ఆతుకూరి మొల్ల – రెండోభాగం

రాసిన వారు: నిడదవోలు మాలతి
******************
మొదటి భాగం ఇక్కడ.

నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.

మదనాగయూధసమగ్రదేశము గాని
కుటిలవర్తనశేషకులము గాదు.
ఆహవోర్వీజయహరినివాసము గాని
కీశసముత్కరాంకితము గాదు
సుందరస్యందనమందిరంబగు గాని
సంతతమంజులాశ్రయము గాదు
మోహనగణికాసమూహగేయము గాని
యూధికానికరసంయుతము గాదు
సరససత్పుణ్యజననివాసము గాని
కఠిననిర్దయదైత్యసంఘము గాదు
కాదు కాదని కొనియాడఁ దగినట్టి
పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.

“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.

అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం –
ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
… … …
సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి
అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.

మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగిన సందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు.
సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు
…. … ….
అని రాముని వర్ణించి, లక్ష్మణుని,
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.

అంటాడు. లక్ష్మణుడిని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. పైన చెప్పినట్టు ఈపద్యం కూడా నేను చిన్నప్పుడే విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!

పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో చర్చించారు.

దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-50).

అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీవర్ణనలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల శరీరభాగాలు ఉపమించడంలో “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!

నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో మహానటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.

ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. రచయితలో నిజాయితీ లోపించినట్టే అనిపిస్తుంది.

పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం అలా నిలబెట్టేదిగా ఉండాలి రచన. అంతేకానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..

ఈనవలలో రచయిత మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. నిజానికి ఆనాటి సాంఘిక దురన్యాయాలు నిరసించడానికి మొల్ల వ్యక్తిత్వాన్ని వక్రీకరించనవసరం లేదనే నా అభిప్రాయం. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.

రెండో అభ్యంతరం – అలా మొల్ల పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.

ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసనసెట్టి తనయననీ, మొల్ల నామధేయననీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసనసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.

సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్‌లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.

మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.

మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి.

ఈ రామాయణం అంతర్జాలంలో లభ్యం. పాఠకులసౌకర్యార్థం పిడియఫ్ ఫైలు ఇక్కడ.

ఉపయుక్తగ్రంథాలు.

ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం. 2 సం. హైదరాబాదు, తెలుగు సాహిత్య ఎకాడమీ. 2005 ?
మలయవాసిని, కోలవెన్ను. తెలుగు కవయిత్రులు. వాల్తేరు, ఆంధ్రా యూనివర్సిటీ. 1979.
మొల్ల, ఆతుకూరి. మొల్ల రామాయణం. ఏలూరు. రామా అండ్ కో. 1937. (నెట్‌లో లభ్యం.)
లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి. ఆంధ్ర కవయిత్రులు. 2వ కూర్పు. 1980.
వెంకటేశ్వరరావు, ఇంటూరి. కుమ్మరి మొల్ల. మద్రాసు, ఆంధ్రా ఫిల్ము పబ్లికేషన్స్. 3వ ముద్రణ. 1969.
సత్యనారాయణ, సుంకర. కుమ్మరి మొల్ల (బుర్రకథ). విజయవాడ, విశాలాంధ్ర ప్రచురణాలయం, 1963.
(గమనిక. ఈబుర్రకథ 1963లో ప్రచురించినా, రాయడం 1951లోనే జరిగిందనీ, అనేకప్రాంతాలలో బహుళ ప్రశంసలు పొందిందనీ రచయిత రాసేరు.)
వెంకటావధాని, దివాకర్ల. ఆంధ్రవాఙ్మయచరిత్రము. హైదరాబాదు. ఆంధ్ర సారస్వత పరిషత్తు. 1961.
శేషగిరిరావు, ఆండ్ర.. ఆంధ్ర విదుషీమణులు. రచయిత, 1995.
Lalita, K. and Tharu, Susie. Eds. Women Writing in India. 600 B.C. to the Present. V.1. New York: The Feminist Press, 1991. pp.95-96.

