కొత్తజీవితపు ఇతివృత్తాలు : ముదిగంటి సుజాతారెడ్డి కథలు

రాసిన వారు: ఎన్.వేణుగోపాల్
*****************
[ఇటీవల విడుదలైన ముదిగంటి సుజాతారెడ్డి గారి కథల సంకలనానికి వేణుగోపాల్ గారు రాసిన ముందుమాట ఇది. పుస్తకం.నెట్ లో దీన్ని ప్రచురించడానికి అందించిన వేనుగోపాల్ గారికి ధన్యవాదాలు. – పుస్తకం.నెట్]

ముదిగంటి సుజాతారెడ్డి గారు తెలంగాణ మాగాణంలో వికసించిన విదుషీమణి. కథ, నవల వంటి సృజనాత్మక ప్రక్రియలలో, సాహిత్యవిమర్శలో, సాహిత్య చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఇప్పటికే అనేక రచనలు చేసి ఆమె సుప్రసిద్ధులయారు. ఆమె ఆత్మకథ తెలంగాణ మధ్యతరగతి రైతుకుటుంబాల జీవనపరిణామాన్ని హృద్యంగా చిత్రించింది. ఇప్పుడు ఆమె కొత్త కథల సంపుటం ‘మరో మార్క్స్ పుట్టాలె!’ కు ఈ నాలుగు మాటల అవసరమేమీ లేదు. కాని ఆమె ఆదేశాన్ని కాదనలేక ఇలా కథలకూ మీకూ మధ్య నిలబడ్డాను. మీరెట్లాగూ ఈ కథలను చదువుతారు. ఆ కథల ఇతివృత్తాల విశిష్టతను గుర్తిస్తారు, కథలలో చిత్రణ పొందిన మానవసంబంధాల ఆర్ద్రతను గమనిస్తారు. ఈ కథల ద్వారా ఆమె ఇవ్వదలచుకున్న సందేశాన్ని గ్రహిస్తారు. అన్నిటికన్న మిన్నగా తెలంగాణ నుడికారంలోని సౌందర్యాన్ని అనుభూతి చెందుతారు. కనుక ఆ విషయాలలోకి పెద్దగా వెళ్లకుండా, ఈ కథల నేపథ్యం గురించి మాత్రం కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాను.

మొట్టమొదట గుర్తించవలసినది ఈ కథల్లో అత్యధికభాగం కొత్తజీవిత పార్శ్వాలను చిత్రించిన, విశదీకరించిన, విశ్లేషించిన కథలు. ఈ పద్నాలుగు కథల్లో పది కథల ఇతివృత్తాలు పూర్తిగా కొత్తవి, కనీసం ఇరవై ఏళ్ల కింద ఉండడానికి అవకాశం లేనివి. ఈ ఇతివృత్తాలు తెలుగు సమాజంలోకి కొత్తగా ప్రవేశించిన జీవనరంగాలకు, వృత్తులకు, వాటివల్ల మానవసంబంధాలలో వచ్చిన మార్పులకు సంబంధించినవి. మూడు నాలుగు కథలలో వస్తువు స్త్రీల సమస్యలకు సంబంధించినది గాని అవి కూడ పాతకథలు కావు. ఆ కథలలో చిత్రణ పొందిన స్త్రీల సమస్యలు గతకాలపు స్త్రీల సమస్యల లాంటివి కావు. అవి ఇటీవలి సామాజిక మార్పులతో ప్రభావితమైన స్త్రీలసమస్యల గురించిన కథలు. బహుశా పాతపద్ధతిలో నడిచిన కథ ఒకేఒకటి, రాజకీయ లబ్ధికోసం కన్నకొడుకును కూడ బలిపెట్టే దుర్మార్గం గురించినది. కాని అక్కడ కూడ రాజకీయ వ్యాపారం మానవసంబంధాలను ఎట్లా ధ్వంసం చేస్తున్నదో కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికే రచయిత్రి ప్రయత్నించారు.

