మాలతి గారి రీడింగ్ లిస్టు

[నిడదవోలు మాలతి గారి గురించీ, ’తూలిక’ గురించీ – ఆన్లైన్ తెలుగు చదువరులకి పరిచయం అక్కర్లేదు కదా. మాలతి గారి రీడింగ్ లిస్టు ఇదిగో! ఈ వ్యాసం నుండి తూలిక/తె.తూలిక కు గానీ వరదల్లా వెళ్ళే లంకెల గురించి మేము నిస్సహాయులం – ఎందుకంటే, కొందరి కథలు/కొందరి గురించిన వ్యాసాలూ – ఆన్లైన్ సెర్చ్ లో తూలికల తీరానికే చేరుస్తున్నాయి మరి! -పుస్తకం.నెట్]

ఈ జాబితా తయారు చెయ్యడం నాకు చాలా కష్టమయింది. ఎందుకంటే అసలు నాకు చదువే తక్కువ. ఆపైన గుర్తున్నవి మరీ తక్కువ. అందులోనూ నాకు చిన్నకథలంటే మక్కువ ఎక్కువ. అంచేత నేను చదివిన బృహద్రంథాలు, ఈ అట్టనించీ ఆ అట్టవరకూ చదివినవి ఒక్కచేతివేళ్ళమీద కూడా లెక్కపెట్టలేం. అంచేత, నిలుచున్నపాళాన అడిగితే చెప్పగల పేర్లు ఇక్కడ ఇస్తున్నాను.

1. ఆరుద్ర – త్వమేవాహం, కూనలమ్మ పదాలు, వేమన్న వేదం, సమగ్రాంధ్ర సాహిత్యం (ఇవి నెలవారీగా ప్రచురించిన రోజుల్లో ఆవురావురంటూ ఎదురు చూస్తూ. చదివిన ఏకైక బృహద్గ్రంథం).

2. రాచకొండ విశ్వనాథశాస్త్రి – ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, అల్పజీవి.

3. మల్లాది రామకృష్ణశాస్త్రి – కథలు

4. ఇచ్ఛాపురపు జగన్నాథరావు – కథలు

5..లత – ఊహాగానం, గాలిపడగలూ-నీటిబుడగలూ.

6. భానుమతీ రామకృష్ణ – అత్తగారి కథలు

7. ముళ్ళపూడి వెంకటరమణ – ఋణభ్రమణం, మహరాజు-యువరాజు, ఇతర చిన్న కథలు.

8.ఆచంట శారదాదేవి – పారిపోయిన చిలుక (సంకలనం), ఒక్కనాటి అతిథి (సంకలనం)

9. బలివాడ కాంతారావు – గోడమీద బొమ్మ, దగా పడిన తమ్ముడు

10, శారద (యస్. నటరాజన్) – మంచీ-చెడూ, అపస్వరాలు

11. కనుపర్తి వరలక్ష్మమ్మ – కథలు (నేను చదివినవి కుటీరలక్ష్మి, కథ ఎట్లా ఉండాలె. ఆవిడ రాసిన పెన్షను పుచ్చుకున్ననాటి రాత్రి చాలా గొప్పకథ అని విన్నాను. ఆవిడ రాసిన శారదలేఖలు కూడా చదవాలి ఎక్కడయినా దొరికితే).

12. కె. కె. రంగనాథాచార్యులు – తొలినాటి తెలుగు కథానికలు. మొదటినుంచీ 1930 వరకు.

13. పోరంకి దక్షిణామూర్తి. కథానికా వాఙ్మయం

14. లక్ష్మణరెడ్డి. తెలుగు జర్నలిజం

15 నాయని కృష్ణకుమారి – ఏం చెప్పను నేస్తం (కవితలు)

16. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ – సాహితీ రుద్రమ

17. ముద్దుక్రిష్ణ (సం.) – వైతాళికులు (కవితల సంకలనం)

