పుస్తకం
All about booksపుస్తకభాష

November 19, 2010

హిందూమతం, సనాతన ధర్మం – శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

More articles by »
Written by: రవి
Tags:

“ఒక దేశం స్వరూపస్వభావాలను వర్ణించి చెప్పడానికి ఉదాహరణలుగా తీసుకొనవలసింది అక్కడ ఉన్న మురికివాడలను, వాటి ఉత్పత్తులనూ కాదు. ఈ లోకంలో ఎవడైనా ఒక ఏపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి కుళ్ళిపోయిన, పురుగులతో పుచ్చిన ఏపిల్ పళ్ళు ఏరికోరి తెచ్చి ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క పుస్తకం వ్రాయవచ్చు. ఇంతవ్రాసినా ఆ చెట్టుయొక్క యథార్థ స్వరూపస్వభావాలు కానీ, గొప్పతనం కానీ వానికి కొంచమైనా అర్థం అయినట్లు కాదు. దేశాన్ని అంచనా వేయాలంటే దానిలో ఉన్న ఉదాత్తమైన అంశాలను పరిశీలించటమే సరైన మార్గం.” – స్వామి వివేకానంద

హిందూమతం అని పిలువబడుతున్న ఒక సనాతనమైన ధర్మం, ఆ ధర్మం లోని ఉదాత్తత, విశిష్టత, విశేషాలు, అలాగే ఇతరమతాల ప్రాదుర్భావం, వాటి భిన్నత్వం, సారూప్యతా – ఇలాంటి విషయాలను సంగ్రహంగా, ఆయా శాస్త్రాలను ఉటంకిస్తూ వ్రాసిన అద్భుతమైన పుస్తకం ఇది.

విస్తారమైన వేదవాఙ్మయంతో మొదలుపెట్టి జగత్తు సృష్టి, వర్ణవ్యవస్థ, అస్పృశ్యత, కారణాలు, ఆశ్రమధర్మాలు, వివాహాది కర్మకాండ, షోడశసంస్కారాలు, ఆస్తిక, నాస్తిక దర్శనాలు, షడంగాలు, వైష్ణవ, శాక్త, స్మార్త ఇత్యాది సంప్రదాయాలు, వీటన్నిటి గురించి గంభీరంగానూ, శాస్త్రబద్ధంగానూ, అనేకానేక ఉదాహరణల ద్వారానూ రచయిత వివరించారు.

ఆ తరువాత అధ్యాయాలలో బౌద్ధ, జైన, క్రైస్తవ, జొరాష్ట్ర, సిక్కు, మహమ్మదీయ ఇత్యాది మతాల గురించి కూడా ఒకొక్క అధ్యాయంలో చెప్పారు.బౌద్ధం గురించిన అధ్యాయంలో – బౌద్ధం మౌలికంగా బోధించే విషయాలేమిటి? ఏ విషయాలలో హిందూమతంతో బౌద్ధం విభేదిస్తుంది? ఆ విభేదం మౌలికమేనా? హిందూమతంలో బౌద్ధంకన్నా ముందే ఉన్న సాంఖ్య, న్యాయవైశేషిక దర్శనాలు కూడా నాస్తికదర్శనాలు అయినప్పుడు బౌద్దానికి మాత్రమే నాస్తికమతం అన్న పేరు ఎలా వచ్చింది? ఈ విషయాలను మౌలిక స్థాయిలో రచయిత చర్చించారు.

ఇదేదో మతగ్రంథం, చాదస్తపు గోల అని ముందుగానే నిర్ణయించేసుకునే వారికి చెప్పేదేం లేదు. అయితే ఈ పుస్తకంలో హిందూమతభిన్నమైన విషయాల గురించిన విస్తృతికి కొదువ లేదు. అస్పృశ్యత గురించిన అధ్యాయంలో – ఇతర దేశాలలో నెలకొని ఉన్న అస్పృస్యత, వాటి స్వరూపస్వభావాలను గురించి వివరించారు. క్రైస్తవ మతాధికారులు మధ్యయుగంలో సాగించిన దారుణకృత్యాలు, మారణకాండ ఇవన్నీ కూడా విపులంగా చెప్పారు రచయిత.

అలానే ఈ కాలం వారికి ఆనాటి ఒక ధర్మం – ఉదాహరణకు – “న స్త్రీ స్వాతంత్రమర్హతి” అన్న మాట ఏదో పెద్ద అశనిపాతంలా ఎందుకు వినబడుతుంది? మనుధర్మశాస్త్రంలో ఆ శ్లోకం పూర్తి అర్థమేమిటి? ఏ సందర్భంలో ఆ మాటను సమన్వయించుకోవాలి? హిందూ ధర్మంలో స్త్రీకి ఇచ్చిన స్థానం, గౌరవం ఎటువంటివి? ఈ విషయాలు రచయిత విపులంగా వివరించారు.

ఈ పుస్తకంలోని ముందుమాట ఇదివరకు ఋషిపీఠం వారు ప్రచురించిన ప్రత్యేకసంచికలో వచ్చింది.

మహామహోపాధ్యాయ శ్రీపుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి పరిచయం చేయటమంటే సూర్యునికి దివిటీ చూపించిన చందమే. విస్తారమైన సంస్కృత వాఙ్మయాన్ని తెలుగువారికి అందుబాటు గావించిన వారిలో ఈయన అగ్రగణ్యులు. సంస్కృతప్రచార సమితి అధ్యక్షులూనూ. వీరి గురించిన వివరాలు ఇక్కడ.

హిందూధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారికి, జిజ్ఞాసువులకు, భారతదేశ ఔన్నత్యం పట్ల విశ్వాసం, అభిమానం,ఆసక్తి ఉన్నవారికి కరదీపిక ఈ పుస్తకం. జయలక్ష్మి పబ్లికేషన్స్ వారి ప్రచురణ. ఠాగూర్ పబ్లికేషన్స్ వారి వద్ద దొరుకుతుంది. పుస్తకం ముద్రణ ముచ్చటగొలిపేలా, హాయిగా, మెచ్చుకోదగ్గదిగా ఉంది. ముద్రారాక్షసాలు లేవు. పుస్తకం వెల 125/- లేదా $5.About the Author(s)

రవి2 Comments


  1. C. Narayana Rao

    Helpful review. Thanks.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
ధ్వన్యాలోకము – అంటే?

ధ్వన్యాలోకము – అంటే?

కొంతకాలంగా గూగుల్ బజ్జులో ధ్వన్యాలోకం గురించి రెండుమూడు ప్రస్తావనలు, అలంకారశాస్త్...
by రవి
9

 
 

భాసకవి కృత ప్రతిమానాటకం!

యస్యాశ్చోరశ్చికురనికురః కర్ణపూరో మయూరః భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః | హర్...
by రవి
16