శబ్దవృత్తి మాత్రమేనని స్థిరీకరించి ప్రతిపాదన చేసినవాడు ఆనందవర్ధనుడు. ఈ ’ధ్వని’ మతంతో విభేదించినవారు కూడా ఉన్నారు.

ఇక్కడ మరో అనుమానం – ధ్వని అనేది శబ్దవృత్తి అన్నాడు, మరి పూర్తి శ్లోకం చదివిన తర్వాతనే ఈ వ్యంగ్యం తెలుస్తూంది, ఇది ఎలా ’శబ్ద’వృత్తి అవుతుంది? వాక్యం అనేది అందులోని శబ్దాల అన్వయం వల్ల వచ్చే అర్థమా? లేక శబ్దాలు ఒక వాక్యంలో ప్రయోగించబడినప్పుడు ఆ వాక్యంలో ప్రయోగింపబడిన శబ్దార్థాలకు సంబంధం లేకుండా ’ఏదో’ అర్థం ఊడిపడుతుందా? ఈ రకమైన వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఆయా శాస్త్రాలను నేర్చుకునే జిజ్జ్ఞాసువులకు సంబంధించిన అంశాలు.

ధ్వని అంటే అర్థం కావడానికి ఆనందవర్ధనుడు ఓ శ్లోకం ఉటంకిస్తాడు.

ప్రతీయమానం పునరస్యదేవ వస్త్వస్తి వాణీషు మహాకవీనామ్
యత్తత్ ప్రసిద్ధవయవాతిరిక్తం విభాతి లావణ్యమివాంగనాసు ||

అవయవసౌష్టవంతో శోభిల్లే అందంకన్నాభిన్నమైన లావణ్యం అంగనలలో ఎలా ప్రకాశిస్తుందో, అలా మహాకవుల వాక్కులలో ఒకానొక వాచ్యాతిరిక్తమైన వ్యంగ్యమైన వస్తువు ఉన్నది.

ధ్వన్యాలోకం – అంటే ధ్వని అనే కాంతి అని చెప్పుకున్నాం కదా. ఈ గ్రంథానికి అభినవగుప్తుడు అనే కవి వ్యాఖ్యానం వ్రాశాడు. ఈ వ్యాఖ్యానం పేరు – లోచనం. (ప్రకాశాన్ని చూడడానికి కన్ను కావాలి కదా, అందుకని ఆ పేరు). ’అతనికంటే ఘనుడు అచంటమల్లన్న’ అన్నట్టు ఈ అభినవగుప్తుడు ఆనందవర్ధనునికంటే
రెండాకులు ఎక్కువ చదివాడు. ఈయన తనవైన ఆలోచనలను ఆనందవర్ధనుడు చెప్పినట్టు చెప్పి ఒప్పింపజేశాడని ఒక వాదం ఉంది.

ధ్వన్యాలోకం – అలంకారశాస్త్రప్రస్థానంలో ఓ మైలురాయి. ధ్వన్యాలోకం తర్వాత ధ్వని సిద్ధాంతాన్ని మమ్మటుడు, విద్యానాథుడు వంటి కవులు అనుసరించారు. ’ధ్వని’ యే కావ్యం యొక్క ఆత్మ. ఈ ధ్వని అనబడే శబ్దాన్ని వ్యంజకం అని, ఆ శబ్దం తాలూకు అర్థాన్ని ’వ్యంగ్యం’ అని మమ్మటుడు (కావ్యప్రకాశం), విద్యానాథుడు (ప్రతాపరుద్రీయం) పేర్కొన్నారు. (శబ్దార్థౌ మూర్తిరాఖ్యాతౌ జీవితం వ్యంగ్య వైభవమ్ – విద్యానాథుడు) ’ధ్వని’ ప్రస్ఫుటంగా కనిపించే కావ్యం ఉత్తమ కావ్యమని, ధ్వని మధ్యమంగా ఉంటే అది గుణీభూతవ్యంగ్యం (ఇది 8 విధాలు), ఆ కావ్యాన్ని మధ్యమ కావ్యమని, ధ్వని అధమంగా ఉంటే అది చిత్ర, శ్రవ్య కావ్యమని అది అధమమని మమ్మటుడు పేర్కొన్నాడు. ఇక్కడ ఓ విషయం మనసులో పెట్టుకోవాలి. ఈ ఉత్తమ, మధ్యమ, అధమ శబ్దాలు ధ్వనికి సంబంధించిన ప్రమాణాలు మాత్రమేనని గ్రహించాలి. ధ్వనికి సంబంధించిన ప్రమాణంతో కవుల స్థాయిని నిర్ణయించటం అర్థరహితమని పండితుల సూచన. పైగా ధ్వనియే కావ్యాత్మ అన్నది ఒక ప్రతిపాదన మాత్రమే. ఇదివరకే చెప్పినట్టు ఈ ప్రతిపాదనను తిరస్కరించిన అలంకారికులు కూడా ఉన్నారు.