ఈ కథలలోని మనుషులు ఒక కొత్త జీవనశకలానికి ప్రతినిధులు. ఆ జీవనశకలం మన సమాజంలో నూతన ఆర్థిక విధానాలతో పుట్టుకొచ్చిన కొత్త మధ్య తరగతి. సాఫ్ట్ వేర్, మేనేజిమెంట్ ఉద్యోగాలు, అమెరికాకూ ఇతర దేశాలకూ పెద్ద ఎత్తున వలసలు, రియల్ ఎస్టేట్ రంగానికి అదివరకెన్నడూ లేనంత ప్రాధాన్యత, జీవితంలో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడం ఈ కొత్త మధ్య తరగతి అనుభవిస్తున్న పరిణామాలు. ఈ పరిణామాలన్నిటికీ మూలం సాఫ్ట్ వేర్ రంగంలో, కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నదని కూడ అనుకోవచ్చు.

ప్రపంచీకరణకూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకూ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. సరిగ్గా ప్రపంచీకరణ క్రమం ప్రారంభమయినప్పుడే ఆ సాంకేతిక పరిజ్ఞానాల ప్రాధాన్యతా పెరిగింది, ఆ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచీకరణ విస్తరణా సులభమయింది. అందులో భాగంగా తామరతంపరగా పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజిమెంట్ కాలేజీలలో చదివి, అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించడం ఈ కొత్త మధ్యతరగతి యువతరానికి లక్ష్యంగా మారింది. అమెరికా కాకపోతే యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలయినా సరే. పది పన్నెండు కాలేజీలు ఉన్నప్పుడు ఆ చదువు చదవడానికీ, ఆరువందలకు పైగా కాలేజీలు ఉన్నపుడు ఆ చదువు చదవడానికీ తేడా ఉంది. ఇప్పుడు ఆ చదువు చదవడం సులభం. ఆ చదువు చూపి డాలర్లు సంపాదించడం సులభం. ఒక డాలర్ కు భారత రూపాయల్లో లెక్కవేసినపుడు నలభై రెట్లో, యాభై రెట్లో విలువ ఉండడం అసలు ఆకర్షణ.

ఈ పరిణామాన్ని మరొక మాటల్లో చెప్పాలంటే, మొత్తంగా సమాజంలోకీ, మానవజీవితంలోకీ తక్కువ శ్రమతో, సులభంగా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగల ఒక కొత్త వర్గం ప్రవేశించింది. అలాగే శ్రమకూ, ఆ శ్రమ చేసే మనిషికీ విలువ తగ్గడం ఒకవైపూ, డబ్బుకూ, డబ్బు తెచ్చే విలాసాలకూ, డబ్బు కూడబెట్టడానికీ విలువ పెరగడం మరొకవైపూ ఉండే కొత్త విలువల చట్రం కూడ ప్రవేశించింది. మన దేశపు మధ్యతరగతిలో బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమ కాలం నుంచీ అప్పటిదాకా కొనసాగుతుండిన విలువల చట్రం మారిపోవడం ప్రారంభమయింది. త్యాగం స్థానాన్ని స్వార్థం, సమాజ శ్రేయస్సు స్థానాన్ని వ్యక్తిగత ప్రయోజనం, నిరాడంబరత్వం స్థానాన్ని బహిరంగ ప్రదర్శన ఆక్రమించాయి. పొదుపు స్థానాన్ని విచ్చలవిడి ఖర్చు, భోగలాలస ఆక్రమించాయి. అవసరమైన వస్తువులు కొనడానికైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించే మానసిక స్థితి తరిగిపోయి, అవసరం ఉన్నా లేకపోయినా సరుకులు కొనడం ప్రవేశించింది. నిజానికి మనుషులు తమ ఉపయోగం కోసం సరుకులు కొనడం తగ్గిపోయి, సరుకులు తమ మారకం కోసం మనుషులచేత కొనిపించుకోవడం ప్రారంభించాయి. మార్కెటేతర, సహజ మానవసంబంధాలను తోసిరాజని మార్కెట్ సంబంధాలు విస్తరించాయి. ‘సరుకుల ఆరాధన’ అని మార్క్స్ చేసిన సూత్రీకరణ నిజానికి ఆయన అది ప్రతిపాదించిన 1860లలో ఎంత నిజమో గాని, ప్రపంచీకరణ దశలో ఇవాళ అక్షర సత్యంగా మారిపోయింది.

