పుస్తక లోకం

రాసిన వారు: యామిజాల జగదీశ్

పండితులకు నచ్చితే అలమరలో
ప్రజలకు నచ్చితే అంతరంగంలో
ఎవ్వరికీ నచ్చకపోతే పుస్తకం
ఎక్కడుంటుందో తెలీదు నాకు
– చల్లా రాధాకృష్ణ శర్మ తన శాంతిసూక్తం అనే పుస్తకంలో రాసుకున్న మాటలివి.

ఉండాల్సిన చోట పుస్తకం లేనప్పుడు నాకీ మాటలు గుర్తుకు వస్తుంటాయి. నాకుపుస్తకాలంటే మక్కువెక్కువే. ప్రేమ సరేసరి. అభిమానమూనూ. ఇంకా ఎన్ని సద్విశేషణాలుంటే అవన్నీ నాకు నచ్చిన పుస్తకాల విషయంలో చెప్పుకుంటూ ఉంటాను. మనసుతో మాట్లాడుతాను. ఇంతకీ పుస్తకప్రపంచంతో నాకున్న బంధం ఊహ తెలిసినప్పటి నుంచీ ఉందని నేను ఘంటాపథంగా చెప్పగలను. అందుకు కారణం మా నాన్నగారు (యామిజాల పద్మనాభస్వామి). ఆయన వృత్తి తెలుగు టీచర్గా పాఠాలు చెప్పడం. ప్రవృత్తి వ్యాసాలు రాయడం. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలతోపాటు భారతి (సాహిత్య మాసపత్రిక), జ్యోతి, స్వాతి వంటి మాసపత్రికలు, బాలానందం మిలియన్ జోక్స్, బాలభారతి వంటిచిన్న పిల్లల మాస పత్రికలకే కాకుండా మర్నెంటికో మా నాన్నగారు ఎన్నో ఎన్నెన్నో వ్యాసాలు రాశారు. అంతే కాదు, మద్రాసు రేడియోలో లెక్కలేనన్ని ప్రసంగాలు ఇచ్చారు. సభలూ – సమావేశాలూ సరేసరి. ఆయన రచనా వ్యాసంగానికి పుస్తకపఠనం తప్పనిసరి. పైగా పలు పత్రికలలో గ్రంథ సమీక్షలు చేశారు. కనుక ఇంటి నిండా పుస్తకాలకు కొర త ఉండేది కాదు.

నా చిన్నప్పుడు మేము మద్రాసు టీ.నగర్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న రెండు గదుల పెంకుటింట్లో ఉండే వాళ్ళం. ఇందులో ఒకటి కిచెన్ కమ్ డైనింగ్ రూమ్. మరొకటి పగలంతా హాలు, విశ్రాంతిగది, రీడింగు రూము, ఇలా ఒకటేంటీ అన్నీనూ. ఈ గదిలోనే బోలెడు పుస్తకలోకముండేది. ఆ గదే రాత్రుళ్ళు పడక గదిగా మారిపోయేది. ఈ పెంకుటింట్లో మొత్తం ఎనిమిది మంది ఉండే వాళ్ళం. అమ్మా నాన్న కాకుండా మేము ఆరగురు అన్నదమ్ములం. గదులు ఇరుకైనవి కావచ్చేమో కానీ మా మనసులు మాత్రం కాదు. మా ఇంటికి ఎందరో వచ్చి వెళ్తుండే వారు. ఎటు కాదన్నా వద్దన్నా పుస్తకాలు, పత్రికలు మా చేతులకీ, కాళ్ళకీ తగులుతుండేవి. కొత్త పుస్తకాలు, పాత పుస్తకాల్లోని విషయాలు మమ్మల్ని పలకరించినా, పలకరించకున్నా వాటి వాసన లు మా శ్వాసనిశ్వాసల్లో భాగమయ్యాయి. మా నాన్నగారి పుస్తకాల ఆస్తిని మేము చదివినా చదవకున్నా వాటి మధ్య నివాసం తప్పనిసరి. మా నాన్నగారి చివరి రోజు వరకూ ఆయన పక్కనే అమరకోశం, శబ్దమంజరి వంటి పుస్తకాలు ఉండేవి. వాటిపక్కనే తెల్లకాగితాల కట్టలు. రెండు నెలలకొకసారి పుస్తకాల బూజు దులుపుతుండే వాళ్ళం. సర్దే వాళ్ళం. అదో పెద్ద పని అయినా నాకు ఇష్టమున్న పని కావడంతో మిగిలిన వారికన్నా నేను ఎక్కువ శ్రద్ధే చూపే వాడిని.

