మూడు జీవితచరిత్రలు

ఇటీవలి కాలంలో రెండు మోనోగ్రాఫులు, ఒక బయోగ్రఫీ చదివాను (వ్యక్తులపై రాసిన మోనోగ్రాఫులకీ, బయోగ్రఫీలకీ తేడా ఏమిటీ? అన్నది అర్థం కాలేదింతకీ!). చదివాక, అసలు మొనోగ్రాఫులు ఎలా ఉండాలి? జీవిత చరిత్ర రాస్తే ఎలా రాయాలి? ఇత్యాది ప్రాథమిక సందేహాలు మొదలయ్యాయి. ఒకటి విసుగు పుట్టించింది. రెండోది పర్లేదనిపించింది కానీ – నేను ఊహించిన సంగతుల్లేవు. మూడోది మాత్రం నాకు అన్ని విధాలా నచ్చింది. ఆ పుస్తకాల గురించీ, వాటిలోని విషయాల గురించీ, అవి రాయబడ్డ విధానం గురించీ – ఈ టపా.

పుస్తకాలు:
Pusapati Ananda Gajapathi Raju – A Monograph by V.V.B.Ramarao
Duggirala Gopalakrishnayya by I.V.Chalapathi Rao
M.R.Pai – the story of an uncommon common man – by S.V.Raju

మొదటిది: పూసపాటి ఆనందగజపతిరాజు (భాష: ఆంగ్లం, రచన: వివిబి రామారావు, తెలుగు యూనివర్సిటీ బుక్ షాపులో లభ్యం)

ఈపుస్తకం సైజు చాలా చిన్నదనే కాదు, చెప్పాల్సిన కంటెంట్ అంతకంటే తక్కువ కనుక, ఆట్టే సమయం పట్టదు. Hagiography అంటారే, సరిగ్గా అలాగే ఉంది. రాజావారి ఆస్థాన భట్రాజులను ఇంటర్వ్యూ చేస్తే, ఇలాగే చెప్తారేమో, అనిపించేంతగా పొగడ్తలతో నిండి ఉంది. అది మొనోగ్రాఫు ఎలాగైందో ఏమిటో! రాజా ఇదిచేశారు, అది చేశారు…రాజా వారికి రానిది లేదు. అసలు ఈ రాజావారు ఇక్కడ పుట్టడం, గిట్టడం మన అదృష్టం – ఈ పంథాలో సాగింది. ఎందుకన్నా మంచిదని వర్డ్ వెబ్ లో ’మొనొగ్రాఫ్’ కి అర్థం చూస్తే – “A detailed and documented treatise on a particular subject” అని ఉంది. మరే! అనుకున్నాను.

రెండవది: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (భాష: ఆంగ్లం, రచన: ఐ.వి.చలపతిరావు, తెలుగు యూనివర్సిటీ బుక్ షాపులో లభ్యం)

గోపాలకృష్ణయ్య గారి గురించి స్కూల్లో హిస్టరీ పాఠాల్లో ప్రస్తావన ఉంది. అలా ఆయన పేరు పరిచయమైంది. ఆపై, బూదరాజు రాధాకృష్ణ గారి ’పద్య సాహిత్యం: సంఘ చరిత్ర (1900-1950) ’ తిరగేస్తున్నప్పుడు దుగ్గిరాల గారి పద్యాలు చూసి – ఆయనపై ఆసక్తి కలిగింది. అలాగే, అక్కడే ఆయన యువకులుగా ఉండగానే పోయారని తెలిసి, ఈయన గురించి తప్పక తెలుసుకోవాలనిపించింది. తక్కువ కాలం బ్రతికినా, మనం ఇంకా ఆయన్ని తల్చుకుంటున్నామంటే మరి, గొప్పేకదా!