You Might Also Like

4 Comments

  1. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    మీ శీఘ్ర సమాధానానికి నెనరులు. నేనెవఱినీ తప్పుపట్టడం లేదు. నా ఉద్దేశ్యం అది కాదని గమనించ ప్రార్థన. ఇహపోతే పదాల్ని, పదబంధాలనీ, సమాసాలనీ అనువాదం చేసి వాడుకోవడం పట్ల ఉన్న కళంకభావన (stigma) భాషాశాస్త్ర సమ్మతం కాదు. వాటిని “మక్కికి మక్కి అనువాదం” అని భావించడం కూడా సరికాదు. అనువాదస్వభావం గల నవీన పదనిర్మాణాల్ని Loan translation words (అనూదిత ఆదానాలు) అనే పేరుతో భాషాశాస్త్రం అంగీకరిస్తుంది. అంటే ఇక్కడ మనం పదాల్ని కాదు, ఆ పదభావాల్ని అనువదిస్తాం. మూలభాషాపదంలోని భావం/ భావన (concept) మనకు అంగీకారయోగ్యమైనప్పుడు, వాటికి మన అనూచాన దేశి జాతీయాలు అచ్చుమచ్చుగా దీటు కాజాలవనుకున్నప్పుడు ఆ మూలభాషా పదబంధాలలో అవయవభూతమైన పదాల్ని ఒక్కొక్కటిగా మన భాషలోకి అనువదించి అనంతరం జతచేర్చడం అభ్యంతరకరం కాదు. అయితే ఒక మూలభాషా మార్ఫీమ్ (Morpheme) కి సుదీర్ఘసమాసాల రూపంలో చేసే అనూదిత ఆదానాలు నాకూ శ్రవణసుఖంగా ఉండవు.

  2. రవి

    ఓ ప్రముఖ రచయిత్రి చదువవలసిన పుస్తకాల జాబితా చాలా సింపుల్ గా ఉంటుందని ఊహించలేదు. సింపుల్ గా అయినా బాగా ఆసక్తికరంగా ఉంది.

    జాక్పాట్ కాస్తలో తప్పింది. ఆరుద్ర గారి కొన్ని రచనలు, అత్తగారి కథలు కొన్నీ తప్ప, జాబితాలో మరే ఇతర పుస్తకమూ చదవలేదు. :-|.

  3. మాలతి

    @ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం, మీవ్యాఖ్య చూడగానే నాకు కొంత అయోమయం అయిందండి. ఎందుకంటే నేను కూడా వీలయినంతవరకూ తెలుగే వాడుతాను, వాడమని అందరకీ చెప్తాను కనక. ఈవ్యాఖ్య పుస్తకం.నెట్ వారు పాఠకులని జాబితాలు అడుగుతూ ప్రకటించిన టపాలో ఉండవలసింది.
    పోతే, అనువాదాలెప్పుడూ మాటకి మాట కానఖ్ఖర్లేదు. ఇక్కడ నాకు నచ్చిన పుస్తకాలు అంటే చాలనుకుంటాను. రీడింగ్ కి చదివిన అన్నఅర్థం సరిపోయినా, చదివినవన్నీ నచ్చాలనేం లేదు కదా.

    @ పుస్తకం.నెట్. *ఈ వ్యాసం నుండి తూలిక/తె.తూలిక కు గానీ వరదల్లా వెళ్ళే లంకెల గురించి మేము నిస్సహాయులం*- :)).వరదల్లా వస్తున్నాయి. ధన్యవాదాలు. – మాలతి

  4. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

    ఎంతో తప్పనిసరి అవసరమైతే మినహా ఆంగ్లపదాల్ని యథాతథంగా తెలుగులోకి దించేయడం తెలుగుభాషకు శ్రేయస్కరం కాదు. అది జన వ్యావహారికమూ కాదు. ఈ అనవసరమైన ఆంగ్ల-తెలుగు మిశ్రమం ఇంగ్లీషు లేకపోతే ఉద్యోగాలు సంపాదించలేని ఒక పరాధీన, డాబుసరి, నగర మధ్యతరగతి బోలీ. ఇది భాషాపరంగా మన (పద) సృజనాత్మకతకీ శ్రేయస్కరం కాదు. Reading కి తెలుగుపదం ఇప్పటికే ఉన్నది. అదే విధంగా List కీ తెలుగుపదం ఇప్పటికే ఉన్నది. అటువంటప్పుడు ఆంగ్లపదానికి బదులు ఏదైనా తెలుగుపదాన్ని (మీరే కల్పించండి) వాడడం నిండా సాధ్యమే. భాష పట్ల, దాని వాడుక పట్ల మనం మొదట్నుంచి వేస్తున్న ఈ శీతకన్ను, చూపిస్తున్న ఈ వదులుతనం , ఇవే మన భాషని ఎదగాల్సినంత ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. పుస్తకం డాట్ నెట్ ఇంగ్లీషు సైటు కాదు గనుక దయచేసి సాధ్యమైనంతగా తెలుగుదనం ఇక్కడ గుబాళించేలా చూడగలరు.

Leave a Reply to రవి Cancel