నూరేళ్ళుగా ఉత్సవాలు – కవిత్రయ జయంతులు

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

విక్రమసింహపురి సాహితీసీమగా వినుతికెక్కడానికి కారణం తిక్కన జన్మస్థానం కావడమే. గొప్ప రచనా శక్తితో, సాటిలేని శైలి విన్యాసంతో విరసించిన తిక్కన మహాభారతం దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. సింహపురికి కీర్తికిరీటంగా నిలిచిన తిక్కన స్మృతితో సుమారు నూరేళ్ళు తిక్కన జయంతులు నిర్వహిస్తూండటం సీమకే గర్వకారణం. అలనాటి సాహిత్యాభిమానులు, ప్రముఖ వదాన్యులు తిక్కవరపు రామిరెడ్డి ఔదార్యంతో ఈఉత్సవాలు క్రమేణా కవిత్రయ జయంతులుగా రూపాంతరం చెందాయి.

అక్టోబరు పన్నెండవ తేదీ 1915న తొలిసారిగా తిక్కన జయంతిసభ జరిగింది. తిక్కన కవితా వైదుష్యాన్ని ప్రముఖ ప్రసంగాల ద్వారా విని సింహపురిసీమ పులకరించిపోయింది. ఆతర్వాత నుంచి తిక్కన జయంతికి టౌన్ హాలు వేదికై ఎందరినో దేశం నలుమూలల నుంచి ఆహ్వానించి నెల్లురీయులకు సాహితీప్రసంగాలు, కమ్మని కవితల విందు చేశారు. దువ్వూరి రామిరెడ్డి, కాంచనవల్లి కనకాంబ, పింగళి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, మోచర్ల రామకృష్ణయ్య వరకు ఎందరికో తిక్కన జయంతి సభలు వేదికైనాయి. మరువూరు దీపాల పిచ్చయ్య శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, నిడుదవోలు వెంకట్రావు, ఉండేల మాలకొండారెడ్డి, డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రముఖుల ముందు ఉపన్యాసమివ్వడం వక్తలు కూడా ఘనంగా భావించేవారు.

తిక్కన జయంతినే కాక, మహాకవులు నన్నయ, ఎర్రనలను కూడా ఈసమయంలో స్మరించుకోవడం సబబుగా ఉంటుంది. అందులో భాగంగానే 1958 నుంచి తిక్కన జయంతి సభలను ’కవిత్రయజయంతులు’ గా నామకరణం చేసి కవిత్రయానికి నీరాజనాలు పలికారు. తెలుగుభాష నాలుగుదిక్కుల నుంచి నేటికి కవిత్రయ జయంతి సభలలో ప్రసంగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ రావడం, కవిత్రయ అవార్డులు అందుకోవడం నూరేళ్ళుగా జరుగుతున్నది. 1915నుంచి తిక్కన జయంతిగా, 1958నుంచి కవిత్రయ జయంతులుగా జరుగుతూ వస్తున్న నేటి ఈ కవిత్రయ జయంతులు రాష్ట్ర సారస్వత చరిత్రలోనే ఒక ముఖ్యమైన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇప్పటివరకు దాదాపు ఐదువందలమంది ప్రఖ్యాత సాహితీవేత్తలు పాల్గొని ఉపన్యాసాలు చేశారంటే ఆ సారస్వత ఉత్సవాల విశిష్టతకు ఒక నిదర్శనం. తిక్కవరపు రామిరెడ్డి చేత అప్పట్లో ఘన సత్కారం అందుకోవడం కూడా ప్రతిష్టాత్మకమైనదిగా భావించేవారు. స్థానిక వర్థమానసమాజం, తిక్కవరపు రామిరెడ్డి, కవిత్రయ జయంతి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నేటికీ జరుగుతూండటంతో నెల్లూరీయుల సారస్వతాభిలాషం రాష్ట్రంలోనే కాక తెలుగు సారస్వతంలోనే విశేషమైనదిగా భావిస్తున్నారు.

You Might Also Like

One Comment

  1. Jaganmohanrao

    This program is very much appreciable, please continue the Tradition

Leave a Reply to Jaganmohanrao Cancel