జనాభిప్రాయాన్ని విరోధించి, ఔన్నిజమే అనిపించే కవితా వ్యూహం

రాసిపంపినవారు: హెచ్చార్కె

విన్నకోట రవిశంకర్ ఇటీవల వెలువరించిన కవితా సంపుటి: ‘రెండో పాత్ర’

‘కుండీలో మర్రి చెట్టు’ అంటూ పెద్ద ప్రపంచాన్ని చిన్న పుస్తకంలో చూపించిన కవి, ‘వేసవి వాన’లో(ఈ పుస్తకం పై – పుస్తకం.నెట్లో, ఈమాటలో వచ్చిన వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ – పుస్తకం.నెట్) మనల్ని సేద దీర్చిన కవి విన్నకోట రవిశంకర్. ఆయన మూడో సంపుటిగా వెలువరించిన ‘రెండో పాత్ర’ మునుపటి కవిత్వ సౌరభాలు వదులుకోకుండా, కొత్త అందాలను పరిచయం చేస్తుంది. పుస్తకం మొదలెట్టిన కాసేపట్లో తనదైన తర్కం లోనికి తీసుకెళ్లి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తుంది. కవిత్వం చదువుకున్న సంతోషంతో పాటు, జీవితం గురించి మరి కొంచెం తెలుసుకున్న అనుభూతి నిస్తుంది.

ఊరి పలుకుబడిలో చెప్పాలంటే, రచనలో రవిశంకర్ ఎప్పుడూ ‘ఎచ్చులకు పోడు’. ఢమఢమలు ఉండవు. శబ్దం అర్థానికి సేవ చేస్తుంది. తను దాగి ఉండి అర్థాన్ని ముందుకు తెస్తుంది. పదాలతో కవి ఏం చేస్తున్నాడో తెలుసుకునే లోపు, తను చేయాల్సింది చేసి తప్పుకుంటాడు. భాషలోనే కాదు, చెప్పే విషయంలోనూ అంతే. మనందరి రోజు వారీ జీవితమే, మనం అలా చూడలేదంతే. భావాలు చిక్కులు పడవు. కల్పించే దృశ్యాల్లో మడత పేచీలుండవు. సూటిగా, ప్రేమగా, భుజం మీద చెయ్యి వేసి మనతో నడుస్తున్న స్నేహితుడిగా పద్యం చెబుతూ మనస్సులను వెలిగిస్తాడు. ఇవి రవిశంకర్ మునుపటి కవనంలో కూడా ఉన్న సుగుణాలే.

మునుపైనా ఇపుడైనా రవి శంకర్ పద్యాలు చాల నిరాడంబరంగా ఉంటూ అంతగా ఆకట్టుకోడానికి కారణం ఏమిటని, ఈ పుస్తకంతో గడుపుతున్నప్పుడు నేను విచికిత్సపడ్డాను. అన్నీ కాదు గాని, ఈ పుస్తకంలోని చాల పద్యాల్లో ఒక పద్ధతిని గమనించాను. అది చెప్పడమే ఈ చిన్న వ్యాసం ఉద్దేశం.

సాధారణంగా జనం అనుకునే దాన్ని విరోధిస్తే, వెంటనే కోపం వస్తుంది. కవి ‘ఇలా అంటాడేంటీ’ అనైనా అనిపిస్తుంది. రవిశంకర్ చాల పద్యాల్లో ఆ పని చేస్తాడు. కోపం రాకపోగా, ఔను, ఆయన అంటున్నది నిజమేనని అనిపిస్తుంది. భిన్న యోచన మొలకెత్తుతుంది. ఇదొక మంచి కవితా వ్యూహం. మొదట అసంగతం అనిపించి, అంతలోనే సంగతత్వంతో అబ్బుర పరిచే వాక్యాలు చదువరికి కొత్త చూపునిస్తాయి. జనం వేటిని ఆలోచించడానికి బద్ధకమేసి, పొడి పొడి జవాబులతో పక్కకు నెట్టి, తప్పుకుంటారో వాటిని మరింత లోతుగా చూడ్డానికీ, బతుకు బరిలో నిలబడడానికి ఈ పద్యాలు ఉపయోగపడతాయి.

