ఆ ఒక్కటీ అడక్కు!

ఏ ఒక్క కథా ఒకసారి చెప్పిన పద్ధతిలో చెప్పినట్టు చెప్పకుండా చెప్పుకొచ్చిన

యండమూరి వీరేంద్రనాథ్ కథా సంకలనం “ఆ ఒక్కటీ అడక్కు!”

పరిచయకర్త:: సాయి పీవీయస్.

===============================================================================

మంచి ప్రేమ కథలని ఇంకా ఎంతో మంచి కుటుంబగాథలని జోరుగా హుషారుగా చదివే తెలుగు పాఠకులు కొత్తదనం కోసం సొగసులని వెదుకుతూ కలవరిస్తున్న తరుణంలో సైన్సునీ, విజ్ఞానాన్నీ, కల్పననీ, సస్పెన్సునీ, ఆధునిక జీవితంలోని ఆందోళననీ మిళాయించుకుని ఒక నక్షత్రం తెలుగు సాహిత్యాకాశంలో కొత్తగా వెలిసింది. ఆ కలం నుంచి వచ్చే సాహిత్యం ఇచ్చే  కిక్కు మరిపించి మురిపించే మత్తుమందు కాదు. మెదడుకి మేత. తెలివికి తేట!” యండమూరి వీరేంద్రనాథ్  రచనలని పరిచయం చేస్తూ 1980లలో అతని ప్రచురణకర్తలు నవభారత్ బూక్ హౌస్, విజయవాడ, వారు రాసిన పరిచయ వాక్యాలు ఇవి.

కథల స్థాయి నుంచి నవలల స్థాయికి ఎదిగితే తప్ప సాధారణంగా రచయితలని పాఠకులు గుర్తించరు. కానీ యండమూరి కథకునిగానే మంచి గుర్తింపు పొందాడు. ఇందుకు మొదటి కారణo అతని పొడుగాటి పేరు కావచ్చు. పొడుగాటి పేర్లున్న రచయితలు తొందరగా జ్ఞాపకం ఉండిపోతారు. కొడవటిగంటి, యద్దనపూడి, మల్లాది….శాస్త్రి, మల్లాదిమూర్తి, కొమ్మూరి,

పురాణంఇలా! యండమూరి కధకునిగానే గుర్తింపబడటానికి రెండవ కారణం విలక్షణమైన అతని కధనం. నాటక రచయితగాను నటకునిగాను అనుభవం ఉన్న అతని కధలు మంచి మెలో డ్రామాతో నిండి ఉండేవి.

ఇప్పుడు నాచేతిలో ఉన్న పుస్తకం అతనిదే! “ఆ ఒక్కటీ అడక్కుకథల సంపుటి. 1981లో మొదటి ముద్రణ జరిగినది. ప్రచురించిన ఆరు నెలల లోపునే రెండవ ముద్రణకి వచ్చి రికార్డ్ నెలకొల్పినదట. తెలుగులో ప్రచురితమయ్యే అన్ని కథా సంపుటాలకి మల్లేనే ఈ సంపుటికి కూడా విషయసూచిక లేదు. ఇందులో ఎన్ని కథలు ఉన్నాయో ఏ కథ ఎక్కడ మొదలవుతున్నదో తెలిపే ఓ సూచికని నేనే ఈ పుస్తకం చివరలో తయారు చేశాను. ఇందులో ఉన్న కథలు పన్నెండు. వరుసగా ఒకటొకటి పరిచయం చేసుకుంటూ పోతాను.

లవర్స్ మస్ట్ లెరన్: కొన్ని భావాలని భాషలోకి అనువదించి చెప్పలేము. అవి భాషాతీత  భావాలు. అటువంటి భావాలని ఎవరికి వారే అనుభవించి అనుభూతిగా పదిలం చేసుకోవాలే తప్ప ఇది..,ఇలా.., అంటూ మాటలలో వివరించి చెప్పలేము. ఇలాటి భాషాతీత భావాలలో బాగా పాపులర్ ఐనది ప్రేమ“. ప్రేమించని మనిషంటూ ఉండనట్టే ప్రేమకి సరైన, సమగ్రమైన నిర్వచనం ఇచ్చిన మనిషి, కనీసం రచయిత కూడా ఎవరూ లేరేమో ఇంతవరకూ! పుట్టిన ప్రతి వ్యక్తీ ప్రేమించి, ప్రేమింపబడాలని ఆశిస్తున్నట్లే; కలంపట్టిన ప్రతి రచయితా తన రచనలలో ఎక్కడో అక్కడ ప్రేమంటే ఇదేనర్రా అని నిక్కచ్చిగా చెప్పటానికి విఫల ప్రయత్నం  జరపటం పాఠకులకు అనుభవైకవేద్యమే! యండమూరి కూడా   అలాటి ప్రయత్నమే చేయబోయాడు ఈ కథలో. అన్నట్టు, నిజానికి ఇది కథ కూడా కాదు. చిన్న నవలిక. 50 పేజీలకి పైగా ఉంది. సంపుటిలో నాలుగోవంతు స్థానాన్ని ఆక్రమించుకొంది. తెలుగు పాఠకులు నవలలకే తప్ప కథలకు ప్రిఫరెన్సు ఇవ్వరని ఎప్పుడో తెలుసుకున్న ప్రచురణకర్తలు కూడా అసంకల్పిత ప్రతీకార చర్య లాగా కావాలనే సంపుటిలో ముందు సీట్లో కూర్చోపెట్టారు.