You Might Also Like

11 Comments

  1. Women Writing in India (Volume-1) – 1 « sowmyawrites ….

    […] 10. Atukuri Molla (Early 16th Century): తెలుగులో లభ్యమవుతున్న మహిళల రచనల్లో మొల్ల రాసిన రామాయణమే మొదటిదట. బి.వి.ఎల్.నారాయణరావు చేసిన అనువాదం నుండి కొన్ని పద్యాలు ఇక్కడ వ్యాసంతో జతచేశారు. మొల్ల గురించి నిడదవోలు మాలతి గారు వివరంగా రాసిన రెండు వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ. […]

  2. Women Writing in India (Volume-1) – 1 « sowmyawrites ….

    […] 10. Atukuri Molla (Early 16th Century): తెలుగులొ లభ్యమవుతున్న మహిళల రచనల్లో మొల్ల రాసిన రామాయణమే మొదటిదట. బి.వి.ఎల్.నారాయణరావు చేసిన అనువాదం నుండి కొన్ని పద్యాలు ఇక్కడ వ్యాసంతో జతచేశారు. మొల్ల గురించి నిడదవోలు మాలతి గారు వివరంగా రాసిన రెండు వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ. […]

  3. మాలతి

    @ రాఘవ, “మొల్ల వాడిన వ్యావహారిక భాషకూ తిక్కన్నగారు వాడిన వ్యావహారిక భాషకూ కొంచెం సామ్యాలు కనబడతాయి.” – అలాగా. నాకు తెలీదండి. కానీ ఎప్పుడయినా వీలయితే చూస్తాను. ధన్యవాదాల.
    @ C.S. Rao, ధన్యవాదాలండీ. ఆరోజు మీతో మాటాడడంచేత ఇక్కడ మళ్లీ పెట్టలేదు. అన్యధా భావించరని తలుస్తాను.

  4. రాఘవ

    చక్కటి (కొనసాగింపు) వ్యాసమండీ. 🙂 నమస్సులు.

    తెనాలివారి వెకిలితనం గురించి చెప్పేది కూడా కట్టుకథే అయ్యుంటుందని నా అనుకోలు. ఎందుకు ఏమిటి అంటే… ప్రస్తుతానికి నేను ఈ విషయమై పెద్దగా పరిశోధన చేయలేదు కాబట్టి పూర్తి ఆధారాలతో చెప్పలేను. కానీ భాషావికాసాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంత వఱకూ కాలాన్ని నిర్ణయించవచ్చు అనుకుంటే, నావఱకూ నాకు మొల్ల వాడిన వ్యావహారిక భాషకూ తిక్కన్నగారు వాడిన వ్యావహారిక భాషకూ కొంచెం సామ్యాలు కనబడతాయి.

  5. C.S.Rao

    కుమ్మరి మొల్ల” అనడం భావ్యం కాదు. “కవయిత్రి మొల్ల ‘ అని వ్యవహరిస్తే నాగరికంగా,గౌరవం గా ఉంటుంది.
    ఆకట్టుకునే కధా సంవిధానము,సందర్భానికి తగిన రసస్ఫోరకమైన శైలి కవయిత్రి మొల్ల ప్రత్యేకమైన కవితా లక్షణాలని మాలతి గారు చక్కగా నిరూపించారు.ఉదహరింపబడిన పద్యాలన్నీ హృద్యంగా ఉన్నవి.
    సాకేత పుర వర్ణన,సాయంశోభ ని వర్ణించే పద్యం బావున్నవి.ఆంజనేయస్వామివారి చేత వర్ణించబడినట్లు చెప్పబడిన శ్రీరామచంద్రప్రభువులవారిమీద,లక్ష్మణస్వామి వారి మీద పద్యం భక్తి భావ రసప్లావితంగా ,గొప్ప కవితా వైభవం తో భాసిల్లే పద్యం.అతిసులువుగా కంఠతా వచ్చి కలకాలం మనసులో నిలిచిపోయే పద్యం.ప్రార్ధనా స్థాయిని అందుకున్న పద్యం.
    ఈ పద్యం ఆంజనేయస్వామివారి ముఖఃతా రావటం గొప్ప ఔచిత్యం తో కూడిన విషయం.
    శ్రీరామచంద్రస్వామివారి రూపాన్ని గురించి ,శ్రీరామతత్వాన్ని గురించి శ్రీఆంజనేయ
    స్వామివారు తప్ప మరెవరూ ఈ సృష్టిలో చెప్పగలరు ,అంత అందంగా, అంత సమగ్రంగా !
    మంచి వ్యాసం అందించిన మాలతి గారికి అభినందనలు.

