స్నేహ బుక్ హౌస్ – బెంగళూరు వారితో

స్నేహా బుక్ హౌస్’ (శ్రీనగర్, బెంగళూరు) యజమాని పరశివప్ప తో మా సంభాషణ.  (ఈ సంభాషణ వెనుక కథ ఇక్కడ చదవండి)

(సంభాషణ కన్నడ లో నడిచింది. నా కజిన్ సింధు నాకూ, పరశివప్ప గారికీ మధ్య వారధి. అందుకు తనకి ధన్యవాదాలు. మా వైపు నుండి పరిచయాలు అయ్యాక)

మీ షాపు ఎన్నాళ్ళ నుంచీ ఉంది? మీకు పుస్తకాల షాపు పెట్టాలి అని ఎందుకనిపించింది?

స్నేహా బుక్ హౌస్’ అన్నది ’స్నేహా విజన్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ అన్న సంస్థలో ఒక భాగం. అది నాదే. బుక్ షాప్ సంవత్సరమున్నరగా ఉంది. నేను మార్కెటింగ్ లో పని చేసేవాడిని. అయితే, నాకు పుస్తకాభిమానం ఎక్కువ. కన్నడ సాహిత్యం విరివిగా చదివేవాడిని. ఆ అసక్తితోనే ఈ బుక్ షాపు తెరిచాను. ఇప్పుడు కూడా మార్కెటింగ్ చేస్తున్నాననుకోండి. వారానికి ఒకట్రెండు రోజులు ఇక్కడ ఉంటాను. మా అసిస్టెంట్లు చూస్కుంటారు. నేను ఈ షాపు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన మార్కెటింగ్ పనులను చూస్తూ ఉంటాను.

షాపు ని చాలా బాగా తీర్చి దిద్దారండీ. రచయితల వారీగా అమర్చిన పద్ధతి బాగుంది

థాంక్స్. షాపులో ప్రస్తుతం పదివేల దాకా టైటిల్స్ పెట్టాము. ఇంకా చేర్చాలనే ప్రయత్నిస్తున్నాము.

మీకేమైనా వెబ్సైట్ ఉందా?

లేదు.

ఉంటే, ఎక్కువమందికి తెలుస్తుంది కదా.

పెట్టాలన్న ఆలోచన ఉంది. ప్రస్తుతానికి నలభై పుస్తకాలను వేశాము. ఇంకో పది పుస్తకాలను వేశాక, అప్పుడు వెబ్సైటు గురించి ఆలోచిస్తాము.

ఈ షాపు ఉన్నది కమర్షియల్ ఏరియా అనలేం కదా. మరి మీకు పబ్లిసిటీ అదీ ఎలా వస్తుంది? మీకు సేల్స్ ఎలా ఉంటున్నాయ్?

మీరన్నది నిజమే కానీ, ప్రధానంగా మా పబ్లిసిటీ అంతా ’వర్డ్ ఆఫ్ మౌత్’. ఇక్కడికి వచ్చిన వారు ఇతరులకి చెప్పడంవాళ్ళు మరొకరికి..ఇలా. పెద్ద సెంటర్లో లేకపోయినా కూడా ఇక్కడికి చాలా మంది జనం వస్తూంటారు. సేల్స్ బాగానే ఉంటున్నాయ్.

మామూలుగా ఏ వయసు వారు ఎక్కువగా వస్తూంటారు? ఏ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడౌతాయి?

పిల్లల పుస్తకాలు, ఆధ్యాత్మికం ఎక్కువగా అమ్ముడుపోతాయి.

(నా సోది: పర్సనాలిటీ డెవెలప్మెంట్..అంటారేమో అనుకున్నా!)

కువెంపు, మాస్తి ఇటువంటి రచయితలవో?

అవంతా సాహిత్యం ఎక్కువ చదివే అలవాటున్న వారే కొంటూంటారు.

యువతఅంటే ..ఇరవైలు, ముప్పైల వారు వస్తూంటారా?

మరీ ఎక్కువ కాదు కానీ, ఇప్పుడు కొంచెం వస్తున్నారు.

మీ వద్ద కన్నడ పుస్తకాలకి ఆంగ్ల అనువాదాలు లభ్యమౌతాయా?
ఇంగ్లీష్ నుండి కన్నడకి చాలా పుస్తకాలు అనువాదాలౌతూ ఉంటాయి. చాలా తెలుగు పుస్తకాలు కూడా అనువాదమౌతూ ఉంటాయి.