వస్తు, రూపాలలో దేని వైపు నుంచి చూసినా ఇదొక కవితా గుణం. దీన్ని అలంకార శాస్త్రంలో ‘కన్సీట్’ అనవచ్చనుకుంటా. (ఇక్కడ రాయడం ఆపి, ‘వికీపీడియా’ను అడిగి చూశాను. ‘conceit’ కు దాదాపు ఆ అర్థమే ఉంది). పేరు ఏమైనా, ఇది కవిత్వానికి భలే మంచి పని ముట్టు. సాధారణంగా కన్సీట్‍ ప్రయోక్తలు అబ్బుర పరచడం కోసం సంక్లిష్టతను వాడుకుంటారు. క్లిష్టమైన పొడుపు కథ చెప్పి, దాన్ని విప్పినప్పుడు పాఠకుడికి కలిగే ఒక రకం సంతోషం ఇస్తారు. రవి శంకర్ కవితల్లో సంక్లిష్టత ఉండదు. ఇంకేవేవో తెలుసుకుంటే గాని, ఇది అర్థం కాని పరిస్థితి ఎక్కడా కల్పించడు. భోజనం బల్ల మీదే అన్నీ ఉంటాయి. పాఠకుడు ఇంటి నుంచి ఏమీ తెచ్చుకోనక్కర్లేదు. పాఠకుడు తన పుస్తకంలోనికి వచ్చిన అతిథి. అతడిని/ఆమెను కవి ‘అండర్మైన్’ చేయడు. అది రవి శంకర్ తత్వానికే విరుద్ధం.

జనం ‘ఔను’ అనుకునేదాన్ని ‘కాదు’ అని ప్రకటించి, అందుకు వారిని ఒప్పించడం వల్ల, వాళ్లు కొత్తగా అలోచించడం మొదలెడతారు. ఉదాహరణకు, సన్యాసిగా బతకడం చాల కష్టమని అందరూ అనుకుంటారు. విన్నకోట రవిశంకర్ ఉన్నట్టుండి లేచి నిలబడి

‘పరిత్యాగి కావడానికి
వదులుకోవలసిందేమీ లేదు
సంసారికే సర్దుబాటు కావాలి.’

అని ప్రకటిస్తాడు. పరిత్యాగి అంటేనే వదులుకునే వాడని అర్థం. మరి ఈయన ఇలా అంటాడేమిటి అని వెంటనే కొంచం కోపం వస్తుంది. మరుక్షణం, మంచి సన్యాసి కావడం కన్న మంచి సంసారిగా బతకడం కష్టమని గుర్తుకొస్తుంది. ఔను కదా అనుకుంటాం. ఎవరికైనా అలా అనిపించకపోతే, వారికి, పద్యం ముందుకు సాగే కొద్దీ కొద్ది కొద్దిగా కవి స్నేహ హస్తం అందుతుంది.

రవి శంకర్ చెడ్డ సన్యాసిని మంచి సంసారితో పోల్చ లేదు. వైస్ వెర్సా కూడా కాదు. మంచి సన్యాసిని మంచి సంసారితో పోల్చాడు. ఇందులో అనవసర తర్కానికి తావు లేదు.

‘సమాధానాలు వెతకటానికి
అసంతృప్తి చాలు
సమాధాన పడడానికి
సంయమనం కావాలి’

అనే పంక్తులు ఒకేసారి పలు భావాల్ని నిద్ర లేపుతాయి. బతుకులో అసంతృప్తి ఎలాగూ ఉంది. వ్యక్తుల్లో, సమూహాల్లో… ఎక్కడ చూసినా ఉంది. సమాధాన పడి మరొక రోజును ఇష్టంగా‍ బతకడానికే సంయమనం అవసరం. ఇది ప్రతి ఒక్కరిలో కనీసం రోజుకు ఒకసారి కదిలే మానసిక కెరటమే. ఇక…

‘అంతరంగాన్ని పులిచర్మంలా పరిచి
కళ్లు మూసుకొని ధ్యానించటం కంటె
అపుడపుడు కనులొత్తుకోవటానికి
దానిని రుమాలుగా మడిచి
భద్రపరచటమే కష్టం.’

అంటూ పాఠకుడి చేయి పట్టుకుని బతుకు లోతుల్లోకి తీసుకుపోతాడు. కనులొత్తుకోడానికి పనికి రాకపోతే పులి చర్మమైనా, జేబురుమాలైనా ఎందుకు? కాసేపు అలా ఎవరి అంతరంగంలో వారిని తిరగనిచ్చి, మళ్లీ…

‘జ్ఞానార్థిగా మారి
చెట్టుకింద సేద తీరటం కంటె
అడుగడుగునా పల్లేరులై గుచ్చుకునే రోజుల్ని
విడిపించుకుంటూ నడవడమే కష్టం
నేనెవరన్నది తెలుసుకోవటం
ఎంత కఠినమో తెలియదుగాని,
నీకై నువ్విచ్చుకున్న నిర్వచనాలన్నీ
ఒకటొకటిగా మర్చిపోవటమే కష్టం’

అని తెగేసి చెబుతాడు. మనుషులు తమకు తాము ఇచ్చుకునే నిర్వచనాలకూ లోకం వారిని చూసే చూపుకీ పొంతన కుదరకనే కదా ఇన్ని గలాటాలు?

