డి. కామేశ్వరి కథలు

వ్యాసం పంపినవారు: కొల్లూరి సోమ శంకర్

dkscover1ప్రముఖ రచయిత్రి డి. కామేశ్వరి రాసిన 32 కథల సంకలనం ఇది. ఆవిడ వెలువరించిన సంకలనాలలో ఇది పదవది.  ఈ సంకలనంలో, ఆవిడ ఇతర సంకలనాలాలో చోటు చేసుకున్న కథలూ ఉన్నాయి.
వర్తమాన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులని తెలియజేసేది సాహిత్యమని రచయిత్రి గట్టిగా నమ్మారు.  అందుకే వివిధ సంవత్సరాలలో ప్రచురితమైన కథలని ఈ సంకలనంలో చేర్చారు.  ఇందులో 1965 -2008 మధ్య వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు ఉన్నాయి.

ఈ పుస్తకంలోని కథలకు వస్తువు- స్త్రీ సమస్యలు, మధ్య తరగతి కుటుంబాలు, ఆస్తిపాస్తుల కోసం ఆరాటం, ఆడ పిల్లల పెళ్ళిళ్ళ కోసం తాపత్రయం వంటివి.
వీటిల్లో కొన్ని కథలు విశేషంగా ప్రస్తావించదగ్గవి.
అన్ని కథలలోకి నాకు నచ్చింది – ‘చీకటి‘ అనే కథ. ‘చిన్ని’ అనే కుర్రాడి కథ ఇది. వాడికి నాన్నంటే ఇష్టం ఉండదు. తల్లి వాడిని ప్రేమగా చూసుకుంటుంది. తాగుబోతు భర్త పెట్టే బాధలు పడలేక, చిన్ని అమ్మ వాడికి చిన్నాన్నగా పరిచయమున్న ‘రాఘవులు’ ని మరో పెళ్ళి చేసుకుని, వాడితో సహా రాఘవులింటికి వచ్చేస్తుంది. అప్పటిదాక తనని ఆపేక్షగా చూసుకున్న చిన్నాన్న ఇప్పుడెందుకు విసుక్కుంటున్నాడో వాడికి అర్ధం కాదు. క్రమంగా తల్లిలోను మార్పు వచ్చి, ఆమె కూడా వీడిని విసుక్కుంటుంది, తిడుతుంది. ఇదంతా చిన్నాన్న వల్లే అనుకుని, చిన్నాన్న చచ్చిపోతే బాగుండని చిన్ని అనుకుంటాడు. ఓ ప్రమాదంలో రాఘవులు చనిపోతాడు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ కష్టాలు! తల్లి గత్యంతరం లేక ఒళ్ళమ్ముకుంటుంది. అది వాడికి నచ్చదు. ఓ సారి తల్లిని ఏమీ అనలేక, గుడ్లు మిటకరించి చూస్తాడు. వాళ్ళమ్మకి కోపమొచ్చి “గుడ్డి వెధవ్వి అయితే బతికిపోతాను…” అంటూ ఉక్రోషంతో వాడిని బాదుతుంది. ఆ తర్వాత చెట్టు మీద నుంచి కింద పడడంతో వాడి కళ్ళు పోతాయి. అమ్మ వాడిని మళ్ళీ ప్రేమగా చూసుకోడం మొదలుపెడుతుంది. ఈ కథ …..”చీకటి! కటిక చీకటి! కారు చీకటి! అలాంటి చీకంటంటే చిన్నికి చాలా ఇష్టం” అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. అయితే కథ మధ్యలోకి వచ్చే సరికి చీకటంటే చిన్నికి భయం కలుగుతుంది. మళ్ళీ చివర్లోకి వచ్చేసరికి వాడికి చీకటంటే భయంపోతుంది. మానవ మనస్తత్వాన్ని, బలహీనతలని చక్కగా చిత్రించిన ఈ కథని 1970లో ఆంధ్రజ్యోతి వార పత్రిక ప్రచురించింది.