అలంకారశాస్త్రం గురించి తెలుసుకోవాలనుకునే వారు, ఇటువంటి ప్రౌఢవాదాలను నిరూపించే పుస్తకాలతో కాక, స్థూలంగా ’రస’, ’వస్తు’, ’గుణ’, ’అలంకార’ – ఇత్యాది వాదాలను, వాటి గురించిన మౌలికమైన అంశాలను విశదీకరించే పుస్తకాలను, లేదా అలంకార శాస్త్ర కవులను పరిచయం చేసే పుస్తకాలతో మొదలుపెట్టటం మంచిది. కావ్యప్రకాశం, అలంకారశాస్త్రచరిత్ర మొదలైన పుస్తకాలు ఇందుకు ఉపకరించగలవు.

ధ్వన్యాలోకం ప్రౌఢం – అయినప్పటికీ పుస్తకంలో ఈ పరిచయం సాగింది కాబట్టి, స్వామికార్యంలో భాగంగా (:)) ఈ పుస్తకం వివరాలు. ధ్వన్యాలోకం, లోచన వ్యాఖ్య సహితం – ఈ పుస్తకం తెనుగు చేసిన వారు మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఈయన తెలుగు వ్యాఖ్యకు ’బాలనందిని’ అని నామకరణం చేశారు. ధ్వన్యాలోకంకన్నా, లోచన వ్యాఖ్యానమే ప్రౌఢంగా ఉంటుంది. ఈ శాస్త్రంలో ఆరంభస్థాయిలో వారికి లోచనం దాదాపు అర్థం కాదు.

ఈ పుస్తకం జయలక్ష్మి పబ్లికేషన్స్ హైదరాబాదు వారి ప్రచురణ. ఠాగూర్ పబ్లిషింగు హవుస్, కాచిగూడ వైశ్యహాస్టల్ వారి వద్ద కాపీలు ప్రాపించవచ్చు. ఖరీదు 350/-.

You Might Also Like

10 Comments

  1. Saroja

    శబ్దం నుంచి అక్షరం ఎలా ఏర్పడింది.

  2. evl. pranamayi

    నమస్కారం అండి నా పేరు ప్రాణమయి. ఇలాగే కావ్యప్రకాశ కూడా నోట్స్ లాగా తయారు చేయడం చెప్పండి దయచేసి . నేను ఏం ఏ సాస్క్రిట్ పొట్టి శ్రీ రాములు యూనివర్సిటీ లో 2 ఇయర్ చేస్తున్నాను మా సబ్….చెప్పేవారు లేక కష్టం అనిపిస్తుంది మేడం గారు

  3. సుధ

    నిర్దిష్టము అనడానికి బదులు నిర్దుష్టము అని అన్నిసార్లు వచ్చినప్పుడు, వ్యాఖ్యల్లోదాన్ని ఎత్తి చూపినప్పుడు సవరించడానికి పుస్తకం. డాట్ కాం వారికి అవకాశం లేదా….వద్దనుకున్నారా…కావాలంటే అలా ఎత్తి చూపిన వ్యాఖ్యను తీసేయండి, కానీ వ్యాసంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ పదాన్ని సరిచేయండి.

    1. సౌమ్య

      సుధ గారికి: మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మాకు కొంత సమయం చిక్కినపుడు అర్థాలు మరొకసారి నిఘంటువులో సరిచూసి వ్యాసాన్ని ఎడిట్ చేయగలము.

    2. sarma

      నిర్దుష్టము,=దోషములు లేనిది, లోపములు లేనిది, స్వచ్ఛమైనది.( వితౌట్ అన్ ఎర్రర్)

      నిర్దిష్టము=నిర్దేశింపఁబడినది.( స్పెసిఫైడ్)

      నిర్దుష్టము, నిర్దిష్టము వేరు వేరు పదాలు వాటి అర్ధాలివీ.

  4. Sinivas

    “నిర్దిష్టమైన” బదులు “నిర్దుష్టమైన ” వాడటం పొరపాటేనా?

    1. kameswari yaddanapudi

      నిర్దుష్టం-అనగా తప్పులేకుండా,
      నిర్దిష్టం-అంగా ప్రత్యెకించి ఒకవిషయం specific

  5. రవి

    హనుమంతరావు గారు, మాలతి గారు: ధన్యవాదాలు.

  6. malathi

    అమ్మో, అద్భుతమయిన పొత్తం తీసుకుని ఎంత చక్కగా వివరించారండీ. వేటితో మొదలు పెట్టాలో కూడా చెప్పడం చాలా బాగుంది. అభినందనలు. – మాలతి

  7. కర్లపాలెం హనుమంత రావు

    చాలా గంభీరమయిన విషయాన్ని చక్కటి తేట తెలుగులో వివరించారు రవి గారు …ధన్యవాదాలు !

Leave a Reply