అవునుచలం పుస్తకాలు చూసాను బెంగళూరు బుక్ ఫెస్ట్ సమయంలోకానీ ….  నేను అంటున్నదినాకు కన్నడ రాదు కానీ, కన్నడ సాహిత్యం గురించి తెలుసుకోవాలనిపించింది అనుకోండిఅప్పుడు చదివేందుకు అనువాదాలు ఉండాలి కదా?
కన్నడ పుస్తకాలు ఆంగ్లం లోకి అనువాదం అయ్యేది కొంచెం అరుదనే చెప్పాలి. భైరప్పా, అనంతమూర్తి ఇలా ప్రముఖుల పుస్తకాలు తప్పిస్తే అనువాదాలు జరిగింది తక్కువే.

అవును, వీరి అనువాదాలు నేనూ చదివాను. కానీ, మరి కన్నడేతరులకి కన్నడ సాహిత్యం గురించి చెప్పాలి కదా మీ బోటి వారు?
మీరన్నది నిజమే. భవిష్యత్తు లో అలాంటి పనులు చేసే ఆలోచనలు ఉన్నాయి.

కొత్తగా కన్నడ సాహిత్యం తో పరిచయం ఏర్పడుతున్న వారికి ఇక్కడ ఏమన్నా పుస్తకాలున్నాయా?
ఎవరన్నా అలాంటి వారొస్తే, కాసేపు వారితో మాట్లాడితే వారికి ఎలాంటి పుస్తకాలు నచ్చుతాయో అర్థమౌతుంది కదా. దాన్ని బట్టి వారికి పుస్తకాలు సూచిస్తాను. ఎందుకంటే, వారికి ఆసక్తి కలిగించే పుస్తకాలు సూచిస్తేనే కదా, మళ్ళీ వచ్చి కన్నడ పుస్తకాలు చదివేది..


నిజమే లెండి. ఇంతకీ, పుస్తకాల సేకరణ ఎలా జరుగుతుంది? ఇక్కడ లేని పుస్తకాలు కావాలంటే తెస్తారా?
నేను విరివిగా చదువుతాను, అలాగే, కస్టమర్స్ వచ్చినపుడు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి, ఎ తరహా పుస్తకాలను ఎక్కువగా అడుగుతున్నారు? ఇలాంటివి గమనించి పుస్తకాలు తీసుకొస్తాను. మీకేదన్న పుస్తకం ఇక్కడ దొరకలేదు కావాలి అంటే తెప్పించగలను.

(ఇక్కడ కాసేపు పుస్తకం.నెట్, తెలుగు అనువాదాల గురించి అడిగారు)

ఒకటిన్నర సంవత్సరాల్లో ఈ స్థాయికి ఎలా వచ్చారు?
(
నవ్వు)

మీకు లాభ నష్టాలు ఎలా ఉన్నాయి?

మొదటి ఏడాది కొంత నష్టం వచ్చింది కానీ, వీ బ్రోక్ ఈవెన్ నౌ.

అయితే, గమనం సాఫీగానే సాగినట్లా?

స్వతంత్రంగా చేస్తున్న ఏ వ్యాపారానికైనా కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అది సహజం. ఓపిక పట్టడం తప్పనిసరి.

ఈ రిలీజ్ ఫంక్షన్ కాకుండా మీరు ఇంకా ఏమన్నా సమావేశాలు అవీ జరిపారా?
జరుపుతూ ఉంటాము. మెంబర్ షిప్ కార్డులు ఇవ్వడం, రీడింగ్ సెషన్స్ నిర్వహించడం, సాహితీ సభల వద్ద స్టాల్స్ నిర్వహించడం ఇలాంటివి చేస్తూ ఉంటాము.
(ఏదో రమేష్ అరవింద్ చిత్రం షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందన్నారు. ఆ సినిమాలో కొంత భాగం ఒక పుస్తకాల కొట్టు నేపథ్యం లో జరుగుతుందట)

ఇక్కడికి ఇక ఎం మాట్లాడాలో తోచక ఆగాము. కాసేపు షాపులో తిరిగి, ఫోటోలు అవీ తీసుకుని, పరశివప్ప గారికి థాంక్స్ చెప్పి, మరోసారి వారి పనితనానికి ముచ్చటపడి, బయటపడ్డాము.
తప్పకుండా మా బుక్ రిలీజ్ కి రండి అని ఆహ్వానించారు కానీ, వెళ్ళడానికి కుదరలేదు.

Contact Details:
Sneha Book House (Publishers and Book sellers)

#34, 50 Feet road, Next to Sri Ayyappa Swamy Temple

Raghavendra Block, Srinagar, Bangalore-50

Ph: 080-26752812

Email: snehabookhouse@gmail.com

You Might Also Like

One Comment

  1. విజయవర్ధన్

    Contact details ఇచ్చినందుకు ధన్యవదాలు. వీరు discount ఏమైనా ఇస్తారా?

Leave a Reply