రవి ఈ పద్యంలో ముక్తి మార్గ అన్వేషులను వ్యతిరేకించడం లేదు. ‘నేనెరరన్నది తెలుసుకోవటం ఎంత కఠినమో’ తనకు ‘తెలియద’నేసి తప్పుకున్నాడు. వారు రవిశంకర్ కవితా విషయం కాదు. సంసార్లు, మీరూ నేనూ, జీవితమే తన కవితా వస్తువు. చేతికి అందిన జీవితాన్ని ఇష్టంగా జీవించాలి. అదే చాల అవసరమైన, కష్టమైన పని. దాని కోసమే సమాధానపడడం, సంయమనం, రోజుల పల్లేరులను వదిలించుకోడం, నీకు నువ్విచ్చుకున్న నిర్వచనాలను మరిచిపోవడం… అన్నీ.

ఫీట్లు చేయాలని, కష్టమైన పనులు చేసి చూపాలని ‘నువ్వు’ అనుకుంటున్నట్లైతే, నాయనా, ఎక్కడికో పోనవసరం లేదు, ఇక్కడే ఇప్పుడే (నువ్వు ఎక్కడుంటే అక్కడే) అలాంటివి చేసి ఔరా అనిపించుకో వచ్చు. అదే మాటను కవి బోధకుడిగా కాకుండా భావుకుడిగా చెబుతున్నాడు.

రవిశంకర్ పుస్తకంలో ఇలాంటి పద్యాలు చదువుతుంటే వేమన గుర్తుకొస్తాడు.

సందేశం కవిత్వం పని కాదు. నిజమే. సాము గరిడీలు చేసి వహ్వా అనిపించుకోడం కూడా కవిత్వం పని కాదు.

పద్యం చదువుతుంటే పాఠకుడి మస్తిష్కంలో ఏదో మెరవాలి. దాని వల్ల, బతుకు మీద మరి కొంచెం ప్రేమ కలగాలి. లేదా, చెడుగు మీద నిజమైన ఆగ్రహం కలగాలి.

అది జరగాలంటే, ఆ మెరుపేదో ముందుగా కవి మస్తిష్కంలో మెరిసి ఉండాలి. తరువాత దానికి తగిన వాహికను వినియోగించి ఉండాలి. ఆ రెండు పనులు జరగిన సందర్భాలు ‘రెండో పాత్ర’ కవితా సంపుటిలో పలు మార్లు దర్శనమిస్తాయి.

ఇలా సాధారణ భావాన్ని ‘రివర్స్’ చేసి, పాఠకుడిని తనతో తీసుకుపోయే పద్యాలు ఈ సంపుటిలో చాల ఉన్నాయి. కవి చేసే పనినే వస్తువుగా తీసుకుని రవిశంకర్ చెప్పిన కవిత దీనికి మరో మంచి తార్కాణం.

కవికి పద్యం రాయాలని ఉండి రాస్తాడని అందరం అనుకుంటాం. అది నిజం కూడా. ఈ భావనను తిప్పేసి కవికి సంబంధించిన మరో పార్శ్వాన్ని, రాయడంలో ఇమిడి ఉన్న వేదనను చాల బలంగా చెప్పాడు ‘ఒకోసారి’ అనే కవితలో రవిశంకర్. ‘నాకెందుకురా నాయ్నా ఈ బాధ’ అని ప్రతి కవి ఒక్కసారైనా అనుకుని ఉంటాడు. రవి ఆ క్షణాన్నిపట్టుకుని,
దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చూసే పద్ధతి ముచ్చట అనిపిస్తుంది. పుస్తకం రుచి తెలియడానికి, కవిత పూర్తి పాఠం:

‘పద్యం రాయాలని ఉండదు
అంతరంగ వధ్యశిలపై
మరొకమారు తలవంచాలని ఉండదు.