ఓ నాటకం చూస్తుంటే, హఠాత్తుగా ప్రేమంటే ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది నటుడు, రచయిత, దర్శకుడు ఐన పాణికి. ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాక కానీ పెళ్ళి చేసుకోకూడదు అనే నిర్ణయానికి కూడా వచ్చేస్తాడు. అదే నాటకంలో హీరోయిన్ లత, పాణి ప్రాణ స్నేహితుడు శాస్త్ర్రి, శాస్త్రి అరెంజ్ చేసిన కాల్ గర్ల్ వసంతవీళ్ళెవ్వరూ కూడా పాణికి ప్రేమంటే ఏమిటో తెలియజేయలేకపోతారు. ఐతే ప్రేమంటే ఏమిటో థియొరెటికల్ గా తెలుసుకోక ముందే తన మేన మరదలు రాధ ప్రేమ(?)కి లొంగిపోయి ఆమెని పెళ్ళి చేసేసుకుంటాడు పాణి. మొదటి రాత్రి అని కూడా ఆలోచించకుండా ప్రేమంటే ఏమిటో చెప్పాల్సిందే నంటూ హఠం చేసి కొత్త పెళ్ళి కూతురుని బిత్తర పోయేలా చేస్తాడు. ఆ తర్వాత, ఆనకెప్పుడో; “ప్రేమంటే ఏమిటో అర్థం అయిందా బావా?” అంటూ ఓ సన్నివేశాన్ని సృష్టించి అడుగుతుంది రాధ. పాణికి అర్థం అయిందో లేదో రచయిత చెప్పడు. చెపితే ఆ అర్థాన్ని తిరిగి చదువరులకు చెప్పాల్సిన బాధ్యత తనదే కాబట్టి. ఇక పాఠకునికి అర్థం అయిందంటే నిజంగా అతను ధన్యుడే! ప్రేమంటే ఏమిటో చెప్పబోయి, చేతకాక మిగతా రచయితలలాగానే యండమూరి కూడా చతికిల పడటం ఈ కథలో కనిపిస్తుంది.

అబద్ధం లాంటి నిజం: ఈ సంపుటిలో ఉన్న రెండు ఆణిముత్యాల లాంటి కథలలో ఇది మొదటిది. వరుసలో రెండవది. శైలజ సెక్రెటేరియట్ లో పనిచేస్తూంటది. ఓరోజు రాత్రి సినిమా నుంచి వస్తుండగా, వర్షం జోరుగా కురవటమూ, రిక్షా టైరు పంచర్ కావటమూ వంటి సమస్యలతో తలదాచుకోటానికి ఓ యింటి వసారా కిందకి వస్తుంది. ఆ ఇల్లు ప్రకాశరావుది. అతను ఛార్టర్డ్ అకౌంటెంట్. పాణి అండ్ మౌళి కంపెనీలో భాగస్వామి. యువకుడు, అందగాడు, ముఖ్యంగా బ్రహ్మచారి. ఆమెని లోపలికి ఆహ్వానిస్తాడు. ముందు బెరుకు బెరుకుగానే లోపలికి ప్రవేశించినా; అతని కలుపుగోలుతనం, నిష్కల్మషత్వం, సమస్యని తన కోణం నుంచి మాత్రమే చూసే పసిపిల్లవాని మనస్తత్వం ఇవన్నీ ఆమెని ఆరాత్రి అతని ఇంట్లో, అతని గదిలో, అతని పక్క బెర్త్ మీదే ధీమాగా నిద్ర పోయేలా చేస్తాయి. ఈ మధ్యలో ఓసారి కరెంట్ కూడా పోతుంది. ఐనా ప్రకాశరావు ఆ అపూర్వ అవకాశాన్ని అందరబ్బాయిల్లా అపురూపంగా ఉపయోగించుకోడు. అలా అని ప్రకాశరావేమీ పిరికివాడు కాదు. ఋషి అంతకన్నా కాడు. బ్రహ్మచర్య జీవితాన్ని పవిత్రంగా గడిపి, ఆ తర్వాత శాస్త్రోక్తంగా పరిణయమాడిన పడతితో సంసారయాత్ర సిన్సియర్ గా సాగించాలనుకునే హైందవ మనస్తత్వం దట్టంగా దిట్టంగా కలవాడు. అంతే! ఐతే, మరునాడు మాటల సందర్భంలో  తన పార్టనర్ పాణితో ఈ ఉదంతం చెపితే, “నువ్వొట్టి చవటవోయ్! అదే నేనైతేనా….” అంటూ మొదలు పెట్టి, “నువ్విలా మంచి బాలుడు సోమూ! అనేలా ప్రవర్తించినందుకు, పొద్దున్నే లేచి వెళ్ళిపోతూ, ’ వీడుత్త ఇంపోటెంటు వెధవలా ఉన్నాడే!’ అని అనుకుంటూ వెళ్ళి  ఉండక మానదు.” అని ముక్తాయించి, సరిగ్గా సూటిగా ఎక్కడ తగలాలో అక్కడే తగిలేలా అవమాన బాణాలు సంధించి వదలటంతో, ప్రకాశరావు దట్టంగా దిట్టంగా కాంక్రీటుతో కట్టుకున్న హైందవ మనస్తత్వం కంపించి కకావికలమవుతుంది. దాంతో అతనికి ఆ రాత్రి జరిగిన సంఘటనలన్నీపురికోసతాడు మీద పడితే బల్లి అనుకుని ప్రకాశాన్ని కరుచుకుపోవటం; కరెంటు పోయినపుడు తన చేతిలోనే అగ్గిపెట్టె ఉన్నా, వెలిగించకుండా చీకట్లోనే కొవ్వొత్తి కోసం వెదుకుళ్ళాడటం వగైరాలు చూస్తే ఆమెకి పాణి అన్నట్టుఅంతర్గతంగా కోరిక ఉన్నట్టు తోపిస్తుంది. దాంతో తానేమీ ఇంపోటెంట్ కాదనీ, కేవలం ప్రిన్సిపల్డ్ అనీ, అవసరం ఐతే ఎంతకైనా తెగించకలడనీ నిరూపించుకోవాలనే పంతం పెరిగి, మళ్ళీ ఆమెని ఓ రాత్రి తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు ప్రకాశం. అతని మస్తిష్కంలో కలిగిన మార్పులు చూచాయగానైనా తెలియని శైలజ ఇదివరకటి కన్నా రెట్టింపు చలాకీతనంతో రెచ్చిపోతుంది. పాణి మాటలతో పొరలు కప్పబడిన ప్రకాశానికి ఆమె మాటలన్నీ ద్వందార్థాలుగా తోపిస్తాయి. ముందుగా అతను ఏర్పాటు చేసుకున్నట్టుగానే కరెంటు పోతుంది. సెక్స్ కోసం వాపోయి ఆవురావుమంటూ కాచుక్కూచున్న శైలజ ఇక తన కౌగిలిలో కరగిపోవటమే తరువాయి అనుకుంటూ ఆమెని గాఢాలింగనం లోకి లాక్కోబోయిన ప్రకాశానికి వద్దు వద్దు అని ఏడుస్తూ తన కాళ్ళ మీద కుప్పలా కూలబడటం దిగ్ర్భమని కలగచేస్తుంది. పశ్చాత్తాపంతో ప్రకాశం తనలో ఇటీవల కలిగిన అంతర్మథనం అంతా వివరిస్తాడు శైలజకి.

