శ్రీశ్రీ కథలు-అనువాదకథలు : 1

మహాకవి అంటే శ్రీశ్రీ అని, మహానటి అంటే సావిత్రి అని – ఇలా వారి పేరు పక్కన ఇంటిపేర్లలా ఆ విశేషణాలు చేరిపోయాయి కనుక, వారు ఎవరు అని ప్రశ్నించే దురదృష్టపు తెలుగువారు ఉంటారనుకోను. కాకపోతే, “శ్రీశ్రీ కథలు కూడా రాశాడా?” అన్న ప్రశ్న ఉదయించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ కనిపించట్లేదు నాకు. ఎందుకంటే, శ్రీశ్రీ అంటే మనకు ఆవేశం నిండిన కవిత్వం, లేదా వివిధ రకాల సినిమా పాటలో గుర్తు వస్తాయి తప్పితే ఏ కథో తట్టదు. కానీ, ఆయన కొన్ని కథలు రాసి, కొన్ని కథల్ని అనువాదం కూడా చేసాడు. ఇవన్నీ ఒక సంకలనంగా ముద్రించడం ఇదే తొలిసారని ఈ సంకలనకర్త చలసాని ప్రసాద్ గారు ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో తెలిపారు. పుస్తకం చదువుతూ ఉంటే నాకు ఒకటే అనిపించింది – పుస్తకానికి “శ్రీశ్రీ రచనలు” అని పెట్టి ఉండాల్సింది ఫేరు అని. ఎందుకంటే, అక్కడ కథలు మాత్రమే కాదు వ్యాసాలు కుడా ఉన్నాయి. ఒకట్రెండు కవితలు కూడా ఉన్నాయి. వ్యాసాలు ఆర్.కే.నారాయణ్ అన్న “personal essays” తరహావి. అలా అన్నీ కలిపినప్పుడు పేరు “కథలు” అని పెట్టడం పాఠకుడిని తప్పుదారి పట్టించడం కాదా? అని సందేహం కలిగింది నాకు.

ఏదేమైనా పుస్తకం చదివేందుకు బాగుంది, శ్రీశ్రీ అంటే కవిత్వం ఒక్కటే కాదు అని తెలుసుకున్నాను. ఇదివరలో ఆయన కథలు ఒకట్రెండు చదివి ఉన్నాను కానీ, నచ్చలేదు అవి. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. కథలు (ఇందులో వ్యాసాలు-కథలు-కథావ్యాసాలు-వ్యాసకథలు..ఇలా రకరకాల భావాలు కలిగించే రాతలు ఉన్నాయి), “నవరసాల శ్రీశ్రీ” అన్న తొమ్మిది కథలు, అనువాద కథలు. మూడు భాగాల గురించీ నాలుగు వ్యాసాల్లో పరిచయం చేస్తాను. ముందుగా – నవరసాల శ్రీశ్రీ గురించి.

“నవరసాల శ్రీశ్రీ” – ఇందులో శ్రీశ్రీ కథలు-కథలు అని చెప్పేవి మొత్తం కలిసి తొమ్మిది ఉన్నాయి. ఇవన్నీ డెబ్భైలలో జ్యోతి మాసపత్రికలో వచ్చినవి. మొదటి కథ – ’లెని’నిజం (అద్భుతరసం). ఈ నవరసాల సీరీస్ లో అన్నింటికంటే నాకు ఈ కథ నచ్చింది. కథా వస్తువుతో పాటు కథనంలో కూడా ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆద్యంతమూ “అద్భుత రసం” అన్న భావన కలుగుతూనే ఉండింది. ఈ వర్ణనల్లోనే మంచి హాస్యం కూడా పండింది. అయితే, ఇలాంటి కథలు నచ్చాలంటే పాఠకులు కొంచెం open-minded గా ఉండాలేమో. లేకుంటే ఇది కాస్త revolutionary గా అనిపించే ప్రమాదం లేకపోలేదు. తరువాతి కథ “నింపాదిగా కోపం చెయి” (రౌద్ర రసం). నిజానికిది కథ కాదు. వ్యాసం. పేరుకి మాత్రమే రౌద్రం. ఇది అసలు నిజానికి అన్నింటికంటే కామెడీగా ఉంది. శ్రీశ్రీ ని చతురులు అని ఎందుకు అంటారో అన్నది ఇది చూస్తే అర్థమైంది. “అరవంలో కోడిగుడ్డు” (హాస్య రసం) – ఇది కథో కాదో మళ్ళీ పెద్ద్ద అనుమానం. అయితే, హాస్యం మాత్రం బానే ఉంది. ఇందులో చర్చించిన భాషలు రాయడం, నేర్చుకోవడం గురించిన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