2001లో వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన ‘పల్లెకే పోదాం‘ అనే కథ పల్లెటూరిలో బతకలేక పట్నానికి వలసొచ్చిన ఓ కుటుంబం కథ. పెనం మీద నుంచి పొయ్యిలో పడిన సంగతి గుర్తించిన ఆ కుటుంబం దూరపు కొండలు నునుపని గ్రహించి తిరిగి పల్లెకి వెళ్ళిపోతుంది. నేటి పల్లెల దుస్థితిని, పట్నవాసపు పరిస్థితులని సరిసమానంగా వర్ణించడంలో రచయిత్రి సఫలమయ్యారు.

మనుషుల నైజాన్ని చక్కగా అర్ధం చేసుకుని, ఇతరులకి మేలు చేస్తునే, తను ఎదిగిన వ్యక్తి కథ ‘అప్పిచ్చువాడు వైద్యుడు‘. ఎం.బి.బి. ఎస్. పూర్తిచేసిన యువకుడు ఓ ఊర్లో వైద్యుడిగా స్థిరపడడానికి ఏం ఎత్తులు వేసాడో, అవి ఫలించాయో లేదో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

ఆకలి‘ ఓ పేద కుటుంబం గురించి చెబుతుంది. భార్యాపిల్లలకి సరైన తిండి కూడ ఏర్పాటు చేయలేని తండ్రి….., చివరికి పెద్ద కూతురు డబ్బు తెస్తే, ఆ డబ్బుతో బియ్యం, కూరలు కొని, రెండో కూతురు వంట చేస్తే, మూడో కూతురు వడ్డిస్తుంటే ఆవురావురమంటూ కంచం ముందు కూర్చుంటాడు. సగం తిన్నాక, ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలిసాక, ఇక తినలేక వదిలేస్తాడు. అయితే పెద్దకూతురు జరిగిన సంఘటనని వివరిస్తే, ఆమెది తప్పు కాదని అంటాడు, అమ్మాయిని ఊరడిస్తాడు. అయితే కూతురిది తప్పు కాదన్న తన నిర్ణయం సరైనదో కాదో తేల్చుకోలేక చాలా సేపు నిద్రపోలేకపోతాడు. ఈ కథ చదువుతూ ఉంటే దేవరకొండ బాల గంగాధర తిలక్ రాసిన ‘ఆశాకిరణం‘ అనే కథ గుర్తుకొస్తుంది.

ఉన్నత చదువుల కోసం పిల్లలను మానసికంగా ఒత్తిడి చేస్తే, పిల్లలు గత్యంతరం లేక జీవితాలని చాలించుకుంటున్న సంఘటనలనుంచి ప్రేరణ పొంది రాసినట్లున్న కథ ‘తప్పెవరిది‘. ఈ కథని 1994లో ఆంధ్రజ్యోతి వార పత్రిక ప్రచురించింది.

ఈ పుస్తకంలోని అతి పెద్ద కథ ‘చీకటి తొలగిన రాత్రి‘. ఇది ఆంధ్రజ్యోతి వార పత్రికలో 1974లో ప్రచురితమైంది. ఒరిస్సాలోని దర్శనీయ స్థలాల నేపధ్యంలో రెండు జంటల మధ్య నడిచిన కథ ఇది. సెలవలకి బావ ఇంటికొచ్చిన మరదలు తమ చిన్ననాటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇద్దరూ వారి వారి జీవిత భాగస్వాములు తమకి తగినవారు కాదని భావిస్తారు. పర్యాటక స్థలాల విహారంలో పరస్పర ఆకర్షణకి లోనవుతారు. అయితే చివరలో జీవితాంతం తోడుగా నిలిచేది కట్టుకున్నవాళ్ళేనని గ్రహించి, తప్పు చేయకుండా, ఆకర్షణని తొలగించుకుంటారు.

ఈ పుస్తకంలో ఉన్న మరో రెండు చక్కని కథలు – ఋణభారం, సొమ్మొకడిది. సొమ్మొకడిది కథ ‘ప్లంబింగ్ పనులు’ నేర్చుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ఆశపడిన ఓ యువతి కథ. అయితే, ఆమెని ప్రేమించి పెళ్ళిచేసుకున్న వ్యక్తి, ఆమె శ్రమించి పనిచేస్తుంటే తను మాత్రం వ్యాపారాభివృద్ధి పేరుతో హాయిగా ఫాను క్రింద కూర్చుని కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటాడు. ఈ విధంగా కూడా మహిళలని మోసం చేసే పురుషులుంటారని ఈ కథ చెబుతుంది.