సమాజంలో, మార్కెట్ లో ఈ మార్పులు జరుగుతున్నాయంటే అవి కేవలం సరుకుల్లోనో, అమ్మకాలలోనో, కొనుగోళ్లలోనో మాత్రమే జరగడంలేదు. మనుషుల్లో జరుగుతున్నాయన్నమాట, మనసుల్లో జరుగుతున్నాయన్నమాట. మానవసంబంధాల్లో జరుగుతున్నాయన్నమాట. మనుషులు రక్తమాంసాల, ఉద్వేగాల, మానవసంబంధాల మనుషులుగా ఉండగూడదని, కేవలం కొనుగోలుదార్లుగా, అమ్మకందార్లుగా మాత్రమే ఉండాలని మార్కెట్ కోరుకుంటుంది, శాసిస్తుంది, మారుస్తుంది. మారనివాళ్లను తొక్కేయడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్ మౌలికంగా మానవతకు, సంఘజీవితం అనే మానవసారానికి వ్యతిరేకమయినది.

మరి మానవసంబంధాలలో ఇంత లోతయిన మార్పులు వస్తున్నప్పుడు, మానవసంబంధాల పునాదిమీదనే నిర్మాణమయ్యే కాల్పనిక సాహిత్యం ఆ మార్పులను పట్టుకోకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఆ సంబంధాల మార్పుల పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది, ఆ మార్పుల పట్ల పాఠకుల వైఖరిని ప్రభావితం చేయడానికి ఎట్లా ప్రయత్నిస్తారనేది ఆయా రచయితల దృక్పథానికి సంబంధించిన విషయం కావచ్చు. కాని అసలు ఆ మార్పులను పట్టించుకోకుండా ఉండడం సున్నితమైన, భావుకులైన రచయితలకు సాధ్యం కాదు.

అందుకే ముదిగంటి సుజాతారెడ్డిగారు ఇక్కడ సంకలితం చేసిన కథల్లో ఏడింటిలో సాఫ్ట్ వేర్, మేనేజిమెంట్ రంగంతో సంబంధం ఉన్న పాత్రలు ఉన్నాయి. ‘ఉన్మాదంలోకి’, ‘బ్రెయిన్ డ్రెయిన్’, ‘మరో మార్క్స్ పుట్టాలె!’, ‘పేగు బంధం’, ‘ఈ పెండ్లి నిలుస్తుందా!’ కథలు ఈ కొత్త ఉద్యోగాలవల్ల, కొత్త జీవన స్థితివల్ల జీవితాలు ఏయే ఒడిదుడుకులకు లోనవుతున్నాయో వివరిస్తాయి. ఈ అత్యాధునిక ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడ స్త్రీల పట్ల చిన్నచూపు అనే కాలంచెల్లిన భావజాలం ఉండడం, ఆ భావజాల నేపథ్యంలో స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నా ఫలితమేమీ లేకపోవడం, పురుషుడు ఎప్పుడయినా పిల్లల పట్ల తన బాధ్యతను వదులుకొని వెళ్లిపోగలగడం ఈ కథలు చూపుతాయి. దేశానికి తిరిగి వద్దామనుకున్న సాఫ్ట్ వేర్ నిపుణులను కూడ అధికార యంత్రాంగంలోని అవినీతి ఎటువంటి చిక్కులకు గురి చేస్తున్నదో, నీతిగా ఉండాలని అనుకునేవారికి కూడ అవినీతి తప్పని స్థితిని పాలకులు ఎలా కల్పిస్తున్నారో కొన్ని కథలు చూపుతాయి.

అలాగే ఈ సాఫ్ట్ వేర్ రంగం పెరుగుదలతో పాటే హైదరాబాద్ చుట్టుపట్ల గ్రామాలలో రియల్ ఎస్టేట్ రంగం పెరుగుదల కూడ జరిగింది. రియల్ ఎస్టేట్ అనేది కేవలం మనిషికి ఆశ్రయమిచ్చే భూమిగా, స్థిరాస్తిగా కాక, పెట్టుబడి సాధనంగా, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించే సాధనంగా కనబడడం మొదలయినాక దానిలో అన్నిరకాల అక్రమాలూ ప్రవేశించాయి. అందువల్లనే ఇక్కడ ఐదు కథల్లో రియల్ ఎస్టేట్ మోసాలు, అక్రమాలు, దానివల్ల కలిగే వేదన చిత్రణ పొందక తప్పలేదు.