ఈ ప్రపంచంలో చాలామందికి జీవితాన్ని అనుభవించి ఆస్వాదించాలనే ఆసక్తి, కోరిక ఏమీ ఉండవు. తమ జీవితాలని తామే ఒక ప్రేక్షకుడిలా చూసేస్తూ గడిపేస్తుంటారు. ఎప్పుడో, ఎందుకో హఠాత్తుగా ఒకసారి వీరికి తామేదో కోల్పోతున్నట్టుగా కలవరపాటు కలుగుతుంది. ఆ తొందరపాటులో ఏదో చేయబోయి ఏమో అవుతుంటారే తప్ప పూర్తి ఇష్ఠాయిష్ఠాలతో కాదు. హోటలుకి పోయి అలవాటైన కుర్చీలో కూర్చుని, అలవాటైన ఇడ్లీ, సాంబారుకి ఆర్డర్ ఇచ్చేశాక, పక్క కుర్చీలకేసి చూస్తే వారు ఉప్మా పెసరట్టు తింటుంటే, అయ్యో అని నాలుక్కరుచు కోవటం లాంటిది ఇది. ఇదో రకం బలహీనత. తమకేం కావాలో తమకే తెలియని దయనీయ పరిస్థితి వీరిది. అర్థం చేసుకోలేకపోతే వీరంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని ముగిస్తాడు రచయిత. మంచి కథ. చక్కని మనో విశ్లేషణ.

ఆ ఒక్కటీ అడక్కు! ఇది టైటిల్ కథ. వరుసలో మూడవది. రావ్, సుమిత్ర దంపతులు. పెళ్ళై 14 ఏళ్ళు దాటుతున్నా, ఇప్పటికీ కొత్త దంపతుల్లా జీవితం సాగించగలుగుతున్నారు. ముఖ్యంగా సుమిత్ర ఇప్పటికీ కొత్త పెళ్ళి కూతురిలా రావ్ తో ఉండీ ఉడిగీ గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంటుంది. ఈ దంపతులిద్దరూ జాలీగా గడపాలని సిమ్లాకి బయలుదేరతారు. ఎంతో సరదాగా ప్రారంభమైన వారి ప్రయాణం ఢిల్లీ ఏర్ పోర్ట్ వచ్చేసరికే అడ్డం తిరుగుతుంది. అక్కడ విమానం దిగేక లగేజ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ జంటనే ముచ్చటగా పరిశీలిస్తున్న ఓ చిన్నది రావ్ ని దగ్గరకు పిలిచి ఏదో కామెంట్ చేస్తుంది. అందుకు ఎర్రబడిన ముఖంతో వెనక్కి తిరిగి భార్య కేసి ఓ మారు చూసి, ఆ పిల్లతో కలసి అతనూ నవ్వేస్తాడు. ఇదంతా ఓ

split secondలో జరిగి పోతుంది. ఆ తరువాత సుమిత్ర ఎంతో కాజువల్ గా ఆ చిన్నది ఏమన్నదని ఆరా తీస్తుంది. రావ్ కూడా అంతే కాజువల్ గా ఏమనలేదని దాటవేస్తాడు. ఆ తర్వాత కూడా చెప్పండని సుమిత్ర రెండు మూడు మార్లు రెట్టించినా చెప్పక పోగా  ఆ సంఘటన గుర్తొచ్చినట్లుగా అతని ముఖంలో కదిలే చిత్రమైన దరహాసం సుమిత్రకి మరింత మంటని పుట్టిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలనే పంతాన్ని రెట్టింపు చేస్తుంది. ఆఖరి అస్త్రంగా, ఆ ఏర్ పోర్ట్ పిల్ల ఏమన్నదీ చెప్పక పోతే (1980లలో) రెండువేలు ఖరీదు చేసే ఈ సిమ్లా ట్రిప్ కాన్సిల్ చేసుకోవటమేకాక, తాను తన పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుంది. ()డకత్తెరలో ఇరుక్కున్న రావ్, ఆ చిన్నది అన్న మాటలు తాను నోటితో చెప్పలేననీ, ఓ స్లిప్ మీద రాసి బాత్ రూమ్ లో ఉంచుతాననీ, చదివినాక ఇక ఎలాంటి రభస చేయకూడదనీ షరతు పెడతాడు. తనకి పుట్టబోయే పాపపై మరీ

