‘చాంద్‌తార’ల కవితా కౌముది

రాసిన వారు: పెన్నా శివరామకృష్ణ

[ఈ వ్యాసం స్కైబాబా, షాజహానాలు రాసిన ’చాంద్ తారా’ కవితాసంకలనానికి పెన్నా శివరామకృష్ణ గారు రాసిన ముందుమాట. పుస్తకం.నెట్ లో దీన్ని తిరిగి ప్రచురించడానికి అనుమతించిన వీరందరికీ, ఆపై వ్యాసాన్ని పుస్తకం.నెట్ కు అందించిన అరుణ పప్పు గారికీ ధన్యవాదాలు – పుస్తకం.నెట్]

హ్రస్వ కవితా ప్రక్రియలు మనకు పూర్వ నుంచీ ఉన్నవే. గాధాసప్తశతులూ, ముక్తకాలూ, శతక పద్యాలూ, చాటువులూ, దోహాలూ, రుబాయీ, ఘట్ కట్ షేర్లు, హైకూలు మొదలైనవన్నీ హ్రస్వ కవితా ప్రక్రియలే. ప్రపంచ పదులు, ద్విపదులు, నానీలు కూడ ఇలాంటివే. తెలుగు ప్రధాన సాహిత్య స్రవంతిలో హ్రస్వ కవితా ప్రక్రియలపట్ల చిన్నచూపు ఉన్నట్లు కనిపిస్తుంది. కొందరు వచన కవులు, విమర్శకులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఇలాంటి ప్రక్రియల పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇవి చమత్కార ప్రధానమైనవనీ, సామాజిక చైతన్యాన్ని కలగించలేవని మరికొందరి అభియోగం. ఇలాంటి ప్రక్రియల్లో రాయడం అపరిపక్వతకు, ప్రతిభా హైన్యానికి సంకేతమని ఇంకొందరు అంటుంటారు. మౌనం ద్వారా, ఉపేక్ష ద్వారా నిరసనను వ్యక్తం చేయడంలో, ఒక మూలకు నెట్టేయడంలో మనవాళ్లు ప్రవీణులు.

అది అలా ఉంచితే ప్రతి ప్రక్రియకూ వ్యక్తీకరణ, ప్రయోజనాలతో తనదైన పరిమితులుంటాయి. ముక్తకాలను, కావ్యంతో, భక్తి శతకాన్ని భక్తి కావ్యంతో పోల్చి చూస్తే పరిమితులు ప్రయోజన భిన్నత్వమూ తెలుస్తాయి. వచన కవితా ఖండికనే పరమోత్కృష్ట ప్రక్రియగా భావించేవారు కూడ వచన కవితను, దీర్ఘ కవితతో (లేదా కావ్యంతో) పోల్చి చూసుకుంటే పరిమితులు ప్రయోజనాల సాపేక్షత గ్రహించవచ్చు.

మంచి కవులుగా పేరుపొందిన స్కైబాబ, షాజహానా తెలుగు కవిత్వాకాశంలో ప్రస్తుతం ‘చాంద్‌తార’లుగా రూపుదాల్చారు. ‘చాంద్‌తార’ అనగానే నెలవంక ప్రమిదలో మణిదీప నక్షత్రం మనో నేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది; ఇస్లాం మత చిహ్నమూ స్ఫురిస్తుంది. చాంద్‌ ఎవరైనా తార ఎవరైనా కవితా కౌముదుల్ని వెదజల్లుతున్న ఈ కవి దంపతులూ చాంద్‌తారలే. ఈ హ్రస్వ కవితల్లోని రెండు పంక్తులకూ చాంద్‌తారలు సంకేతాలే. వచన కవిత్వంలో లాగానే ‘చాంద్‌తార’లలోని పాద విభజనలో నిర్దిష్టమైన నియమాలేమీ కనిపించవు. అయినా రెండు పంక్తులుగా మాత్రమే విభజించుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇందులోని అంతర్లీనమైన ముస్లిం ఆంతరిక, లౌకిక, జీవన సంఘర్షణలను ‘చాంద్‌తార’ అనే శీర్షిక సూచిస్తుంది.
ఒక్క తాన నిలుస్తలె
పైన కటీ పతంగ్‌ – కింద మున్నా
ఒకే రకమైన రెండు దృశ్యాలను మన ముందు ఉంచి వేరు వేరు కారణాలను వ్యంగ్యం చేస్తాడు స్కైబాబ. ‘విహరిస్తూ చంద్ర భ్రమరం / అడవి ఒక ఆకుపచ్చని పుష్పం’– ఎంత అందమైన భావన. అడవి నంతటినీ పుష్పంగా భావించడం- అందునా ‘ఆకుపచ్చని పుష్ప’ మనడం ఊహల్లోని, వ్యక్తీకరణల్లోని నవ్యత. ఇలాంటివి సార్వజనీనమైన వస్తువులు. సందేశం కంటే వర్ణనా ప్రధానమైనవి.
సెహ్‌రాలోని చమ్కీదారాలు
ఊచల వెనక చంద్రబింబం

