బాస్‍వెల్ మాన్యువల్

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

నెల్లూరు చరిత్రకు ఆనవాళ్ళు కొరవడుతున్న సమయంలో…ఆశాదీపాలు ఆంగ్లేయుల కృషి ఫలితాలు..అధికారికంగా వెలువడే గెజిట్స్, జిల్లా గెజిటర్, మాన్యువల్ వంటివే. అలాంటి దశలో బాస్‍వెల్ మాన్యువల్ సజీవసాక్ష్యం.

’ఎ మాన్యువల్ ఆఫ్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాసు’ పేరుతో 1873లో వెలువడింది. నెల్లూరు పూర్వపు కలెక్టరు, కృష్ణాజిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న జాన్ ఏసీ బాస్‍వెల్ ఈ మాన్యువల్ ను రచించి, తయారు చేయించి ముద్రింపజేశారు. మద్రాసు ప్రభుత్వప్రెస్ లో హెచ్.మోర్గన్ ఆధ్వర్యంలో సరిగ్గా 134ఏళ్ళ క్రితం ముద్రణ అయిన మాన్యువల్ ఇది.

జిల్లాలో మాన్యువల్ ఆనవాళ్ళు లేక ముగ్గురు,నలుగురు చరిత్ర ప్రేమికుల వద్దనున్న చిక్కిశల్యమైన ఈ గ్రంథం 29 అధ్యాయాలలో, 863 పేజీలలో జిల్లా చరిత్రను సంక్షిప్తంగా అందించిన ఈ కావ్యం కనుమరుగైంది. బాస్వెల్ నెల్లూరు జిల్లా కలెక్టరుగా 1867-68 మధ్య కాలంలో ఇరవై నెలలు పనిచేసారు. అనంతరం కూడా జిల్లా చరిత్రమీద ఏళ్ళ తరబడి తయారు చేసిన మాన్యువల్ కు 1870 జనవరి ఐదవ తేదీ మద్రాసు ప్రభుత్వం ముద్రణకు అనుమతినిచ్చింది. దీనికి ముందుమాట కూడా స్వయంగా రాసుకున్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితుల గురించి, వాతావరణం, భూములు, గనులు, రాజకీయం లాంటి జిల్లాసర్వస్వం ఇందులో పొందుపరిచారు. ఈ మాన్యువల్ చరిత్రకు ప్రామాణికమై నిలిచింది. కానీ, దురదృష్టం ఏమిటంటే మాన్యువల్ ప్రచురణ అయ్యేటప్పటికి బాస్వెల్ మరణించడమే! అయినప్పటికీ జిల్లా చరిత్రను అందించిన బాస్వెల్ ఎప్పటికీ చిరస్మరణీయుడే!

You Might Also Like

One Comment

  1. sriram velamuri

    నేను చదివాను, అధ్బుతమైన విషయ సేకరణ,నాది నెల్లూరు
    కావటంతో మరింత ఆసక్తి కలిగింది,రచయిత సుబ్బారావు గారికి ధన్యవాదాలు

Leave a Reply to sriram velamuri Cancel