ఒట్టు వేసి ఒప్పుకుంటుంది సుమిత్ర. రాసి పెట్టి వచ్చాక, చదవటం కోసం లోపలికి వెళ్ళిన భార్య రాక కోసం, ఆమె ముఖంలో కదలాడబోయే భావాలను చదవటం కోసం ఎంతో ఆతృతగా, ఆదుర్దాగా వేచిచూస్తున్న రావ్ కి నీకు బుద్ధి లేదు రావ్! కాగితంపై వెయిట్ ఉంచక్కరలేదా? పైగా అది బాత్ రూమ్ కదా!” అని రుసరుసలాడుతూ వస్తున్న సుమిత్ర అగుపిస్తుంది. అతను రాసిన స్లిప్ నీళ్ళల్లో పడి, అక్షరాలన్నీ నాని  అలుక్కుపోతాయి.  “అసలేం జరిగిందంటే….” అంటూ ఈసారి నోటితోనే చెప్పబోతున్న రావ్ కి మధ్యలోనే అడ్డుపడి, ” ఈ విషయంపై ఇక రభస చేయనని పాపపై ఒట్టు వేసుకోలేదా?

Let us drop that topic” అంటూ ఆపేస్తుంది సుమిత్ర. సుమిత్ర నిజంగానే చదవలేదా? లేక చదివేసే చదవలేదనే effect కోసం ఆ స్లిప్ ని తనే కావాలని నీళ్ళల్లో పడేసిందా? తను చదివినట్టు దొరికిపోతే భవిష్యత్తులో ఉండీ ఉడిగీ రావ్ చేయబోయే టీజింగ్స్ కి ఎర అవుతూ ఉండాలి కదా! ఆ ప్రారబ్ధం నుంచి తప్పించుకోటానికి ఈ ఎత్తు వేసిందా? అసలింతకీ ఆ ఏర్ పోర్ట్ పిల్ల ఏమంది? ఈ ప్రశ్నలన్నీ పాఠకునిలోని విక్రమార్కునికే వదిలేసి భేతాళుడిలా గమ్మత్తుగా మాయమైపోతాడు రచయిత.

మనీషిమనీ= షి ఈ కథ ఇతివృత్తం వరకట్న సమస్య. కూతురికి మంచి కట్నం ఇచ్చి పెళ్ళి చేయటం, కొడుక్కి బాగా డబ్బు ఖర్చు చేసి, విద్యావంతుణ్ని చేసి, అతని పురోభివృద్ధికి రాచబాట వేయటం ప్రతి తండ్రి బాధ్యత. ఈ రెంటినీ నిష్పక్షపాతంగా నిర్వహించటానికి చాలినంత ధనం సమకూర్చుకోలేక పోవటమే నేటి మధ్య తరగతి కుటుంబాల ప్రాథమిక సమస్య. ఈ పాత లెక్కకి కొత్త పరిష్కారం ఇవ్వాలనుకుంటాడు లెక్కల మాష్టారు రంగనాథం. తను ఉద్యోగరీత్యా ఆర్జించిందంతా కొడుకు, రాజు, చదువుకే పెట్టుబడి పెడితే, అప్పుడతడు తన ఉన్నత చదువులతో మరో ఉన్నత కుటుంబానికి అల్లుడుగా ఉన్నత కట్నంతో వెళతాడని, అలా వచ్చి పడిన డబ్బుతో తన కూతురికి కూడా మంచి సంబంధం కుదర్చవచ్చని స్టెప్పులు వేసుకుంటూ వెళ్ళిన రంగనాధానికి ఆన్సర్ ఎన్నిసార్లు ప్రయత్నించినా రావటల్లేదు. ఉన్నత విద్యతో ఉన్నతోద్యోగం సంపాదించుకున్న రాజు తండ్రి ఊహలకి విరుద్ధంగా శైలజని ప్రేమించి, కాణీ కట్నం లేకుండా కోడలుని ఇంటికి తీసుకు వస్తాడు. ఇప్పుడు కూతురు శారద గతి ఏమిటి? వదిన శైలజని ఆదర్శంగా తీసుకుని, ఎదురింటి స్టూడెంట్ సుబ్బారావులో కాబోయే భర్తను చూడటానికి ప్రయత్నిస్తుంది శారద. కానీ, సుబ్బారావు సుబ్బారావుగానే ఉంటాగానీ, రాజుగా రాణించలేనంటాడు. శారదకి కూడా ఆన్సర్ రాలేదు. ఆమె లెక్క కూడా తప్పింది. ఈ దేశంలో అందరూ రాజులే ఐతే రంగనాధం లాంటి తండ్రుల లెక్కలకు ఆన్సర్లు వస్తాయంటాడు రచయిత. అది సాధ్యమా?! ఒక సాదా సీదా కథ. అనవసరమైన కథ.