ప్రమాద సూచికలాగా
పాదం ఒకటి మెదిలితే చాలు
మనసంతా ఆరాటంతో
తడిసి ముద్దవుతుంది
వత్తి అంటుకున్న సీమటపాకాయలాగా
బెంబేలెత్తుతుంది.
ఎన్ని విస్ఫోటనాలెదురైనా సరే
ఇక దీనిని తలకెత్తుకోక తప్పదు.
అసంపూర్ణ పద్యాన్ని మోస్తున్నంత సేపూ
ఆందోళనగానే ఉంటుంది
పల్లెటూళ్లో ప్రసవవేదన పడుతున్న స్త్రీని
బండిలో వేసుకుని బయల్దేరినట్టుగా ఉంటుంది
జీవన్మరణాలకి బాధ్యత వహించే
ఇంత బరువుని మరి మోయాలని ఉండదు.
పొడిపొడి మాటలు చాలవు
పరిచిత దృశ్యాలు పనికి రావు
తెలియని అడవిదారుల వెంట
తెలవారేదాకా సాగే అన్వేషణకి మళ్లీ
తెరతీయాలని ఉండదు.
పద్యం రాయాలని ఉండదు.’

ఈ పుస్తకానికి వెల్చేరు నారాయణ రావు గారు ఒక అందమైన వెనుక మాట సమకూర్చారు. “ఈ పద్యాలు ఎలా చదవా”లో చెప్పారు. “ఇందులో అలజడి లేదు, ఆందోళన లేదు. తెచ్చిపెట్టుకున్న ఆకలి కేకలు లేవు. సమస్యల చట్టుబండల సాలుగూళ్ళు లేవు.” అని వెల్చేరు వ్యాఖ్యానించారు. తెచ్చిపెట్టుకున్నవి ఆకలి కేకలయినా, ఖరీదైనా కేకులైనా బాగోవు. కవిత్వం కాలేవు. ఎవరి కవిత్వంలోనైనా ఆకలి, అలజడి, ఆందోళన, సమస్యలు ఉంటే, అది (దానికది) దోషం కాదు. ఎవరి కవిత్వంలోనైనా అవి లేకపోతే, లేకపోవడం (దానికదే) గుణం కాదు. రెండు వైఖరుల్లో ఏదీ ‘తెచ్చి పెట్టుకున్నది’ కాగూడదు. రవి కవిత్వంలో అలజడి, ఆందోళన వంటివి లేవనే మాట మాత్రం, చాల వరకు నిజం. నారా మాటల్లోనే చెప్పాలంటే; ‘ఈ కవిత్వం నిండా పరుచుకుని మన చుట్టూ వున్న అమాయక ప్రపంచం ఉంది… … మనం మరిచిపోయిన వాటిని మళ్లా చూస్తున్నట్టు స్వచ్ఛంగా పట్టుకొస్తుందీ కవిత్వం”.

-హెచ్చార్కె
24-8-2010

You Might Also Like

8 Comments

  1. Kinige Newsletter 21 April 2012 | Kinige Blog

    […] రెండో పాత్రసమీక్ష ‘కినిగె’పై […]

  2. పుస్తకం » Blog Archive » బాహ్య ప్రపంచపు మసి వదిలి తళతళలాడే ‘ రెండో పాత్ర’

    […] లో హెచ్చార్కె గారు రాసిన వ్యాసం ఇక్కడ, మూలా సుబ్రహ్మణ్యం గారి వ్యాసం […]

  3. పుస్తకం » Blog Archive » “రెండో పాత్ర”లో చిక్కని కవిత్వం

    […] గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు. అలాగే, కె.వి.ఎస్.రామారావు […]

  4. సౌమ్య

    @Ravishankar:
    Thanks a lot.
    I roamed around different shops in Hyd for ‘Vesavi Vaana’ back in early 2007 or so… and finally gave up.

  5. రవిశంకర్

    ధన్యవాదాలు. హైదరాబాదులో ఈ పుస్తకం నవోదయా బుక్ హౌస్ లో దొరుకుతుంది. రెండో పాత్ర, వేసవి వాన కాపీలు ఈ క్రింది అడ్రసుకి సంప్రదించి కూడా పొందవచ్చు :

    V.Phaneendra
    G2 Indra Heritage Apartments
    Ashok Nagar Extn
    Hyderabad-500020
    Phone :(040)27671494

  6. కొత్తపాళీ

    మిత్రులు రవిశంకర్ కొత్త కవిత్వ సంపుటి వెలయించినందుకు సంతోషం. ంఈ సమీక్ష బావుంది.

  7. Srinivas Vuruputuri

    మంచి పరిచయం! హైదరాబాదులో ఈ కవితా సంపుటి లభిస్తుందా?

  8. kvrn

    పద్యం చదువుతుంటే పాఠకుడి మస్తిష్కంలో ఏదో మెరవాలి. దాని వల్ల, బతుకు మీద మరి కొంచెం ప్రేమ కలగాలి. (లేదా, చెడుగు మీద నిజమైన ఆగ్రహం కలగాలి).
    very well said. similar to Arudra’s definition of good poetry.

Leave a Reply