కిండిల్ కబుర్లు

అప్పట్లో, ఈనాడు ఆదివారం మొదటి పేజీలో “మాయాలోకం” అనే శీర్షిక కింద వింత మనుషుల కథనాలు వేసేవారు. అందులో ఒకటి: ఒక వ్యక్తికి చదవటమంటే విపరీతమైన ఆసక్తి. పగలనకా, రాత్రనకా చదువుతూనే ఉండేవాడు. ఇష్టాలుండచ్చు కాని, అవి వెర్రిగా ముదిరితే అందర్నీ ఇబ్బందికి గురిచేస్తాయి. ఈయన పుస్తకపఠన పిచ్చిని అదుపులో ఉంచడానికి ప్రయత్నించి విఫలమైన కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఆయనతో “నువ్విలానే చదివితే నీ కళ్ళు పాడైపోతాయి. అప్పడిక నువ్వు పుస్తకం అంటూ చదవలేవు. అందుకనే చదవటం తగ్గించు, లేకపోతే గుడ్డివాడివైపోతావు” అని భయపెట్టారు. అతను ముందు పెద్దగా పట్టించుకోకపోయినా, రాను రాను ఆ భయం అతనిలో పాతుకుపోయింది. “నిజంగా కళ్ళు పోతేనో?!” అన్న ఊహ అతణ్ణి నిలువనివ్వలేదు. దీపముండగానే ఇళ్ళు చక్కదిద్దుకోవాలన్న పద్ధతిని పాటించేసి, కళ్ళుండగానే బ్రెయిలీ లిపి అభ్యసించేసి అందులో ప్రావీణ్యం సాధించాడు. ఇహ, పగలు కళ్ళతో, రాత్రుళ్లు ముసుగు తన్ని బ్రెయిలీ లిపిలోనే యడాపెడా చదవుతూ పోయాడు. తమ ఉపాయం వికటించిందని గ్రహించిన ఇంట్లోవాళ్ళు తలలు పట్టుకున్నారు.

తమాషాకే ఈ కథ అనుకున్నా, పుస్తకాలంటే బోలెడు ఇష్టం ఉన్నా, చదవటంలో ఉన్న సాధకబాధకాలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. సుబ్బరంగా భోంచేసి, అలా కాసేపు చల్లగాలిలో తిరిగొచ్చి, అరలో ఉన్న ఓ పుస్తకాన్ని తీసుకొని, పడకకూర్చీలో నడుం వాలుస్తూ దాన్ని చదువుకుంటూ నిద్రలోకి జారుకోవడం కోసమే పుస్తకాలనుకుంటే, కొత్త పరికరాలు అక్కరలేదు. ప్రయాణాల్లో, వెయిటింగ్ రూమ్స్ లో పుస్తకాలు ఎక్కువగా అక్కరకు వస్తాయి. జీవితాల్లో నిలకడకన్నా పరుగుపందాలే ముఖ్యమైన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పుస్తకాలు (ఈ-పుస్తకాలు) తప్పనిసరైపోయాయి. కాని కంప్యూటర్ స్క్రీన్ మీద చదవాలంటే కళ్ళకి కష్టం. “మీ కళ్ళను అంత శ్రమ పెట్టకోకండి, మా రీడర్‍తో మీ కళ్ళు క్షేమం. బదులుగా మా దగ్గరే పుస్తకాలు కొనండి” అంటూ అమెజాన్.కామ్ వాడు మన మీదకి వదిలిన ప్రయోగమే కిండిల్.

కిండిల్ అంటే ఏమిటి?

మరో ఎలెక్ట్రానిక్ పరికరం. పుస్తకాలు చదువుకోడానికి ప్రత్యేకంగా తయారుచేయబడింది. ఏమిటి దీని ప్రత్యేకత అంటే.. దీని తెర (స్క్రీన్)! తక్కిన పరికరాల్లా వెలుగును ప్రసరించదు, అందుకని కళ్ళపై వత్తిడి ఉండదు. కాగితం చదువుతున్న భావనే కలిగిస్తుంది. పరికరం సాధారణంగా మనకు లభ్యమయ్యే పుస్తకాల సైజుల్లోనే లభిస్తుంది. చేతిలో పట్టుకోడానికి – కొన్ని లావు పుస్తకాలకన్నా- వీలుగా ఉంటుంది. తేలిగ్గా, నాజూకుగా, పలకలా (హాండ్ బాగ్ లో పెట్టేసేంత! లాప్‍టాప్ బాగులతో ప్రయాణించే వాళ్ళకి మరీ సులువు) ఉండడం వల్ల, ఎక్కడికన్నా తీసుకుపోవచ్చు. నుంచుని, కూర్చుని, పడుకొని – ఎలా అయినా చదువుకోవచ్చు. ఎక్కువ సేపు వాడినా, వేడి రాదనుకుంటాను. (నేనింకా అంతేసి సేపు వాడలేదు!)