ఈలాఇల్లాలు: ఈల వేసే అలవాటు గల ఇల్లాలు వల్ల ఇంటాయన పడే అగచాట్ల గురించి చెపుతుందీ కథ. చదువుకునే రోజుల్లో, ఓ నాటకంలో ఓ పురుష పాత్రఅదీ ఓ రౌడీ పాత్రని పోషిస్తుంది తాయారు. నాటకవశాత్తూ ఓ చోట ఈల వేయాల్సి వస్తుంది. “నువ్వూరికే ఈల వేసినట్టు నటించమ్మా! బాక్ గ్రౌండ్ లో నేనెవరి చేతో వేయిస్తాలే!” అని మాష్టారు ఎంత చెప్తున్నా వినకుండా; సహజత్వం కోసమని అన్నగారి దగ్గర పట్టుబట్టి నేర్చుకుంటుంది. నాటకం ఐతే అయిపోయింది కానీ నేర్చుకున్న విద్య మాత్రం వదలలేదు. ఈ అలవాటు గ్రహపాటుగా మారి, పెళ్ళి సంబంధాలు కూడా తప్పి పోతుండటంతో, నేర్పిన అన్నగారే మార్గాంతరం యోచించి, ఎలాగోలా పాపారావుతో తాయారుకి మూడుముళ్ళు పడేలా చూస్తాడు. ఇక అప్పటి నుంచీ మొదలైన పాపారావు పాట్లు పాఠకుడికే ఎరుక. హాస్య కథ అని అనలేము కానీ చదువుతున్నంత సేపూ సరదాగా ఉంటుంది. పాపారావు పాట్లని చూసి జాలి పడతాము. ఈ కథని జంధ్యాల తన సినిమా ఆనందభైరవిలో కామెడీ ట్రాక్ గా వాడుకున్నాడు. ఈల వేసే ఇల్లాలుగా శ్రీలక్ష్మి, బాధిత భర్తగా సుత్తివేలు నటించారు.

నీహారిక; నీకు :: ఈ రెండు కథలు ఒకే నాణేనికి చెందిన బొమ్మా, బొరుసు ల్లాంటివి. “నీహారికకథలో కరుణానిధి సెంటిమెంట్స్ అతని కుటుంబ సభ్యుల ప్రాక్టికాలటీ మధ్య నలిగిపోతే జీవితంలో ఎమొషన్సు కి, సెంటిమెంట్సుకి చోటివ్వకుండా

ప్రాక్టికాలిటీ, బిజినెస్ మెంటాలిటీ వృద్ధి చేసుకుంటున్న భర్తని కొద్దిగానైనా మారమని అక్రోశిస్తూ ఆవేదనతో రాసుకున్న

ఓ  భార్య లేఖ నీకుఅనే కథ.

పరస్పరం:: మనిషి బలహీనతలకు బానిస. ముఖ్యంగా మగవాడి విషయంలో ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. పెళ్ళికి ముందు ఏదో ఒక వ్యసనం ఊండని మగవాడు సాధారణంగా ఊండడు. స్త్రీ, తాగుడు, పేకాట, సిగరెట్లు, కనీసం సినిమాలు లేదా

నాటకాలు ఇలా ఏదో ఒక దానికి లొంగిపోనివాడు అరుదు. గమ్మత్తేమిటంటే, ఇలాంటి వ్యసనపరుడూ పెళ్ళి కుదిరిన మర్నాటి నుంచి మారిపోటానికి చాలా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాడు. బుద్ధిమంతుడు అని అందరి చేతా అనిపించుకోవాలి అనే  తాపత్రయం కన్నా, తనక్కాబోయే భార్య తన కోసం ఎన్నెన్నో త్యాగాలు చేయబోతున్నదని, ఆ త్యాగమయి కోసం, ఆఫ్ట్రాల్, తానీ ఒక్క వ్యసనం పరిత్యజించలేడా అనే భావనే ఇందుకు ప్రబల కారణం అంటాడు రచయిత. కానీ ఇదంతా పురాణాల్లోనూ; పుస్తకాల్లోనూ కనిపించే ట్రాషే తప్ప, వాస్తవం తద్భిన్నంగా ఉంటుందనీ, సంప్రదాయాల రీత్యా తనవాళ్ళ నుండి దూరమై వచ్చిన పడతి, వస్తూనే భర్తని కూడా అతని వాళ్ళ నుండి దూరం చేసి వేరింటి కాపురం పెట్టిస్తుందని, సద్దుకు పోవటం, త్యాగాలు చేయటం ఆ నటనలో ఒక భాగమేనని, మ్యాట్నీకి తన కిష్టమైన బురద రాముడుచూసేసి, సాయంకాలం భర్త ఇంటికి రాగానే మీరు వెళ్ళి చూడమన్నారని బాపూ సినిమా పక్కింటి మామ్మగారిని తోడు తీసుకు వెళ్లి చూసొచ్చానని అలవోకగా అబద్ధాలు ఆడేయగలరని, వారి సహనం తాము అనుకున్నది ఆరు నూరైనా నూరు ఆరైనా సాధించటానికే తప్ప

మరెందుకూ కాదని నింపాదిగా తెలుసుకునే భైరవమూర్తి లాటివారు తిరిగి తమతమ పాత వ్యసనాల చెంతచేరుతారని;

ఇలా భార్యాభర్తలు అనునిత్యం పరస్పరం వంచించుకుంటూనే, లోకానికి మాత్రం ఆదర్శ దంపతుల్లా, made for each other గా ఫోజులిస్తూ ఉంటారని….ఇదీ కథ. కథలో కల్పన, శిల్ప చాతుర్యం తక్కువై, వాచ్యం ఎక్కువై పోయింది. రచయిత ఒక దశలో తనని తాను సమాధాన(?)పరచుకోటానికి ఈ కథ వ్రాసి ఉంటాడా అనిపించింది చదవటం ముగించాక. రచయిత కారెక్టర్ పై పత్రికలు లేవనెత్తిన దుమారం ఈ భావనకు అధారమేమో మరి తెలియదు.

