మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

తెలుగుభాషలోనే మొట్టమొదట కథాసాహిత్యం అన్న ప్రక్రియ మొదలైంది 1819వ సంవత్సరం. దీని పితామహుడు నెల్లూరీయుడైన నేలటూరు వెంకటాచలం ఉరఫ్ తాతాచారి. వీరి కథలు చెన్నపట్నంలో సీపీబ్రౌన్ దొర కొలువులో చేరిన తర్వాతనే వెలుగులోనికి వచ్చాయి. 1841న వీరి కథాసాహిత్యానికి అబ్బురపడ్డ బ్రౌన్ దొర వెలుగులోనికి తీసుకురావలెననే పట్టుదలతో ముద్రణ కూడా చేయించారు. తాతాచారి 24 కథలను ఆంగ్లానువాదంతో సీపీబ్రౌన్ తాతాచారి కథలు పేరిట 1855లో కథాసంపుటిని కూడా వెలువరించి కథాసాహిత్యానికి తెరతీశారు. ఈసంపుటికి ’పాపులర్ తెలుగు టేల్స్’ అని బ్రౌన్ నామకరణం కూడా చేశారు. 1855లో విడుదలైన ఈసంపుటి నేటికీ ముద్రణ అవుతుండటం తాతాచారి, బ్రౌనుల కృషికి నిదర్శనం.

1916లో ఈసంపుటి గిడుగు సంపాదకత్వంలో ద్వితీయముద్రణ జరిగింది. ప్రథమ, ద్వితీయ ముద్రణలలో కూడా సీపీబ్రౌను 18-1-1855, 17-4-1855 తేదీలలో రాసిన ఆంగ్లపీఠికలు కూడా అందులో ముద్రించారు. 1974లో కూడా బండి గోపాలరెడ్డి పరిశోధనలో మచిలీపట్నానికి చెందిన శేషాచలం అండ్ కో వారు తాతాచారి కథలను తిరిగి ముద్రించారు. తాతాచారి కథలు నీతిబోధలేకాక 1800నాటి సామాజిక స్థితికి దర్పణంగానూ ఉన్నవి. అందులోని శైలి శుద్ధ వ్యవహారికమైనందువల్ల పండితశైలికి దూరంగా ఉందన్న బ్రౌన్ దొర ప్రశంసకు యోగ్యమైంది. రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు విక్రమార్కకథలు, పంచతంత్ర కథలను రచించారు. ఈ సంక్షేమరూపాలైన కథలను బ్రౌన్ దొర మెచ్చుకున్నప్పటికీ అందులోని పండిత శైలి అంతగా రుచింపలేదు. తాతాచారి కథల్లోని శైలి మెరుగైనదని భావించారు. తాతాచారి కథల్లో కూడా సామాన్యులకు అర్థం కానివి వదిలివేశారు. ’బహువ్రీహి’ అన్న కథలో భాషాచమత్కారముంది. కానీ, సామాన్యులకి అర్థంకాదని వదిలి, 17వదైన ’గిరిన్మయూరే’ కథ కఠినమైనా చక్కగా ఉందని పుస్తకంలో చేర్చారు.

వావిళ్ళ సంస్థవారు 1951లో తృతీయ ముద్రణగా, 1974న బండి గోపాలరెడ్డి చతుర్థ ముద్రణగా తీసుకువచ్చారు.

You Might Also Like

2 Comments

  1. Tweets that mention పుస్తకం » Blog Archive » మొట్టమొదటి తెలుగు కథ నెల్లూరియునిదే -- Topsy.com

    […] This post was mentioned on Twitter by రేగులగెడ్డ అక్షయ్, రేగులగెడ్డ అక్షయ్. రేగులగెడ్డ అక్షయ్ said: అది సరి కాదు. తాతాచారి కథలని ప్రచురించిది బ్రౌన్ దొరే అయినా, రాసిన వారు నేలటూరు వెంకటాచలం ఉరఫ్ తాతాచారి. http://bit.ly/9byPH0 […]

  2. అక్షయ్

    తెలుగులోని మొదటి కథా సంపూటి తాతాచారి కథలని మా తెలుగు మాస్టారు చెప్పినట్టు గుర్తు. అయితే, ఆ సంపూటిని రాసిన వారు బ్రౌన్ద్ దొర కాదని, తాతాచారి గారే అని నాకిపుడే తెలిసింది. ఆసక్తి కరమైన వ్యాసాన్ని రసినందుకు ఈతకోట సుబ్బారావుగారికి, ఇలా పంచినందుకు పుస్తకం.నెట్ వారికీ జోహార్లు. 🙂

Leave a Reply