ఒక పిల్లల మాసపత్రికలో మొదటిసారిగా నా పేరు అచ్చవడానికి కారణం కూడా మా నాన్నగారే. ఆయన ఆ పత్రికలో మూడు నాలుగు కథలు రాసేవారు. వాటిలో ఒకటి నా పేరుమీద రాసేవారు. అలా అచ్చులో నా పేరు చూసి నేను తెగ మురిసిపోయాను. అంతదాకా ఎందుకు? ఇప్పటికీ నాకు నా పేరు అచ్చులో చూసుకున్నప్పుడు పొందే ఆనందాన్ని మరి దేనితోనూ పోల్చలేను. రచయిత మధురాదర్ పుణ్యమాని బుజ్జాయి అనే పిల్లల మాసపత్రికతో 2000 జనవరిలో ఏరిన బంధం ఇప్పటికింకా కొనసాగుతోంది. దాదాపు పదేళ్ళుగా ఆ పత్రికకు అవీ ఇవీ రాస్తున్నా. వాళ్ళకి ఒక విధంగా నేను ఆస్థాన రచయితను. అలాగే మరికొన్ని పత్రికలలోనూ నేను రాసినవి అచ్చయ్యాయి. నేను రాసిన మొదటి కథకు మిలియన్ జోక్స్ పత్రిక ఇచ్చిన పారితోషికం అయిదు రూపాయలు. ఆ తర్వాత జ్యోతిమాసపత్రిక దీపావళి సంచిక (సంవత్సరం గుర్తుకు రావడం లేదు) లో సిండికేట్ బ్యాంక్ మీద రాసిన అనువాద రచనకు 50 రపాయలు లభించాయి. సరే రచనలకు అందుకున్న డబ్బుల సంగతి పక్కనపెట్టి పుస్తకాల సేకరణ విషయానికి వస్తాను.

నేను మొదట్లో మా అమ్మ ఇచ్చిన పాకెట్మనీతో 1970, 80 ప్రాంతాలలో వివిధ మ్యాగజైన్లు కొనే వాడిని. అవి వారికీ వీరికీ ఇచ్చి పరిచయాలు పెంచుకున్నాను. కొన్ని పరిచయాలు సన్నిహిత సంబంధాలకు దోహదపడ్డాయి. మా రెండో అన్నయ్య ఆనంద్ నుంచి నేను చాలా పుస్తకాలే కొట్టేశాను. వాటిలో ఇప్పుడు నా దగ్గర అతి తక్కువగానే ఉన్నాయి. చేయి దాటిన చాలా పుస్తకాలు దారి తప్పినవి, ఎటు వెళ్ళిపోయాయో తెలీదు. ఫుట్పాత్లమీద పుస్తకాలు చూడాలన్నా, కొనాలన్నా నాకు మహా సరదా. ఏదైనా ఒక పుస్తకం కొన్నానంటే నాకా రోజు పండగే. కొన్న చోటే కొన్ని పేజీలు తిరగేస్తాను. అలా కొన్న వాటిలో కొందరు ప్రముఖులకి ఆయా రచయితలు, రచయిత్రులు ఎంతో ప్రేమతో సంతకాలు చేసిచ్చిన పుస్తకాలు కూడా ఉన్నాయి. డాక్టర్ సి. నారాయణ రెడ్డికి ఒక రచయిత్రి సంతకం చేసిచ్చిన పుస్తకం, మా మామగారికి (జి.కృష్ణ, పాత్రికేయులు) సుధామ సంతకం చేసిచ్చిన పుస్తకం (పంజగుట్ట చౌరస్తా దగ్గర్లో ఉన్న పాత పుస్తకాల దుకాణంలో పది రూపాయలకి ఆ పుస్తకం కొన్నాను. ఓ ఆరుగురు కవుల్ని సాహిత్య ప్రక్రియపై ఇంటర్వ్యూ చేసిన పుస్తకం. అఫ్కోర్స్ ఈ పుస్తకం సుధామ రాసింది కాదనుకుంటాను, సరిగ్గా గుర్తు లేదు), ఇలా మరికొన్ని పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి.