సంయమనం:: Portrait Painter అనిల్ దేవ్. చాలామంది కళాకారుల జీవితం లాగానే అతని దాంపత్య జీవితమూ అసంతృప్తిదాయకమే! అతనిని అర్థం చేసుకుని అతనిపై విశ్వాసం పెంచుకోవాల్సిన అతని భార్య అనుక్షణం అనుమాలతో అతనిని , అవమానిస్తూ వేధిస్తుంటుంది. మొదట్లో స్వీయ రక్షణార్థం మాటకు మాట బదులిచ్చినా; తరువాత్తరువాత, కోపం భావుకత్వాన్ని నాశనం చేస్తుందనే ఎరుకతో మౌనంగా ఉండిపోవటం అలవరచుకుంటాడు. అతని ఈ జీవితం ఇలాగే మరికొంత కాలం సాగి ఉంటే అనిల్ అటు ఋషిగానో, ఇటు పలాయనవాదిగానో మారి ఉండేవాడేమో! కానీ అతని కళ కొత్తదార్లు  వెతుక్కుంటూ స్వప్న నర్తనందగ్గరకి చేరుతుంది. ప్రేమ జాలితో ప్రారంభమై, ఆకర్షణతో పెరిగి, అనురాగంతో బలపడి, కోరికతో పరిపూర్ణమవుతుంది అంటాడు రచయిత ఇక్కడ. ఆమె పరిచయం అతనిని ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోతుంది. అంతా ఆనందమే! అందరూ మంచివారే! భార్య కూడా మంచి మిత్రురాలిగా తోపిస్తుంది ఇప్పుడు. మానసికంగా ఎంతో దగ్గరగా దాదాపు ఒక్కటిగా ఐపోయిన అనిల్, స్వప్న శారీరకంగా ఇప్పటికీ ఎడంగానే ఉన్నారని, మనలని నమ్మమంటాడు రచయిత. కారణం: ఇంతకు కొన్ని పేజీల ముందు మనం ప్రకాశరావు దగ్గర నేర్చుకున్న భారతీయ/హైందవ సంప్రదాయం. ఫలితం: తిరిగి ఇంకెప్పుడూ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు కనీసం తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించరాదనే నిర్ణయంతో విడిపోతారు.

నమ్మబుల్ కాని కథ, కథనం.

వేడి:: ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన కథల్లో రెండవది ఇది. వరుసలో పదవది.

ఈ వెధవ ఉజ్జోగానికి ఏమైనా ఇక రాజీనామా ఇవ్వాల్సిందే! ఇవ్వాళే ఇచ్చేస్తా!” రోజుకో సారైనా ఇలా అనుకోక మానడు ప్రతి సగటు ఉద్యోగీ. కట్టుకున్న భార్యని అసహ్యించుకుంటూనే ఆమెతోనే ప్రతి ఏడాదీ కనీసం ఓ జనాభా సంఖ్య ఐనా పెరిగేలా ప్రవర్తించే సాధారణ పౌరుని  లాగానే తన ఉద్యోగాన్ని ద్వేషిస్తూనే రిటైర్మెంట్ వయసు దాకా వచ్చేస్తాడు కానీ ఆ వెధవ ఉజ్జోగానికిమాత్రం రాజీనామా ఇవ్వడు. కారణలని కేవలం వాచ్యంగా కాక, గొప్ప మనో విశ్లేషణతో, అంతకన్నా గొప్పదైన శిల్ప విన్యాసంతో చెప్పిన కథ ఇది. ఉద్యోగం అంటే డబ్బు సంపాయించటానికే కదా అని నోరు చప్పరించేస్తారు ఎవరైనా! కానీ అదెంత మాత్రం నిజం కాదు. పొట్ట నింపుకోటానికి ఉద్యోగమే అవసరం లేదు. కూలీ పని చేసుకున్నా; కూల్ డ్రింకులు అమ్ముకున్నా కడుపు నిండకపోదు. కానీ, ఉద్యోగి జీవితంలో ఉన్న లగ్జరీ, షో, హోదా, డాబు, దర్పం, వగైరా ఏ స్వయం ఉపాధికాలు ఇవ్వలేవు. కూతురు ఐస్ క్రీం అడిగితే; “ఇంట్లో ఉంది కదా ఇస్తానుండండిఅని భార్య అంటున్నా విననట్టుగా, గారాలపట్టీని టయోటాలో, ఫుల్లీ ఏర్ కండిషన్డ్ రెస్టారెంట్ కి  తీసుకువెళ్ళలేడు. భార్యని అద్దాల కేసులో అందాల బొమ్మలా ఉంచటానికి ఇన్సొలిడేటెడ్ కుకింగ్ ఆపరేటస్ కొని ఇవ్వలేడు. పిల్లల్ని డూన్ స్కూల్లో చేర్పించి చదివించలేడు. బామ్మర్ది పెళ్ళికి బంగారు పులిగోరు చైన్ బహుమతిగా ఇవ్వలేడు. అందుకనే డాక్టర్లు, ఇంజనీర్లు కూడా తమతమ లుక్రాటివ్ ప్రొఫెషన్లు వదులుకుని, సివిల్స్ అంటూ నిద్రాహారాలు మానుకుని పరీక్షలు పాసవటానికి ఆ యా ఉద్యోగాలలో ఉన్న ఈ షో, ఈ లగ్జరీనే కారణం. నాగరికత విప్లవాన్ని వ్యతిరేకిస్తుంది. మనసుకి మందు చల్లి జోకొడుతుంది. నాగరికతా  ప్రపంచం  అంటే మత్తు మందులో మునిగి జోగుతున్న వ్యవస్థ అంటాడు రచయిత. ఎంతో శ్రద్ధ తీసుకుని రాసిన కథ.