ఋణ భారం‘ కథ ఇద్దరు అక్కా తమ్ముళ్ళది. కొన్నాళ్ళపాటు అక్కకి ఆర్ధిక సహాయం చేసిన తమ్ముడు ఒక దశలో అక్కని విసుక్కుని ఇకపై నేనేమీ సాయం చేయనని కటువుగా ఉత్తరం రాస్తాడు. అయితే అదేమీ మనసులో పెట్టుకోని అక్క తండ్రి ఆస్తిని తమ్ముడికి భద్రంగా అప్పగించి చనిపోతుంది. పశ్చాతాప్తంతో సిగ్గుబడతాడు తమ్ముడు. అక్క ఋణభారం తెంచలేదు, పెంచిపోయింది అనుకుంటూ విలపిస్తాడు. ఈ కథని ‘పత్రిక’ మాసపత్రిక 2002లో ప్రచురించింది.

తను మరణించి నరకానికి వెళ్ళినట్టుగా రచయిత్రి అల్లిన కథ ‘నరకంలో నిముషం‘ అంతగా ఆకట్టుకోదు. దీన్ని హాస్య వ్యంగ్య కథగా కూడా భావించలేము.

కథా వస్తువుని, కథనడిపిన తీరుని పక్కన బెడితే, ఈ పుస్తకానికి అతిపెద్ద లోపం ప్రూఫ్ రీడింగ్ సరిగ్గా జరగకపోవడం. కవర్‌పేజీ పైనే ‘డి. కామేశ్వరి కధలు’ అనే శీర్షికలో ‘కథలు’కి బదులుగా ‘కధలు’ అని ముద్రితమైంది. అక్కడి నుంచి మొదలైన తప్పులు చాలా కథలలో దొర్లాయి. కామాలు, ఫుల్‌స్టాప్‌లు లేకపోడం, సంభాషణల మధ్య ఎడం లేక పేరాగ్రాఫ్‌లా కనిపించడం వలన ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాక, కొన్ని చోట్ల రెండో సారి చదవాల్సొస్తుంది.

ఈ పుస్తకంలోని ప్రతి కథలోను ఏదో ఒక సామాజిక సమస్యని చిత్రీకరించడం, దానికొక పరిష్కారం సూచించడం కనిపిస్తుంది. అయితే ఆయా కాల మాన పరిస్థితుల దృష్ట్యా రచయిత్రి చూపిన పరిష్కారాల సాధ్యాసాధ్యాలపై సందేహం కలుగుతుంది. రచయిత్రి తన మాటలో చెప్పుకున్నట్లు 1970లలో జరిగిన కథ చెబుతుంటే ఇప్పటి తరంవాళ్ళకి వింతగా అనిపిస్తుంది. సమాజంలో మార్పు తేవడం రచయిత బాధ్యత కాదు; సమాజంలో మార్పు బీజాలు నాటి, ఆలోచనలకి ఒక దిశ కల్పించడమే రచయితల బాధ్యత కాబట్టి ఈ కథలన్నీ ఆ దిశలోనే సాగినట్లు చెప్పచ్చు.

ఆగస్టు 2008 లో మొదటిసారి ముద్రితమైన ఈ 357 పేజీల పుస్తకం (D.Kameswari Kathalu) వెల 150/- రూపాయలు. రచయిత్రే స్వయంగా ప్రచురించుకున్న ఈ పుస్తకం కాపీలు నవోదయ బుక్ హౌస్‌లోను, విశాలాంధ్ర బుక్ హౌస్‌లోను లభిస్తాయి.

You Might Also Like

2 Comments

  1. Dr. C. Jaya Sankar Babu

    చక్కటి సమీక్షనందించిన రచయిత కొల్లూరి సోమ శంకర్ గారికి, పుస్తకం.నెట్ నిర్వాహకులకు అభినందనలు.
    – డా. సి. జయ శంకర్ బాబు, సంపాదకులు, సాహితి, యుగ్ మానస్

  2. “డి. కామేశ్వరి కథలు” పుస్తకం పై సమీక్ష « సృజన - అనుసృజన

    […] వ్యాసాన్ని పుస్తకం.నెట్‌లో చదవండి. లింక్ చదివి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. […]

Leave a Reply