2010 అక్టోబర్ 15వ తేదీన హైదరాబాద్ టెలిఫోన్ భవన్ ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ఫుట్పాత్మీద అమ్మే పుస్తకాల వరుసలోంచి అద్దేపల్లి రామమోహనరావు రాసిన పొగ చూరిన ఆకాశం – కవితా సంపుటి, డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి రాసిన గాయాల చెట్టు పుస్తకం పదేసి రూపాయలకి కొన్నాను. రచయిత అద్దేపల్లి తన కవితా సంపుటిని సహృదయ శారదా అశోకవర్ధన్గారికి సాదరంగా అని సంతకం చేసివ్వగా తుర్లపాటి రాజేశ్వరిగారు శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారికి గౌరవపురస్సరంగా అని సంతకం చేసిన కవితా సంపుటి కావడం విశేషం. ఒకసారి మా నాన్నగారి విద్యార్థి చింతామణి పుస్తకాన్ని నేను మద్రాసు వెస్ట్ మాంబళంలో పేవ్మెంట్ మీద అయిదు రూపాయలకి కొన్నాను. అలాగే మా మావగారు రాసిన నాయన (కావ్యకంఠ గణపతిముని జీవితచర్రిత – ఇంగ్లీషులో) పుస్తకాన్ని ఒకరికి సంతకం చేసివ్వగా అది కొంత కాలానికి ఫుట్పాత్ మీద పాత పుస్తకాల మధ్య నలిగి నా వంక జాలిగా చూడటం చూశాను. అలాగే మా నాన్నగారు రాసిన సుందరకాండ పుస్తకం కూడా అబిడ్స్ పేవ్మెంట్ మీద చూశాను కానీ కొనలేదు. ఆ రోజు నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. మరో వారానికి వెళ్ళి చూడగా ఆ పుస్తకం అక్కడ లేదు. ఇలా రోడ్డుమీద కొచ్చే పాత పుస్తకాల గుంపులో పెద్ద రచయితలు సంతకం చేసిన పుస్తకాలు చూసినప్పుడల్లా బాధ కలుగుతుంది. ఆ సమయంలో ఇక ఎవరికీ పుస్తకాలు కానుకగా ఇవ్వకూడదనిపిస్తుంది.

ఎవరో ఎంతో ప్రేమతోనో అభిమానంతోనో, గౌరవంతోనో ఇచ్చిన పుస్తకాలను అందుకున్న వాళ్లు కారణం ఏదైనా కావచ్చు…వాటిని ఇలా వదిలించుకోవడం చూసి మనస్సు బాధ పడుతుంది. నేను రాసిన నా జెన్ కథలు (సహ రచయిత డి. చంద్రశేఖర్ రెడ్డి) పుస్తకాన్ని కొందరికి ఇచ్చాను. ఆ పుస్తకం ఇప్పటికింకా పేవ్మెంట్ మీద దర్శనం కాలేదు. అందుకు సంతోషిస్తున్నాను. నేను కష్టార్జితంతో కొన్న పుస్తకాలను ఇంట్లో జాగా లేకో అద్దె కొంపలు మారుతున్నప్పుడో ఎవరికైనా ఇవ్వడమో లేక అమ్మేయడమో జరిగుండవచ్చు. కానీ నేను కానుకగా అందుకున్న పుస్తకాలను నాకు తెలిసి ఎప్పుడూ అమ్మలేదు. అమ్మను కూడా. నేను పోయిన తర్వాత వాటి సంగతిని మా ఇంట నా శ్రీమతిగానీ, కుమారుడు సాత్యకి గానీ పట్టించుకుంటారనే నమ్మకం లేదు. నాకిష్టమైన అవి అప్పుడు ఎక్కడ ఉంటాయో కదూ?

పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గూడూ లాంటిదే. కనుక కన్న పిల్లలకి ఇతర నిత్యావసరాలతోపాటు పుస్తకాలు కూడా ఇచ్చి పెంచాలని ఓ ఇంగ్లిషు రచయిత చెప్పిన మాటలు ఆయనెంత అనుభవపూర్వకంగా చెప్పాడో ఏంటో? పుస్తకాలనేవి కలలు లేదా కత్తులు కావచ్చు. పుస్తకాల్లోని పదాలు మనల్ని గాయపరచవచ్చు. లేదా మన ఆలోచనలకు పదును పెట్టవచ్చు. వాటిని మనం ఉపయోగిచడంలోనే ఉంది అసలు మజా. పుస్తకంలోని పేజీలు తిరగేసే ప్రతిసారి ఏదో ఒకటి బురక్రెక్కి తీరుతుందనే నా సదభిప్రాయం. కలలు, పుస్తకాలు రెండు వేర్వేరు ప్రపంచాలు. వీటిలో పుస్తకాల లోకపు విస్తీర్ణం కాస్తంత పెద్దదే. యువ తకు పుస్తకం ఆహారం. మెదడుకు మేత. వయస్సు మీద పడుతున్న వారికి ఆనందమయం చేసే పుస్తకాల్ని మనిషి సద్వినియోగపరచుకుంటే అవి సౌహార్దానికి సౌభాగ్యానికి ఆభరణాల్లాంటివి కూడా అవుతాయి.

కవితలు లేకుండా జీవించ వచ్చు. సంగీతం లేకుండా జీవించవచ్చు. చిత్రకళ లేకుండా జీవించవచ్చు. హృదయంలేకుండా జీవించవచ్చు. మిత్రులు లేకుండా జీవించవచ్చు. వంట తెలియకుండా జీవించవచ్చు. కానీ కొద్దో గొప్పో నాగరికత తెలిసిన వ్యక్తి పుస్తకాలు లేకుండా బతకడం కష్టసాధ్యం. కిటికీల్లాంటి పుస్తకాల్లోంచి మన ఆత్మ లోకాన్ని చూడగలదు కనుకే నేను పుస్తకాలను మంచి మిత్రులుగానే చూస్తాను. అలాగని నేను సంగీతాన్నీ, చిత్రకళనూ చిన్నచూపు చూడటం లేదు. వాటిమీద కూడా నాకు అభిమానం లేకపోలేదు. సంగీత జ్ఞానం లేకున్నా మంచి సంగీతం విని ఆస్వాదించ గల మనసు నాకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఘంటసాల, పీబీ శ్రీనివాస్, టీఎం సౌందర్ రాజన్ (తమిళ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేశన్లకు ఎక్కువ పాటలు పాడిన నేపథ్యగాయకుడు) తదితరుల పాటలు, కున్నైక్కుడి వైద్యనాథన్ వాయులీనం, ఎన్. రమణి, ప్రపంచం సీతారాం వేణునాదం, చిట్టిబాబు, గాయత్రి వీణానాదం వినడ మంటే నాకెంతో ఇష్టం. ఒకప్పుడు పాప్ సంగీతం కూడా బాగానే వినేవాడిని కానీ ఇప్పుడు దానిమీద మోజు తగ్గిపోయింది. అలాగే చిత్రకళను చూసి ఎంజాయ్ చేయగలను. ముఖ్యంగా బాపు కుంచెల్లో ఒయ్యారాలు వొలకబోసుకున్న అమ్మాయిల బొమ్మలంటే నాకు ఇష్టం. చంద్ర, బాలి బొమ్మలన్నా ఇష్టపడతాను. అయినప్పటికీ, పుస్తకాలంటే నాకు మహా మహా ఇష్టం!

You Might Also Like

4 Comments

  1. ramaseshu

    A good article. Hats off to sri jagadish. May his pen continue to write double his own age permits. Abhinandanlatho…

  2. skmohanrao

    Na manasuloni abhiprayalni intha baga cheppinanduku meeku pratyeka krualutajnathalu.

  3. గంటి లక్ష్మీ నరసింహమూర్తి

    జగదీష్,మీ నాన్న్గగారు,మానాన్నగారు చిన్ననాటినుండి మంచి స్నేహితులు.మీ నాన్నగారు నాకు మంత్ర దీక్ష నిచ్చిన గురువుగారు.నాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చేరు.వాటిని చాలా జాగ్రత్తగా భద్ర పరిచేను.మీకు కావలసియుంటే తీసుకొని వెళ్ళవచ్చు-మూర్తి

  4. మందాకిని

    పుస్తకం గురించీ, పుస్తకాభిమానం గురించీ చక్కటి పరిచయం.

Leave a Reply