చివరలో ఇంకో రెండు కథలు ఉన్నాయి. అవి “స్త్రీ / స్త్రీ”;  “టాస్” అనేవి. వాటి ప్రత్యేకత ఏమీ లేదు. మందిలో మరో రెండు. అంతే!

ఈ పుస్తకానికి పరిచయాలు, ప్రశంసలు గట్రా ఏమీ లేవు.

చివరగా చెప్పుకోవలసిన మాట ఒకటి ఉన్నది. ఈ పుస్తకం ఆరు నెలలలోనే పునర్ముద్రణకి వచ్చిందంటే దాని పాపులారిటీ చెప్పకనే చెబుతోంది. సాధారణంగా నవలల్లో ఉండే రీడబిలిటీ కథలలో ఉండదు. అయితే యండమూరి కథలు బాగా పాపులారిటీ పొందటానికి, నవలల్లా హాట్ హాట్ కేకుల్లా అమ్మబడటానికి కారణం అతని శైలి, కథన చమత్కృతి. ప్రతి రచయితకీ ఒక శైలి, ఓ పద్ధతి ఉంటాయి. వీటినే ముద్రలని కూడా అంటూంటారు. ఐతే యండమూరి ప్రత్యేకత ఏమిటి అంటే;

అతను కథ కథకీ శైలిని, కథనాన్ని మారుస్తూంటాడు. పరీక్షగా పరిశీలిస్తే అతని ఏ రెండు కథలు ఒకే రచయిత రాసిన కథల్లా కనపడవు. అతని కొన్ని కథలు చదువుతుంటే, అవి అతని కథల్లా కాక మరెవరో చేయి తిరిగిన ప్రసిద్ధ రచయిత కథ ఇతని పేరుతో పొరపాటున అచ్చయినదా అనే భ్రాంతిని కూడా మనలో కలిగిస్తాయి. అక్కడే ఉంది అసలు కిటుకు.

నవలా, నాటక రచయితగా తన ట్రేడ్ మార్క్ ముద్రని అవలీలగా ఎస్టాబ్లిష్ చేసుకున్నయండమూరి కథకునిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, కథనం ఏర్పాటు చేసుకోకుండా ఓ నూతన పంథా, ఓ కొత్త ఒరవడి అనుసరించాడు. కథ రాయాలని తను అనుకున్న థీమ్ కి, ఎన్నుకున్న ప్లాట్ కి అనువైన శైలి అప్పటికే ఎస్టాబ్లిషై ఉంటే నిర్మొహమాటంగా తను కలిపి పెట్టుకున్న పిండిని సదరు రచయిత శైలీ చట్రంలో వంపేసి, కరకర జంతికల్లాంటి కథలని వండేసి పురాణమ్ సుబ్రమణ్య శర్మగారు ఎన్నార్ నంది విషయంలో చెప్పినట్టుగా ఆరగింపవయ్య! పాఠకా! అని మన ముందు పెట్టేస్తాడు. అద్భుతమైన ఈ కొత్త హైబ్రిడ్ రుచులకి డంగై పోయిన పాఠకులు ఏది ఇంకొంచెం! మళ్ళా కొంచెంఅంటూ ఒక్కొక్క కథా సంపుటాన్ని పదే పదే పలుమార్లు ప్రింట్ అయ్యేలా ఆర్డర్లిస్తారు. ఆరగిస్తారు.

