తెలుగు మణిహారం – ఆముద్రిత గ్రంథ చింతామణి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

నెల్లూరు జిల్లా గెజిట్ తరువాత ఇప్పుడు లభ్యమయ్యే నెల్లూరు ప్రాచీన పత్రిక ’ఆముద్రిత గ్రంథ చింతామణి’. 19వ శతాబ్ద చివరిపాదంలో ఆంధ్రదేశంలో సాగిన భాషాకృషికి, సారస్వత వ్యాసంగానికి, చెలరేగిన పండిత వివాదాలకూ ఆముద్రిత గ్రంథ చింతామణి నిలువుటద్దం. అప్పటి విమర్శనాపద్ధతులకు, సాహిత్యసంప్రదాయాలకూ ఇది ఒక సజీవసాక్ష్యం. ఆనాటి సాహితీపరులంతా ఏదో ఒక విధంగా ఈ పత్రికా సంపాదకులతో సంబంధం ఉన్నవాళ్ళే. ఆముద్రిత గ్రంథ చింతమణి దాదాపు రెండు దశాబ్దాలపాటు జీవించింది. ఈపత్రిక సంపాదకులు పుండ్ల రామకృష్ణయ్య దీని నిర్వహణ తన జీవితాశయంగా భావించారు. తన 23వ ఏట పత్రిక ప్రారంభించి, చనిపోయేరోజువరకు పత్రిక కొనసాగిస్తూ వచ్చారు. ఉల్లిగొండం రామచంద్రరావు ప్రేరణ, రెవెన్యూ ఉద్యోగి-గౌరవనీయుడూ అయిన రోజుకుర్తి వెంకటకృష్ణారావు ప్రోత్సాహం పుండ్ల రామకృష్ణయ్యకు ఈ పత్రిక ప్రచురణకు స్ఫూర్తినిచ్చాయి. హిందూ వర్నాక్యులర్ స్కూలులో ఆంధ్ర పండితులుగా పనిచేస్తున్న ఒడయారు వీరనాగయ్య దేవర సహసంపాదకుడిగా బాధ్యత స్వీకరించి కొంతకాలం పత్రికా నిర్వహణలో సహకరించారు. తొలి నాలుగుపుటలలో వ్యాకరణాది శాస్త్ర విచారం. గ్రంథవిమర్శ, సమస్యాపూరణం, వసుచరిత్ర,మనుచరిత్ర వంటి ప్రాచీన ప్రబంధాలలోని కఠిన పద్యాలకు అర్థనిరూపణ, భిన్నప్రతులలోని పాఠాంతరాలను చర్చించి కవి హృదయాన్ని ఆవిష్కరించడం, లక్షణ విరుద్ధమైన రచనలమీద ఆక్షేపణలతో పాటు పద్యాల ప్రచురణ, విద్యావిషయకమైన లేఖలుండేవి. తక్కిన పుటలను ఆముద్రిత గ్రంథాలను పరిష్కరించి ప్రకటించడానికి కేటాయించేవారు. నిరాదరణతో నశించిపోతున్న తాళపత్ర గ్రంథాలను సేకరించి ప్రచురించడం ఆముద్రిత గ్రంథ చింతామణి ప్రధానాశయం. వేదం వెంకటరాయశాస్త్రి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి వంటి వారి కీర్తి దశదిశలా వ్యాప్తి చెందేందుకు ఆముద్రిత గ్రంథ చింతామణి గొప్ప సాధనం అయింది.

You Might Also Like

8 Comments

  1. mythili

    ముఖ్యమయిన వ్యాసాలనీ లేఖలనీ కలిపి కాళిదాసు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఒక సంవత్సరం క్రితం పుస్తకంగా తీసుకు వచ్చారండీ.

    1. సౌమ్య

      Mythili garu, are you talking about this book..or was there another?
      http://pustakam.net/?p=4733
      (Ofcourse, I know this was not one year ago. But still enquiring)

    2. Sreeni@gmx.de

      Sowmya-gaaru: As Mythili gaaru said, there is a volume of selected writings published in “అముద్రిత గ్రంథచింతామణి” compiled and brought out by శ్రీ కాళిదాసు పురుషోత్తం of నెల్లూరు. The book is published by A.P. G.O.M.L, Hyderabad (Orient mss. library in OU campus, Tarnaka). Obviously, like any other APGOML publication you can’t easily buy it outside in bookshops. On a related note, A.P. Press Academy archives site has a good number of the issues in e-form.

      Regards, Sreenivas

    3. సౌమ్య

      Oh, I understood now. I thought she was writing about selected writings from Penna Teeram column! 🙂 I think I saw this book of selected writings from “అముద్రిత గ్రంథచింతామణి” 1-2yrs back in the APGOML at OU Campus. Thanks for clarifying.

    4. pvsrprasadarao

      ippudu paina meeru perkonna pustakamu ekkada labhistundi sir.

      where can i get the above said book?please send me the particulars
      thanking you sir

  2. ఏల్చూరి మురళీధరరావు

    అనర్ఘమైన విజ్ఞానకల్పతరువు “అముద్రిత గ్రంథ చింతామణి”ని అధికరించి ఇన్నాళ్ళ తర్వాత పుస్తకం.నెట్ ఈ చిన్ని సంస్మారికనైనా ప్రకటించటం ఎంతో భావ్యంగా ఉన్నది. చిన్నయసూరి గారు, బహుజనపల్లి సీతారామాచార్యుల వారు ప్రారంభించిన పత్రికాముఖ అముద్రితగ్రంథప్రకాశనోద్యమాన్ని “రాజహంస”, మంజువాణి”, “చింతామణి”, “కల్పలత”, “సరస్వతి” వంటి పూర్వోత్తర పత్రికల కంటె అత్యంత ప్రామాణికంగా నిర్వహించిన సమర్థ సంపాదకులు శ్రీ పూండ్ల రామకృష్ణయ్య గారు. ఆనాటి సాహిత్య వాదవివాదాల నేపథ్యంలో శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి గారికి, శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారికి, శ్రీ మచ్చ వేంకటకవి గారికి అఖండమైన ప్రోత్సాహాన్ని కల్పించి, వారిచేత వెలలేని విమర్శలను వ్రాయించిన ఘనత అముద్రిత గ్రంథ చింతామణికి దక్కుతుంది. శ్రీ వేంకటరాయశాస్త్రి గారి “జక్కన విక్రమార్క చరిత్ర విమర్శనము”, “సంస్కృతాంధ్ర గ్రంథవిమర్శన ప్రకారలేశము” వంటివి అముద్రిత గ్రంథ చింతామణి ముఖంగా వెలువడినవే. వారి “అభిజ్ఞాన శాకుంతలము”, శృంగార నైషధ సర్వంకష”లకు; శ్రీ గురజాడ అప్పారావు గారి “కన్యాశుల్కము” నాటకానికి, మచ్చ వేంకటకవి గారి “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన కుశచరిత్రము”నకు, గణపవరపు వేంకట కవి “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము”నకు వారు వ్రాసిన విమర్శల విలువ ఇంతింతని చెప్పలేము. భట్టుమూర్తి, రామరాజభూషణుడు వేర్వేఱని నమ్మి, రామరాజభూషణుని “హరిశ్చంద్రనళోపాఖ్యానము”ను ప్రామాణికంగా ప్రకటిస్తూ అద్భుతావహమైన పీఠికను వెలయించారు. “కావ్యాలంకార సంగ్రహము”ను గుఱించి తొలి విమర్శను ప్రకటించారు. నెల్లూరి వీరరాఘవకవి “వసుంధరా పరిణయము” వారి సాటిలేని పరిష్కరణనైపుణికి సమ్యఙ్నిదర్శనం. చాటుపద్యపూరణలు, ఒకరి పేర ప్రసిద్ధంగా వెలసి ఉన్న పద్య వేఱొకరిదని సప్రమాణంగా నిరూపించి చెప్పటం, కఠినాతికఠినమైన పద్యాలకు పాఠకులచేత అర్థ తాత్పర్యాలను వ్రాయించటం, తమకు వ్యతిరేకంగా వచ్చిన లేఖలను ప్రకటిస్తూనే ఆ క్రింద తమ సమాధాన్ని వ్రాయటం – ఇవన్నీ వారు నెలకొల్పిన విశిష్ట సంప్రదాయాలే. ఆఖరికి “మరణవార్త”లను కూడా అననుకరణీయమైన తమ గంభీరశైలిలో వ్రాసేవారు. బహుజనపల్లి వారి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ, “శబ్దరత్నాకర ప్రౌఢవ్యాకరణాది బహుగ్రంథరచయితలును, గీర్వాణాంధ్రభాషామహావిద్వాంసులును, మన వేదము వేంకటరాయశాస్త్రి గారికి, పెక్కండ్రు మహాపండితులకును ఆచార్యులును, సార ఘనసార హార హీర కర్పూర యశోధవళితసమస్తదిగంతరులును నైన శ్రీ శ్రీ శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యుల వారు దివంగతులైరని చెప్పుటకెంతయు దురపిల్లుచున్నవారము” అని వ్రాశారు.

    శ్రీ వీరనాగయ్య గారు ప్రధానంగా పద్యవిమర్శలను వ్రాసేవారు. వారి లేఖలుకూడా అనేకం.

    మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి మాలికలు, “రాధాకృష్ణ సంవాదము”, “కవితావినోదకోశము”, “ప్రబంధ సంబంధ బంధ నిబంధన గ్రంథము” అముద్రితగ్రంథచింతామణిలో వెలువడినవే. వ్రాతప్రతులకై గ్రంథాలయాలపై ఆధారపడక స్వయంగా సేకరించిన ప్రతుల మూలకంగా పరిష్కృతాలను ప్రకటించేవారు.

    నా చిన్నప్పుడు మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలోనూ, నెల్లూరు వర్ధమాన సమాజం వారి గ్రంథాలయంలోనూ, తిరుపతి ఓరియంటల్ లైబ్రెరీలోనూ, హైదరాబాదులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోనూ, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలోనూ, కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్కార్యాలయంలోనూ, విజయనగరం ఫోర్డు లైబ్రెరీ లోనూ కొన్ని కొన్ని అముద్రితగ్రంథచింతామణి సంచికలు దర్శనమిచ్చేవి. ఎక్కడా పూర్తి సంపుటాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఫొటోకాపీ సౌకర్యాలు లేనందున నేను నాకు నచ్చిన పుస్తకాలను, వ్యాసాలను, పద్యాలను పూర్తిగా చూసి వ్రాసుకొన్నాను. కొన్ని గుర్తుంచుకొని వదలివేయక తప్పలేదు. నా పరిశోధనాంశం కావటం వల్ల “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము”ను, నెల్లూరి వీరరాఘవకవి “వసుంధరా పరిణయము”ను, మచ్చ వేంకటకవి గారి “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన కుశచరిత్రము”ను, “ప్రబంధ సంబంధ బంధ నిబంధనగ్రంథము”ను పూర్తిగా వ్రాసుకొన్నాను.

    మీరు “ఇప్పుడు లభ్యమయ్యే అముద్రితగ్రంథచింతామణి” అని ప్రకటించిన సమాచారాన్ని బట్టి అది ఇప్పుడు పూర్తిగా దొరుకుతున్నదో, లేక పాక్షికంగా లభిస్తున్నదో తెలియరాలేదు.

    ఆ మహాసంపాదకుని సేవాహేవాకాన్ని స్మరింపజేసిన పుస్తకం.నెట్ సంపాదికలకు నా హార్దిక ధన్యవాదాలు.

    1. varaprasaad.k

      మీ సంస్కారాన్నికి ప్రణామం.చాలా మంచి సంగతులు చెప్పారు,

  3. KOTARI MOHAN RAO

    i missed to read this being nellorean

Leave a Reply to mythili Cancel