ఇందులోకి పుస్తకాలను ఎక్కించడం కూడా చాలా తేలిక. పుస్తకాలను తెరచి చూడ్డం, చదువుకోవటం కూడాను. మొత్తానికి ఇదో పుస్తకం కాని పుస్తకం అన్న మాట.

ఇంకేముంటాయేంటి?

మామూలు పుస్తకాల్లో ఉండని లక్షణాలు దీనికి కొన్ని ఉన్నాయి: ఇందులో అక్షరాలను మనకి కావాల్సిన సైజులో పెంచుకోవచ్చు. ముఖ్యమైన వాక్యాలను ఒక చోట కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఆంగ్ల పదాలకు అర్థాలు అక్కడక్కడే చూసుకునే వీలుగా నిఘంటువు ఉంది. కిండిల్ ను ఎటు పట్టుకుంటే, పుస్తకం అటే తెరుచుకుంటుంది. మూడున్నర వేల పుస్తకాలు పడతాయని అమెజాన్ సైటులో ఉంది. అన్ని కాకున్నా, బాగానే పడతాయి.

పుస్తకాలు చదువుకోడానికే కాక, వినడానికి అనుకూలంగా ఇందులో మ్యూసిక్ ఫైల్స్ ను ఉపయోగించవచ్చును. అంటే ఆడియో పుస్తకాలనూ వినచ్చు మాట. లేదా, మీకు నచ్చిన పాటలు వింటూ మీకు నచ్చిన రచననీ ఆస్వాదించచ్చు.

అవీ కాక, ఈ పరికరానికి వయర్-లెస్ ఉంది. దీన్ని ఉపయోగించి అంతర్జాలంలోని పత్రికలనూ, బ్లాగులనూ చదువుకోవచ్చును. (ఆంగ్లం మాత్రమే! తెలుగు కనిపించదు, యూనికోడ్ సపోర్ట్ లేనందువల్ల!) అమెజాన్ వాడి కొట్టు నుండి పుస్తకాలను కొనుక్కోవచ్చును. ఈ పేరాలో చెప్పినవ్వన్నీ అమెరికా వాళ్ళకే. భారత్ లో ఉన్నవాళ్ళకి కష్టం.

తెర కిందున్న కీబోర్డ్ ద్వారా పుస్తకంలోని పదాలను వెదకచ్చు. బ్రౌజర్ లో టైపు చేసుకోవచ్చు.

వెల?

అమెరికాకి వెళ్ళో, అక్కడి నుండి వస్తున్న వారితోనో తెప్పించుకుంటే చిన్న కిండిల్ పది వేలకి, పెద్దది ఇరవై వేలకి వచ్చేయవచ్చు. నేరుగా ఇండియాకి వాడినే షిప్ చేయమంటే కస్టమ్స్ కూడా మనమే భరించాలి.

అవసరమా?

ఖచ్చితంగా చెప్పలేను కాని, నేను గమనించిన కొన్ని విషయాలు చెప్తాను, దాని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు..

అమెజాన్ నుండి పుస్తకాలు కొనే వీలు వద్దనుకున్నా, కిండిల్ ఉపయోగకరమే! తెలుగు పి.డి.ఎఫ్ లు చక్కగా కనిపిస్తున్నాయి. (అంటే పి.డి.ఎఫ్ లు చక్కగా ఉంటే!) కాల్పనిక సాహిత్యం, కాల్పనేతర సాహిత్యంలోని పుస్తకాలు కూడా “ఉచితం”గా దొరికేవి కూడా బాగున్నాయి. మన తెలుగు పుస్తకాలే చాలా ఉన్నాయి. వాటిని ఇందులో చదువుకోవడం చాలా వీలుగా ఉంది.

అక్షరాలు చిన్నగా ఉండి, పేజీలు చాలా ఎక్కువగా ఉండే పుస్తకాలను కిండిల్ లో చదువుకోడంలోనే సౌకర్యం ఎక్కువ.

బోలెడంటే బోలెడు పుస్తకాలు పెట్టుకోవచ్చును. పుస్తకాలు .txt లేక .pdf ఫైల్స్ పెట్టుకోవచ్చును.  పి.డి.ఎఫ్ లో చిన్న అక్షరాలుంటే వాటిని జూం చేయడం కష్టమవుతోంది.  వాటిలో నోట్స్ రాసుకోవడం, హైలైట్ చేసుకోవడం లాంటివి పనిచేయవు. పి.డి.ఎఫ్ వాడేటప్పుడు అడ్డంగా పట్టుకుంటే, అక్షరాలు పెద్దగా కనిపిస్తాయి, కాని చివర్న ఉన్న బొమ్మలూ, అక్షరాలు కట్ అవుతున్నాయి.  మరికొన్ని విషయాలు ఇక్కడ.

టెక్నికల్ పుస్తకాలు ఇందులో చదవాలనుకుంటే చాలా చిరాకుగా ఉంది, ముఖ్యంగా text books. ఇరవై ముప్ఫై పేజీలుండే ఏ వైట్ పేపర్లో చదువుకోవచ్చును. కిండిల్ లో నేరుగా డౌన్‍లోడ్ చేసుకునే పుస్తకాలు కూడా అంతగా లభించటం లేదనే అనిపించింది నాకు.