మంచి ఉత్ప్రేక్ష. ‘ఊచల’ ద్వారా బందిఖానాను స్ఫురింపజేస్తాడు. ఒక స్వల్ప అంశం ద్వారా విషయాన్నంతటినీ వ్యంగ్యం చేయడం మెటానమీ. వివాహ వ్యవస్థలోని పై మెరుగుల వెనుకనున్న ప్రతికూల అంశాలను, స్త్రీల దుస్థితిని ధ్వనిస్తాడు. ‘ఉర్స్ లో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ / అబ్బా ముఖం చిన్నబోయింది’ – అంటూ కార్యకారణాల మధ్య కాంట్రాస్ట్‌ ద్వారా దారిద్య్రాన్ని దైన్యాన్ని చక్కగా ధ్వనిస్తాడు.
పరేషాన్‌ గుండేది చిన్నప్పుడు
మా భాష మాట్లాడే అమితాబ్ బొట్టు పెట్టిండేంది

ప్రతిపదసార్థక్యం కలిగిన కవితలలో ఇదొకటి. ‘పరేషాన్‌’, చిన్నప్పుడు’ అనే పదాలు కారణం తెలియని సంఘర్షణను, కారణాలను అన్వేషించలేని, అర్థం చేసుకోలేని అమాయకత్వాన్ని తెలుపుతాయి. ‘మా భాష’ – ఉర్దూకు సర్వనామం. ‘అమితాబ్ – సినిమా రంగానికి, ఉర్దూ మాట్లాడే హిందువులకు సంకేతం. ‘బొట్టు’- హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక.

హిందీ, ఉర్దూ భాషల ఉత్పత్తి, క్రమ పరిణామం, క్రమంగా వేరువేరు లిపులను ఆశ్రయించి, వేరువేరు భాషలుగా రూపొందడం- అయినా ఆ రెండు భాషలకున్న ఆజన్మ సంబంధ బాంధవ్యాలు- హిందీ సినిమా వికాసం లో హిందూ, ముస్లిం సంస్కృతీ సంప్రదాయాల, హిందీ ఉర్దూ భాషా సాహిత్యాల ఉమ్మడి పాత్ర- ఉర్దూ, భారతీయ ఇస్లాం సంస్కృతి అవినాభావమనే అభిప్రాయాలు- మొదలైన అనేక విషయాలను గూర్చిన లోతైన ఆలోచనలకు ఈ కవిత ప్రేరణనిస్తుంది.
పొద్దున్నె అద్దంలో మొఖం చూసుకోవాలనేది అమ్మీ
ఇప్పుడు మా అద్దం ముక్కలైంది
ఇక్కడ ‘అద్దం’ అనే ప్రతీక అనేక అన్యాయాలకు ఆస్కారమిస్తున్నది. ఇది ముస్లింల మన-స్థితిని కవి అర్థం చేసుకున్న తీరును తెలుపుతుంది. ఏమైనా ఈ కవిత చదువగానే ఒక సినిమా కోసం షకీల్ బదాయినీ రాసిన (దిల్ దియా దర్ద్ లియా -1966 -‘కోయీ సాగర్ దిల్ కో బహలాతా నహీ–’ అనే గజల్) ‘జిందగీకీ ఆయినే కో తోడ్‌దో, ఇస్‌మే అబ్ కుచ్ భీ నజర్ ఆతా నహీ–’ అనే షేర్ గుర్తుకొచ్చింది. ‘పండుగనాడు దూరముండి దండం బెట్టేటోడు / అలాయిబలాయి నేర్పితి’- ‘దూరముండడం’ వెనుక చాలా విషయముంది. ఇస్లాం సంస్కృతిలోని సానుకూలమైన అంశాలను, హిందూ సంస్కృతిలోని లోపాలను ప్రతిఫలింపజేసే మాటలివి. ‘నేర్పడం’లో ఎవరికైనా ఆధిక్యతాభావమున్నట్లు అనిపిస్తే అది కవి ఉద్దేశ్యమే ననుకోవాలి.