“దైవభీతి” (భయానకరసం) కథ లో భయానకంగా ఏమీ లేదు కానీ, వ్యంగ్యం ఉంది విపరీతంగా. శ్రీశ్రీ గారికి దైవభక్తిపై గల అభిప్రాయాల గురించి ఈ కథల్లోని ప్రధాన పాత్రధారుల అభిప్రాయాలు చదవడం ద్వారా కాస్త అవగతమైంది. రచయిత భావజాలం పాత్రల్లోకి ఎలా జొప్పించవచ్చు, ప్రధాన పాత్రల తత్వాన్ని రచయిత తత్వానికి పాఠకులు ఎలా అన్వయించుకునే ప్రయత్నం చేస్తారు అన్నదాని మీద నాపై నేనే ప్రయోగం చేసుకున్నాను ఈ కథలు చదువుతున్నప్పుడు. ఇంకోళ్ళపై నేనెలాగో చేయలేనుకదా! “మదన కదన కథ” (శృంగార రసం) ఎలా మొదలైందో చూడండి – “డాక్టర్ భగవంతం గొప్ప మేధావి. అంతకుమించిన గొప్ప భక్తుడు. అన్నట్లు పాఠకులు నన్ను మన్నించాలి. ఈ కథ భక్తుని గురించి కాదు. ఈ డాక్టరు గారి గురించి అంతకన్నా కాదు. ఏదో పేరు చాలా సెక్సీగా ఉందని ఈయన పేరుతో ప్రారంభించాను.” ఇక ఈ కథ ముగింపు వాక్యాలు శ్రీశ్ర్రీకి జనం అమాయకత్వానికి విపరీతంగా చిరాకు పుట్టిందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఈ కథ ముగింపు నాకు అర్థం కూడా కాలేదు అసలు. అంతవరకు బానే ఉన్న డాక్టర్ సడన్ గా భక్తుడైపోయి ఆశ్రమం పెట్టడమేమిటో,ఎందుకో అసలు అర్థం కాలేదు.

తరువాతిది “కుళ్ళూ-పేతుళ్ళూ” (భీభత్స రసం) ఇది కవిత.
“ఈ దేశంలో ఎలకా దేవుడు
పందీ దేవుడు, మనిషే ఎదవ”
– ఈ వాక్యాల్లో ఆయన గురించి చాలా ఊహలు కలిగాయి నాకు. ’ప్రస్తేషన్’  సరైన పదమేమో ఈ కవిత రాసినప్పటి శ్రీశ్రీ మన:స్థితి ఎలా ఉండి ఉంటుంది అన్న ప్రశ్నకి. “బ్రూహి ముకుందేతి” (శాంతరసం) మళ్ళీ వ్యంగ్యం. శ్రీశ్రీ గారి వ్యంగ్యాన్ని ప్రెజెంట్ చేసే పద్ధతి నాకు చాలా నచ్చేసింది. “కన్నీటి కబుర్లు” అన్నది కరుణ రసం అంటున్నారు కానీ కథ కాదు. వివిధ కవుల విషాగ గీతాల గురించి వివరిస్తూ సాగిన వ్యాసం అని చెప్పాలి. “వెలుతురు కిరణాలు” (వీరరసం) ఈ సిరీస్ లో చివరి కథ. కమ్యూనిస్ట్ దారిలో పోరాటం చేస్తున్న ఓ యువకుడు పోలీసుల చేతిలో మరణించే దృశ్యం ఈ కథా వస్తువు. దీని తరువాత “చావు-పుట్టుక” అన్న చిన్న సింగిల్ పెజి వ్యాసం ఉంది. పై రెండూ కూడా శ్రీశ్రీకి విప్లవకారులపై ఉండే సానుభూతిని తెలియజేస్తాయి.

మొత్తానికి తొమ్మిది కథలు చదవదగ్గవే. శ్రీశ్రీ రాసే శైలి, అందులోని సంభాషణా చాతుర్యం నాకు నచ్చింది. ఈ కథల ముందు పేజీలో తొమ్మిది శ్రీశ్రీ బొమ్మలు ముద్రించారు. బాగున్నాయవి.

ఈ పుస్తకం గురించిన నాలుగు పరిచయ వ్యాసాలలో ఇది మొదటిది. రెండవది, మూడవది శ్రీశ్రీ అనువాద కథల గురించి.  తరువాయి భాగం త్వరలో ఇక్కడే చూడండి 🙂

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం

    […] నాకు బాగా నచ్చింది, ఉపయోగపడింది – శ్రీశ్రీ అనువాద కథలు. వంగూరి ఫౌండేషన్‌ ప్రచురించిన […]

  2. పుస్తకం » Blog Archive » శ్రీశ్రీ కథలు-అనువాద కథలు 3

    […] పరిచయం చేస్తున్నాను.  మొదటివ్యాసం ఇక్కడ, రెండోవ్యాసం ఇక్కడా […]

  3. పుస్తకం » Blog Archive » శ్రీశ్రీ కథలు-అనువాద కథలు 2

    […] “శ్రీశ్రీ కథలు-అనువాద కథలు” చలసాని ప్రసాద్ గారి సంకలనాన్ని […]

  4. కొడవళ్ళ హనుమంతరావు

    మహాకవి విశేషణం ఇంటీపేరులా చేరిపోయిందని చదవగానే మధురవాణితో కుటుంబరావు సంభాషణ [1] గుర్తొచ్చింది: “కథక చక్రవర్తులు, మహాకవులు, కవి సామ్రాట్టులూ యిదంతా ఫ్యూడల్ సెటప్ లోంచి వచ్చి మన్నిపట్టుకు పీడిస్తున్న బిరుదుల సంత.” అది చదివింతర్వాత నాకూ కాస్త తుప్పు వదిలింది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “మధురవాణి ఇంటర్వ్యూలు (ఊహాజనిత సంభాషణలు),” పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 1997. పేజీ 147.

Leave a Reply