ఛార్జ్ అవ్వటం గురించి పెద్ద ఆందోళన పడక్కరలేదు. వయర్లెస్ ఆఫ్ ఉంటే కొన్ని రోజుల పాటు ఛార్జ్ చేయనక్కరలేదు. కొత్త డివైస్ ఛార్జ్ అవ్వడానికి కూడా రెండు గంటలు మించి సమయం పట్టలేదు. ఛార్జ్ ని యు.ఎస్.బి, లేక ప్లగ్ ద్వారా పెట్టవచ్చును. అంటే ప్రయాణాల్లో అదీ, మీతో పాటు లాప్‍టాప్ కూడా ఉండాలన్న నియమం లేదు.

ఇందులో వాడిన “ఈ-పేపర్” టెక్నాలజి రివల్యూషనరీ అవ్వచ్చు గాక, కాని బటన్స్ మాత్రం పురాతన కాలం నాటివి. “నెక్స్ట్ పేజ్” అని ఒక బటన్ ఇచ్చారు. పేజి మార్చాల్సిన ప్రతిసారి ఇది వాడాలి. మరో మార్గం లేదు. ఒక్క పుస్తకంకే కొన్ని వందల సార్లు ఆ బటన్ వాడాల్సి వస్తుంది. అది ఎంత వత్తిడిని తట్టుకుంటుందో నాకు అనుమానమే! కిండిల్ కొనదామనుకున్నప్పుడు, ఇది ఓ రెండేళ్ళు పనిచేస్తే చాలుననుకున్నాను. ఇప్పుడు అతి జాగ్రత్తగా వాడితే ఓ ఏడాది వస్తుందని నా అంచనా!

పేజి మారడానికి, అడ్డం నుండి నిలువుకీ, నిలువు నుండి అడ్డానికి మారడానికి కన్ను గుర్తించేంత సమయం తీసుకుంటుంది, పైగా తెరంతా నల్లగా మారుతుంది. తక్కిన ఈ-రీడర్స్ లో ఇది మరింత ఎక్కువగా ఉందని చదివి, కాస్త శాంతించాను.

రెండు ముక్కల్లో చెప్పాలంటే..

రోజులో కనీసం మూడు-నాలుగు గంటలు పుస్తకాలు చదివే అవసరమో / ఆసక్తో ఉండి, పుస్తకాలన్నీ అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటే, కిండిల్ లాంటి వాటి అవసరం లేదు. అలా కాక, మీరో చోట, మీ పుస్తకాలో చోట ఉంటూ, అప్పుడో అరగంటా, అప్పుడో గంటా చదువుకోవాల్సి వస్తే, కిండిల్ ఒక వరమే!

You Might Also Like

6 Comments

  1. varaprasaad.k

    మొత్తానికి చెప్పి,చెప్పనట్టు అనవసరం అని తేల్చేశారు,అంత మొహమాటం అవసరం లేదు,ప్రజల్ని పదివేలకు మునగకుండా అడ్డుకున్నందుకు అభినందనలు.గతంలో ఇంగ్లీషులో పెద్ద పెద్ద కామెంట్స్ రాసి చీవాట్లు తినేవాణ్ని.ఇపుడు సులువుగా తర్జుమా అయిపోతుంటే రాయటానికి మంచి కులాసాగా ఉంది.

  2. Purnima

    Depends on what kind of Telugu books you wanna read! We could find many Telugu ebooks at mallepoolu.com, DLI and other places and yes, all those PDFs are very readable on Kindle.

    Take a look at this post and try your luck.

    http://vbsowmya.wordpress.com/2010/03/24/dli-experiences/

  3. leo

    కేవలం తెలుగు పుస్తకాలు చదవటానికి కిండిల్ కొనవచ్చునా? కిండిల్ లో చదవటానికి తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

  4. Dhanaraj Manmadha

    అన్ని వేలు పోసి కిండిల్ నే కొనాల్సిన అవసరం లేదు. నాలుగు వేల లోపే దొరుకుతున్న పేద వాడి బ్లాక్ బెర్రీ (Micromax Q5) లో కూడా చదూకోవచ్చు :D. పర్యావరణం, కళ్ళకి ఇబ్బంది అనేవి, కిండిల్ కొన్నా రావచ్చు. ఇందులో mail attachments రూపంలో వచ్చిన పీడీఎఫ్ లు బాగానే ఓపెనవుతున్నాయి. ఒక్క సంవత్సరం పనిచేసే పనైతే కిండిల్ కొనటం దండగ కూడా…

  5. Rammohan Rao

    I am using Infabeam Phi. It is good and convenient. We can read Doc, text., pdf file.
    As a journalist I found it’s useful save news clips and check when I badly need them.
    It’s price though less then 10K. I feel Infabeam should reduce it or offer it on easy instalments so that more people can use it.

  6. madhu.t

    if u want to buy this kind of product now available at infibeam.com namely infibeam phi check it out at their website

Leave a Reply to Rammohan Rao Cancel