అధికారంలో ఉన్నవారికి ఈ సాఫ్ట్ వేర్ రంగం పెరుగుదల గురించి గాని, తత్పర్యవసానమైన రియల్ ఎస్టేట్ రంగం ప్రాధాన్యత గురించి గాని మిగిలిన సమాజం కన్న ముందే తెలిసే అవకాశం ఉంది. అందువల్ల మోసానికి, వంచనకు దిగడానికి, తద్వారా లాభాలు చేసుకోవడానికి వారికే ఎక్కువ అవకాశం ఉంది. ‘వైరస్’ కథలో జర్మన్ కార్ల కంపెనీ వస్తుందనే మోసపూరిత ప్రచారంతో వందలాది ఎకరాల రియల్ ఎస్టేట్ సొంతం చేసుకున్న రాజకీయ నాయకుడి ఉదంతం మన కళ్ల ముందర జరిగిన ఫోక్స్ వాగన్ ఉదంతానికి ప్రతిబింబమే. ఒకసారి మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు ఈ దోపిడీ వంచనల విషవలయాన్ని ప్రారంభించాక అది ఒక కళగా, పరిశ్రమగా మారి అందులోకి చోటామోటా దళారీలు, వ్యాపారులు, ఏజెంట్లు, ఉద్యోగులు ఎందరో ప్రవేశిస్తారు. ఒక సొంత ఆశ్రయం ఏర్పరచుకుందామనే ప్రయత్నంలో మోసాలకు గురయ్యే మామూలు ప్రజలు, అమాయకులు ఎంతోమంది ఉంటారు. ‘భూమి లేచిపోయింది’, ‘బ్రెయిన్ డ్రెయిన్’, ‘సీతయ్య చెల్క’, ‘పేగుబంధం’ కథల్లో ప్రస్తావనకు వచ్చింది ఈ దుస్సహ జీవనదృశ్యమే.

ఈ సామాజిక పూర్వరంగంలోనే స్త్రీల మీద అత్యాచారాలు, అమెరికా పెళ్లికొడుకుల కట్నాల ఆశలు, అమెరికాలో స్థిరపడికూడ తమ వంతు భూమి కోసం దురాశలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పని వత్తిడిలో భగ్నమైపోతున్న స్త్రీ పురుష సంబంధాల సున్నితత్వం, పేదరైతుల భూములను సేకరించడంలో ప్రభుత్వ మోసాలు, రక్తబంధం కన్న రాజకీయలబ్ధిదే పైచేయి కావడం, సరుకుల అమ్మకాల క్రీడలో బహుళజాతి సంస్థల మోసాలు లాంటి అనేక అంశాలను సుజాతారెడ్డి గారు చాల ఆలోచనాస్ఫోరకంగా చిత్రించారు, విశ్లేషించారు.

ఆమె విశ్లేషణల లోతుకు, విస్తృతికి, సమాజం పట్ల అభినివేశానికి మూడు ఉదాహరణలు చూడండి:

“సినిమాల్లో అవకాశాలు కొడుకులకు, మనుమలకు వంశపారంపర్యంగా కులవృత్తిగా మారాయి! ఆఖరికి సినిమా తారల కులమొకటి తయారవుతుందేమో – ప్రతిభ, తపన ఉన్నవాళ్లకు ప్రవేశం దొరకక డిప్రెషన్ లో కొట్టుక పోవలసిందే! ఆకలితో మాడి చావాల్సిందే!”

“ఆధునికమైన మానేజిమెంట్ లో మానవ మనోభావాలకు స్థానం లేదు మరి!…పని! పని! పని ఏ విధంగా ఆగకూడదు. రాక్షసత్వానికి మరోపేరు పని సంస్కృతి.”

ముఖ్యమంత్రి, మంత్రులు ఆ కార్లలోకి ఎక్కారు. కార్లు కదిలాయి. వాటివెంట సెక్యూరిటీ బలాలు పరిగెత్తాయి. కార్లకు అటుపక్క ఇటుపక్క వెనుకా ముందల పరిగెత్తే వాళ్లను చూస్తుంటే పూర్వం భూస్వాముల కచ్చరం బండ్లవెంట పరిగెత్తే వెట్టిచాకిరి వాళ్లు గుర్తుకు రాక మానరు! మనుషులు మారారు. కాని వ్యవస్థ అదే! మారలేదు!”

ఈ దుస్సహ దృశ్యాలను చూపడం ఆ వ్యవస్థ మారలేదని చూపడానికే. మారవలసిన అవసరాన్ని స్ఫురింపజేయడానికే.

ఎన్ వేణుగోపాల్
హైదరాబాదు, జూలై 22, 2010

You Might Also Like

Leave a Reply