‘షాజహానా గారి కవిత్వ కం……స్వరంలో మృదుత్వం, కటుత్వం విడదీయరానంతగా కలగలసిపోయి ఉంటాయి.

రేగుముల్లుతో ముక్కు కుట్టుకున్నా
కళ్ల వెంట పటపటమని జారిన బాల్యం
‘రేగుముల్లు’లో పేదరికపు దు—ఖపు పదును నిక్షిప్తమై ఉంది. బాల్యానికి అశ్రువులతో అభేదం చెప్పడం గమనించదగినది. ఈమె తన మొదటి కవితతోనే తన కవిత్వ వస్తుజాలాన్ని, వ్యంగ్య వైభవాత్మకమైన వ్యక్తీకరణ రీతిని స్పష్టం చేసింది. ‘పగలంతా చూసొచ్చిన వింతలన్నీ / రాత్రంతా ఒడ్డుకు చెబుతూ పడవ’- లాంటి అందమైన ప్రాకృతిక ఊహా చిత్రాలతోపాటు, చాలా కవితలలో ముస్లిం మహిళ ఆంతరిక సంఘర్షణను చిత్రించింది.

ఔరత్ ఉభయ ‘చెర’
సగం కన్నీటిలో.. సగం కలల్లో..
ఇది అందరు మహిళలకూ కొంతవరకైనా వర్తిస్తుంది. కాని ‘ఔరత్ అనే పదంతో నిర్దిష్టంగా సగటు ముస్లిం మహిళ వేదనను చెప్పింది. సౌకర్యానికి, విస్తృత ప్రయోజన సాధనకు సంకేతమైన ‘ఉభయ చరత్వా’న్ని జీవన వైఫల్య వ్యక్తీకరణకు వాడుకోవడం విశేషం. ముస్లిం బాలిక బాల్యంతో మొదలుపెట్టి ముస్లిం ‘ఔరత్ తో ముగించి- తన కవిత్వంలో ఆద్యంతమూ అంతర్లీనమైన ముస్లిం మగువ వేదనను వ్యంగ్యం చేసింది.

ఇద్దరి కవితలలోను ఉక్తి చమత్కారాల కంటే దృశ్య భావ చిత్రాలు ఎక్కువ. విన్నదాని కంటే చూసినది ఎక్కువ కాలం జ్ఞాపకానికి నిలిచినట్లు ఉక్తి చమత్కృతి కంటే దృశ్య భావ చిత్రం మనస్సు మీద చెరగని చిత్తరువులా నిలిచిపోతుంది. ఇందులో ‘షాజహానా కవితలు సంఖ్యలో తక్కువ అయినా దాదాపు అన్నీ శక్తిమంతమైనవే. ఇది లోపం కాకపోవచ్చునేమో కాని ఇద్దరి కవితలలోను భాషాపరంగా ఏకరూపత కనిపించదు.