  6. మాలతి

    @ హనుమంతరావుగారూ, మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. ఏకామ్రనాథుడు తొలిసారిగా మొల్లని ప్రస్తావించినట్టు నాకు తెలీదు. ముకుందవిలాసం నేను చూడలేదు. మీకు వీలున్నప్పుడు ఆచంట శారదాదేవిగారిమీద నావ్యాసం నా తెలుగుతూలికలో చూసి మీ అభిప్రాయాలు చెప్పగలరని ఆశిస్తున్నాను.
    – మాలతి

  7. కొడవళ్ళ హనుమంతరావు

    మాలతి గారికి,

    మీ వ్యాసం బావుంది.

    ముక్కు తిమ్మనార్యుని “పారిజాతాపహరణము,” ఎమెస్కో ఎడిషన్ కి రాసిన పీఠికలో విశ్వనాథ అంటారు: “ఆధునిక కాలములో నదేమి చిత్రమో! కావ్యము – తగ్దతశక్తి; కవి – వాని ప్రతిభ; కావ్యము నుండి మనము పొందు నానందము; కావ్యము నందలి కథ – కవి దానినెట్లు నిర్వహించెను? ఏమి సాధించెను? మొదలైనవన్ని పోయి, ఆ కవి యెప్పుడు పుట్టెను? ఏ యూరి వాడు? ఆయన యెవరి యాస్థానములో నున్నాడు? ఆయన గ్రంథములో నెన్ని యాశ్వాసములున్నవి? మొదలైన విషయముల విచారణ యెక్కువైనది. ఈ రీతిగా పాఠకులు తమ్ము తాము వంచించుకొనుచున్నారు. పైన చెప్పిన విషయములు వార్తాపత్రికలకు సంబంధించినవి. కావ్యమునకు సంబంధించినవి కావు.”

    ఆయనతో అంగీకరిస్తూనే, కావ్యానికి సంబంధించని వాటిపై రాస్తున్నాను – వార్తాపత్రికల విషయాలపై వెచ్చించే సమయంలో వెయ్యో వంతు కూడా నేను కవిత్వంపై వెచ్చించను కనుక ఈ వంచన తప్పదు. 🙂

    “కుమ్మర మొల్ల” గా ప్రచారమయినందుకు మీరు చాలా అబ్బురపడ్డారు. అందులో ఆశ్చర్యపడవలసిందేముంది? పూర్వం మన సమాజంలో తక్కువ కులాల్లో చదువుకున్నవాళ్ళు చాలా తక్కువ కదా. వాళ్ళలో కావ్యాలు రాసే ప్రావీణ్యం కలవారున్నారంటే నమ్మడం కష్టమే. అంతటి అరుదైన కవి గనుక మెచ్చుకోలుగా మొదట వాడితే అదే స్థిరపడి ఉండొచ్చు.

    మొల్లని మొదటిసారిగా ప్రస్తావించిన ఏకామ్రనాథుడు “కుమ్మర మొల్ల” అనే వాడాడు. ఆ సందర్భం ఆమె ఔన్నత్యాన్ని చూపేదే: శూద్ర కవిత్వమని విద్వాంసులు రాజు ముందర తక్కువ చెయ్యడం, మొల్ల వచ్చి చిత్రంగా ఓ పద్యం చదివి, రాజుని మెప్పించడం. ఆ కాసిని పంక్తులను బట్టి మొల్లను గూర్చి మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయంటూ లక్ష్మీకాంతమ్మ గారు వివరించారు [1]. “ముకుందవికాసం” అన్న పీఠికలో ఇలాంటి వార్తాపత్రికల విషయాలతో పాటు మీరు చర్చించిన కావ్య సంబంధ విషయాలు చాలా ఉన్నాయి. అది మీరిచ్చిన ఉపయుక్త గ్రంథాలలో ఉందో లేదో తెలియదు. ఇతరులకి ఉపయోగపడుతుందని ఇస్తున్నాను.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “మొల్ల రామాయణము,” మొల్ల. సంపాదకురాలు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2008.

  8. tsradhika

    వ్యాసం బాగుందండీ. ఉదహరించిన పద్యాలన్నీ బాగున్నాయి.