ఇంతకీ, పుస్తకం చదవడం మొదలుపెట్టాను – గోపాలకృష్ణయ్య గారిపై అభిమానం మొదలైంది. పుస్తకం భాష కాస్త అకడమిక్ గా అనిపించింది కానీ, ముందు పుస్తకంతో పోలిస్తే – ఈ పుస్తకంలో కాస్త గో.కృ. గారిలోని లోపాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. అందునా, ఎక్కడా ’భట్రాజుతనం’ ఛాయలు కనబడలేదు. అయితే, ఆయన వ్యక్తిగత జీవితం, అందునా – భార్యా, కుమారుడి గురించిన ప్రస్తావన మరీ నామమాత్రంగా ఉంది. ఒక వ్యక్తి జీవితం ఎంత సంఘసేవలో ఉన్నా కూడా, అతనికీ ఓ కుటుంబం ఉందనీ – ఆ కుటుంబంతో అతని సంబంధాలు ఎలా ఉండేవో అన్న సందేహం చదువరులకి కలుగుతుందనీ – రచయిత అర్థం చేస్కుని ఉంటే బాగుండేది (పూసపాటి వారి పుస్తకం లో కూడా కుటుంబసభ్యుల ప్రస్తావన లేదన్నది అప్పుడు తట్టలేదు – ఆ పొగడ్తల వల్ల!).

ఇక, దుగ్గిరాల గారు మాత్రం స్పూర్తి కలిగించే వ్యక్తి. అలాగే, ఏ మనిషైనా లోపరహితం కాదు అని మళ్ళీ అనిపిస్తుంది ఆయన గురించి చదివితే.

మూడవది: M.R.Pai – the story of an uncommon common man – (రచన: ఎస్.వి.రాజు, స్ట్రాండ్ బుక్ స్టాల్ వారి ప్రచురణ. వారి షాపుల్లో లభ్యం. వెల వంద రూపాయలు. వారి వద్ద కొన్నప్పుడు అరవై రూపాయలే ఛార్జ్ చేశారు).

ముందుగా, ఎం.ఆర్.పాయ్ ఎవరు? అంటారా?
నిజానికి, ఆ పుస్తకం చూడగానే నాకూ అదే సందేహం కలిగింది. ఆ తరువాత – ఒకే ఒక్క కారణానికి అతని గురించి ఏం తెలీకుండానే పుస్తకం కొనేశాను – విల్ డ్యూరంట్ ’ఎ కేస్ ఫర్ ఇండియా’ వేసిన స్ట్రాండ్ వారు వేశారంటే, ఈ వ్యక్తిలో ఎంతో కొంత విషయం ఉండి ఉండాలి అని. పాయ్ గారు ఒక ప్రముఖ కన్జ్యూమర్ ఆక్టివిస్ట్, అలాగే ఫోరం ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ స్థాపించిన తొలినాటి వ్యక్తుల్లో ఒకరు. పాల్కీవాలాతో కలిసి చాలా ఏళ్ళు పనిచేశారు. చివరకు ఆయన జీవితం గురించిన పుస్తకాన్ని కూడా రాసారు. టైం మేనెజ్మెంట్ (తెలుగులో ఏమంటారు??) గురించి ఒక పుస్తకాన్నీ, మరో మూడు పుస్తకాలనూ రచించారు. సామాన్యుల్లో అసామాన్యుడు అన్న ట్యాగ్‍లైన్ నిజంగానే ఆయనకి సరిగ్గా సరిపోతుంది.

ఈ పుస్తకం చదువుతూంటే బయోగ్రఫీ అన్నది ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. టైపోలు అవీ కొంచెం తగిలాయి కానీ, అది తప్పిస్తే, ఎక్కడా అతిగా పొగడకుండా, ఆయన పొరబాట్ల గురించి చెప్పే సమయంలో అతిగా తెగడకుండా – ఒక విధమైన బ్యాలెన్స్ తో రాసినట్లు అనిపించింది. పుస్తకం చదువుతూండగా, నాలో consumer consciousness పెరుగుతున్న అనుభూతి కలిగింది 😉 అలాగే, ఎం.ఆర్.పాయ్, ఆయన భార్యలపై చాలా గౌరవం కలిగింది. ఈ పుస్తకం లో నాకు బాగా నచ్చిన అంశం పాయ్ కుటుంబం, వారి జీవనవిధానం – వీటికి కూడా కొంత స్థలం కేటాయించడం. ఈ మూడో పుస్తకం మాత్రం తప్పక చదవమని చెబుతాను అందరికీనూ. ఇలాంటి వ్యక్తుల గురించిన పుస్తకాలు మరిన్ని రావాలని అభిలషిస్తున్నాను.

-మరోసారెప్పుడన్నా పాయ్ గారి చరిత్ర గురించి వివరంగా రాసేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పటికి సెలవు.

You Might Also Like

Leave a Reply