ఒక వస్తువు, దృశ్యం కలిగించిన తాదాత్మ్యం నుంచి, ఎలాంటి బౌద్దిక ప్రమేయం లేకుండ వెలువడిన కొన్ని వీరి కవితలను ఉత్తమ హైకూలుగా కూడ భావింపవచ్చు. ఒక పెద్ద గండశిలను శిల్పంగా మలచడం వేరు. ఒక చిన్న సుద్ద ముక్కనో, గులకరాయినో శిల్పంగా తీర్చిదిద్దడం వేరు. ఇక్కడ మొదటి పనిలో గొప్ప నైపుణ్యాన్ని సాధించిన వారే రెండవ పనిలో సఫలమయ్యే అవకాశముంటుంది. ఏ కళాకారుడికైనా పరిధి తగ్గుతున్న కొద్దీ అమోఘ నైపుణ్య సాధన, ప్రదర్శనలు అత్యావశ్యక మవుతాయి. కవిత్వంలోనైతే వ్యక్తీకరణ పద్దతికి ప్రాధాన్యం పెరుగుతోంది. వచన కవత్వ సాధనవల్ల తమకు తెలియకుండానే బోధపరచుకున్న ఆలంకారికతా రహస్యాలు హ్రస్వ కవితా రచనలో అప్రయత్నంగా వినియోగిస్తాయి. మంచి వచన కావ్యం రాయగలిగిన వారికి మంచి వచన కవితా ఖండిక రాయడం బహ•శా సులభ సాధ్యమే. ప్రమాదవశాత్తు ఎవరైనా ఒక మంచి వచన కవితా ఖండిక రాయవచ్చునేమో! ప్రమాదవశాత్తు ఎవరూ మహాకావ్యం రాయలేరు.

హ్రస్వ కవితలు రాయడం తేలిక అని ఎవరైనా అనుకుంటే అది అజ్ఞాన మూలకమని నా అభిప్రాయం. మొదటే చెప్పినట్టు ప్రయోజనానికి సంబంధించి ప్రతి ప్రక్రియకూ తనదైన పరిమితులుంటాయి.
పూలను తన్మయత్వంతో చూస్తుంటావు
ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ
మనుషులందరినీ స్వచ్ఛత, సరళత, నిసర్గత, సుగుణ సౌరభమూ, సహనమూ మూర్తీభవించిన మనీషులుగా తీర్చిదిద్దడానికి, లోకాన్ని ‘గులసితా–’గా మార్చడానికి బాగా ఉపకరించేది ఉత్తమ కవిత్వమే నేమో! తమ ‘చాంద్‌తార’ లతో ఉదాత్తమైన కవిత్వానుభవాన్ని అందించటమే కాక ఈ నాలుగు మాటలు రాసే సందర్భాన్ని కల్పించిన స్కైబాబ, షాజహానా గార్లకు కృతజ్ఞతలు.
-పెన్నా శివరామకృష్ణ
24.5.2008

You Might Also Like

3 Comments

  1. ramnarsimha

    @SKYBABA garu,

    You might have written your opinion in Telugu..

    I am very disappointed..

    I know very well that “The Telugu words which are used in the Media..

    can`t be understood by many people”..

    “The Urdu words which are used by you are so Sweet”..

    I can understand “Urdu” very well..

    I love Telugu,Urdu & Hindi languages so much..

    I am also from Telangana..

    I will also write another opinion..

    Thanks.. for reply..

    Yours sincerely,
    Ram.

    Yours sincerely

  2. sky baaba

    shukriya ramnarsimha gaaru, muslim kavulu vaaduthunna urdu padaalapai mee abhipraayame kontha mandi vyaktham cheyadam tho telugu patrikallo charcha jarigindi.. english padaalu upayoginchangaa lenidi urdu padaalu upayogiste elaa thappavuthundi annadi oka konam.. english paradeshapu bhaasha, kaani urdu desheeya bhaasha kadaa ani kudaa.. sare, konni padaalaku urdu lone fressness untundi.. telugu lo raaste anthagaa nappadu.. aasakthi unnavaaru artham telusukone prayathnam kudaa chesthaaru kadaa.. memu artham kaani kosthaandhra, uttarandhra, seema mandalikaalu arthaalu telusukoni kudaa chaduvukuntunnam kadaa..

  3. ramnarsimha putluri

    Poems are heart-touching.

    But..

    Can the words CHAND-TARA, AURATH, KATI PATHANG, SEHARA, UBHAYA CHERA..

    be understood by everyone..???

Leave a Reply