  9. మాలతి

    @ నరసింహారావు మల్లిన, మంచి పద్యాలు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలండీ. నిజానికి నేను ఇలాటి స్పందనకోసమే ఎదురు చూస్తున్నాను.
    @ రామ్, తెలుగువెలుగులోని విషయాలు ఉటంకించినందుకు ధన్యావాదాలు. ఆధారాల్లేని కథలకంటే, మొల్ల మహాకావ్యనిర్మాతగా చెప్పదలుచుకున్న విషయాలు చెప్పడమే ఉచితమన్న అభిప్రాయంతో నేను ఆకట్టుకథలజోలికి పోలేదు.

  10. నరసింహారావు మల్లిన

    ఇదే ఘట్టంలో(సీతా కల్యాణం) కవయిత్రి మొల్ల వ్రాసిన పద్యం నా కెంతో యిష్టమయిన పద్యాలలో ఒకటి. అందుకని దానిని కూడా ఇక్కడ వ్రాస్తున్నాను, అవధరించండి.
    చ.
    కదలకుమీ ధరాతలమ కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూవిషా
    స్పదులను బట్టు కూర్మమ రసాతలభోగిఢులీకులీశులన్
    వదలక పట్టు ఘృష్టి ధరణీఫణికచ్ఛపపోత్రివర్గమున్
    బొదువుచుఁ బట్టుఁడీ కరులుభూవరుఁడీశునిచాపమెక్కిడున్.
    క.
    ఉర్వీనందనకై రా
    మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రునిచాపం
    బుర్విం బట్డుడు దిగ్దం
    త్యుర్వీధరకిటిఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్.
    వ.
    అనుచు లక్ష్మణుండు దెలుపుచున్న సమయంబున.
    మ.
    ఇనవంశోద్భవుఁడైనరాఘవుఁడు భూమీశాత్మజుల్ వేడ్కతోఁ
    దనువీక్షింప మునీశ్వరుం డలరఁ గోదండంబు చేనంది చి
    వ్వన మోపెట్టి గుణంబు పట్టి పటుబాహాశక్తితోఁ దీసినన్
    దునిఁగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయుచందంబునన్.

    సముద్రాలు ఘోషపెట్టిన రీతిలో శబ్దం వినిపించిందంట.

    తెలుగులో ఒక పదాన్ని గుఱించి చెప్పే నానార్థాల పదాలతో ఎలా ఆడుకోవచ్చో వాటిద్వారా అందాన్ని ఎలా రాబట్టచ్చో తెలిసిన విదుషీమణి మొల్ల. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కల్పన. మన అదృష్టం.

  11. rAm

    “తెలుగు వెలుగులు” పుస్తకం నుంచి మొల్ల గురించి మరికొంత-

    మొల్ల అంటే మల్లెపూవు.బొండుమల్లె.

    ‘సిద్దేశ్వరచరిత్ర కర్త’ అయిన ఏకామ్రనాధుడు మొల్ల గురించి రాస్తు “తిక్కన సోమయాజి వరప్రసాదమ్ము చేత కుమ్మరి రామాయణంబును వచన కావ్యంబు రచయించి”అని వివరించాడు.కాని మొల్ల పూర్వకవి స్తుతిలో శ్రీనాధుని నుతించటం వల్ల పదహారవశతాబ్ధం ప్రధమార్ధంలో జీవించి వుండచ్చు.అనుశ్రుతంగా వచ్చే కధలు
    తెనాలి రామకౄష్ణుని సమకాలికుల్ని చేసి వాళ్ళమధ్య జరిగినట్టుగా పెక్కు సంఘటనలు వివరిస్తున్నాయి.

    ఒక సంఘటన.ఒక దినం మొల్ల కోడిపెట్టను,కుక్కపిల్లను చేతుల్లో పొదివికొని వీధి వెంట పోతున్నది.వికటకవి తెనాలి రామకౄష్ణుడు ఎదురైనాడు.వెంటనే తో కుక్కనిస్తావా?పెట్టనిస్తావా?అని శ్లేష చమత్కారంతో ఆమెను అడిగాడు.అందుకు మొల్ల జంకు కొంకు లేకుండా నేను నీకు అమ్మను కదా అని శ్లేష తోనే జవాబిచ్చినది.

    మరొక వ్యాసం : నాటికీ నేటికీ మహిళల్లో మహాకావ్య నిర్మాత మొల్ల
    http://eenadu.net/sahithyam/display.asp?url=maha68.htm

Leave a Reply to మాలతి Cancel