ఈ నా థియరీని ఇప్పుడు పై కథలతో సమీక్షిదాం! “అబద్ధం లాంటి నిజంఅనే  ఈ కథ కొమ్మూరి వేణుగోపాల రావు రచనలా ఉంటుంది. ముఖ్యంగా కథ చివరలో ప్రకాశరావు మనస్తత్వాన్ని వివరిస్తున్నప్పుడు ఉటంకించిన ఉప్మాఇడ్లీపెసరట్టు ఉదంతం కొమ్మూరివారి నవల వ్యక్తిత్వం లేని మనిషిని జ్ఞాపకం చేయక మానదు. అలాగే, యద్దనపూడి సులోచనారాణి బాణీలో రాసినవి లవర్స్ మస్ట్ లెర్న్కథ, ముఖ్యంగా అందులో చివరి భాగం, లేఖా సాహితిగా రాసిన నీకుఅనే కథాను.  “నీహారికలో కరుణానిధి మనోవేదన చదివినాక బుచ్చిబాబు, దయానిధి గుర్తుకి రాలేదంటే వారికి బుచ్చిబాబు ఎవరో తెలిసి  ఉండకపోవచ్చు! స్త్రీ డివైడెడ్ బై స్త్రీ కథ రంగనాయకమ్మగారి ధొరణిలో వ్రాసినది. ఇక టైటిల్ కథ ఆ ఒక్కటీ అడక్కు!” ఈ కథ పక్కన రచయిత పేరు ముద్రించకపోతే ఇది తప్పకుండా ఇచ్చాపురపు జగన్నాధరావు గారి కథేనంటారు తెలుగు కథా సాహిత్యాన్ని మథించిన ఎవరైనా! ఈ కథలోని సుమిత్రా, రావులు, ఇచ్చాపురపు వారి సుజాతా, రావులను పుణికి పుచ్చుకు పుట్టారు. భార్యాభర్తల గిల్లికజ్జాలకి అందంగా అక్షర రూపం ఇచ్చిన నలుగురైదుగురు రచయితలలో ఇచ్చాపురం వారు ఒకరు. రామలక్ష్మీఆరుద్ర (వీరి జంట పార్వతీ కృష్ణమూర్తులు)కథలు, మునిమాణిక్యం వారి కాంతం కథలుఈ కోవలోకే వస్తాయి. అలా అని యండమూరి కథలన్నీ అనుకరణలు, అనుసరణలు అని తొందరపడి తీర్పిచ్చేయకూడడు. ఒక్కో రచయితకి ఒక్కో కథన చమత్కృతి, శైలి విన్యాసం ఉన్నట్లే; కొన్ని ప్రత్యేక తరహా కథలని కొన్ని ప్రత్యేక తరహా శైలీ, కథనాలు అవసరం అవుతాయి. తప్పదు. మన దగ్గర ఉన్న ఇతివృత్తానికి సరిగ్గా సరిపడే శైలి, కథనం వేరే రచయిత() ద్వారా అప్పటికే  నలగబడి, పాపులరై ఉంటే దానిని నిర్భీతితో నిర్లజ్జగా అనుసరించటంలో ఎలాంటి ఆక్షేపణా ఉండదు. సంఘం మీదా, సంప్రదాయ సంస్కృతుల మీదా సెటైరికల్ గా బాణాలు విసరాలనుకుంటే; పానుగంటి, ముళ్ళపూడి దంచేసిన హాస్య వ్యంగ్య శైలిని అనుకరించక తప్పటం లేదు కదా! అందుకనే, ఇదివరలో ఆంధ్రపత్రికలో అడపాదడపా వచ్చిన తన బ్రెయిన్డ్రెయిన్ కథలని ఎమెస్కో పాకెట్ బుక్ గా సంకలితం చేస్తూ ఇలాంటి కథలని హాస్య, వ్యంగ్యంగా ముళ్ళపూడి, పార్కిన్న్ ల పద్ధతిలోనే చెప్పటం మేలని వారినే ఫాలో అయానని ముందుగానే చెప్పుకున్నాడు ఆ రచయిత క...శర్మ. రచయిత మొట్ట మొదటి బాధ్యత తను చెప్పదలచుకున్నది సూటిగా  పాఠకుని బుర్రలోకి ఎక్కించటం. అందుకుగాను ఓ పాపులర్ కథన పద్ధతిని అనుసరిస్తే అది ఆక్షేపణీయంగా ఎందుకు భావించాలి. ఈ సంపుటిలోని అన్ని కథలూ పరస్పరంలాగానే చప్పబడిన (insipid) శైలిలోనే సాగితే, ఇలా ఈ పుస్తకం గురించి మన పుస్తకం నెట్లో చర్చించుకునేవారమా?

ఇక రచయిత స్వంత శైలి, స్వీయ ప్రతిభ అంటారా! అందుకు ఈ సంపుటిలోని వేడిఒక్కటి చాలు.

ఆ కథని యండమూరి తప్ప మరి ఏ ఇతర రచయిత రాయలేడు. రాయలేదు. రాయడు.

ఈ పుస్తకం వర్తమాన వెల, వగైరా వివరాలు తెలుసుకోవటానికి యండమూరి ప్రస్తుత ప్రచురణకర్తలు

నవసాహితి బుక్ హౌస్, ఏలూరు రోడ్, విజయవాడ—520002.” సంప్రదించగలరు.

.

You Might Also Like

5 Comments

  1. varaprasaad.k

    కొందర్ని చూస్తే జాలేస్తుంది,అంటే కాదు బాధ కూడ వేస్తుంది,ముఖ్యంగా మన తెలుగు లోనే ఈ రకమైన సంఘటనలు చోటు చేసుకోడం నిజంగా దౌర్బాగ్యం.

  2. varaprasaad.k

    సంతోషం సాయి గారు నేరేషన్ చాలా బావుంది.

  3. రవి

    ఓ సారి ఈ లంకె చూడండి.

  4. చంద్ర మోహన్

    మంచి పరిశీలన! సమీక్ష చాలా బాగుంది. ఐతే చాలా సబ్జక్టివ్ గా ఉంది. ముఖ్యంగా రెండు వాక్యాలు:
    1. రచయితల గుర్తింపు వారి పొడుగాటి పేర్ల వలన వచ్చిందన్న ఊహ
    2. నవలల్లో ఉన్న రీడబిలిటీ (సాధారణంగా) కథల్లో ఉండదన్న మాట

  5. సౌమ్య

    బాగా రాసారండీ!
    మీ సమీక్ష చూసి, అర్జెంటుగా యండమూరి కథలు చదవడం మొదలుపెట్టాను.ఇప్పటిదాకా
    చదివిన రెండూ – నాకు ఆల్రెడీ చదివేసిన కథాంశాల్లా అనిపించాయి…ఇక మిగితావి ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply