పుస్తకం
All about booksపుస్తకలోకం

August 4, 2010

ముద్రాక్షరాల పితామహుడు రామస్వామిశాస్త్రి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

’చేతివ్రాత పుస్తకాలను చదువుకునే దినాలలో వావిళ్ళ రామస్వామిశాస్త్రుల వారు ముద్రణాలయాన్ని స్థాపించి చదువరుల కష్టములను నివరింపజేసిరి’ అని సి.పి.బ్రౌన్ మహాశయునిచేత ప్రశంస. అంతేకాదు, 1847లోనే ముద్రణారంగంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టి తక్కువ స్థలంలో ఎక్కువ అక్షరాలు పట్టేలా, అందంగా ఉండేందుకు అనువుగా గ్రేట్ టైపులో, ఇంగ్లీషుబాడీలోను అక్షరములను పోతపోయించి రెండొందల ఏళ్ళ క్రితమే ముద్రణకళకు శోభను కలిగించినవారు రామస్వామిశాస్త్రులు. మైసూరు రాజాశ్రయం పొంది సంస్కృత గ్రంథాలను కన్నడలిపిలో ముద్రించేందుకు అచ్చుయంత్రాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం తెలుగు సారస్వతానికి, ముద్రణరంగానికి పితామహునిగా నిలిచి, వావిళ్ళ సంస్థ ద్వారా ముద్రాపకుడిగా, ప్రచురణాధికారిగా, రచయితగా, వ్యాఖ్యాతగా ఆంధ్రభారతికి గణనీయమైన సేవచేసి తన కీర్తిచంద్రికలను సాహితీలోకంలో వికసింపజేసిన వ్యక్తి వావిళ్ల రామస్వామి. నెల్లూరుజిల్లా వావిళ్ల గ్రామంలోనూ, తర్వాత దండిగుంటలో నివసించిన వెంకటేశ్వరశాస్త్రి,మహాలక్ష్మాంబ సంతానం రామస్వామిశాస్త్రి. సాహితీవేత్తలకు వావిళ్ళ అంటే పుస్తకసంస్థ స్పూర్తినిస్తుంది.

ముద్రాక్షరశాలలో కృషి:
శ్రీ దక్షిణామూర్తి ఉపాసనాదత్తమైన శక్తిచే సాహితీసరస్వతిని వశం చేసుకుని, చెన్నాపురిలో మేనమామ వెంకటాచలశాస్త్రి నెలకొల్పిన ’వివేక రత్నాకరము’ అనే అచ్చుకూటంలో శ్రద్ధ వహించారు. అనంతరం వరుసగా హిందూభాషాసంజీవని (1849) సరస్వతీనిలయం (1851) అనే ముద్రాక్షరశాలల ముద్రణకృషిలో పాల్గొన్నారు. కొన్ని పరిస్థితుల వలన వాటిని వదిలి, స్వతంత్ర్యంగా ’ఆది సరస్వతీ నిలయము’ అన్న అచ్చుకూటపు ఎడారిలో వంటరిగా 1854 నుంచి 1891 వరకు పరిభ్రమించి సాహితీలోకాన దాన్ని వికసింపజేశారు. క్రమక్రమంగా 1854-62 సంవత్సరాల మధ్యకాలంలో 17 సంస్కృత గ్రంథాలను తెలుగులిపిలో ప్రచురించారు. రామస్వామి శాస్త్రి బాల్యంలో తండ్రి శిక్షణలో కొంత విద్య నేర్చి, పిమ్మట నెల్లూరులో గట్టుపల్లి శేషయ్యశాస్త్రి, ఉడాలి శేషోపాధ్యాయుల వద్ద వేదాధ్యయనం చేశారు. అనంతరం మైసూరు చేరి వైదుష్యం వృద్ధి చేసుకున్నారు. మైసూరు రాజాశ్రయం పొందితే అక్కడి ప్రాంతీయ భాష కన్నడం నేర్చుకున్నారు. సంస్కృత గ్రంథాలను కన్నడలిపిలో ముద్రించి ప్రచురించాలని అనేక వ్యయప్రయాసలను ఎదుర్కుని కన్నడ అచ్చుకూటంను ఏర్పాటు చేస్కున్నారు.

కన్నడీయులకు ప్రాంతీయభేధం అధికం కావడం వలన తెలుగువారు కన్నడభాషను ముద్రించడం పట్ల వ్యతిరేకించారు. దీనివల్ల వీరు చెన్నపురికి తరలిపోవలసి వచ్చింది. శృంగేరీ మఠాధిపతి జగద్గురువు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద నృసింహ భారతీస్వాములు (32వ గురువు, 1826-1891) వీరిని అనుగ్రహపూరితమైన ఉపదేశమిచ్చి, భావి కార్యోన్ముఖులను చేయడానికి కొంత ధనమర్పించి చెన్నపురికి మరలించారు. ఆ జగద్గురువు మహత్వం వల్లనే వావిళ్ళ మహాసంస్థ అయిందనవచ్చు.

చెన్నపురిలో భవిష్యత్తుకు బాట:
చెన్నపురిలో శృంగేరీ మఠ బాధ్యతను నిర్వహిస్తూ, భవిషత్తుకు పటిష్టమైన పథకం చేసుకున్నారు. 1847లో వేదం వెంకటాచలం ఏర్పాటుచేసిన వివేకరత్నాకరం అనే ముద్రణాశాలలో శ్రమించి ముద్రణారంగంలో అనుభవం సంపాదించుకున్నారు. 1849లో భాగస్వాములతో కలిసి హిందూభాషాసంజీవని అన్న ముద్రణాశాలను స్థాపించారు. వావిళ్ల గ్రంథాలు రత్నఖచిత పేటికలు, వెల స్వల్పం, ఫల మధికం అనే సంకీర్తనను స్థిరంగా అర్జించుకున్నాయి.

(అచ్చువేయడంలో వావిళ్ళవారు ప్రవేశపెట్టిన (ప్రూఫ్ రీడింగులో) నూతన వరవడి, బొంబాయి ’నిర్ణయసాగర్’ ప్రెస్సు వారినుండి అనుకరింపబడినది. అందువలన వావిళ్ళవారు అచ్చువేసిన గ్రంథాలు అచ్చుతప్పులు లేకుండా పరిష్కారమై ప్రామాణికతను సంతరించుకున్నాయి.About the Author(s)

పుస్తకం.నెట్2 Comments


  1. పితామహుడు చాలా పెద్ద మాట. సాధారణంగా పితామహులక్కూడా పితామహులుంటారు. నిజానికి వావిళ్ళవారి కంటే ముందే తెలుఁగులో ముద్రణ చేపట్టినవారున్నారు. అయితే దాన్నొక కార్పొరేట్ లెవెల్ కి తీసుకొచ్చిన తొట్టతొలి వ్యాపారదక్షుడు వావిళ్ళ రామస్వామిశాస్త్రి. ఆయన్ని “తెలుఁగుప్రెస్ కార్పొరేట్ పితామహుడు” అనడం ఎక్కువ సమంజసమనుకుంటా.


  2. సౌమ్య

    సిపిబ్రౌన్ అకాడెమీ వారు ఈయన జీవితచరిత్ర పుస్తకం గా వేశారు. రచన: వివియస్.శర్మ.
    వివరాలు: అకాడెమీ వారి సైటులో చూడవచ్చు. (http://www.cpbrownacademy.org/cpbBooks.asp)

    ఇంతకీ, వావిళ్ళ వారు తాముగా ఏమీ రాయలేదా? కనీసం – పుస్తకాల ముద్రణ లోని సాధకబాధకాలు – ఇటువంటి వాటి గురించి కూడా?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు మణిహారం – ఆముద్రిత గ్రంథ చింతామణి

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
7

 
 

27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 

నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 

 

దువ్వూరు శతకాన్ని నిషేధించిన ఆంగ్లేయులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
0

 
 

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకల...
by సౌమ్య
3

 
 

నూరేళ్ళుగా ఉత్సవాలు – కవిత్రయ జయంతులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తక...
by పుస్తకం.నెట్
1